ఇంటికి రాగానే సుందరం కాల్ చేసాడని స్రవంతి చెప్పింది. విషయం ఏమిటో చెప్పలేదుకానీ నన్ను మాత్ర ఉన్నపళాన కాల్ చేయమని చెప్పాడని చెప్పింది.
మీటింగులో ఉండగా సెల్ మ్రోగితే నేనే ఎత్త లేదు. రాత్రి తొమ్మిది దాటిన తర్వాత కాల్ చేద్దాములే అనుకుంటుండగా సెల్ మ్రోగింది. చూస్తే సుందరం నుండే కాల్!
సుందరం అంటే మాకు వేలు విడిచిన మావయ్య బావమరిది తమ్ముడు. చాలా కాలం వరకూ ఆస్ట్రేలియాలో వెలగ బెట్టి ఈ మధ్యనే కాలిఫోర్నియా లొ పాదం మోపాడు. నేనెప్పుడో చిన్నప్పుడు చూసానంతే! ఒరే మన చుట్టం రా అంటూ ఇండియా నుండి మా నాన్న పోరు పడలేక కలిసాను.
నాకు సుందరం మావయ్య వరసవుతాడు. సుందరాన్ని కలవడానికి ఓ సారి నేనూ మా ఆవిడ పిల్లలం కలసి వెళ్ళాం. సుందరం మావయ్యా అని సంబోధించబోతే – మనం అందరం ఒకే వయసు వాళ్ళం జస్ట్ సుందర్ అని పిలు చాలు అని ఓ గంట క్లాసు పీకాడు. వయసులో నాకంటే ఖచ్చితంగా పదిహేనేళ్ళు పెద్ద. సుందరం సరే, అయన భార్య లక్ష్మి వరసల విషయంలో నాకూ మా అవిడకి పెద్ద షాకిచ్చింది. నన్ను అన్నయ్యా అని ముద్దుగానూ, మా అవిడ్ని అక్కయ్యా అని అతి ప్రేమగానూ పిలిస్తే నేనూ మా అవిడ ఇదెక్కడి వరసలురా అని తలబాదుకున్నాం. అంతకీ మా అవిడ ఉండ బట్టలేక ఇలా వరసలెందుకు పేరు పెట్టి పిలవండి చాలూ అంటే మా అవిడ్ని చూస్తే తన అక్కయ్య గుర్తుకొచ్చిందని ఓ గంట సేపు వాయించి చివరకి “అలాగే అక్కయ్యా!” అంటూ ముగించింది. అలా అక్కా కుక్కా అంటూ పిలవద్దని మా అవిడ చెప్పి చెప్పీ “అక్కయ్య” పిలుపుకి అలవాటు పడిపోయింది.
ఈ సుందరం మావయ్య ఓ విచిత్రమైన మనిషి! అవతల వాళ్ళని పొగిడి తన పనులుచేయించుకొనే దిట్ట అని కలిసిన మర్నాడే అర్థమైపోయింది. మాయింటికి భోజనానికి పిలిచాకా వాళ్ళింటికి బదులు భోజానానికి పిలిస్తే వెళ్ళినపుడు, మా అవిడ వండిన వంకాయ కూర అద్భుతం అనీ, అలాంటి కూర తన జన్మలో తినలేదంటూ అప్పటికప్పుడు మా అవిడ చేత వాళ్ళింట్లో పోపు పెట్టించిన ఘటికుడు సుందరం మావయ్య.
ఫోన్ తీసి మాట్లాడాను. “హలో ! స్రవంతి ఇప్పుడే చెప్పింది మీరు ఫోన్ చేసారని ! ఏమిటి అంత అర్జంటు…”
“ఏమీ లేదు. ఈ నెలాఖరున మన తాటా ప్రోగ్రాం ఉంది కదా ! దానికి తెలుగు సినిమా నటులు నవ్వుల రాజబాబు, కితకిత కిష్టయ్య, ఇంకో హాస్యనటి చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. వాళ్ళకి మీ ఇంట్లో ఓ రెండు రోజులు ఆతిధ్యం ఇప్పించమని నా రిక్వెస్ట్ ! ”
” అది కాదు! నెలాఖరుకి మా అమ్మా నాన్న రావచ్చేమో… ” నసిగాను. ఆ సినిమా వాళ్ళని నా ఇంట్లో పెట్టుకోవడం నా వల్ల కాదనిపించింది.
