ఆ స్టోర్‌లో అతనూ ఆమే ఒకే సమయంలో ఉద్యోగానికి చేరారు. అతను మరో కంపెనీలో అదివరకు ఆరేళ్ళు కంప్యూటర్ అకౌంటెంట్‌గా పనిచేసి ఆ అనుభవంతో ఇక్కడికి వచ్చాడు. ఆమె కొత్తగా ఉద్యోగానికి చేరింది. ఒకే రోజులో అతను ఆ పెద్ద గిడ్డంగి వ్యవస్థ ఏర్పాటు, పనితీరు, అందులోగల సదుపాయాలు, చిక్కులు ఏంటన్నది అర్థం చేసుకున్నాడు.
అక్కడ లారీల్లో సరుకు దించుకోడానికి, ఎక్కించడానికి సుమారు డెబ్భైమంది పనిచేస్తారు. బైట నాలుగు వైపులనుండి రోడ్లు నేరుగా గిడ్డంగి లోపలికి వచ్చి తిరిగి బయటికి వెళతాయి. అన్ని దిక్కులనుండీ లారీలు వచ్చి రాత్రంతా మూటలు దింపో, ఎక్కించుకునో వెళ్తుంటాయి. ఆ లారీ సరుకుల్లో ఎక్కువగా ఉండేది పంచదారే. అప్పుడప్పుడూ పెద్ద మొత్తంలో కొన్ని రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. ఆ కెమికల్స్ అన్నీ అక్కడ నుండి ఆ సంస్థకే చెందిన ఎనిమిది షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్తుంటాయి. షుగర్ ఫ్యాక్టరీల నుండి చక్కెర ఇక్కడికి వచ్చి, ఇక్కడినుండి వేరే ఊళ్ళకి వెళ్తుంటుంది. ఆ గిడ్డంగి బయటి గాలిని లోపలికి పీలుస్తూ బయటికి విడుస్తూ ఉండే ఒక పెద్ద ఊపిరితిత్తి లాంటిది.
లారీల సరుకుల లెక్కలు పది పన్నెండు చోట్ల రాయబడుతుంటాయి. వాటన్నిటిని ఒకచోటకి చేర్చి లెక్కించి రాయడం అన్నది ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. పైపెచ్చు ఏ సమయంలో అయినా మేనేజింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి ఏం జరుగుతోంది? ఎంత స్టాక్ ఉంది? ఎంత స్టాక్ రావచ్చు? ఇలాంటి వివరాలు అడుగుతుంటారు. ఆయనకు కావలసింది ఐదు నిమిషాల్లో క్లుప్తంగా చెప్పగలిగేంత సంక్షిప్త సమాచారం మాత్రమే. అయితే ఆ ఐదు నిమిషాల్లో చెప్పే ఆ సంక్షిప్త సమాచారం సేకరించడానికి బ్రహ్మాండమైన లెక్కల సామర్థ్యం కావాలి.
అంతకుముందు ఆ గిడ్డంగిలోనే ఇరవై ఏళ్ళుగా పనిచేసిన ఒక ముసలి బ్రాహ్మణుడు ఈ లెక్కలు చూస్తుండేవాడు. రానురానూ ఆయనకు ఈ పనిలో సామర్థ్యం తగ్గిపోయింది. అందుకని ఆయన్ని ఆ సంస్థకు చెందిన మతపరమైన ట్రస్టుకు బదిలీ చేసి ఇతన్ని ఆ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఒక్క వారం రోజుల్లోనే అక్కడ ఉన్న సవాళ్ళు అతనికి తెలిసిపోయాయి. అక్కడ పనిచేస్తున్న చాలామందికి కంప్యూటర్ వాడటం రాదు. వాళ్ళు పెద్ద పెద్ద పద్దుల పుస్తకాలు రాసే రోజుల్లో ఉద్యోగాల్లో చేరి ఆపైన ఎదగకుండా స్థిరపడిపోయినవాళ్ళు. అదంతే. ఆ వాతావరణం ప్రతి ఒక్కరిని ఓ పెద్ద సంస్థలో తాము ఒక చిన్న భాగం అనుకునేలా చేస్తుంది. అది ఒకలాంటి అర్థరాహిత్యాన్ని ఇచ్చినా భద్రతని కూడా ఇస్తుంది. ఎక్కడికీ వెళ్ళనక్కర్లేదు, దేన్నీ సాధించాల్సిన పనిలేదు, అంతా సజావుగా జరిగిపోతుందన్న భద్రత.
