[దిగవల్లి వేంకట శివరావుగారి 1938లో ప్రచురించబడిన భారతదేశమున బ్రిటిష్ రాజ్యతంత్రము, The British Rule in India అను రెండు పుస్తకములు చాల ప్రశంసించబడినవి. కాని, తెలుగు పుస్తకమునకు చివరి ప్రకరణము ఇప్పటివరకునూ ప్రచురించబడలేదు. శివరావుగారి చేతివ్రాత ప్రతిని వారి మిత్రులు డా. గూడూరి నమశివాయ 1980లో ఫెయిర్ కాపీ చేసి ఒక నోటుబుక్కులో వ్రాశారు. ఆ చివరి ప్రకరణాన్ని ఈమాట పాఠకులకోసం అందించిన దిగవల్లి రామచంద్రగారికి మా కృతజ్ఞతలు.– సం.].
భారతదేశ స్వాతంత్ర్య సిద్ధి
ఇంగ్లీషువారు భారతదేశమునేల వదిలిపెట్టిరి?
1935వ సంవత్సరపు రాజ్యాంగ చట్టముననుసరించి 1937 ప్రారంభములో జరిగిన ఎన్నికలలో హిందువులు హెచ్చుసంఖ్యగల జనరల్ స్థానములలో కాంగ్రేసు అభ్యర్థులు వేలకొలది హెచ్చు ఓట్లతో బ్రిటీషు ప్రభుభక్తిపరాయణులనోడించి గెలుపొందిరి. మహమ్మదీయులు హెచ్చుసంఖ్యగలచోట్ల ముస్లిములీగు సభ్యులే హెచ్చుమంది ఎన్నుకొనబడిరి. ఈ రెండు రాజకీయ సంస్థలుగల కొయలీషను మంత్రివర్గము లేర్పడవలెనని మహమ్మదీయులు కోరిరి. కాని కాంగ్రేసువారు అందుకు సమ్మతించలేదు. ఇందువలన ఈ రెండుపక్షముల మధ్యనుగల వైషమ్యము విస్తరించెను. ఒకప్పుడు కాంగ్రేసుకు అనుకూలముగానుండి భారతదేశము ఒక జాతి కాదని వాదించిన వారెల్లరను తీవ్రముగా విమర్శించిన మహమ్మదాలి జిన్నాగారు, కాంగ్రేసు ప్రభుత్వముల పరిపాలనమున మహమ్మదీయులకు న్యాయము జరుగదని బహిరంగముగా ప్రకటింపసాగెను. చాలామంది మహమ్మదీయులు యీయనమాటలనే శిరసావహింపసాగిరి. మహమ్మదీయులు అందరును ఆయనను నాయకునిగనంగీకరించిరి. అతడు ముస్లిములీగుకు అధ్యక్షుడయ్యెను.
కాంగ్రేసు మొదట భారతదేశములోని పదకొండు రాష్ట్రములలో నేడింటియందు ప్రభుత్వము వహించెను. కాంగ్రేసు మంత్రుల పరిపాలనము చక్కగనే జరిగెను. కాంగ్రేసుకు పలుకుబడి హెచ్చినది. 1936 సం.లో 50వేలకు తక్కువగానున్న కాంగ్రేసు సభ్యుల సంఖ్య 1939 అంతమునాటికి 50 లక్షలకు పెరిగెను. అయితే త్వరలోనే కాంగ్రేసులోనొక తీవ్రమైన వామపక్షమొకటి బయలుదేరినది. ఆ సంవత్సరమున కాంగ్రేసు అధ్యక్షతకు గాంధిగారు సూచించిన అభ్యర్థియైన పట్టాభి సీతారామయ్యగారిని వామపక్షనాయకుడైన సుభాసుచంద్రబోసుగారు ఎన్నికలలోనోడించుటవల్ల నావామపక్షమెంత బలముగానుండెనో తెలిసివచ్చెను. అయితే కాంగ్రేసులోని గాంధీ శిష్యులైన మితవాదులు సుభాసుచంద్రబోసుగారిని రాజీనామా ఇచ్చునట్లు బలవంతపెట్టిరి. ఆయన ఫార్వర్డు బ్లాకు అనునొక కొత్త పక్షమును స్థాపించెను. ఈ వైషమ్యముల వలన కాంగ్రేసులో కొంత బలహీనతయేర్పడెను.
