టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్

జెరోన్షన్

ఎలియట్ కావ్యరచనలో, ప్రూఫ్రోక్‌తో మొదలైన ప్రారంభదశ ముగిసింది. జెరోన్షన్ (Gerontion, 1920) ఎలియట్ కవితా ప్రస్థానంలో ప్రౌఢదశాప్రారంభాన్ని ప్రకటించింది. ఇది ఎలియట్ మొదటి గొప్పకవిత అని చెప్పవచ్చు. ప్రపంచయుద్ధం, నగరాలు, కాలుష్యం, ఆందోళన, భయం, బోర్‌డమ్ (boredom) – ఇవన్నీ యుద్ధానంతర యూరప్ లక్షణాలు, ఎలియట్ ప్రారంభదశలో కావ్యవస్తువులు, అంటే రోగలక్షణాలు. రెండవదశ రోగనిదానంతో మొదలవుతుంది. ప్రారంభ కవితలలో, బీటలువారిన నేల, రెండవదశలో నోరుతెరచి నీరడుగుతుంది.

శుష్కభూమి: జెరోన్షన్ అనావృష్టితో మొదలయి అనావృష్టితో ముగుస్తుంది. మొదటి రెండు పాదాలు:

Here I am, an old man in a dry month,
Being read to by a boy, waiting for rain.

చివరి పాదం: Thoughts of a dry brain in a dry season.

ఆద్యంతము కవితలో అనార్ద్రతే. ఎక్కడా తడిలేదు, గాలిలో మట్టిలో మనిషిలో. మొదటి పాదంలోని నెల (dry month) చివరి పాదానికి పొడుగు పెరిగి ఋతువయింది (dry season). మెదడులో కూడా తడి లేదు, (dry brain). వర్షం కొరకు నిరీక్షణే కాని కవితలో చినుకు పడలేదు (waiting for rain). జెరోన్షన్ రాసినపుడు, అది వేస్ట్‌లాండ్‌లో భాగంగా (ముందుకవిత) భావించి రాసినా, తరువాత దానిని స్వతంత్ర కవితగా ఉంచడానికి ఎలియట్ నిర్ణయించాడు, ఎజ్రా పౌండ్ సూచన మేరకు.

‘ముసలాణ్ణయి పోతున్నా అయిపోతున్నా’ అన్నాడు ప్రూఫ్రోక్. జెరోన్షన్ ముసలాడయ్యేపోయాడు. కళ్ళు కనపడవు. ఎవరో పిల్లవాడు (తన కొడుకో మనవడో కాదు) ఏదో చదివి వినిపిస్తున్నాడు. (read to by a boy, my boy కాదు. వర్షమే లేదు, పంట ఏం పండుతుంది?) ముసలాళ్ళు పిల్లలతో ఏం చదివించుకొంటారు? బైబిలో, భగవద్గీతో. జెరోన్షన్ అంటే little old man అని అర్థం, grand old man కాదు. శరీరంలోను ఆత్మలోను ముడుచుకుపోయిన ముసలివాడు తన జీవితాన్ని నెమరువేసుకుంటున్నాడు.

ఈ కవితకు ముందు యిచ్చిన ఉల్లేఖనం (Epigraph): జీవితమే జీవంలేని ఒక కలవంటిదైనపుడు, యవ్వనమైనా వార్ధక్యమైనా ఒకటే (Measure for Measure: Shakespeare).

యుద్ధం చేయని వ్యర్థజీవితం:

I was neither at the hot gates
Nor fought in the warm rain
Nor knee deep in the salt marsh, heaving a cutlass,
Bitten by flies, fought.

ఇతడు జీవితంలో ఏ పోరాటము చేసినవాడు కాదు. దేనికోసం పోరాడుతాడు? దేనినైనా బలంగా నమ్మినవాడే పోరాడుతాడు. లేనివాడు సులభమైన దారిని ఎన్నుకుంటాడు. అతడు చెబుతున్నది సాధారణయుద్ధమే (hot gates, warm rain అంటే బాంబుల వర్షం). అతడు ఎన్నడూ, పురుగులు కరుస్తూంటే, చిత్తడినేలలో మనిషెత్తు గుబురు కోసుకొంటూ దారి చేసుకుంటూ, శత్రువుతో పోరాడలేదు. అంతరంగంలోకూడా ఏ ధర్మం కొరకూ, ధర్మంలో శ్రద్ధ కొరకూ, పోరాడలేదు. [థెర్మోపైలేకి (Thermopylae) అనువాదమే hot gates. (thermo+pylae) అక్కడ 480 B.C.లో జరిగిన యుద్ధం యిక్కడ ప్రస్తావన.]

