డివైన్ కామెడీ: దాన్తె అలిగ్యేరి

“The Divine Comedy is the best book literature has ever achieved.”

– Jorge Luis Borges.

“Dante and Shakespeare divide the world between them. There is no third.”

– T. S. Eliot.


ముందుమాట

దాన్తె అలిగ్యేరి (Dante Alighieri) కావ్యం (La Divina Commedia: ల దివీన కొమేదియా) దివ్యలీల (కావ్యనామానికి నేను చేసిన తెలుగు) వ్యాఖ్య చేయబూనడం సాహసమే. సమగ్రవ్యాఖ్య చేయగలనని చెప్పడం లేదు. కాని ప్రధానకావ్యాంశాలను వివరించే ప్రయత్నం చేస్తాను. కొన్ని కీలకమైన పద్యాలను వివరిస్తాను. ఆ వివరణలో కావ్యంలోని ప్రధానవిషయాలు చర్చకు వస్తాయి. ఈ కావ్యంలో ప్రతి పద్యము ప్రతి పదము కావ్యంలోని అనేక పద్యాలతో పదాలతో సంవదిస్తాయి, ముడిపడి ఉంటాయి కనుక, మొదటి పద్యాన్ని పూర్తిగా వ్యాఖ్యచేసే ప్రయత్నంలో అనేక పద్యాలు దానితో అనుసంధించవలసి ఉంటుంది. ఈ కావ్యంలో మూడు పర్వాలు నరకము (Inferno), ప్రక్షాళనము (Purgatorio), పరంధామము (Paradiso). నరకవర్ణన పాపాలను ధ్యానింపజేస్తుంది. ప్రక్షాళనపర్వం ప్రాయశ్చిత్తతత్త్వం వివరిస్తుంది. ప్రాయశ్చిత్తంతో ప్రక్షాళితమైన ఆత్మ పరంధామం చేరుతుంది.

నరకపర్వం పృథివి ప్రధానం, రెండవ పర్వంలో నీరు ప్రధాన ప్రతీక. నీరు కావ్యమంతటా ప్రవహిస్తూనే ఉంటుంది. అదే నీరు, తీరాన్నిబట్టి పేరు: అకెరాన్ (Acheron), స్టిక్స్ (Styx), ఫ్లెయెథాన్ (Phlegethon), కొకైటస్ (Cocytus). కాని ఒక్కొక పర్వంలో దాని లక్షణం మారుతుంది. నరకం చివర నీరు ప్రవహించదు. ఘనీభూతమవుతుంది. చివరి పర్వంలో (పారడీసో) నాలుగు భూతములు వెలుగు రూపం పొందుతాయి, ఆత్మలు కూడా. దాన్తె పరంధామం (Paradiso) ఒక సవితృమండలం అనవచ్చు.

ల దివీనాకు నేను ప్రధానంగా అనుసరించిన ఆంగ్లానువాదం సిసన్ (C.H. Sisson, The Divine Comedy) చేసినది. ఆక్స్‌ఫర్డ్ వర్‌ల్డ్ క్లాసిక్స్ ప్రచురణ. నా ప్రస్తుతవ్యాసాలలోని కొమేదియాకు ఆంగ్లవచనానువాదాలు నేను చేసినవే, కొన్ని ఆంగ్లానువాదాలననుసరించి. కొన్ని చోట్ల పద్యానువాదప్రయత్నం చేశాను.

దాన్తె కావ్యంపై విశ్లేషణ చేసిన అనేకవ్యాఖ్యాతలకు, భాష్యకారులకు–ఔర్‌బాక్ (Auerbach), సింగిల్‌టన్ (Singleton), ఫ్రెచ్చేరొ (Freccero) వంటివారికి–నేను ఋణపడి ఉన్నాను.

ది డివైన్ కామెడీ

డివైన్ కామెడీని పరిచయం చేసుకునే ప్రయత్నానికి ముందు, రెండు విషయాలు మన ముందు అడ్డంగా నిలబడతాయి. ఒకటి, దాన్తె, బియత్రీచెల ప్రేమకథ. రెండు, అతడి రాజకీయాలు. మా గురించి చెప్పి ముందుకు సాగండి, అంటాయి. కావ్యం కంటే కూడా, యీ రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావిస్తుంది పాఠకలోకం. ఒక కావ్యం చదవడంలో రచయిత జీవితం ఎంతవరకు ఉపయోగిస్తుంది అన్న విషయంపై విభిన్నదృక్పథాలు విరుద్ధసిద్ధాంతాలు ఉన్నాయి. నా దృష్టిలో కావ్యమే సకలార్థసాధకం. కాని, దాన్తె విషయంలో అతడి కావ్యం అతడి ప్రేమతో, రాజకీయజీవితంతో అనవసరంగా ముడిపడిపోయింది. కావ్యాన్ని వాటినుండి విడి చేయడం సాధ్యం కాదన్నంతగా పెనవేసుకున్నాయి కనుక వాటిని ప్రస్తావించి, పక్కకు పెట్టడం అవసరం.

