బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి ప్రకరణము 3

స్వతంత్ర భారత రాజ్యాంగము

భారతదేశ రాజ్యాంగ నిర్మాణసభ (Constituent Assembly) 1946వ సం. డిశంబరు 9న ప్రథమమున సమావేశమై రెండేండ్లు కృషిచేసి స్వతంత్ర భారత రాజ్యాంగమును తయారుచేసెను. సభాధ్యక్షులైన శ్రీ రాజేంద్రప్రసాదుగారు దానిపైన 1947వ సం. నవంబరు 26వ తేదీన సంతకము చేసిరి. అది 1950వ సం. జనవరి 26వ తేదీ నుండి అమలు జరుగుచున్నది.

ఈ రాజ్యాంగమునుబట్టి భారతదేశము సంపూర్ణ స్వతంత్ర ప్రజాస్వామికమైన రాజ్యసమితిగ నేర్పడినది. India is a Democratic Republic and union of states. ఇందలి రాజ్యభాగము నాలుగురకములైన రాజ్యభాగములుగ విభజింపబడినది – భారతదేశ పౌరులకు దేశమునందు స్వాతంత్ర్యము స్వేచ్ఛయుండునట్టి ప్రాతిపదికస్వత్వములు కొన్ని రాజ్యాంగముననె స్థిరముగ నొసగబడి వానివిషయములలో సమితి ప్రభుత్వము పైనగాని రాజ్యభాగ ప్రభుత్వముల పైనగాని హైకోర్టు సుప్రీము కోర్టుల ద్వారమున పరిహారము పొందు అధికారమివ్వబడినది.

భారతసమితి యొక్క ప్రభుత్వాధికారములు అధ్యక్షునియందు నెలకొల్పబడినవి. రాజ్యసభయును లోకసభయును గల ప్రజాప్రతినిధులకు బాధ్యత వహించు మంత్రులద్వారా పరిపాలనము జరుగును.

వివిధ రాజ్యభాగములందు గల ప్రజాప్రతినిధుల సభలకు బాధ్యులైన మంత్రులద్వారమున స్థానిక పరిపాలనము జరుగును.

ఇంగ్లీషువారు భారతదేశమునేల వదిలిపెట్టిరి?

భారతదేశమును వదలిపోవుడని కాంగ్రేసు మహాసభవారు 1942లో ప్రారంభించిన ‘క్విట్‌యిండియా’ ఆందోళనమును బ్రిటీషువారు అణచివేసిరి. ఆయుద్యమానంతరము దేశములో చెలరేగిన అల్లరులు కొంచము పెద్ద ఎత్తులోనే సాగినను దేశముయొక్క విస్తీర్ణమును జనసంఖ్యనుబట్టి ఆలోచించినచో నిదితిరుగుబాటు అని చెప్పుటకు వీలైనంత పెద్దదని ఎంచుటకు వీలులేదని ఆంగ్లేయ రాజనీతిజ్ఞులు నిశ్చయించిరి. ముసల్మానులు దీనిలో పాల్గొనక తొలగియుండిరి. ఇది కాంగ్రేసువారు అధికారమును చేజిక్కించుకొనుటకు చేసిన ప్రయత్నమని ముస్లిములీగువారు దీనిని గర్హించిరి.

