చలం — కాలం చెల్లిన నాణెం

చలం తెలుగు సాహిత్యం మీద చెరగని ముద్ర వేశాడని అంటారు సాహితీ ప్రియులు, విమర్శకులు, విశ్లేషకులు. చలం చాలా రచనలు చేశాడు. ప్రేమలేఖలు, వివాహం, ఆదర్శ జీవితం, దైవమిచ్చిన భార్య, మైదానం, సావిత్రి లాంటి నవలలు, ఆ తరువాత మ్యుజింగ్స్, లేఖలు అని ఇంకేవో ఉన్నాయి. చలం పేరు వింటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది మైదానం. 1927 లో వ్రాసిన ఈ నవల పాఠకులను అత్యధికంగా ఆకర్షించింది. ఈ నవలకు పాఠక లోకంలో కీర్తి, అపకీర్తి రెండూ సమానంగానే వచ్చాయి. చలాన్ని విపరీతంగా అభిమానించేవాళ్ళు ఉంటారు, అంతే విపరీతంగా ద్వేషించేవాళ్ళూ ఉంటారు. కానీ, చలాన్ని ఒక హేతుబద్ధమైన కోణంలో చూసిన విశ్లేషణలు చాలా అరుదు. ఈ వ్యాసంలో చలాన్ని హేతుబద్ధమైన విమర్శనా దృష్టితో చూసి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

రచయిత-సామాజిక బాధ్యత

కవి అయినా, రచయిత అయినా కళాకారుడైనా మరే రంగంలో ప్రావీణ్యం సంపాదించిన వారైనా వారి మేధోసంపత్తిని సమాజ శ్రేయస్సు కోసం వాడాలి. ప్రతి మనిషి సమాజంలో సభ్యుడే. మానవుడు సామాజిక జీవి అన్నాడు అరిస్టాటిల్. ఈ బాధ్యత రచయితల మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సాహిత్యానికి ఉంటుంది కాబట్టి. రచయిత కేవలం తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రచనలు చేయరాదు. మనిషి వ్యక్తిగత అనుభవాలకన్నా జీవితం చాలా విశాలమైనది.

వ్యక్తిగత అనుభవాల నుండి ప్రేరణ పొందడం సహజమే అయినప్పటికీ, ఆ అనుభవాల ఆధారంగా మాత్రమే సార్వత్రిక సిద్ధాంతాలను నిర్మించడం అసంపూర్ణమైన దృష్టికి దారితీస్తాయి. ఆధునికయుగంలో తలెత్తుకొన్న వ్యక్తిగతస్వేచ్ఛ అన్న భావనను విసృతమైన సమాజ శ్రేయస్సుతో సమన్వయం చేసుకోవడం ఆధునిక దార్శనికుల ఉత్తమ లక్షణం. ఆధునిక తెలుగు రచయితలలో సాహిత్య ప్రియులు గొప్ప తాత్త్వికునిగా భావించే చలం వ్యక్తిగతస్వేచ్ఛను మాత్రమే ఉగ్గడిస్తూ, దానికి పర్యవసానంగా సమాజంలో చెలరేగే అల్లకల్లోలాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకోని రచయితగా మిగిలిపోయాడని నా భావన.

కుటుంబ వ్యవస్థ-చలం తాత్త్వికత

మానవ నాగరిక సమాజానికి పునాది కుటుంబ వ్యవస్థ అని చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తారు. మనిషి స్థిర నివాసం ఏర్పరచుకున్నాక నాది నీది అన్న భావన మదిలో మొలకెత్తింది. తద్వారా బంధాలు ఏర్పడినవి. ఉదాహరణకు నా మనిషి, నా మిత్రుడు లాంటివి. అప్పటివరకు తాను ఎక్కడ ఉండేవాడో, ఎవరితో సంపర్కం చెందినదీ ఆ సంపర్కం వలన కలిగిన సంతానం ఎవరు అనేది మనిషికి తెలియదు. రాను రాను నాది నీది అన్న భావన గట్టిపడి అది వివాహ వ్యవస్థకి దారి తీసింది. వివాహం, దాని ద్వారా ఏర్పడిన కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత ఆస్తి అనేవి ఒకదానికి మరొకటి ముడిపడి ఉన్నవి. స్థిరనివాసంతో బంధం గట్టిపడి వివాహానికి దారితీయటం, తద్వారా కుటుంబం ఏర్పడటం, కొన్ని కుటుంబాలు ఒక కమ్యూనిటీ అవ్వటం, కమ్యూనిటీ సమాజంగా ఉద్భవించటం, సమాజం గట్టిపడి, ఒక రాజ్యంగా రూపాంతరం చెందటం మానవ నాగరికత ఆవిర్భావంలో ముఖ్యమైన మైలురాళ్ళు. ఇందులో ప్రధానమైనది ప్రాచీనమైనది వివాహ బంధం ద్వారా ఏర్పడిన కుటుంబం. ఏ సమాజానికైనా ప్రథమ మెట్టు, మూల స్తంభం కుటుంబమే.

