ది వేస్ట్‌ లాండ్: 2. బరియల్ – మొదటి దృశ్యం

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


1. The Burial of the Dead

వేస్డ్‌ లాండ్‌కు మొదట ఎలియట్ పెట్టదలచిన పేరు, He do the police in different voices. ఈ వాక్యం డికిన్స్ నవల బ్లీక్ హౌస్ (Bleak House) లోది. మా పిల్లవాడు వేరు వేరు గొంతులు అనుకరించగలడు’ అని ఆ పిల్లవాడి పెంపుడు తల్లి చెప్పిన వాక్యం. గొంతులు వేరుగాని, మాట్లాడే వాడు ఒకడే. అట్లాగే, ఈ కావ్యంలో కూడా అనేకుల గొంతులు వినిపిస్తాయి. వినిపించని గొంతు ఎలియట్‌దే. April is the cruelest month అంటున్నది ఎలియట్ కాదు. నాటకంలో నాటకరచయిత మాట్లాడడు కదా? (Life is a tale told by an idiot అన్నది మేక్‍బెత్, షేక్స్ పియరు కాదు కదా!) కాని అందరి మాటలు నాటకకర్తవే. వేస్ట్‌ లాండ్‍లో రచయిత స్థానం టైరీసియస్ అనే పాత్ర వహిస్తాడు. అలా అంటే, అన్ని పాత్రలలో టైరీసియస్ కూడా, నలుగురిలో నారాయణలా, ఒక పాత్ర అని అర్థం కాదు. అన్ని పాత్రల జీవితసారం టైరీసియస్. అదే అంటాడు ఎలియట్, వేస్ట్ లాండ్‍కు చివర యిచ్చిన నోట్స్‌లో: Tiresias, although a mere spectator and not indeed a ‘character’, is yet the most important personage in the poem, uniting all the rest… . What Tiresias sees, in fact, is the substance of the poem.’

కనుక, వేస్డ్‌ లాండ్‌లో ఏ గొంతు ఎవరిది అని అడుగడుగునా అడుగుతూ చదవాలి. మరి ఆ మొదటి మాటలు ఎవరివి? ఎనిమిదో పాదంలో మరీ (Marie) అనే ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది (Summer surprised us’). ఆ మరీయే, మొదటి ఏడు పాదాల నాందీ పద్యం కూడా చదివిందనుకోవాలా? అలా అనిపించదు. మరి, ఎవరి మాటలు? అవి పురుషుడి మాటలా, స్త్రీ మాటలా? మాట్లాడుతున్నది ఒకరా, బృందమా? ఈ నాందీ వాక్యాలు,వేస్డ్‌ లాండ్‌ నాటకకావ్యారంభంలో కోరస్ వంటివి అనుకోవచ్చా? ఈ కోరస్, ఎలియట్ రాయబోయే పద్యనాటకాన్ని సూచిస్తోంది కూడా:

Ruinous spring shall beat at our doors;
… …
Yet we have gone on living,
Living and partly living. (Chorus in Murder in the Cathedral)

ది వేస్డ్‌ లాండ్‌ మొదలు పెట్టిననాటికే ఆ నాటకం అతని మదిలో కదులుతూ ఉండి ఉండవచ్చు. ఇక్కడ కూడా కాంటర్బరీ యాత్ర స్మరణ ఉంది కదా? వసంతదూషణము (Ruinous spring), జీవన్మృత్యువు (Living and partly living) అక్కడా యిక్కడ కూడా విషయాలు. ఇక కావ్యంలో ప్రవేశిద్దాం.

మొదటి దృశ్యం

వేస్డ్‌ లాండ్‌ లోని యీ మొదటి భాగాన్ని నాలుగు దృశ్యాలుగా (scenes) పరిశీలిద్దాం.

