నొప్పి వెంటాడే వేళలు

పొత్తి కడుపులో కాస్త నొప్పి కలిగినట్టు అనిపించి పక్క మీద నుంచి ముత్తయ్య పైకి లేచాడు. వీధి దీపాల వెలుతురులో పెళ్ళాం పిల్లలు గాఢంగా నిద్రపోతున్నారు. గోడ గడియారాన్ని చూశాడు. సమయం రెండు దాటింది. గడియారపు ముల్లు తన పని తాను చేసుకుపోతుంది. మళ్ళీ సూదులు పొడుస్తున్నట్టు కడుపు గుడగుడలాడింది. ఉబ్బిన కడుపు మీద జారుతున్న లుంగీని విప్పి గట్టిగా మడిచి కట్టుకున్నాడు. కిటికీ అంచులో ఉన్న తమలపాకు, సున్నాన్ని తీసి, రెండిటిని కలిపి అరచేతిలో పెట్టుకుని నలిపి కింది దవడలో కుక్కాడు. వెనుక భాగం మోరీకు వెళ్ళి ఉచ్చ పోసుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డాడు కానీ సరిగ్గా కూర్చోలేకపోయాడు. ఉబ్బిన కడుపులో మళ్ళీ సూదులతో పొడుస్తున్నట్టు నొప్పి తరుముకొచ్చింది.

గాలిని రుబ్బుతున్నట్టు పంకా పరుగులు తీస్తుంది. ఉక్కపోతను తరిమి కొత్త గాలిని లోపలికి ఆహ్వానించడంలో పంకా తడబడింది. గది నిండా ఉక్కపోత కంపు అల్లుకుంది. మళ్ళీ గడబిడమనే శబ్దాలతో నొప్పి మొదలై లోపల ఏదో దేవుతున్నట్లు అనిపించింది. మరుగుదొడ్డికి వెళ్ళాలి అనుకున్నాడు. రాత్రి రెండింటికి పైన బయటకు వెళ్ళాలి అంటేనే మనసులో అలజడి మొదలవుతుంది. తలుపు తెరిస్తే చీకటి, తారును కాల్చి పోసినట్టు దట్టంగా పేరుకుపోయినట్టు ఉంది. ఈ భయానకపు రాత్రికి భయపడి గుమ్మం ముందు ఎన్ని బల్బులు బిగించినప్పటికి హర్ధుల్లాలు బల్బులను దొంగిలిస్తారు. హరధ్ అనే మత్తు మందును వాడటం వలన హర్ధుల్లా అని పేరు తెచ్చుకున్నవారు. హర్ధుల్లాల ముఖాల్లో మాటలు, నవ్వు, చూపు, ఎటువంటి కదలికలు లేకుండా సాలెగూడు అల్లినట్టు ఉంటాయి. వీరు రాత్రి వేళలలో గుడిసె భాగాలలో మానవత్వం కరుడుగట్టి సంచరించే యాంత్రిక మనుష్యులు. ఒక రకంగా స్వర్గానికి వెళ్ళే దారిని కనుగొన్నవారు అని చెప్పొచ్చు.

అగ్గిపుల్ల కొనను క్షవరపు బ్లేడుతో నునుపుగా చెక్కి హరధ్ అనే మత్తుమందును ఆ అగ్గిపుల్లతో ఆవగింజలో పావు వంతు తీసి, సిగరెట్ ప్యాకెట్లో ఉండే సిల్వర్ కోటింగ్ పేపర్‌ని విప్పి అందులో పెట్టి, అగ్గిపుల్లను రాజేసి పేపర్ అడుగు భాగాన పెట్టి వేడిచేస్తారు. పావు వంతు ఆవగింజంత పరిమాణంలో ఆ వస్తువు వేడికి నెయ్యిలా కరిగినప్పుడు అందులో నుండి వెలువడే పొగను, పేపర్ గొట్టం ద్వారా ముక్కుతో పీల్చి స్వర్గాన్ని చవి చూస్తారు. ఒక్కసారి ముక్కుతో పీలిస్తే కనీసం పదిగంటల సేపైనా త్రిశంకు స్వర్గాన్ని చుట్టి వస్తారు. కళ్ళు మూసుకుని, నోరు వెళ్ళబెడతారు. ఆ సమయంలో వాళ్ళని కొట్టినా, గిచ్చినా అది ఏ మాత్రం వారికి వంటపట్టదు. ఆవగింజంత పరిమాణం ఉన్న ఆ హరధ్ మత్తుమందును కొనేందుకు కనీసం యాభై నుండి వంద రూపాయలు అయినా అవసరమవుతాయి. కేవలం దానిని కొనడం కోసమే అర్ధరాత్రిలో వీధి వీధి తిరిగి సామాన్లు దొంగిలించే పని పెట్టుకుంటారు.