దాన్తె, బియత్రీచెలు మొదటిసారి కలిసినపుడు వాళ్ళు తొమ్మిదేళ్ళ పిల్లలు. మనకు అర్థమయేటట్టు చెప్పాలంటే నాలుగో తరగతిలో చదువుతుంటారు, బహుశా. కలిశారనడం కూడా సరికాదు. వయసొచ్చేవరకు ఆ పిల్ల అతన్ని ఎన్నడూ పలకరించి ఎరగదు. ఎప్పుడన్నా ఒక అరనవ్వు నవ్వేది. కాని వయసొచ్చాక ఆమెకు అతడంటే ప్రేమ కలగలేదనలేము. దాన్తె తక్కిన ఆడపిల్లలతో చనువుగా తిరుగుతుంటే, యిష్టపడేది కాదు. దాన్తె ముఖాన్నే అడిగేది. కాని ఆమె తండ్రి ఆమెను ఒక సంపన్నుడికిచ్చి పెళ్ళిచేసినపుడు ఆమె కాదనలేదు. చేసేసుకుంది. ఆ తరువాత కొద్దికాలానికే చనిపోయింది, తన యిరవైనాలుగవ ఏట. దాన్తె జీవితకాలమంతా బియత్రీచెను ప్రేమించాడు, కాదు ఒక దేవతగా ఆమెను ఆరాధించాడు. బహుశా ఆమెను వివాహం చేసుకోవాలన్న ఆలోచన కూడా అతడికి ఎన్నడూ ఉండి ఉండలేదేమో! ఆమె మీద కవితలు రాశాడు, ఏకంగా ఒక కావ్యమే రాశాడు. ఆ తరువాత తన ప్రధానకావ్యమైన డివైన్ కామెడీలో బియత్రీచె ఒక అతిప్రధానపాత్ర. పాత్ర అనడంకంటే ఆమె ఒక దివ్యశక్తి అనడం సరియేమో! నిజానికి ఆమె దాన్తెకు తన తొమ్మిదో ఏటనుండి కూడా, మొదటి చూపునుండి కూడా, ఒక మానుషరూపం కాదు, ఒక అలౌకిక ఆధ్యాత్మిక అనుభవం. ఆమె సోదరుడు దాన్తెకు సన్నిహిత మిత్రుడు. బియత్రీచె జబ్బుపడి చావుతో పోరాడుతున్న సమయంలో అతడు తన కవిమిత్రుడి వద్దకు వచ్చి ఆమెపై ఒక కవిత రాయమని కోరాడు. కాని, అప్పుడు కానీ ఆ తరువాత కానీ ఆమె పై దాన్తె రాసిన కవితలలో ఉన్నది ఫ్లారెన్స్ వీథిలో పెన్సిలు రబ్బరు కొనడానికి వచ్చిన రెండుజడల నాలుగో తరగతి పిల్ల కాదు. ఆ పిల్ల అతడికి బాలాత్రిపురసుందరి. అతడి అలౌకిక అనుభూతికి ఆమె కామెడీలో ఒక నిమిత్తమాత్రయే. కృష్ణశాస్త్రి ‘ఊర్వశి’ కాకినాడలో కలిసిన స్త్రీ అనవచ్చా?

ఇక దాన్తె వివాహవిషయం. అతడు పూర్తిగ వివిధశాస్త్రాల అధ్యయనంలో తీవ్రంగా మునిగి ఉన్న సమయంలో జేమ్మను పెళ్ళి చేసుకున్నాడు 1292లో. అతడికి యిరవై ఏడేళ్ళ వయసు. తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉండినారు, దాన్తె దేశంనుండి బహిష్కరించబడిన వరకు. ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో వారికి అయిదుగురు కొడుకులు, యిద్దరు కూతుళ్ళు కలిగారు. దేశబహిష్కారం తరువాత అతడు తిరిగి ఫ్లారెన్స్ రాలేదు. రానివ్వలేదు ఆనాటి ప్రభుత్వం. దాన్తె ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. దాన్తె భార్య కొంత ఆస్తిని కాపాడుకోగలిగింది, అది దాన్తె ఆస్తి కాదు, తనకు తన తల్లిదండ్రులనుండి సంక్రమించినది అని వాదించి. ఆ కొద్ది ఆదాయంతో ఏడుగురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. వారిలో యిద్దరు కొడుకులు కొంత పెద్దయిన తరువాత ప్రవాసంలో ఉండిన తమ తండ్రి వద్దకు వెళ్ళి ఆయనతో ఉన్నారు. అతడు తన భార్య బిడ్డలను తన కవితల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ మాటకొస్తే అతడి జీవితంలోని సైనికసేవవంటి అనేకవిషయాలను కూడా ప్రస్తావించలేదు. అది కుటుంబవైముఖ్యంగా అర్థం చేసుకోనవసరం లేదు. అతడి కవితాశయం వేరు. ఇదీ దాన్తె ప్రేమ కథ. ఇక అతడి దేశబహిష్కారము, ప్రవాసము.

