సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం

దేవుడా రక్షించు నా దేశాన్ని
పవిత్రుల నుండి, పతివ్రతల నుండి
పెద్దమనుషుల నుండి, పెద్ద పులుల నుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపాసర్పాల నుండి
లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి
( దేవరకొండ బాలగంగాధర తిలక్ )

నేటి సమాజంలో మన సంస్కృతి, సంప్రదాయం మతాలను విమర్శనాత్మకంగా చూడడాన్ని జాతీయ ద్రోహంగా పరిగణిస్తున్న ధోరణి వ్యాప్తిలో ఉంది. ఆత్మ విమర్శకు, పరిశీలనకు స్థానం లేకుండా పోతోంది. ఈ ‘కుహనా జాతీయవాదం’ (Pseudo-Nationalism) ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన పరిస్థితిలో, భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు. ఒకప్పుడు విశాల దృష్టి, సహనం, బహుళత్వంకు (pluralism) పేరుపొందిన భారతీయ సంస్కృతి, ఇప్పుడు విమర్శను శత్రువుగా, సంవాదాన్ని దుర్బలత్వంగా భావిస్తుంది. ఈ ఆధునిక దుస్థితిని 17వ శతాబ్దంలో జీవించిన మహావిద్వాంసుడు నీలకంఠ దీక్షితులు సంస్కృతంలో రచించిన ‘కలివిడంబనం’ (కలియుగ విజృంభణ పై వ్యంగ్య నిరసన) అనే కావ్యం అద్భుతంగా, భయంకరంగా ప్రతిబింబిస్తుంది.

ప్రాచీన సంస్కృత సాహిత్యంలో సనాతన ధార్మిక గ్రంథాలలో తాత్విక, మతపరమైన విమర్శలు కొత్తవేమీ కావు. వివిధ తాత్విక సిద్ధాంతాల మధ్య వాద వివాదాలు, చర్చలు నిరంతరం కొనసాగుతూ ఉండేవి. ఈ చర్చల ప్రధాన లక్ష్యం ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా, సత్యాన్ని అన్వేషించడం, సిద్ధాంతాలను మరింత పరిణతిలోకి తీసుకురావడం.

​తాత్విక ఆచార్యుల మధ్య చర్చలు

అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని స్థాపించిన రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు వారి శిష్యులు మధ్య చర్చలు, విమర్శలు ఈ పద్ధతికి నిదర్శనం. వీరు ఒకరి సిద్ధాంతాలను మరొకరు విమర్శించి, తమ తమ సిద్ధాంతాలను సమర్థించుకున్నారు. ఇది కేవలం సైద్ధాంతిక వైరుధ్యమే తప్ప, వ్యక్తిగత దూషణ కాదు. ఈ విమర్శల ఫలితంగానే భారతీయ తత్వశాస్త్రం మరింత సుసంపన్నమైంది.

​జనసాహిత్యం విమర్శ

కేవలం తాత్విక గ్రంథాలలోనే కాకుండా, జనసామాన్యం కోసం ఉద్దేశించిన పురాణాలు, నాటకాలు వంటి వాటిలోనూ విమర్శ కనిపిస్తుంది.

​బ్రాహ్మణేతర పురాణాలు: జాంబ పురాణం వంటి బ్రాహ్మణేతర పురాణాలు బ్రాహ్మణ సంప్రదాయాలను, వాటిలో ఉన్న అసంగతమైన అంశాలను ప్రశ్నిస్తాయి. ఈ పురాణాలు ఉత్పత్తి కులాల శ్రమను, విశ్వకర్మ వంటి వారి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి, తద్వారా సాంప్రదాయక వర్ణ వ్యవస్థపై ప్రత్యామ్నాయ దృక్పథాన్ని చూపుతాయి.

​కాళిదాసు ‘అభిజ్ఞానశాకుంతలం’: నాటకంలో విదూషకుడైన మాఢవ్యుడు బ్రాహ్మణులకు పన్నుల మినహాయింపు ఇతర ప్రత్యేక సదుపాయాలపై రాజు దుష్యంతుడిని ప్రశ్నించే సందర్భం ఉంది. తనను హింసా జీవనుడు అని విమర్శించిన రాజు యొక్క బావమరిది తో ఒక జాలరి మేకను బలి ఇచ్చి యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు కూడా హింసాపరులే అని ఎదురు సమాధానం చెప్తాడు. ఇది సామాజిక అసమానతలపై వివక్షపై విమర్శను సూచిస్తుంది.

​ ‘భగవదజ్జుకం’: పల్లవ రాజు మహేంద్రవర్మ రచించిన ఈ ప్రహసనంలో (హాస్య నాటికలో), శైవులు, బ్రాహ్మణులు, వారి ఆచారాలలోని అసంగతత్వాన్ని, కపటత్వాన్ని విమర్శించారు. ఒక పక్క సన్యాసి వేషంలో ఉంటూనే లౌకిక సుఖాలకు ఆశపడే పాత్రలను సృష్టించి, ఆనాటి సమాజంలోని లోపాలను హాస్యభరితంగా ఎత్తిచూపారు.

​విమర్శ యొక్క లక్షణం

ప్రాచీన భారతదేశంలో ఈ విమర్శల ప్రధాన లక్ష్యం ఒక జాతిని లేదా ఒక వర్గాన్ని నిందించడం కాదు. బదులుగా, ఇది తమ సిద్ధాంతాన్ని స్థాపించుకోవడానికి, అవతలి పక్షం యొక్క లోపాలను ఎత్తిచూపడానికి ఒక పద్ధతి. ఇది ఒక ఆరోగ్యకరమైన మేధో చర్చ. ఈ వాదవివాదాలు వ్యక్తిగత నిందలకు కాకుండా, తాత్విక లోపాలపై దృష్టి పెట్టేవి.

