అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్

ప్రపంచసాహిత్యం తెలుగులో లభించే రోజు యింకా రావలసి ఉంది. ఆ దిశగా యిది నా అల్పప్రయత్నం. ఇప్పటివరకు షేక్స్‌పియర్‌ను, ఎలియట్‌ను కొంత పరిచయం చేశాను. బోద్‌లేర్ యీ వరసలో మూడవవాడు. ఇది చాలా స్వల్ప ప్రయత్నమే. కేవలం బోద్‌లేర్ కవిత్వంపై ఆసక్తి కలిగించడమే యీ రచన ఆశయం. బోద్‌లేర్ కవితలను కొన్నిటినైనా అనువదించవలె అన్న ప్రయత్నం చాలాకాలం తరువాత యీ రూపం పొందింది. కేవలం అనువాదాలవలన ప్రయోజనం ఉండదని భావించి, కొంత వ్యాఖ్య కూడా జోడించాను. బోద్‌లేర్ ప్రధాన కవితాసంపుటి ‘పాపపు పూలు’ (Les Fleurs du Mal: 1857) నుండి ఎక్కువ కవితలు తీసుకున్నాను. ‘ఖండకవితలు’ (Les Epaves / Scraps: 1866) నుండి ఒక కవితను చేర్చాను. వచనకవితకు బోద్‌లేర్ వచనకవితలు ఒజ్జబంతి అని భావిస్తారు. నిజమైన వచనకవితకు ఉదాహరణప్రాయంగా రెండు వచనకవితలను, వచనకవితాసంపుటి Spleen de Paris (Petits Poemes en prose:1869) నుండి చేర్చాను.

బోద్‌లేర్ కవితలు మూలభాషలోనూ, ఆంగ్లానువాదాలతోనూ నెట్‌లో లభ్యమౌతున్నాయి.

బోద్‌లేర్ అసాధారణకవి. అతడికి ఖ్యాతి అపఖ్యాతి కూడా అమితంగా లభించాయి. అపఖ్యాతిలో కొంత అతడు కోరి తెచ్చుకున్నదే. (de plusieurs vilaines actions que je n’ai jamais commises, et avoir lachement nie quelques autres mefaits que j’ai accomplis avec joie… – A une heure du matin, Spleen De Paris. Of several vile actions which I have never committed, and faint-heartedly denied some other misdeeds which I accomplished with joy – At One’o clock in the morning: Spleen De Paris.)

అతని అపఖ్యాతికి ప్రధానకారణం అతడి అద్భుత కవితా శిల్పాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకపోవడం వల్లనే. ఆ రచనా శిల్పాన్ని కొంతైనా ఆవిష్కరించే ప్రయత్నమే యీ వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలోని ప్రత్యేకత బోద్‌లేర్‌ను భారతీయ సనాతనధర్మదృష్టితో సమన్వయించే ప్రయత్నం. కవులందరూ ఏ భాషవారైనా, ప్రాచ్యమైనా పాశ్చాత్యమైనా, అక్కడికి చేరుతారు.

“తవ్వుకుంటూ పో, చివరకు నీవు ఆ సనాతన భూమిపైన నిలబడి ఉంటావు.” (Dig deeper and you will find yourself standing on Catholic ground. – Josef vonGörres)
– సూరపరాజు రాధాకృష్ణమూర్తి.


బోద్‌లేర్ జీవితం

ఏప్రిల్ 9, 1821: జననం, పారిస్‌లో. తల్లి కేరొలీన్, తండ్రి ఫ్రాంస్వా బోద్‌లేర్ (Francois Baudelaire). బోద్‌లేర్‌కు ఆరేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. భర్త పోయిన తరువాత తల్లి జాక్ ఔపిక్‌ను (Jacques Aupick) వివాహం చేసుకుంది. అతడు లెఫ్టినెంట్ కర్నల్, సంపన్నుడు, ఉన్నతోద్యోగి. కొంతకాలం కోన్‌స్టాంటినోపుల్‌కు (Constantinople) ప్రభుత్వ రాయబారిగా కూడా పనిచేశాడు. కాని బోద్‌లేర్ అమితంగా ప్రేమించిన తల్లి, కొత్త భర్త మోజులో పడి తనను ఆయాకు వదిలేసింది. తల్లికంటే ఆమె తనను బాగా చూచుకుంది. ఆ ఆయా మీద ఒక కవితకూడా రాశాడు తరువాత కాలంలో: ‘పెద్ద మనసున్న ఆయా’ (La servante au grand coeur: Servant with a big heart).