దేశమంటే ఆ కాలంలో నగరమే. ఫ్లారెన్స్ ఒక రాజ్యం, జెనోవా ఒక రాజ్యం, వెనిస్ ఒక రాజ్యం. రోమ్ సరే, క్రైస్తవసామ్రాజ్యానికి ముఖ్యపట్టణం. ఆనాడు ఇటలీ ఒక దేశం కాదు. ఇటలీని ఒక దేశం చేయవలె అన్నదే దాన్తె కల. అతడి రాజకీయం, అతడి పోరాటం, అతడి బహిష్కారం అన్నీ ఆ కలలో కలిగినవే. ఆ కల చాలా కాలానికి, సుమారు ఏడు వందల సంవత్సరాల తరువాత సాకారమయింది, పీడకలగా ముస్సొలీని కాలానికి. ఆనాటి రాజకీయాల వివరాలు చాలా సంక్లిష్టం. వాటిని అర్థం చేసుకోవడంలో ఆయాసం అధికం, ప్రయోజనం తక్కువ. ప్రధానంగా గుర్తుంచుకోవలసింది, పోప్ బోనిఫాచ్చె తన అధికారాన్ని విస్తృతం చేసుకోవడం కొరకు వేసిన ఎత్తులు, వాటికి వివిధరాజులనుండి వచ్చిన ప్రతిఘటన, మద్దతు. కొందరు రాజులు, పోపు అధికారాన్ని ఎదురించారు, కొందరు సమర్థించారు. విచిత్రమేమంటే, యీ పోపు, చక్రవర్తి ఫ్రెడరిక్‌ల (పవిత్రరోమన్ సామ్రాజ్యం) మధ్య స్పర్ధను, మతము-రాజ్యముల మధ్య పోటీగా రెండు పక్షాలవారు స్థూలంగా ప్రదర్శించినా, వాస్తవంలో అది పరదేశపాలనను విరోధించే స్వదేశీ ఉద్యమం. జర్మన్ ఆధిపత్యాన్ని సహించని స్వదేశాభిమానులు ప్రభువును తీవ్రంగా ఎదిరించారు. వారిలో మతీల్డ (Matilda of Tuscany) ప్రముఖ రాణి. మన ఝాన్సీ లాగా, పోపుకు మద్దతుగా తన సైన్యాన్ని పంపింది. దాన్తె మొదట పోపు పక్షంవైపు పోరాడి విజయం సాధించాడు. ఆ తరువాత పోపుతో విరోధించి ఫ్రెడరిక్‌ను సమర్థించాడు. అంటే ఒక విధంగా, దాన్తె పరదేశపాలకపక్షం వహించాడనవచ్చు. అందుకు కారణం, పరదేశీయులు తన దేశాన్ని ఒకటి చేస్తారన్న అతడి ఆశ. (బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఒకటి చేశారని, బ్రిటిష్ పాలనకు ముందు అసలు భారతదేశం లేదనేవారు కూడా ఉన్నారు. ఒకటి చేశారో లేదో కాని, ఒకటిని రెండు చేశారు. ఇటువంటి ఐక్యతాస్వప్నం దాన్తెను నడిపించింది. చివరకు ఆ కల ఒక పీడకలగా నిజమయింది, 700 సంవత్సరాల తరువాత, ముస్సొలీని రూపంలో.)