ఒక వీధిలో, అనుకున్న వస్తువును దొంగిలించేందుకు పథకం వేస్తే ఇంటికి బయట ఉన్న వసారా మీదో, ఫుట్‌పాత్ మీద కుక్కల మధ్యన కుక్కలానో పడుకుంటారు. ఏది దొరకనప్పుడు నీళ్ళు పట్టే పీపాలోని నీళ్ళు కింద పారబోసి, ఆ పీపాను పట్టుకు వెళ్ళిపోతారు. వేరే దారి లేకపోతే మీటర్ ఉన్న గదిని తెరిచి ఏ వీధికి వెళ్ళే లైన్ ఫ్యూజ్ లేకుండా ఉంటుందో చూసి లాగేసి పక్క వీధిలో పడుకుంటారు. కరెంట్ పోవడంతో బయట గుమిగూడేవాళ్ళతో ‘ఏంటి పెద్దయ్యా కరెంట్ పోయిందా? ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. ఎలుక అటు ఇటు తిరుగుతున్నప్పుడు కింద పడి ఉంటుంది’ అని వాళ్ళంతట వాళ్ళే టార్చ్‌లైట్ తీసుకుని సరిచేసి, ‘ఏమైనా ఉంటే ఇవ్వండి’ అని డబ్బు అడిగి తీసుకుంటారు. ఇలా చిల్లరగాళ్ళలా వ్యవహరించే వీరిని, ఆరు నెలలు ఇక్కడ ఉండి వెళ్ళిన ఆరుముగం అవ్వ ‘వీళ్ళు ముట్టుగుడ్డను కూడా దొంగలించే రకం’ అని అనడం వీళ్ళ పనులకు తగ్గట్టే ఉంది.

మోరీలో వేలాడదీసిన సండాస్ బకెట్ తీసుకుని నీళ్ళతో నింపి ముందుగది లోకి వచ్చాడు. గుమ్మం ముందు బకెట్‌ను పెట్టేసి భార్యను నిద్ర లేపాడు. రెండు మూడు సార్లు పిలిచినా కూడా లేచేటట్లు కనిపించలేదు. వంగుని ఆమె భుజంపై తట్టి చిన్న గొంతుతో “పునీతా, పునీతా” అని పిలిచాడు. ఆమె నిద్ర మగతులో “ఊరికే ఉండలేరా. పిల్లలు పక్కనే కదా పడుకుని ఉన్నారు” అని అటుగా ఒత్తిగిల్లి పడుకుంది. అతడు గట్టిగా ఆమె కడుపు మీద తట్టి “రెంటికి, బాత్‌రూమ్‌కి వెళ్ళాలి, లేచి తలుపు గొళ్ళెం పెట్టుకో” అని చెప్పి ఆమెను కుదిపి వెళ్ళాడు.

మగతనిద్రలోనే ఆమె పైకి లేచింది. ఇంతలోనే అతడు తలుపు తెరిచి బయటకు వెళ్ళి “పునీతా తలుపుకు గొళ్ళెం పెట్టుకో” అని చెప్పి మెట్లు దిగి నడక మొదలుపెట్టాడు. తలుపు వేసిన శబ్దం వినబడగానే కాళ్ళను ఎత్తి నడవడం మొదలుపెట్టాడు. నీళ్ళను పట్టుకుని వీధిలోకి వచ్చి నడుస్తుంటే వీధికి మైలురాయిలా ఒక కుక్క అడ్డంగా పడుకుని ఉంది. అది అలికిడి వినబడగానే ‘భౌ’మంటూ పెద్దగా మొరుగుతూ పరిగెత్తుకెళ్ళి తొంగి చూసి తోక ఆడించింది. అరుపులు వినబడగానే శరీరమంతా భయంతో కంపించిపోయి ముత్తయ్యకు చెమట కారడం మొదలయింది.