” అలా అనకు వెంకీ ! నేను మా ఇంట్లో నే పెట్టుకునే వాడ్ని. కానీ మా ఇంట్లో ప్రముఖ హీరోయిన్ ఉంటానంది. ఆమెతో పాటే అమె అనధికార భర్త ఉంటారు.”
” ఎవరా హీరోయిన్ ? ” అని అడిగాను. ఉష అని చెప్పాడు.
” అదేంటి ? ఉష కి పెళ్ళి కాలేదు కదా !భర్తేమిటి ?” ఇదే విషయం ఉండ బట్టలేక అడిగాను.
“ఓ అదా ! అతను అనధికార భర్త! పెళ్ళయ్యిందంటే సినిమాలో చాన్స్ ఇవ్వరని ఇలా అభిమానుల చెవుల్లో పువ్వులు పెట్టి మరీ డబ్బు సంపాదిస్తారు. ! అయినా అది ఆమె పెర్సనల్ మేటర్! ” అంటూ అమె తరపున వకాల్తా పుచ్చుకున్నాడు సుందరం.
ఆ కామేడియన్లని భరించడం తప్పేట్లా లేదనిపించి సుదీర్ఘ వాయింపు భరించలేక ఒప్పుకున్నాను.
” ముందే చెబుతున్నాను. జస్ట్ రెండు రోజులు అంతే !” అని ముందుగానే సుందరాన్ని హెచ్చరించాను.
” అది చాలు వెంకీ ! చాలా థాంక్స్ ! ” అంటూ కాల్ చేసిన పని అయ్యిందనగానే టక్కున ఫోన్ కట్ చేసాడు సుందరం.
సుందరం మావయ్య చాలా ఘటికుడు. దాదాపు పదిహేనేళ్ళుగా ఉంటూ మేము తెలుగు వాళ్ళ కమ్యూనిటీలో తెచ్చుకోలేని పేరు కేవలం ఆరు నెలల్లో కొట్టేసాడు. ప్రస్తుతం అతను తాటా అనే తెలుగు సంస్థకి అధ్యక్షుడు. అసలు ఈ సంస్థ స్థాపించడానికీ ఓ పెద్ద కథుంది. మా ఊళ్ళో ఓ తెలుగు సంస్థ చాన్నాళ్ళుగా ఉంది. ఓ శుభముహుర్తం చూసి మా సుందరం మావయ్య ఆ తెలుగు సంస్థ వారిని కలిసి ప్రెసిడెంట్ లేదా అచ్చ తెలుగులో అధ్యక్షుడి పదవి ఇమ్మని అడిగాడు. మీరింకా ఈ కేలిఫోర్నియా లో అడుగుపెట్టి డిస్నీ లాండు కూడా చూడలేదు, మరీ అధ్యక్ష పదవి ఎలా ఎవ్వడం, కష్టం కదా అని పక్కన పెట్టారు. అంతే సుందరం మావయ్యకి మనిషి కొచ్చినంత కోపం వచ్చింది. హుటా హుటిన తనకున్న నలుగురు స్నేహితుల్నీ పోగు చేసి ఆ రాత్రికి రాత్రే తాటా అని ఓ తెలుగు సంస్థ కి శ్రీకారం చుట్టేసాడు.
ఓ సారి తాటా అంటే ఏమిటని అడిగితే ” తెలుగు అసోషియేషన్ ఆఫ్ టోటల్ అమెరికా” సంక్షిప్తంగా తాటా అని దురద గోక్కుంటూ చెప్పాడు. తాటా ఏమిటి?, “తెలుగు అసోషియేషన్ ఆఫ్ టోటల్ అమెరికా” అంటే టాటా అవ్వాలికదా ఈ తాటా అనే తంటా ఏమిటని అడిగితే, అమెరికాలో తానా, ఆటా అనే రెండు పెద్ద తెలుగు సంస్థలున్నాయి కదా, తానాలో మొదటి అక్షరం, ఆటాలో చివరి అక్షరం కలిపి తాటా అని నామకరణం చేసానంటూ, సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్న అయిన్ స్టీన్ నా తెలివి ముందు బలాదూర్ అన్న బిల్డప్పు ఇచ్చి మరీ వాయించాడు.
