ది వేస్ట్‌ లాండ్: 2. బరియల్ – రెండవ దృశ్యం

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


[చాసర్ జీవించిన కాలం, షేక్స్‌పియరుకు రెండువందల సంవత్సరాల ముందు, మన ఆదికవి నన్నయ్యకు మూడు వందల సంవత్సరాల తరువాత. చాసర్ కాలపు ఇంగ్లీషును మధ్యాంగ్లం (Middle English) అంటారు. అంతకు పూర్వం కూడా ఇంగ్లీషు లేదని కాదు. ఉండింది, కాని అది ఇంగ్లీషులా ఉండదు. ఇప్పటి ఇంగ్లీషువాళ్ళెవరూ దానిని చదవనుకూడా చదువలేరు. దానిని Anglo-Saxon, లేక Old English అంటారు. చాసర్ భాష కూడా యీనాటికి చాలా మారింది. కాని దానిని ఇంగ్లీషుగా గుర్తించగలం. చాసరుకాలంనాటికి ఇంగ్లీషుపై ఫ్రెంచి ప్రభావం బాగా ఉండింది. అప్పటికి నార్మన్ ఆక్రమణ (Norman Conquest) జరిగి రెండు వందల సంవత్సరాలే. ఉదా: soote (sweet), roote (root) – యీ రెండూ, రెండు మాత్రల పదాలు (two syllabled). అంటే ఆ పదాలలోని చివరి e పలుకవలసినదే, silent కాదు, పూర్తిగానూ పలకరు. neutral vowel.]

రెండవ దృశ్యం

What are the roots that clutch, what branches grow
Out of this stony rubbish? Son of man,
You cannot say, or guess, for you know only
A heap of broken images, where the sun beats,
And the dead tree gives no shelter, the cricket no relief,
And the dry stone no sound of water. Only

మరీ బాల్యోత్సాహం, మంచుకొండలపై క్రీడలు సరస్సులు పార్కులు పార్లర్లు వేడి కాఫీ వేడి కబుర్లు- వీటితో సరదాగానే గడిచింది. మరీ బై చెప్పేసింది. సీను మారింది. ఈ సీనులో స్వరం మారింది. ఇప్పుడు అసలు వేస్ట్ లాండ్ లోకి అడుగుపెడుతున్నాం. బండరాళ్ళు, ముళ్ళపొదలు. పచ్చగడ్డి కూడా మొలవదు యీ రాతినేలమీద (What are the roots that clutch, what branches grow/Out of this stony rubbish?). ఇక్కడ ప్రచండమైన ఎండ (the sun beats), ఎండలోనుండి నీడకు నడుద్దామంటే, ఎండిన చెట్లు (the dead tree gives no shelter). ఎండి మోడైన చెట్టుమీద ఏ పిట్ట వాలుతుంది, గానంచేసి నీ వీనులకు విందు చేస్తుంది? (Cricket no relief) ఇక, నీళ్ళు?

అభంగతరంగమృదంగనిస్వనాలు కాదు కదా, టప్ టుప్ అన్న చప్పుడు కూడా వినపడదు. (the dry stone no sound of water) ఈ సీనులోని మొదటి సగంలో, మూడు బైబిల్ అధ్యాయాలలో నుండి మూడు వాక్యాలను (Ezekiel, Ecclesiastes, Isaiah) గుర్తు చేస్తాడు ఎలియట్. Son of man! అనేది బైబిల్లో తరచు వినిపించే మాట. ఇంతవరకు ఇది కూడా వెనుకటిలాగా ఒక విధమైన కోరస్ అనుకోవచ్చు. ఇక్కడి మనుషుల ఆత్మలు యిక్కడి నేలరాయి లాగానే బండబారిపోయాయి. తడి లేదు. ఈ ఎండిన నేలలో ఏ జీవం తలెత్తుతుంది? ఏ మొక్కలు వేళ్ళూనగలవు (what are the roots that clutch) ఏ కొమ్మలు విస్తరిస్తాయి (what branches grow?) ఈ జీవితాలలో ఏ సాఫల్యం? నీవు చెప్పలేవు. ఎందుకంటే, నీవు మానవమాత్రుడివి. నీ బుద్ధికందని విషయం అది.

