వేస్ట్‌ లాండ్: 4. ది ఫైర్ సెర్మన్ 1

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


3. ది ఫైర్ సెర్మన్

రెండు కట్టెల ఎండురాపిడిలో
రగిలింది అంగరాగం
మిగిలింది కామధూమం
హోమం కానిది
ఆరని అంగారం.
(నా కవితాసంపుటి అగ్నిమీళే నుండి)

వేస్ట్ లాండ్‌ లోని ఈ మూడవ కవితలో వస్తువు యీ ఎండుకట్టెల రాపిడి.

Monks, the All is aflame….
Aflame with what? Aflame with the fire of passion
the fire of aversion, the fire of delusion. (The Fire Sermon: Aditta Sutta)

వేస్ట్ లాండ్‌ కావ్యం ఒక నిర్వేదదర్శనంలో ఆవిర్భవించింది. పాశ్చాత్యసంస్కృతి పునరుజ్జీవనానికి ఆశ కూడా మిగల్చని మరుభూమిలా మారిపోయింది. ఆ దశలో ఎలియట్ దృష్టి ప్రత్యామ్నాయ సంస్కృతులవైపు మళ్ళింది. తూర్పు సంస్కృతులవైపు అతని చూపు మళ్ళింది. వైదికధర్మము బౌద్ధము అతన్ని ఆకర్షించాయి. ఉపనిషత్తులు, పతంజలి మహాభాష్యము కొంత చూశాడు. బౌద్ధదర్శనాలు చూచాడు. అవి బలంగా ఆకర్షించాయి. బౌద్ధమతాన్ని స్వీకరించే ఆలోచన కూడా అతనికి కలిగింది. కాని క్రైస్తవమతంపై మనసు యింకా ఊగిసలాడుతున్నది. ఈ దశలో రాసిన కావ్యం వేస్ట్ లాండ్‌. వేస్ట్ లాండ్‌ మొదటి ప్రతి ది ఫైర్ సెర్మన్ తోనే మొదలవుతుంది. అంటే, బౌద్ధప్రభావం అతనిపై ఎంత బలంగా ఉండిందో తెలుస్తుంది. ఆ ప్రభావస్వరూపమేమిటో చూద్దాం.

వేస్ట్ లాండ్‌‌లో ప్రధానకావ్యవస్తువు వంధ్యత్వం (infertility) అని కావ్యం పేరే చెబుతున్నది. స్త్రీపురుషుల వంధ్యత్వక్లైబ్యాలకు ప్రతీక ఊషరక్షేత్రం (The Waste Land) అని అర్థం చేసుకొంటున్నాం. అంతే కాక, ఏమీ పంటనివ్వని క్షేత్రము, సంతానం కలగని వంధ్యత్వక్లైబ్యాలు, యీ జడచేతనాలు రెండూ కూడా ఆధ్యాత్మిక వంధ్యత్వానికి ప్రతీకలు అని కూడా అర్థం చెప్పుకొంటున్నాం. ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఆశ లేదు అన్న నిర్వేదం ఎలియట్ కావ్యంలో ప్రధానకావ్యవస్తువు అని నిర్ధారించాము. ఇది పూర్తి నిజం కాదు. ఆధ్యాత్మిక స్వస్థతకు పునాది ధర్మవ్యవస్థ, అంటే సమాజసువ్యవస్థ. సమాజమంటే ఏమిటి? మనుషులే కదా? సమాజసువ్యవస్థకు సత్సంతానం ప్రాణం. ఇది ఎలియట్ కావ్యవస్తువు. ఊషరక్షేత్రం లేక వంధ్యత్వక్లైబ్యాలు కేవలం ఆలంకారికార్థంలో గ్రహిస్తే, ఎలియట్ ఆశించిన ప్రయోజనం నెరవేరదు. ఎలియట్ ఉద్దేశించిన సంతానసాఫల్యం గౌణార్థంలో కాదు, ముఖ్యార్థంలోనే అని గ్రహించకపోతే వేస్ట్ లాండ్‌ సరిగా అర్థం చేసుకోనట్లే. స్త్రీపురుష సంబంధం సంతానసాఫల్యం కొరకు అన్న వివేకం నశిస్తే ఏ సమాజానికైనా యీ స్థితి కలుగుతుంది అన్న సత్యాన్ని దర్శించాడు ఎలియట్. భారతీయదర్శనంలో ప్రాణభూతమైన అంశం యీ సంతానమే. ‘ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీః’ (తై. ఉప. 1. 11. 1), ‘ప్రజాయై గృహమేధినామ్’ (కాళిదాసు, రఘువంశము) – సంతానమంటే జనాభాను పెంచడం కాదు. ధర్మాన్ని అవిచ్ఛిన్నంగా ప్రవర్తింపజేయగల సంతానం కావలె. ఇటువంటి సంతానం కొరకే భారతీయ పురాణాలలో వేలసంవత్సరాలు తపస్సు చేసినవారి కథలు చదువుతాం. వారి తపస్సు జనాభా పెరగడానికి కాదు. (ఈ సాఫల్యం లేనపుడు, స్త్రీపురుషసంబంధమైనా, స్వలింగసంపర్కమైనా ఒకటే. రెండూ నిష్ఫలమే. ఈ అంకంలో యూజినిడీస్ అనే పాత్ర హోమోసెక్సువల్.)