రెండవప్రపంచయుద్ధము అంతమగునాటికి పైకి భారతదేశమున ఇంగ్లీషుపరిపాలన చాలా గట్టిగనే కనబడుచుండెను. ఎటువంటి సవాలునైనను ఎదుర్కొనుటకును ప్రభుత్వమును సాగించుటకును శక్తిమంతముగ కనబడుచుండెను. 1935వ సంవత్సరపు రాజ్యాంగచట్టముక్రింద భారతదేశములోని ఆంగ్లరాజప్రతినిధి వైస్రాయికి చాలా విస్త్రుతమైన అధికారములుండెను. యుద్ధసమయమున చేయబడిన శాసనముల వలన ఆయన అధికారములు మరింత హెచ్చింపబడినవి. ఆయన కార్యాలోచనసభ (ఎగ్జిక్యూటివు కవున్సిలు) ఆయనకే బాధ్యతకలిగి యుండెనుగాని శాసనసభలకు బాధ్యతకలిగినది కాదు. ఉన్నతయుద్యోగ వర్గములపైన ఇండియనుసివిల్‌సర్వీసు పోలీసుసర్వీసు శాఖలలో హెచ్చుమంది భారతీయులను నియమించుపద్ధతి అమలులోనున్నప్పటికిని ఆ శాఖలందు ఇంగ్లీషుజాతివారి సంఖ్యానిష్పత్తి హెచ్చుగనేయుండెను. అత్యున్నతోద్యోగములందు వారిసంఖ్య మరింత హెచ్చుగనుండెను. భారతదేశమున అభినవమారణాస్త్రములుగల పెద్ద ఇంగ్లీషుసేనయుండెను. భారతీయసైన్యములోని పైయధికారులందరు ఇంగ్లీషు ఆఫీసరులుగనె యుండిరి.

భారతదేశములోని రాష్ట్రీయగవర్నరును ఇంగ్లీషువారే. అప్పుడు పదకొండు రాష్ట్రములలో ఐదురాష్ట్రములు మంత్రులపరిపాలన క్రిందగాక గవర్నరుల పరిపాలన క్రిందనుండెను. భారతదేశపరిపాలనమెల్ల ఇంగ్లాండులోని రాజ్యాంగకార్యదర్శి కనుసన్నల మెలగుచుండెను. భారతదేశప్రభుత్వముపైన ఇంగ్లీషుపార్లమెంటువారు సర్వాధికారములు కలిగియుండిరి.

అయితే ఆనాటికి భారతదేశమున ఇంగ్లీషువారికున్నట్లు పైకి కనపడు అధికారబలము నిజమునకంతగట్టిదికాదు. అసలుసంగతి ఏమనగా అప్పటికప్పుడే భారతదేశములోని వివిధవర్గములవారికి తమదేశపు భావిప్రభుత్వవిధానవిషయమున ఏకాభిప్రాయము కుదరగనే భారతదేశమునకు స్వాతంత్ర్యము నొసగెదమని బ్రిటీషువారు వాగ్దానము చేసియుండిరి.

ఇంగ్లీషుప్రభుత్వ పక్షమున సర్ స్టాఫర్డుక్రిప్సు భారతదేశమునకువచ్చి చెప్పినమాటలు అప్పుడు ఇంగ్లాండులోని ముఖ్యరాజకీయపక్షముల వారందరు కలిసి ఏర్పడిన సంయుక్త కోయలీషన్ ప్రభుత్వమువారి పక్షమున చెప్పబడెను. అందువలన భారతదేశము స్వతంత్రమగుటలో తగుసహాయము చేయుటకు ఇంగ్లాండులోని ప్రధానరాజకీయ పక్షములవారు మాట ఇచ్చినట్లైనది. ఇంగ్లాందులోని కన్సర్వెటీవు పక్షము వారదివరకు భారతదేశమున చాలాకాలమునుండి తమ పక్షమువారికి ఉద్యోగములిచ్చుటకును తమపక్షీయులు లాభములు పొందుటకును తగు అవకాశములు కలిగియున్నందున భారతదేశముపై యధికారములను సడలించుట కిష్టపడకుండిరి. అయితే ఇంగ్లాండు ప్రభువులలోనే ఒక గొప్ప మార్పు వచ్చి రాజకీయాధికారమునెల్ల ఒక క్రొత్తతరగతి జనసంఘమువారి చేతులలోనికి పోవుచుండెను. ఈ క్రొత్త తరగతుల ప్రజలకు పూర్వపు కన్సర్వెటీవు పక్షీయులవలె భారతదేశ విషయమున పట్టుదల ఎంతమాత్రము లేదు.