  1. ​చార్వాక దర్శనం: సంస్కృత సాహిత్యంలో అత్యంత తీవ్రమైన విమర్శలు చేసిన సిద్ధాంతాలలో చార్వాక దర్శనం ముఖ్యమైనది. ఇది వేదాలను, కర్మకాండలను, స్వర్గ నరకాలను పూర్తిగా ఖండించింది. ఇటువంటి నాస్తిక (భౌతికవాద) సిద్ధాంతాలు కూడా ప్రాచీన భారతదేశంలో స్వేచ్ఛగా వృద్ధి చెందాయి.
  2. ​ఉపనిషత్తులలో విమర్శ: కొన్ని ఉపనిషత్తులు కర్మకాండలపై, యజ్ఞాలపై తీవ్రమైన విమర్శలు చేశాయి. ఉపనిషత్తులో యజ్ఞాలను “సురక్షితం కాని పడవలు”గా పోల్చి, వాటి ద్వారా మోక్షం లభించదని పేర్కొన్నారు.
  3. ​వివిధ దర్శనాల మధ్య చర్చలు: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత దర్శనాల మధ్య, అలాగే జైన, బౌద్ధ సిద్ధాంతాల మధ్య జరిగిన వాదవివాదాలు కూడా ఇదే కోవకు చెందినవి. ఇవన్నీ భారతీయ తాత్విక వ్యవస్థలో విమర్శ ఎంత అంతర్భాగమో నిరూపిస్తాయి.

​మొత్తంగా, ప్రాచీన భారతదేశంలో విమర్శ అనేది సత్యాన్ని అన్వేషించడానికి, తాత్విక లోపాలను సరిదిద్దడానికి సంప్రదాయాలను నిరంతరం పునరుద్ధరించడానికి ఉపయోగించిన ఒక సాధనం. ఇది ఒకరినొకరు నిందించుకునే జాతివాదం కాకుండా, ఆరోగ్యకరమైన మేధో చర్చ.

పాండిత్యం పరస్పర అవగాహనతో కూడిన ఈ సంవాద సంప్రదాయం క్రమేపీ క్షీణిస్తూ రావడాన్ని కలి లక్షణంగా దీక్షితులు వర్ణించారు

కలియుగ భావన: క్షీణత

నిజానికి, దేశకాలాల్లో మానవజాతి పురోగతి, ప్రగతి అనే భావనలు ఆధునికమైనవి. ప్రాచీన హిందూ పౌరాణిక భావన ప్రకారం, కాలం గడిచే కొద్దీ కలిశక్తి పుంజుకుని ధర్మం క్షీణిస్తుంది. క్రైస్తవ సంప్రదాయంలో కూడా ఆధునిక కాలం వరకు కాలంలో క్షీణతను మాత్రమే చూశారు. ఆధునికత మాత్రమే వికాసవాదం ( రినైజాన్స్) ప్రగతి (progress) అనే భావాలను నమ్మకాలుగా స్థిరపరిచింది. అయితే, నేటి భారతీయ వాస్తవికతకు కలియుగ భావనలు అద్దం పడుతున్నాయి. మహా శివభక్తుడు అద్వైత వేదాంతి అయిన నీలకంఠ దీక్షితులు ‘కలివిడంబనం’లో చేసిన విమర్శలు నేటి సమాజానికి సరిగ్గా సరిపోతాయి. ఆయన మూఢనమ్మకాలు, మతపరమైన బాహ్యాడంబర ప్రదర్శన, మతం-వ్యాపారం సంబంధం, ధనికుల ఆరాధన, పాండిత్యం విద్యల పట్ల నిరసన, అలాగే అక్షరాస్యులుగా గర్వించే మిడిసిపడే అజ్ఞానులను తీవ్రంగా విమర్శించారు.

జ్యోతిష్యం, మానవ బలహీనతలపై సూక్ష్మ దృష్టి

అసలు జ్యోతిష్యం ఒక వేదాంగం ముహూర్తాలు పెట్టడం, కాలాన్ని నిర్ణయించటం ప్రధాన విషయాలు. ఫలిత జ్యోతిష్యం -మానవ భవిష్యత్తు లాభనష్టాలు చెప్పటం అనేది గ్రీకుల నుంచి మనకి సంక్రమించింది అని కొందరు అంటారు. పరమ వైదికులైన మీమాంసకులు కూడా ఈ ఫలిత జ్యోతిషాన్ని పట్టించుకోలేదు.

నీలకంఠ దీక్షితులు జ్యోతిష్యాన్ని కూడా విమర్శిస్తారు. కానీ ఆయన విమర్శ ఆధునిక హేతువాదుల విమర్శకు భిన్నమైనది. హేతువాదులు జ్యోతిష్యంలో ఉన్న హేతువిరుద్ధ స్వభావాన్ని మరియు అవైజ్ఞానికతను నేరుగా విమర్శిస్తారు. కానీ దీక్షితులు మరింత లోతుగా వెళ్లి, జ్యోతిష్యం వంటి విశ్వాసాలకు మానవ బలహీనతలతో ఉన్న సంబంధాన్ని సూక్ష్మ పరిశీలన ద్వారా బయటపెడతారు. మనుషులలోని ఆశ, అజ్ఞానం, అనిశ్చితి భయం వంటి బలహీనతలే ఇటువంటి విశ్వాసాలు అంత బలంగా కొనసాగడానికి ప్రాథమిక కారణమని ఆయన వివరించారు.