ఆ సంస్థని అహం బ్రహ్మస్మి అన్నట్లుగా నడుపుతూ, పని తక్కువ పేరు ఎక్కువ అన్న థీం తో ముందుకు సాగిపోతున్నాడు. ఇప్పుడిప్పుడే అర్థమయ్యింది సుందరం మావయ్య దురద ! ప్రతీ ఏడాది సంస్కృతి చట్టు బండలూ అంటూ సినిమా హీరోలనీ, హీరోయిన్లనీ వాళ్ళ కుక్క పిల్లల్నీ, పత్రికల వాళ్ళనీ, గాయకులనీ వగైరా వగైరా అందర్నీ పిలిపిస్తూ ఉంటాడు. వాళ్ళందర్నీ పొగుడుతూ వాళ్ళతో ఫొటోలూ గట్రా దిగుతూ వార్తల్లో నలుగుతూ అమెరికాలో తాటా అధ్యక్షుడిగా చెలా మణీ అవుతూ తనొక్కడే తెలుగు సంస్కృతిని తన భుజస్కంధాల మీద మోస్తున్నట్లుగా అందరికీ ఓ ఫీలింగ్ కలగజేసిన మహా మేధావి.
ఈ నాలుగేళ్ళలో మా వూళ్ళో జనాలకి అర్థం అయ్యిందేమిటంటే, సుందరం మావయ్యకి మైకు దురద మరీ ఎక్కువని. అందుకే ఆయనకు మైకాసురుడు అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. పనస పొట్టు కూరలో ఆవ ఎంత ఉండాలి దగ్గర్నుంచి అమెరికా ఆర్థిక విషయాలన్నీ తెలుసున్నట్లుగా గడగడా మాట్లాడేయగలడని నేనంటే – గడగడా కాదు, లొడలొడా అని మా అవిడ అంటుంది. మేం ఇద్దరమూ కరక్టేనని మా పిల్లలంటారు.
ఏదేమైనా, ఈ సారి ఈ కమేడియన్స్ నివాసం నా ఇల్లు అని తేలిపోయింది. స్రవంతికెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.ఈ విషయం చెబితే నా మీదా తోక తొక్కిన త్రాచులా లేస్తుందని నాకు తెలుసు. ఎలా చెప్పడం? క్రితం సారి స్రవంతి అభిమాన మాటల రచయిత వచ్చి సుందరం మావయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆయన్ని అందరూ కలిసి ఎక్కడ సినిమాల్లో పలుకుబడీ ప్రాపకం పొందేస్తారా అన్నట్లు ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకొన్నాడు. మా ఇంటికి భోజనానికి పిలిస్తే ఆ మహారచయిత గారు తెగ బిజీ అంటూ, క్షణం కూడా ఖాళీ లేదు, అమెరికా వచ్చి కూడా సినిమాలకి పని చేస్తున్నారు – రోజూ తెగ కాల్స్ వస్తాయి – అందుకే మధ్యాహ్నం పన్నెండు తరువాతే లేటుగా లేస్తారు అంటూ సుదీర్ఘ ఉపన్యాసం దంచుకున్నాడు నాకూ మా అవిడకీ!
స్రవంతికి ఒళ్ళుమండింది. ఆ సినీ రచయితగార్ని మనమేమైనా కొరుక్కుతింటామా, డిన్నర్ కి పిలిస్తే ఇంత లొల్లి పెడతాడేంటీ అంటూ గయ్యిమంది. లక్ష్మి అత్తయ్య , సారీ చెల్లెమ్మ దగ్గర ఇదే విషయం స్రవంతి అంటే – “ఆయనంతే అక్కయ్యా” అంటూ కొట్టి పారేసింది. అప్పటినుండి స్రవంతికి సుందరం అంటే మహా మంట. అలాంటిది ఈ సారి ముగ్గురు కామెడీ యాక్టర్లని మా యింట్లో పెట్టుకుంటానంటే నా బ్రతుకు ట్రాజడీ అయిపోతుందన్న విషయం తెలిసీ ఇది ఎలా తప్పించుకోవాలా అని సతమత మయ్యాను. ఏదైతేనేం స్రవంతికి చెప్పాను. కితకితల కిష్టయ్య కామెడీ అంటె పిల్లలకి ఇష్టం, ముందు వద్దన్నా పిల్లలు ఇష్టపడుతున్నారని స్రవంతి సరేనంది. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాను.
