బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి ప్రకరణము 2

మౌంట్‌బ్యాటన్ ప్రభువు 1947 మార్చి 24వ తేదీన రాజప్రతినిధియై రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి తుదకు భారతదేశ ప్రభుత్వాధికారములు బ్రిటీషువారి హస్తములనుండి భారతీయుల వశము చేయు విధానమును గూర్చి ఆయన జూన్ 3వ తేదీననొక గొప్ప ప్రకటన చేసెను. దాని సారాంశములేమనగా–

1. మహమ్మదీయులు హెచ్చు సంఖ్యగాగల ప్రాంతములవారు కోరినచో వారిని ప్రత్యేక అధినివేశ రాజ్యముగా నేర్పడనిచ్చి వారికొక ప్రత్యేక రాజ్యాంగ నిర్మాణసభ యేర్పరుపబడును. ఆ పరిస్థితులలో పంజాబులోను వంగరాష్ట్రములోను హిందువులు అధికసంఖ్యగల జిల్లాలలోని శాసనసభ్యులు కోరినచో ఆ జిల్లాలు విడదీయబడును.

2. పశ్చిమోత్తర సరిహద్దు పరగణావారు పాకీస్తానమున జేరుదురో లేదో నిర్ణయించుటకు జనవాక్యము ద్వారా నిర్ణయము (Referendum) జరుపబడును.

3. వంగరాష్ట్రములోని సిల్హెటు జిల్లాలోని ప్రజల ఇష్టమును బట్టి అది ముస్లిము ప్రాంతములో చేర్చబడును.

4. పంజాబులోను వంగరాష్ట్రములోను హిందూ మహమ్మదీయ రాష్ట్రప్రాంతముల సరిహద్దులను నిర్ణయించుటకొక సంఘమేర్పరుపబడును.

5. ఇంగ్లీషు పార్లమెంటు సభలో వెంటనే భారతదేశమునకంతకును అధినివేశ ప్రతిపత్తినిచ్చుటకుగాని లేదా భారతదేశమును విభజించుటకు ప్రజలిష్టపడినచో రెండు భాగములకు వేరువేరుగా అధినివేశ ప్రతిపత్తినిచ్చుటకుగాని తగు ఏర్పాటులతోనొక శాసనము ప్రవేశపెట్టబడును. ఈ విషయమై రాజ్యాంగ ప్రతినిధిసభల తీర్మానమునకు ఎట్టి ఆటంకమునుండదు.

మౌంటుబ్యాటనుప్రభువు చేసిన ప్రకటనమును ప్రజలలో వివిధభావములతో గ్రహించిరి. హిందువులును అన్నితరగతుల జాతీయవాదులును భారతదేశమునిట్లు ముక్కలుచేయు దుఃస్థితి వచ్చినందులకు చాలా చింతించిరి. జిన్నాగారనుకున్నట్లుగాక అతుకులబొంతయైన పాకిస్థానము లభించుచున్నందులకు మహమ్మదీయులును అంత సంతోషపడలేదు. ఏది ఎట్లున్నను భారతదేశ రాజకీయ సమస్యాపరిష్కార విషయములో నీక్రొత్త పథకము అందరికి కీడులోమేలుగా కనబడెను. అందువలన కాంగ్రేసుమహాసభయు ముస్లిములీగును దీనిని అంగీకరించిరి. అంతట పంజాబు రాష్ట్రమును వంగరాష్ట్రమును బ్రిటీషువారేర్పరచిన రెండు సరిహద్దు సంఘములు మధ్యవర్తి తీర్మానముద్వారా విభజింపబడెను. 1947 సం. జులై 1వ తేదీన బ్రిటీషు పార్లమెంటువారు ఇండియా ఇండిపెండెన్సు బిల్లు అను శాసనమును చేసిరి. దానినిబట్టి అగస్టు 14వ తేదీ అర్ధరాత్రమున రాత్రి 12 గం.లకు (15వ తేదీ ప్రారంభమున) ఢిల్లీలో రాజ్యాంగనిర్మాణసభవారు ప్రత్యేక సమావేశము జరిపి బ్రిటీషురాజ్యముల సమ్మేళనము కామన్‌వెల్తులోని భాగముగా భారతదేశమొక స్వతంత్ర అధినివేశరాజ్యముగ ప్రకటించిరి. క్రొత్త అధినివేశరాజ్యమునకు మౌంటుబ్యాటను ప్రభువునే మొదటి గవర్నరు జనరలుగనేర్పరచుకొనిరి. పాకిస్థాను రాజ్యమువారు తమదేశమునకొక నూతనరాజ్యాంగ నిర్మాణసభను ఏర్పరచుకొనిరి. 1947వ సంవత్సరం అగస్టు 15వ తేదీన భారతదేశముననింగ్లీషు ప్రభుత్వమంతమై స్వతంత్ర ప్రజాప్రభుత్వమేర్పడినది.