Son of man,
You cannot say, or guess, for you know only
A heap of broken images

నీ జ్ఞానం, అతకని ముక్కలు. వాటిని ఎలా అతికి అర్థం చేసుకోవాలో తెలుసుకోలేవు. నీవు జీవితపు లోతులలోకి చూచి పరమార్థమేమిటో తెలుసుకోడం లేదు. జీవితపు ఉపరితలం మీద జారిపోతున్నావు, అదే జీవితమనుకొంటున్నావు. ఆర్ద్రత లేక నీ మనోభూమి శుష్కించింది. నీ ఆలోచనలు ఆశయాలు ఎండిన చెట్టు వంటివి. అవి నీకు ఆశ్రయం యివ్వలేవు. నీకు నీడ యివ్వడానికి యిక్కడ ఒక ఎత్తైన రాయి మాత్రమే ఉంది. ఈ రాయి నీడలో తలదాచుకో (Come under the shadow of this red rock).

ఇంతవరకు మనం చూసిన రాళ్ళు వేరు. ఈ రాయి వేరు. ఇది ఎర్రరాయి, క్రీస్తు రక్తంలో పునీతమైన చర్చికి ప్రతీక. ఈ ‘రాయి’ ఎండకు గాలికి ఎండనిది, తుఫానుకు కూలనిది, నిప్పులో కాలనిది, శస్త్రాలు ఛేదించలేనిది. (ఎలియట్ The Rock అని ఒక నాటకం కూడా రాశాడు.) డస్సిన మానవాళికి చల్లని నీడనిచ్చే దేవాలయం. మనిషి ప్రశ్నలకు మనిషి చెప్పలేని సమాధానాలు చెప్పే రాయి. (Son of man, You cannot say, or guess, for you know only, A heap of broken images) సమాధానాల కొరకు రాయిని ఆశ్రయించాలి. The Rockలో కోరస్: The Rock. Who will perhaps answer our doubtings. (క్రైస్తవ సంప్రదాయంలో రాయి మనిషి జీవితానికి పునాదిరాయి, క్రైస్తవధర్మానికి చర్చికి సంకేతం.)

నీకు రెండు నీడలే తెలుసు, అంటున్నాడు. ఉదయం నీ వెనుక నడిచే నీడ, సాయంకాలం నీకెదురొచ్చే నీడ. ఈ రెండు కాక మూడో నీడ కూడా ఉంటుందా? And I will show you something different from either. అదేమి నీడ? చర్చి యిచ్చే చల్లని నీడ, ఆ నీడలో బతికిన నీవు, వెళ్ళిపోతూ యీలోకంలో విడిచివెళ్ళే నీ నీడ. ఇదిగో, యీమాట వినబడినప్పుడే మనిషి భయంతో బతికుండగానే చచ్చిపోతాడు. I will show you fear in a handful of dust. (పుట్టిల్లు చేరేను మట్టి ప్రాణాలు – వేటూరి.) నీ వెనుక నడిచే నీడలా (Your shadow at morning striding behind you) మృత్యువు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నీవు పరుగెడితే, అది తరుముతుంది. మృత్యువును ముఖాముఖి ఎదురించే వరకు (Or your shadow at evening rising to meet you), భయం వదిలిపోదు.

(జీవితసత్యం తెలుసుకోవలె అంటే, మృత్యువును ఆశ్రయించవలె. కఠోపనిషత్తులో నచికేతుడదే చేశాడు. చెడ్డీ సరిగ్గా వేసుకోడంరాని పసివాడు, ఏ బస్సు ఎక్కాలి అని ఎవరినీ అడగకుండా – ఏ బస్సుకిందా పడకుండా – యమలోకానికి వెళ్ళి మృత్యుద్వారం వద్ద నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు.)

భగ్నప్రేమ:

రాళ్ళు గుళ్ళు ఎండిన చెట్లు మృత్యుభయం. (stony rubbish, dry stone no sound of water, fear in a handful of dust.) ఇది మొదటి ప్రపంచయుద్ధంలో జరిగిన విధ్వంసఫలితంగా యూరప్‌లో అలముకొన్న నిరాశనిస్పృహల చిత్రణ కావచ్చు. బాంబులు కురిసిన నేలలో మొక్క మొలవడం కష్టం. (కావ్యం రాయడమూ కష్టమే.) ఈ దృశ్యం ముగిసింది. తిరిగి తెర లేచినపుడు, మరుభూమి మాయమై, విరహసముద్రం మన ముందుంటుంది. నావ, నావలో యిద్దరు ప్రేమికులు. సముద్రమే, కాని ప్రేమదాహం తీర్చే చుక్క నీరు కరువు. (కోల్‌రిజ్ అన్నట్టు – Water! water! everywhere, nor any drop to drink.) వాగ్నర్ (Wagner) అనే ప్రఖ్యాత సంగీతకారుడు రాసిన సంగీతరూపకం ట్రిస్టన్ అండ్ ఇసోల్డ (Tristan and Isolde) ఒక విషాద ప్రేమగాథ. రచన, సంగీతరచన కూడా అతనివే. అందులోని ఒక పాటతో (జర్మన్ మూలం) మొదలవుతుంది, ఎలియట్ తరువాతి దృశ్యం.