శిథిలావస్థలో దేహము, గేహము:

My house is a decayed house,
And the Jew squats on the window sill, the owner.

అద్దె కొంప పాతబడి కూలడానికి సిద్ధంగా ఉంది. ఇంటియజమాని యూదు. యూదు ధనకాంక్షకు పేరు. ఇంటికి రిపేర్లు చేయించడు. అద్దె మాత్రం వసూలుచేస్తాడు. ఇక్కడ జెరోన్షన్ దేహమే శిథిలమైన అద్దె యిల్లు. (ఈ అద్దెయిల్లు ఉపమానం షేక్స్‌పియరు కూడా చేస్తాడు. ‘అద్దెకొంపకు ఆయిల్ పెయింట్లెందుకు, యజమాని ఎప్పుడైనా యిల్లు ఖాళీచేయమనవచ్చు’.)

Why so large cost, having so short a lease,
Dost thou upon thy fading mansion spend?
(Sonnet. 146)

ఇక్కడ శిథిలగృహం దేహాన్ని మాత్రమే చెప్పడంలేదు. యూరపు, యూరపీయ సంస్కృతి కూడా, కూలడానికి సిద్ధంగా ఉన్న శిథిలగృహం, decayed house. ఎందుకు? ఏ ధర్మం కోసం పోరాడి తన యిల్లు నిలుపుకోవలెనో, ఆ ధర్మయుద్ధం, బయట కాని వెలుపల కాని ఏనాడు చేయలేదు. అలసమైన జీవితం గడిపాడు. అందుకే తన యిల్లు ధనపతుల (యూదుల) వశమయిపోయింది. యజమాని కిటికీలో కూచుని యితని వ్యవహారాలనన్నిటినీ గమనిస్తుంటాడు, నిఘా ఉంచి నియంత్రిస్తాడు. ప్రపంచమే శిథిలగృహం. అది ధనపతుల వశమైపోయింది. ధనబలం ముందు మనిషి దాసోహమంటూ అద్దె కట్టుకుంటూ బతుకవలసిందే. కవితలో చివరిమాట కూడా ఈ అద్దె విషయమే: tenants of the house. కూలిపోబోతున్న దేహము గేహము పతనమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకలుగా అర్థం చేసుకోవలె.

అంతే కాదు. Decayed house పాడుబడిన చర్చిని కూడా చెబుతుంది. ‘ఈ దేవాలయం నా యిల్లు’ అని, దానిలో తిష్ఠవేసి, ‘అద్దెకున్నవారి’పై నిరంతరం నిఘా ఉంచి ఉన్నాడు ధనపతి, యూదు. దేవాలయం ఆ స్థితికి రావడానికి ఆ యూదే కారణం. అది అట్లా ఉండడమే అతడు కోరుకొనేది. (యూదు జాతివాచకం కానక్కరలేదు. లోభానికి, ద్రోహానికి వాచకం. ఇది ఒక్క క్రైస్తవానికి పరిమితమైన విషయం కాదు. ఈనాడు అన్నిమతాల దేవాలయాలు కేవలం దేవాదాయాలు.)

ముసలివాడు, ముసలిది, సంసారం:

Sneezes at evening, poking the peevish gutter.

ఇక ముసలివాడి సంసారవిషయం. మేక కామవాంఛకు ప్రతీక. (goat:a lecherous man. Concise Oxford Dictionary, విచ్చలవిడిగా కామంలో ప్రవర్తించే పురుషుడు, అనే అర్థంలో వాడుతారు.) ముసలివాడికి రాత్రిపూట దగ్గు మొదలవుతుంది, ‘పొలంలో’ (in the field, ‘క్షేత్రం’ సమీపించగానే). అతడికి దగ్గు, ఆమెకు జలుబు! అతడి దగ్గు రాత్రి దాక ఆగుతుంది (coughs at night). కాని ఆమె జలుబు సాయంత్రమే మొదలవుతుంది! (Sneezes at evening). అర్థజర్జరి. ఆమె టీ చేయడానికి మాత్రం పనికొస్తుంది. ఇదీ వారి సాంసారికజీవితం, దాని సాఫల్యము. ముసలితనంలోనే కాదు, వయసులోనూ సంసారజీవితం నిస్సారం కావడం ఆధ్యాత్మికవైఫల్యంలో భాగంగా భావిస్తాడు ఎలియట్.