ఆదిలో ఆదికవి చాసర్ స్మరణ:

ఈ మొదటి దృశ్యంలో కూడా రెండు గొంతులు (he do the police in different voices) వినిపిస్తున్నాయి (1-7; 8-18):

కావ్యప్రారంభంలోనే ఎలియట్ అనాదిగా వస్తున్న కవిసమయాన్ని తలకిందులు చేశాడు. వసంతశోభను వర్ణిస్తూ వసంతానికి కవితాహారతి యిచ్చి ఆహ్వానించడం కవిసంప్రదాయం. ప్రకృతిశోభతో జీవితాలలో నూతనోత్సాహాన్ని తెస్తుంది వసంతం. ఆంగ్లసాహిత్యానికి ఆదికవి అనదగిన చాసర్ (Geoffrey Chaucer) తన కాంటర్బరీ కథలు ఏప్రిల్ స్తుతితోనే మొదలుపెడతాడు:

When that April with his shoures soote
The droghte of March hath perced to the roote,
And bathed every veyne in swich licour
Of which vertu engendred is the flour;

తీయని ఏప్రిల్ జల్లులు, మార్చి నెలలో ఎండిన నేల లోపలికి యింకి, వేళ్ళను తడిపి, నరనరాలలో రసం నింపుతాయి. (భూగర్భంలో నుండి) పూవు పుట్టుకొస్తుంది.

ఈ నాలుగు పాదాలలో చాసర్ వాడిన ప్రతి పదము దగ్గరగా పరిశీలించదగినదే. చలి వదిలి, జీవితాలలోకి వెచ్చదనం పచ్చదనం వస్తున్న సమయం. ప్రకృతికి, ప్రతి ప్రాణికి సంతోషాన్ని కొత్త జీవనోత్సాహాన్ని తెచ్చే కాలం. అందరూ ఆనందంగా ఆహ్వానించే ఏప్రిల్. చాసర్ కేవలం ఏప్రిల్ జల్లులను, వసంతశోభను వర్ణిస్తున్నాడా? కాదనిపిస్తుంది. అంతకంటే చాలా చెబుతున్నాడు.

– When that April: ఇక్కడ that లేకపోతే ఏమవుతుంది? ఉండి ఏం చేస్తోంది? that April అనడంలో ‘ఈ వసంతం యీనాటిది కాదు, యిక్ష్వాకులనాటిది, యింకా ముందుది’ (నా అగ్నిమీళే) అంటోంది. అనాదిగా అందాన్ని ఆనందాన్ని తెస్తున్నది అని, వర్తమానాన్ని గతంతో కలుపుతున్నది. కాలమనే పూలమాలలో ఈ ఏప్రిల్‌ను మరోపూవుగా కూరుస్తున్నది, that అనే ఆ పదం. ఆ that లేకపోతే, ఈ ఏప్రిల్, యీ వసంతం, హారంనుండి తెగి రాలిన పూవవుతుంది. గతంతో తన బంధం తెగి విడిపోతుంది. సంప్రదాయం ఛిన్నమవుతుంది. that April అనడంలో, యీ ఏప్రిల్, కాలగతిని చరిత్రను సంస్కృతీసంప్రదాయాన్ని తెగకుండా నిలుపుతోంది, తనలో కలుపుకుంటోంది.

– showers sweet: తీయని జల్లులు. జల్లులో తడుస్తూ ఎవరైనా ‘తీయగా’ ఉన్నాయి, అంటారా? తాగే, తినే జల్లులు కావు కదా? తీయగా అంటే, ఏమర్థం యిక్కడ? తీయదనం రసనేంద్రియవిషయం కాదు. అంతే కాదు, ఏ ఒక్క యింద్రియవిషయమూ కాదు. ఈ తీయదనం, స్త్రీపురుషసమాగమంలోని సర్వేంద్రియసుఖానుభూతికి విశేషణం. భూసేచనము, భూసతినిషేకము, రెంటినీ ధ్వనిస్తున్నాడు చాసర్. తీయదనం జల్లులది కాదు, అవి యిచ్చే అనుభూతిది.

– pierced to the root: మార్చి నెల గాలులకు (drought), వేళ్ళు వాడి వడలినాయి. నేలను చీల్చుకొని (pierce) ఆ వేళ్ళ వరకు వాననీరు యింకి, వాటిని తడిపి జీవనస్పర్శనిస్తున్నాయి.
మూలాలను కాపాడుకుంటేనే ఏ ప్రాణికైనా జాతికైనా మనుగడ.

– bathed every vein in such liquor: నరనరము నఖశిఖము నింపి, అని. ఏ ఒక్క యింద్రియాన్నో తృప్తి పరచడం కాదు. సర్వేంద్రియతోషణం. ఏ ఒక్క యింద్రియాన్ని ఉద్దేశించనప్పుడు, ‘ప్రాణం సుఖంగా ఉంది’ అంటాం. అటువంటి ప్రాణతోషణం. దేహస్పృహ వదిలిన ఆత్మానందసదృశస్థితిని చెబుతున్నాడా, అనిపిస్తుంది. (తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో న బాహ్యం కంచన వేద నాన్తరం – బృహ. ఉప. 4. 3. 21.) ప్రాణమే రసప్లావితం అయింది ఆ జల్లులో.