పురాణకాలంలో కూడా సంతానసాఫల్యకేంద్రాలు, వాటినిర్వహణకు తగిన చట్టాలు ఉండినవి. కనుక తపస్సుకు ప్రయోజనం సంతానం కాదు, సత్సంతానప్రాప్తి. సమాజసువ్యవస్థకు ఆధారం సుప్రజ. వేస్ట్ లాండ్‌ లోని ప్రధానవస్తువు వంధ్యత (sterility) అని గుర్తించడం సులభమే. కాని దాని ప్రాధాన్యం సరిగా గుర్తించడం కూడా అవసరం. యూరప్ జనాభా పెరగడం లేదు అని కాదు ఎలియట్ నిర్వేదం. వేస్ట్ లాండ్‌‌లో ప్రధానకావ్యవస్తువు సంతానాపేక్షతో చేయవలసిన తపస్సు. అది ఇప్పుడు అన్ని సమాజాలు చేయవలసిన తపస్సు. ఎన్ని వేల సంవత్సరాలు చేయాలో! ఈ ప్రాధాన్యం గుర్తించని సమాజంలో కామం క్షామానికి దారి. సమాజసువ్యవస్థకు ధర్మబద్ధమైన కామం ప్రాణం. ఎలియట్ ఎక్కడా వాచ్యం చేయలేదు కాని, వేస్ట్ లాండ్‌‌లో కావ్యవస్తువు పటిష్ఠమైన వివాహవ్యవస్థ. ఈ అంకంలో ఎలియట్ మూడుసార్లు ఉదాహరించిన స్పెన్సర్ కవిత ప్రొథలమియాన్ (Prothalamion) ఒక పెళ్ళిపాట. ప్రపంచంలోని మహాకావ్యాలన్నిటికీ కావ్యవస్తువు పటిష్ఠవివాహవ్యవస్థ, రామాయణభారతాలకు, ఒడీసియస్‌కూ. ఈ సత్యం దర్శించలేని సమాజంలో, శృంగారం ఆనందం కాదు, ఆరిపోని అంగారం. ఈ అంకం ముగింపు యిదే: burning.

బుద్ధుడు గయలో అప్పుడే తననాశ్రయించిన వేయిమంది శిష్యులకు చేసిన బోధ యీ ఆదిత్తసుత్త. అప్పటివరకు అగ్నిసూక్తం వల్లిస్తూ, అగ్నిని ఆరాధిస్తూ ఉండిన తన కొత్త శిష్యులకు, వారికి పరిచితమైన భాషలో చెబితే సులభంగా పట్టుకొంటారని యీ విధమైన బోధ చేశాడట. ’భిక్షువులారా! సర్వము మండిపోతున్నది!’ ఏమిటి మంట? సర్వేంద్రియవ్యాపారము మండడమే! కన్ను చూచింది తనకు నచ్చింది కావాలంటుంది. నాలుక తనకు నచ్చింది కావాలంటుంది. అన్ని యింద్రియాలు ఏదో ఒకటి కోరుతూనే ఉంటాయి. కోరిక తీరేదాకా మంట. కోరిక ఎన్నటికీ తీరిపోదు. మంటలు ఆరవు. సర్వేంద్రియాలు సర్వదా మండుతూనే ఉంటాయి. ఈ మంటనే ఎలియట్ చెబుతున్నాడు వేస్ట్ లాండ్‌ లో.