Frisch weht der Wind
Der Heimat zu
Mein Irisch Kind,
Wo weilest du?

(చక్కటి గాలి
ఇంటికై వీచేను
నా ఐరిష్ బాలా,
ఏలా, చేసేవు జాగు?)

ఇది, ఒక నావికుడు పాడుకొంటున్న పాట, దూరమైన తన ప్రియురాలిని తలచుకొంటూ.

ఎలియట్ జీవితం: ప్రేమస్మృతులు, సాంసారికజీవితం.

వాగ్నర్ రూపకం కథ: ఇసోల్డ ఐరిష్ యువతి. ఆమెను మార్ అనే రాజు పెళ్ళి చేసుకోవలె అనుకొన్నాడు. కాని ఆమె మరొకరిని ప్రేమించింది. ట్రిస్టన్ అనే రాజుగారి అనుచరుడు ఆమెను ఐర్లండ్ నుండి నావలో తీసుకువస్తున్నాడు, రాజుగారి కోసం. ట్రిస్టన్‌పై ఆమె ప్రథమకోపం ప్రేమగా మారడం, ప్రేమ భగ్నం కావడం, ప్రేమికులిద్దరూ చనిపోవడం సంగ్రహంగా కథ. ఈ రూపకంలో, ప్రేమికులు ప్రధానపాత్రలు. కాని వారిని వేరు చేస్తున్న సముద్రం భగ్నప్రేమకు సంకేతమై కథనంతా ఆక్రమిస్తుంది. ప్రేమికులమధ్య ఎప్పుడూ ఒక సముద్రం ఉంటూనే ఉంది.

వేటూరి, వాగ్నర్: విరహసముద్రం అనగానే సీతాకోకచిలుక సినిమాలో వేటూరి పాట గుర్తురాకుండా ఉండగలదా?

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే…
సాగరసంగమమే, ప్రణవ (య) సాగరసంగమమే…
జానకి కన్నుల జలధితరంగం
రాముని మదిలో విరహసముద్రం
చేతులు కలిపిన సేతుబంధనం

గొప్ప పాట! గొప్ప భావన! సీతమ్మ శోకం లోకానికంతటికీ తెలిసేది, జలధితరంగాల లాగా. రామయ్య బాధ లోకానికి తెలిసేది కాదు. ఆ శోకం ఆయన మదిలో భద్రం. ఇది అర్థానికి ఒక పొర. ఈ తెర తొలగిస్తే మరో గాఢార్థం. కనుకట్టులో కనువిప్పును దాచిన మహాకవి వేటూరి! కనుకట్టు: సీతారాముల వియోగం; కనువిప్పు: సముద్రము తరంగము, రెంటికీ వియోగమా? అవి విడిపోయిందెప్పుడు? ధ్వన్యర్థాన్ని వాచ్యంలో దాచడం మహాకవి మాత్రమే చేయగలడు. సీతారాముల ప్రేమతత్త్వాన్ని యింత గొప్పగా, మూడుమాటల్లో కాదు, ఒక్క మాటలో చెప్పినవాడు మరొకడు లేడు. ఉంటే, అతడు కూడా వేటూరి అంతటి గొప్ప కవి.

వాగ్నర్ రూపకంలో ‘చేతులు కలిపిన సేతుబంధనం’ లేదు. అతడి సముద్రం ‘నిర్జనమైన నీటిఎడారి’ (Oed’ und leer das Meer). ఎడారి కనుకనే ఎలియట్ కావ్యంలో దాని స్మరణ.