సవతి తండ్రి బోద్‌లేర్‌ను బాగానే చూచుకొన్నాడు. కాని, యితడి సాహిత్యాసక్తి అతడికి నచ్చలేదు. కవిత్వం రాసి ఎలా బతుకుతాడు? డిగ్రీ పరీక్ష తప్పిన బోద్‌లేర్‌ను, సాహిత్యం నుండి మంచి మార్గానికి మళ్ళించాలన్న సదుద్దేశంతో, లోకం తెలిసొస్తుందని, తిరిగిరమ్మని డబ్బిచ్చి పంపాడు. ముందు కలకత్తా వెళ్ళమన్నాడు (1841) సవతితండ్రి. మాట వింటాడా బోద్‌లేర్? కుర్రతనం. మధ్యలో మోరిషస్‌లో దిగిపోయాడు. అక్కడ ఒక కేరళ యువతితో పరిచయమయింది. ఆ కాలంలో బెంగాల్ నుండి, మలబారు నుండి అమ్మాయిలను అమ్మే వ్యాపారం ముమ్మరంగా సాగేది. పోర్చుగీస్‌వారు, డచ్చివారు స్త్రీలను చెరకుతోటల యజమానులకు కూలీలుగా అమ్మేవారు. (Reunion అనే ఫ్రెంచి పాలిత ప్రాంతంలో) ఈ కేరళయువతి అటువంటి ఒక బానిసస్త్రీ కూతురు. పేరు డోరతీ (Dorothy). మద్యానికి మత్తుమందులకు బానిస అయిపోయి, రాయడం మరచిపోయిన యీ యువకవిలో కవిత్వపు కైపెక్కించింది డోరతీ. బోద్‌లేర్‌లో నిద్రాణంగా ఉండిన కవితకు పునరుద్దీపనమయింది యీ కేరళకాంతనీలకాంతి. ఆమెపై ఒక కవిత రాశాడు: ‘మలబారు యువతి’ (A une Malbaraise). బహుశా యీ యువతి కలిసివుండకపోయి ఉంటే, మనకొక బోద్‌లేర్ మిగిలేవాడు కాదేమో? ఈ విషయం బోద్‌లేర్ స్వయంగా ఒకచోట రాసుకున్నాడు. బోద్‌లేర్‌లో కవిని ఆరిపోకుండా అందమైన తన అరచేతులు అడ్డంపెట్టిన యీ మలబారు మహిళకు సాహిత్యలోకం ఋణపడి ఉండవలసి ఉంటుంది.

లోకం తెలిసొస్తుందని, సాహిత్యాభిలాష వదులుతుందని పంపితే, తిరిగివచ్చిన బోద్‌లేర్‌కు కవిత్వపిపాస మరింత బలపడింది. న్యాయశాస్త్రం చదివాడుగాని న్యాయవాదవృత్తిలో ఆసక్తి లేదు. తాగుడు, వ్యభిచారం, నల్లమందు అలవాటయ్యాయి. ఖర్చులెక్కువయ్యాయి. తల్లితండ్రులు ఖర్చుపై నియంత్రణ పెంచారు. యావజ్జీవము అతడు ఆర్థికవిషయాలలో మైనరుగా ఉండవలసినట్టు ఏర్పాటు చేశారు. తల్లికి విరివిగా ఉత్తరాలు రాసేవాడు, అన్నీ డబ్బుకోసమే కావు, కాని ఎక్కువగా డబ్బు కోసమే.

అపోలినీ (Apollonie Sabatier) అనే ఒక సంపన్నుల వేశ్యపై విరహగీతాలు రాశాడు. మారీ డాబ్రీన్ (Marie Daubrun) అనే నటితో ప్రేమ వ్యవహారం నడిపాడు.

ఈ ప్రేమ వ్యవహారాల మధ్య అమెరికన్ కవి పో (Edgar Allen Poe) రచనలు బోద్‌లేర్‌ను బలంగా ఆకర్షించాయి. అతడి రచనలు చాలా అనువదించాడు, ఫ్రెంచిలోకి. పో-ను అనుకరిస్తున్నావని ఎవరో అంటే, ‘పో-ను యింతగా ఎందుకు అనువదించానో తెలుసా? పో కూడా నాలాగా రాస్తాడని తెలియడానికి’ అని జవాబిచ్చాడు బోద్‌లేర్.

1855లో Revue des deux mondesలో యితడి కవితలు 18 వరుసగా అచ్చయ్యాయి. రావలసినంత అపఖ్యాతి వచ్చింది. మరికొన్ని కవితలు కలిపి 1857లో పాపపు పూలు (Les Fleurs du Mal) కవితాసంపుటి అచ్చయింది. అందులో ఆరు కవితలు అసభ్యంగా ఉన్నాయని కోర్టు నిషేధించింది. 300 ఫ్రాంకుల జరిమానా విధించింది. (ఆ జరిమానా తరువాత 50 ఫ్రాంకులకు తగ్గించబడింది.) అప్పుడు విధించిన నిషేధం 1949 వరకు సడలించబడలేదు.