అయితే, సాంప్రదాయిక వివాహ వ్యవస్థలో కొన్ని లోపాలుండవచ్చు. పరిణామగతంగా ఏర్పడిన మానవ సామాజిక వ్యవస్థలో కొన్ని రుగ్మతలు ఉండొచ్చు. మనిషి తన మేధస్సుతో ఆయా రుగ్మతలను పారద్రోలి సమాజాన్ని సంస్కరించాలి గానీ సమాజాన్ని విధ్వంసం చేసే ఆలోచన చెయ్యకూడదు. అట్లాంటి ఆలోచనలు తొలిలో కొంతమందిని ఆకర్షించినా అది తాత్కాలికమే. మనిషి సమాజంలో జీవించేటప్పుడు, సమాజం పట్ల తనకు బాధ్యత ఉంటుంది. తన స్వేచ్ఛలో కొంత సమాజానికి అప్పజెప్పి సమాజంలో సభ్యుడవుతాడు. అంటే సమాజం పట్ల బాధ్యతను స్వయంగా స్వీకరించుతాడు.

సమాజం ఏర్పడక మునుపు మనిషి జీవించిన పరిస్థితిని జంతుప్రాకృతికస్థితి (state of nature) అంటారు. దీనిలో మనిషికి స్వేచ్ఛ ఉన్నది కానీ ఆ స్వేచ్ఛకు భద్రత లేదు. అడవికి వెళ్లి కష్టపడి పళ్ళు ఫలాలు సేకరించుకుని వస్తూవుంటే మనకంటే బలాడ్యుడొకడు మనం సేకరించిన పళ్ళు ఫలాలను లాక్కెళ్లి పోవచ్చు. ఆకలితో ఉన్న ఒక మనిషి మరో సాటి మనిషిని చంపి తన ఆకలి తీర్చుకోవచ్చు. కానీ నాగరిక సమాజంలో ఇవన్నీ హేయమైన విషయాలు. ప్రస్తుత సామాజిక వ్యవస్థలో లోపాలున్నంత మాత్రాన, ఏ రచయిత కూడా సమాజాన్ని నాగరికత ఏర్పడని రోజుల్లో ఉండే జంతుప్రాకృతికస్థితికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించకూడదు.

చలం మాత్రం తన సాహిత్యంలో ప్రతిపాదించిన సూత్రాలు ఈ కోవకు చెందినవే. వివాహాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని గేళి చెయ్యటమే ఆయన రచనలోని ప్రధాన ఉద్దేశ్యం. మైదానంలో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుంది. దీన్ని వ్యతిరేకించే వారిని పతివ్రతలు అని చులకనగా మాట్లాడతాడు చలం. విశృంఖలమైన స్వేచ్చను ఒక ఆదర్శంగా చూపటం, ఆ విశృంఖలత్వాన్ని వ్యతిరేకించేవారిని కించపరచడం చలం సాహిత్యంలో కనిపించే ప్రధాన అంశాలు.