అయినను కాంగ్రేసు మంత్రివర్గములు 1935వ సం. రాజ్యాంగచట్టమేర్పరచిన రాజ్యాంగమును ప్రజాహితైక పద్ధతులలో నడిపించగలిగిరి. రాజకీయ పరిస్థితులు కొంతశాంతముగనేయుండెను. కాని ఇంతలో 1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ మహాసంగ్రామము దాపురించినది. భారతదేశ ప్రజాప్రతినిధులతో ఆలోచించి వారి సమ్మతి గైకొనకుండగనే బ్రిటీషు రాజప్రతినిధి భారతదేశమును యుద్ధములోనికి దిగినట్లు ప్రకటించుట అన్యాయమని కాంగ్రేసునాయకులకు తోచినది. నిరంకుశ సామ్రాజ్య పద్ధతులననుసరించి చేయింప యుద్ధమునందు తాము సహకరింపమని కాంగ్రేసు వర్కింగు కమిటీవారు ప్రకటించిరి. ఈ సామ్రాజ్య దృక్పథమును వీడి భారతదేశమును స్వతంత్రదేశముగా నంగీకరింతురా లేదా యుద్ధములో తమ నిజోద్దేశ్యమును తెలుపవలసినదని బ్రిటీషు ప్రభుత్వమును కోరిరి. దానికి తగిన సమాధానము రానందున 1939 అక్టోబరు నవంబరు నెలలలో భారతదేశములోని అన్ని రాష్ట్రములందును కాంగ్రేసు మంత్రులు రాజీనామాలనిచ్చిరి.
జర్మనులు విజృంభించి విజయముగాంచుచున్న తరుణమున తుదకు కేంద్రముననొక జాతీయప్రజాప్రభుత్వమునైన నేర్పరచినచో తాము సహకరింతుమని కాంగ్రేసువారు నోరువిప్పి చెప్పిరి. బ్రిటీషు ప్రభుత్వము తరఫున 1940 అగస్టు 8వ తేదీన రాజప్రతినిధి యొక ప్రకటనగావించి భారతదేశములోని బలవంతులైన పెద్ద ప్రజాసంఘము జాతీయ ప్రభుత్వ స్థాపనకు వ్యతిరేకముగానున్నందున అట్లు స్థాపింప వీలులేదనెను. ముస్లిములకిష్టములేదనియే ఆయన ఉద్దేశ్యము. అయితే యుద్ధానంతరము, భారతదేశమునకొక క్రొత్త రాజ్యాంగమును నిర్మించుటకొక ప్రజా ప్రతినిధుల సంఘమునేర్పరతుమనియు, అదనపు భారతీయ సభ్యులను రాజప్రతినిధిసభలో నియమించి దానిని పెంపుచేయుదమనియు భారతదేశ ప్రజాప్రతినిధులతోను సంస్థాన ప్రతినిధులతోను ఒక యుద్ధ సలహాసంఘము నేర్పరతుమనియు రాజప్రతినిధి ప్రకటించెను. ఇది తృప్తికరముగలేదని కాంగ్రేసు వారభిప్రాయపడిరి. గాంధి మహాత్ముని నాయకత్వమున అక్టోబరు 1940లో వ్యష్టిసత్యాగ్రహమునారంభించిరి.