1857లో అతడి సవతితండ్రి చనిపోయిన తరువాత బోద్‌లేర్ తల్లి దగ్గర ఉన్నాడు. ఆ తరువాత అతడు కొన్ని గొప్ప కవితలు రాశాడు: యాత్ర (Le Voyage), హంస (Le Cygne) వంటివి.

1866లో తన సంపూర్ణరచనలకు ప్రచురణకర్తను వెదుక్కుంటూ బ్రసెల్స్ వెళ్ళాడు. రెండేళ్ళు ఉన్నాడు. పక్షవాతం వచ్చింది. మాట పోయింది. పారిస్ తిరిగి వచ్చి, ఒక నర్సింగ్ హోమ్‌లో దాదాపు సంవత్సరం ఉండి, అక్కడే చనిపోయాడు. 46వ ఏట (ఆగస్టు 31, 1867).

జీవితమంతా బోద్‌లేర్ చీకటి దారుల్లో వెలుతురును వెదికాడు. ఆ వెదకులాటలో, యముని మహిషపులోహఘంటలు తొందరచేస్తూనే ఉన్నాయి:

“పగలు పలుచన అవుతోంది. రాత్రి చిక్కనౌతోంది. గుర్తుంచుకో… త్వరలో మోగుతుంది ఘంట.”

Le jour décroit; la nuit augmente, Souviens-toi! …Tantot sonnera l’heure.
(L’horloge)

The day wanes; night thickens, remember! Soon will sound the hour. (The Clock)

బోద్‌లేర్ కవిత

కాళిదాసుకు కాళికాదేవి ప్రత్యక్షమమైనట్టు, బోద్‌లేర్‌కు సైతాను (త్రిలోకశాసకుడు, c’est Satan Trismégiste: Au Lecteur. To the Reader) సాక్షాత్కరించాడు. మూటగట్టి విసిరేస్తే దశకంఠుడి దర్బారులో దభీమని పడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుకాక మరి నాలుగు తలలతో మహోజ్వల సింహాసనాసీనుడై సాక్షాత్కరించాడు సైతాను. ఆ అనుభవాభివ్యక్తి పాపపు పూలుగా (Les Fleurs du Mal) గానం చేశాడు.

బోద్‌లేర్ ఆధునికత లేక నవ్యత

బోద్‌లేర్ యీ యుగంలో మొదటి ఆధునిక కవి (modernist poet) అంటారు. ఏ విధమైన ఆధునికత? వస్తువిషయంలోనా?

బోద్‌లేర్ తనను గురించి చెప్పుకున్నాడు ఒక చోట, తన స్వభావంలో సహజమైన ద్వైవిధ్యం గురించి. తనలో ఒక సగం తనను దివ్యత్వంవైపు ఆకర్షిస్తుంది; మరొక సగం తనను సైతాను పాతాళంలోకి లాగుతుంది అని. ఇందులో నవ్యత ఏమీ లేదు. మహాభారతంలో దుర్యోధనుడు తన గురించి సరిగ్గా బోద్‌లేర్ అన్నట్టే అన్నాడు: జానామి ధర్మం న చ మే ప్రవృత్తి:, జానామ్యధర్మం నచమే నివృత్తిః. (ధర్మమేమిటో తెలుసు.కాని అలా ప్రవర్తించలేను. అధర్మమేమిటో తెలుసు. కాని దానినుండి మరలలేను.) ప్రతి మనిషిలో యీ దైవాసురప్రవృత్తులు సతతము సంఘర్షిస్తూనే ఉంటాయి. ఇందులో సనాతనము అధునాతనము ఏదీ లేదు. అధునాతనమేదైనా ఉంటే అది ఆత్మవంచన. దుర్యోధనుడిలో ఆత్మవంచన లేదు. బోద్‌లేర్ నవ్యకవిత్వంలో నవ్యత అంతకంతకూ అధునాతనమవుతున్న యీ ‘ఆత్మవంచన’. కవి యీ ఆత్మవంచనను బట్టబయలుచేయడం తనతోనే మొదలుపెట్టాడు. తాను తన ధార్మికముసుగును తొలగించి, తనలోని ఆసురగుణాలను, మరికొంత మసిబూసి, ఆవిష్కరించాడు. అంతరంగమాలిన్యాన్ని బహిరంగం చేయడంలో కూడా బోద్‌లేర్ నవ్యత ఏమీ లేదు. ధూర్జటి యింత ఘాటుగాను, యింతకంటే సూటిగాను చెప్పాడు, తన శ్రీకాళహస్తీశ్వరశతకంలో: భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముఁడై/కాయల్గాచె వధూనఖాగ్రములచే గాయంబు/రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్/అమరస్త్రీల రమించినన్ జెడదు మోహంబింతయున్/తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలంగ మహోద్యోగముసేయు నెమ్మనము.

