పరిచయము
పదిహేడవ శతాబ్దములో తెలుగునాడు ఇద్దరు గొప్ప వాగ్గేయకారులను సృష్టించినది. వారు క్షేత్రయ్య, రామదాసు. క్షేత్రయ్య శృంగారరస ప్రధానమైన పదములకు, జావళులకు ప్రసిద్ధుడు. రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న భక్తిసంగీతమునకు కాణాచి. తఱువాతి కాలములోని త్యాగరాజువలె రామదాసు కూడ తన సర్వస్వాన్ని ఆ శ్రీరామునికే అర్పించాడు. ఆ రాములవారిని స్మరించాడు, నిందించాడు, స్తుతించాడు. రామదాసు ఎన్ని కీర్తనలను వ్రాసినాడో మనకు తెలియదు. సుమారు 250 – 300 అని అంచనా. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము కొన్ని రామదాసు కీర్తనలలోని ఛందస్సును అందరికి అర్థమయ్యేటట్లు తెలియబరచడమే. పాటలకు పద్యములకు చాల తేడాలు ఉన్నాయి. పద్యములలో పదముల అమరిక ఒక నిర్దిష్టమైన పరిధిలో సాగుతుంది. వృత్తములైతే అవి గురు లఘువుల అమరికగా నుండవచ్చును. దేశి ఛందస్సు అయినప్పుడు, అవి రెండు సూర్య గణముల, ఆఱు ఇంద్రగణముల ఎన్నికపైన, మాత్రా వృత్తములైతే అవి మాత్రాగణముల నిర్మాణముపైన ఆధారపడి ఉంటుంది. కాని పాటలలో లయ ప్రధానాంశముగా ఉంటుంది. రాగభావములు బహిర్గతములైనా, వాటి వెనుక ఉండే పాట నడక, లయ, తాళము ఎంతో ముఖ్యమైనవి. పద్యములలోవలె కాక పాటలలో అవసరమయినప్పుడు దీర్ఘమును హ్రస్వముగా, లఘువును గురువుగా పరిగణించుకొన వీలగును. ఒక అక్షరమును పొడిగించుకొనుట సాధ్యము, అదే విధముగా ఊనిక లేక త్వరగా పలుక వచ్చును. అంతేకాక పాటలలో పాదాంత లఘువు విరామము వలన గురుతుల్యము. మూడు మాత్రల గణములు త్ర్యస్రగతిలో, నాలుగు మాత్రల గణములు చతురస్రగతిలో, ఐదు మాత్రల గణములు ఖండగతిలో, ఏడు మాత్రల గణములు మిశ్రగతిలో, తొమ్మిది మాత్రల గణములు సంకీర్ణ గతిలో సాగుతాయి. పాటలలోని ఛందస్సులు కొన్ని మనమెఱిగిన పద్యము వలె ధ్వనించవచ్చును. అవి వృత్తములైనా కావచ్చు, లేకపోతే సీస పద్యములైనా కావచ్చు. అట్టివి కొన్నిటిని మీముందు ఉంచుతాను.
త్ర్యస్రగతి
కన్నడములో భోగషట్పది అని ఒక ఛందోబంధము గలదు. ఇది మూడు మాత్రల త్ర్యస్రగతిలో సాగుతుంది. ఈ షట్పదిలో ఆఱు పాదములు ఉంటాయి. 1, 2, 4, 5 పాదములలో నాలుగు సూర్య గణములు, 3, 6 పాదములలో ఆఱు సూర్యగణములు ఒక గురువు. 1, 2 మఱియు 4 ,5 పాదములను చేర్చి వ్రాసినప్పుడు ఇది ఒక చతుష్పది అవుతుంది. ఎన్నియో స్త్రీల పాటలు ఈ ఛందస్సులో ఉన్నాయి. మూడు మాత్రలు ఉండడమువలన దీని గతి త్ర్యస్రగతి. క్రింద భోగషట్పదికి ఒక ఉదాహరణము –
సారసాక్ష గోపబాల
చారు రాసనాట్యలోల
నీరజాస్య నీలదేహ – స్నేహసుందరా
మారజనక ముగ్ధహాస
సారసాక్షి హృన్నివాస
శ్రీరమేంద్ర ధారుణీంద్ర – ప్రేమమందిరా
ఇందులో మూడవ, ఆరవ పాదములలో అక్షరసామ్య యతి, సర్వత్రా ద్వితీయాక్షర ప్రాసలు ఉన్నాయి. ఈ గణముల అమరికతో చతుష్పదికి క్రింద ఒక ఉదాహరణమును ఇచ్చినాను. ఇందులో అక్షరసామ్యయతి అన్ని పాదములలో ఉన్నాయి.