భారతదేశములోని ఇంగ్లీషు అధికారవర్గమువారికిని ఆ దేశములోని రాజకీయపక్షముల ప్రజలకును స్నేహసంబంధములు లేకపోగా విరోధమేర్పడియున్నదని అందువలన అక్కడిరాజకీయములు పనికిమాలినవిగనున్నట్లు ఇంగ్లాండులోని సామాన్యపౌరులకు తోచుచుండెను. ఇంగ్లాండుకు భారతదేశముతోడి సంబంధము ఉభయదేశములకును లాభకారిగా లేదని చాలామందికి తోచుచుండెను. ఏది ఎట్లున్నను ఉభయదేశములలో జనసామాన్యమునకును సామాన్యపౌరునికిని దీనివలన నెట్టిప్రయోజనములేదను సంగతి విస్పష్టముగ తోచుచుండెను. ప్రపంచయుద్ధము అంతమగునప్పటికి యుద్ధమువలన అనర్థము శాంతియొక్క లాభములు మానవుల తలకెక్కుటగాక మానవస్వాతంత్ర్యము – జాతీయ స్వాతంత్ర్యము – ఆర్థిక స్వాతంత్ర్యము అభివృద్ధి చెందవలెనను భావములు ప్రపంచము నందన్నిచోట్లను వ్యాప్తిచెందుచుండెను. ఇది భారతదేశమున కూడ వర్తింపవలెననుట సహజము.

ఇంగ్లాండువారికి యుద్ధమన్న రోతకలిగినది. విశాల భారతదేశమునందు శాంతిభద్రతలను కాపాడుటకు అవసరమైనంతమంది ఆంగ్లేయ సైనికులను ఉంచవలసియుండుట యనునది ఇంగ్లీషుప్రజల కనవసరమైన బాధ్యతను బాధను కలిగించుటయని అనవసరముగ నింగ్లీషుయువకుల రక్తమును ధారపోయుటయని ఇంగ్లీషు జనసామాన్యమునకు తోచుచుండెను. ఇంతటి కష్టముతో బలవంతముగా భారతదేశమును పరిపాలించు పద్ధతి, ఆ దేశమువలన తాముపొందు లాభములను నిలబెట్టుకొనజూచు కొలదిమంది ఇంగ్లీషు పెట్టుబడిదారులు వర్తకులు స్వలాభాపేక్షతో ప్రేరేపించుచున్న పద్ధతియని నిందించుటకు కూడా అవకాశముండెను.

ఇంగ్లాండు ప్రజలలో చాలామందికి ఇటువంటి అభిప్రాయము కలుగుచున్న సందర్భములో భారతదేశమున జాతీయవాదులతో ఆయుధసంఘర్షణము చేయు ఏ ప్రభుత్వమైనను ఇంగ్లాండులో తీవ్రవిమర్శకు గురియై తమ విధానమును సమర్థించుకొనవలసియుండును. అట్లని భారతదేశమున అల్లరులు చెలరేగకుండ శాంతిభద్రతలను కాపాడుటకు తగు చర్య తీసుకొనకుండ ఏ ప్రభుత్వమును ఊరక కూర్చొనలేరుకదా? ఒకవంక శాంతిభద్రతలు కాపాడుటకు తగుచర్యలను దీసికొన నిశ్చయించినను గూడ క్లిష్టపరిస్థితులు రాకుండ చూచుటకె ప్రయత్నించుచుండెను. 

భారతదేశపు భవిష్యత్తును గూర్చిన సమస్యలును భారతదేశమునకును ఇంగ్లాండునకును మధ్యగల పరస్పర సంబంధములును నానాటికి కష్టతరములగుచుండెను. దీనికితోడు యుద్ధమువలన ఇంగ్లాండు ధనవిహీనమైయున్నందున తన ఆదాయమునుండి మఱింతసొమ్ము వ్యయపడగల విధానమును భారతదేశమునందవలంబించు శక్తి ఇంగ్లాండుకు లేదు.