జ్యోతిష్య వ్యాపారం

సాధారణంగా నేటి హేతువాదులు జ్యోతిష్యులకి ఆధునిక విజ్ఞాన పరిచయం అసలే లేదు అని విమర్శిస్తారు. కానీ నీలకంఠ దీక్షితులు గ్రహవిజ్ఞానం జోలికి వెళ్లడు. మనుషుల బలహీనతల్ని జ్యోతిష్యులు ఎలా తనకి లాభదాయకంగా మార్చుకుంటారో రాస్తాడు. జ్యోతిష్యం వ్యాపారంగా మారిన విధానం విశ్లేషిస్తాడు. నేను ఎంతకాలం బతుకుతాను అని ఎవరైనా అడిగితే నూరేళ్లు బతుకుతావు అని తడుముకోకుండా చెప్పాలి. నిజంగా నూరేళ్లు జీవిస్తే బతికినంత కాలం గౌరవిస్తాడు చచ్చాడా ఇంకా అడిగేది ఎవరిని? జ్యోతిష్కుడు ఎప్పుడు ఇతరులని గందరగోళపరిచేలా గోడమీద పిల్లిలా మాట్లాడాలి. అలా కావచ్చు ఇలా జరగొచ్చు అని రెండు పక్షాలు ఉండేట్టు చెప్పాలి. రెండు కాలాలు అప్పుడు లేక ఇప్పుడు ఉండేట్లు చెప్పాలి. కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్లు చెప్పి తప్పించుకోవాలి. ఉదాహరణకు ఈ నక్షత్రం మంచిది కాబట్టి పని కావచ్చు. గ్రహ దృష్టి బాగాలేదు కనుక కాకపోవచ్చు. ఇప్పట్లో కావచ్చు, కాకపోవచ్చు…. ఇలా చెప్పాలి. డబ్బు లేని వారికి డబ్బు వస్తుందని, ధనికుడు అయితే కోటికి పడగలు ఎత్తుతాడని చెప్పే జ్యోతిష్కులను లోకులు బాగా పోషించి గౌరవించి ఆదరిస్తారు. శకునాలు స్వప్నఫలాలు ఇలా అనేక రకాల జాతకం చెప్పే వాళ్ళని ప్రస్తావిస్తాడు కవి. ప్రపంచమంతా ఇలాంటి జ్యోతిష్కులతో నిండిపోయింది అంటాడు.

ఈ ఒక్క విషయంలోనే కాదు, మనుషుల బహుముఖ ప్రవర్తనలలో, విశ్వాసాలలో మత వైఖరులలో ఉండే ఆత్మవంచన (self-deception) పరవంచనలను (deceiving others) ఆయన స్పష్టపరుస్తారు. నేటి భారతీయ సామాజిక-రాజకీయ పరిస్థితులను ఈ కావ్యం కన్నా సూక్ష్మంగా అర్థం చేసుకునే ఆధునిక రచనలు అరుదని చెప్పవచ్చు.

పురుషుల కపటత్వం

​నీలకంఠ దీక్షితులు తన రచనల ద్వారా సమాజంలోని పురుషుల కపటత్వాన్ని (Hypocrisy) స్త్రీల పట్ల వివక్షను సూటిగా విమర్శించారు. ముఖ్యంగా, ఆయన ‘వైరాగ్య శతకం’లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేటికీ ఎంతో వాస్తవంగా అనిపిస్తాయి.

​ఆయన ప్రకారం, చాలా మంది పురుషుల్లో ద్వంద్వ నీతి (double standards) కనిపిస్తుంది. తమకు వర్తించని నియమాలను ఇతరుల మీద, ముఖ్యంగా స్త్రీల మీద రుద్దుతుంటారు.

​పితృభక్తి: తండ్రులతో గొడవ పడుతూ కూడా, తమ పిల్లలకు మాత్రం పితృభక్తి గురించి బోధించడం.

​పాతివ్రత్యం: తామే పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ, తమ భార్యలకు మాత్రం “పతివ్రతా ధర్మాలను” నూరిపోయడం.

​ఈ విధంగా, పురుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ప్రమాణాన్ని ఏర్పరచుకొని, దానిని ఇతరులకు మాత్రమే వర్తింపజేస్తారని ఆయన స్పష్టం చేశారు.

​స్త్రీల పట్ల వివక్ష

​ఆయన రచనల్లో స్త్రీలు ఎదుర్కొనే వివక్షను కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఒకే వ్యక్తి వివిధ సందర్భాల్లో స్త్రీలను ఎలా విమర్శిస్తారో ఆయన చెప్పారు:

​సంతానం లేకపోతే: పిల్లలు లేని స్త్రీలను “గొడ్రాలు” అని నిందించడం.

​ఎక్కువ సంతానం ఉంటే: ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని “ముసలిది” అని, “ఏటా బాలింత” అని తిట్టడం.

​తక్కువ సంతానం ఉంటే: తక్కువ పిల్లలు ఉన్నా కూడా తిట్టడం.

​ఈ ఉదాహరణల ద్వారా, పురుషులు తమ స్వార్థం కోసం స్త్రీలు ఏ విధంగా ఉన్నా వారికి నచ్చదని, ఎలాగైనా నిందించడానికి ఒక కారణం వెతుకుతారని ఆయన పేర్కొన్నారు.