వేంకటాద్రివాస శ్రీశ – ప్రేమనిలయ పాపనాశ
సంకటమ్ము బాపుమయ్య – శర్వబాంధవా
శంకలేక పంకజాక్ష – చక్రపాణి పీనవక్ష
వంకలేని బాట జూపు – ప్రణవసంభవా
రెండు సూర్యగణములకు బదులు ఒక షణ్మాత్రను కూడ పాటలలో ఉపయోగిస్తారు. అంతే కాక సూర్యగణములోని అంత్య లఘువు అక్కడక్కడ లోపిస్తుంది. అప్పుడు దానికి ముందున్న గురువును సాగించి పాడాలి. ఇట్టి ఛందస్సులో రామదాసు కీర్తనలు కొన్ని ఉన్నాయి. అందులో సుప్రసిద్ధమైనది ఈ మంగళహారతి పాట –
రామచం౽ద్రాయ జనక-రాజజా మనోహరాయ
మామకా౽భీష్టదాయ – మహిత మంగళం
చారుమేఘరూ౽పాయ – చందనాది చర్చితాయ
హారకటకశోభితాయ – భూరిమంగళం
(ఈ ౽ గుర్తు అక్షరమును పొడిగించి పాడవలెనని సూచిస్తుంది.)
ఈ భోగషట్పది మూస రాముల దివ్యనామస్మరణ జేయుచున్న జాలు… అనే పాటలో కూడ కనిపిస్తుంది –
భాగవతుల పాదజలము – పయిన జల్లుకొన్న జాలు
బాగుమీరినట్టి యమృత -పానమేటికే…
త్ర్యస్రగతిలో తురగవల్గనరగడ
ఉత్సాహల పాదములతో కూడ కీర్తనలను రచించవచ్చును. మొదట అట్టి రచన ఏవిధముగా ఉంటుందో పరిశీలిద్దాము. బేసి పాదములు తురగవల్గన రగడగా, సరి పాదములు జాతిపద్యమైన ఉత్సాహగా అమర్చి క్రింద నాకల్పనయైన రామగీతి అనే పద్యమును ఉదాహరణముగా ఇచ్చినాను –
బేసిపాదము – తురగవల్గనరగడ – (సూ)4 – (సూ)4
సరిపాదము – ఉత్సాహ – (సూ)4 – (సూ)3/గ
అంత్యప్రాస – బేసి/సరి/బేసి/సరి
రామగీతి పాడుమెపుడు – రామగీతి యిచ్చు రక్ష
ప్రేమతోడ మనసు నింపు – హృదయకమల మలరఁగా
రామనామ జపము సలుప – రాముఁడిచ్చుఁ బ్రాణబిక్ష
కామితార్థములు లభించుఁ – కడిది తెరలు పెలరఁగా
ఎన్నగాను రామభజన పాట తీసికొందామా?
పల్లవి:
అ.పల్లవి:
కన్నవిన్నవారి వేడు-కొన్న నేమిఫలము మనస?
చరణం 1:
రామరామరామ యనుచు – రమణియొకతె పల్కగా
ప్రేమమీర భఽద్రాద్రి-ధాముడైన రామవిభుడు
కామితార్థ ఫలములిచ్చి – కైఽవల్యమొసగలేదా?