అక్కడున్నవాళ్ళు లెక్కల్ని ఒక్కొక్కరు ఒక్కో లెడ్జర్ పుస్తకంలో రాసుకుంటున్నారు. వాటన్నిటిని కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు ఒకే లెక్క రెండు మూడుసార్లు నమోదు కావడం, ముఖ్యమైన సమాచారం నమోదు కాకుండా పోవడం – ఇలా ఎన్నో ఇబ్బందులు. అతను అక్కడ లెక్కలు రాసే ప్రతిచోటా ఒక కంప్యూటర్‌ని పెట్టించి, కేవలం దాని వాడకం కోసమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించాడు. ఈ పనికి ఆడవాళ్ళు మాత్రమే కావాలన్న విషయంలో అతను పట్టు విడవలేదు.
అక్కడి మేనేజర్ అతనితో ”అబ్బాయిలు కూడా ఈ కాలంలో బానే చదువుతున్నారు” అని అన్నాడు.
“నిజమే, అయితే వాళ్ళు సరిగ్గా కూర్చుని పనిచెయ్యరు. సందు దొరికితే చాలు సెల్‌ఫోన్ చూస్తూ ఉంటారు. లేదా కంప్యూటర్‌లో గేమ్స్ పెట్టుకుని ఆడుతుంటారు. ఇలాంటి పనులు ఆడపిల్లలు మాత్రమే శ్రద్ధగా చేయగలరు” అని అతను సమాధానం చెప్పాడు.
“అది కాదు…” అని మేనేజర్ ఏదో చెప్పబోయాడు.
“మీకు కావలసినవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మరెక్కడైనా పోస్టింగ్ చేసుకోవచ్చు.” అన్నాడతను సూటిగా.
మేనేజర్ కళ్ళలో దెబ్బతిన్న భావం కనిపించింది. “అందుకు చెప్పట్లేదు…” అని నసిగాడు.
“థేంక్స్” అన్నాడతను.
ఆపైన మేనేజర్ అతనితో ఏమీ మాట్లాడలేదు. అతనేంటి, అతని శక్తి సామర్థ్యాలేంటి అన్నది ఆయన అర్థం చేసుకున్నట్టున్నాడు.
అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకువచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు. బజర్ నొక్కి ఆమెని లోపలికి రమ్మన్నాడు.
ఆమె లోపలికి వచ్చి గదిలో గోడ పక్కన చేతులు కట్టుకుని నిల్చుంది. బాగా బక్కచిక్కిన అమ్మాయి. రెండు పక్కలా మెడ ఎముకలు పైకితేలి కనిపిస్తున్నాయి. మెడలో సన్నటి పూసలదండ వేసుకుని ఉంది. నుదుట స్టిక్కర్ బొట్టు. మెడ, బుగ్గలూ పాలిపోయి జబ్బుచేసిన మనిషిలా ఉంది.
అతను “మీకు ఒంట్లో ఏమైనా బాలేదా?” అని అడిగాడు.
ఆమె ఏదో వినిపించీ వినిపించనట్టుగా చెప్పింది.
“ఏంటీ?” అన్నాడు.
“అదేం లేదు సార్” అంది కొంచెం పెద్దగా.
“మీరెప్పుడు జాయిన్ అయ్యారు?”
“రెండు నెలలు అయింది సార్.”
“ఏం చేస్తున్నారు ఇప్పుడు?”
“స్టోర్‌లో…” అంది.
“ఇది మొత్తం స్టోరే. ఏ డిపార్ట్‌మెంట్లో చేస్తున్నారు?”
ఆమె మాట్లాడకుండా నిల్చుంది.
“చెప్పండి” మళ్ళీ అడిగాడు అతను.
“ఇప్పటివరకు పని అంటూ ఏమీ ఇవ్వలేదు సార్. కృష్ణన్న తనతో పాటు నిల్చోమన్నాడు. అయితే ఆయన నన్ను టేబుల్ దగ్గర అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. నేను ఆ టేబుల్ పక్కనే కూర్చుని ఉంటాను” అంది ఆమె నీళ్ళు నములుతూ.
“టేబుల్ చూసుకుంటూ…”
ఆమె ఏమీ మాట్లాడలేదు.
“ఏం చదువుకున్నారు?”
ఆమె చెప్పింది అతనికి వినిపించలేదు.
“ఏంటీ?” గట్టిగా అడిగాడు.
“బీ.కామ్.” అన్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు?”
“లేదు సార్.”
“మరి కళ్ళల్లో నీళ్ళు ఏంటి?”
“లేదు సార్.”
“ఏం చదువుకున్నారు అని అడిగాను కదా?”
“బీ.కామ్. సార్.”
“కంప్యూటర్‌తో పనిచేయడం వచ్చా?”
“వచ్చు సార్.”
అతను మాట్లాడుతూనే కంప్యూటర్‌లో ఆమె వివరాలు చూశాడు. అందులో ఆమెకు కంప్యూటర్‌తో పనిచేయడంలోను, కొన్ని అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లు హ్యాండిల్ చేయడంలోను సర్టిఫికేషన్ ఉందన్న రుజువులు ఉన్నాయి.