​అభిప్రాయాలకు ఉన్న పరిమితులు

​అయితే, ఆయన అభిప్రాయాలకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒకచోట “ఆడవాళ్ల మాటే వేదంలా తయారయ్యింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు పరిస్థితుల మార్పు పట్ల ఆయనకు గల ఆందోళనను సూచిస్తుంది.

విమర్శపై నియంత్రణ: ఒక కలియుగ లక్షణం

ప్రాచీన/మధ్యయుగ భారతదేశంలో వివిధ సంప్రదాయాల మధ్య, సిద్ధాంతాల మధ్య పరస్పర సంవాదం, విమర్శ సాధారణం. వైదిక కర్మను అనుసరించే పూర్వ మీమాంస సిద్ధాంతవేత్తలు బౌద్ధుల ‘యోగి ప్రత్యక్షం’ (అతీంద్రియ శక్తులు)ను నిరాకరించారు. అంతేకాదు, వారు దైవం ఉనికినే కూడా తిరస్కరించారు. ఈ విభిన్న వాదాలను అలా ఉంచి, ఆధునిక కాలంలోనే, ముఖ్యంగా పునరుద్ధరణ వాదం (Revivalism) ఆధునిక జాతీయవాదం (Nationalism) ఉదయించిన తర్వాత, విమర్శకు ఆస్కారం తగ్గిపోయింది. జాతీయవాదం వివిధ రాజకీయ సిద్ధాంతాల జాతుల శత్రుత్వపు భావనలు, విమర్శనాత్మక దృక్పథానికి తావు లేకుండా చేశాయి.

నీలకంఠ దీక్షితులు నేడు భిన్న దృక్పథాలను వ్యక్తం చేసిన వారిని సనాతన సంప్రదాయ విరోధులుగా ముద్రించడం వారి వాదనను అణచివేయడం సర్వసాధారణం అయిందని 17వ శతాబ్దంలోనే పసిగట్టారు. అజ్ఞానులు, బుద్ధిహీనులు, ఇతరుల ఆలోచనలను గౌరవించని వారు రాజ్యం చేసే పరిస్థితిని, ఆలోచనలపై నియంత్రణను ఆనాడే కలికాలం యొక్క ప్రధాన లక్షణంగా వర్ణించారు.

వాదనలో మూర్ఖత్వం: నేటి డిజిటల్ యుగానికి పూర్వసూచన

పండిత సభల్లో జరిగే చర్చల గురించి నీలకంఠ దీక్షితులు చేసిన వర్ణన నేటి సోషల్ మీడియా డిజిటల్ యుగానికి సరిగ్గా సరిపోతుంది:

“పండిత సభలలో మధ్యవర్తిగా పండితుడు కాకుండా, మిడిమిడి జ్ఞానం కలవాడైతే, నోరు పెట్టుకుని గట్టిగా బల్లగుద్ది వాదంలో గెలువు. ఒకవేళ అతడు పండితుడు అయితే, అతనికి పక్షపాతం ఉందని ప్రచారం చెయ్యి. నిందకు భయపడి నీ వైపే మొగ్గుచూపుతాడు.”

ఈనాడు తమకు నచ్చని విషయాలను ‘విదేశీయం’, ‘విజాతీయం’, ‘విమతం’ అని ప్రచారం చేయడంలో ఇదే వైఖరి కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నాడో వినకుండానే, తక్షణం పొగరుగా బదులు చెప్పడం, వాదనలలో గెలవడానికి సిగ్గు లేకపోవడం, పెద్ద కోలాహలం చేయడం వంటి లక్షణాలను ఆయన వివరించారు. తత్వాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలని అనుకునేవాడు వినయంగా అణకువతో అధ్యయనం చేయాలి. కానీ, వాదాలలో గెలవాలని మాత్రమే అనుకునేవాడికి సిగ్గు, లజ్జ అక్కర్లేదు, కేవలం రౌడీయిజం చాలు.

జ్ఞానాభాస (Pseudo-science): అజ్ఞాన వ్యాప్తికి మూలకారణాలు

లోకంలో అజ్ఞానం వ్యాప్తికి రెండు ప్రధాన కారణాలను దీక్షితులు పేర్కొంటారు:

  1. జ్ఞానాభాస: నిజమైన జ్ఞానంలా కనిపించే అజ్ఞానం (Pseudo-science).
  2. గురువులపై మూఢభక్తి: గురువులపై ఉన్న మూఢమైన, విమర్శనారహిత నమ్మకాలు.

మంచి, నైతికత కలిగిన గురువులు లేకపోతే, విద్యా ప్రమాణాలు క్షీణిస్తాయి, ఫలితంగా జ్ఞానాభాస వ్యాపిస్తుంది. ఆయన అంటారు, సైన్స్ కన్నా సూడో సైన్స్ లాభదాయకం. జ్ఞానం కన్నా జ్ఞానాభాస సుఖదాయకం. తత్వం కన్నా మూఢత్వంలో చాలా హాయి. జ్ఞానం సంకటభరితమైనది, కష్టమైనది. అజ్ఞానం సుఖకరమైనది, సరళమైనది. ఈ కారణంగానే, సన్యాసులు, జ్యోతిష్యులు, మాంత్రికులు ఆధ్యాత్మిక వ్యాపారస్తులు ప్రజల అజ్ఞానం అసహాయతను పెట్టుబడిగా మార్చుకుని లాభపడుతున్నారు.