అగస్టిన్: ధూర్జటి: అన్నమయ్య

సెయింట్ అగస్టిన్ తన పాపచరిత్రను ఒక గ్రంథంగా రాశాడు. దాని పేరు కన్ఫెషన్స్ (Confessions, లాటిన్). ఇది క్రైస్తవులు నిత్యము పఠించవలసిన గ్రంథమే కాక, పాశ్చాత్యసాహిత్యాలలో దీనికి ఒక ప్రముఖస్థానం కల్పించబడింది. అగస్టిన్‌‌ను మన ధూర్జటితో పోల్చవచ్చునేమో. తన పాపాలను దాచుకోకుండా పాఠాలుగా మార్చినవారు వీరిద్దరూ. ఇద్దరూ పాపపుబుద్ధిని నిగ్రహించడం తమ వశం కాదని, ప్రభువును ప్రార్థిస్తారు. ’ఈ కామాగ్ని నన్ను కాలుస్తున్నది. ప్రభూ! నన్ను బయటికి లాగు’, అంటాడు (Pluck me) అగస్టిన్. ధూర్జటిని యింతకుముందు చూచాం:

రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,
పాసీ పాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి, వాంఛాలతల్
కొసీ కోయదు నామనం బకట! నీకున్ ప్రీతిగా సత్ర్కియల్
చేసీ చేయదు, దీని త్రుళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వరా!

అన్నమయ్య కూడా యిదే అంటాడు:

దేవ యీ తగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా|
తనువున బొడమినతతి నింద్రియములు
పొనిగి యెక్కడికి బోవునయా|
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేగుదురయ్యా|

భగవంతుని అనుగ్రహం లేనిదే ఇంద్రియనిగ్రహం సాధ్యం కాదు అని అంటున్నారు వీరు. ఎలియట్ కూడా యిదే అంటాడు తన ఫోర్ క్వార్టెట్స్‌లో :

Love is the unfamiliar Name
Behind the hands that wove
The intolerable shirt of flame
Which human power cannot remove. (L. G.)

బుద్ధుడు ఎవడికి వాడే యీ యమనియమాలు సాధించవలెనంటాడు. అగస్టిన్ ‘ప్రభూ! నీవే నన్ను పీకి బయటపడేయ్’ అంటాడు. బుద్ధుడిని అగస్టిన్‌ను కలిపి వాడుకుంటున్నాడు ఎలియట్.

ఎలిజబెత్ రాణి: లెస్టర్

మొదటి ఎలిజబెత్ అవివాహితగానే ఉండిపోయింది అన్నది ప్రసిద్ధమే. అలా ఉండిపోవడానికి కారణం రాజకీయం అంటారు. యూరప్ లోని దేశాధిపతులందరి దృష్టి ఆమెపై ఉండడానికి, వివాహావకాశానికి ఎదురుచూస్తూ ఉండిపోవడానికి, ఆమె ‘కన్య’గానే ఉండిపోయింది. ఆమెకు రాజకుటుంబానికి చెందిన లెస్టర్‌కు (Earl of Leicester) ప్రేమవ్యవహారం నడిచిందంటారు. అటువంటి సంబంధం నిజమే అయినా సాఫల్యం ఉండదు కదా!

ఈ ఎలిజబెత్ రాణి ప్రేమవ్యవహారం, యీ అంకంలో బాగా ప్రచారం పొందిన టైపిస్ట్ శృంగారకథతో ముడిపెడుతాడు ఎలియట్. రెండూ నిష్ఫలస్త్రీపురుష సంబంధాలే. మహారాణి అయినా, రాత్రి పడుకోను పక్క కూడా లేని టైపిస్ట్ అయినా, యిద్దరిదీ వ్యర్థ జీవితమే.

ఈ యిద్దరి స్త్రీల ఆర్థికసామాజికస్థాయిలలో అంతరం వారి ప్రేమల నైష్ఫల్యంలో ప్రతిఫలించడం లేదు, మహారాణి అయినా మామూలు టైపిస్ట్ అయినా ఒకటే అని చెప్పడం ప్రధానం కాదు. ప్రేమ అన్న వస్తువే కరవయింది, యిది ప్రధానం.