“ఇప్పుడు తొమ్మిది కంప్యూటర్లలో డేటా ఎంట్రీ చేస్తున్నాం. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కన్సాలిడేట్ చేస్తూ ఉండాలి. అది చేయగలరా?”
“నేర్చుకుంటాను సార్” అంది ఆమె.
“అదేం పెద్ద కష్టమైన పని కాదులే. అంతా ఆటోమేటిక్‌గా ఎప్పటికప్పుడు అదే అప్‌డేట్ అవుతూ ఉంటుంది. దానిని మానిటర్ చేసుకుంటూ, కావలసిన వివరాలను తీసుకుని రిపోర్టుగా మారుస్తూ ఉండాలి. ఎప్పుడు నేను గెట్ డేటా నొక్కినా రిపోర్ట్ రెడీగా ఉండాలి అంతే. అవి ఏంటి, ఎలా చెయ్యాలన్నది నేను నేర్పిస్తాను.” అన్నాడు.
“సరే సార్.”
ఆమె ఇప్పుడు కుదుటపడినట్టు అనిపించింది. ఆమెను తిట్టడానికో, లేదా ఉద్యోగం నుంచి తీసేసి ఇంటికి పంపించడానికో పిలిచి ఉంటాడు అని ఆమె అనుకుని ఉండొచ్చు. ఆమె వెలిసిపోయినట్టున్న పాత చీర కట్టుకుని, చేతులు వదులుగా ఉన్న జాకెట్టు వేసుకుని ఉంది. అరిగిపోయిన రబ్బరు చెప్పులు వేసుకుంది.
“మీకెంత జీతం ఇస్తామని చెప్పారు?” అని అడిగాడు.
“పద్దెనిమిది వేలు సార్.”
“సరిగ్గా ఇస్తున్నారా?”
“ఇస్తున్నారు సార్.”
ఒక క్షణం ఆలోచించి “ఈ ఆఫీసుకు సూటయ్యేలా నువ్వు ఇంకొంచం మంచిగా డ్రెస్ చేసుకుని రావాలి. ఎందుకంటే కస్టమర్లు వస్తూ పోతూ ఉండే చోటు కదా. నువ్వు ముందున్న ఆ కేబిన్ లోనే కూర్చోవాల్సి ఉంటుంది” అన్నాడు.
ఆమె ఏమీ మాట్లాడలేదు.
ఇక వెళ్ళొచ్చు అన్నట్టు అతను తల ఊపాడు.
ఆమె చేతులు జోడించి బయటికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత రెండు రోజులు ఆమెను తన గదికి పిలిపించి ఆమె చెయ్యాల్సిన పనులేంటి, అవి ఎలా చేయాలి అనేది నేర్పించాడు. ఆమె మరింత దూరంగా నిల్చుని ఉన్నప్పుడు “దగ్గరగా వచ్చి చూడొచ్చుగా…” అన్నాడు. “సరే సార్” అంటూ నిల్చున్న చోటే ఒక కదలికని చూపించింది కానీ దగ్గరికి రాలేదు. అయితే అతను చెప్పేది ఆమె వెంట వెంటనే అర్థం చేసుకుంటుందని స్పష్టమైంది. రెండో రోజు ఆమెను చూసినప్పుడు ఇంతకుముందు ఆమెని చూసినప్పుడు కట్టుకున్న అదే పాత చీర కట్టుకుని ఉన్నట్టుగా అనిపించింది. ఆ విషయం అడుగుదామా వద్దా అని ఒక క్షణం ఆలోచించి అడిగితే ఆమె మనసులో బాధపడవచ్చనిపించి విరమించుకున్నాడు.
ఈసారి జీతం వచ్చాక కొత్త బట్టలు కొనుక్కుంటుందేమో. ఈ ఉద్యోగానికి రాకముందు ఆమెకి అప్పులూ అవీ ఉన్నాయేమో… పెళ్ళి కాని అమ్మాయి. ఇంటికి పెద్ద కూతురు కూడా అయి ఉండొచ్చు.
ఆమె వెళ్ళాక తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు, తనకు అప్పుడప్పుడూ ఆమె గురించి ఆలోచనలు వస్తున్నాయని అతను గ్రహించాడు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తుండగానే పెదవులపైన ఒక చిరునవ్వు విరిసింది. అతను ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని ఇదివరకు చూడలేదు. చూసుండొచ్చేమో కాని, పట్టించుకోనుండడు. అతను చదివిన కాలేజీలో, ఉద్యోగం చేసిన సంస్థలో అందరూ ఎగువ మధ్య తరగతి అమ్మాయిలు. మధ్య తరగతి ఆడవాళ్ళు కూడా కట్టూ బొట్టూ నడవడికల్లో కలిగిన వర్గానికి చెందినవారిలా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇక ఆమె గురించి ఆలోచించకూడదనుకున్నాడు. అయితే అలా అనుకున్నా కూడా మనసు ఏదో రకంగా ఆమె చుట్టూనే తిరుగుతోంది. జీతం రాగానే ఆమె కొత్త బట్టలు కొనుక్కుంటుందా లేదా చూడాలి. అవే పాత బట్టలు వేసుకుని వస్తే మాత్రం దాని గురించి నేరుగా చెప్పకుండా ఒక ఈ-మెయిల్ ద్వారా చెప్పాలి అనుకున్నాడు.