సమస్త సృష్టిని, నిత్యము తనను తాను పునరుజ్జీవింపజేసుకునే ప్రకృతిని, పరమాత్మ నిండి ఉన్నాడు. ఈ పునరుజ్జీవనాన్ని మనిషి కాదంటున్నాడు. పునరుజ్జీవనం కొరకు ఉత్సాహం లేకపోవడమే విరతి. పునరుజ్జీవనకాంక్షను అతడు నైతికపతనమని, దేహవాంఛలలోకి ‘దిగజారడ’మని (depraved) అనుకొంటాడు. (depraved May… The Waste Land లోని April is the cruellest monthకు మొదలు. వసంతం తెచ్చే ఆనందం అలజడిగా అనిపిస్తోంది. (Whan that April with his shoures soote; fresh as is the month of May. – Chaucer).

కామం హేయమా ఉపాదేయమా అన్న ఈ క్రైస్తవధర్మసందేహానికి భగవద్గీత స్పష్టంగా సమాధానం చెప్పింది. భగవానుడు అసందిగ్ధంగా ఒప్పేసుకున్నాడు, ‘నేను కామమును’ (కామోస్మి) అని. కాని ఎటువంటి కామము? ధర్మవిరుద్ధం కాని కామము. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి (గీత. 7. 11). బలవంతపు బ్రహ్మచర్యాన్ని ఎలియట్ కొన్ని కవితలలో స్పష్టంగా నిరసిస్తాడు. సాధారణంగా హీనార్థంలో చెప్పుకునే లైంగికవాంఛ, లైంగికక్రియ, ఎలియట్ కవితలలో విచిత్రంగా, ఆధ్యాత్మిక ఆర్తికి, సాఫల్యానికి ప్రతీక; వంధ్యత ఆధ్యాత్మిక నిష్ఫలతకు ప్రతీక. ఆ సాఫల్యము లేకపోవడమే ఎలియట్ కావ్యవస్తువు, ఒక్క వేస్ట్‌లాండ్‌లో మాత్రమే కాదు.

ప్రాచ్యంలో కవులు సాధారణంగా ఆధ్యాత్మిక ఆర్తిని సూచించడానికి రతిని వర్ణిస్తారు. పరమాత్మను స్త్రీగా (ఉమర్ ఖయ్యామ్), పురుషుడిగా (సూరదాసు, క్షేత్రయ్య) భావించి కవిత చెప్పారు. ఈ రతి ఎలియట్‌లో విరతిగా కావ్యవస్తువు అయింది. అంటే, లైంగికవాంఛ, దాని సాఫల్యము ఎలియట్ కవితలలో అభావరూపంలో ఉంటుంది. ఈ అభావానికి కారణం మనిషి తలను (బుద్ధి) మాత్రము ఆశ్రయించి, తక్కిన అన్ని ఇంద్రియాలను వదిలి నపుంసకుడు కావడం.

I have lost my sight, smell, hearing, taste and touch:
How should I use it for your closer contact?

ఇంద్రియాలు రెండంచుల కత్తి:

ఇంద్రియాలు మనిషిని సుఖంలో ముంచి పరమార్థాన్ని మరపిస్తాయి, పశువుగా మారుస్తాయి. అవే యింద్రియాలు దివ్యానుభూతికి ద్వారాలు కాగలవు కూడా. ఈ అర్థంలో రెండు పద్యాలు:

తోయజగంధంబు దోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులలర
కమలనాళాహార విమలవాక్కలహంసరవములు సెవులు పండువులు సేయ
ఫుల్లదిందీవరాంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మలకల్లోలనిర్గతాసారంబు వదనగహ్వరముల వాడు దీర్ప
త్రిజగదభినవసౌభాగ్యదీప్తమైన విభవమీక్షణములకును విందుసేయ నరిగి
పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తేభయూథంబు మడుగు జొచ్చె.
(గజేంద్రమోక్షం: పోతన)

ఇంద్రియలౌల్యంలో జీవుడు సంసారమనే మడుగులో ఎలా కూరుకుపోతాడో, మడుగులో దిగిన మత్తేభానికి మత్తు దిగేదాకా తెలియలేదు.