ఈ నాలుగేళ్ళలో మా సుందరం మావయ్య మైకు దురద దినదినాభి వృద్ధి చెందుతూ కీర్తి కేన్సర్ గా పరిణమించింది. ఈ మధ్య ఫొటోల పిచ్చి కూడా ముదిరింది. నెలకొకసారయినా తన పేరు పేపర్లో పడేట్లా చూసుకుంటూ అమెరికా తెలుగు వారి తరపున సాంస్కృతిక వకాల్తా పుచ్చుకొన్నవాడిలా పిచ్చి పిచ్చి స్టేట్ మెంట్లు ఇస్తూ తక్కువ శ్రమతో ఎక్కువ ప్రాచుర్యాన్ని కొట్టేస్తున్నాడు.
ఇంతకీ ఆ సినిమా కమేడియన్లు వచ్చే రోజు రానే వచ్చింది. వాళ్ళకోసం ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసాం. హాస్య నటికి మాత్రం ఒక ప్రత్యేకంగా రూం ఇద్దామని స్రవంతి అంది.
ఎయిర్ పోర్ట్ కెళ్ళి పికప్ చేసుకొనే డ్యూటీ కూడా నాకే అంటగట్టాడు సుందరం. తప్పదురా దేవుడా అనుకుంటూ వెళ్ళాను. నవ్వుల రాజబాబు, కితకితల కిష్టయ్య, కామెడీ కామాక్షి విమానం దిగారు. పరిచయాలయ్యాక ఇంటికి తీసుకొచ్చాను. ఎయిర్ పోర్ట్ దగ్గర్నుండి ఇంటికొచ్చేవరకూ చూస్తూనే ఉన్నాను, కామెడీ కామాక్షి కితకితల కిష్టయ్య ని బల్లిలా అంటిపెట్టుకొని ఉంది. ఇంటికొచ్చినా కాకా (కామెడీ కామాక్షి) , కికి (కితకితల కిష్టయ్య) చెయ్యి వదల్లేదు. అంతకీ మా రెండో వాడు మీ వైఫ్ పిలుస్తున్నారంటూ కికి ని పిలవడం నే విన్నాను. వాళ్ళిద్దరూ మొగుడూ పెళ్ళాలు కారని అంకుల్ ఆంటీ అని పిలిస్తే చాలని చెప్పి వాడి నోరు మూయించాను.
స్నానం చేసి ఫ్రెషప్ అయితే, డిన్నర్ చేయవచ్చు అని చెప్పి లోపలకి వెళ్ళబోయాను. నవ్వుల రాజబాబు (నరా) వెనక్కి పిలిచాడు.
“ఏమండీ ! నాకు కాస్త బీ పి ఉంది. ఉప్పు కారం తగ్గించి వండమని మీ శ్రీమతి గారి కి చెబుతారా? ” అన్నాడు. సరే నంటూండగా, కికి తనకి సుగర్ అని కాస్త స్వీట్లు లాంటివి తినననీ, రైసు కూడా తగ్గించానని చెబుతూ, ప్రతీ పూట తను చపాతీలే తింటానని చెప్పాడు. అసలే గొడవ లేనిది కాకా కే! వారిచ్చిన మెనూ స్రవంతి కి చెప్పాను.
తిండి కార్యక్రమాలు అయ్యాక నరా, కికి, కాకా హాలులో టీవీ చూస్తూ చతికిల బడ్డారు. మేమూ హాలులో కబుర్లు చెప్పుకుందామని కూర్చున్నాం. అంతలో నరా సిగరెట్ తీసి వెలిగించాడు. నేనూ స్రవంతి ఒక్క సారి షాక్ తిన్నాం! స్రవంతి వెంటనే నరా గారికి చెప్పింది. ఇక్కడ ఇంట్లో కాల్చకూడదని బయటకెళ్ళి కాల్చుకోమని ! అలాగే అంటూ బాక్ యార్డ్ వైపుగా వెళ్ళాడు. ఎంత చెప్పినా వినడు. “నే స్నానానికెళ్ళి వచ్చేలోపులో ఓ అయిదు సిగరెట్లు ఊదేసాడు. వద్దన్నా వినిపించుకోడు” అంటూ విసుక్కుంది.” అన్నం లేక పోయినా బ్రతుకుతాడు కానీ సిగరెట్ లేకుండా రాజబాబు గారుండలేరు ” అంటూ కికి, నరా పై సింపతీ చూపించాడు.
