ది వేస్ట్‌ లాండ్: 2. బరియల్ – మూడవ దృశ్యం

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


మూడవ దృశ్యం

Madame Sosostris, famous clairvoyante,
Had a bad cold, nevertheless
Is known to be the wisest woman in Europe,
With a wicked pack of cards. Here, said she,
Is your card, the drowned Phoenician Sailor,
(Those are pearls that were his eyes. Look!)
Here is Belladonna, the Lady of the Rocks,
The lady of situations.
Here is the man with three staves, and here the Wheel,
And here is the one-eyed merchant, and this card,
Which is blank, is something he carries on his back,
Which I am forbidden to see. I do not find
The Hanged Man. Fear death by water.
I see crowds of people, walking round in a ring.
Thank you. If you see dear Mrs. Equitone,
Tell her I bring the horoscope myself:
One must be so careful these days.

వేస్ట్ లాండ్‍కు మొదట పెట్టదలచిన పేరు (He do the police in different voices) కదా! ఇప్పుడొక జలుబు గొంతు వినబోతున్నాం. మేడమ్ (మదామ్) సొసోస్ట్రిస్ (Madame Sosostris) ఒక ప్రఖ్యాత దైవజ్ఞ. తన దివ్యదృష్టితో, టారట్ పేకలు (tarot cards) వాడుతూ, అదృష్టాన్ని చెబుతుంది.

వేస్ట్ లాండ్‍కు ఉల్లేఖనంలో సిబిల్ కూడా యిలా జోస్యాలు చెప్పేదే. చాలా జాతులలో యీ సోది చెప్పేది స్త్రీలే-గణాచారులు ఎరుకలసానులు. కాని, చేటలో పోసిన చేరెడు బియ్యానికి సోది చెప్పే మనిషి కాదు యీ సొసోస్ట్రీస్. అరవై ఏళ్ళనాటి విత్తోరియా దె సీకా (Vittoria de Sica) సినిమా ది బైసికిల్ థీఫ్ (The Bicycle Thief) గుర్తొస్తుంది. అందులో ఒకడి సైకిల్ పోతుంది. దానితోపాటే ఆ సైకిల్ వల్ల రాకరాక వచ్చిన ఉద్యోగమూ పోతుంది. అటువంటి ఆపదలో యిటువంటి మేడమ్ దగ్గరకే కదా వెళుతారు? ఆమె గది కిక్కిరిసి ఉంది, క్లయింట్లతో. అలిసిపోయిన మేడమ్‍కు మధ్య మధ్య కాఫీ అందిస్తుంటుంది ఒక అసిస్టెంట్. ఆ సినిమా దృశ్యం గుర్తొస్తుంది.)

మేడమ్ సొసోస్ట్రిస్ చెప్పేది కూడా చౌకబారు చిలకజోస్యం కాదు. మేడమ్ దగ్గరకు పెద్దపెద్దవాళ్ళు వస్తుంటారు. ఆమెకు జలుబు కూడా చేస్తుంది! (famous clairvoyante, /Had a bad cold.) దివ్యదృష్టి ఉన్నవాళ్ళకు కూడా జలుబు చేస్తుందా! ఆమెకు ఎంత ఉధృతంగా జలుబు (bad cold) చేస్తేనేం, మొత్తం యూరప్ లోనే ఆమెకు పెద్ద పేరు. జోస్యం చెప్పడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు. టారట్ పేకముక్కల (pack of cards) ఆధారంగా ఆమె జోస్యం చెబుతుంది. (రోడ్డు పక్క చిలక కూడా పేకలోనుంచే ఒక కార్డ్ తీస్తుంది. ఈమె దగ్గర చిలక లేదు కాని, పేకముక్కలున్నాయి. జాతకచక్రాలు కూడా చూస్తుంది. (Tell her I bring the horoscope myself.) ‘పాడుపేక’ ముక్కలంటాడు, కవి (a wicked pack of cards) అన్నీ ‘పాడు’ ఫలితాలే చెబుతుందనేమో?