బోద్‌లేర్ పూలను పాపాలను, ఆదర్శాలను ఆగ్రహాన్ని (Spleen et ideal: Anger and ideal) కలిపినట్టే, ధూర్జటి రతిని రోతనూ కలుపుతూ కూడా ఒకే పద్యంలో చెప్పాడు: మలభూయిష్టమనోజధామము సుషుమ్నా ద్వారమో… (ఇది తాంత్రికాచారంపై చురక).

కనుక బోద్‌లేర్ నవ్యత అతని కవితావస్తువులో, అతడి ఋజుత్వంలోనూ లేదు, ముఖ్యంగా తెలుగు పాఠకుడికి. కనుక బోద్‌లేర్ తనలోని కాముకతను, యితర బలహీనతలను బట్టబయలుగా చెప్పడం కూడా నవ్యలక్షణమేమీ కాదు. మరి ఎందులో ఉంది అతడి ఆధునికత? అతడి కవితాశైలిలోనా?

బోద్‌లేర్ కాలంనాటికి ఫ్రాన్సులో ప్రచారంలో ఉన్న కవిత్వం పార్నాసియన్ (Parnassian) అని పిలుచుకున్నారు. రొమాంటిక్ కవిత్వానికి తరువాత, సింబలిస్ట్ కవిత్వానికి ముందు, యీ ఉద్యమం మధ్యలో రాజ్యం చేసింది. ఈ ఉద్యమనినాదం కళ కోసమే కళ. దీనిలో ప్రముఖుడు గోతియెర్ (Theophile Gautier). ఇతడికే బోద్‌లేర్ తన పాపపు పూలు అంకితం యిచ్చాడు. (wizard of words అన్నాడు: Au Poete impeccable, Au parfait magicien es lettres françaises, A mon très-cher et très-vénéré Maitre et ami. To the impeccable Poet, To the perfect magician of French literature, To my very dear and very esteemed master and friend) ‘సిద్ధుడైన సాహిత్య మాంత్రికుడు’ (parfait magicien es lettres); నిజానికి ఆ మాట బోద్‌లేర్ విషయంలో మరింత నిజం.

ప్రతీకత ఉద్యమంగా (symbolism) బోద్‌లేర్‌తో మొదలైందనవచ్చు. కనుక, ఆ విధంగా అతడు ఆధునికుడు అనవచ్చు. కాని సింబలిజమ్, భాష పుట్టినప్పుడు పుట్టింది, భాషతో పుట్టింది. ఇంకా చెప్పాలంటే, భాష పుట్టకముందు పుట్టింది, సంకేతాలతో (sign language).

అధునాతనమా సనాతనమా అన్న చర్చ వదిలేసి బోద్‌లేర్‌ను ఒక కవిగా చూడడం ప్రయోజనకరం. ఏ రచయిత విషయంలోనైనా యిదే నిజం. ఎందుకంటే, విషయంలో కొత్తదంటూ ఏమీ ఉండదు. అత్యంత అధునాతనము, విప్లవాత్మకము అన్న భావాలు చరిత్ర అట్టడుగునుండి తీసి చూపవచ్చు. విషయంలాగే విధానం కూడా. కాకుంటే, విషయంలోనూ విధానంలోనూ ఆలోచనలు సరళరేఖలా తిన్నగా ముందుకు వెళ్ళవు, ముందుకు వెనక్కు సాగుతూ ఉంటాయి. కొంత కాలం స్వేచ్చ మనిషిని నడిపిస్తుంది. దాని తరువాత నియతి కొంతకాలం నడిపిస్తుంది.

బోద్‌లేర్ రొమాంటిక్ కవిత్వాన్ని దాటి చాలా వెనక్కు వెళ్ళాడు. అరిస్టాటిల్ ఆదేశించిన సంస్థానము (structure), సౌష్టవము (symmetry) యితడి కవిత్వంలో ప్రధానగుణాలు. అలా అని రొమాంటిక్ గుణాలు యితన్ని ఆకర్షించలేదు అనలేము కూడా. హ్యూగో, నేర్వాల్‌ల ప్రభావం నుండి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యంకాదు. కాని ఆంగ్ల సాహిత్యంలో స్వేచ్చ, ఫ్రెంచి సాహిత్యంలో నియతి ప్రబలతత్త్వాలు అనవచ్చు. ఒక షేక్స్‌పియర్ ఫ్రాన్సులో సాధ్యం కాడు, ఒక రాసీన్ (Racine) సాధ్యం. ఫ్రాన్సులో స్వేచ్చాతత్త్వం ప్రధానంగా రాజకీయాలకు పరిమితం అయింది. వారి సాహిత్యంలో నియతి ప్రధానం. భావంలో స్వేచ్చ, భావవ్యక్తీకరణలో నియతి ఫ్రెంచ్ స్వభావం అనవచ్చు. పార్నాసియన్ ప్రభావం బోద్‌లేర్‌పై ఎక్కువగానే ఉంది. కనుక అతడిది పార్నాసియన్ స్పూర్తితో సాగిన సింబలిస్టు రచన.