ఆమెను దాటుకుని వెళ్ళిన ప్రతిసారీ గాజు పార్టిషన్ లోంచి ఆమెను చూస్తూ వెళ్ళేవాడు. తన గది నుంచి బయటకు రాగానే అక్కడి లారీలు, క్రేన్లు చేసే మోతలు, మనుషుల అరుపులు, కేకలు, రోడ్డుమీంచి వచ్చే శబ్దాలూ అన్నీ కలగలిసిన పెద్ద శబ్ద కాలుష్యం అతన్ని చుట్టుముట్టేస్తుంది. అది అక్కడి గాలిలో నిరంతరం తేలుతూ ఉన్నట్టే అనిపించేది. ఆ మోతల మధ్యనే ఆమె ఉండే ఆ గాజు క్యాబిన్ వైపు చూడాల్సివచ్చేది. అప్పుడామె దూరంగా వేలాడుతోన్న క్యాలెండర్ లోని పెయింటింగ్‌లా కనిపించేది. ఎలాంటి కదలికలు, భావోద్వేగాలు లేని వస్తువులాగే ఉండేది.
అందమైన అమ్మాయి అయితే కాదు. బహుశా ఆ బక్కచిక్కిన ఒళ్ళు, పాలిపోయిన తెల్లచారల చర్మం కాకుండా కొంచెం కండపట్టి ఉంటే అందంగా ఉండొచ్చేమో. చెవులకు కూడా పూసల పోగులే వేసుకుని ఉంది. అవే రబ్బర్ చెప్పులు. ఈరోజు తారీఖేంటీ అని ఆలోచించాడు. ఇరవై తొమ్మిది. ఇంకో వారం రోజుల తర్వాత చూద్దాం. నాలుగో తారీఖు ఆదివారం. ఐదో తారీఖున ఆమె కొత్త బట్టలు వేసుకుని తీరాలి, అనుకున్నాడు.
ఆమె ఉన్న గాజు పార్టిషన్ గదిలో మరో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలూ ఒక అధునాతనమైన వాతావరణంలో పనిచేయడానికి కావలసిన వేషధారణలో ఉన్నారు. గట్టిగా మాట్లాడటం, తలను వెనక్కి వాల్చి గట్టిగా నవ్వడం, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు చేతులు నాజూకుగా ఊపడం, ఇలాంటి వైఖరులను అలవరుచుకున్నవాళ్ళు. అతన్ని చూడగానే కంగారు, బెరుకు లేకుండా అభివాదం చెయ్యడానికి, చెదరని చిరునవ్వుతో అతని ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సరిపోయే ఆత్మవిశ్వాసం ఉన్న నేర్పరులు. అయితే ఈమె మాత్రం దారిలో ఎదురయినా, మరెక్కడైనా కనిపించినా కంగారుగా చేతులు జోడించి, పెదవులు మాత్రం కదిపి మాటలు బయటకు రాకుండానే నమస్కారం చెప్పి గోడకు అతుక్కుపోయి నిల్చుంటుంది. అతను దాటుకుని వెళ్ళిపోయాకే ఆమె వెళ్తుంది.
కిందిస్థాయి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అయుండొచ్చు. ఈమెను ఇక్కడివాళ్ళు ఎలా చూస్తున్నారో తెలియడంలేదు. కొందరు ఆడవాళ్ళు మరొకరిని తక్కువ చేయడం ద్వారా తాము గొప్పవారమని చూపించుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశాల్ని వాళ్ళు ఎప్పుడూ వదులుకోరు. ఆమె వేసుకున్న పూసలదండ, కవరింగ్ పోగులు, పాతచీర ఇప్పటికే వీళ్ళ కబుర్లలో చోటు చేసుకునివుంటాయి.
ఆ విషయాన్ని ఆమెకు నేరుగా చెప్పకుండా ఈ-మెయిల్ లోనే చెప్పాలనుకున్నాడు. అయితే అతను ఐదో తారీఖున ఆఫీసుకు రాలేదు. చెన్నైలో ఒక మీటింగ్ ముగించుకుని బయటికి రాగానే ఆరోజు ఐదో తారీఖు అని గుర్తొచ్చింది. స్టోర్‌లో ఉండుంటే ఆమె కొత్త బట్టలు వేసుకుని వచ్చిందో లేదో చూసుండేవాడినని అనుకున్నాడు. ఇదెంత పిచ్చి ఆలోచనో అనిపించి తనలో తానే నవ్వుకున్నాడు.