ఈ మేడమ్ నోట్లో ఒక్క మంచి మాట పలకదు. జాతకాలు చెప్పేవాళ్ళు రెండు విధాలు. కొందరు, జాతకచక్రం చేతిలోకి తీసుకొంటూనే, ‘ఓహో! ఆహా! మహజ్జాతకం! ఆరు నెలలలో అమెరికా వెళ్ళి పోతావు. వచ్చేటపుడు ఒక ఐ-ప్యాడ్ తెస్తావుగా నాకోసం’ అంటాడు. మరొకాయన, చక్రం చూస్తూనే ముఖం చిట్లిస్తాడు. ‘ఈ పిల్లకు కుజదోషం’ అని మొదలుపెట్టి, కట్టకముందే తాళి తెంపేస్తాడు. మన మేడమ్ ఈ రెండో రకమే.

సొసోస్ట్రిస్ చెప్పే దుష్ఫలితాలు, వ్యక్తులవే. కాని, ఆమె చెప్పే జోస్యం, మొత్తం యూరప్ భవితవ్యం కూడా. ఆ యూరప్ ‘పడిపోవును పేకమేడలై’ అంటున్నట్లుంది. (యూరప్ కూలిపోవడానికి కారణం యితరేతర శక్తులేవీ కావు. దాని దోషమే.) ‘పాడు పేకముక్కలు’ కూలకేమవుతాయి. ఆమె యిక్కడ చెప్పే జలుబుజోస్యం, కావ్యంలో నిజం కాబోతోంది.

ఎలియట్ యిక్కడ చెప్పిన ఆరు పేక ముక్కలలో, టారట్ పేకముక్కల్లోవి రెండు మాత్రమే: Man with three staves; The wheel. తక్కినవి స్వకల్పితాలు.

Phoenician Sailor:
Belladonna:
Man with three staves:
The wheel:
The One eyed Merchant:
The Hanged Man: (కార్డు కనబడుట లేదు – I do not find the Hanged Man.)

ఇక్కడ యీ మేడమ్‍ను మనకు పరిచయం చేస్తున్న పాత్ర ఎవరో తెలియదు. ఆమె క్లయింటా? అయితే అతడి మాటలలో వ్యంగ్యం ఎందుకుంది? (bad cold, ఆమె చెప్పే జోస్యం తుమ్మితే ఊడే ముక్కులాగా అంటున్నాడా? ఆమె దౌష్ట్యాన్ని (wicked) ధ్వనిస్తున్నాడా? లేక, క్లయింట్ కాక మరో పాత్ర ఆమెను పరిచయం చేస్తున్నారా? అతడికి జోస్యంలో నమ్మకం ఉందా? ఇవన్నీ వఠ్ఠి మూఢనమ్మకాలంటున్నాడా?

ఆమె కార్డులు చూద్దాం:

  • The drowned Phoenician Sailor: చావు కబురుతో వస్తుంది, మొదటి కార్డు. ఫినీషియన్లు దాదాపు వేయి సంవత్సరాలుగా సముద్రయానంలో ఆరితేరినవారు. ఈ నావికుడు పోయిందెపుడు? సముద్రపులోతుల్లో శవం చాలాకాలం ఉండిపోతే దాని కళ్ళు ముత్యాలుగా మారిపోతాయట. ఫినిషియన్ చనిపోయిందెప్పుడో కాని, ఇప్పుడు అతడి కళ్ళు ముత్యాలు, ఖరీదైన రాళ్ళు (precious stones). కాని, రాళ్ళు. (Those are pearls that were his eyes. Look.) ఈ వాక్యం షేక్స్‌పియరు నాటకం ది టెంపెస్ట్‌లో (The Tempest) ఏరియల్ పాటలోది. చూడలేని కళ్ళను ‘చూడు’ అంటోంది, మేడమ్. చూడడానికి ముత్యాలలా అందంగా ఉండేవి కళ్ళు కావు, అందం చూడగలిగేవి కళ్ళు. రాళ్ళైన కళ్ళు, బండరాళ్ళైన గుండెలు, శవసంస్కృతి.
  • Belladonna: (ఇటాలియన్ భాషలో అందమైన స్త్రీ) ఈ పదానికి మరో అర్థం కూడా ఉంది. హోమియో మందులు వాడే వాళ్ళకు తెలిసిన పేరే. అది ఒక విధమైన విషం. అందము, అపాయము రెండు మేళవించిన మహిళ. ఆమె అందం ఎరగా విసురుతుంది, పనులు సాధించుకోడానికి (Lady of situations). బాహ్యసౌందర్యానికి మోహితులై మోసపోవద్దు అని హెచ్చరిస్తోంది, మేడమ్.
  • Man with three staves: మూడు కర్రలతో మనిషి. ఈ కార్డు అనావృష్టిని కరువును సూచిస్తుంది. వెనుక చూచిందే – stony rubbish, dry stone, no sound of water.
  • The One eyed Merchant: ‘వీడి వీపు మీద ఏదో ఉంది. నేను చూడకూడదన్నమాట.’ అదేదో ప్రమాదాన్ని సూచిస్తుంటుంది. వీపుమీద ఏముందో ఎలా కనపడుతుంది ఎవరికైనా? ఆమెకు కనిపిస్తుంది. ఆమెకు దివ్యదృష్టి ఉన్నది కదా. కాని ఆమె చూడకూడదట! (I am forbidden to see.)
  • the Hanged Man: ‘ఈ కార్డు కనపడుట లేదు. ఇది అశుభసూచకం. నీకు జలగండం ఉంది’ అంటోంది. బాగుంది! టప్ అన్న నీటి శబ్దం వినబడని రాతినేల, యిక్కడ జలగండం! (Death by Water అని వేస్ట్ లాండ్‍ లోని అయిదు అంకాలలో ఒకటి, అన్నిటికంటె చిన్నది. ఈమె జోస్యం అక్కడ నిజం కాబోతోంది.) నీరులేక నోరెండికూడా చావొచ్చు, యీ మరుభూమిలో. ఈ ఉరి తీయబడ్డ వ్యక్తి (hanged man) శిలువపై క్రీస్తును సూచించవచ్చు. వేస్ట్ లాండ్ లోని చివరి సెక్షన్‍లో (What the Thunder Said) ముసుగుమనిషి (Hooded Man) కూడా క్రీస్తునే గుర్తుచేస్తుంది. (He who was living is now dead.) ఈ క్రీస్తు శిలువపై మరణించిన క్రీస్తు, పునరుత్థానానికి పూర్వపు క్రీస్తు. ఇక్కడి ఉరి తీయబడ్డ వ్యక్తి కూడా, జీవన్మృతుడు. ఇంకా పునరుత్థానం జరుగలేదు. జరిగే సూచనలు కూడా లేవంటోంది సొసోస్ట్రిస్. (I do not find The Hanged Man.)

    ‘ఈ కార్డు కనపడడం లేదు. ఇది అశుభసూచకం. నీకు జలగండం ఉంది’ అన్నమాటలకర్థం: ‘కృపాజలసేచనం లేని నీకు, మృత్యువు తప్ప, ఈ జన్మలో ఆధ్యాత్మికపునర్జన్మకు అవకాశం లేదు.’

  • The wheel: చక్రం. ఎలియట్ చెప్పిన కార్డుల్లో రెండే అసలు టారట్ పేకలు, తక్కినవి ఎలియట్ కల్పితాలని చెప్పుకొన్నాం. మేడమ్ యీ కల్పితమైన పేకముక్కలనే జోస్యానికి వాడుకొంది. అసలు టారట్ కార్డులు రెంటినీ పేరు మాత్రం చెప్పి ఊరకుంది. అలా వదిలిన వాటిలో ఈ wheel ఒకటి. (…and here the wheel.) ఈ చక్రం ఏ భవిష్యదర్థం చెప్పదా? నిజానికి అర్థం చెప్పక వదిలేసిన యీ కార్డుకు చాలా అర్థం చెప్పుకోవలె, మనమే చెప్పుకోవలె. నాలుగు లైన్లు ముందు, మునిగిపోయిన ఫినీషియన్ నావికుడు; నాలుగు లైన్ల తరువాత జలగండం – ఈ చక్రానికి తగిలించుకోవలె మనం.

అట్లాంటిక్ మీద కురుక్షేత్రం

అంతే కాదు, ఎలియట్ కావ్యాలలో, సముద్రము సముద్రయానము నావ స్టీరింగ్ చక్రము – ఇవి తరచు కనిపిస్తుంటాయి. అది సహజమే. ఎలియట్ తన బాల్యంలో వేసవి సెలవులు సముద్రతీరంలో గడిపిన వాడు (గ్లోస్టర్, మసాచుసెట్స్) ఫోర్ క్వార్టెట్స్ (Four Quartets) కవిత లోని డ్రై సాల్వేజెస్‌లో (Dry Salvages) యీ బాల్యానుభవ ప్రభావం బాగా కనిపిస్తుంది. (కవిత్వమంటే, వెంటాడే బాల్యమే కదా!) అందులోనే ఎలియట్ భగవద్గీతను స్మరిస్తాడు. (అట్లాంటిక్‌పై కురుక్షేత్రం! రథసారథి చక్రధారి అయి కనిపిస్తాడు.)