బోద్‌లేర్ కవిత్వరథం నడిపేటప్పుడు, పగ్గాలు వదలడు. రథం రేఖా మాత్రం కూడా దారిపక్కకు పోలేదు. ఎక్కడా రథగతిలో కుదుపు ఉండదు. సుఖంగా, అంతకంతకూ స్థిరంగా కవిత ముగింపు వైపుకు సాగుతుంది. అలా అని ఛందస్సు కోసం కానీ మరి దేనికి కానీ ఒక్క పదం అదనంగా వచ్చి చేరలేదు. కవిత్వరచనలో బోద్‌లేర్‌ది అబ్బురపరిచే కౌశలం, అధికారం. బోద్‌లేర్ భావంలో స్వేచ్చ కాదు, అరాజకం. కాని కూర్పులో కఠిన క్రమశిక్షణ. అయినా మాంత్రికతే కాని యాంత్రికత కాదు.

కనుక మనం చూడవలసినది నవ్యత కాదు, కవిత్వం. కవిత్వం కావడమే నవ్యత. నవ్యం కాని కావ్యం నిలబడదు. నిలబడింది అంటే, అది ఆధునికమే (modernist).

కాల్పనికకవి బోద్‌లేర్

భావంలో భావకవి కానివాడు కవి కాడు. భావకవిత్వమంటే మనిషి పోగొట్టుకున్న స్వర్గం కోసం పరితాపం. ఈ లోకం ఒక కంటకభూమి; దీనిని వదిలి పైకి, చాలా చాలా పైకి, ఎగిరిపోవాలి, అక్కడ తన స్వర్గం తాను కల్పించుకోవలె. ఆ కల్పనే కాల్పనికత:

Oh, lift me as a wave, a leaf, a cloud! I fall upon the thorns of life! I bleed! (West Wind – Shelley);
Higher still and higher/From the earth… Like an unbodied joy whose race is just begun (Skylark – Shelley)

That I might drink, and leave the world unseen,
And with thee fade away into the forest dim:

Fade far away, dissolve, and quite forget
What thou among the leaves hast never known,
The weariness, the fever, and the fret: (Ode to a Nightingale – Keats)

ఈ ముళ్ళ నేలను (the thorns of life), అల్పదేహపరిమితులను (unbodied joy) దాటి, అపరిమితాన్ని అందుకోవాలన్న ఆర్తి ఉన్నవాడే కవి. యో వై భూమా తత్సుఖం. నాల్పే సుఖమస్తి (ఛాం.ఉప.7.13.1). ఆ ఆనంత్యం కొరకు ఆర్తి (gout de l’infini: longing for the infinite) కవిత్వానికి ఆత్మ, రూపం మారుతుంది. ఆత్మ మారదు. భావం మారదు, శిల్పం మారుతూంటుంది. బోద్‌లేర్ భావంలో కాల్పనికకవి, శిల్పంలో సింబలిస్టు. శిల్పంలో కూడా బోద్‌లేర్ రెండు విభిన్న రీతులను మేళవించాడు; ప్రాచీనకవుల నియతి (Classicism), అధునాతనుల పదప్రయోగం (Diction); రాసీన్ (Racine) నియతి, పో (Poe) విధానం.

అయితే, యీ ఆనంత్యం కొరకు ఆర్తిలో అంతర్నిహితమై ఒక కొత్త ధర్మం కొరకు అన్వేషణ కూడా ఉంటుంది. ప్రయోజనం లేనట్టున్న యీ సృష్టికి ఒక అర్థము పరమార్థము కల్పించే బాధ్యత కవిపై ఉంది. బోద్‌లేర్ కవితలో ఆ బాధ్యత తలకిందులై కనిపిస్తుంది. అతడు వర్ణించే పాపం, అధర్మం పుణ్యం కొరకు, ధర్మం కొరకు తలకిందుగా చేసిన తపస్సు. ఈ తలకిందులే అతణ్ణి అధునాతనకవిని చేసింది, పూర్తిగా అపార్థం చేసుకోడానికి, అవమానించడానికి కూడా కారణమయింది. బోద్‌లేర్ అనుభవంలోకి రాని దానిపై నమ్మకాన్ని నటించడు, ఆత్మవంచనను సహించడు.