ఇక శిల్పవిషయానికి వస్తే, బుద్ధుడి బోధకు అగస్టిన్ కథ, ఎలిజబెత్ తలకు టైపిస్టు మొల అతికించి యిస్తాడు ఎలియట్, ‘జగదేకవీరుడికి అతిలోకసుందరిని అతికించి యిస్తా’ అన్నట్టు. ఈ అతుకులలో (these fragments) నుండి కదా, ఎలియట్ సృష్టిస్తాడు. పికాసో చిత్రం గెర్నికా (Guernica) యీ అతుకులే కదా!

టిరీసియస్

ఈ అంకంలో, యీ అంకంలో మాత్రమే కాదు, మొత్తం వేస్ట్ లాండ్‌లో ప్రధానపాత్ర టిరీసియస్ (Tiresias). ఎలియట్ స్వయంగా అన్నాడు, వేస్ట్ లాండ్‌ చివర యిచ్చిన నోట్స్‌లో: ’టిరీసియస్ చూచిందే యీ కావ్యసారం’ అని. ‘చూడడం’ కంటితో కాదు, టిరీసియస్ చూపు పోగొట్టుకున్నాడు.

టిరీసియస్ ప్రధానంగా పాశ్చాత్యకావ్యాలలో మూడు సందర్భాలలో కనిపిస్తాడు.

ఒకటి: సోఫోక్లీస్ నాటకం ఈడిపస్ రెక్స్. ఇందులో, అతడికి రాజ్యంలో ఉపద్రవానికి కారణం తెలుసు. (ఈడిపస్ తన తండ్రిని, తండ్రి అని తెలియక, చంపడం; ఆ తరువాత తన తల్లిని, తల్లి అని తెలియకనే, భార్యగా స్వీకరించడం) కాని, టిరీసియస్ తనకు తెలిసింది చెప్పలేడు. రాజ్యంలో అందరిలాగానే పాపపరిణామాలు అనుభవిస్తాడు.

రెండు: హోమర్ కావ్యం ఒడీసియస్. ఇందులో యులిసిస్ నీటిలో మునిగి చనిపోతాడని టిరీసియస్‌కు తెలుసు. కాని చెప్పడు.

మూడు: ఇతడు ఒక శాపకారణంగా కొంతకాలం స్త్రీగాను కొంతకాలం పురుషుడుగాను ఉండినవాడు. ఈ కారణంగా మరో శాపం వలన, గుడ్డివాడయినాడు. (ఈ కథ ఓవిడ్ రాసిన మెటమోర్ఫసిస్ లోను, దాన్తె కావ్యం ది డివైన్ కామెడీ లోను వస్తుంది.)

ఈ మూడు కథలలోను టిరీసియస్ కథాసారమేమంటే, అతడు పురుషుడు స్త్రీ కూడా కాబట్టీ యిద్దరి అనుభవాలూ అతడికి తెలుసు. అతడికి జరిగిపోయినవి జరుగుతున్నవి జరుగుబోయేవి అన్నీ తెలుస్తాయి, కాని తెలిసినది చెప్పలేడు. సమాజంలోని అందరిలో అతడుంటాడు. అందరి అనుభవాలు అతడి స్వీయానుభవాలే. అందరి కర్మలలో అతని భాగం ఉంటుంది. కనుక, దేనినీ ఆపలేడు, పూర్తిగా ఆమోదించలేడు, ద్వేషించలేడు. అందుకే, అతడు ఎలియట్ కావ్యంలో మన ప్రతినిధి. సమాజంలో జరిగే ప్రతి పాపంలో మన భాగం ఉంది. టిరీసియస్ కళ్ళు లేక చూడడు. మనము కళ్ళుండీ చూడం. బాధ్యత తీసుకోము. అంతా తెలిసినా తెలియనట్టు ఉండిపోతాం.

పచ్చగా ఉండవలసిన ఏ నేల అయినా మరుభూమిగా మాడిపోవడానికి కారణం కామదావానలం. బెస్తరాజు (Fisher King) నపుంసకుడు కావడానికి, అతని రాజ్యం మరుభూమి కావడానికి, అతడు ఏ స్త్రీలపై జరిపిన అత్యాచారాలో (ఫిలొమెల్ so rudely forced) కారణమని సూచిస్తుంది వేస్ట్ లాండ్‌. రాజు ఒక్కడి నేరమే కాదు. రాజు ప్రజల ప్రతినిధి. మనిషిని కాల్చివేస్తున్న యీ కామాగ్ని తోనే యీ అంకం ముగుస్తుంది:

Burning burning burning burning
O Lord Thou pluckest me out
O Lord Thou pluckest
burning

burning అన్న పదంతో ముగుస్తుంది, యీ అంకం. కాని, burning తరువాత విరామచిహ్నం లేదు. నిర్విరామంగా మనిషిని కామం కాలుస్తూనే ఉంటుంది. దానికి ముగింపు లేదు.