మాంత్రికుల వ్యాపారం

మాంత్రికుడు చెప్పిన వెంటనే తాను చెప్పిన పని జరిగితే ఆ మాంత్రికునికి గొప్ప కీర్తి లభిస్తుంది. మరి చెప్పినది జరగకపోతే ఏం చేయాలి? ఆ హోమం చేయాలి ఈ జపం చేయాలి అని ఏదో రకంగా జాప్యం చేస్తూ డబ్బు గుంజి రెండు చేతుల సంపాదించవచ్చు. సుఖవంతులు సుఖంగా జీవిస్తుంటే ఇదంతా మా అనుగ్రహం అని మాంత్రికుడు చెప్పుకుంటాడు. దుఃఖవంతులు దుఃఖమయ జీవితం గడుపుతుంటే ఏదో కారణము వల్ల తమ అగ్రహానికి గురి అయ్యారని చెప్పుకుంటారు. రెండు విధాల కింద పడినా పైన పడినా మాంత్రికునికి అనుకూలమే. మాంత్రికుడు అజ్ఞానం వల్ల తెలియక సమాధానం చెప్పలేక మౌనం వహించినా, లేక ఏదో పిచ్చిగా అర్థంపర్థం లేకుండా వదిరినా, లోకంలో ఎక్కడా లేని వింత ప్రవర్తనతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినా అంతా ఆయన మహిమ వల్లనే అంటారు. ఆయన మహిమలో వాటిని భాగంగా చూస్తారు. ఇలా రకరకాల హోమాలు జపాలు చేస్తూ మాంత్రికుడుగా జీవించడానికి ఏ అర్హత అక్కర్లేదు జనాల అజ్ఞానం అసహాయత చాలు. అవే అతని పెట్టుబడి. మాంత్రికుడు ఏం చేసినా ఎలా ఉన్నా లాభమే అంటారు దీక్షితులు.

పండితుల లాగే కవులు కూడా మోసకారులుగా మారారు. పిడికెడు ముష్టి కోసం ఆశపడి కవులు ఎదుటివారిలో ని పిరికితనం, చెడ్డతనం, పిసినారితనం తెలివి తక్కువతనం వంటి అన్ని దుర్గుణాలను కప్పిపుచ్చి వాళ్లకు దాసులై వారిని వీరులు విక్రమార్కులు మహాత్ములని పొగిడేస్తుంటారు అంటారు దీక్షితులు. నేటి మన అవార్డుకవులలో ఈ లక్షణం కనబడుతుంది.

అసలు పుస్తక రచన దానికదే గొప్ప విషయం అనే అభిప్రాయం సరి కాదు అని ఆయన అభిప్రాయం. గ్రంథకర్తల పరిమితులని ఆయన బయటపెట్టారు.

పాఠనైర్గ్రంథనిర్మాణైః ప్రతిష్ఠా తావదాప్యతే ।
ఏవం చ తథ్యవ్యుత్పత్తిరాయుషోఽన్తే భవేన్న వా ॥

బోధించడం ద్వారా లేదా గ్రంథాలను రచించడం ద్వారా సమాజంలో గౌరవం, కీర్తి లభిస్తాయి. కానీ, ఈ ప్రక్రియలు మనిషికి జీవితాంతం నిజమైన జ్ఞానం, సత్యం యొక్క అవగాహనను ఇస్తాయా లేదా అనేది సందేహాస్పదమే. చాలా మంది ప్రజలు నిజమైన జ్ఞానాన్ని పొందడం కంటే కీర్తి, గౌరవాల కోసం ఆరాటపడతారు. దీని వల్ల ఉపరితల జ్ఞానం మాత్రమే లభిస్తుంది తప్ప, అంతర్గతమైన, లోతైన సత్యం అర్థం కాదు. అందుకే, ఈ యుగంలో నిజమైన తత్త్వవేత్తను లేదా జ్ఞానవంతుడిని కనుగొనడం చాలా అరుదు. జ్ఞానానికి కావాల్సింది ఆత్మవిమర్శ, అంతర్గత పరిశీలన. కేవలం ఇతరులకు చెప్పడం లేదా పుస్తకాలు రాయడం మాత్రమే కాదు.

రచయితలవి అవాస్తవాలు! అబద్దపు బతుకులు!

భారతీయ తత్వాన్ని ఎంతగానో అభిమానించిన రష్యన్ తత్వవేత్త రచయిత లియో టాల్‌స్టాయ్ అంటారు.

రచయితల్లో అధిక శాతం అవాస్తవాలు, అబద్ధాలు,
కపటత్వాల బతుకులు, నాతో సహా కీర్తి, డబ్బే ప్రధానం!

మా తాపత్రయం వెనుక అసలు వాస్తవం ఇదే. దీనికి భిన్నంగా ప్రజాహితులం, ఉత్తములం అంటూ మమ్ములను మేము అద్భుతంగా ప్రదర్శించుకుంటాం. అందుకోసం పోటీపడుతుంటాం. ఎత్తులు, పైఎత్తులు, కుట్రలు, మరోవైపు పరస్పర పొగడ్తలు… ఇలా ఎవరి స్థానాలకూ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మేము బోధకులమే.. ఆచరించే వాళ్ళంకాదు. ఈ రచయితల లోకంలో నాకు వచ్చిన గుర్తింపును, ప్రశంసలను నేనూ బాగా ఆస్వాదించా. వీటిని వదులుకోలేకపోయా. అందుకే ఈ గుంపులో బాగా ఒదిగి పోయా. ఇప్పుడు ఆ ప్రస్తానాన్ని తలుచుకుంటే చాలా బాధకలుగుతుంది. (Confession -LeoTolstoy))

అంతేకాదు కళ్ళు మూసి తెరుస్తూ జపనిష్ట లో ఉన్నట్టు నటనలుచేస్తూ, అహంబ్రహ్మాస్మి అంటూ, పరిపూర్ణఅద్వైతజ్ఞానం లభించినట్లు నటించే కుహనా ఆధ్యాత్మికవేత్తలని నీలకంఠ దీక్షితులు పరిహాసం చేస్తారు.