సాధారణంగా కాల్పనికకవులు అని చెప్పుకునేవారికి బోద్‌లేర్‌కు ఒక ప్రధానభేదం గమనించాలి. కాల్పనిక కవులు, నేలమీద నిలవలేరు. అది ముళ్ళ నేల: (the thorns of life: Shelley). బోద్‌లేర్ తన పూలకోసం, ముళ్ళను వదలడు. పూవుకు ముల్లుంటుంది. ముళ్ళను వదిలి పూలు మాత్రమే ఆమోదించగలము అని అనుకోడు బోద్‌లేర్.

నిజమైన అన్వేషణ ఒక గమ్యం కొరకు కాదు. దేనినో వెదకుతూ తెలియని సముద్రాలలో సాహసయాత్రలు చేసే యులిసిస్‌లు కాదు, ఎగరకుండా ఉండలేక సముద్రాలపై ఎగిరే ఆల్బట్రాస్ (L albatros), బోద్‌లేర్‌కు ఆదర్శం. హంస నడక నడకకొరకే, ఆల్బట్రాస్ ఎగరడం ఎగరడం కొరకే. వాటికి వేరు ప్రయోజనం లేదు.

బోద్‌లేర్, డాంటే

 
డాంటే ప్రభావం లేని యూరపియన్ రచయిత లేడంటే అతిశయోక్తి కాదు. ఊహించని చోటుల్లో కూడా డాంటే ప్రభావం ఉంటుంది. బోద్‌లేర్‌పై డాంటే ప్రభావం చాలానే ఉంది. డాంటే నరకదర్శనంలో అతడి ధర్మాభిరతి నిగూఢం. కాని బోద్‌లేర్ నరకం దైవం విధించిన శిక్ష కాదు. ధర్మసంబంధం సడలడమే నరకం, అందుకు శిక్ష కాదు. బోద్‌లేర్‌కు నగరమే నరకం: జనసమూహాల నగరం, కలలు నిండిన నగరం: Fourmillante cite, cite pleine de réves: (Les Sept vieillards) teeming city, city full of dreams. బోద్‌లేర్ కలలు, డాంటే నరకవాసుల ‘నిట్టూర్పులకు’ అనువాదం: The only lamentations were the sighs/Yet they made the eternal air tremble… They did not adore God as he should be adored (Infeno: 4,25,37). ఎలియట్ అసత్యనగరానికి (unreal city), డాంటే సత్యనగరానికి (d’una vera citta: (Purg. 13.94-96: true city) నడుమ బోద్‌లేర్ కలలనగరం (cite pleine de réves: city full of dreams).

ధర్మానికి పట్టాభిషేకం చేయడం డాంటే ధర్మదర్శనంలో భాగం, మహాభారతంలో శ్రీకృష్ణుడికిలాగ: కిట్టుదు కర్ణశల్యులను కీటములం కరతాడనంబులన్… ధర్మజుంగట్టుదు పట్టము… (కర్ణపర్వము). డాంటే లాగా బోద్‌లేర్ రాజకీయాలను ఆశ్రయించడు. బోద్‌లేర్ ప్రయాణం ఆశలు లేనిది. అతడు పారిపోయేది నగరం నుండి, నగరంలోకి కూడా. ఇది అతడి కవిత్వంలో పెద్ద ద్వైవిధ్యం.

భౌతికవాది ఆత్మను కాదంటాడు, ఆత్మవాది భౌతికాన్ని కాదంటాడు. రెండు వాదాలు కూడా సగం సృష్టిని వదిలేస్తున్నాయి. కనుక ఏ ఒకటి పూర్ణంకాదు. రెంటి సంయోగమే గీత చెప్పిన యోగం: మమ యోనిర్మహద్రృహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్… (14.3: క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి: శంకరభాష్యం). ఈ సంయోగమే అరవిందయోగి చెప్పే పూర్ణయోగం (Synthesis of Yoga). బోద్‌లేర్ యోగి కాడు, కాని కవిగా అతడు దర్శించింది యీ పూర్ణయోగమే. అతడి తపన యీ పూర్ణతకొరకే. అతడు భౌతికాన్ని కాదనలేడు, ఆత్మను వదులుకోలేడు. అతని కవిత్వమంతా ఆ సంయోగం కొరకు తపన.

కవులు సాధారణంగా రెంటిలో ఒకదానిని మాత్రమే పట్టుకుంటారు. బోద్‌లేర్ దేహాన్ని వదలకుండా ఆత్మను, ఆత్మను వదలకుండా దేహాన్ని పట్టుకునే ప్రయత్నంచేశాడు. ఆ ప్రయత్నంలో, సాధారణంగా కవులు ధరించే ధార్మికమునుగును తీసి పారేశాడు. ముసుగుకు అలవాటుపడ్డ పారకులు అతడిని సహించలేకపోయారు. అతడు సైతాను సృష్టిలో భాగం. సృష్టికర్తను నమ్మితే అతడి సృష్టిని, సృష్టిలో భాగమైన సైతానును కూడా ఆమోదించవలె. లేడని కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోడు సైతాను.