కామం పాశ్చాత్యులు ‘కనిపెట్టారు’ అన్న భావం మనలో చాలామందికి ప్రబలంగా ఉంది. భారతీయసంస్కృతి అందుకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతులతో పోలిస్తే మన సంస్కృతి చాలా స్వచ్ఛము పవిత్రము అన్న భావం కూడా చాలామందిలో ఉంది. ఈ చర్చ కావ్యవిమర్శలో రాకుండా ఉండదు. నిజమే, కాని అది ప్రధానం కాదు. కవి తన దర్శనాన్ని కావ్యంగా ఎలా మలిచాడు అన్నదే ప్రధానం. వేస్ట్ లాండ్‌ను ముందు కావ్యంగా పరామర్శించి, కవి జీవితదృక్పథాన్ని చివరకు వాయిదా వేద్దాం.

ఈ అంకంలో ప్రముఖము ప్రసిద్ధము అయిన సన్నివేశం ఒక టైపిస్టు ‘ప్రేమ’కథ. అది ప్రేమ కాదు, కామం కూడా లేని యాంత్రిక చర్య (215-256). ఇది ‘టైపిస్టు’ కథ కాదు, అంటే ఒక వ్యక్తి కథ కాదు. ఈ నాటి కామసంబంధాలన్నీ యిదే ‘టైప్’ అని చెప్పే కథ. సుదీర్ఘమైన యీ టైపిస్టు కథ కాక, యిందులో యింకా అనేక ‘ప్రేమ’ కథలున్నాయి. ఎలిజబెత్ రాణి కథ అయినా, నదీతీరంలో అపరిచితులకు ఆ రాత్రికి అద్దెకు దేహాలప్పగించే సామాన్య స్త్రీల కథలైనా ప్రాథమికమైన భేదం లేదు. ఆ శృంగారం నిష్ఫలం. అంతే కాదు, ఆ శరీరస్పర్శలో ఆనందస్పర్శ కూడా లేదు. బలాత్కారాలైనా (so rudely forced), బలహీనతలైనా (I raised my knees), అన్నీ దుఃఖానికి మానసికవైక్లబ్యానికి దారితీసేవే (I can connect/ Nothing with nothing).

ఎప్పటిలాగే యిక్కడా ఎలియట్ గతాన్ని వర్తమానాన్ని, పురాణగాథలను ఆధునికదృశ్యాలను, బలాత్కారాలను బలహీనతలను, స్త్రీపురుషులను, కలగుచ్చి కావ్యం చేస్తాడు. అట్లాగని గతమంతా స్వచ్ఛము, వర్తమానం తుచ్ఛము అనడం లేదు ఎలియట్. వర్తమానంలోని కాలుష్యాన్ని ఎత్తిచూపుతాడు: empty bottles, sandwich papers,/Silk handkerchiefs, cardboard boxes, cigarette ends. కాని, ఆ కాలుష్యంలో కాలధర్మమెంత, మనిషి అధర్మమెంత అని కూడా ఆలోచింపచేస్తాడు.

ఇందులోని కొన్ని ప్రేమసన్నివేశాలు చూద్దాం.

ప్రారంభదృశ్యం:

-The river’s tent is broken: the last fingers of leaf.
Clutch and sink into the wet bank. The wind
Crosses the brown land, unheard. The nymphs are departed.
Sweet Thames, run softly, till I end my song.
The river bears no empty bottles, sandwich papers,
Silk handkerchiefs, cardboard boxes, cigarette ends
Or other testimony of summer nights. The nymphs are departed.
And their friends, the loitering heirs of city directors;
Departed, have left no addresses.