O voyagers, O seamen,
You who came to port, and you whose bodies
Will suffer the trial and judgement of the sea,
Or whatever event, this is your real destination. ’
So Krishna, as when he admonished Arjuna
On the field of battle.
Not fare well,
But fare forward, voyagers.

గమ్యం కాదు, ప్రయాణం ముఖ్యమంటాడు, ఎలియట్. ధనమైనా నిధనమైనా స్వధర్మాచరణంలోనే. వేస్ట్‌ లాండ్‌ లోని డెత్ బై వాటర్ (Death by Water) అనే భాగంలో కూడా యీ చక్రప్రసక్తి ఉంది:

Gentile or Jew
O you who turn the wheel and look to windward,
Consider Phlebas, who was once handsome and tall as you.

‘O you who turn the wheel’. స్టీరింగ్ వీల్ వద్ద ఉండి, చక్రం తిప్పేవాడి సామర్థ్యం మీద ప్రయాణము, ప్రయాణికుల భద్రత ఆధారపడుతుంది. నావ నడిపేవాడు కనిపించే చక్రధారి. కనిపించని చక్రధారి ఒకడున్నాడు, యీ జగత్తుకు. ఆ చక్రాన్ని, చక్రధారిని గుర్తించకుంటే, ‘నేనే చక్రం నడుపుతున్నాను’ అన్న అహంకారం ముంచుతుంది, యిందులోని ఫ్లీబస్‌ను ముంచినట్టు. ఫ్లీబస్ ‘ఒకప్పుడు నీ లాగే అందగాడు, ఆజానుబాహువు.’ (Consider Phlebas, who was once handsome and tall as you.) ఏమైనాడు? నీవు యూదువైనా కాకపోయినా మరెవరైనా, యిదే గతి. ఈ గతి కలగకూడదు అంటే, మార్గం శరణాగతి. సర్వసమర్థుడైన చక్రధారికి చక్రం వదిలేసి నిశ్చింతగా ప్రయాణం చెయ్యి.

ఎలియట్ యిక్కడ, మరణం తరువాతి తరణం కాదు చెప్పడం. బతికుండగానే తరింపజేయగల తారకమంత్రం చెబుతున్నాడు.

మైథిలీ శరణ గుప్త తన సాకేత్ కావ్యంలో యీ తరణసాధనమే చెబుతున్నాడు:

కింతు సురసరితా కహాఁ సరయూ కహాఁ?
వహ్ మరోఁ కో మాత్ర్ పార ఉతారతీ;
యహ్ యహీఁసే జీవితోఁ కో తారతీ!

అయినా, ఎక్కడ సురసరిత? ఎక్కడ సరయు?
అది మృతుల మాత్రము చేర్చునావలి తీరం.
ఇది ఇక్కడిక్కడే జీవితాలకు తారణం.

‘తరించగలిగేది ఎప్పుడో ఎక్కడో కాదు, యిప్పుడే యిక్కడే. ఎప్పుడు ఎక్కడ అని పేకముక్కల్ని అడగకు.’ అంటే, అందము ఆనందము మరచి, బతికినంతకాలము మృత్యువు నీడలోనే గడిచిపోవలెనని అర్థమా? కాదు. వాటిని సార్థకం చేసుకోమని సందేశం.

చక్రభ్రమణము, స్థిరకేంద్రము

ఈ చక్రం కష్టసుఖాల జీవితచక్రం కూడా. కష్టసుఖాలు మనం నియంత్రించగలిగినవి కావు. అవి ఎందుకొస్తాయో ఎందుకుపోతాయో మనిషి చెప్పలేడు. కాని తెలుసుకోవాలన్న కోరిక పెద్ద బలహీనత. కష్టాలు కలకాలం కాపురం ఉండవు. సుఖాలు శాశ్వతాలు కావు. ఈ తెలివి కలిగి, తిరిగే చక్రాన్ని పట్టుకోక, స్థిరబిందువును చేరే ప్రయత్నం చెయ్యి, అంటాడు ఎలియట్. ఈ చక్రభ్రమణము స్థిరకేంద్రము ఎలియట్ కవితలో చాలా కీలకమైన కల్పన:

At the still point of the turning world.
Except for the point, the still point
There would be no dance,

…as a Chinese jar still
Moves perpetually in its stillness. – (Burnt Norton: Four Quartets)

నైశ్చల్యమంటే, జడంగా పడి ఉండడం కాదు. కేంద్రబిందువు వద్ద కనిపించని కదలికే, యీ కనిపించే నిరంతరజగచ్చక్రభ్రమణకారణం. కేంద్రబిందువెంత స్థిరము స్తిమితము అయితే, యీ జగచ్చక్రానికి అంత జవము చైతన్యము.

భగవద్గీత, జగచ్చక్రం: ఎలియట్

భగవద్గీతలో కూడా యీ చక్రం ఉంది. ఈ జగత్తు ఒక జగచ్చక్రం (giant wheel). ఈ జగచ్చక్రాన్ని నిరంతరం తిప్పుతున్నాడు జగన్నాథుడు. దానినెక్కి కూర్చుని నేనే తిరుగుతున్నాననుకొంటున్నాడు మనిషి. అదే స్మృతిభ్రంశము, బుద్ధినాశము. అదే మాయ.

ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. (భగవద్గీత. 18. 61.)

పాతకాలంలోని రంగులరాట్నమైనా, యీ కాలపు రాక్షసచక్రమైనా, యంత్రమే. ఈ యంత్రం పైకెక్కి కూర్చున్నవి సర్వభూతములు (యంత్రారూఢాని). వారి హృద్దేశంలో, అంటే చక్రానికి కేంద్రస్థానంలో, ఈశ్వరుడున్నాడు. చక్రానికి ఎన్ని కేంద్రబిందువులుంటాయి? ఎందరి హృదయాలలో ఉంటాడు? ‘సర్వభూతానాం’ అంటున్నాడు. ఎన్ని గుండెలు! అదే, ఆ అనేకమే, భ్రమ, (భ్రామయన్ భ్రమణం కారయన్: శంకరభాష్యం.) ‘మాయయా భ్రామయన్’ అంటే, ఏమిటర్థం? ‘చూశారా, నేను లోకాన్ని ఎలా మాయ చేస్తున్నానో?’ అని అదేదో గొప్ప పని చేస్తున్నట్టు, వికటాట్టహాసం చేస్తూ తన విలనీ ప్రకటించుకొంటున్నాడా, భగవానుడు? కాదు.

సర్వభూతములకు తమతమ పనులలో ‘తిరుగగల’ (భ్రమణం) శక్తిని, తమ విధులు నిర్వర్తించగలశక్తిని యిచ్చేవాడు ఈశ్వరుడు. మరి ‘మాయయా’ ఏమిటి? ఈశ్వరుడు చక్రం తిప్పుతుంటే, తిరిగే చక్రం పైన కూర్చుని తిరుగుతూ, ‘నేనే తిరుగుతున్నా’ననుకొంటున్నాడు మనిషి. ఇది మాయ. ఈ మాయ ఈశ్వరుడి శక్తి, ఈశ్వరుడు సర్వభూతములకు యిచ్చిన శక్తి. అంటే, మనిషి తన విధులు నిర్వర్తించడానికి అవసరమైన ఈశ్వరప్రసాదమైన మాయాశక్తి. ఆ ఈశ్వరశక్తి లేకపోతే కాలుకూడా కదపలేని మనిషి, అంతా నేనే కదుపుతున్నా అనుకొంటాడు. ఆ మాత్రం అహం లేకపోతే ప్రాణులు తమ విధులలో ప్రవర్తించలేవు. చక్రం ప్రవర్తించదు. అదీ, మాయయా భ్రామయన్ అంటే.

హృద్దేశంలో ప్రతిష్ఠితుడైన యీ ఈశ్వరుడే, ఎలియట్ తన భాషలో చెబుతున్న the still point of the turning world. ఈ జగచ్చక్రం నిర్వక్రంగా ప్రవర్తించవలెనంటే, హృద్దేశంలో ప్రతిష్ఠితుడైన ఈశ్వరుని గుర్తించవలె. గుర్తించని జీవితం మృత్యువుతో సమానమే (the drowned Phoenician) అది నరకమే. నరకం దాన్తెకు బాగా తెలుసు.