– such liquor: అటువంటి రసం. ఎటువంటి రసం? engendered is the flower: జననసామర్థ్యంకల రసం. భూగర్భంలో దాగిన పూలను బయటికి తేగల్గిన రసం. స్త్రీపురుషసమాగమసుఖం మాత్రమే చెప్పడం లేదు, సారసంసారాన్ని, సంసారసాఫల్యాన్ని కూడా చెబుతున్నాడు చాసర్.

– virtue: ఈ పదం రెండర్థాలలో ప్రయోగిస్తారు. 1. moral excellence 2. by (in) virtue of: on account of or by reason of. చాసర్ యిక్కడ యీ పదాన్ని ఆ రెండర్థాలలోను ప్రయోగిస్తున్నాడు. ఆ సారసంసారము, సాఫల్యము ఉన్నపుడే, ఉన్న కారణంగానే, స్త్రీపురుషసమాగమం గుణం – virtue – అవుతుంది. అది లేని సంసారం నిష్ఫలం. యాంత్రికమైన దైహికసమాగమం, విగుణం (vice).

మన ఆదికవి:

భువికి దివికి శోభనం. నన్నయ కూడా యిటువంటి వర్ణన చేశాడు.

ఖరకిరణతాపముననురు
తరదవదాహమున శోషితములైన వనాం
తరతరుతతికాప్యాయన
కరమై వర్షాగమంబు గడుబెడగయ్యెన్. (ఆంధ్రమహాభారతం: అరణ్యపర్వం. 4. 134.)

[ఆప్యాయ(న)ము = తృప్తి; బెడగు:అందము]

‘భూసతికిం దివంబునకుబొల్పెసగంగ శరత్సమాగమంబాసకలప్రమోదకరమై విలసిల్లె… (141): వర్షాగమము (showers sweet), శరదాగమము రెంటిలోను భువికి దివికి జరిగే సమాగమం వర్ణిస్తున్నాడు నన్నయ. ఆ సమాగమం తరుతతికి సకలసృష్టికి ఆప్యాయనకరము, ప్రమోదకరము.

ఎలియట్ కవిత చదవడానికి చాసర్‌ను, నన్నయ్యను యింతగా పరామర్శించాలా? అవును, వేస్ట్‌ లాండ్‌లో తన నిర్వేదమేమిటో తెలియవలె కదా?

తన మొదటి నాలుగు పాదాలలో చాసర్ ఏం చెబుతున్నాడు? ప్రకృతిశోభ, శోభనం చెబుతున్నాడు. వసంతాగమనంతో, స్త్రీపురుషులలో నవచైతన్యము నూత్నోత్సాహము కలుగుతున్నాయి. చలి వదిలింది. దుప్పటిముసుగులు తొలగించి కార్యోన్ముఖులు అవుతున్నారు జనం. నవచైతన్యం కలుగుతుంది, ఐహికము దైహికము పారమార్థికము కూడా. ఉత్సాహంగా సంసారం సాగించాలి. పనులు మొదలు పెట్టాలి. తీర్థయాత్రలు చేయాలి. ఆపదమొక్కులు తీర్చుకోవాలి కదా? (కాంటర్బరీకి తీర్థయాత్రకు వెళుతూ, దారిలో కాలక్షేపానికి ఒక్కొక్కరు చెప్పే కథలే కాంటర్బరీ కథలు. తీర్థము, స్వార్థము, సంప్రదాయపు మూలాలు వదలకుండా, యిహపరాలను కలిపి పేనుకున్న చైతన్యమది. ఏప్రిల్ నెలకు పరిమితమైన చైతన్యం కాదు. సంవత్సరానికంతా సరిపడ చైతన్యం సృష్టించే నెల అది. వసంతమైనా వర్షమైనా శరత్తైనా శిశిరమైనా, అన్ని పెట్టెలను లాగే రైలు ఎంజిన్ ఏప్రిల్.