హేమంతం. ఠేమ్స్ (Thames) నదీతీరం. కాలం, పదహారవ శతాబ్దం కావచ్చు, యిరవయ్యో శతాబ్దమూ కావచ్చు. స్పెన్సర్ రాసిన ఒక పెళ్ళిపాటలోని (ప్రొథలమియాన్) వాక్యం – Sweet Thames, run softly, till I end my song – మూడుసార్లు వినిపిస్తుంది యీ భాగంలో. ఆ కాలంలో వివాహసందర్భాలలో ఉండిన సంబరం, వివాహంలోని స్వచ్ఛత, వివాహబంధానికున్న విలువ, గుర్తుచేస్తుంది స్పెన్సర్ పాట. జలదేవతలు నీటిపై పూలు చల్లిపోతారు అని ఆ కాలంలో ఒక అందమైన ఊహ. ఆ కాలంతో పోలిస్తే స్త్రీపురుషసంబంధాలు యిప్పుడు ఎలా మారిపోయాయి!

The river’s tent is broken: నదిగట్టున చెట్లకొమ్మలు, నదికి కప్పుగా ఉండేవి. హేమంతంలో ఆకులన్నీ డుల్లి, ఆ చెట్టు చిరిగిన టెంటులాగా ఉంది. రాలిన ఆకులు తడిగట్టున నాని, చివికి, యీనెలు చేతి వేళ్ళలాగా కనిపిస్తున్నాయి (fingers of leaf). నదిలో జారిపడిపోతానన్న భయంతో తడి ఒడ్డును పట్టుకొన్న మనిషి చేతివేళ్ళలాగా ఉన్నాయి ఆ ఆకుల యీనెలు. జలగండభయం (Death by Water), వేస్ట్ లాండ్‌లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ఒకప్పటి పచ్చటి నేలపై యిప్పుడు తడిలో చివికిన ఆకులు, (the brown land). వీస్తున్న గాలి వినడానికి అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడా ప్రాంతం నిర్జనం. వేసవి వెళ్ళిపోయింది. జలదేవతలు వెళ్ళిపోయారు. జలదేవతల కాలము వెళ్ళిపోయింది.

ఈ కాలపు జలదేవతలు (nymphs) వేరు. డబ్బున్న వారి కొడుకుల డబ్బుతో రాత్రి గడిపి పోవడానికి వచ్చే అమ్మాయిలు యీ కాలపు జలదేవతలు (their friends, the loitering heirs of city directors). తెల్లవారితే నదీతీరంలో, ఖాళీమద్యం సీసాలు, సిగరెట్టు ముక్కలు, చెత్త చెదారం, రాత్రి జరిగిన ‘ఆనందపు’ అవశేషాలు. ఇప్పుడు నదీతీరంలో అవేవీ లేకపోవడానికి కారణం యిది హేమంతం (no empty bottles, sandwich papers, /Silk handkerchiefs, cardboard boxes, cigarette ends). ఆ మగవాళ్ళు వాళ్ళ అడ్రసులు యివ్వరు. ఆ రాత్రి గడిచిన తరువాత వాళ్ళపేర్లు బయటకు రాకూడదు, ‘అవాంఛిత’ పరిణామాలకు వారి బాధ్యత ఏమీ ఉండదు (have left no addresses).

ఇక్కడి no (no empty bottles…), యిప్పటి వేసవికి హేమంతానికి ఉన్న తేడా మాత్రమే కాదు, ఆ తేడా ఎలిజబెత్ కాలానిది కూడా. ఆ కాలంలోని స్వచ్ఛవాతావరణాన్ని గుర్తు చేస్తుంది యీ దృశ్యం. ఆ కాలంలోనూ వేసవిలా హేమంతం ఉండదు. కాని కవి చెబుతున్నది ఆ హేమంతంలా యీనాటి హేమంతం లేదని. ఆ కాలంలో యీ చెత్త లేదు. వివాహమంటే యిప్పుడున్న చెత్త దృష్టి లేదు. ఠేమ్స్ నదీతీరంలోని బాహ్యకాలుష్యం ఆంతరకాలుష్యానికి ప్రతిబింబం. మారిన పర్యావరణం మారిన జీవితపు విలువల పరిణామం. ఇప్పుడు స్పెన్సర్ ఆ పెళ్ళిపాటలు రాయలేడు.