టైమ్ రెండున్నర పైన అయ్యిందే. అన్ని చోట్లు మూసి ఉంటాయే. ఎక్కడికి వెళ్ళాలి. ఈ దరిద్రాన్ని దింపుకునేందుకు మనసు అటూ ఇటూ పరుగులు తీస్తూ లెక్కలేసింది. 90 ఫీట్ రోడ్‌ను ఆనుకుని ఉన్న జుమ్మా మసీదు దగ్గర ఉండే మరుగుదొడ్డిలోనే నాలుగు రూములు, ఏ వేళలో వెళ్ళినా 24 గంటలు తెరిచే ఉంటుంది. అక్కడ పగటి పూటే కాలు చూసి పెట్టాలి. లేకపోతే తీసుకు వెళ్ళే నీళ్ళు చెప్పులకి అంటుకునే పియ్యను కడిగేందుకే సరిపోదు. ఆపై ముడ్డి కడగడం ఎలా? ఈ రూమ్ రెండు రూపాయలు ఇచ్చి వెళ్ళేందుకు ఆలోచించే వారికి, లేదా రెండు రూపాయలు చెల్లించి వెళ్ళలేని వారికి, పొద్దంతా బుద్దిని పిచ్చెక్కించే గంజాయి, అబిన్ వీటితో పాటు హై‌క్లాస్ తాగుబోతులకు కేటాయించినట్టు అనిపిస్తుంది. ఈ మరుగుదొడ్లను ఎప్పుడో, ఎవరో పాపం చూసి, కాస్త కడిగి బ్లీచింగ్ పౌడర్ వెయ్యాలి తప్ప, లేకుంటే ఎప్పుడు పీతులతో నిండిపోయి మురిగిపోయిన వాసన వేస్తూ, అన్ని వేళలా దోమలు కచేరి చేస్తుంటాయి. ఇవేమీ లెక్క చేయకుండా ఒక అవసరానికి రాత్రివేళ కిందా మీద పడి పరిగెత్తుకుని వెళితే, గుమ్మం దగ్గర ఆల్ ఇండియా రౌడీల లాగా, రొమ్ము విరుచుకుని, ఖాకీ చొక్కా తొడుక్కుని రాత్రిపూట పహారా కాచే పోలీసుల్లా కుక్కలు మొరుగుతూ, దారిని ఆక్రమించుకుని పడుకుని ఉంటాయి. వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా లోపలికి వెళ్ళి కూర్చుని ముక్కు మూసుకుని, మండే కళ్ళను రెప్ప వేయకుండా, గుడ్లప్పగించి చూస్తే, అస్పష్టమైన వెలుతురులో స్త్రీ పురుషుల మర్మాంగాలతో సెక్స్ చేసుకునే చిత్రాలు. ‘వెయ్యి యోనిలు చూసినవాడు జ్ఞానికి సమానం’ ‘స్త్రీ యోని బెత్తెడు అయినా, దాని లోతు సముద్రమంతా’ అని సూక్తులతో గోడ నిండిపోయి ఉంటుంది.

ఇవన్నీ ఇంట్లో మరుగుదొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి టైల్స్, మార్బుల్స్ వేసి డబ్బులు చెల్లించే మరుగుదొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా జనాలు గుమిగూడటం మొదలవుతుంది. మరుగుదొడ్లలో ఉన్నవారు కాస్త ఆలస్యం చేస్తే కూడా ‘లోన ఎవరబ్బా. పేగులు తిప్పి మెలేస్తున్నాయి. త్వరగా రమ్మనండబ్బా, పనికి పోవాలి.’ అని అరుస్తాడు. ఇంకొకడు ‘వెళ్ళి చాలాసేపు అయింది. లోన పడుకుండిపోయాడా ఏంటి? వెళ్ళి తట్టి లేపండి.’ అంటాడు. లోపల నుండి వచ్చినవాడు ‘ఏంటి భాయి, దిండుతో లోపలికి వెళ్ళానా? లేదా పార్సిల్ తీసుకు వచ్చానా? టక్కున దింపేసి బయకు వచ్చేందుకు?’ అని జవాబిస్తాడు. ఇలా పదింటి వరకు మాటల వాగ్వాదం కొనసాగుతుంది.