సంప్రదాయమూలాలు ఎండి పోతున్నాయి అన్న నిర్వేదంలో సాహిత్యసంప్రదాయమూలాలు కూడా ఉన్నాయి. సాహిత్యం తన మూలాలను విడిచి మనలేదు, ఏ కవీ తాను చెప్పదలచుకొన్నది, స్వతంత్రంగా సంప్రదాయనిరపేక్షంగా చెప్పలేడు, (No poet has his meaning alone అన్నది ఎలియట్ ప్రసిద్ధవాక్యం.) చాసర్ కావ్యప్రారంభపాదాలను ఎలియట్ తన కావ్యప్రారంభంలోనే, గుర్తు చేయడంలో ఈ ప్రయోజనం కూడా సిద్ధిస్తున్నది. సాహిత్య మూలాలను ఉపేక్షిస్తే (dull roots) సాహిత్యం బీడుగా మారుతుంది.

అంతే కాదు. ఎలియట్ కవిగా తన భయాన్ని కూడా యిందులో చేరుస్తున్నాడని అనుకోవచ్చు. తన కవితాధార ఎక్కడ ఎప్పుడు ఆగిపోతుందోనన్న భయం ప్రతి కవిని వెంటాడుతూనే ఉంటుంది. ఎలియట్ కవితలో కూడా యీ భయం చాలాచోట్ల వ్యక్తమవుతుంది. ఈ కావ్యప్రారంభవాక్యాలు (dull roots, dried tubers) కావ్యసృజనశక్తిని జననశక్తితో ఏకం చేసి, ‘సృజనన’ శక్తిగా ధ్వనిస్తున్నాయి అనుకోవచ్చు.

సంప్రదాయాన్ని నిలపడమంటే, గుడ్డిగా అనుసరించడము, అది వట్టిపోయేదాకా దాన్ని పిండుకోడమూ కాదు. దానిని నిలపడం, మరింత పరిపుష్టం చేయడం, దానికి కొత్తదనం సంపాదించడం. ఎలియట్ చాసర్‌ను వాడుకున్న తరువాత, ఎలియట్ ప్రయోజనం నెరవేరడమే కాదు, చాసర్ వాక్యాలకు కొత్త జీవము కొత్త అర్థము కలుగుతాయి. Burial of the Dead చివరి భాగంలో ఎలియట్, దాన్తె వాక్యాన్ని యథాతథంగా వాడుకుంటాడు: I had not thought death had undone so many (మృత్యువు యింతమందిని కాజేసిందనుకోలేదు). లండన్ బ్రిడ్జిపై నడుస్తున్న జనాలనుద్దేశించిన యీ ఎలియట్ మాటలు, దాన్తె కావ్యంలో నరకానికి కొత్త అర్థం యిస్తాయి. సంప్రదాయంలో ఆదాయం కూడా ఉంటుంది. The existing order is complete before the new work arrives; for order to persist after the supervention of novelty, the whole existing order must be, if ever so slightly, altered (Tradition and the Individual Talent: Eliot).

మొదటి పాదంలోనే ఎలియట్ అనాది కావ్యసంప్రదాయాన్ని, కవి సమయాన్ని తలకిందులు చేశాడు. నవ్య కవితావిర్భావాన్ని (modernist) ప్రకటించాడు. ప్రకృతికి కొత్త అందాలను ప్రాణులకు కొత్త ఆనందాన్ని తెచ్చే ఏప్రిల్, అన్ని నెలలకంటే అతిక్రూరమైనది అంటున్నాడు. ఎందుకట? వసంతపు జల్లులు, నిర్జీవమైన నేలలో (dead land) లైలక్ పూలు పూయిస్తున్నాయట! ప్రాణులకు, మృత్యుశైత్యంలో ఏమీ తెలియలేదు. మెలకువ రాగానే ఏవో తీయని జ్ఞాపకాలు తీరని కోరికలు కూడా మేలుకుంటాయి! అవి తలపుకు వస్తే బాధ! మళ్ళీ ఆ చలి, వెచ్చని దుప్పటి మేలనిపిస్తుంది (winter kept us warm). జీవితాన్ని జడత్వం కప్పేసింది దుప్పటిలా, శిశిరాన్ని మంచులా (covering /Earth in forgetful snow). ఏ పని చేయడానికి కోరిక ఉత్సాహం లేవు. నిశ్చేతనంగా పడి ఉండడంకంటే, పాపం చేయడమైనా మేలే. పాపం! పాపం చేయడానికి కూడా చైతన్యం లేదు. స్మృతి, కోరిక కుమ్మక్కై (mixing memory and desire) వేధిస్తున్నాయి.