అధిక విద్యావంతులప్రయోజకులైరి – పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతులమాట జనవిరోధంబాయె – వదరుఁబోతులమాట వాసికెక్కె
ధర్మవాదనపరుల్‌ దారిద్ర్యమొందిరి – పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి – దుష్టమానవులు వర్ధిష్ణులైరి
( నరసింహ శతకం – శేషప్ప 18వ శతాబ్దం)

అబద్ధాలే పెట్టుబడి: మతం, వైద్యం వ్యాపారం యొక్క ఐక్యత

నీలకంఠ దీక్షితులు ప్రకారం, అబద్ధాలు ఆడడం తీయగా మాట్లాడడం వల్ల మాత్రమే ధనం సంపాదించవచ్చు. జ్ఞానం సత్యాలను పాటించడం దారిద్ర్యానికి మూలం. మూర్ఖత్వమే పెట్టుబడిగా మారడం గురించి ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చారు. గోచి కట్టుకోవడం, విభూతి పూసుకోవడం, మౌనం వహించడం వంటివి మూర్ఖుడిని బతికించే ఉపాయాలని చెప్పారు. ఈనాడు ఎలాగైనా జీవించవచ్చు, దాన్ని సంప్రదాయంగా సమర్థించుకోవాలి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

“మంత్రం తప్పుగా చదివితే, ‘ఇదే మా సంప్రదాయం’ అనాలి. తప్పులు మాట్లాడితే పూర్వకవి ప్రయోగం అనాలి. అనాచారం చేస్తే ‘ఇది మా దేశాచారం’ అనాలి. ”

దానం, జపం, తపస్సు వంటి వాటిని ఒక బహిరంగ ప్రదర్శనగా (Show business), విన్యాసంగా మారిస్తేనే ధన లాభం ఉంటుందని ఆయన విపులంగా వివరించారు. అధికార లాభానికి కూడా ఇటువంటి షో బిజినెస్ పనికి వస్తుందని నేటి రాజకీయ నాయకులు గుర్తించారు. వైద్యం కూడా వ్యాపారంగా మారిపోవడం, మనుషుల బలహీనతలు, ఆశలు భయాలతో ఆడుకోవడం గురించి ఆయన అనేక ఉదాహరణలతో వివరించారు.

నీలకంఠ దీక్షితులు విమర్శలు చార్వాకుల (భౌతికవాదులు) విమర్శకు భిన్నమైనవి. చార్వాకులు సంప్రదాయం, మతం, ఆధ్యాత్మికతలను బ్రాహ్మణుల సుఖ జీవనం కోసం చేసిన సృష్టిగా తిరస్కరిస్తారు. కానీ సనాతన సంప్రదాయానికి చెందిన దీక్షితులు, మానవ స్వభావాన్ని సమగ్రంగా పరిశీలిస్తారు. మనుషుల అశక్తత, అజ్ఞానం, అమాయకత్వం, సామూహిక సమ్మతి ఎలా సూడో-సైన్స్ జ్ఞానాభాసకు పెట్టుబడిగా మారతాయో స్పష్టం చేస్తారు.

జ్యోతిష్యుడు కావటం, మాంత్రికుడై ఉండటం, వైద్యం తెలియడం, ముఖస్థితి చేయడం వీనిలో ఏ ఒక్కటి ఉన్నప్పటికీ బాగా సంపాదించుకోవచ్చు అంటారు దీక్షితులు.

మొత్తంగా జనజీవన విధానం 17 శతాబ్దం నాటికే ధనస్వామ్యం వైపు మొగ్గుతుండడాన్ని దీక్షితులు గమనించారు.

ధనస్వామ్యానికి తార్కిక వివరణ

తర్క శాస్త్ర పద్ధతిలో ధనస్వామ్య మూలాలను బట్టబయలు చేస్తారు దీక్షితులు

లాభో హేతుః ధనం సాధ్యం దృష్టాన్తస్తు పురోహితః
ఆత్మోత్కర్షో నిగమనం, అనుమానేష్వయం విధిః ॥

  1. లాభము (profit) హేతువు. అంటే, ఈ కాలంలో ప్రజలు ఏ పని చేయడానికైనా కారణం (హేతువు) లాభమే. ముఖ్యంగా మార్కెట్ వ్యవస్థలో లాభమే ప్రధానం
  2. ధనము (wealth) సాధ్యము(సాధించవలసిన లక్ష్యము)
  3. పురోహితుడు దీనికి దృష్టాంతము.
  4. తన అభివృద్ధి నిగమనం (conclusion)

అనుమాన ప్రమాణం లో ఈ పద్ధతే (విధిః) వర్తిస్తుంది.

పురోహితుడుని ఒక ఉదాహరణగా చూపటం గుర్తించదగిన విషయం. పురోహితుడు ధన సంపాదనకి ప్రాధాన్యం ఇవ్వకూడదని మనుస్మృతి చెప్తుంది. కానీ అన్ని వృత్తులు ప్రవృత్తులు, విశ్వాసాలు వ్యాపారంగా మారిపోవడాన్ని ధన సంపాదనకు ఉపకరణ గా మారడాన్ని దీక్షితులు విమర్శించారు.