ఒకవంక బ్రిటిషుపరగణాలుగనుండిన రాజ్యభాగమునిట్లు స్వతంత్ర అధినివేశరాజ్యముల స్థాపన చేయుటకు ప్రయత్నములు జరుగుచుండగా భారతదేశమునందు వివిధస్థానములందు చేరియున్న రాజ్యభాగమునకును కొత్త అధినివేశములకును మధ్యనుండవలసిన పరస్పర రాజ్యాంగ సంబంధముల విషయమై రాయబారములు జరుగసాగెను. ఈ సంస్థానములపై బ్రిటిషువారికిగల సార్వభౌమత్వాధికారములు బ్రిటీషుప్రభుత్వము తదనంతరమవతరించు అధినివేశరాజ్యప్రభుత్వమునకు సంక్రమించవలెనని కాంగ్రేసువారు వాదించిరి గాని బ్రిటీషుప్రభుత్వమువారు అందులకు అంగీకరింపలేదు. బ్రిటీషువారు తమ రాజ్యాధికారమును వదలుకొనగనే బ్రిటీషురాజ్యస్థాపనకు పూర్వమీసంస్థానములకుగల స్వతంత్రస్థితి యేర్పడునని ఆంగ్లప్రభుత్వమువారనిరి. ముందేమి జరుగనున్నదోయను సందిగ్ధావస్థ కొంతకాలమిట్లేయుండెను. భారతదేశములోని 622 సంస్థానములలోని చిన్నచిన్న హిందూసంస్థానములు కొన్నికలిసి ముఠాలు(group)గా ఏర్పడి భారతీయ సమితితో చేరదలచినట్లు ప్రకటించెను. మరికొన్ని సంస్థానములు రాబోవు పరిస్థితులను జూచినపిదప ఆలోచింపదలచియుండెను. పెద్ద సంస్థానములలో మైసూరు, బరోడా రాజ్యములు 1935 సంవత్సరపు ఇండియా రాజ్యాంగచట్టము నిర్ణయించిన ఫెడరల్ విధానము పద్ధతులపైన భారతీయ సమితిలో చేరుటకంగీకరించెను. గాని ఒక కోటి యనభైలక్షల (1.80) జనసంఖ్యగల హైదరాబాదు సంస్థానమును, తిరువాన్కూరు సంస్థానమును తాము స్వతంత్రరాజ్యములుగ నుండదలచినట్లు ప్రకటించెను.

1947వ సంవత్సరం జులై నెల అంతమందు రాజప్రతినిధియైన మౌంట్‌బ్యాటన్‌నే సంస్థాన పరిపాలకులను, వారి ప్రతినిధులను ఒక సభయందు సమావేశపరచి భారతదేశములోను ప్రపంచములోను ఏర్పడియున్న రాజకీయ పరిస్థితులనుబట్టియు భౌగోళికముగా ఆర్థికముగా సాంఘికముగా భారతదేశములోని వివిధ భాగములు ఒకదానితోనొకటి విడదీయుటకు వీలులేని పరస్పర సంబంధములనే కలిగియున్నవగుటనుబట్టియు వివిధ భాగములు తక్కిన భాగములతో సంబంధములేని స్వతంత్రరాజ్యములుగనుండుట అసంభవమని అసమంజసమని వారికి నచ్చజెప్పి తమ రక్షణ విషయమునను విదేశవ్యవహారముల విషయములోను రాకపోకలు సంసర్గమార్గముల విషయములోను క్రొత్త అధినివేశములలో నేదోయొకదానితో చేరుట ఉత్తమమనియు తక్కిన విషయములందు స్వతంత్రముగ దేశ పరిపాలనము చేసికొనవచ్చుననియు బోధించెను. ఈ హితబోధ చాలామందికి మంచిదని తోచెను. కొన్ని వారములలోనే చిన్నచిన్న సంస్థానములన్నియు అధినివేశములతో చేరెను. తిరువాన్కూరులో స్టేటుకాంగ్రేసువారి ఆందోళన జరిగి దివాను సి. పి. రామస్వామి అయ్యర్‌గారికి ప్రాణాపాయము కలుగగా ఆయన రాజీనామా చేసిరి.

తిరువాన్కూరు మొదట చేసిన నిశ్చయమును మార్చుకొని భారతీయ సమితిలో చేరదలచెను. హిందూప్రజలును మహమ్మదీయ పరిపాలకుడును గలిగిన నిజాము రాజ్యము మాత్రము భారతదేశ క్రొత్త అధినివేశముల రెండింటితోనూ సంధి యేర్పాటుల ద్వారా రాజ్యాంగబంధమును కలిగుయుండుటకు నిశ్చయించెను.