దాన్తె: ఎలియట్

I see crowds of people, walking round in a ring అంటున్నది మేడమ్ సోసోస్ట్రిస్. ఈ వలయం (ring), దాన్తె తన ఇన్ఫెర్నోలో (Inferno) వర్ణించిన వలయాల వంటిదే అయి ఉండవచ్చు. దాన్తె తన కావ్యంలో నరకంలో కాలనీలను (circles) అన్నిటినీ చాలా వివరంగా వర్ణిస్తాడు. (ఆసక్తి ఉన్నవారికి, అటువంటి గైడు మన పురాణాలలో కూడా దొరుకుతుంది. వర్జిల్ లాంటి టూరిస్ట్ గైడు కూడా దొరుకుతాడు.) Burial of the Dead ముగింపులో, ఎలియట్ దాంతే వాక్యాన్ని వాడుకున్నాడు: I had not thought death had undone so many! నరకంలో (Inferno) తాను చూచి విభ్రాంతుడై దాన్తె అన్న వాక్యం, ఎలియట్ తాను లండన్ బ్రిడ్జ్‌పై చూసినవారి గురించి అంటూ, ‘వీరు జీవన్మృతులు, వీరి జీవితాలు నరకసదృశం’ అని ధ్వనిస్తున్నాడు.

ప్రస్తుత సందర్భంలో, సొసోస్ట్రిస్ వాక్యానికి కూడా అటువంటి వ్యాఖ్యానమే చేయవలసి ఉంటుంది. జనం మందలు మందలుగా గానుగెద్దులలాగా గుండ్రంగా తిరుగుతూ కనిపిస్తున్నారు. ఎంతకాలం ఎన్ని మైళ్ళు నడిచినా ఉన్నచోటికే మళ్ళీమళ్ళీ వస్తున్నారు. అడుగు ముందుకు వెళ్ళలేరు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటువెళుతున్నారో తెలియదు. దిక్కు తోచక, గమ్యం తెలియక, క్షణం తీరిక లేక తిరుగుతున్న జనాలను గురించి, వారి వ్యర్థజీవితాలను గురించి అంటున్న మాట.

మేడమ్ జోస్యం ముగిసింది. ఇక బిజినెస్. పేకముక్కలు సంచిలో వేసుకొంటూ, తన క్లయింట్‌తో, మరో క్లయింట్ ఈక్విటోన్ (Mrs. Equitone) ప్రస్తావన తెస్తుంది. మేడమ్ దగ్గరకు చాలామంది వస్తారు. కొందరి దగ్గరికి మేడమే వెళుతుంది, వాళ్ళ పర్సనల్ ఫైల్స్ తీసుకొని. వి.ఐ.పి.ల ఫైళ్ళు తనదగ్గరే ఉంటాయి. (ఫ్లాట్ కొన్నవాడు రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళతాడు, సంతకాలు చేయడానికి. ఫ్లాట్ కట్టినవాడి దగ్గరకు రిజిస్ట్రార్ వెళుతాడు, ఫైలు మోసుకొని.) మేడమ్ అంటుంది తన క్లయింట్‌తో:

If you see dear Mrs. Equitone,
Tell her I bring the horoscope myself:
One must be so careful these days.

ఈక్విటోన్ అంటే మేడమ్‌కు భయము భక్తి రెండూ ఉన్నట్టున్నాయి (dear Mrs. Equitone అంటోంది). మేడమ్‌కు పోలీసుల భయం కూడా ఉందేమో (One must be so careful these days). లేక, హోరోస్కోప్ తానే వెళ్ళి స్వయంగా క్లయింటుకు యిస్తాననడం, ఆమెకు అందవలసిన ఫీజు కొరకు అయి ఉండవచ్చు.