చరణం 2:
పాపమెల్ల బాసె రామ-పదము సోకినంతనే
రూపవతులలోఽనధిక – రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామ-తత్త్వమెల్ల తెలుపలేదా?
ఇందులో పల్లవి ఉత్సాహపాదమువలె, అనుపల్లవి తురగవల్గన రగడవలె ఉన్నాయి. మొదటి చరణములోని రెండు పాదాలు రామగీతి అమరికవలె, చివరి రెండు పాదములు తురగవల్గన రగడవలె ఉన్నాయి. రెండవ చరణపు అమరిక కూడ ఈ తెఱగే.
తురగవల్గన రగడ చాయలు బూచివాని పిలువబోదునా అనే పాటలో కూడ ఉన్నది.
పల్లవి:
అ.పల్లవి:
ఆఽ చిచ్చి జోలపాడి – ఆయిఊచిన నిదురపోవు
చరణం 1:
నెత్తిమీద బెట్టి నన్ను – ఎత్తుకోమనేవు కృష్ణా
చరణం 2:
తల్లి వెన్నపాలు నాకు – తెమ్ము తెమ్ము తెమ్మనేవు
చరణం 3:
మాటిమాటికిట్లు నన్ను – మాఽరాము చేసితేను
చతురస్రగతి
అందరు వాగ్గేయకారులవలె రామదాసు కూడ చతురస్రగతిలో చాల పాటలను వ్రాసెను. సామాన్యముగా చతురస్రగతిలోని పాటలు ఆదితాళమునకు సరిపోతాయి. నాలుగు మాత్రలు ఐదు విధములుగా సాధ్యము, అవి – UU, UII, IIU, IUI, IIII (U – గురువు, I – లఘువు). కొన్ని చోటులలో రెండు చతుర్మాత్రలకు బదులు UIUUI లాటి అష్టమాత్రలను కూడ ఉపయోగిస్తారు. పాదమునకు 16, 28, 30, 32 మాత్రలు ఉండే చతుర్మాత్రల పాటలను ఒకటి రెండు ఉదాహరిస్తాను.
- హరిహరిరామ నన్నరమర చూడకు
నిరతము నీ నామస్మరణ ఏమరనుమణిమయభూషణ – మంజులభాషణ
రణజయభీషణ – రఘుకులపోషణ - అంతా రామమయంబీ జగమంతా రామమయం… అనే పాటలోని చరణములలో రెండు చతుర్మాత్రలకు బదులు అష్టమాత్రలు కూడ ఉపయోగించబడినవి.
అంతా రామమయం – బీజగ – మంతా రామమయం
అంతరంగమున – నాత్మారాము డ
నంతరూపమున – వింతలు సలుపగ… అంతా రామమయంసోమసూర్యులును – సురలు తారలును
ఆ మహాంబుధులు – నవనీజంబులు… అంతా రామమయం
ఇందులో మొదటి చరణములో 8, 4-4 / 8, 4-4 మాత్రలు, రెండవ చరణములో పూర్తిగా అష్టమాత్రలు ఉన్నాయి.
రామదాసు అష్టపది
ఇప్పుడు మీకు పాదమునకు 28 మాత్రలతో అందరికి తెలిసిన, అపురూపమైన, ఏ తీరుగ నను దయ జూచెదవో… పాటను పరిచయము చేస్తాను. పాదమునకు ఏడు చతుర్మాత్రలతో శ్రీజయదేవకవి ఎన్నో అష్టపదులను వ్రాసినాడు. ఈ పాట కూడ అట్టి కోవకు చెందినదే. అష్టపదులలో ధ్రువము (పల్లవి) ఉంటుంది. అష్టపదులలోని పదము ఒక ద్విపద. రామదాసు పాటలో మొదటి పదమునే పల్లవిగా భావించుకోవాలి. ఇందులో ఎనిమిది ద్విపదులు ఉన్నాయి. అన్నిటికి ప్రతి పాదములో ఏడు చతుర్మాత్రలు లేక రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నాయి. సర్వత్రా ద్వితీయాక్షర ప్రాస, ఐదవ చతుర్మాత్రతో అక్షరసామ్య యతి గాని ప్రాసయతి గాని, రామా అనే పదము సర్వత్రా అంత్యప్రాసగా ఉండుట ఈ పాటలోని విశేషాలు. ఉదాహరణమునకు ‘కావగ రావా రామా నన్నిట గావగ రావా రామా’ లాటి ఒక పాదమును ధ్రువముగా కల్పించుకొంటే ఇది అక్షరాలా ఒక అష్టపది అవుతుంది. ఏతీరుగ నను దయజూచెదవో … పాట ఒక అష్టపది అని ఇంతవఱకు ఎవ్వరు నిరూపించలేదు. బహుశా తెలుగులో యిదియే జయదేవుని బాణీలోని మొట్టమొదటి స్వతంత్రమైన అష్టపదియేమో?
