నా పద్యాన్ని
మీకు నచ్చినట్టు చదవండి
పైనుంచి కిందికి
కింది నుంచి పైకి
వాక్యాలను తప్పించి
చదవండి
వాక్యాల మధ్య
మీ సొంత వాక్యాలు
చొప్పించి చదవండి
అభేదమే కవిత్వం
పాఠకుడే కవి
బీజాక్షరం మాత్రమే మొదలు
ఊజా బల్ల మీదకి
పిలిస్తే వచ్చే అశరీరవాణి
పండుగనాడు
గద్దె పలుకు
మనస్సు కోరే ప్రశ్నలకి
తోచిన జవాబులు
భయం గుప్పిట్లో
కర్మ ఫలాలు
హద్దులు చెరిపి
సందిగ్ధాల తోవలకి
సందర్భాన్ని జోడించి
కల్పవికల్పాల
ధ్వనిని తోడిచ్చే
కవిత్వం
ఒకరు పుట్టించేది కాదు
ఇరు దిశలా ప్రవహించే
జీవధార
త్వమేవాహం
త్వమేవాహం
న సంశయః!