ఇంగ్లాండు పార్లమెంటువారు శాసించిన ఇండియా స్వాతంత్ర్య బిల్లు జులై 18వ తేదీన ఆంగ్లరాజు అనుజ్ఞనుబడసి శాసనమయ్యెను. దానినిబట్టి సంస్థానములపైన బ్రిటీషువారికుండిన సార్వభౌమత్వాధికారములను వారు వదులుకొనునట్లును అది వారి పూర్వస్థితిని పొందునట్లును శాసించబడిననూ, అవి క్రొత్త అధినివేశములతోనేదైన ఏర్పాటులు చేసికొను అవకాశముకూడ కలిగించు నిబంధనయొకటి చేర్చబడెను.

శాశ్వతమైన రాజ్యాంగ సంబంధము సంధి ద్వారా ఏర్పరచుకొనువరకును తాత్కాలికముగా ప్రాతసంబంధములు ఒక సంవత్సరము పాటు అమలులోనుండునట్లు హైదరాబాదు సంస్థానము ఇండియా యూనియను ప్రభుత్వముతో ది 29-11-1947వ తేదీన ఒక stand still agreement అనబడు రాజీ ఏర్పాటు చేసుకొనెను.

హైదరాబాదులోని మహమ్మదీయ ప్రజాసంఘమగు ‘ఇత్తెహద్ ముస్లిమీన్’ సంఘమువారు కాశీం రజ్వీ నాయకత్వమున హైదరాబాద్ స్వతంత్రరాజ్యముగ నుండవలెనను ఆందోళన ప్రారంభించి అందుకొరకు సభలు సమావేశములు ప్రదర్శనములు జరుపుచు నూటికి 80మంది జనులుగల హిందూప్రజలపై దౌర్జన్యములు జరుపసాగిరి. రజాకారులను అల్లరిమూకల సంఘమువారు ప్రోత్సహించి ఆయుధములిచ్చి రాజ్యమునల్లకల్లోలముచేయసాగిరి. దేశమధ్యముననొక స్వతంత్రరాజ్యముండుటవలన భారతీయసమితి రాజ్యరక్షణకు వీలుండదని ఇట్టిది ప్రపంచములోనెక్కడను లేనివిషయమని భారతదేశ ప్రభుత్వమువారు హైదరాబాదుకు వలసినన్ని ప్రత్యేకసౌకర్యములనిచ్చి తమ సమితిలో చేరవలసినదని ప్రోత్సహించిరిగాని  లాభములేకపోగా భారతదేశప్రభుత్వము ఓపికపట్టియున్నకొలది రజాకారులు విజృంభించి దేశములో అల్లరులు సాగించి భారతరాజ్య సరిహద్దులలోనికి కూడా వచ్చి దౌర్జన్యము చేయసాగిరి. మద్రాసు బొంబాయి మధ్య పరగణాల సరిహద్దులందలి ప్రజలు భయోత్పాతమున మునిగిరి.

1948వ సంవత్సరము జనవరినుండి భారతరాజ్యసమితి ప్రభుత్వమువారు హైదరాబాదు ప్రభుత్వముతో జరిపిన రాయబారములు విఫలములయ్యెను. భారతదేశ గవర్నరు జనరలు హైదరాబాదును భారతరాజ్యసమితిలో చేరమని కోరినను వారు వినలేదు. నిజామురాజ్యమునందు బాధ్యతాయుత ప్రజాపరిపాలనమునైనను స్థాపించమని కోరినను వినలేదు. 1948వ సంవత్సరము జూను నెలలో రాజీ యేర్పాటులను గూర్చి యొక మతలబు తయారుచేయబడెను. దీనికైన అంగీకరింపవలసినదని మూడురోజులలో ఇంగ్లాండు వెళ్ళిపోవుచున్న మౌంటుబ్యాటను ప్రభువు నిజాముగారిని హెచ్చరించెను.