ఏతీరుగ నను దయజూచెదవో – యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను – నళినదళేక్షణరామా (1)
(కావగ రావా రామా నన్నిట – గావగ రావా రామా – ధ్రువము – నా కల్పన.)
శ్రీరఘునందన సీతారమణా – శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను – కన్నదికానుపు రామా (2)
మురిపెముతో నాస్వామివి నీవని – ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచు నీ – మరుగు జొచ్చితిని రామా (3)
క్రూరకర్మములు నేరకచేసితి – నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవె – దైవశిఖామణి రామా (4)
గురుడవు నామది దైవము నీవని – గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు – క్రూరుడనైతిని రామా (5)
నిండితి నీవఖిలాండకోటి బ్ర-హ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన – నిత్యానందము రామా (6)
వాసవకమలభవాసురవందిత – వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన – భద్రాద్రీశ్వర రామా (7)
వాసవనుత రామదాస పోషక – వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె – దాశరథీ రఘురామా (8)
క్రింద మాత్రాగణముల నిర్మాణమును ఒక ద్విపదకు చూపినాను –
నిండితి । నీవఖి । లాండకోటి బ్ర । హ్మాండము । లందున । రామా (లాండకోటి బ్ర – అష్టమాత్ర; ప్రాసయతి)
నిండుగ । మది నీ । నామము । దలచిన । నిత్యా । నందము । రామా (అక్షరసామ్య యతి)
క్రింద జయదేవుని “లలిత లవంగలతా పరిశీలన…”
అష్టపదినుండి ఒక ఉదాహరణము:
మదన మ । హీపతి । కనకదండరుచి । కేసర । కుసుమ వి । కాసే (కనకదండరుచి – అష్టమాత్ర)
మిళిత శి । లీముఖ । పాటల । పటల కృ । తస్మర । తూణ వి । లాసే
పాదమునకు 30 (8+8+8+6) మాత్రలతో శరషట్పది అమరికవలె ఉండే పాటలను కూడ రామదాసు వ్రాసినాడు. అట్టి పాట పావన రామనామ సుధారసపానము … అనే పాట.
పల్లవి:
సేవించియు శ్రీహరి పాదంబులు – చిత్తమునుంచేదెన్నటికో
చరణం 1:
భూసుతకును నతి ప్రాణప్రదంబగు – పురుషోత్తము గనుటెన్నటికో
చరణం 2:
పంచతత్వములు తారకనామము – పఠియించుట నా కెన్నటికో
చరణం 3:
కనకచేలు కరుణాలవాలునిఽ – కన్నుల జూచేదెన్నటికో
చరణం 4:
అంచితముగ రామదాసుడ ననుకొని – ఆనందించేదెన్నటికో
ఖండగతి
ఐదు మాత్రలతో సాగే నడకను ఖండగతి అంటారు. ఇందులో మూడింటిని ఇక్కడ విశదీకరిస్తాను.