నీలకంఠ దీక్షితులు తన కలి విడంబన శతకంలో ధనికులు, ముఖ్యంగా కొత్తగా ధనవంతులైనవారిని, లోభులను తీవ్రంగా విమర్శించారు.

ధనవంతులపై విమర్శలు

ధనవంతులు లాభం కోసం అబద్ధాలు చెబుతారు. నిజం చెప్పేవారిని తక్కువగా చూస్తారు. డబ్బు చేరితే వెంటనే అహంకారం పెరుగుతుంది. దొంగలకు, బంధువులకు ఆశ పుట్టిస్తుంది.

నడ మంత్రపు సిరి

కొత్తగా ధనవంతులైనవారు తమను పొగిడే మాటలన్నీ నిజమేనని నమ్ముతారు. తమని తాము దేవుళ్లలాగా భావించుకుంటూ, ఇతరులను పురుగుల్లా చూస్తారు. పండితులను అవమానిస్తారు. పొగడ్తలను ఇష్టపడతారు, ఎంతలా అంటే పొగడ్తలకు సేనకు నిజంగా అర్హు లైన గొప్పవారు, అర్హులు కాని వీళ్ళను దిక్కులేని స్థితిలో పొగిడినా, సేవ చేసినా ఈ డబ్బున్న వాళ్ళకి సిగ్గుండదు. తాము అర్హులం కాదు అని సిరికలవారు గుర్తించరు. సాధారణంగా భూతావేశం, మద్యం మత్తు కొద్దిసేపు ఉంటే, మూర్ఖుల ఐశ్వర్యమదం మాత్రం వారి జీవితాంతం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ దుర్గుణాలు వెల్లుల్లి వాసనలా సులభంగా పోవని, వారి కుటుంబ సభ్యుల్లో కూడా ఈ పొగరు కనిపిస్తుందని ఆయన తెలిపారు.

లోభులపై విమర్శలు

లోభులు తమ ధనాన్ని రక్షించుకోవడం కోసం చాలా కష్టపడతారు, సరిగా తినకుండా ఉంటారు. తమని ఎవరైనా ఏదైనా అడుగుతారేమోనని ఎప్పుడూ భయపడుతుంటారు.

సమాజం దృష్టి

సమాజం ధనవంతులను నిందిస్తూనే ఉంటుందని, ఆ ధనవంతుడు అన్నీ దానం చేసి బికారిగా మారేంతవరకూ సమాజం సంతోషించదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రజలలో ధనవంతులు పట్ల నిరసన తెలియజేస్తుంది.

ధనస్వామ్యం రుణ విధానం పై ఎక్కువగా ఆధారపడుతుంది. రుణ బాధితులు కూడా పెరుగుతారు. ఈ విషయాన్ని దీక్షితులు స్పష్టంగానే గుర్తించారు.

అప్పుల బాధలు

​కలివిడంబనం శతకం ప్రకారం, అప్పుల బాధలు చాలా భయంకరమైనవి. రచయిత నీలకంఠ దీక్షితులవారు ఋణగ్రస్తుల కష్టాలను గురించి ఈ గ్రంథంలో వివరించారు.

​ వడ్డీ వ్యాపారిని రచయిత పెద్ద పిశాచంగా పోల్చారు. అతడిని తలుచుకోగానే కాళ్ళు చేతులు వణకడం, కళ్లబడగానే బుద్ధి పనిచేయకపోవడం జరుగుతుంది. యముడికి కూడా మనుషుల ప్రాణాలను హరించేందుకు ఒక సమయం ఉంటుంది, కానీ అప్పిచ్చిన వాడికి అలాంటి నియమం ఏదీ లేదు. అతడికి కోరలు, తాడు వంటివి లేకపోయినా, అతడిని చూస్తే మనసులో ఒక రకమైన ఆందోళన (ఉద్వేగం) కలుగుతుంది. గ్రామాలు కొండ ప్రాంతాలలోనూ ఈ అప్పుల బాధలు తట్టుకోలేక ప్రజలు పడే కష్టాలు వర్ణనాతీతమని రచయిత పేర్కొన్నారు. గ్రామీణుల రుణ బాధలను నేటి రచయితలు హృదయ విదారకంగా వర్ణించారు. కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథ ఈ కోవకు చెందినదే

అసలు విషయం దీక్షితులు జీవిస్తున్న 17వ శతాబ్దం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ పోర్చుగీస్ లాంటి పాశ్చాత్య దేశాల వ్యాపారుల హవా తీవ్రంగా పెరిగింది. ధనస్వామ్యం రాజ్యం చేయడం మొదలైంది. వ్యాపారం అన్ని రంగాలలోకి చొచ్చుకు పోయింది. ఈస్టిండియా కంపెనీ వారు దేవాలయాలను దేవాలయ వ్యవస్థను కూడా శాసించడం మొదలుపెట్టారు. ఈ కొత్త పరిస్థితులు ఆలోచనలోనూ ప్రజల జీవన విధానంలోనూ మాత్రమే కాదు మతం ఆధ్యాత్మికత విశ్వాసాలు అన్నిటినీ వ్యాపారమయం ధనస్వామ్యం చేసేశాయి. ఈ నూతన పరిస్థితులను దీక్షితుల రచనలు ప్రతిబింబిస్తాయి. వ్యాపారం ధనస్వామ్యం ప్రపంచాన్ని శాసిస్తున్న నేటి కాలానికి అంకురస్థితిని ఆయన రచనల్లో చూడవచ్చు.