రామాయణగాథలో అహల్య కూడా అంటుంది: I have lost my sight, smell, hearing, taste and touch అని. ఆమెకు పోయిన యింద్రియాలు ఎలా వచ్చాయి? వచ్చి ఏం చేశాయి? ఇంద్రియపరమార్థమేమిటో చెప్పే మరో పద్యం:

ప్రభుమేనిపై గాలి పైవచ్చినంతనే
పాషాణ మొకటికి స్పర్శవచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే
శిలకొక్క దానికి జెవులు కలిగె
ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన
యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభునీలరత్న తోరణ మంజులాంగంబు
కనవచ్చి రాతికి గనులు కలిగె
నా ప్రభుండు వచ్చి యాతిథ్యమును స్వీక
రించినంత నుపల హృదయ వీథి
నుపనిషద్వితాన మొలికి శ్రీ రామ భ
ధ్రాభిరామమూర్తి యగుచు దోచె
(రామాయణకల్పవృక్షం: అహల్య శాపమోచనఖండం, విశ్వనాథ సత్యనారాయణ)

ఇంద్రియాల సార్థక్యం ఏమిటో అన్వయవ్యతిరేకవిధానాలలో చెప్పిన పోతన పద్యాలు ప్రసిద్ధమైనవి: కమలాక్షునర్చించు కరములు కరములు (అన్వయం); కంజాక్షునకుగాని కాయంబు కాయమే (వ్యతిరేకము).
ఇంద్రియాలు, మనిషిని బండరాయిగా శపించగలవు. అవే ఇంద్రియాలు బండరాయికి భగవత్ స్పృహను యివ్వగలవు. ఆధ్యాత్మికంగా ఎదగదలచినవాడికి యింద్రియాలు, వాటి బలము, అవరోధం కావు. నీవు ఎదిగినంత ఎత్తుకు యింద్రియాలు నీతో వస్తాయి. అవి నీచమైనవి, వదిలికాని ఎదగలేవు, అన్నమాట సరికాదు. నీచ (Nietzsche) అదే అంటాడు: The degree and type of the sexuality of a man extend all the way to the ultimate peak of his spirit. (Aphorism 75: Beyond Good and Evil).

ఇంద్రియాలు పరమాత్మవైపుకు తలుపులు కిటికీలు. వాటిని మూసేశాడు మనిషి అన్నది ఎలియట్ నిర్వేదం. ఇక పారమార్థికస్పృహ ఎలా కలుగుతుంది? జీవితంలోని ఈ విరతిపై విరుచుకు పడతాడు క్రీస్తు. ఎలా? పెద్దపులిలా!

క్రీస్తు శిశువు, పశువు:

Signs are taken for wonders. ‘We would see a sign!’
The word within a word, unable to speak a word,
Swaddled with darkness. In the juvenescence of the year
Came Christ the tiger

The tiger springs in the new year.

లోకులు భగవంతుని శక్తిని నమ్మరు. మహిమలు (signs) కావాలంటారు (We would see a sign). లోకమంతా ఈశ్వరవిభూతి. అయినా, ‘హాంఫట్ విభూతి’ కావాలంటారు జనాలు. జగత్తంతా ఆయన లింగమే, అయినా, నోట్లోనుంచి లింగాలు సృష్టించమంటారు. ‘మాకు మహిమలు చూపించండి’ అనే ఆస్తికభక్తులకు, ‘మేము కంటితో చూచిందే నమ్ముతాము’ అనే నాస్తికహేతువాదులకు తేడా ఏముంది? భగవంతుడు ఎదురుగా నిలబడినా లోకానికి నమ్మకం కలగదు. ఈ కవితలో క్రీస్తు రెండుసార్లు కనిపిస్తాడు, శిశువులా (swaddled with darkness), పశువులా (Came Christ the tiger). అయినా నమ్మకం కలిగిందా? చిన్నపిల్లలను బట్టతో కప్పినట్టు (swaddle), అప్పుడే పుట్టిన క్రీస్తును శబ్దంగా (word) చెబుతున్నాడు ఎలియట్, ‘In the beginning was the word’ అన్న బైబిల్ వాక్యాన్ని గుర్తుచేస్తూ. క్రీస్తు మాట చీకటితో చుట్టబడి ఉంది. (swaddled with darkness). క్రీస్తు మాట మూగదైపోయింది (unable to speak a word). లోకపుచీకటిలో ఎవరికి తోచిన అర్థం వారు చెబుతున్నారు. ‘మాట’కు నోట మాట రావడం లేదు. ఇది క్రీస్తు దివ్యవాణి స్థితి.