ఎందుకో అనుమానమొచ్చి గబ గబా మేడ పైకి వెళ్ళి చూసాను. రూమంతా ఒకటే సిగరెట్ కంపు. ఓ అరడజను ఎయిర్ ఫ్రెష్నర్లు జిమ్మితే కానీ కంపు పోలేదు. స్రవంతి కి భలే చిరాకేసింది. రాత్రి కాకా కి లేడీస్ రూం అంటూ అమెకేర్పాటు చేసిన రూం ఇచ్చాం. మగాళ్ళిద్దరికీ ఒక రూం ఇచ్చాం. కాని తెల్లారి లేచాక చూస్తే నేనూ స్రవంతి ఆశ్చర్యపోయాం. గదులు అలాగే ఉన్నాయి కాని ఉండాల్సిన మనుషులు మాత్రం తారుమారు అయ్యరు. కాకా, కికి ఒక రూంలోనూ, సిగరెట్ ధూపపు వాసనలో నరా రెండో రూంలోనూ కనిపించారు. చూస్తూ కూడా చూడనట్లు నేనూ స్రవంతీ నటించాం.
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రెడీ అయ్యింది. ఉప్పు లెస్ మెనూ ఒకళ్ళకి, సుగర్ లెస్ కాఫీ ఇంకోళ్ళకీ, ఇలా ఒక్కొక్కరికీ ఒక ఐటెం చొప్పున చేసింది స్రవంతి. ఆ తరువాత షాపింగ్ అని బయల్దేరదీసారు. ముగ్గురూ మూడు కార్టులు తోసుకుంటూ కనిపించినవన్నీ ఎక్కించారు. తీరా బిల్లు పేమెంట్ దగ్గరకొచ్చేసరికి పర్సు తీసి – “అరే డబ్బులు తేవడం మరిచానే !” అంటూ వీర లెవల్లో ఏక్షన్ మొదలు పెట్టాడు నరా. మిగతా వాళ్ళు బిల్లు చూసి అన్నీ కాన్సిల్ అంటూ వెనక్కి ఇచ్చేసారు. నరా నన్ను “మీకు ఇంటికెళ్ళేక ఇస్తాను. ఈ డిజిటల్ కెమేరా చాలా చీప్ గా ఉంది. మీ కార్డ్ మీద పే చేస్తారా?” అంటూ బ్రతిమాలాడేడు. ఇంటికెళ్ళేక ఇచ్చేస్తాడు కదా అని సరే నని నాలుగు వందల డాలర్ల బిల్లు పే చేసి ఇంటి ముఖం పట్టాం. దారిలో రాత్రికి, ఇక్కడ మంచి మంచి వెరైటీలు దొరుకు తాయట కదా అంటూ మందు కావాలని అన్నారు. స్రవంతికి ఇవేం ఇష్టం ఉండవని తెలుసు. నాకు అలవాటు లేదని ఇంట్లో కుదరదన్నట్లు చెప్పాను. మీరేం కంగారు పడకండి, మేం మీ గరాజ్ లో మూడో వాడి కంట పడకుండా చేస్తాం – కాదనకండి అంటూ చేయిపట్టుకున్నారు. ఇష్టం లేకపోయినా సరేనన్నాను. రాత్రికి వాళ్ళకి గరాజులో విడిది ఏర్పాటు చేసాను. నేను మాత్రం పైకి వచ్చి పడుకున్నాను. ఆ మర్నాడు ఉదయమే వాళ్ళని సైట్ సీయింగ్ అంటూ శాన్ ఫ్రాన్సిస్కో అంతా చూపించి ఓ రెండు వందల డాలర్లు వదిలించుకొని ఇంటి ముఖం పట్టాను. ఇంటికెళ్ళాక స్రవంతి నిప్పులు చెరుగుతూ ఉంది.
వాళ్ళని హాలులో కూర్చోబెట్టి పైకి రండి అన్నట్లుగా కళ్ళతో సైగ చేసింది స్రవంతి. చరచరా నడుస్తూ వాళ్ళ రూం తలుపు తీసింది. రూము నిండా బాటిల్సూ, సిగరెట్టు పీకలు – అదొక బందెల దొడ్డిలా తయారుచేసారు. ఇహ బాత్రూములు సరే సరి. ఏం మాట్లాడాలో తెలియక ఇంకొక్కరోజు ఓపిక పట్టమని ప్రాధేయపడి క్రిందకొచ్చాను.