మరీ:

మరీ (Marie) ఫ్రెంచి పేరు. ఫ్రెంచ్ కనెక్షన్ చెప్పుకోడం ఒకప్పుడు గొప్ప అనిపించేది. రష్యన్ నవలలలో ముఖ్యంగా స్త్రీపాత్రలు తరచు తమ ఫ్రెంచిభాషను ప్రదర్శిస్తారు. మరీ మాత్రం, ‘నేను రష్యన్ కానే కాను, ఫక్తు జర్మన్, మాది లితువానియా’ అంటుంది: Bin gar keine Russin, stamm’ aus Litauen, echt deutsch. ప్రపంచయుద్ధం ముగిసిన సమయంలో యిటువంటి ఐడెంటిటీలు ముఖ్యం.

మరీ తన బాల్యం ఎంత ఆనందంగా గడిచిందో చెబుతున్నది. వేసవి వచ్చిందంటే, సందడి, సరదా. మిత్రబృందంతో, సరస్సులకు పార్కులకు పార్లర్లకు వెళ్ళడం. కాఫీలు, కబుర్లు. (Starnbergersee, మ్యూనిక్ దగ్గర ఒక సరస్సు; Hofgarten మ్యూనిక్‌లో పార్క్.)

ఆమెది సంపన్నకుటుంబం. చిన్నతనంలో వేసవి సెలవుల్లో వాళ్ళ బంధువుల దగ్గరకు వెళ్ళేది. ‘అతడు’ ఆమెను స్లెడ్ మీద మంచుకొండలలో తిప్పేవాడు. స్లెడ్ మీద జారుతుంటే తనకు భయమేసింది, పడిపోతానేమోనని. (staying at the arch-duke’s /My cousin’s, he took me out on a sled, /And I was frightened. He said, Marie, Marie, hold on tight./ And down we went.) ఎంత థ్రిల్! ఎంత సరదా! And down we went! ఎంత కిందికి (దిగజారి) వెళ్ళిపోయారో? వెనక్కు తిరిగి చూసుకొంటే, ఆ రోజులు ఎంత ఆనందంగా గడిచిపోయాయి! In the mountains, there you feel free. there అనే పదం తీసేసి చదివితే యీ వాక్యం టూరిస్ట్ వార్త. there అనే పదం చేర్చడంతో, ఆ సరదాలు యిప్పుడు దూరపుకొండలు.

మరి, ఇప్పడేం చేస్తుంది ఆమె? ఆ వయసు లేదు, పలకరించే తోడు లేరు. ఒంటరి బతుకు. I read, much of the night, and go south in the winter. రాత్రులు పుస్తకాలతో గడుపుతుంది. ఆ సరదాలు ఆ చలి ఆ రాత్రులు గుర్తొస్తే మరి బాధ ఉండదా? అప్పుడు ఆమె జీవితం ఉత్తరం, యిప్పుడు దక్షిణం. గతస్మృతులు, గతించని కోరికలు. నిర్వేదం కాక ఏముంటుంది? ఆమె యిప్పటి స్థితి, బతుకు కాదు, చావు కాదు. ఉల్లేఖనంలోని (epigraph) సిబిల్ పరిస్థితి యిదే కదా! సిబిల్! నీకేం కావాలి? అంటే, చావు కావాలి అన్నది. పునరుజ్జీవనం పొందాలంటే ముందు యీ చావులాంటి బతుకు చావాలి. ఆ అంత్యక్రియలే (Burial of the Dead) వేస్ట్ లాండ్‌ లోని యీ ప్రారంభభాగం. ఇదొక క్రైస్తవక్రతువు. ఈ శీర్షికను ఎలియట్, Anglican Book of Common Prayer నుండి తీసుకొన్నాడు.