రాజకీయ ప్రతిష్టంభనము ఒకటిన్నర సంవత్సరములు అట్లేయుండెను. ఆ సమయమున జపానువారు మలయాద్వీపకల్పములో చొరబడి బర్మావైపునకు చొచ్చుకొని వచ్చుచుండిరి. 1942 మార్చి నెల 8వ తేదీన రంగూను పడిపోయినది. తరువాత మూడు దినములలో బ్రిటీషు ప్రభుత్వమువారు కొంచెము మెత్తబడి బ్రిటీషు మంత్రివర్గమున సభ్యుడైన సర్ స్టాఫర్డుక్రిప్సును భారతదేశమునకు పంపుచున్నామని చెప్పి రాజప్రతినిధి 1940 అగస్టులో చేసిన ప్రకటనములోని యంశమును పునరుద్ఘాటించిరి. క్రిప్సు వచ్చి భారతదేశమునకు అధినివేశప్రతిపత్తి నొసగెదరని యుద్ధము ఆగిపోవగనే రాజ్యాంగ నిర్మాణ సభయొకటి యేర్పరుపబడునని చెప్పెనేగాని ప్రభుత్వమునందు వెంటనే మార్పుచేయు ఆశలేమియు కలిగింపలేదు. కాంగ్రేసు మహాసభయు ముస్లిములీగువారునుగూడ 1942 మార్చి ఏప్రిలు నెలలో క్రిప్సు చేసిన సూచనలు తిరస్కరించిరి. క్రిప్సు రాయబారము జరుగుచున్న సమయమున ముస్లిములు కాంగ్రేసుతో సహకరించలేదు. పైగా కేవలము తలలు లెక్కించి అధిక సంఖ్యాకుల తీర్మానము ప్రకారము జరుగు ప్రజా ప్రభుత్వ విధానము (బ్యురాక్రసీ) భారతదేశ పరిస్థితులకు పనికిరాదని జిన్నాగారు ప్రకటించిరి. కేంద్రమున కాంగ్రేసువారు ప్రభుత్వమును ఏర్పాటుచేయునెడల అల్పసంఖ్యాకుల విషయమున నేర్పరుపబడిన రక్షణలుగాని ప్రత్యేక నియోజకవర్గములుగాని ముస్లిములకు రక్షణ కల్పింపజాలవని ఆయన బహిరంగముగానుద్ఘాటించిరి. కాంగ్రేసు మంత్రివర్గములు రాష్ట్రములందు రాజీనామానిచ్చినప్పుడు తమకు విముక్తి కలిగినదని మహమ్మదీయులు సంతోషమును తెలియబుచ్చుటను దేశములో సభలను చేసిరి.
1940 సంవత్సరం జనవరిలో హిందువులును ముసల్మానులును వేరువేరు జాతులని జిన్నాగారు ప్రకటించి మాతృదేశ ప్రభుత్వము ఈ రెండు జాతులవారును పంచుకొని అనుభవించవలెనని యుద్ఘాటించిరి. మూడు నెలల తరువాత 1940 మార్చి నెలలో లాహోరులో జరిగిన ముస్లిములీగు సమావేశమునందు పంజాబు పశ్చిమోత్తర పరగణాలు కాశ్మీరము, సింధు, బెలూచిస్థానములు కలిసి పాకిస్థాను పేర యొక స్వతంత్ర ముస్లిము రాజ్యముగ నుండవలెనని జిన్నాగారు ప్రకటించిరి. పూర్వము ఇంగ్లాండులో రౌండు టేబిలు కాన్ఫరెన్సు జరుగుచుండినప్పుడు కొందరు మహమ్మదీయ యువకులు ఈయభిప్రాయమును ప్రకటించియుండిరిగాని అప్పటికది ఎవరికిని రుచించలేదు. సర్ మహమ్మద్ ఇక్బల్‌గారు ఒకటిరెండు ముస్లిము సంస్థానములను తక్కిన భారతదేశముతో నొక ఫెడరేషనుగా నుండవలెనని 1930లోను, 1939లోనూ చేసిన సూచన కూడా మహమ్మదీయులందరికి సమ్మతము కాకపోయెను. ఈ భావములకు జిన్నాగారును మఱల జీవముపోసి పాకిస్థానమను స్వతంత్ర రాజ్యమును స్థాపింపవలెననియు అనగా 1940లో ముస్లిములీగువారు దీనినామోదించిరి. ఆనాటి నుండి ఈ విషయములోనే కాంగ్రేసుకును ముస్లిములీగుకును తీవ్రమైన అభిప్రాయభేదము కలుగుచుండెను. జాతీయ ప్రభుత్వము స్థాపింపవలెనని కాంగ్రేసు కోరినప్పుడెల్ల బ్రిటీషుప్రభుత్వమువారు ముస్లిములీగువారి కిష్టములేదని సాకుచెప్పుటకును అవకాశము కలిగెను.