వేస్ట్ లాండ్‌లో ఇంతవరకు రాయి రప్ప బండలు కొండలు (stony rubbish; the dry stone no sound of water; this red rock). ఎక్కడా తడి తగలలేదు. ఇక్కడ నీరు కనిపిస్తోంది. కాని అంతమాత్రమే తేడా. ఇక్కడా అదే శుష్కజీవితం. (the brown land) అదే నిర్జనము నిర్జీవము. బురద అంటుకున్న ఎలుక ఒకటి గడ్డిలో తిరుగుతున్నది. మరికొన్ని ఎలుకలు ఎముకలపై పరుగెడుతున్నాయి. (ఎలుకలు ఎలియట్ కవితలో తరచు కనిపిస్తాయి. ఇంటి పునాదులు తవ్వి కలుగులు చేసి కాపురాలు చేస్తాయి ఎలుకలు.) స్పెన్సర్ లాగా ప్రేమలు, పెళ్ళిళ్ళపై గీతాలు రాసే సన్నివేశం కాదిది యీనాడు. ప్రేమకు ఆహ్లాదానికి ఏ మాత్రము అవకాశంలేని దృశ్యం.

స్వీనీ, పోర్టర్

But at my back from time to time I hear
The sound of horns and motors, which shall bring
Sweeney to Mrs. Porter in the spring.
O the moon shone bright on Mrs. Porter
And on her daughter. 200
They wash their feet in soda water
Et O ces voix d’enfants, chantant dans la coupole!
Twit twit twit
Jug jug jug jug jug jug
So rudely forc’d.

Tereu

But at my back from time to time I hear/The sound of horns and motors – యమునిమహిషపు లోహఘంటలు మధ్య మధ్య వినిపిస్తూనే ఉంటాడు ఎలియట్. ఇక్కడ కొమ్ముబూర (horns) చాలా పనులు చేస్తుంది. పురాణకథనొకదానిని వర్తమానంతో కలిపి, రెంటిని పోలుస్తుంది. గ్రీకుగాథలో, ఏక్టియన్ అడవిలో వేటకు వస్తాడు, కొమ్ములూదుతూ వేటకుక్కలను వెంటబెట్టుకొని. ఆ వనంలో డయానా ఆమె పరిచారికలతో నగ్నంగా స్నానం చేస్తుంటుంది. అనుకోకుండా ఏక్టియన్ ఆమెను చూస్తాడు. తన ఏకాంతాన్ని భగ్నం చేసి తనను నగ్నంగా చూచాడన్న కోపంలో డయానా అతనిపై నీళ్ళు చల్లింది. అతడు లేడిగా మారిపోయి, భయంలో పారిపోతుంటే అతని వేటకుక్కలు అతనిని గుర్తుపట్టక చంపేస్తాయి. ఈ పురాణకథలో కొమ్ములు, ఏక్టియన్ వేటలో ఊదే కొమ్ములు. ఈ పురాణగాథను యీ కాలపు స్వీనీ, పోర్టర్‌ల నవశృంగారానికి నవనేపథ్యంగా వాడుతాడు ఎలియట్. కారుమోతలు వినిపిస్తున్నాయి, స్వీనీ కారులో వస్తున్నాడు పోర్టర్‌ను కలవడానికి. ఇక్కడ ‘horns’ అతని కారు హారన్. అతని మగతనాన్ని సూచించే ‘కొమ్ములు’ కూడా. అతడు ‘మాంచి’ మగాడు. (స్వీనీ ప్రధానపాత్రగా ఎలియట్ కొన్ని కవితలు రాశాడు: Sweeney Among the Nightingales, Sweeney Erect.)

గ్రీకుగాథలో ఏక్టియన్ తప్పులేదు. అనుకోకుండా నగ్నస్త్రీని చూచాడు, శిక్షకు మించిన దారుణమైన ఫలితం అనుభవించాడు. ఇక్కడ స్వీనీ అంత అమాయకుడేమీ కాదు. కొమ్ములున్న (horns) మగవాడు. కొమ్ములూదుతూ ‘వేట’కు వచ్చాడు. పైగా, పోర్టరు, ఆమె కూతురు (పరిచారిక కాదు), అతడి కోసం ఎదురు చూస్తున్నారు. అతడు వచ్చింది ఒక వేశ్యాగృహానికి. అనుకోకుండా రాలేదు. లోకానికంతా ప్రకటిస్తూ, హారన్ మోగిస్తూ, తనకోసం ఎదురుచూస్తున్న పోర్టర్ కూతురికోసం వచ్చాడు. వసంతము. వెన్నెల రాత్రి. కాని, స్వీనీ యీనాడు, ఆనాటి ఏక్టియన్ లాగా, ఏ శిక్షకు పాత్రుడు కాడు. గ్రీకుగాథలో, ఏక్టియన్ తప్పుకాని తప్పుకు దారుణమైన శిక్ష అనుభవించాడు. ఈ నాడు స్త్రీపురుషులు ఏమి చేసినా తప్పు కాదు. డబ్బు దేనినైనా క్షమిస్తుంది. పోర్టర్, ఆమె కూతురు, గ్రీకుగాథలో డయానా లాగా వనం లోని స్వచ్ఛజలాలలో స్నానం చేయరు. సోడానీటితో కాళ్ళు కడుక్కొంటారు. వారు సమాజంలో ఆదరణీయులు.