ఇంగ్లాండులోని లేబరుపక్షమువారికీ విషయమున కన్సర్వెటీవు పక్షీయులపైన నెట్టిననుమానములున్నను నిజమునకు ఎన్నిచిక్కులైన పడి భారతదేశము నంటిపెట్టుకొనియుండుట అవసరమైయుండునంతటి ఆర్థికలాభము భారతదేశమువలన ఇంగ్లీషుపెట్టుబడిదారులకు కలుగుటలేదు. ఈ పరిస్థితులలో ఆంగ్లేయ రాజకీయవేత్తల మనస్సులందు ఒక ఆందోళనమాత్రముండెను. తాము భారతదేశమును వదలినపిమ్మట ఆ దేశములో తమదేశమునకు వర్తక వ్యాపారములు చక్కగా జరుగనేరవను భయమే వారిని బాధించుచుండెను.

తాము పోయినతరువాత నీదేశముననేర్పడు జాతీయప్రభుత్వములు తమకు వ్యతిరేకమైన శాసనములు చేయునేమోయను భయము కొంతయున్నను తాము మంచితనముతో వెడలిపోయినచో నీదేశీయులు ఇంగ్లీషువర్తకులపట్ల స్నేహభావము కలిగియుందురను ధైర్యము వారికి లేకపోలేదు.

యుద్ధమునకు పూర్వము ఇంగ్లాండునకును భారతదేశమునకు నుండిన ఆర్థిక సంబంధము యుద్ధానంతరము తారుమారైనది. అంతకు పూర్వము భారతదేశము ఇంగ్లాండు దేశమునకు 15 వందల కోట్ల రూపాయలు ఋణపడియుండెను. యుద్ధమునందు ఇంగ్లాండు అమిత సాధనసామగ్రిని కొనవలసివచ్చినందున యుద్ధము పూర్తియగునప్పటికి ఇంగ్లాండు భారతదేశమునకు 120 కోట్ల నవరసులు బాకీపడెను. అందువల్ల భారతదేశము తమకివ్వవలసిన ఋణమును చెల్లించునంతవరకును తమ వశములో నుంచుకొనవలయునను పూర్వపుటాలోచన పోయినది.