ఆనాడు, పోపు పక్షం వహించిన గెల్ఫివారు కొంతకాలానికి మళ్ళీ రెండు వర్గాలుగా చీలిపోయారు, బ్లాక్, వైట్‌లుగా. నల్లవారు పోపు సర్వాధిపత్యాన్ని సమర్థించారు. తెల్లవారు పోపు అధికారాలు ధార్మిక విషయాలకే పరిమితం చేయాలనేవారు. రాజ్యనిర్వహణలో పోపు తలదూర్చకూడదు. ఫ్లారెన్స్ పోప్ పక్షం. ఆనాటి ఇటలీలోని రాజ్యాలలో ఫ్లారెన్స్ అతి సంపన్నమైనది, తక్కిన రాజ్యాలపై ఆధిపత్యం సంపాదించినది. అక్కడ గిబెల్లీని పక్షాన్ని నిషేధించారు పోపు పక్షం వహించిన గెల్ఫి పక్షంవారు. గిబెల్లీని పక్షసభ్యులనందరినీ రాజ్యబహిష్కారం చేశారు. గిబెల్లీని పక్షంలో ఉండిన దాన్తె కూడా ఫ్లారెన్స్ నుండి బహిష్కరించబడ్డాడు. అతడి జీవితకాలంలో అతడు తిరిగి తన ఫ్లారెన్స్‌లో అడుగు పెట్టలేకపోయాడు. ఒక్కసారి అనుమతిని యిచ్చారు కాని చాలా అవమానకరమైన షరతులతో. దాన్తె, అప్పటికే అనేకరాజుల మన్నన పొందినవాడు, అసాధారణమైన కవిగా ప్రసిద్దిపొందినవాడు, ఆ షరతులతో తాను అమితంగా ప్రేమించిన, తనను అమితంగా ద్వేషించిన తన జన్మభూమికి తిరిగి రావడానికి యిచ్చిన అనుమతిని స్వీకరించలేదు. అతడి ప్రసిద్ధకావ్యం ది డివైన్ కామెడీ ప్రవాసంలో రాయబడింది. (ప్రవాసంలో దాన్తె అనేక దేశాలు తిరిగాడు, వాసం చేశాడు.) కనుక అతడి కావ్యంలోని ప్రారంభచరణాలలోనే ప్రవాసం ధ్వనిస్తుంది. కాని, అక్కడ ప్రవాసం అత్యంతవిస్తృతార్థం సంపాదించింది. అందులోని ప్రవాసం దాన్తెది మాత్రమే కాదు, మనిషిది.

కనుక, ఒక రచయిత జీవితవిశేషాలు, అతడి రాజకీయాలు గాని, ప్రేమలు పెళ్ళిళ్ళు గాని, అతడి కావ్యచర్చలో ఎంతవరకు ఉపయోగిస్తాయి? కావ్యంలో భాగమైనంతవరకే కాని, విడిగా కాదు. అప్పుడది జీవితం కాదు, కావ్యాంశమే.

భాష-ఛందస్సు

దాన్తె ఇటాలియన్ భాషలో తెలుగులో నన్నయలాంటివాడు. అతనికి పూర్వం ఒకరిద్దరు ఆ భాషలో కవులున్నా, దాన్తె కావ్యంతో ఆ భాషకు గొప్ప గుర్తింపు వచ్చింది. హోమర్ గ్రీకు, వర్జిల్ లాటిన్‌తో సాటిగా దాన్తె ఇటాలియన్ గుర్తింపు పొందింది. ఆనాడు ఇటలీలో అనేక మాండలికాలు ప్రచారంలో ఉండినాయి. దాన్తె టస్కనీ (Tuscany) ప్రాంత మాండలికంలో రాశాడు. డివైన్ కామెడీతో ఆ మాండలికానికి జాతీయస్థాయి కలిగింది. గీడో కవల్‌కాన్తి (Guido Cavalcanti), బ్రునేత్తొ లతీని (Brunetto Latini) యితడి సమకాలికులు. గీడో గినిత్సేల్లి (Guido Guinizelli) అభిమాని దాన్తె.

కామెడీ లోని ఛందస్సును టెర్జా రీమా (terza rima) అంటారు. అంటే మూడవ ప్రాస. ఈ ఛందోరూపాన్ని తెలియడానికి ఆంగ్లంలోని పర్సీ బిష్ షెల్లీ (P. B. Shelley) ప్రసిద్ధకవిత ఓడ్ టు ది వెస్ట్ విండ్, ఉపకరిస్తుంది. ఇందులో పద్యాన్ని త్రిపద (tercet) అనవచ్చు. మొదటి త్రిపదలోని నడిమి పాదానికి తరువాతి త్రిపద మొదటి పాదానికి ప్రాస (మూడవ ప్రాస).

O wild West Wind, thou breath of Autumn’s being,
Thou, from whose unseen presence the leaves dead
Are driven, like ghosts from an enchanter fleeing,

Yellow, and black, and pale, and hectic red,
Pestilence-stricken multitudes: O thou,
Who chariotest to their dark wintery bed

The winged seeds, where they lie cold and low,
Each like a corpse within its grave, until
Thine azure sister of the Spring shall blow

Her clarion o’er the dreaming earth, and fill
Driving sweet buds like flocks to feed in air)
With living hues and odours plain and hill:
– (Ode to the West Wind.)