హేమంతశిశిరాలలో జుట్టు సహా అన్నీ రాలిపోయి ముసలిదైన సంవత్సరానికి నవయవ్వనంలా (juvenescence of the year), వసంతంలా వస్తాడు క్రీస్తు ‘అంహోమర్దనుడై’, విరతిని విధ్వంసం చేస్తూ, జర్జరకాలాన్ని నవజీవంతో నింపుతూ, పులిలా దూకుతూ (The tiger springs: spring పదంలోని రెండర్థాలు స్పష్టమే, వసంతము, పైకి దూకడము.) విలియమ్ బ్లేక్ కవిత ది టైగర్ (The Tiger) దీని గురించే, తిమిరారణ్యాలను తన జ్వలించే జ్ఞానాక్షులతో దహించే పులి (Tiger!Tiger! burning bright /In the forests of the night!).

I have lost my passion:why should I need to keep it
Since what is kept must be adulterated?

Passion అనేది, క్రీస్తు జీవితంలో చివరి ఘట్టాలను చెప్పే మాట. క్రైస్తవధర్మంలో ఆ పదానికి ధృతి, భక్త్యావేశము అని చెప్పవచ్చు. క్రీస్తు పులిలా పైకి దూకుతుంటే, ‘రా! నన్నుద్ధరించు’ అనగలిగిన భక్త్యావేశం పోగొట్టుకున్నాను, అంటున్నాడు యీ కవితలోని ముసలివాడు. మహాభారతంలో మరో ముసలి ఉన్నాడు. అతడేం చేశాడో చూద్దాం.

పాపంపైకి దూకే పులిని తిక్కన కూడా వర్ణించాడు, వెనుక చూశాం, “అంహోమర్దనుడా జనార్దనుడు”లో. దుర్యోధనుడి సైన్యం ఎలా భయపడిందో!

పులిపొడగన్న లేళ్ళగమివోలె సుయోధనునగ్రసైనికుల్
దలకి కలంగి నివ్వెరగు దన్కిన చేష్టలు దక్కి చిత్రరూ
పుల క్రియ నుండి…

ప్రాణాలు పోయాయనుకొని, ప్రాణం లేని బొమ్మలలాగా ‘చేష్టలు దక్కి’ ఉండిపోయారు దుర్యోధనుడి సైనికులు. పీకమీదికి దూకే పులిని చూసి భయంతో వణికిపోరా, ఎవరైనా? ‘ఆహా! ఎంత అందంగా ఉన్నావు పెద్దపులీ’ అంటాడా ఎవడైనా? కాని భీష్ముడు, పీక మీదికి దూకే పులిలా చక్రం ధరించి వధించడానికి వస్తున్న కృష్ణుడిలో దివ్యసౌందర్యదర్శనం చేయగలిగాడు, భక్త్యావేశంతో.

అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబున నిట్లను సంభ్రమంబు లే
కప్పరమేశుతో నిటు కృతార్థునిజేయుదె…


Lose beauty in terror… I have lost my passion
అని జెరోన్షన్ అంటున్నాడు. భీష్ముడు ఏమంటాడు? I have lost my terror in beauty and passion. సౌందర్యదర్శనంలో, భక్తిలో భయమెక్కడో జారిపోయింది.

Christ the tiger రెంటికి ప్రతీక, భగవదాగ్రహానికి, కామేచ్ఛలోని నిత్య పునరుజ్జీవనశక్తికి. Passion అన్న పదానికి, సాధారణమైన అర్థం తీవ్రమైన ఇచ్ఛ. ‘నాకు కోరిక నశించింది. ఎందుకు పెంచుకోవాలి? ఉంచుకున్నకోరిక మలినం చేయక తప్పదుకదా? అంటాడు జెరోన్షన్.

I have lost my passion:why should I need to keep it
Since what is kept must be adulterated?

మలినమవుతుందని కోరికను చంపుకుంటారా? కామంలో దోషం లేదు, కల్తీలో ఉంది. అహల్యలో కామం కల్తీ అయింది (adultery, adulterated) కనుక దోషమయింది. కామమే లేకపోతే క్షామమే. అదే ఎలియట్ కవితలలోని వస్తువు.

In depraved May, dogwood and chestnut, flowering judas,
To be eaten, to be divided, to be drunk
Among whispers; by Mr. Silvero
With caressing hands, at Limoges
Who walked all night in the next room.