అన్నిటికన్న ముఖ్యమైన విషయము మరొకటి ఆంగ్లేయ రాజనీతిజ్ఞుల మనస్సుకుతోచెను. భారతదేశమునందు తాము నిర్మించియుంచిన ప్రభుత్వయంత్రము యుద్ధానంతరమాదేశమునెదుర్కొనిన సమస్యలను పరిష్కరింపగలుగునను ధైర్యము వారికి లేదు. ఆర్థికవిషయములందు దాపురించిన చిక్కులును ఒడిదుడుకులును అందరికిని తెలియును. భారతదేశ జనసంఖ్య సంవత్సరమునకు ఏబదిలక్షలు చొప్పున పెరుగుచుండెను. దేశములోని జనసంఖ్యలో బహుసంఖ్యాకులు నిరక్షరకుక్షులు. అమాయకులైన వ్యవసాయకులు. వారు అర్ధాకలితో కాలముగడుపుచుందురు. వీరి జీవితవిధానమును చక్కబరచుటయనునది చాలా పెద్దసమస్య. యుద్ధకాలమున దేశములోని చెలామణి పెంపుచేయబడినందున (inflation) రూపాయికి విలువ తగ్గిపోయి ప్రజలు జీవితావసరములను కొనుటకే శక్తిలేనివారైపోయిరి. ఇట్లు పెరిగిపోవుచున్న జనసంఖ్యకు దేశములోని ఆహారపదార్థములు చాలవు. వంగదేశమున సంభవించిన ఘోరక్షామముకన్నను తీవ్రమైన కఱవు వచ్చునేమోయని ఇంగ్లీషుప్రభువులు కూడా భయపడుచుండిరి. అందువలన జీవితమునకవసరమైన పదార్థములను న్యాయముగా వినియోగించుటకు వ్యవసాయమును పరిశ్రమలు రాకపోకలు సంసర్గమార్గములు ప్రజారోగ్యము విద్య అభివృద్ధిచేయుట చాలా ముఖ్యము. దేశముయొక్క ఆర్థికస్థితిని చక్కచేయుట కవసరమైన ప్రణాళికలను ప్రభుత్వము తయారు చేయవలసియుండెను. చదువుకొన్నవారియందు తగు ఉత్సాహము కలిగించిననే వారీకార్యక్రమమును చక్కగా నెరవేర్పగలుగుదురు. సామాన్యపరిస్థితులందే ప్రభుత్వములకిది కష్టమైన పని. విదేశ ప్రభువులకే బాధ్యతవహించియుండు భారతదేశప్రభుత్వమునకిది మఱియు కష్టసాధ్యమైన పని. ముఖ్యముగా దేశములోని అనర్థకములన్నిటికినీ కారణము పారతంత్రమేయనియెంచి ప్రభుత్వమువారు చేయు ప్రతి చిన్న కార్యమును గూడ జాతీయోద్యమనాయకులు విమర్శించుచున్న పరిస్థితులలో నిది ఎంత దుర్ఘటమో యోచింపవచ్చును. బ్రిటీషుప్రభుత్వమువారు తమ అధికారములను భారతదేశములోని ప్రభుత్వవశము చేసి ప్రజలను సహకరింపుడని కోరిననుగూడ వారు తమ చేతులలో మిగిల్చియుంచుకొనిన స్వల్పాధికారములు గూడా భారతీయులు సహింపక వానిపేరున జరుపబడు చర్యలననుమానముతో జూతురు. ఇంకొక చిక్కుకూడ ఉండెను. భారతదేశములోని స్వదేశీసంస్థానాధీశులతోను భూస్వాములతోను బ్రిటీషు ప్రభుత్వమువారు చేసికొనిన యొప్పందములు నిజముగా కాలమానపరిస్థితులను బట్టి పనికిమాలినవిగానెయున్నను, ఇంగ్లీషువారీదేశమున అధికారము కలిగియున్నంత కాలము ఆ యొప్పందములను త్రోసిరాజనుటకు వీలులేదు. భారతదేశ ప్రభుత్వమువారు ప్రజలక్షేమలాభముల కొరకేదైనా చర్య దీసికొనదలచి అందుకొరకు వారు తయారుచేయు ప్రణాళికలకీ యొప్పందములు అడ్డువచ్చుచుండెను.

భారతదేశమునందు స్థాపించబడియున్న ప్రభుత్వ యంత్రాంగము నిజమునకు దేశక్షేమమునకు కావలసిన మహత్తర ప్రణాళికలను అమలుచేయగల శక్తిగలట్టిదిగలేదు. ప్రపంచములోని అన్ని ప్రభుత్వయంత్రాంగములవలెనే ఇదియు యుద్ధకాలమున నియమింపబడిన అసంఖ్యాకులయిన ఉద్యోగివర్గముతో కదలమెదలలేనిస్థితిలోనుండెను. ముఖ్యంగా క్రిందిశాఖలలో నిటువంటి పరిస్థితివలన సంభవించు లోటుపాటులు మితిమీరియుండెను. ఇక పై అంతస్తులలోనుండు ఇంగ్లీషు ఉద్యోగస్తులన్ననో- యుద్ధకాలమున పెరిగిన కవిలికట్టలను చూచుటలోనే వారి కాలము చాలవరకు చెల్లిపోవుచుండెను. భారతదేశముయొక్క భావిరాజ్యాంగమెట్లు పరిణమించునో అప్పుడు తమ స్థితి యెట్లు మారునో అను అనుమానము వారిని బాధించుచుండెను. అప్పుడప్పుడు భారతదేశముయొక్క భవిష్యత్తును గూర్చి ఇంగ్లాండు ప్రభుత్వమువారు చేయుచువచ్చిన వివిధ ప్రకటనలవలనను తుదకు క్రిప్సుగారి ప్రకటనలవలనను ఇకముందు తాము బ్రిటీషుప్రభువులకె వశవర్తులుగ నుండవలెనో, భారతదేశ రాజకీయపక్షములలో ప్రభుత్వము వహింపగలవారికే వశవర్తులుగ నుండవలెనో పాలుపోక ఉన్నతోద్యోగములందుండిన భారతీయులు కూడా తికమకపడుచుండిరి. ఇట్టి సందిగ్ధావస్థయందు పరిపాలన ఎట్లు జరుగును?