(కొందరు విమర్శకులు, ఈ మిసెస్ ఈక్విటోన్, ద విన్చీ (da Vinci) చిత్రం మడోన్న (Madonna of the Rocks) లోని మేరీ కావచ్చు అంటారు. అది అంత సమంజసంగా లేదు. ఆ పేరులోనే తిరకాసు ధ్వనిస్తుంది: Equitone, equivocation. ఆమెను మేరీ కన్యగా గుర్తించడం అంత సులభం కాదు. పైగా, ఒక Lady of the Rocks (the lady of situations, Belladonna,) సీనులో ముందే ఉంది. కాని, ముందే అనుకొన్నట్టు, ఏ అర్థాన్నైనా సమర్థించగల సందర్భం సృష్టించడం ఎలియట్ శిల్పంలోని ప్రత్యేకత. సామర్థ్యం బాధ్యత రెండూ పాఠకుడివే. ఎలియట్ పాఠకుడికి అర్థస్వేచ్ఛనిస్తూనే, తన రచనను నియమించుకోగలడు. (a controlling detachment, అంటాడు Alvarez.)

జోస్యం

ఇంతకూ, వేస్ట్ లాండ్‌లో, ఈ జోస్యం ప్రాధాన్యం ఏమిటి? సోసోస్ట్రీస్:

the wisest woman in Europe,
With a wicked pack of cards.

ఇందులోని వ్యంగ్యం స్పష్టమే.

Where is the Life we have lost in living?
Where is the wisdom we have lost in knowledge? – Chorus from ‘The Rock.’

మనిషికి భవిష్యత్తు తెలుసుకోవలెనని ఆసక్తి. కాని ఆ చూపు ఎంత దూరపుచూపు? (… man fixed his eyes before his feet (l. 65.) అంటాడు ఎలియట్, దీని తరువాత సీనులో.) భవిష్యత్తులో ఆసక్తి, అల్పవిషయాలలోనే కాని, జీవితపరమార్థవిషయంలో లేదు. సోదిమాటలలో ఉన్న శ్రద్ధ, ప్రవక్తల మాటపై లేదు. సొసోస్ట్రిస్ చెప్పే నిజాలు పేకముక్కల్లా కూలిపోయేవి (pack of cards), పరమార్థంలో పనికిరానివి (wicked). దొరకని చోట వివేకం (the wisest woman in Europe) వెదుకుతున్నాం. దొరికిందే వివేకం అనుకొంటున్నాం.

శిల్పవిషయం

ఎలియట్ యీ సీనులో ఆశించిందేమిటి? చౌకబారు జోస్యాలను విమర్శించడమా? అవును. కాని ఆమె చెప్పిన జోస్యాలన్నీ కావ్యంలో ముందు నిజం కాబోతాయి. అవి భయంకరమైన నిజాలు కూడా. వెనుక చెప్పిన I will show you fear in a handful of dust, అన్న ప్రవక్త వాక్యం యీ చౌకబారు జోస్యాన్ని నిజం చేస్తుంది. నిర్జీవులు తిరిగే నిర్జనమైన ఎడారి యీ సంస్కృతి. ఆధ్యాత్మికదాహం తీర్చడానికి ఒక చుక్క నీరు లేదు, కాని మునిగి చావగలిగినన్ని నీళ్ళున్నాయి. దాంతే నరకం (Inferno “) పుట్ట పగిలి, ప్రేతాత్మలు లండన్ నగరంలో (ఒక్క లండనే కాదు) హడావుడిగా తిరుగుతున్నాయి.

జీవంలేని జీవనవిధానం ఎంత దుస్సహమో, ప్రేతాలు జీవులలా తిరగడం అంతకన్నా భయంకరం. చనిపోయినదంతా చచ్చినట్టు పడి ఉండదు. గతం ప్రేతమై వెర్రెత్తి వీథులలో తిరుగుతుంది. జనాలకు వెర్రెక్కిస్తుంది. ఇది పెద్ద ప్రమాదం. ఇదొక భయంకరపునరుత్థానం (Resurrection).

జనాలు వెర్రిగా వెంటబడే జోస్యాలను వ్యంగ్యంగా చిత్రిస్తూనే, ఆ జోస్యాన్నే తన ప్రధాన కావ్యవస్తువు చేసుకోవడం యీ దృశ్యంలోని కావ్యశిల్పవిశేషం.

గతము, భవిష్యత్తు (memory and desire) రెండూ చూశాము. రెండూ రెండే. ఇక ముగింపు. భూతభవిష్యత్తులొక్కటైన వర్తమానం. ఇహపరాల సరిహద్దులు చెరిగిన దృశ్యం. ఎవరు ప్రాణులు ఎవరు గతప్రాణులు, ఏది జీవనము ఏది పునరుజ్జీవనము తెలియని స్థితి.

(సశేషం)