1942 అగస్టు 8వ తేదీన అఖిలభారత కాంగ్రెసు కమిటీవారు భారతదేశ స్వాతంత్ర్యము కొరకు బ్రిటీషువారీ దేశమునుండి తొలగిపోవలెనను Quit India నినాదములతో తీవ్రమైన శాంతిసమరమును ప్రారంభించుటకు తీర్మానించిరి. అప్పటివరకు కాంగ్రెసువారందుకొరకు తగు సన్నాహము చేయకపోయినప్పటికిని- దీనిని ఆదిలోనే త్రుంచివేయవలెనని బ్రిటీషుప్రభుత్వమువారు నిశ్చయించిరి. అగస్టు 9వ తేదీ తెల్లవారకుండగనే కాంగ్రేసు నాయకులందరిని అరెస్టుచేసిరి. కాంగ్రెసు అక్రమసంఘముగ ప్రకటింపబడెను. సరియైన సంఘవ్యవస్థ కాని నాయకత్వము కాని లేనందువలన దేశములో దౌర్జన్యములు తిరుగుబాటులు హింసాత్మక చర్యలు జరుగుట ప్రారంభమయ్యెను. రైలుమార్గములు పాడుచేయుట రైలు స్టేషనులు తగులబెట్టుట, తంతి టెలిఫోను తీగలను నరికివేయుట, దేశములోని వివిధప్రాంతములందు జరిగెను. ఈ ఉద్యమమును అణచుటకు ప్రభుత్వమువారు తీవ్రమైన చర్య జరిపించిరి. చాలాచోట్ల ప్రజలను తుపాకులతో కాల్చిరి. వాయు విమానములనుండి మరఫిరంగులను కాల్పించిరి. ప్రభుత్వమువారు చేసిన అంచనాలను బట్టియె 60,000 మంది అరెస్టు చేయబడిరి. ఎట్టి విచారణము లేకుండ 18,000 మందిని చెరసాలలందు నిర్బంధించిరి. 940 మంది ఈ యుద్యమమునందు వధింపబడిరి. పోలీసువారి వలనను మిలటరీవారి వలనను తుపాకుల కాల్పులవల్ల 1630 మంది గాయపరుపబడిరి. ఇదియంతయు ఐదునెలలలోనే జరిగినది. ఈ క్రూరచర్యల వలన భారతదేశమునందు అశాంతి తగ్గినట్లు పైకి కానబడినను, త్వరలోనే బ్రిటీషుప్రభుత్వమువారికి క్రొత్తచిక్కులు కలిగెను. 1941లో తన నిర్బంధము నుండి తప్పించుకొనిపోయిన సుభాసుచంద్రబోసుగారు, జర్మనీ జపానులతో కలసి భారతదేశ స్వాతంత్ర్యము కొరకు కృషిచేయసాగెను. జపానువారు మలయాద్వీపకల్పమును జయించినప్పుడు చాలామంది భారతీయ సైనికులు వారికి బందీలుగా చిక్కిరి. జపాను ప్రభుత్వముతో బోసుగారొక ఏర్పాటుగావించుకొని ఈ సైనికులనెల్లరను ‘అజాదు హిందు ఫౌజు’ అను పేరనొక స్వతంత్ర సైనికదళముగానేర్పరచి సింగపూరులో స్వతంత్ర భారతప్రభుత్వము నొకదానిని స్థాపించి నేతాజీయని ప్రఖ్యాతిజెందెను. నేతాజీగారి సైనికులు 1943లో జపాను సేనలతో కలిసి భారతదేశ సరిహద్దులవరకు చొచ్చుకొనివచ్చిరి.
1942లో జరిగిన దౌర్జన్యములకు కాంగ్రేసే ఉత్తరవాదులని గవర్నమెంటువారు నిందించగా గాంధిగారు కాదనిరి. రాజప్రతినిధి దర్శనమివ్వలేదు. ఆయన ఉపవసింపగా ఆయనకు ప్రాణాపాయకర పరిస్థితి కలిగెను. అంతట బ్రిటీషు ప్రభుత్వమువారాయనను 1944 సం. మే 6వ తేదీన చెరసాల నుండి వదిలివేసిరి. ఆయన జిన్నాగారితో చాలాసార్లు సంప్రదింపులు జరిపిరి కాని యెట్టి రాజీయును జరుగలేదు.