ఇంతగా తన గతజీవితాన్ని గురించి నిర్వేదం చెందుతున్న యీ మరీ గురించి ఎలియట్ ఏమంటున్నాడు? వయసు నిలిచేది కాదు అన్న తత్త్వం పాడుతున్నాడా? (I grow old! I grow old! అన్న ప్రూఫ్రోక్‌లా.) ఇక్కడ రెండు గతాలున్నాయి, వ్యక్తిగతం జాతిగతం. చాసర్ కాలంలో యిహపరాలను కలిపి పేనుకున్న తీర్థయాత్రలు చేసేవారు. మరీ వేసవి విహారాలు యిప్పటి పాకేజ్ టూర్స్ కాకపోవచ్చు. కాని అందులో యిహమే ఉంది, పారలౌకికస్పర్శ లేదు. ఇది సంస్కృతిస్మరణ. ఇక మరీ గతాన్ని ఆమె వర్తమానం నుంచి చూస్తే? And drank coffee, and talked for an hour. ఏం గుర్తొస్తూంది? I measured out my life with coffee spoons, ప్రుఫ్రోక్ గుర్తు రావడం లేదూ? talked for an hour. గడియారం చూచుకుంటూ మాట్లాడుకున్నారా? అవును, బయలుదేరినప్పటి ఉత్సాహం సాయంత్రానికి ఉడిగిపోతుంది. ఇంటికి వెళ్ళి ‘రిలాక్స్’ అవ్వాలి! ఆ బాల్యంలోని ఆనందం వెనక్కు తిరిగి చూచుకొనడంలోనే ఉంది. వర్తమానంలో నిలబడి చూచినప్పుడు, భూతం అందంగానే కనబడుతుంది, భూతద్దంలో. కాని ఆ అందమైన భూతం, ఒకప్పటి వర్తమానమే! సుఖాన్ని, విశ్రాంతిని అవిశ్రాంతంగా అన్వేషిస్తూ అలసిపోవడమే, ఆనాడైనా ఈనాడైనా. ఇదే అది! అదే యిది.

మరి ఎలియట్ చెప్పే, చరిత్ర సంస్కృతి సంప్రదాయము, వీటి అర్థం ఏమిటి? వీటి అర్థం వర్తమానం గతించడం కాదు, గతం వర్తించడం. గతంలో కలిసిపోవడం కాదు, గతాన్ని కలుపుకోడం. గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా. ఎందుకంటే, భవిష్యత్తు రేపటి వర్తమానమే.

జీవితాన్ని రెండు మాటలలో చెప్పాలంటే, అవి ఈ రెండే, జ్ఞాపకము, కోరిక (memory and desire). జ్ఞాపకం భూతం, కోరిక భవిష్యత్. ఈ రెండు కలబడడమే జీవితం. భూతభవిష్యత్తులమధ్య నిరంతరం నలిగే వర్తమానమే జీవితం. నలిగిపోకుండా, వర్తమానాన్ని బతికించుకోవడమే జీవితం.

అదే అంటాడు, ఎలియట్ ఫోర్ క్వార్టెట్స్‌లో:

Time present and time past
Are both perhaps present in time future,
And time future contained in time past.
If all time is eternally present
All time is unredeemable.

If all time is eternally present, వర్తమానం జ్ఞాపకాల కోరికల క్షణక్షణపోరాటమే (mixing memory and desire) అయితే, అది జీవితం కాదు.

ది వేస్ట్ లాండ్‌లో తమ నిరాశానిస్పృహలకు కావ్యరూపం యిచ్చిన ఎలియట్, ఫోర్ క్వార్టెట్స్‌లో తాత్త్వికుడై తమకు దూరమైనాడని చాలామంది పాఠకులు భావించారు. కాని, రెండు కావ్యాలకు కంటికి కనిపించినంత దూరం, వాస్తవంలో లేదు.

(In the mountains, there you feel free – ఈ వాక్యంలో there ప్రాముఖ్యాన్ని గుర్తించిన హ్యూ కెనర్ (Hugh Kenner) దాని అర్థాన్ని సరిగా గ్రహించలేదు. ఆ పదం ఆటలో అలసటను ధ్వనిస్తున్నది అని అభిప్రాయపడ్డాడు కెనర్. We have only to delete ‘there’ to observe the collapse of more than a rhythm: to observe how the line’s exact mimicry of a fatigue… (The Invisible Poet:T. S. Eliot. p. 127.) కెనర్ అనుకున్నట్లు, స్లెడింగ్ చేసి చేసి అలసిపోయి ఉన్న మరీ నోటి దగ్గరకు ఏ రిపోర్టరో తోసిన మైకులో మరీ మాట్లాడిన మాటలు కావు అవి. ఆ సందర్భంలో ఆమె ‘అక్కడ (there)’ అనదు. ఇది స్మృతివాక్యం. చాలా కాలం గడిచిన తరువాత, గతాన్ని తలచుకొంటూ ఆమె నిర్వేదంతో అన్న మాట. ఈ సందర్భంలో, there, దూరమైన కొండలనే చెబుతుంది.)

(సశేషం)