అడ్డ సందును దాటి, వీధిలోకి వచ్చాడు. అర్ధరాత్రి వేళ ధారావి కొత్త మృగాలు మాటు వేసుకుని గర్జించే అడవిలా అతడికి గోచరిస్తుంది. పగటి పూట చూసే ధారావికి, రాత్రి పూట చూసే ధారావికి ఎంతో తేడా కనిపించింది. తెరిచి ఉంచిన కొట్లు మరో విధంగా కనబడ్డాయి. సంచరించే మనుష్యులు ఇంకో రకంగా ఉన్నారు.

ఇంతలో కాళ్ళు చేతులు జలదరించి వణుకు పుట్టడం మొదలయింది. కాళ్ళను ముందుకు చాపి నడకకు ఉపక్రమించాడు. చీకట్లో కాళ్ళకు తగిలి భయంతో పరుగులు పెట్టే పందికొక్కులను కూడా లెక్క చేయకుండా వేగంగా నడిచాడు. ఇక్కడి నుండి చూసేటప్పుడే మరుగుదొడ్లో కాస్త వెలుతురు కనబడింది. మనసుకు కాస్త ఊరడింపు. ఉక్కపోత శరీరం మీద గాలిపడి చల్లబడ్డట్టు ఉంది. అయినా సరే లోలోపల శరీరం వేడితో రగిలింది. బొడ్డు కింద ముల్లులా గుచ్చుకుంటుంది. మరుగుదొడ్డిని సమీపించాడు. అక్కడ తాపీ పనివాళ్ళు నిలబడి మరుగుదొడ్డిని రిపేరు చేస్తున్నారు.

“అయ్యో అన్నా, ఇంకా రెండు మూడు రోజులకు ఈ ‘సండాస్ బంద్!’ కాస్త ముందుగా వచ్చి ఉండకూడదా? పక్క సండాస్ వాడు ఇప్పుడే తాళం వేశాడు. ఆ ఎదురుగా ఉన్న కుండల కొట్టు దగ్గరే నిలబడ్డాడు. కావాలంటే అడిగి చూడు. తెరుస్తాడేమో” అని తాపీవాడు అన్నాడు

“అన్నా, మీరు మరెక్కడికయినా వెళ్ళండి. వాడ్ని నమ్మకండి. కొన్ని సమయాల్లో వాడికి జతగా వేరే పార్టీ వస్తుంది. వాళ్ళకి మాత్రమే వాడు తెరిచి పెడతాడు. బాలాజీ గుడిని ఆనుకొని మచ్చీ మార్కెట్ (చేపల మార్కెట్) ఉంది కదా? దాని పక్కన ఇట్లాంటిదే ఒక టాయిలెట్ ఉంది, అక్కడికి వెళ్ళండి, తెరిచి ఉంటుంది” అన్నాడు ఇంకొకడు.

నీళ్ళ బకెట్‌ను పక్కన పెట్టి, లుంగీని విప్పి, టైట్‌గా లేకుండా కడుపు మీదకి కట్టుకున్నాడు. ముంబై గుడిసె వీధులలో బ్రతికేవాడికి కడుపు నింపుకోవడం ఒకటే సమస్య కాదు. కడుపులోది దింపుకోవడం కూడా ఒక సమస్యనే. రెండింటికీ ఎంతగానో కొట్టుమిట్టాడాల్సి ఉంటుంది.

ఛ… తప్పు చేశానేమో? మోరీ లోపల పేపర్ పరిచేసి, తెల్లారగానే బయటకు తీసుకువెళ్ళి విసిరేసి ఉండొచ్చునేమో?

90 ఫీట్ రోడ్డుకు ఆవైపు వీనస్ హోటలుకు వెనుక పెళ్ళి చేసుకుని వచ్చిన కొత్తలో రెండు అడుగులు వెడల్పు లేని తిలకర్ సాల్‌లో 6 బై 8 అడుగుల గుడిసె. నాలుగు వైపులా తగరపు రేకులతో నిండినది. చప్పుడు కాకుండా ముద్దు పెట్టి, మూలుగులు లేకుండా కరిచి, మూగ రాసక్రీడలలో శిఖరం చేరాలి. పొగిడో, చప్పుడు చేసి నవ్వేస్తేనో ఆరోజు పక్కింటోళ్ళకి నిద్ర చెడుతుంది. తగరపు రేకులకు ముద్దుల శబ్దాన్ని, మూలుగులను అడ్డుకునే శక్తి ఎక్కడిది?