ఏప్రిల్ మే నెలలలో ప్రకృతి కొత్తజీవం పొందుతుంది. కోరికలు కదిలిస్తాయి. కవులు ఈ నెలలను పునరుజ్జీవనకాంక్షకు ప్రతీకలుగా వాడుతారు. చాసర్ తన కవితను ఏప్రిల్ మే నెలలతోనే మొదలుపెడతాడు: When that Aprille with his shoures soote, fresh as is the month of May. ఈ కవిసమయాలను ఎలియట్ తలకిందులు చేస్తాడు. అతడి వేస్ట్‌ లాండ్ April is the cruelest month అని మొదలవుతుంది. ఇక్కడ depraved May అంటున్నాడు. దివ్యభావం లోపిస్తే ధర్మకామం పశువాంఛగా, దివ్యనైవేద్యం నరమాంసభక్షణంగా మారిపోతాయి (To be eaten, to be divided, to be drunk). భక్తిభావం ఉంటే ప్రసాదం, లేనివాడికి అది కేవలం లడ్డు) క్రీస్తుకు ద్రోహం చేసిన అతని శిష్యుడు జూడాస్, తరువాత పశ్చాత్తాపంతో ఉరివేసుకున్న చెట్టును జూడాస్ అనే అంటారు. Silvero అనే పేరు లోభాన్ని చెబుతుంది. ఏ సిల్వర్ (వెండినాణెం) కోసం జూడాస్ నమ్మకద్రోహం చేశాడో అతడు. Silvero వంటి మరికొన్ని పేర్లను కూడా ఎలియట్ సృష్టిస్తాడు ఈ కవితలో:

By Hakagawa, bowing among the Titians;
By Madame de Tornquist, in the dark room
Shifting the candles; Fräulein von Kulp
Who turned in the hall, one hand on the door.
-De Bailhache, Fresca, Mrs. Cammel

ఎవరు వీరంతా? ఇవన్నీ మనిషిలోని అవలక్షణాలకు సృష్టించిన పేర్లు. Hakagawa (hacking, నరకడం); Kulp (Latin, culpa, నేరం) – మరికొన్ని పేర్లు, వ్యాపారులు.

Vacant shuttles
Weave the wind.

Shuttle అనే పదానికి, మగ్గపునేతలోని కండెలా, రెండు చోట్ల మధ్య తిరుగుతూ ఉండే వాహనాలు, లేక మనుషులు అని అర్థం. అరక్షణం తీరికలేకుండా, అనుక్షణము ఆందోళనలో, ఆసుపోసినట్లు తిరిగే వర్తకవ్యర్థులు. దారపు కండె తిరుగుడులో ప్రయోజనం ఉంది, బట్ట తయారవుతుంది. వీరి తిరుగుడు గాలిని నేస్తుంది. ఏమిటా గాలులు?వ్యాపారపు గాలులు (trade winds).

After such knowledge, what forgiveness?

జ్ఞానం క్షమించరాని అపరాధమా? అవును, బృహద్గ్రంథాల అనంతవిజ్ఞానం వెనుక, మనిషి ఆత్మ అల్పమై అణగి ఉంది (Curl up the small soul in the window seat/Behind the Encyclopædia Britannica. Animula.) భగవత్ స్పృహ కోలుపోయిన మనిషి జ్ఞానమే ఆది అపరాధం (the original sin). అదే కదా మనిషి భగవంతుని కృపనుండి పతనమవడమంటే (The fall. మిల్టన్ చెప్పిన the fruit of that forbidden tree). తల మాత్రమే మిగిలిన మేధావి పొందే విజ్ఞానం క్షమించరాని అపరాధమే. ఆ తలలో ఎటువంటి జ్ఞానం? Tenants of the house/ Thoughts of a dry brain in a dry season. బుద్ధికందని తత్త్వాన్ని బుద్ధిలో యిముడ్చుకోవలె అనుకోడం అపరాధమే.

‘చరిత్ర’ లేని స్త్రీ:

History has many cunning passages, contrived corridors
And issues, deceives with whispering ambitions,
Guides us by vanities. Think now
She gives when our attention is distracted
And what she gives, gives with such supple confusions
That the giving famishes the craving. Gives too late
What’s not believed in, or is still believed,
In memory only, reconsidered passion.