చీకటిని చీకటి అని తెలిసినవాడు మాత్రమే తమసోమా జ్యోతిర్గమయ అనగలడు. ఆ చీకటే బోద్‌లేర్ కవితనిండా. మరో విధంగా చెప్పాలంటే వెలుగు కొరకు ఆర్తి. ఆ వెలుగు కలిగినపుడు యిక చీకటి చీకటిగా ఉండలేదు. అప్పుడు చీకటి వెలుగులు రెంటినీ దాటిన వెలుగు కాని వెలుగు. ఆ వెలుగు కాని వెలుగును లీలగానైనా అనుభవించనివాడు ‘పాపపుపూలు’ రాయలేడు. ఆ వెలుగుకాని వెలుగులో దొంగ, దొర కూడా శివస్వరూపమే. వృక్షాణాం పతయే నమో నమో (నమకం రెండవ అనువాకము); స్తేనానాం పతయే నమో నమో; నిషౙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో; వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో నమో (మూడవ అనువాకము).

హాలాహలాన్ని అమృతంలా సేవించగలగాలి అంటాడు బోద్‌లేర్: ‘శుభ్రలోకాలను నిండిన స్వచ్ఛాగ్నిని అచ్చమైన అమృతంలా తాగు.’

Et bois, comme une pure et divine liqueur,
Le feu clair qui remplit les espaces limpides
(Elevation.)

And drink, like a pure and divine liquor,
The clear fire that fills the limpid spaces.

ఆ అమృతహాలాహలం గుటకలో అతడికి సత్యం మెరుపులా మెరిసి, చీకటి వదిలిపోతుంది:

Un éclair… puis la nuit! – Fugitive beauté…

A flash then the night— Fugitive beauty…

ఇది చదివిన తరువాత, కేనోపనిషత్తు స్మరణకు రాదా? స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానాముమాం హైమవతీం… యదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇతీన్నయమీమిషదా…

ఆ ఇంద్రుడు అదే ఆకాశంలో బహుశోభమాన, స్వర్ణాభరణ భూషిత, అయిన ఒక స్త్రీని చేరెను… మెరుపువలె కనురెప్ప తెరచి మూసినట్టు… (కేన.3.3.12;3.4.4.)

దివ్యానుభవం యిలా మెరుపులా మెరిసి, బోలెడు చీకటి వదిలిపోతుంది. బోద్‌లేర్ కవితలను పరచుకున్న చీకటి, ఆ దివ్యానుభవతటిత్తు వదిలి వెళ్ళినదే.


కవితలో విషయం కొంత చర్చించాం. తిరిగి రూపం వైపు చూపు పెడదాం, సింబలిస్టు కవిత రూప ప్రధానం కనుక. సింబలిస్టు కవితను నిర్వచించే ప్రయత్నం చేయను. ఎందుకంటే, కవిత, ఏ పేరు పెట్టుకున్నా, ఏ నిర్వచనానికీ లొంగదు. దానికి నిదర్శనం, ఏ యిద్దరు సింబలిస్టు కవులు ఒకే సూత్రంమీద నడవరు. మలార్మే (Mallarme), బోద్‌లేర్‌లు యిద్దరూ ఫ్రెంచి సింబలిస్టు కవితోద్యమానికి ఆద్యులంటారు. కాని, వీరిలో సాదృశ్యం కనిపించదు. (సాదృశ్యమంటే, అనుసరణ, అనుకరణ కానవసరంలేదు.)

సింబలిస్టు కవితా లక్షణాలు ప్రధానంగా రెండు చెబుతారు. ఒకటి, యిందులో కనిపిస్తున్న వస్తువు ప్రధానం కాదు. అది స్ఫురింపజేసే అర్థం ప్రధానం. ఆ అర్థం స్పురించేవిధంగా వస్తువర్ణన చేయవలె. రెండు, ఒక్క వ్యర్థపదమూ ఉండకూడదు; ప్రతిపదమూ కవితావస్తువును ఆవిష్కరించేదిగా ఉండాలి. (ఇవి ఒక్క సింబలిస్టు కవితకే లక్షణాలని చెప్పవచ్చా? ఈ రెండు ఏ కవిత్వానికైనా ప్రాణమే.)