ఎలియట్ సౌందర్యసాక్షాత్కార స్వరూపం:

వేస్ట్‌ లాండ్ రాసే సమయంలో ఎలియట్ తీవ్రమైన మానసిక అస్వస్థతతో పోరాడుతూ ఉండినాడు. స్వస్థత దొరికిన సమయాలలో కవిత్వం రాసేవాడు. ఆ ఘర్షణ ఆందోళన యీ ప్రేమఘట్టంలో ప్రతిఫలించింది అంటారు. ఎలియట్ భార్యకు కూడా మానసిక స్వాస్థ్యం ఉండేది కాదట. ఫలితంగా, అతని సాంసారికజీవితం సుఖంగా సాగలేదంటారు. ఈ సెక్షన్ మొదటి భాగం బయటి ఘర్షణ (ప్రపంచ యుద్ధం), రెండవ భాగం లోపలి ఘర్షణ. కవి కాలము జీవితము, ఈ వివరాలు, ఒక కవి కావ్యం ఎందుకు అలా రాశాడో చెప్పవచ్చు. కాని, రాసిందేమిటో చెప్పదు. అది మన పని. ప్రేమలో దివ్యానందమూ ఉంది, తీవ్రవిషాదమూ ఉంది. ప్రేమ స్వర్గము, ప్రేమ నరకము. ఈ సన్నివేశంలో ఎలియట్ చూపిన రచనా నైపుణ్యం ఏమంటే, స్వర్గమో నరకమో తెలియని స్థితిని వర్ణిస్తాడు. ఏకకాలంలో అది రెండూను.

వాగ్నర్ రూపకంలోని విరహగీతంతో, ఎలియట్ ఒక ప్రేమజంటను ప్రవేశపెడతాడు. (వెనుక మనం చూచిందే. అక్కడ ఈ దృశ్యం, ఒక ప్రేమజంట సంభాషణ కాకపోవచ్చని, ఆమె మాటలు అతడిని ఉద్దేశించినవి కావు, అతడి మాటలు ఆమెతో అన్నవి కావని, ఆ తర్వాత ఎక్కడో ఎవరో అడగబోతున్న ప్రశ్నలకు ముందే చెప్పిన సమాధానాలని చెప్పుకున్నాం. కాని, అదే దాన్ని చూడవలసిన విధానం అని నిర్ధారించలేము కూడా. మరెలాగా కూడా చూడవచ్చు? ఆ సన్నివేశాన్ని మళ్ళీ చూద్దాం.)

You gave me hyacinths first a year ago;
They called me the hyacinth girl.

ఆమె తమ ప్రథమ ప్రేమ సన్నివేశాన్ని అతడికి గుర్తు చేస్తోంది. అతడెలా స్పందించాడు? అతడూ ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకొంటున్నాడు. ఆనాడు ఏం జరిగింది?

Yet when we came back, late, from the Hyacinth garden,
Your arms full, and your hair wet, I could not
Speak, and my eyes failed, I was neither
Living nor dead, and I knew nothing,
Looking into the heart of light, the silence.
Oed’ und leer das Meer.

ఆ రోజు పూలతోటలో వాళ్ళిద్దరికీ తెలియకుండా కాలం గడిచిపోయింది, we came back, late.

తిరిగి వచ్చినపుడు, తడిసిన జుట్టు, చేతులలో పూలు. అలా ఆమెను చూసి అతడు ఒక అలౌకిక సమాధిస్థితి లోకి వెళ్ళిపోయాడు. కనులు చూడడం లేదు. మాట రావడం లేదు. తాను బతికే ఉన్నాడా? చనిపోయాడా? కాంతికేంద్రబిందువు లోని మౌనాన్ని చూస్తూ, ఉండిపోయాడు. ఈ దృశ్యం ఏం చెబుతోంది? గాఢమైన ప్రేమ ఒక సమాధిస్థితిని కల్పించగలదు. అది జీవన్మరణాలకు అతీతమైన అలౌకికానందానుభూతి. ఆ స్థితి లౌకికమైన ప్రేమను దాటించేస్తుంది. అతడు పలికిన చివరి వాక్యం మళ్ళీ వాగ్నర్‍దే (Oed’ und leer das Meer – ఈ సముద్రం నీటి ఎడారి). ఆ అలౌకిక స్థితిలో, లోకము లౌకికప్రేమ రెండూ సముద్రమంత పెద్దదైన సైకతప్రాంతం. ప్రేమకు రెండు ముఖాలు. రెంటినీ యిక్కడ ఒకే సన్నివేశంలో కలిపి చెబుతున్నాడు ఎలియట్. అది అలౌకికానందస్థితి కావచ్చు, ప్రియావియోగదుఃఖం తెలియనీయని మూర్ఛ కావచ్చు (అజ్ఞాతప్రియా వ్యసనముహూర్తం).

ఇది యీ సన్నివేశాన్ని అర్థం చేసుకునే అనేకవిధాలలో ఒక విధం. ఈ వాక్యాలను వివిధంగా పరస్పరవిరుద్ధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు, ఈ సన్నివేశంలో యిద్దరు లేరు, ఒక్క స్త్రీ మాత్రమే ఉంది, మొత్తం ఆమె మాటలే, అని కూడా అనుకోవచ్చు.