హైదరాబాదు నిజాము ప్రభుత్వమువారు రాజీపత్రమును తిరస్కరించగా భారతరాజ్యసమితి ప్రభుత్వమువారు ఆర్థికముగా కొంత ఒత్తిడి కలిగించి చూచిరి. కాని యిదియు ప్రయోజనకారి కాలేదు. నిజాము సలహాదారులు రహస్యముగా మందుగుండు సామాను తెప్పించి యుద్ధ సన్నాహములు గూడ చేయుచుండిరి. నిజాము రాజ్యములోను భారతదేశపు సరిహద్దుప్రదేశములలోను అక్రమసైనిక బృందములనదగు రజాకారులయాగడములకు హద్దుపద్దులు లేకపోయెను. అంతట భారతప్రభుత్వమువారీ రజాకారు మూకలను నిరాయుధులచేసి అక్రమసైనిక బృందములను విచ్ఛిన్నము చేసి శాంతిని క్రమపరిపాలనమును స్థాపించవలసినదని అందుకొరకు సికందరాబాదులో నిదివరకుండిన భారతీయసైన్యములను మరలనుంచుటకంగీకరింపవలసినదని భారతీయ ప్రభుత్వమువారు నిజామును కోరిరి. నిజాము దీనికి అంగీకరింపలేదు. తన స్వాతంత్ర్యమును నిలువబెట్టుకొనదలచి అతడదివరకె యునైటెడ్‌నేషన్సువారికొక ఫిర్యాదును ఇండియాపై చేసియుంచెను. ఇట్టి పరిస్థితులలో శాంతిని క్రమపరిపాలనమును నెలకొల్పువిషయములో తాము తగుచర్యదీసికొనదలచినామని ఇండియాప్రభుత్వమువారు నిజాముకు సెప్టెంబరు 11వ తేదీన తుదిలేఖను వ్రాసిరి.

హైదరాబాదులో శాంతిని క్రమపరిపాలనమును నెలకొల్పుటకు పోలీసుచర్యను దీసికొనుటకు భారతీయసైన్యములు సెప్టెంబరు 13వ తేదీన నిజామురాజ్యములోనికి ప్రవేశించెను. 18వ తేదీన హైదరాబాదు సేనానాయకుడైన ఎల్. ఏండ్రూస్‌గారు నిజాముగారి తరఫున భారతీయ సేనానియైన జె.ఎన్. చౌధురిగారికి లోబడిపోయెను. రజాకారు నాయకుడైన కాశీంరజ్వీని అరెస్టుచేసి రజాకారుమూకలను అణచివేసిరి. ఐక్యరాజ్యసమితిలో ఇండియాపైన ఫిర్యాదుచేసిన నిజాము మంత్రివర్గమువారు లాయకాలీ ప్రభృతులు 17వ తేదీననే రాజీనామానిచ్చి తొలగిపోయిరి. తన ఫిర్యాదును వదలుకొన్నానని నిజాము యునైటెడ్‌నేషన్సు సెక్యూరిటీకౌన్సిలువారికి సెప్టెంబరు 22వ తేదీన తంతినిచ్చెను. హైదరాబాదును భారతరాజ్యసమితిలో చేర్చుటకు నిజాము సెప్టెంబరు 18వ తేదీన అంగీకరించి ఫర్మానా జారీచేసెను. కొన్నాళ్ళపాటు చౌధురిగారే రాజ్యపరిపాలనమును జరిపి శాంతిని స్థాపించెను. పిదప హైదరాబాదులో ప్రజాప్రభుత్వము స్థాపించబడినది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణమునందు అన్ని రాష్ట్రములకు సంస్థానములకుగూడ కొన్ని ప్రభుత్వాధికారములివ్వబడినవి. స్వతంత్ర భారతీయరాజ్యాంగములోని నిబంధనల ప్రకారము హైదరాబాదు పరిపాలన జరుగునట్లు నిజాము 23-11-49 తేదీన ఫర్మానా జారీచేసెను.

కాశ్మీరరాజ్యము విషయములో కూడా కొన్ని చిక్కులు వచ్చెను. కాశ్మీర రాజ్యము 1947 అక్టోబరు 26వ తేదీన ప్రకటించెను. జమ్మూకాశ్మీరు ప్రజాసభయైన నేషనల్ కాన్ఫరెన్సు నాయకుడైన షేకు అబ్దుల్లాగారు దీనికి హర్షించిరి. పాకీస్థానమువారు బలవంతముగా కాశ్మీరమును చేజిక్కించుకొనజూచి కాశ్మీరు సరిహద్దులలోనికి స్వతంత్రసేనలనుబంపిరి. అంతట కాశ్మీరు సంరక్షణ కొరకు భారతదేశ సైన్యములు 1947 సం. అక్టోబరు 27వ తేదీన కాశ్మీరమునబ్రవేశించి శాంతిస్థాపించెను. ఈ వ్యవహారములు యునైటెడ్‌నేషన్సువారి సముఖమున ప్రవేశపెట్టగా వారొక సంఘమును పంపి ప్రజలేరాజ్యమునజేరుదురో నిర్ణయించువరకు వివాదములు పడకుండ యుద్ధవిరమణముగావించుటకు సలహానివ్వగా అట్టి ఏర్పాటు 1949 జనవరి 1వ తేదీన జరిగెను.

స్వతంత్ర భారత రాజ్యాంగమునందు కాశ్మీర ప్రజాప్రభుత్వపరిపాలనమును గూర్చి కొన్ని ప్రత్యేకపుటేర్పాటులుగావింపబడి అమలుజరుగుచున్నవి.

(సశేషం)