ఈ స్వీనీ పోర్టర్‌ల కథను, మరో పురాణకథతో కూడా పోలుస్తాడు ఎలియట్. ఈ కథ వెనుక (A Game of Chess) ప్రస్తావించిందే. దానినే యిక్కడ మరోసారి స్మరిస్తాడు ఎలియట్. అంటే, స్వీనీ పోర్టర్‌ల కథను, రెండు పురాణకథల నేపథ్యంలో ప్రదర్శిస్తాడు. గమనించవలసిందేమంటే ఆ రెండు పురాణకథలు ఒకదానికొకటి విరుద్ధం. ఏక్టియన్ డయానాల కథలో ఏక్టియన్ చేయని తప్పుకు ఒక స్త్రీ చేత (ఆమె దేవతే కావచ్చు) దారుణంగా శిక్షింపబడ్డాడు. రెండవది ఫిలోమెల్ కథ (so rudely forced). అందులో ఆమె టిరీసియస్ చేత బలాత్కారానికి గురి అయింది. పక్షిగా మారి ఆ బాధను మాటలలో చెప్పుకోలేక అప్పటినుండి కూస్తూనే ఉండిపోయింది (Twit twit twit/Jug jug jug jug jug jug). ఒక పురాణకథలో పురుషుడి అత్యాచారం, మరో పురాణకథలో స్త్రీ క్రౌర్యం. మరి ఈ నాటి అన్యాయపు కథలో? ఇద్దరిదీ సగం సగం. అర్ధబృగళం! బుద్ధిపూర్వకంగా కాక పోయినా, నగ్నస్త్రీని చూడడమే దారుణశిక్షార్హమైన మహాపాపమొకనాడు! ఈ నాడు అదే నేరమైతే, ఎవడూ బతకడు.

ఈ మూడు కథల సందర్భానికి మరో క్రైస్తవకథ జోడిస్తాడు ఎలియట్. పోల్ వెర్లేన్ కవితలోని వాక్యం: Et O ces voix d’enfants, chantant dans la coupole! (And O the voice of the children, singing in the cupola!) పవిత్రపాత్ర (Holy Grail) కొరకు పార్సిఫాల్ యాత్ర చేస్తున్నాడు. ఆ పాత్ర, ఏ విధమైన కామప్రలోభాలకు లొంగని పవిత్రాత్మలకే లభ్యమవుతుంది. చివరకు, అమాయకులైన పిల్లల పాటలకు కూడా ఆకర్షింపబడరాదు. ఇటువంటి పవిత్రలక్ష్యం నుండి యీనాడు మనుషులు ఎంత దిగజారిపోయారో గుర్తుచేస్తాడు ఎలియట్.

యుజినిడెస్

ఈ పేరు మనం మేడమ్ సోసోస్ట్రిస్ దగ్గర విన్నాం. ఎలియట్ యిప్పుడు మరో నిష్ఫలలైంగిక సంబంధం చెబుతున్నాడు. యుజినిడెస్ (Eugenides) హోమోసెక్సువల్. అతని జేబులో ఎండబెట్టిన పండ్లు (currants) ఉన్నాయి. (పంటకు పనికిరాని ఎండిన విత్తనాలు. ఆ పండ్లు తింటూ ఉంటాడు, కాలక్షేపానికి.) స్వలింగసంపర్కానికై వాళ్ళు కలిసే హోటలొకటి ఉంది. ఆ హోటలుకు ఆహ్వానించాడు ‘నన్ను’ అని అంటున్నాడు. ఎవరిని? టిరీసియస్‌నా? ఎవరో, యింతవరకు మనతో మాట్లాడిన పాత్ర. ఇంతటితో వదిలేశాడు ఎలియట్ యీ ప్రసక్తి.

(సశేషం)