పునీత ఆరు నెలల నిండు చూలాలు. “కడుపు నొప్పి పుడుతుంది బాత్‌రూమ్‌కి వెళ్ళాలి” అంది. అతడు చొక్కా వేసుకుని సిద్ధం అయ్యాడు. నొప్పితో కళ్ళనీళ్ళను అదుపు చేసుకుని తలుపు తెరిచింది. “ఇలా కడుపుతో ఉన్నపుడు చిమ్మ చీకటిలో బయటకు వెళ్ళకూడదు అని అమ్మ ఉత్తరాల్లో రాసేది. వెళితే బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది” అంది.

చేతిని పట్టుకులాగి, “నేను వెంట వస్తున్నా. ఏం కాదు” అని ధైర్యం చెప్పి పిలిచాడు.

“లేదండీ. మనకు ఏమైనా పర్వాలేదు. కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా అయితే… అది కూడా తొలిచూరి బిడ్డ.” భయబడి రానని మొరాయించింది.

దేవుడి పటానికి ముందు ఉన్న విభూతిని ఆమె ముఖానికి రాసి “ఇది మనవూరి కులదైవం గుడిలో విభూతి చూసుకో, రా పోదాం.” అన్నాడు. ఆమె వద్దని బాధని దిగమింగుకుని కూర్చుంది. పెందలకడనే వెళదాం” అంది. దీపం ఆర్పకుండా చాప మీద పడుకుంది. అతడికి నిద్ర ముంచుకువచ్చింది, ఆమె మళ్ళీ అతడిని లేపింది. “బాగా కడుపు నొప్పి పుడుతుంది వెళ్దామా” అంది, పొత్తి కడుపును రెండు చేతులతో మోస్తూ. ముత్తయ్య చొక్కా తొడుక్కుని, మేకుకు వేలాడుతున్న టార్చిలైటును తీశాడు. ఇంతలో “అంత దూరం వెళ్ళేందుకు నా వల్ల కాదు. ఇక్కడే ఉండాలి అని ఉందండీ” అంది. మోరీలో పేపర్‌ని పరిచి అందులో ఆమెను కూర్చోమన్నాడు. అయిపోగానే దానిని తీసి మడిచి అన్నం వండి వార్చే కడప రాతి పలక అరుగు మీదకి ఎక్కి దూలం గుండా వెనుక వైపు ఉన్న మురికి కాలువలోకి విసిరాడు. అతడు దిగగానే, ఆమె వెనక్కి తిరిగి నిలబడి కుమిలి కుమిలి ఏడ్చింది.

చేపల మార్కెట్ మరుగుదొడ్డి వైపు వేగంగా పరుగులు తీశాడు. ఎత్తైన ఫుట్‌పాత్ మీద కూర్చున్న పోలీస్ గుంపు ఇతడిని చూసి నవ్వింది. ‘ముంబై‌కి వచ్చి నలభై ఏళ్ళు దాటనుంది. ఇంకా మరుగు దొడ్డితో ఉన్న ఇల్లు కొనేందుకు వీలుకాలేదే?’ అన్న బాధ ఇప్పుడు అతడిని పియ్యలా వెంటాడింది. దారిలో ఎక్కడైనా పోతుందో? అన్న దిగులు శరీరమంతా ఎగబాకి, కడుపును బిగపట్టి అప్రమత్తంగా నడిచాడు.

రాత్రి పనికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే కొంతమంది కనబడకుంటే కూడా, వీధి చివర చీకట్లో ఎక్కడో దింపుకొని పోవచ్చు. ఒకరిద్దరు ముఖం తెలిసినవారు చూస్తూ దాటి వెళుతున్నారు. కాలును ఎడంగా జరిపి నడవటం చేత కాలు తగిలి బకెట్ పిడి ఊడి నీళ్ళు నేలపాలు అయ్యాయి. బకెట్‌ను కూడా పైకి ఎత్తేందుకు ఇష్టం లేక అక్కడి నుండి వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు.