1943 అక్టోబరులో లిన్‌విత్‌గో ప్రభువుకు బదులుగా వేవెల్ ప్రభువు రాజప్రతినిధిగా వచ్చెను. అతడు భారతదేశ రాజకీయ పరిస్థితులను గమనించి 1945 మార్చినెలలో లండనుకు విమానముపైన పోయి తానును సర్వసేనానియును తప్ప తక్కిన తన కార్యాలోచన సంఘములోని సభ్యులందరును భారతదేశ రాజకీయపక్షములవారి ప్రతినుధులనుండి నియమించెదనని అందులో హిందువులును మహమ్మదీయులును సమానసంఖ్యగా నుండునట్లు నియమించెదనని ప్రకటించి 1945 జూన్ 25వ తేదీన సిమ్లాలో నొకసభను సమావేశపరచెను. అయితే కాంగ్రేసువారికిని ముస్లిములీగువారికిని రాజీకుదరనందున ఇది విఫలమయ్యెను.
ఇది జరిగిన కొలదికాలములోనే ఇంగ్లాండులో లేబరుపక్షము వారధికారమునకు వచ్చిరి. భారతదేశములోని రాజకీయ ప్రతిష్టంభనము నేదోవిధముగా అంతమొందించవలెననని ఇంగ్లాండులోని క్రొత్తమంత్రివర్గమువారు నిశ్చయించిరి. కేంద్రమునను రాష్ట్రములలోనుగూడ క్రొత్త యెన్నికలు జరుపుటకును ఎన్నికలు కాగానే రాజప్రతినిధి కార్యాలోచన సంఘమును భారతీయ సభ్యులతో పునర్నిర్మాణము చేయుటకును అదివరకు మార్చిలో ప్రకటించినట్లు రాజ్యాంగనిర్మాణమును చేయు ఒకొక ప్రజాప్రతినిధి సభను నియమించుటకు నిశ్చయించిరి. 1946లో జరుపబడిన యెన్నికలందు జనరల్ స్థానములకు కాంగ్రెసు పక్షమువారు అధిక సంఖ్యాకులుగ నెన్నుకొనబడిరి. మహమ్మదీయ స్థానములకు ముస్లిములీగువారె అధికసంఖ్యాకులుగ నెన్నుకొనబడిరి.
యుద్ధానంతరము జపాను లొంగిపోవగనే సుభాసుచంద్రబోసుగారు స్థాపించిన భారతజాతీయ సైన్యమువారు బ్రిటిషువారికి లొంగిపోయిరి. అంతట ఆ సైనికాధికారుల కొందరిపైన భారతదేశములో రాజద్రోహము నేరముమోపి విచారింపబూనుకొనిరి. అదివరకే స్వతంత్ర భారత సైన్యమునుగూర్చి తెలియని వివరములెల్ల ఈ విచారణ సందర్భములో వెల్లడియై వారిపట్ల సానుభూతి కలిగెను. దేశ ప్రజలందు గొప్ప సంచలనము కలిగించెను. చాల నగరములందీ జాతీయ సైనిక యోధులపట్ల సానుభూతి సభలు ప్రదర్శనములు జరిగెను. 1946వ సంవత్సరము ఫిబ్రవరి 18వ తేదీన బొంబాయిలో ‘రాయల్ ఇండియన్ నేవీ’ నౌకాదళములోని రేటింగ్సు అనబడు నౌకరులు తిరుగుబాటుగావింపగా నిదికూడా ప్రజలయందు సంచలనము కలిగించెను. బ్రిటీషువారు దీనిని గమనించిరి.
1946 ఫిబ్రవరి 19వ తేదీన బ్రిటీషు ప్రధానామాత్యుడు మంత్రివర్గములోని ముగ్గురు మంత్రులు భారతదేశమునకు వచ్చి భారతీయ నాయకుల అభిప్రాయానుసారముగ భారతదేశమునకు సంపూర్ణ స్వపరిపాలనమును స్థాపించు విషయమై కృషిచేయగలరని ప్రకటించెను. 1946 మార్చిలో ఇంగ్లీషు ప్రధానమంత్రి భారతీయులకు నిజముగా సంపూర్ణ స్వాతంత్ర్యము పొందదలచినచో రాజ్యాంగ సంస్కరణముల పరమావధి యదియె అగుటకు గూడ అవకాశముండుననియు ప్రకటించినాడు.