అతని జీవితంలో ఇప్పటి వరకు తన స్వభావానికి నప్పని, తన తర్కానికి లోబడని పిచ్చితనం ఏదైనా ఉందంటే అది ఇదేనేమో అనుకున్నాడు. అతను సినిమాలు చూడడు. ఎలాంటి సినిమా అయినా పది నిముషాలకే చిరాకనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఒకే పాటని వినేవాళ్ళని అతను కాలేజీ రోజుల్లో ఎందరినో చూశాడు. ఫ్యాషన్ పేరిట పిచ్చి పిచ్చి బట్టలు తెగ కొనేవాళ్ళసు చూశాడు. అదే రాజకీయాల్ని మళ్ళీ మళ్ళీ చర్చించుకునేవాళ్ళను చూశాడు. ఒకే హాస్యానికి ఎన్నిసార్లయినా పగలబడి నవ్వేవాళ్ళను చూశాడు. ఇలాంటివన్నీ అతనికి ఫూలిష్‌గానే అనిపించేవి.
“నువ్వు మనిషివే కాదురా. ఒక మృగానివి. లేదా యంత్రానివి” అని స్నేహితులు అతని గురించి ఎప్పుడూ అంటూ ఉండేవారు. “యంత్రం అయితే నేను కంప్యూటర్‌ని. నేను ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండటానికి ఇష్టపడుతుంటాను” అని అతను వాళ్ళకు సమాధానం చెప్పేవాడు.
ఆరో తారీఖు పొద్దున్నే ఈ-మెయిల్స్ పని ముగించుకుని బయటికి వచ్చినప్పుడు గాజు గదిలో ఉన్న ఆమెను చూశాడు. అమ్మాయిలందరూ కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తూ ఉండగా, ఈమె ముఖంలో మాత్రం రంగులు మారుతూ ఉన్న కంప్యూటర్ స్క్రీన్ వెలుతురు కనబడింది. అదివరకు చూసిన అదే పాత చీరే కట్టుకుని ఉంది. కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ నిల్చొని తన గదికి వెళ్ళిపోయాడు.
వచ్చి తన కుర్చీలో కూర్చునేంతవరకు అతనిలో ఎలాంటి తీవ్రమైన ఆలోచనా లేదు. అయితే పేర్ల జాబితాలో ఆమె పేరు చూసి ఈ-మెయిల్ చేయడానికి పూనుకోగానే చెప్పలేనంత కోపం వచ్చింది. ముఖ్యంగా ఆమెతో ఆ విషయం గురించి అదేపనిగా చెప్పినా కూడా ఆమె దాన్ని పట్టించుకోకుండా ఉందంటే అది పేదరికమో చేతకానితనమో కాదు. కేవలం నిర్లక్ష్యం. ఆమె చూపించే వినయ విధేయతలు కూడా ఆ నిర్లక్ష్యపు కొనసాగింపే అనిపించింది. వెంటనే మెయిల్ రాశాడు. అతను రాసిన ఆ ఈ-మెయిల్లో నిష్కర్ష ధ్వనించింది. ‘ఈ ఉద్యోగ వాతావరణానికి సరిపోయే దుస్తులు వేసుకుని రాలేదంటే మీ మీద చర్యలు తీసుకోవలసి వస్తుంది’ అని రాశాడు. ఈ-మెయిల్ పంపించాక చేతులు కట్టుకొని స్క్రీన్ కేసి చూస్తూ ఉన్నాడు. కాసేపట్లో ఆమె నుంచి రిప్లయ్ వచ్చింది. ‘క్షమించాలి సర్. నేను మీరన్నట్టే చేస్తాను. క్షమించాలి సార్’ అని రాసింది. అందులో ఆమె అపరాధభావాన్ని అతను గుర్తించాడు. అది వరకు ఉన్న కోపం తగ్గి తన మీద తనకే చిరాకు వేసింది. లేచి బయటికి వెళ్ళి లారీలను ఒకసారి చూసి తన గదికి వచ్చాడు. కంప్యూటర్ స్క్రీన్‌నే చూస్తూ కూర్చున్నాడు.
కాసేపటికి ఆమెను తన గదికి రమ్మని పిలిచాడు. ఆమె లోపల వచ్చేటప్పుడు చేతులు జోడించింది. కళ్ళల్లో చెమ్మ.
లోపలికి రాగానే ”రేపు కొత్త చీర కొనుక్కుంటాను సార్” అంది.