సత్యానంతర యుగం (Post-Truth Era) నీల్ పోస్ట్మాన్: ఒక ఆధునిక ఆధిపత్యం

నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్దంలో చెప్పిన సత్యాలను నేటి అత్యాధునిక సమాచార దశకు అన్వయించవచ్చు. అమెరికన్ సామాజికవేత్త మాధ్యమ విమర్శకుడు నీల్ పోస్ట్మాన్ (Neil Postman) తన రచనలలో, ముఖ్యంగా ‘ Amusing Ourselves to Death లో సమాచారం యొక్క నాణ్యత తగ్గడం, అబద్ధాలు వాస్తవాల మధ్య తేడా కనుక్కోవడం కష్టమవడం గురించి వివరించారు. టెలివిజన్ వంటి మనోరంజన-ఆధారిత మాధ్యమాలు గంభీరమైన చర్చలను కూడా శోభాయమానమైన, ఉప్పొంగించే వినోదంగా మార్చివేస్తాయని ఆయన ‘ హెచ్చరించారు. ఇది ఒక అర్థంలో నీలకంఠ దీక్షితులు విమర్శించిన ‘బహిరంగ ప్రదర్శన’ (Show Business) యొక్క ఆధునిక, టెక్నాలజీ-ఆధారిత రూపం.

పోస్ట్మాన్ నేరుగా ‘పోస్ట్-ట్రూత్’ (Post-Truth) అనే పదాన్ని ఉపయోగించలేదు, కానీ అతను వివరించిన పరిస్థితులు దానికే దారి తీస్తాయి. సత్యానంతర యుగంలో భావోద్వేగాలు వ్యక్తిగత నమ్మకాలు వాస్తవాలకు మించి ప్రాముఖ్యత పొందుతాయి. టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా ‘వాట్సాప్ యూనివర్సిటీలు’ నీలకంఠ దీక్షితులు ఎప్పుడో విమర్శించిన జ్ఞానాభాసను, అజ్ఞానాన్ని సర్వవ్యాప్తం చేసే సామర్థ్యాన్ని పొందాయి.

ముగింపు: ఒక నిత్య ప్రస్తుత విమర్శ

రాజకీయాలు కుహనా ఆధ్యాత్మికత కలగలిసిపోయి, అవి నిజమైన జ్ఞానం విమర్శనాత్మక ఆలోచన స్థానాన్ని ఆక్రమించాయి. బహిరంగ ప్రదర్శనలు, ఇమేజ్ నిర్మాణం ఒక ఆధిపత్య రూపంగా మారాయి. నీలకంఠ దీక్షితులు ‘కలివిడంబనం’లో అసత్యం, ధన సంపాదన, బహిరంగ ప్రదర్శన మతం పేరుతో రాజ్యం చేస్తున్నాయని చెప్పారు. జ్ఞానం విద్యలకు కాలం చెల్లిందని, కలికాలం ముదిరిపోయిందని హెచ్చరించారు.

ఆయన విశ్లేషణ నేటి సమాజానికి ఒక నిశితమైన విమర్శ దృక్పథాన్ని అందిస్తుంది. ఇది ఒక పురాతన గ్రంథం కాదు; ఇది మానవ స్వభావం అధికారం పెట్టుబడికి లొంగిపోయే వైఖరిని స్పష్టం చేసే ఒక నిత్య ప్రస్తుత విమర్శ. ఈ విమర్శను అర్థం చేసుకోవడం, నీల్ పోస్ట్మాన్ వంటి ఆధునిక మేధావుల సూచనలతో కలపడం, మనం ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్లను – సోషల్ మీడియా ఎకో చేంబర్లు, జ్ఞానాభాస వ్యాప్తి, సత్యానంతర రాజకీయాలు – ఎదుర్కోవడానికి మనకు అవసరమైన విమర్శనాత్మక దృక్పథాన్ని అందిస్తుంది.

బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయదూషితాః
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితమ్.

తే.
బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు
ప్రబలగర్వవిదూషితుల్ ప్రభువులెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.

బోధించేవారికి ప్రవచనాలు చేసే వారికి ఈర్ష్యాసూయలు మానసిక అవ లక్షణాలు ఎక్కువ. ప్రభువులు మిక్కిలి గర్వముతో విర్రవీగుతున్నారు. సామాన్య ప్రజలు పూర్తి అజ్ఞానంలో ఉన్నారు. అందువల్ల మంచి మాట తర్కబద్ధమైన మాట లోలోపల ఇంకిపోయింది వ్యర్థంగా.
(భర్తృహరి సుభాషిత రత్నావళి)


మూలాలు

  1. కలివర్తన దర్పణము అనువాదం పవని వేణుగోపాల్. తిరుపతి 1999
  2. నరసింహ శతకం శేషప్ప
  3. భర్తృహరి సుభాషిత రత్నావళి
  4.  Amusing Ourselves to Death: Public Discourse in the Age of Show Business. ​Neil Postman​ Viking Penguin – U. S 1985
  5. అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం దేవరకొండ బాలగంగాధర తిలక్
  6. kalividambanam, translation sunanda, Y. Sastri, sarada jnana peetham pune 2007
  7. Confession -LeoTolstoy

రాణి శివశంకర శర్మ

రచయిత రాణి శివశంకర శర్మ గురించి:

రాణి శివశంకరశర్మ \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన \’గ్రహాంతరవాసి\’ నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన \’గ్రహాంతరవాసి\’ కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన \’అమెరికనిజం\’ ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ\’గా, మలిసంపుటి \’పూజారి 2040\’గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు \’హిందుత్వ\’, \’ధర్మోరక్షతి రక్షితః\’ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన \’శకుంతల\’ అందరి మన్ననలు పొందింది.

 ...