శనివారమే వాళ్ళ ప్రోగ్రాం ! ఆ ప్రోగ్రాంలో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన నాకు, ప్రత్యేకంగా స్రవంతికి కృతజ్ఞతలు చెప్పి, మా ఆతిధ్యాన్ని ఆకాశానికెత్తేసి ఇలాంటి మంచి మనుషులు ఈరోజుల్లో కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్నో దేశాలు తిరిగాము కానీ, ఇలాంటి ఆతిధ్యం జీవితంలో స్వీకరించలేదని చెబుతూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉన్న తెలుగువారిని చూస్తే ముచ్చటేస్తోందని ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం చేసారు. ఇంత మర్యాద చేసిన మమ్మల్ని ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికొచ్చి కనీసం ఒక్క పూటైనా వాళ్ళ ఆతిధ్యం స్వీకరించాలని సభాపూర్వకంగా కోరుతూ కార్యక్రమం మొదలుపెట్టారు. మా సుందరం మావయ్యకి మైకు చూస్తే పూనకం వస్తుంది. వచ్చిన ఆర్టిస్టులందరికీ పాదాభివందనాలు, కరచాలనాలు చేసి తనొక్కడే ఈ సంస్థని ఒక చిన్న అమెరికన్ ప్రొఫెషనల్ కంపెనీలా నడుపుతున్నానంటూ సొంత డబ్బా కొట్టుకొని, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తామంటూ రెచ్చిపోయాడు. నాకు తెలిసి సాహిత్యంలో కానీ, నాటకంలో కానీ, సంగీతంలో కానీ ఆవగింజంత ప్రవేశం లేకపోయినా అన్నిటిలోనూ తనో నిష్ణాతుడన్న ఫీల్ కలగజేసి మైకుని వదిల్తే ఒట్టు.
మొత్తానికి కార్యక్రమం అయ్యింది. కమేడియన్స్ ఇండియా ప్రయాణం అయ్యారు. నేను మొహమాటపడుతూ నరా ని నాలుగు వందల డాలర్లూ అడిగాను. ప్రస్తుతం తన దగ్గరలేవనీ ఇండియా వెళ్ళిన వెంటనే పంపుతాననీ చెప్పాడు. నరా ఎంత నీతిమంతుడో అంటూ కాకా, కికి లు వంత పాడారు. అదొక చావు బాకీ అని అర్థం అయ్యింది. నా వరకూ సరే స్రవంతికెలా నచ్చ చెప్పాలా అని చూసాను. వెళుతూ ముగ్గురూ స్రవంతినీ నన్ను ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ ఇళ్ళకి రావాలనీ మరీ మరీ చెప్పారు. కాకా “అక్కయ్యా, ఈ చెల్లెమ్మని మర్చిపోకు…తప్పకుండా వస్తావు కదూ” అంటూ భారీగా కన్నీళ్ళు గుమ్మరించి మరీ కదిలింది.
వాళ్ళు వెళ్ళిన తరువాత రెండు వందల డాలర్లు వదిలాయి రూం క్లీనింగ్ కోసం. స్రవంతి ఇహ జన్మలో ఎవ్వరికీ ఆతిథ్యం ఇచ్చేది లేదని, ఒకవేళ తనకి తెలియకుండా నేను ఒప్పుకుంటే విడాకులిస్తానని మరీ బెదిరించింది.
ఓ రెండు వారాల తరువాత నాకు ఏటి అండ్ టి నుండి ఓ అయిదువందల డాలర్లకి సుదీర్ఘమైన బిల్లు వచ్చింది. కాలింగ్ కార్డులొచ్చేక ఇంటి ఫోన్ నుండి ఇండియా కాల్స్ చేయడం మానేసాం.అదీ కాక ఏటి అండ్ టి వాడు నిమిషానికి 3 డాలర్లు చార్జ్ చేసాడు, మేం వాడి కాలింగ్ ప్లానులో లేక పోవడం వల్ల. అంటే మాకు తెలియకుండా ఇండియా కాల్స్ ఎడాపెడా చేసేసారన్నమాట ఆ ముగ్గురు మరాఠీలూ ! మింగలేని కక్కలేని పరిస్థితి నాది. స్రవంతి ఈ కామెడీ భాగోతం చూసాక నాతో ఓ నెల్లాళ్ళు మౌన వ్రతం పట్టింది. సుందరం మావయ్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయలేదు.