“కొత్త చీర గురించి చెప్పడం లేదు. ఈ ఆఫీస్‌కంటూ ఒక స్టేటస్ ఉంది అది మెయింటెయిన్ చెయ్యాలి అని మాత్రమే చెప్తున్నాను.”
“మా నాన్నతో చెప్పాను సార్. నాన్న వద్దన్నారు.”
“నాన్న ఏం చేస్తారు?”
ఆమె రెండు క్షణాలు మాట్లాడలేదు.
అతను మళ్ళీ “ఏం చేస్తారు” అని అడిగాడు.
“నాన్న ఇక్కడే దగ్గరలో ఒక కొట్టులో పనిచేసేవారు. ఇప్పుడు మానేశారు.”
“ఇంట్లో ఎవరెవరు ఉంటారు?”
“పిన్ని, ముగ్గురు చెల్లెళ్ళు.”
“జీతం డబ్బులు మీ నాన్న తీసుకుంటారా?”
“అవును.”
“సరే, వచ్చే నెల జీతంలో కొంత డబ్బు ఇక్కడే కట్ చేసుకుంటాం. బట్టలు కొనుక్కో. పే స్లిప్‌లో డబ్బులు కట్ చేసుకున్న డిటెయిల్స్ ఉంటాయి. అది మీ నాన్నకు ఇవ్వు.”
ఆమె తల ఆడించింది కానీ అతను చెప్పిన విషయం మీద శ్రద్ధ పెట్టలేదనిపించింది.
“సరే ఇక నువ్వు వెళ్ళచ్చు” అన్నాడు.
ఆ తర్వాత ఆమె గురించి ఆలోచించినప్పుడు ఆమె ఏదో ఒక బోనులో చిక్కుకొని ఉందనిపించింది. మరోవైపు అతనినుండి వస్తున్న ఒత్తిడి ఆమెను మరింత మానసికంగా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాడు. తను మరీ క్రూరంగా ప్రవర్తించానేమో అని కాసేపు మథనపడ్డాడు. ఆమెకు పంపించిన ఈ-మెయిల్ తెరిచి మరోసారి చదివాడు. నిజానికి అది కటువుగానే ఉంది. అయితే అతను ఊహించుకున్నంతగా ఆమె ఆ మెయిల్ వల్ల ప్రభావితురాలు కాలేదు. కటువైన మాటలు, చర్యలు అన్నీ ఆమెకు అలవాటు అయిపోయినట్టే తోచింది.
ఆమెను గూర్చిన ఆలోచనల్లో మునిగిపోయి ఉండటం అతనికి సహజంగా అనిపించసాగింది. దాదాపు అన్ని విషయాల్లోనూ ఆమె గూర్చిన ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. పాటలో దాగున్న తాళంలా, ఏ ఆలోచన ఆగిపోయినా ఆమె తలపు ముందుకు ఎగబాకి వచ్చేస్తోంది.
కెమికల్స్ పంప్ చేసి బయటకి పంపించే గొట్టంలో లీకేజ్ ఉందని ఫోర్‌మన్ వచ్చి చెప్పినప్పుడు అతనే స్వయంగా వెళ్ళి చూశాడు. అప్పటికప్పుడే అది సమస్యగా మారకపోయినా మెల్లగా పెద్ద సమస్యగా వచ్చి నెత్తిన పడుతుందని అర్థమైంది. దాన్ని బాగుచెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యమని, ఇంజనీర్లను రమ్మనీ ఫోన్‌లో చెప్పి చేతులు కడుక్కోడానికి చుట్టూరా చూశాడు. పక్కనే ఉన్న పొడవాటి గదిలోకి చేతులు కడుక్కోడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్ళు భోజనం చేస్తూ ఉండటం గమనించాడు. ‘సారీ’ అన్నాడు.
అయితే అక్కడున్న ఆడవాళ్ళు అతని రాకను సంతోషంగానే స్వీకరించారు.
ఒక చురుకైన అమ్మాయి “భోంచేద్దురు రండి సార్” అంది మెరుస్తోన్న కళ్ళతో. మిగిలిన ఆడవాళ్ళ కళ్ళల్లో నవ్వులు కనిపించాయి.
“నో, యూ గో ఆన్” అని చెప్పి వెనక్కితిరిగినప్పుడు దూరంగా ఒంటరిగా కూర్చున్న ఆమెను చూశాడు.
ఆమె ఒక్కత్తే కూర్చుని తింటోంది. ఒక క్షణం ఆమె ముందున్న చిన్న ప్లాస్టిక్ బాక్స్‌ని చూడకుండా ఉండలేకపోయాడు. ఒక ఊరగాయ ముక్క, కొంచం పెరుగన్నం. ఇంకేమీ లేవు. ఇలాంటి ఆఫీసు వాతావరణంలో ఈ రకంగా భోజనం తెచ్చుకోవడం అన్నది ఎలా ఉంటుందా అని ఒక క్షణం ఆలోచించాడు. అందరు ఆడవాళ్ళతో కూర్చుని ఆమె ఆ బాక్స్ ఓపెన్ చేసి తినడం అన్నది అసాధ్యమే. ఒకవేళ ఈ రోజు ఏదో ఆలస్యం అయుండచ్చు, అందుకే అర్జంటుగా అలా తెచ్చుకుందేమో అనుకున్నాడు.