ఇంగ్లీషు మంత్రివర్గమువారు 1946 మార్చి నెలలో ఢిల్లీకి వచ్చి కాంగ్రేసు నాయకులతోను ముస్లిములీగు నాయకులతోను పలుమార్లు చర్చలు జరిపిరి. వారిమధ్య రాజీ జరుగుటకు ఎట్టి అవకాశమును లేనందున 1946 మే నెల 16వ తేదీన భారతదేశ రాజ్యాంగ నిర్మాణమును గూర్చి వారు కొన్ని సూచనలు చేసిరి.
భారతదేశములోని వివిధ రాష్ట్రములును సంస్థానములును గలిసిన యావద్భారతదేశమునకు గలిపి ఒక ఫెడరేషనుగా నుండవలెననియు కేంద్రం ఫెడరలు ప్రభుత్వము, విదేశీవ్యవహారములు, దేశరక్షణము, రాకపోక సంసర్గమార్గములును వ్యవహరించునట్లును తక్కిన యధికారములు రాష్ట్రములకును సంస్థానములకును ఉండునట్లును నిర్ణయించిరి. బ్రిటీషు ఇండియాలోని వివిధరాష్ట్రములు మూడువర్గములుగా విభజించి ఒకదానియందు పంజాబు, పశ్చిమోత్తర సరిహద్దురాష్ట్రములు, సింధుబెలూచిస్థానములును రెండవవర్గమునందు బంగాళము అస్సాము మూడవ వర్గమునందు తక్కిన రాష్ట్రములునుండునట్లును నిర్ణయించిరి. కేంద్రసమితి రాజ్యాంగము రాష్ట్రీయ శాసనసభలు మతవర్గములు, కులములవారు సంస్థానప్రతినిధులు కలిసి ఎన్నుకొను 296 మంది సభ్యులుగల రాజ్యాంగనిర్మాణ సంఘము (Constituent Assembly) వలన తయారుచేయబడునట్లును, పైన చెప్పిన మూడువర్గముల రాష్ట్రీయ ప్రతినిధులు వేరుగా సమావేశమై ఆయా రాష్ట్ర రాజ్యాంగములను తయారుచేయునట్లును నిర్ణయించిరి.
క్రొత్త రాజ్యాంగము స్థాపింపబడి ఎన్నికలైన పిదప ఫెడరలు సమితిలో చేరనిష్టములేని రాష్ట్రములు తొలగిపోవుటకు అవకాశముండునట్లు నిర్ణయించిరి. ఈలోపుగ రాజప్రతినిధి కార్యాలోచన సంఘములో వివిధ రాజకీయపక్షములవారినుండి నియమింపబడి పునర్నిర్మాణము చేయబడునట్లును నిర్ణయించిరి. జూను నెల 6వ తేదీన ముస్లిములీగువారు ఇంగ్లీషు మంత్రివర్గమువారి సూచనలనంగీకరించిరి. అయినప్పటికిన్నీ సంపూర్ణ స్వాతంత్ర్యముగల పాకిస్థాను రాజ్యస్థాపనమే తమ గమ్యస్థానమనియు తీర్మానించిరి. కాంగ్రేసు మహాసభవారు రాజప్రతినిధి స్థాపింపదలచిన తాత్కాలిక ప్రభుత్వము (Interim Govt) పథకమును తిరస్కరించిరి. అయినప్పటికిని రాజ్యాంగనిర్మాణము చేయు ప్రజాప్రతినిధి సభయందు పాల్గొనుటకు నిశ్చయించిరి. జూను నెల 29వ తేదీన ఇంగ్లీషు మంత్రివర్గమువారు తమ దేశమునకు మఱలిపోయిరి.