ఇన్‌ఫెర్నో ప్రారంభపాదాలు (Prologue):

రొబెర్తో బెన్యిని (పూర్తి పాఠం ఇక్కడ)

Nel mezzo del cammin di nostra vita
mi ritrovai per una selva oscura
ché la diritta via era smarrita.

Ahi quanto a dir qual era è cosa dura
esta selva selvaggia e aspra e forte
che nel pensier rinnova la paura!

Tant’è amara che poco è più morte;
ma per trattar del ben ch’i’ vi trovai,
dirò de l’altre cose ch’i’ v’ho scorte.

Io non so ben ridir com’i’ v’intrai,
tant’era pien di sonno a quel punto
che la verace via abbandonai.

దాన్తె: సాంఖ్యము

దాన్తెకు గణితశాస్త్రాభిమానం ఎక్కువ. అతనికి యీ సమస్తసృష్టి గణితశాస్త్రరచన, అతని కల్పన గణితం. సాధారణంగా యీరెండు విరుద్ధాలు అని భావిస్తాం. దాన్తెకు కల్పన గణితరూపం. డివైన్ కామెడీ కావ్యం ముగింపులో యీ జ్యామితి (Geometry) కల్పన:

Like a geometer who sets himself
To square the circle, and is unable to think
Of the formula he needs to solve the problem,
So was I faced with this new vision.
(Sisson. Paradiso: 33-133-136)

ఈ పద్యాన్ని దాని సందర్భంలో పరిశీలించవలసి ఉంది. వలయాన్ని త్రిభుజంగా మార్చడమంటే, అవాజ్మానసాన్ని వాక్కుతో పట్టుకోడమే. తత్త్వాన్ని మాటల్లో పట్టుకోవలెనంటే, ఆ తత్త్వానికి రెండు కాళ్ళు రెండు చేతులు (పది యిరవై కాకపోయినా) చేర్చాలనే ప్రాథమికభాషావశ్యకతను గుర్తించిన ఆదికవి వాల్మీకి. దాన్తె, అరవిందయోగి యీ సాహసం చేసినవారిలో ప్రముఖులు. వాక్కుకు అందనిదానిని వాక్కుతో పట్టుకోవాలని, ఎగిరే చేపకోసం ఎగిరే కొంగముక్కులు. (‘As Kingfishers Catch fish’- Hopkins.)

దాన్తె ఎక్కాలపుస్తకాన్ని కవిత్వంగా మార్చగలడు. ఎక్కాలపుస్తకాన్నే కాదు గంటల పంచాంగాన్ని కూడా కవిత్వంగా మార్చగలడు. కావ్యంలోని ప్రతి సంఘటన ఎప్పుడు జరిగిందో రాశితో తిథివారనక్షత్రాలతో సహా చెబుతాడు, వాటికి కావ్యంలో స్థానం కల్పిస్తూ, వాటిని కవితగా మారుస్తూ (అతను పుట్టిన ఏడాదిని ఇలానే అంచనా వేశారు). గహనవనం (a dark wood: una selva oscura) గడచి బయటపడుతున్న సన్నివేశాన్ని యిలా చెబుతున్నాడు:

అది సుప్రభాతసమయం, పగటి ప్రభువు వెడలెను
దివ్యప్రేమ ప్రేరణలో సృష్ట్యాదిన కదలి,
అలనాటి తనతోటి సుందరతారలతో గగనపథాధిరోహణ చేస్తూ.
నా మది నిండి పొంగి పొరలె
(Prologue: 37-42)

దీనిని సృష్టి సమయంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్న బైబిల్ వర్ణనతో అనుసంధిస్తున్నాడు. బైబిల్ లోని ఆదికాండంలో (Genesis) వర్ణన దేశకాలాల (Space and Time) సృష్టి. ఆ సృష్టిని దాన్తె అనే పథికుడు గహనవనగమనంతో అనుసంధిస్తున్నాడు.