ఈ విషయం గురించే ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. అయితే వెంటనే ఈ ఉత్సాహం ఎంతవరకు వెళ్తుందో చూడాలి అనిపించింది. మరుసటి రోజు ఆ లీకేజ్ గొట్టాన్ని ఇంజనీర్లు విప్పదీస్తున్నప్పుడు దాన్ని చూడటానికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ పొడవాటి గదిలోకి దూరాడు. ఆమె ఇప్పుడు కూడా అదే చోట కూర్చుని తింటూ ఉంది.
“ఈ రోజైనా భోజనం చేద్దురు రండి సార్. చపాతీ, చికెన్ తెచ్చాను” అని పిలిచింది ఆ చురుకైన అమ్మాయి మళ్ళీ.
“పరవాలేదు, ఇంకోరోజు తింటాలే…” అంటూనే దూరంగా కూర్చున్న ఆమె బాక్స్ కేసి చూశాడు. ఆమె తినటం ఆపేసి నిశ్చేష్టురాలిలా కూర్చుని ఉంది. అదే తెల్లటి అన్నం. ఎర్రగా ఊరగాయ ముక్క.
బయటకు వచ్చి ఇంజనీర్లకి ఆజ్ఞలు జారీ చేసి తన గదికి వచ్చాడు. చేతులు కట్టుకుని వాలుకుర్చీలో కూర్చోగానే ఆమె బాక్స్‌లో ఉన్న తెల్లటి అన్నం గుర్తొచ్చింది. ఆమె ఒంటిమీద తెల్లచారలూ గుర్తొచ్చాయి. ఆమె ఒళ్ళు బక్కచిక్కి పాలిపోయి ఉండటానికి కారణం ఇదే. ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి ఆహారమే తింటూ ఉండాలి. జెయిల్లో ఖైదీలకు కూడా ఇంతకంటే మంచి ఆహారం కనీసం రోజులో ఒక పూటైనా దొరుకుతుంది.
అతను ఆమె రూపాన్ని మరోసారి కళ్ళల్లో నిలుపుకుని చూశాడు. తర్వాత, అంతే అని చెప్పుకుంటున్నట్టు చేతులు ఊపి ఆ ఆలోచనను విరమించుకున్నాడు.
ఆ మరుసటి రోజు భోజనం సమయంలో ఆమె గుర్తొచ్చింది. ఆమె అక్కడ భోంచేస్తూ ఉంటుంది. అదే పెరుగన్నం. ఒక ఊరగాయ బద్ద. రుచిగా ఉన్న దేన్నయినా ఆమె తిని ఉంటుందా అనిపించింది అతనికి. అది ఆమె ఇంటిలోని పేదరికం వల్ల మాత్రమే కాదు. అందులో ఒక అణచివేత కూడా దాగి ఉంది. చిన్నతనం నుండి అలాంటి అణచివేతనే అనుభవిస్తూ పెరిగి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు సుడులు తిరిగాయి అతనిలో. ఎందుకని ఆమె గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? అనుకున్నాడు.
ఫోర్‌మన్ వచ్చి “పని అయిపోయింది సార్” అని అన్నాడు.
అప్పుడే అతను తన టేబిల్ మీద భోజనం కేరేజి విప్పి పరిచి పెట్టాడు. అతనికి ప్రతి రోజూ పక్కనున్న రత్నా కఫేనుండి ఆ రోజు స్పెషల్ మీల్స్ కేరేజిలో వస్తుంది. దాదాపుగా ఎప్పుడూ మాంసాహారమే. అతను పరచిన డబ్బాలను తీసి మళ్ళీ యథావిధిగా కేరేజి కట్టేశాడు.
“సార్, మీరు భోంచేయండి సార్. ఇప్పటికే లేట్ అయింది” అని అన్నాడు ఫోర్‌మన్.
“పరవాలేదు. తర్వాత తింటాలే. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా?” అంటూ ఫోర్‌మన్ వెంట నడిచాడు.
అక్కడ ఇంజనీర్లు పని ముగించుకుని అతని కోసం చూస్తూ ఉన్నారు. అతన్ని చూడగానే తాగుతున్న సిగరెట్‌లని కిందపడేసి సర్దుకుని నిల్చున్నారు.
అతను దగ్గరకు వెళ్ళి “అయిపోయిందా?” అని అడిగాడు.
“పక్కాగా ముగించాం సార్.”