సమాజ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే తీరు (deviant behaviour) చలం పుట్టక ముందు ఉంది, చలం గిట్టిన తరువాత ఉంది. అది చలం సృష్టించినది కాదు. కానీ ఇటువంటి అతిరిక్త ప్రవర్తనను (deviant behaviour) చలం ఆదర్శంగా, ఆకర్షణీయమైన ఆలోచనగా చూపించాడు. ఒక చోట రాజేశ్వరి అంటుంది అమీర్ తో ‘నువ్వు నా పెనిమిటివైతే నీతో ఉండవొచ్చానా!’ అని. అంటే ఆమె బంధం కోరుకోవటం లేదు. సంబంధాన్ని కోరుకుంటుంది. బంధంలో కొంత స్వేచ్ఛని కోల్పోతాము. ఇది ఇష్టపూర్వకంగా కోల్పోతాము. ఎందుకంటే బంధం జీవితానికి భద్రతనిస్తుంది గనక. పెళ్లి అయితే స్వేచ్ఛ కోల్పోతాము అని మగవాడికి తెలుసు. కానీ ఆ స్వేచ్ఛను కొంత కోల్పోవటానికి ఇష్టపడే పెళ్లి చేసుకుంటాడు. కోల్పోయిన స్వేచ్ఛ స్థానంలో బంధం ఏర్పడుతుంది. అది జీవితానికి భద్రతనిస్తుంది.

పరిస్థితుల ప్రభావంతో కొందరు పెళ్ళికి దూరమైనప్పటికీ లోకంలో ఎక్కువ మంది మనుజులు వివాహ బంధం ద్వారా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, పిల్లల్ని కని వాళ్ళని కష్టపడి పెంచి పెద్దచేసి వాళ్ళు ప్రయోజకులైతే గొప్ప అనుభూతి చెందుతారు. అది కుటుంబ వ్యవస్థలో ఉన్న మాధుర్యం. మానవ పరిణామక్రమంలో కుటుంబ వ్యవస్థకున్న ప్రాధాన్యం. రాజేశ్వరికి తోడు కావాలి, కాని అది భర్త రూపంలో కాదు. విశృంఖలంగా రతీసౌఖాన్ని అందించే మగవాడు కావాలి. కానీ, మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, ఎంతకాలం రతీసౌఖ్యాన్ని ఆస్వాదించగలరు? రతీసౌఖ్యం జీవితంలో ముఖ్యమైన అంశమే. సందేహం లేదు. దాన్ని సంసార సుఖం అంటే చలం ఒప్పుకోడు. అది పతివ్రతలు అనే మాట అంటాడు.

సమాజ సంస్కరణకు, సామాజిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసే ఊహలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి. వీరేశలింగం, గురజాడ వంటి సంస్కర్తలు వ్యవస్థలోని రుగ్మతలను సరిదిద్దాలని ప్రయత్నిస్తే, చలం ఆ వ్యవస్థ పునాదులనే ప్రశ్నించే తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. సాంప్రదాయ వివాహ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడం ఒక ఎత్తైతే, దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ప్రతిపాదించిన మార్గాలు సమాజ స్థిరత్వానికే ప్రమాదకరంగా పరిణమించవచ్చని చలం ఊహించకపోవడమే ఆయన చూపు సమగ్రం కాదని తెలుపుతుంది.

మైదానం నవల విశ్లేషణ

మైదానం నవలలోని కథానాయిక రాజేశ్వరి పాత్ర చలం తాత్త్వికతకు అద్దం పడుతుంది. లాయర్ పెళ్ళాం అయిన రాజేశ్వరి తన భర్తను, కుటుంబాన్ని వదిలి సాయిబుల అబ్బాయి అమీర్‌తో వెళ్ళిపోతుంది. నవల ప్రారంభంలో ఆమె తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, ఆ జీవితాన్ని “సుందరమైన దివ్యమైన స్వప్నమువలె” వర్ణిస్తుంది. ఒక పక్క సెలయేరు, ఒక పక్క కొండ, దానిమీద పాడుబడిన కోట; మరో వైపు జీడిమామిడి తోట ఇంకోవైపు విశాలమైన స్థలంలో, అదే మైదానం, పూరిపాక వేసుకుని, ఒక కుండలో అన్నం వండి, ఒకే మూకుడులో ఇద్దరూ రాతిబండ మీద నూరిన పచ్చడితో ‘భోంచేసి’ ఆపైన నిరంతరమైన రతీక్రీడలో మునిగితేలుతూ బతుకుతారు. మైదానం తొలిపలుకు ఏంటో చూడండి:

“లేచిపోయినా నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంగా ఉంటుంది. ఇదివరకంతా ఈ మనుషుల్లోంచి, నీతివర్తనులలోంచి వెళ్ళిపోయి ఎడారిలో జీవించటం వల్ల నేను చేసిన పని ఘోరత్వం నీచత్వం బోధపడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నమువలె, ఆ ఏడారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతివలె తోచింది. ఇంటిని, బంధువుల్ని, భర్తని మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్‌ని, మీరాని అనుభవించిన తరవాత మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులైనా, మనుషులేనా అనిపిస్తుంది నాకు”

అయితే, కథ సాగేకొద్దీ ఆమె ఆనందం అశాశ్వతమని తేలుతుంది. అమీర్ మరొకరి పట్ల ఆకర్షితుడైనప్పుడు రాజేశ్వరి తీవ్రమైన నిరాశకు గురవుతుంది. “ఈ ఒక్క కొమ్మనే నమ్ముకొని అన్ని ఆశ్రయాలను తన్నేశాను. ఇది ఇట్లా పెళ్ళుమని విరిగింది. నేనేం కాను?” అని ఆమె వాపోతుంది. ఈ సంభాషణల ద్వారా ఆమె ఎంచుకున్న మార్గంలోని అస్థిరత్వాన్ని రచయిత మనకు స్పష్టం చేస్తూనే ఉన్నాడు. క్షణికమైన ఆనందం కోసం శాశ్వతమైన భద్రతను వదులుకోవడం వల్ల కలిగే పరిణామాలను ఈ పాత్ర ద్వారా చలమే స్వయంగా వివరిస్తాడు.

ఇదేనా స్త్రీలు కోరుకొనే స్వేచ్ఛ?

నిజంగా ఆధునిక స్త్రీలోకం చలం సూచించే స్వేచ్ఛను కోరుకుంటుందా? చలాన్ని గొప్ప స్త్రీవాదిగా ఊహించుకునే మధ్యతరగతి మహిళలు, “సరైన సాయిబు దొరకక సంసారం అనే కూపంలో కూరుకుపోయాము గానీ, లేకపోతే ఎప్పుడో లేచిపోయేవాళ్ళం,” అని అనగలరా? ఎక్కడో ఒక రాజేశ్వరి, ఒక కామేశ్వరి లాంటి కాల్పనిక పాత్రలు తప్ప, వారే స్త్రీలోకానికి ప్రతినిధులు అనుకోవటంకన్నా అవమానకరం మరొకటి ఉండదు, ఆత్మాభిమానంతో గౌరవప్రదంగా బ్రతికే మహిళలకు.

మైదానానికి ఐదు ఏళ్ల ముందు, అంటే 1922లో మాలపల్లి వచ్చింది. అందులో కమలమ్మ మరిది వరసయ్యే మోహనరావు అనే యువకుడితో లేచిపోతుంది. ఒక సందర్భంలో మోహనరావు అనుకుంటాడు, కమలమ్మ పట్ల తనకున్న ధర్మమేమిటి అని. ఆమె వివాహిత. ఆమెను తను వివాహం చేసుకోలేడు. తనను నమ్మి వచ్చిన ఆమె ఉండగా తను మరొకరిని పెళ్లి చేసుకోలేడు. కనీసం అతనికి తను లేపకొచ్చిన స్త్రీ పట్ల బాధ్యత ఏమిటి అన్న ఆలోచన అన్నా వచ్చింది. తెలుగు సాహిత్యం మీద కాస్తో కూస్తో అభిరుచి ఉన్నవారు మాలపల్లి చదివితే కమలమ్మ జీవితం చివరికి ఎలా కడతేరినది అర్ధం అవుతుంది. లేచిపోయిన వారు దురదృష్టవంతులు, వారి బతుకుకి భద్రత లేదు, జీవితానికి గౌరవం లేదు. క్షణికానందం కోసం నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. తెగిపోయిన గాలిపటం ఎక్కడ పడుతుందో తెలియని విధంగా వారి బతుకు ఎలా కడతేరుతుందో ఎవరికీ తెలియదు. కడుపున పుట్టిన బిడ్డలు కూడా అటువంటి స్త్రీని తల్లి అని చెప్పుకోవటానికి అసహ్యించుకుంటారు అని తెలుస్తుంది లేచిపోయిన స్త్రీల వాళ్ల జీవితాలను పరిశీలిస్తే.