చరిత్రకు ఎలియట్ స్త్రీరూపం యిచ్చాడు. ఆమె (She) ఒక మధురవాణి. పురుషులను వశం చేసుకోడానికి ఎవరికి ఏ మాటలు నచ్చుతాయో ఆ మాటలు చెబుతుంది (She gives; deceives; gives with supple confusions; cunning passages”). ఎవరు ఏమడిగితే అది యిచ్చేస్తుంది. లెఫ్టిస్ట్‌కు కన్నుగీటుతుంది. రైటిస్టు వైపు పైట జారుస్తుంది. ఆస్తికుడితో ‘నేను నీ దానినే’ అంటుంది. నాస్తికుడితో ‘నీవు నాకు నచ్చావు’ అంటుంది. ఇస్తా ఇస్తానంటూ ఊరిస్తూ కాలం గడిపేస్తుంది. ఇచ్చినా, అది యిచ్చేదేమిటి? Gives… reconsidered passion. అంటే, గతంలోని ఆవేశాలు ప్రేమోద్రేకాలు రత్యుత్సాహాలు, సెకండ్‌హేండ్‌గా మళ్ళీ మనకు అమ్ముతుంది చరిత్ర. చరిత్ర అంటే గడచిన కాలము, జరిగిన ఘటనలు కాదు, అంటాడు ఎలియట్. జీవితం చరితార్థం కావడానికి ఏ చరిత్ర కావాలో ఆ చరిత్రను మనిషి నిర్మించుకోవలె. చరిత్ర మన వెలుపల లేదు, గతంలో లేదు. చరిత్ర యిప్పుడు యిక్కడ నీలో జరిగేదే. History is now and England (Four Quartets).

Think neither fear nor courage saves us. Unnatural vices
Are fathered by our heroism. Virtues
Are forced upon us by our impudent crimes.

భయంకాని సాహసంకాని సమస్యకు పరిష్కారం కాదు. చేయవలసిన యుద్ధం చేయనీయదు భయం. చేయకూడని పనులు చేయిస్తుంది సాహసం. అవివేకంతో చేసిన దుష్కర్మలకు అవార్డులు. శౌర్యపతకాలకు రెండు ముఖాలు, ఇటు ముఖం వీరచక్ర, అటుముఖం ద్రోహముద్ర.

We have not reached conclusion, when I
Stiffen in a rented house.

ముసలాడు అద్దెకొంపలో ఎప్పుడో బిగుసుకుపోతాడు. కాని కథ అంతటితో ముగియదు. చావు ముగింపే కాని, తీర్మానం కాదు. తరువాత ఉంది ముసళ్ళ పండగ, దైవంముందు నిలబడి జవాబులు చెప్పుకోవలె.

I that was near your heart was removed therefrom

పరమాత్మ హృదయానికి దగ్గరగా ఉండిన నేను, అక్కడనుండి తొలగించబడ్డాను. ఏమంటున్నాడు? ఒకప్పుడు మనిషికి పరమాత్మహృదయంలో స్థానం ఉండేది. ఆరోజులు వేరు. అదో స్వర్ణయుగం. గతకాలమె మేలు, అంటున్నాడా? లేదు. సమస్య కాలంతో రాలేదు, కాలంతో పోదు. కాలమే సమస్య. If all time is eternally present/All time is unredeemable (Burnt Norton: Four Quartets). సమస్య పరిష్కారము రెండు మనిషిలో ఉన్నాయి. ఇందులోని కర్మణి ప్రయోగం ‘తొలగించబడ్డాను’ (was removed) ఏ దుష్టశక్తులో నన్ను తొలగించాయి అనడం లేదు. తన ఆదిపాపమే (original sin) తాను స్వర్గంనుండి తోసివేయబడడానికి కారణం. కనుక, సమస్య పరిష్కారము రెండూ మనిషిలోనే ఉన్నాయి.

What will the spider do
Suspend its operations, will the weevil
Delay?

డబ్బుతో మనిషి అల్లిన సాలెగూడు ప్రపంచం. తాను అవిశ్రాంతంగా అల్లుకొంటున్న సాలెగూటిలో తానే చిక్కుకొని పోతాడు. విరమించలేనంత దూరం వచ్చేసింది, లోకం.

De Bailhache, Fresca, Mrs. Cammel, whirled
Beyond the circuit of the shuddering Bear
In fractured atoms. Gull against the wind, in the windy straits
Of Belle Isle, or running on the Horn,
White feathers in the snow, the Gulf claims,
And an old man driven by the Trades
To a sleepy corner.
Tenants of the house,
Thoughts of a dry brain in a dry season.