- పాదమునకు నాలుగు పంచమాత్రలు ఉండే గీతిని మంగళగీతి అంటారు. ఇది పంచమాత్రల సీసపద్యములోని ప్రథమార్ధపాదము వంటిది. క్రింద ఒక ఉదాహరణము –
పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో (పల్లవి స్రగ్విణీవృత్తమునకు కూడ సరిపోతుంది)శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ
నామకీర్తనలు వర్ణింతు రామప్రభో
సుందరాకార హృన్మందిరోద్ధార సీ
తేందిరా సంయుతానంద రామప్రభో - కుసుమషట్పది అమరికతో (పం-పం/పం-పం/పం-పం – పం-గ) అక్షరసామ్య యతితో పాదముల నిర్మాణమును శ్రీరామ నీనామ మేమిరుచిరా… అనే పాటలో గమనించ వీలగును.
కరిరాజ ప్రహ్లాద – ధరణి విభీషణుల – గాచిన నీనామ – మేమిరుచిరా
కదళీ ఖర్జూరాది -ఫలములకధికమౌ – కమ్మన నీనామ – మేమిరుచిరా - లయ(గ్రాహి) వృత్తమువలె (పాదమునకు ఏడు పంచమాత్రలు, ఒక చతుర్మాత్ర) కూడ రామదాసు వ్రాసినాడు. జయజానకీరమణ జయ విభీషణశరణ… పాటనుండి ఒక చరణము:
జయ త్రిలోకశరణ్య – జయ భక్తకారుణ్య – జయ గణ్యలావణ్య – జయ జగద్గణ్య
సకలలోకనివాస – సాకేతపురవాస – అకళంక నిజహార – అబ్జముఖహాస
సంకీర్ణగతి
ఈ గతిలో తొమ్మిది మాత్రలు ప్రధానము. అవి సామాన్యముగా 4, 5 లేక 5, 4 మాత్రలుగా విరిగే పదాలతో ఉంటుంది. అప్పుడప్పుడు మూడు మూడు మాత్రలు కూడ ఉంటాయి. 5+4 మాత్రలతో శీతాంశ అనే వృత్తము, 4+5 మాత్రలతో నవరోజు అనే వృత్తమును ఈ గతిని ఎత్తి చూపించుటకు కల్పించినాను. క్రింద వాటికి ఉదాహరణములు –
శీతాంశ – భ/త/భ/త/భ/త/భ/గ UII UUI UII UUI –
UII UUI UIIU 22 ఆకృతి 1664407
ఎక్కడ నున్నాఁడు – చక్కని మారాజు – చిక్కఁడె నేఁజూడఁ – జెప్పు చెలీ
మక్కువతో నేను – మిక్కిలి ప్రేమించఁ – బ్రక్కకు రాఁడాయె – వాఁడు సకీ
చుక్కల ఱేడల్ల – నెక్కెను మిన్నందుఁ – డక్కరికాఁ డెప్డు – డాయుఁ గొమా
బిక్కున నేనుంటి -చిక్కని చీఁకట్ల -నక్కునఁ జేరంగ – నౌనొ హలా
నవరోజు – భ/స/జ/న/ర/న/జ/గ UII IIUI – UII IIUI – UII IIUIU 22 ఆకృతి 155222
రాముఁడె భువనమ్ము – రాముఁడె చలనమ్ము – రాముఁడె కవనమ్ముగా
రాముఁడె కదలించు – రాముఁడె కరగించు – రాముఁడె మురిపించుఁగా
రాముఁడె యొక త్రోవ – రాముఁడె యొక నావ – రాముఁడె నవజీవ మా
రాముఁడె మదియందు – రాముఁడె బ్రతుకందు – రాముఁడె కనువిందుగా
ఇట్టి గతిలో రామదాసు వ్రాసిన ఒక పాట –
తాజేసిన మేలు – దైవ మెరుంగవలె – తాజెప్పుకోవలెనా
తన మనసు వశము – చేసుకొన్న చాలు – కాశీకి పోవలెనా
కలకాలము తల్లి – కరుణ భోజనమిడు – కాలమందు చూడుడీ