ప్రవాసం

ప్రపంచసాహిత్యంలో ప్రవాసం ఒక ప్రముఖ కావ్యవస్తువు. కాని అన్నిటి కావ్యప్రయోజనం ఒకటిగా ఉండదు. ఒక్కొక కావ్యంలో ప్రవాసం ఒక్కొక ముఖం ప్రదర్శిస్తుంది. రామాయణంలో పదునాలుగేళ్ళు, భారతంలో పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం, అంతకంటే కష్టమైన ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చెప్పబడినవి. కాని రామాయణంలో, భారతంలో ‘వనవాసం మంచిదే’ అనిపించేంతగా చెప్పబడింది. సీతాదేవి తిరిగి వనవాసం కోరింది (తెలిసో తెలియకో, మంచికో చెడుకో). వనవాసం అంత ఆహ్లాదకరం! అరణ్యవాసం చేస్తున్న పాండవులను సంజయుడు చూచినపుడు ధర్మరాజు ఎట్లా ఉన్నాడట!–వనవాసము సేసియు త్రిభువనరాజ్యము చేయునట్టి వడువున సంతోషనిబద్ధబుద్ధి ( ఆరణ్య.1.66). సంతోషనిబద్ధబుద్ధి అంటే సంతోషం స్వభావం అయినవాడు అని అర్థం. కారడవిలో ఉన్నా రాజప్రాసాదంలో ఉన్నా అతడికి తేడా లేదు. వాసవలీలన్ (ఆరణ్య: 3.123), స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడిలా దివ్యంగా వెలిగిపోతూ కనిపించాడట ధర్మరాజు. అంటే అరణ్యరోదనం అన్న పదానికి అర్థం లేదని కాదు. రోదనమో మోదనమో మనిషి స్వభావం. వనవాసస్వభావం మారదు. ఆత్మీయులకు, జనని జన్మభూమికీ దూరమైనామన్న దుఃఖం ప్రవాసలక్షణం.

ప్రవాసంలో కూడా రెండువిధాలు. ఒకటి దేశబహిష్కారం, రెండు, పరదేశంలో బానిసబ్రతుకు. అంటే, ఒక రాజు మరొక రాజ్యాన్ని ఆక్రమించి ఆ దేశప్రజలను బానిసలుగా తమ రాజ్యానికి తరలించడం. చరిత్రలో యిటువంటి బానిసప్రవాసం ప్రతిజాతి ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిందే. ఈ విధమైన బానిసప్రవాసం యూదులు అనుభవించారు. బైబిల్ పాతనిబంధన లోని యూదుల ప్రవాసం (Exile) ప్రాక్క్రైస్తవచరిత్రలో ప్రముఖ సంఘటన. ఆ తరువాత ఈజిప్టు నుండి ప్రవాసం (Exodus) మరో ప్రముఖ ఘటన.

డివైన్ కామెడీ కావ్యంలో దాన్తెకు ఆచార్యుడై అతనికి దారి తెలియని కారడవిలో దారి చూపినవాడు వర్జిల్ (Virgil). అతడు కవిగాను, ఆధ్యాత్మిక మార్గంలోనూ కూడా దాన్తెకు ఆచార్యుడు. వర్జిల్ రాసిన ప్రసిద్ధకావ్యం ఎనీయడ్‌లో (Aeneid) కథానాయకుడు ఎనీయస్ (Aeneas) కూడా ప్రవాసి. జన్మభూమి ట్రోయ్ (Troy) వదిలి పరదేశం వలస వెళ్ళాడు.

షేక్స్‌పియర్ నాటకాలలో–విషాదాంతాలలో కాని, సుఖాంతాలలో కాని, రెండూ కలిసిన వాటిలో కానీ ప్రవాసం ప్రముఖవిషయం. ఆజ్ యు లైక్ ఇట్ నాటకంలో డ్యూక్ ప్రవాసం, టెంపెస్ట్ నాటకంలో ప్రాస్పెరో ప్రవాసం కొన్ని ఉదాహరణలు.

బోదెలేర్ కవితల్లో ప్రముఖమైనది హంస (La Cygne). దాని కవితావస్తువు ప్రవాసం. ఆ కవిత హ్యూగోకు (Victor Hugo) అంకితం. మూడవ నెపోలియన్‌ను దేశద్రోహి అన్నాడు హ్యూగో. ఒక దేశపు చక్రవర్తిని దేశద్రోహి అని ఎవడైనా బతకడమే ఆశ్చర్యం. దేశబహిష్కారం చేశాడు చక్రవర్తి. హ్యూగో అప్పుడు గర్న్‌సీ (Guernsey) ద్వీపానికి వలస వెళ్ళాడు. అతడి ప్రసిద్ధనవల ల మిసరాబ్ల్ (Les Miserables) ప్రవాసంలో రాశాడు. కాని అతడికి ఆ ద్వీపమే నచ్చింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత నెపోలియన్ ఆంక్ష తొలగించినా హ్యూగో ఫ్రాన్సుకు తిరిగి రావడానికి యిష్టపడలేదు. ఫ్రాన్సులో పూర్తిగా ప్రజాపాలన ఏర్పడిన తరువాతనే స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.