పద్యంలోని పద ప్రయోగం ఆ వస్త్వావిష్కార ప్రయోజనంతో సాగవలె. వస్తువును వదిలి, తత్త్వం చెప్పడం కాదు. వస్తువర్ణన బలంమీద తత్త్వం నిలవాలి. వస్తువును వర్ణించే ప్రతి పదమూ కవితలోని తత్త్వాన్ని చెప్పాలి. అంటే తత్త్వం సాకారం కావాలి. ఆత్మ నిత్యమ్మకాలాద్యవిచ్ఛిన్నంబుతో (రామాయణకల్పవృక్షము) మొదలు కాదు. ఆ ఆత్మకు కళ్ళు కాళ్ళు చేతులు అమర్చాలి. అప్పుడే తత్త్వం అవతరిస్తుంది కవితలోకి. ఇదే రూపం (form). విషయం కూడా రూపమే (Content too is form). ఆలంకారికులు చెప్పే ధ్వన్యర్థం వాచ్యార్థబలంమీద ఆధారపడుతుంది. గుడ్డివాళ్ళు ముందు గుడ్డివాళ్ళుగా కనిపించాలి. వాళ్ళచేష్టలు, రూపము వాస్తవంగా వర్ణించాలి. ఈ కవితలో కనుగుడ్లు తిప్పడం, కళ్ళు ఎప్పుడూ పైకి చూస్తున్నట్టుండడం, వాళ్ళ స్వాభావికవర్ణన. ఈ వాస్తవవర్ణన లేకపోతే, సింబలిస్టు కవిత పౌండ్ (Ezra Pound) అభియోగానికి తగినట్టు, బీజగణితంగా మారిపోతుంది (x = y గుడ్డివాడు = ఋషి). అంటే, ఒక వస్తువునో సన్నివేశాన్నో ఎన్నుకొని, దానికి చిత్రరూపం యివ్వాలి. సింబలిస్టులు విమర్శించిన సహజత్వం, వాస్తవత వాచ్యార్థంగా ఏ కవితకైనా బలమైన ఆధారం. ఆ వాచ్యార్థబలం మీద ఏ కవితనైనా నిలపవచ్చు. అంటే, పౌండ్ చెప్పే ‘చిత్రం’ (image) సింబలిస్టు కవితకు ఆధారం, సింబలిస్టు కవితకు కూడా యిమెజిస్ట్ కవితకు మాత్రమే కాదు. అంటే, కనిపించని తత్త్వానికి కనిపించే రూపం వాచ్యార్థం.

Imagiste కవిత్వం గురించి (పౌండ్ ఫ్రెంచి పదాన్నే వాడుతాడు) పౌండ్: Use no superfluous word, no adjective, which does not reveal something. ఈ పదాల పొదుపు, హైకూ వంటి మినీ కవితల్లో పౌండ్ ప్రసిద్ధ కవితలో సాధ్యం కావచ్చు. కాని, దీర్ఘ కవితల్లో సాధ్యం కాదు.

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough – Pound: In a station of the metro)

గుడిగంటపై
నిద్రకొరిగిన
పురుగు. (Buson)

బోద్‌లేర్ ఫ్రెంచికవిత్వ చరిత్రలో ఒక కొత్త యుగానికి ప్రవక్తగా ప్రసిద్ధుడు. అతనిది ఒక కొత్త స్వరం. అపస్వరం అని కూడా అన్నారు. అపూర్వస్వరం అపస్వరంగా వినిపించక తప్పదు. అది ఒక మహాకవికి, ఒక యుగకవికి అవసరమైన కావ్యప్రక్రియ. యుగకవి ఒక కొత్త వాణితో బాణితో తనను తాను ప్రకటించుకుంటాడు. కాని మహాకవి ధర్మం అతనిని వదలదు. అతడు సిఫిలిజేషన్ చెప్పబోతే అది సివిలిజేషనవుతుంది. కోతిని గీయబోతే అయ్యవారవుతుంది. దయ్యాన్ని ఆవాహన చేస్తే దైవం సాక్షాత్కరిస్తుంది. కావ్యధర్మం అంటూ ఒకటి ఉంటుంది. అది కవిపై, మహాకవిపై మరీ బలంగా, తన బలాన్ని చూపుతుంది. ఈ కవిధర్మం కవిపై ఎంతగా విజయం సాధించగలిగితే, కవిత అంతగా పరిపుష్టమైనట్టు. ఆ పరిపుష్టిని భారతీయదృష్టితో చూసి చేసిన వ్యాఖ్య యిది. బోద్‌లేర్ కవితలు కొన్నిటికి విపులమైన విశ్లేషణ యీ పుస్తకం.


పేరు: ప్రకృతి ఒక ఆలయం: షార్ల్ బోద్‌లేర్ (2019).
ప్రచురణ: ఆథర్స్ ప్రెస్, న్యూఢిల్లీ.
వెల: 495 రూ. (25$)
ప్రతులకు: authorspressgroup@gmail.com, : www.authorspressbooks.com