నన్ను ఆ తెలుగు సంఘానికి గుడ్ బై చెప్పమని చెబుతూ, లేకపోతే తనే నాకు గుడ్ బై చెబుతానని మరీ హెచ్చరించింది స్రవంతి. ఇండియా వెళ్ళేక వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమని ప్రతీ రోజూ పోరుతూ, నా నిర్వాకం గురించి కనిపించిన ప్రతీ వాళ్ళకీ చెప్పింది. ఆ ముగ్గురు మరాఠీల రాకతో కామెడీ మాట ఎలా ఉన్నా నా బ్రతుకు ట్రాజెడీ గా మారింది. స్రవంతి కోపం చల్లారడానికి కొన్ని నెలలు పట్టింది.
ఓ ఆర్నెల్ల తరువాత నేనూ స్రవంతీ పిల్లలూ ఇండియా వెళ్ళాం. నరా, కాకా, కికి లను కలుద్దామని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఎప్పుడు కాల్ ఛేసినా వాళ్ళ సెక్రటరీలు ఎత్తి, షూటింగ్ లో బిజీ గా ఉన్నారనో, లేదా ఎక్కడో సభకెళ్ళారనో అనేక దొంగ సాకులు చెప్పి తప్పించుకున్నారు. చివరకి అతి కష్టమ్మీద నరా ఫోన్ లో దొరికాడు. మేం వచ్చామని చెప్పాను. ఫోన్ లో ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్పి రేపు ఇంటికి రమ్మనమని చెప్పాడు. నేనూ స్రవంతీ పిల్లలూ బయదేర బోతుండగా నరా సెక్రటరీ కాల్ చేసి అర్జంటుగా షూటింగ్ ఉండడంతో నరా సార్ వెళ్ళాల్సివచ్చిందని మరో సారి తప్పక కలుద్దామని చెప్పి ఫోన్ కట్ చేసాడు. జరిగిన విషయమంతా మా బావమరిదికి చెబితే విరగ బడి నవ్వాడు.
” మీ అంత వెర్రి వాళ్ళు ఉండరు బావా! వాళ్ళందరూ అవకాశవాదులు. వాళ్ళకి ఏ క్షణం ఎక్కడ ఎవరితో ఎలా సద్వినియోగ పరుచుకోవాలో బాగా తెలుసు. వాళ్ళు ప్రొఫెషనల్స్ ! రోజుకి మీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూస్తారు. కనిపించిన అందర్నీ ఇళ్ళకి పిలిచే వెర్రివాళ్ళు కారు వాళ్ళు. ఎంతమందినని గుర్తు పెట్టుకుంటారు. ఒకవేళ గుర్తున్నా గుర్తులేనట్లుగానే నటిస్తారు…వాళ్ళకి మీ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు మీరు వెర్రివాళ్ళు. ఇండియాలో అందుబాటులో లేని వాళ్ళు అమెరికాలో ఇంటికొస్తున్నారంటే, అదేదో అమెరికా ప్రెసిడెంట్ మీ ఇంటికి వస్తున్నట్లు మీరు ప్రవర్తించడం మీ తప్పు ! వాళ్ళననుకొని ఏం ప్రయోజనం? ” అంటూ గీతోపదేశం చేసాడు.
ఇండియా నుండి వచ్చిన ఓ రెండు నెలల తర్వాత సుందరం మావయ్య నుండి ఫోన్ వచ్చింది. నేను హలో అనగానే పురాణం మొదలు పెట్టాడు.
” హలో వెంకీ ! హౌ ఆర్ యూ ! ఈ మధ్య నల్ల పూసయి పోయావు ! వచ్చే నెల మన తాటా సంస్థ దీపావళి ప్రోగ్రాం ఉంది. ఈ సారి గిగా స్టార్‌నీ, ఇంకా ఎంతో మంది సినిమావాళ్ళని అహ్వానిస్తున్నాం ! క్రితం సారి నీ మర్యాదల గురించి తెలుగు సినిమా రంగమంతా పాకిపోయింది. ఈ సారి మీ ఇంట్లో….”
“సారీ ! రాంగ్ నంబర్ ” అని ఫోన్ కట్ చేసాను.*