కాంగ్రేసు పాల్గొనకపోయినను తాత్కాలికపు ప్రభుత్వము నెలకొల్పవలసినదని ముస్లిములీగువారు రాజప్రతినిధిని హెచ్చరించిరి. కాని రాజప్రతినిధి దీనికంగీకరింపలేదు. ఇంగ్లీషు మంత్రివర్గమువారి సూచనలనంగీకరించిన అన్ని పక్షముల ప్రతినిధులునుగాని అట్టి తాత్కాలికపు ప్రభుత్వమేర్పడ వీలులేదనెను. మంత్రివర్గమువారి సూచనలను గూర్చి కాంగ్రేసువారును ముస్లిములీగువారును తమకు తోచినట్లు అర్థము చేసికొనజూచిరి. కొంతకాలము వాదనలు చేసిచేసి ముస్లిములీగువారు కూడా ఇంగ్లీషు మంత్రివర్గమువారి సూచనలను తిరస్కరించిరి. అంతట రాజప్రతినిధి అదివరకు తాను ప్రకటించిన పద్ధతిపైన ముస్లిములీగు ప్రతినిధులు లేకుండగనే తన కార్యాలోచనను పునర్నిర్మాణముగావించెను.
1946 ఆగస్టు 12వ తీదీన వేవెలుగారు నెహ్రూ పండితుని మంత్రివర్గ సభ్యులను పేర్కొనమని ఆహ్వానించెను. జిన్నాగారిని మంత్రివర్గమున పాల్గొనమని నెహ్రూగారు కోరినను ఆయన అంగీకరింపలేదు. అంతట ముస్లిములీగువారికి రోషావేశము కలిగి 1946 అగస్టు 16వ తేదీన ‘Direct action’ సత్యాగ్రహ దినముగ గమనించుటకు నిశ్చయించి దౌర్జన్యపూరితములగు నుపన్యాసములుగావించిరి. ఆ రోజున ముస్లిములీగువారి పట్ల సానుభూతిగలవారు కొందరు శాంతియుతముగ ప్రదర్శనములు జరిపి తృప్తిపొందగా, కలకత్తాలోని ముస్లిములీగువారి అల్లరిమూకలు చెలరేగి దౌర్జన్యములకు దిగెను. హిందువులను చంపిరి. వారిండ్లను తగులబెట్టిరి. వారి అంగళ్ళను లూటీచేసిరి. అంతట హిందువులు ఎదురుదాడికిదిరిగిరి. కొన్ని దినములవరకును కలకత్తా వీధులలో హిందూమహమ్మదీయ పోరాటములు తీవ్రమై రక్తపాతము జరిగెను. ముస్లిములీగు మంత్రివర్గమువారుగాని గవర్నరుగాని రాజప్రతినిధిగాని ఈ అక్రమములను అరికట్టుటకు తగిన చర్యలను తీసికొనలేదు. వంగ రాష్ట్ర ముఖ్యమంత్రి సుహ్రవర్దీగారు ఈ దారుణ చర్యలకు కారకుడయ్యెను.