అందువలన భారతదేశప్రభుత్వము బ్రిటీషువారి చేతులలో నుండి భారతీయుల చేతులలోనికి ఎంత త్వరితముగమారిన నంత మంచిది అనుభావము వ్యాపించెను. అయితే ఈ భావము ఇంగ్లాండులోనెంత తీవ్రముగ వ్యాపించియున్నదో భారతదేశీయులెరుగరు. అందువలన భారతదేశప్రభుత్వమును ప్రజాయత్తము చేయదలచినామని బ్రిటిషువారు చెప్పు మాటలను భారతీయులు విశ్వసింపరైరి. లూయీఫిషరుగారి గాంధీజీ జీవితములో ఈ సంగతిని చెప్పియున్నారు.

భారతదేశములోని ప్రధానరాజకీయ పక్షములవారు భారతదేశ రాజకీయాధికార స్వీకారము విషయమై ఏకాభిప్రాయమునకు రావలెనని అల్పసంఖ్యాకుల విషయమై కొన్ని రక్షణలుండవలెనని బ్రిటీషువారను మాటలు దేశములోని అధికసంఖ్యాకులకు లోబడని అల్పసంఖ్యాకవర్గమొకటి యున్నంతకాలమూ తామీదేశమునంటిపెట్టుకొని యుండవచ్చునను దురుద్దేశ్యముతో నీమాటలనుచున్నారను దురభిప్రాయము కలిగెను.

భారతదేశములోని రాజకీయపక్షములలో కాంగ్రేసు తీవ్రజాతీయపక్షమే యైనప్పటికిని గాంధీమహాత్ముని నాయకత్వమున సాత్వికవిధానములతో ఆందోళనము చేయుచున్నదిగాని విప్లవపక్షమువానివలె హింసావిధానము లవలంబించి ఇంగ్లీషువారిని ద్వేషించుటలేదు. కమ్యూనిస్టులు సోషలిస్టులు మొదలైన వామపక్షములవారికింకను కాంగ్రేసునకున్నంత బలములేదు. కమ్యూనిస్టులు రష్యాపైన ఆధారపడినవారు. ఉత్తరోత్రా వామపక్షములు బలవంతములై భారతదేశమును ఇంగ్లీషువారు వదలవలసివచ్చినచో వారికీదేశములో నిప్పునీరు పుట్టని పరిస్థితి కలుగవచ్చును. ముస్లిములీగునాయకులు భూస్వాములు ధనవంతులునై బ్రిటీషువారిపైన ఆధారపడువారు. అందువల్ల ఏదోవిధముగా కాంగ్రేసుతోను ముస్లిములీగుతోను స్నేహభావముతో దేశపరిపాలన వారికి అప్పగించి వెళ్ళినచో ఈ దేశములో తమకుగల ఆర్థిక వ్యవహారములలో కొంత లాభము పొందవచ్చును. అందువల్లనే ఇంగ్లీషువారు 1947లో భారతదేశమును వదలినారు.

(సమాప్తం)