కులుకుచు పెంచిన – కొడుకుల గుణముల – కోడలొచ్చిన చూడుడీ
మత్తమయూరము – సుందరలేఖా
వందే విష్ణుం దేవమశిక్షా స్థిథిహేతుం… అనేపాటలో ఈ వృత్తపు చాయలు ఉన్నాయి. అందులోని ఒక చరణము:
మాయాతీతం – మాధవమాద్యం – జగదీశం
నిత్యానందం – మోహవినాశం – మునివంద్యం।
యోగధ్యేయం – యోగనిదానం – పరిపూర్ణం
వందేరామం – రంజితలోకం – రమణీయం॥
ఇందులో మొత్తము చరణము ఒక మత్తమయూరవృత్త పాదములకు (మ/త/య/స/గ) సరిపోతుంది. ఈ మత్తమయూరము ఒక పురాతన వృత్తము. నాట్యశాస్త్రములో, పింగళ ఛందస్సులో ఇది పేర్కొనబడినది. పై చరణములో చివరి నాలుగు అక్షరములను తొలగించి క్రింది విధముగా వ్రాసినప్పుడు అది సుందరలేఖా వృత్తమునకు (మ/త/య) సరిపోతుంది. ఈ వృత్తమును జయకీర్తి తన ఛందోనుశాసనములో పేర్కొన్నాడు. ఒక విధముగా ఇది గర్భకవిత్వముతో సమానము.
మాయాతీతం మాధవమాద్యం / నిత్యానందం మోహవినాశం।
యోగధ్యేయం యోగనిదానం / వందేరామం రంజితలోకం॥
నిశికాంత
కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ… అనేపాటలోని ఒక చరణము:
నీదండనాకు – నీవెందుబోకు వాదేలనీకు – వద్దు(ద్దూ) పరాకు
శ్రీరామ మమ్ము – చేపట్టుకొమ్ము – ఆదుకొనరమ్ము – ఆరోగ్యమిమ్ము
ఇందులో పాటంతా UUIUI లేక ఈ అమరికకు సరిపోయే మాత్రలతో నిండి ఉన్నది. మొదటి పాదములో అక్షరసామ్య యతి, రెండు చిన్న పాదములకు ప్రాసయతి ఇందులోని విశేషములు. ఈ లయతో నిశికాంత అనే వృత్తము నొకటి నేను కల్పించినాను. నిశికాంత వృత్తమునకు ఒక ఉదాహరణము –
నిశికాంత – స/జ/స/జ/స/జ/స/జ IIUIUI IIUIUI IIUIUI IIUIUI
24 సంకృతి 11451116. అర్ధ పాదములకు ప్రాసయతి, అర్ధ పాదములలో అక్షరసామ్య యతి –
కను మూయగాను – గల గాంచినాను – నిను జూచినాను – నిశికాంతుఁగాను
వనమందు నెమ్మి-వలె నీవు సుమ్మి – మన మొక్క తమ్మి – మధురమ్ము నెమ్మి
తనువెల్ల హాయి – తరుణమ్ము రేయి – స్వనమో రుబాయి – స్వరరాగదాయి
వనజాస్యమందు – వరహాస మెందు – నెనలేని విందు – హృదయమ్మునందు
గరుడగమన
గరుడగమన రారా… అనే పాటలోని బేసి పాదములలో 3, 3, 4 – 4 – 3, 3, 4 మాత్రలతో ఉండే ఛందస్సును గమనించవచ్చును. ఇందులో మధ్య ఉండే చతుర్మాత్ర ఆద్యంత భాగములకు మధ్య ఒక వంతెనవలె వర్తిస్తుంది. దీనిని వరణము అంటారు. క్రింద ఒక ఉదాహరణము –
పిలువగానె రమ్మి – అభయము – తలపగానెయిమ్మి
పాలకడలి శయన – దశరథ- బాల జలజనయన
ఇట్టి అమరికను నేను గరుడగమన అను వృత్తముగా కల్పించినాను. అట్టి గరుడగమన వృత్తమును క్రింద చదవండి.