ఇక, బోదెలేర్ కవితలో ఆన్ద్రొమాక్ తన భర్తను పోగొట్టుకొని, స్వదేశం ట్రోయ్ వదిలి బందీగా, విజేత భార్యగా ఎపైరస్‌లో ప్రవాసం అనుభవించింది.

ఆన్ద్రొమాక్, నీవు గుర్తొస్తున్నావు—
నీ నవవైధవ్యమహద్వ్యసనానికి దీనదర్పణం,
ఆ కుల్య, అసత్యసిమ్వా, నీ కన్నీటితో
పొంగి మహాప్రవాహమైన కాలం.

ఈ బోదెలేర్ కవితలో ఒక్క ఆన్ద్రొమాక్ ప్రవాసమే కాదు, అన్నివిధాల ప్రవాసము కవితావస్తువు. తన పారిస్ నగరమే తనకు ప్రవాసంగా మారిపోయింది అంటున్నాడు బోదెలేర్:

ఒకనాటి పారిస్ యిక లేదు. ఒక నగరరూపం మనిషి
మనసుకంటే, అయ్యో! త్వరగా మారుతుంది

చిక్కిశల్యమైన నీగ్రోవనిత గుర్తొస్తోంది,
బురదదారులు తొక్కుతూ, పొగమంచు వెనక
అదృశ్యమైన తన గొప్ప ఆఫ్రికా
కొబ్బరిచెట్లకోసం ఆబగా వెదకుతూ;

బానిసప్రవాసం నీగ్రోవనితకు నిత్యనివాసం, చరిత్రలో ఆమె ఒక కన్నీటి అధ్యాయం. అంతేకాదు, బోదెలేర్ ప్రవాసపరిధిని యింకా విస్తృతం చేస్తాడు. కొత్త వలససామ్రాజ్యాలు స్థాపించేవారు కూడా, గొప్ప అన్వేషకులు. కాని వారికి తెలియకుండానే వారి కాంక్షాఫలంగా ప్రవాసజీవనం చేసినవారే. తమ జవ్మభూమిని జ్ఞాపకాలలో సామ్రాజ్యకాంక్ష అడుగున సమాధి చేశారు.

పురాస్మృతి ఒకటి కొమ్ము ఊదింది!
దూరద్వీపంలో విస్మృతనావికులు,
—బందీలు, పరాజితులు… యింకెందరో!

ఏనియస్ కూడా ప్రవాసి. అలాటివారెందరో:

ఎవరెవరు పోగొట్టుకున్నారో ఎన్నటికీ ఎన్నటికీ తిరిగిరానిదానిని,
ఎవరి కన్నీరు వారి సేచనమై, తోడేలు పాలు పాలనమై,
పూలలా వాడిపోతున్న అనాథులు!
వారందరూ వస్తున్నారు తలపుకు.

ఆల్బేర్ కామూ (Albert Camus) కథ అతిథి (L’hôte,ల్’ఓత్) ప్రవాస సరిహద్దులను చెరిపేస్తుంది. ఆ కథలో ఎవడు అతిథి, ఎవడు యజమాని? అరబ్బు నేలపై నివసించే ఫ్రెంచివాడా, అరబ్బా? ఇద్దరూ. తన అవసరంలేని యీ భూమిపై మనిషి ప్రవాసి.

ప్రవాసి అనగానే మనకిష్టమైన కృష్ణశాస్త్రి పరచిన ‘ప్రవాసి’ మరణశయ్య గుర్తురాకుండా ఉంటుంద

నా కుగాదులు లేవు
నా కుషస్సులు లేవు
నేను హేమంత కృ
ష్ణానంత శర్వరిని.

నాకు కాలమ్మొక్కటే
కారురూపు, నా
శోకమ్మువలెనె, నా
బ్రతుకువలె,
నా వలెనె.

ఏను మరణించుచున్నాను…

ఏను మరణించుచున్నాను; ఇటు నశించు
నాకొరకు చెమ్మగిల నయనమ్ము లేదు;
పసిడివేకువపెండ్లిండ్ల పడిన యెవరు
కరగనేర్తురు జరఠాంధకారమృతికి?

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె!
నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను!
నేనె నాపయి వాలినా, నేనె జాలి
నెదనెద గదించినాను, రోదించినాను!

బ్రతికియున్న మృత్యువునై ప్రవాస తిమిర
నీరవ సమాధి క్రుళ్ళి క్రుంగినపుడేని
నిను పిలిచినాన, నా మూల్గునీడ ముసిరి
కుములునేమొ నీ గానోత్సవముల ననుచు?