“ఎందువల్ల ఇలా జరిగింది?” అని అడిగాడు.
“జాయింట్లలో మురికి పేరుకుంటుంది సార్. కెమికల్స్ మురికి మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది. పేరుకుంటే మరింతగా తినేస్తుంది.”
“ఇదెన్నాళ్ళు నడుస్తుందీ?”
“ప్రస్తుతానికి ఓకే సార్. లోపల మళ్ళీ తినకుండా ఉండాలంటే ఏదైనా కోటింగ్ ఇవ్వాలి. ఈ కెమికల్ స్టీల్‌ని బాగా తినేస్తుంది సార్.”
“అల్యూమినియం లేదా డ్యూరా అల్యూమినియం అయితే ఏమీ కాదేమో సార్” అన్నాడు ఒక ఇంజనీర్.
“అల్యూమినియం అలాయి ఏదైనా పరవాలేదు అనుకుంటా సార్” అన్నాడు మరో ఇంజనీర్.
“సరే చూద్దాం” అన్నాడు అతను.
“అయితే రిజిస్టర్స్ అన్నీ అక్కడికి పంపించేస్తాం సార్.”
“సరే పంపించేయండి” అని చెప్పి అతను తిరిగి చూసినప్పుడు పొడవాటి గదిలోకి నడుస్తున్న ఆమె కాళ్ళు తలుపు సందులో నుంచి కనిపించాయి.
ఒకక్షణం ఆలోచించి మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆమె మాత్రమే కూర్చుని తింటోంది. అందరు ఉన్నప్పుడు అక్కడ కూర్చుని తినడాన్ని తప్పించడానికి ఆలస్యంగా వచ్చిందని అర్థమైంది. అతన్ని చూడగానే బాక్స్‌కి మూత పెట్టింది. దాని లోపల ఉన్నది అదే పెరుగన్నం, ఊరగాయ ముక్కేనన్నది అతను చూశాడు.
“ఒంటరిగా భోంచేస్తున్నారేంటి?” అని అడిగాడు
“లేదు సార్…” తటపటాయిస్తూ లేచి నిల్చుంది.
“పరవాలేదు కూర్చోండి” అని “కృష్ణా” అని పిలిచాడు.
కృష్ణ దగ్గరకు వచ్చి “సార్” అన్నాడు.
“నా కేరేజిని ఇక్కడికి తీసుకురండి” అన్నాడు.
“కలిసే భోంచేద్దాం” అన్నాడు ఆమెతో.
“లేదు సార్” అని ఆమె ఏదో చెప్పబోతుంటే “కూర్చోండి” అన్నాడు.
ఆమె తినకుండా బాక్స్ మీదనుండి చేయి తీయకుండా అలా కూర్చుని ఉంది. ఆమె చేయి వణుకుతోంది.
కృష్ణ కేరేజీ తెచ్చి పెట్టాడు.
“వడ్డించండి” కృష్ణకు సైగ చేశాడు.
కృష్ణ ఒక్కొక్క గిన్నె తీసి టేబిల్ మీద పరిచాడు.
“షేర్ చేసుకుని తిందాం” అన్నాడతను.
మొట్టమొదటిసారిగా ఆమె కళ్ళల్లో కోపాన్ని చూశాడు. కృష్ణని బయటికి వెళ్ళమని సైగ చేశాడు.
“తీసుకోండి. నేను మీది తీసుకుంటాను” అన్నాడు. ఆమె ముఖం ఎర్రబడి కోపం స్పష్టంగా కనబడుతోంది. “భోంచేయండి” అన్నాడు.
“ఏంటి? జాలా?” అడిగింది ఆమె.
అప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆ కోపాన్ని చూస్తుంటే అతనికి లోలోపల చాలా సంతోషంగా అనిపించింది. ఒక బొమ్మ ప్రాణం ఉన్న అమ్మాయిగా మారింది అనిపించి ఆనందం కలిగింది.
“అవును, జాలే” అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అనుకున్నాడు.
ఆమె మరింత కోపంతో “నాకేం అవసరం లేదు” అంది.
“అవసరమే” అని చేతులు టేబుల్ మీద పెట్టి కొంచెం ముందుకు ఒంగి “ఎక్కువ మాట్లాడకుండా తీసుకుని తిను” అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
ఆమె నిర్ఘాంతపోయి కళ్ళు పైకెత్తి అతనికేసి చూసింది.
“ఊఁ, తీసుకో!” కటువుగా పళ్ళబిగువున ఆజ్ఞాపించాడు.
ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆతని కళ్ళల్లోకి చూసింది. మెల్లగా నవ్వి “సరే” అంది.
[మూలం: మలర్తుళి (పూలచినుకు – ఏప్రిల్, 2023) కథల సంపుటంలోని సువై (రుచి) అనే కథ.]