సెప్టెంబరు 2వ తేదీన పండిత జవహర్‌లాల్ నెహ్రూగారిని, వారితోడివారిని రాజప్రతినిధి కార్యనిర్వాహక సభ్యులుగ ప్రమాణములు చేయించిరి. దీనితరువాత కొద్దిరోజులలోనే నౌకాళీ జిల్లాలోని గ్రామములందలి హిందువులును కోమిల్లాలోని హిందువులును మహమ్మదీయ దుండగుల దౌర్జన్యములకు గురియై అనేక బాధలకు లోనైరి. చాలామంది వధింపబడిరి. స్త్రీలు చెరపట్టబడిరి. వారి ఇండ్లు తగులబెట్టబడినవి. దీని ఫలితముగా బీహారు రాష్ట్రములోని మహమ్మదీయులకును నిట్టి ఇక్కట్టులే ప్రతిక్రియగ సంభవించెను. నెహ్రూగారు బీహారుకు విమానముపై పోయిరి. అక్కడి కాంగ్రేసు మంత్రివర్గమువారు ఈ అన్యాయములను అరికట్టుటకు తగుచర్య దీసుకొనిరి. నెహ్రూగారి నాయకత్వమున రాజప్రతినిధి కార్యాలోచన సంఘము ఇంగ్లీషు క్యాబినెట్టు మంత్రివర్గమువలె సమష్టి బాధ్యతతో ప్రవర్తించుచు సమర్థతతో ప్రభుత్వము సాగించెను. అంతట రాజప్రతినిధియగు వేవెల్‌గారి అధికారము అడుగంటసాగెను. ఇదిచూచి ఆయన కాంగ్రేసువారికి శిఖండివలె పనిచేయగల ముస్లిములీగువారి ప్రతినిధులను తనకార్యాలోచన సభలోనికి ఏదోవిధముగా చొప్పించుటకు పూనుకొనెను. అంతట ఆ సభయందదివరకున్న ఐకమత్యము నశించెను. సమష్టి బాధ్యతతో వర్తించు రాజ్యాంగవిధానమును ముస్లిములీగు వర్గసభ్యులు ధిక్కరించిరి. ఇంతకన్నను అన్యాయమేమనగా రాజ్యాంగనిర్మాణ సభయందు పాల్గొనుటకు ముస్లిములీగువారు నిరాకరించిరి. అందుకు మేమెన్నడు అంగీకరించియుండలేదని జిన్నాగారు ప్రకటించిరి. ఇది రాజప్రతినిధికిని ఇంగ్లీషు మంత్రివర్గమువారికినిగూడ తలవంపు తెచ్చు పరిస్థితిగ పరిణమించెను. కాని బ్రిటీషు ప్రభుత్వమువారు డిశంబరు ఆరవ తేదీన ఒక ప్రకటనచేయుచు ముస్లిములీగువారు రాజ్యాంగనిర్మాణ సభలో పాల్గొననిచో ఆ సభ తీర్మానములు మహమ్మదీయులధిక సంఖ్యాకులుగనున్న రాష్ట్రభాగములకు వర్తింపవని అందులో ప్రకటించిరి.
అయినప్పటికిని 1946 డిశంబరు 9వ తేదీన రాజ్యాంగనిర్మాణ సభవారు సమావేశమైరి. ముస్లిములీగు ప్రతినిధులు పాల్గొనలేదు. ఆ సభవారు శ్రీ రాజేంద్రప్రసాద్‌గారిని అధ్యక్షులుగానెన్నుకొనిరి. రాజ్యాంగముయొక్క వివిధభాగములను తయారుచేయుటకు వివిధ ఉపసంఘములు నియమింపబడెను.
ఇట్టి పరిస్థితులలో దేశము చిక్కులకు లోనైయుండెను. అంతట 1947 ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటీషు గవర్నమెంటువారు ఒక చిత్రమైన ప్రకటన చేసిరి. తాము 1948వ సంవత్సరము జూను నెలలో భారతదేశమును వదలుకొని పోదలచినామని, యీ దేశ పరిపాలనమును భారతీయుల వశముచేయుటకు వలయు సన్నాహములెల్ల చేయుటకు మౌంట్‌బ్యాటన్ ప్రభువును రాజప్రతినిధిగా నియమించుచున్నామనియు ప్రకటనచేసిరి.
ఈ ప్రకటన వలన భారతదేశమున గొప్ప సంచలనము కలిగెను. ముస్లిములీగువారు మాత్రము మఱల సత్యాగ్రహము చేయుటకు నిశ్చయించిరి. పంజాబులో దౌర్జన్యములు చెలరేగెను. అది పశ్చిమోత్తర సరిహద్దు పరగణాలకు వ్యాపించెను. లూటీలు, దోపిళ్ళు, నిరపరాధుల వధలు విపరీతముగ జరిగెను. దీనివలన అదివరకెల్ల అఖండభారతదేశము కావలెనని కోరు హిందువులలోను సిక్కులలోను విరక్తికలిగెను. ఇకనీ మహమ్మదీయులతో కలిసియుండుట శ్రేయస్కరము కాదను భావమొకటి వ్యాపించెను. అంతట మహమ్మదీయులు రాజ్యాంగనిర్మాణ సభలో చేరనిచో పంజాబును వంగరాష్ట్రమును విభజన చేయవలెనను ప్రచారమొకటి బయలుదేరెను.
(సశేషం)