ఆమె, హామ్లెట్‌లోని ఒఫీలియా కావచ్చు, వాగ్నర్ ఆపెరా లోని ఇసోల్డ కావచ్చు. ఒఫీలియా ప్రేమ భగ్నమై, మతి తప్పి, చేతులనిండా పూలతో, పాటలు పాడుకుంటూ తిరుగుతూ కనిపిస్తుంది. చివర, అందరికీ గుడ్‍ నైట్ చెబుతూ వెళ్ళిపోతుంది. తెల్లవారేసరికి, ఒక కాలువలో పడి చనిపోయి కనిపిస్తుంది (arms full with hyacinths, hair wet). ఆ స్థితిలో ఆమెను చూచి నిశ్చేష్టుడైన ప్రియుడి మాటలా అవి? I could not/Speak, and my eyes failed, I was neither/Living nor dead, and I knew nothing. ఒఫీలియా కావచ్చు. కాదనడానికి ఆధారం లేదు.

లేదా, భగ్నమైన ప్రేమలో ప్రియుడన్న మాటలు కాదు, అవి కూడా అదే స్త్రీ, ఒఫీలియా లాగా మతితప్పిన స్థితిలో అన్న మాటలు కావచ్చు. ఒఫీలియా చనిపోయింది, యీమె చనిపోలేదు. అంతే తేడా. మళ్ళీ చావులాంటి బతుకు, బతుకులాంటి చావు. వేస్ట్‌ లాండ్ అంతటా పరచుకొన్న స్ఫురణ యీ జీవన్మరణమే కదా?

అలాగే, ఇసోల్డ కూడా ఆ మాటలు అని ఉండవచ్చు. ట్రిస్టన్ గాయపడి చావుబతుకుల్లో ఉంటాడు. గాయం మాన్చి అతణ్ణి కాపాడగలిగింది అతడి ప్రియురాలు ఇసోల్డ మాత్రమే. ఆమె సముద్రం దాటి రావాలి. వాచ్‌మన్ అంటాడు, ఎక్కడా ఆమె నావ జాడ లేదని. (Oed’ und leer das Meer – ఈ సముద్రం నిర్జనమైన నీటి ఎడారి.) తీరా ఇసోల్డ ప్రియుణ్ణి చేరుకొనే క్షణానికి, అతడు ఆమె పేరు జపిస్తూ ప్రాణం వదులుతాడు. ఆ క్షణంలో ఇసోల్డ అన్న మాటలు కావచ్చు.

ఇవేవీ కావు. మరో అర్థం కూడా చెప్పుకోవచ్చు. అలా అర్థం చెప్పగల అవకాశం రచనలో ఉంది. అదే రచనకు స్వేచ్ఛనివ్వడం. ఇందులోని బొమ్మలగుట్ట (a heap of broken images, fragments) లోనుండి, ఏరుకొని అతికి, తోచిన చిత్రం తయారు చేసుకోవచ్చు. కాని, మనం ఏది చేసుకున్నా, అది ఆనందాభిషంగపరిష్వంగమే. మీ చిత్రం జీవన్మరణాలను ఏకం చేసి చూపుతుంది. అది విషయనియంత్రణలో కవి సామర్థ్యం.

అవును, వేస్ట్‌ లాండ్ ఒకసారి చదివి పడేసే కావ్యం కాదు. అనగననగ అర్థమతిశయిల్లుచునుండు. ఈ కావ్యంతో సంగమ్ ఒక రాత్రితో (one-night cheap hotels – Prufrock) ముగిసేది కాదు.

వసంతము లైలాక్ పూలు గుర్తు వస్తే, వాటిని మంచుతో కప్పేసి మరచిపోవడం మేలనిపించింది. (April is the cruellest month; spring rain; forgetful snow) జ్ఞాపకాలు తీయని బాధలుగా మిగిలిపోయాయి. యవ్వనపు ప్రథమప్రేమలో ఆనందపు అంచులు, విషాదపు లోతులు ఒక్కటైన ప్రేమ ‘సమాధి’ని చూచాం (Living nor dead, and I knew nothing, Looking into the heart of light, the silence.) వేస్ట్‌ లాండ్‍లో ఇంతవరకు గతము, జ్ఞాపకాలు (memory). గతం భూతమైతే, ఇక భవిష్యత్తు (desire)? ఈ మూడవ దృశ్యం అదే. అనగా, సోది.

(సశేషం)