గరుడగమనుఁ డీవే – కడలిని – నురగశయనుఁ డీవే
సరసలోలుఁ డీవే – జగమున – సరసిజాక్షుఁ డీవే
గిరిజ కన్న నీవే – కృపనిడు – కరుణజలధి నీవే
హరి యనంగ రావా – హరుసపు – నురుఁగు చల్లి పోవా
మనోరమ – మేఘసుందర
భద్రశైల రాజమందిరా… అనే పాటలో నాలుగు సూర్య గణములు, ఒక గురువు, ఒక వంతెన, మళ్ళీ నాలుగు సూర్య గణములు, ఒక గురువు ఉండే అమరికను పాదములలో గమనించవచ్చును. కొన్ని వృత్తములకు నాలుగు సూర్య గణములు, ఒక గురువు ఉండే అమరిక గలదు. అట్టి వాటిలో మనోరమ వృత్తము ఒకటి. క్రింద మనోరమ వృత్తమునకు నా ఉదాహరణము:
మనోరమా – న/ర/జ/గ III UI UI UIU 10 పంక్తి 344
కలలు చాలు – కళ్ళు విచ్చరా / మెలకువైన – మేలు నీకురా
పిలిచె నిన్ను – వెల్గురేక లీ / లలిత భాను – లాస్య లీలలో
అక్షరగణములకు బదులు మాత్రాగణములను ఉపయోగించగా జనించిన వృత్తమునకు నేను మేఘసుందర అని పేరునుంచినాను. ఒక మేఘసుందర మాత్రావృత్తమును క్రింద చదవండి:
శ్రీరమేశ – చిద్విలాసుఁడా / భూరమేంద్ర – భువనమోహనా
మేరలేని – మేఘసుందరా / హారి నాకు – హర్ష మీయరా
రెండు పాదములకు మధ్య ఎనిమిది మాత్రల ఒక వంతెనను నిర్మిద్దామా?
శ్రీరమేశ – చిద్విలాసుఁడా – శ్రీరాఘవేంద్ర – భూరమేంద్ర – భువనమోహనా
మేరలేని – మేఘసుందరా – మృదువచనభాషి – హారి నాకు – హర్ష మీయరా
ఇప్పుడు ఇది భద్రశైల రాజమందిరా పాటవలె ఉంటుంది. ఆ పాటనుండి కొన్ని పంక్తులను క్రింద ఇచ్చినాను.
భద్రశైల రాజమందిరా – శ్రీరామచంద్ర – బాహుమధ్య విలసితేంద్రియా
సంతత ప్రశాంత కారణా – శ్రీరామచంద్ర – దంతివర మదనివారణా
తను నిరస్త నీల కంధరా – శ్రీరామచంద్ర – పరమపురుష మేఘ సుందరా
ముగింపు
రామదాసు సంస్కృతాంధ్ర భాషలలో కవి, పండితుడు. హృదయపు లోతులనుండి భక్తి సాగరమును చిలికి నననవమైన ఛందో బంధముల అమృతమును సృజించి, రాగతాళ యుక్తముగా జగదభిరాముడైన ఆ శ్రీరామునికి నివేదించినాడు. ఇక్కడ నేను మీముందు ఉంచినది లేశమాత్రమే. ఈ రంగములో కృషి ఎంతో అవసరము. గాయకులకు మాత్రమే కాదు, విద్యార్థులకు కూడ ఇది ఒక పెన్నిధి. ఈ విభాగములో క్రొత్త పరిశోధనలు జరుగుతాయని ఆశిస్తాను.
దాసులందు గొప్పవాఁడుగా – దాశరథి కొక్క – దాసుఁడయ్యె గోపనాఖ్యుఁడే
వాసియైన కీర్తనమ్ములన్ – భద్రాద్రి రాము – నాసరకయి తాను బాడెనే
(కృతజ్ఞతలు: అడిగిన వెంటనే నాకు రామదాసు కీర్తనలపైన పుస్తకమును పంపిన శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి నాహృదయపూర్వకమైన కృతజ్ఞతలను అందజేయడము నాకర్తవ్యము.)