ముగింపు

మరి ఎందుకు మైదానం అంతగా పాఠకులను ఆకర్షించింది? తెలుగు సాహిత్యంలో ఒక నిర్దిష్టమైన స్థానాన్ని సంపాదించింది? చలం రచనల్లో అదొక మాగ్నమ్ ఓపస్‌గా నిలిచింది? గతంలో ఐఏఎస్ పరీక్షలో తెలుగు ఐచ్చిక సబ్జెక్టు కు నిర్దేశించిన సిలబస్ లో మైదానం కూడా ఉండేది (ఇప్పుడు లేదనుకోండి). మైదానం నవల తన కాలంలోని సామాజిక కట్టుబాట్లపై తిరుగుబాటుగా నిలిచి, ఎందరినో ఆకర్షించిందన్నది వాస్తవం. ఇది రాసేనాటికి స్త్రీలు కఠినమైన నిబంధనలతో మగ్గిపోయారు. స్త్రీల ప్రగతి కోసం నడుం కట్టిన వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి సంస్కర్తలు ఉన్నారు. వీరికి భిన్నంగా చలం ఒక కొత్త పంథాని ఎంచుకుని, ఒక తీవ్రవాదాన్ని తెర పైకి తెచ్చాడు. దానికి తోడు సూటిగా, నిక్కచ్చిగా చెప్పే చలం శైలి అనితరసాధ్యమైనది. దానికి చాలామంది ఆకర్షితులైనారు. కానీ, అసమగ్రమైన తాత్త్వికదృష్టి వల్ల చలం వాదన జబ్బుకన్నా మందు ప్రమాదకరమైంది అన్నట్లు అయింది. 20వ శతాబ్దంలో కమ్యూనిజం, నక్సలిజం వంటి తీవ్రభావాలు కొన్ని తరాల ప్రజలను ఎలా ఆకర్షించాయో అలాగే చలం రచనలు, భావాలు కొంతమందిని ఆకర్షించాయని చెప్పుకోవచ్చు.

కార్ల్ పాపర్ అనే రాజనీతి తత్వవేత్త స్వేచ్ఛా సమాజం దాని శత్రువులు (Open Society and its Enemies) అని ఒక గ్రంథం రచించాడు. అందులో, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్తలు: ప్లేటో, మార్క్స్, హెగెల్ యొక్క సిద్ధాంతాలను పరిశీలించి వారి వాదనలు ఆచరణలోకి వస్తే స్వేచ్ఛాయుత సమాజానికి గొడ్డలిపెట్టు అని తేల్చి చెప్పాడు. హిట్లర్ జర్మనీలో, స్టాలిన్ సోవియట్ యూనియన్‌లో జరిగింది అదే! తెలుగు సాహిత్యంలో గనక స్వేచ్ఛాయుత సమాజం దాని శత్రువులు అనే గ్రంధం ఎవరైనా రాస్తే మొదటగా చలం గురించి రాయాలి; ఆ గౌరవం ఆయనకే ఇవ్వాలి.

విప్లవాత్మక భావాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేశానని భావించిన చలం జీవిత చరమాంకంలో రమణమహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొంది ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ఒక ముఖ్యమైన పరిణామం. ఆయన అభిమానులకు ఇది ఒక ఉన్నతస్థితిగా కనిపించవచ్చు, కానీ విమర్శనాత్మకంగా చూస్తే, ఆయన యవ్వనంలో ప్రతిపాదించిన విప్లవాత్మక సిద్ధాంతాలపై ఆయనకే సందేహాలు కలిగాయా అన్న ప్రశ్నను రేకెత్తిస్తుంది. ఇది ఆయన తాత్విక ప్రయాణంలో ఒక విరోధాభాస ముగింపుగా (anti-climax) నిలుస్తుంది.