శరీరం వణుకుతో అలసిపోయింది. రోడ్డుపై చిన్నపాటి రాళ్ళు గుచ్చుకుని నొప్పి ముడ్డి ద్వారా తన్నుకొచ్చి ఇపుడే దారిలో వెళ్ళి అవమానం పాలవుతనేమో? అని అనిపించి, పక్కన ఉన్న పట్టాల వైపు పరుగులు తీశాడు. ఎదురుగా వచ్చినవారు కొంతమంది నిలబడి చూసి ‘ఏంటీ బాబు, ఈ సమయంలో పట్టాల వైపు వెళుతున్నాడు. ఇంట్లో పెళ్ళాం బిడ్డలతో గొడవో గిడవో పడి వచ్చేసి ఉంటాడేమో?’ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ దాటి వెళ్ళిపోయారు.

వేగంగా వెళ్ళినవాడు దోబి ఘాట్‌ని దాటి రైలు పట్టాలు ఎక్కాడు. యముడి గొంతులా అరిచి మొదటి పట్టాలపై నేల కంపిస్తూ రైలు దడదడమని వెళ్ళింది. అది బైటూరికి వెళ్ళే రైలు. ఎన్నో పెట్టెలను లాక్కొని వెళ్ళింది. ఆ రైలు దాటి వెళ్ళేటప్పుడే దాని వెలుతురు రేకెత్తించిన కంగారులో దేనిని సరిగ్గా చూసేందుకు వీలు కాలేదు. పట్టాలు చివరన అయినా నిలబడదాం అంటే పక్కన ఉన్న అమ్మవారి గుడి నుండి నాలుగురైదుగురు హిజ్రాలు కూర్చుని ఉండటం మసకగా కనిపిస్తుంది. ఇంకాస్త మరుగుకు వెళదాం అని వేచి నిలబడ్డాడు. ఎదురుగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలు మూడవ పట్టాల నుండి రాక్షస వేగంతో దూసుకెళ్ళింది. దానిని చూస్తూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పట్టాలను దాటే ప్రయత్నం చేశాడు. ఆలోపు అతడి లుంగీ, ముడ్డి భాగం వైపు తడి అయ్యింది. గట్టిగా పట్టుకుని దానిని బయటకు వెళ్ళనివ్వకుండా లోపలికి అదుముకున్నాడు. పేగు తెగినంత బాధ. శరీరం వణికింది. కాస్త మైకం కమ్మినట్టు అనిపించింది. రెండవ పట్టాల పైన కాలు తీసి పెట్టే లోపు భూమ్ అన్న శబ్దంతో గూడ్స్ రైలు సర్రున దూసుకెళ్ళింది. అతడికి అతి దగ్గరలో దడదడమని నేల కంపించి వెళ్ళిన విభ్రాంతిలో, బాహ్య ప్రపంచపు కట్లను తెంచుకుని, రెండు కాళ్ళ మధ్య నుండి సర్రున పరుగులు తీసింది.

(మూలం: వలి సూళుమ్ పొళుదుగల్)


ఎస్. రాజేంద్రన్ తమిళ సంతతికి చెందిన ముంబయ్ వాసి. స్వస్థలం తిరునల్వేలి జిల్లాలోని ఇరైప్పువారి అనే ఊరు. ప్రస్తుతం నవిముంబయ్‌లో నెరుల్‌లో నివాసముంటున్నారు. పనుల నిమిత్తం ముంబయ్‌కి వలస వచ్చిన తమిళుడు. తన పద్నాలుగేళ్ళ వయసులో పొట్టకూటికి వచ్చిన ఆయన ముంబయ్‌కి వచ్చి దాదాపు 40 ఏళ్ళ పైబడింది. ఇప్పటి వరకు రెండు పుస్తకాలు రచించారు. వలి సూళుమ్ పొళుదుగల్ అనే కథా సంకలనం, కన్నాడి అనే కవితా సంకలనం రచించారు. కథలు ధారావి జీవన విధానాలను ఆధారంగా చేసుకుని రాయబడినవి. ప్రింటింగ్ శాఖలో పనిచేస్తున్నారు. పుదుమై పిత్తన్, మౌని, రాజ గోపాలన్, ఇమయం వీరి అభిమాన రచయితలు.