కవిత ముగింపు:

కవిత ముగింపు ముసలాడి సంధిప్రేలాపనేమో అనిపిస్తుంది. పొడి పేర్లు. సముద్రాలు జలసంధులు సాహసయానాలు (Belle Isle, Cape Horn). అతడే అంటాడు: ఇవి ఎండలలో, ఎండిన తలలోని అద్దెకున్న ఆలోచనలు. ప్రపంచకథ ముగిసిపోతున్నట్టు అనిపిస్తోంది అతనికి. వర్తకప్రభంజనంలో (driven by the trades) భూగోళం ఒక గందరగోళమయి, ఖగోళాలు గుద్దుకొని బద్దలై (fractured atoms) పోతున్నాయి. ‘ఈ లోకం నా చిటికెనవేలిపై గిరగిరా తిరుగుతున్నది’ అన్నవాళ్ళు, సముద్రపుసుడిగుండంలో చిక్కుకుని గిరగిరా తిరుగుతున్నారు. ప్రయోజకులు ప్రసిద్ధులు (De Bailhache, Fresca, Mrs. Cammel) ‘మేము లేకపోతే ఈ ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది’ అన్నవాళ్ళు, పిట్టల యీకల్లా మంచుకు అతుక్కుపోయారు, విశ్వాంతరాళాలలోకి విసరివేయబడ్డారు. కవిత ముగింపు, ముసలాడి చివరి క్షణాలలో అతడికి కనిపిస్తున్న విశ్వవిస్ఫోటనం. వ్యాపారపుగాలులు ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే పాశ్చాత్యసంస్కృతి చివరిక్షణాల దృశ్యం.

జెరోన్షన్ అంటే little old man అని అర్థం కదా? ముడుచుకుపోయిన ముసలాడు. ముసలితనం ఎవరికైనా వస్తుంది, భీష్ముడికీ వస్తుంది ధృతరాష్ట్రుడికీ వస్తుంది. ఈ కవితలోని జెరోన్షన్‌కూ (పాశ్చాత్యహేతువాదవ్యాపార సంస్కృతికీ) వచ్చింది. కాని ఎలా రావాలి ముసలితనం? ఎలియట్ మరో కవితలోని సిమియన్‌కు ఎలా వచ్చింది? My life is light, waiting for the death wind/ Like a feather on the back of my hand (A Song for Simeon, Eliot).

పాశ్చాత్యసంస్కృతికి వయసై పోయింది, జెరోన్షన్‌కు లాగా. ధనదాహంలో హేతువాదంలో భగవంతుడికి దూరమై, ప్రభంజనంలో చిక్కుకున్న దూదిపింజల్లా, కాకుల యీకల్లా కకావికలై ప్రపంచం సుడులు తిరుగుతోంది. ఎలియట్ పాశ్చాత్యసంస్కృతికి శాపనార్థాలు పెడుతున్నాడని మనమేమీ చంకలు గుద్దుకోనక్కరలేదు. ప్రాచ్యము పాశ్చాత్యము అన్న వివక్ష లేదు ఈనాడు. వ్యాపారవాయుగుండంలో ప్రపంచం మొత్తం చిక్కుకుపోయింది. ఉన్నదొకే సంస్కృతి, వ్యాపార సంస్కృతి. ఎలియట్ కవితలో మనకు కనిపించేవి, బీటలుబారిన భూమి, ఆర్ద్రతలేని హేతు‘బద్ధ’బుద్ధి. నిరాశ నిస్పృహ నిర్వేదము నిండినట్లు అనిపించే ఈ కవితలో, నిజానికి, శాపం కాదు, భగవంతుడికి దూరమైపోతున్నామన్న నిర్వేదం ఉంది. లేదు లేదు అనడంలో, ఏది కావాలో బిగ్గరగా వినిపిస్తుంది, పరమాత్మకై పరమ ఆర్తి.

My house is a decayed house,
And the Jew squats on the window sill, the owner.

నా శిథిలదేవాలయం తిరిగి బాగవుతుందా? తిష్ఠవేసిన యూదు వదిలి వెళ్ళిపోతాడా? మనిషిని లోభము ద్రోహము వదిలిపోతాయా?

ద వేస్ట్ ల్యాండ్‌లోని విషయమంతా యీ చిన్న కవితలో ఉంది. అందుకే మొదట దీనిని దానికి ‘ముందుకవిత’గా ఉంచాలని ఎలియట్ అనుకొన్నది.


పేరు: ద వేస్ట్ ల్యాండ్, మరో నాలుగు కవితలు (2019).
ప్రచురణ: ఆథర్స్ ప్రెస్, న్యూఢిల్లీ.
వెల: 495 రూ. (25$)
ప్రతులకు: authorspressgroup@gmail.com, : www.authorspressbooks.com