ఒకడికి,
మనుషులంటే…
అవకాశాలు!
అవసరాలకు ఆసరాలు!
ఆసరాలకు ఆలింగనాలు!
ఆదాయ మార్గాలు!
అధిరోహణకు నిచ్చెన మెట్లు!
నిత్యజీవిత పదోన్నతికి
మార్గాలని సుగమం చేసే పనిముట్లు!
వ్యాపారానికి కావలసిన దళారీలు… వగైరా వగైరా.
మరొకడికి,
మనుషులంటే…
అక్వేరియంలో ఈదులాడే
సుకుమారమైన చేప పిల్లలు,
జీవలాలస తొణికిసలాడే
కలల అలలు,
కను రెప్పల కాల వ్యవధిలో
పగటికి రంగులు నింపే సీతాకోకచిలుకలు
చీకటిని వెలిగించాలని తాపత్రయపడే
మిణుకు మిణుకు మిణుగురు పురుగులు
పడి పగిలిపోకుండా కాపాడుకోవల్సిన
లబ్డబ్ గుండెల కలల రెపరెపలు
స్వేచ్ఛగా రెక్కలు విప్పిన పావురాళ్ళు… వగైరా వగైరా.
ఒకరు(లు) మరొకరు(లు)ని
కనుమరుగు చేసేస్తూ వ్యాపించే
అందమైన అబధ్ధం లాంటి నిజం పేరు
నాగరికత.