ఈ ‘బ్రతికియున్న మృత్యువునై ప్రవాస తిమిరం’తో మొదలవుతుంది దాన్తె కావ్యం ది డివైన్ కామెడీ.

ఇన్‌ఫెర్నో: ప్రోలోగ్

Nel mezzo del cammin di nostra vita
mi ritrovai per una selva oscura
che’ la diritta via era smarrita.

(Midway our life’s path I found out that the direct way was lost in an obscured wood. Prologue: 1.)

మన బతుకుదారి మధ్యలో కనుగొన్నాను
ఎక్కడో దారి తప్పానని
దిక్కుతోచని ఒక గహనవనంలో చిక్కుకున్నానని.

ఈ ఉపమానం ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఉంది. గాంధారదేశవాసిని ఒకనిని దొంగలు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఒక నిర్జనమైన అడవిలో వదిలేశారు. దిక్కుతోచక తన స్వదేశానికి ఎలా వెళ్ళాలో తెలియక రక్షించండి అని ఆక్రోశించాడు. ఎవరో ఒక మహాపురుషుడు అతడి కళ్ళకు కట్టిన గంత తొలగించి, యీ దిక్కుగా వెళ్ళు, మీ గాంధారదేశం చేరుతావు అని దారి చూపినపుడు, అతడు ఊరూరు తిరిగి, దారి అడుగుతూ తన గాంధారదేశం చేరుకుంటాడు. అలాగే యీ లోకంలో (ఇహ) దారి చూపేవాడు దొరకాలి. క్షణంలో జ్ఞానం కలిగి ముక్తుడౌతాడు.

[యథా సోమ్య పురుషం గాంధారేభ్యోఽభినద్ధాక్షమానీయ తం తతోతిజనే విసృజేత్ …తస్య యథాభినహనం ప్రముచ్య ప్రబ్రూయాద్ ఏతాం దిశం గాంధారా ఏతాం దిశం వ్రజేతి స గ్రామాద్గ్రామం ప్రచ్ఛన్ పండితో మేధావీ గాంధారేనేవోపపద్యేత ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద… (6.14.1-2)]

ఈ ప్రారంభపద్యంపై ఒక గ్రంథం రాయదగినంత విషయం ఉంది, ‘శ్రీవాణీగిరిజాః’పై రాయగలిగినంత. దాన్తె జీవితకాలరచన అయిన డివైన్ కామెడీ అతడి దేశబహిష్కారకాలంలో, ప్రవాసంలో జరిగింది. ఈ ప్రవాసం ఆ విధంగా సఫలమనే చెప్పాలి. ఈ ప్రవాసకాలంలో ఆయన అనేక రాజ్యాలు తిరిగాడు, అనేకదేశాధిపతుల, సంపన్నుల ఆతిథ్యము, ఆదరసత్కారాలు పొందాడు. జీవితచరమదశలో రవేన్న (Ravenna) నగరాధీశుడు గీడో (Guido Novello da Polenta) కూడా ఆయనను ఆదరించి సత్కరించాడు. దాన్తె మరణం (1321) రవేన్న లోనే, కామెడీ రచన ముగిసిన కొద్దికాలంలోనే. తన జీవితానుభవం, ఒక దేశదుస్థితికే ప్రతీక. దేశ దుస్థితి ఒక మనిషిది కాక మనిషి దుస్థితికి ప్రతీకగా కావ్యత్వం పొందుతుంది. బైబిల్‌లో చెప్పిన ప్రవాసం (బాబిలోనియాలో యూదుల ప్రవాసం) కేవలం ఒక జాతిది కాదు. అది మనిషి ప్రవాసం, యీ లోకమే మనిషి ప్రవాసం. కామూ చెప్పినట్లు ఇంత విస్తృతిని సంపాదిస్తాడు దాన్తె, తన కావ్య ప్రారంభంలో. కారడవిలో దారి తప్పిన మనిషి తన స్వస్థలం చేరుకోవలెనని తపిస్తాడు. ఆ తపనతో ప్రారంభం అవుతుంది డివైన్ కామెడీ.

దాన్తె యీ ప్రారంభశ్లోకంలోని కారడవి (una selva oscura) ఉపనిషదర్థం ఒక్కటే కాదు. యూరపు ఉండిన ఒక కాల్పనిక, గ్రామీణ (romantic, pastoral) సాహిత్యసంప్రదాయసూచన కూడా ఉన్నది.

మనకు సుపరిచితమైన కృష్ణశాస్త్రి కవితాపంక్తులు: ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై యీ యడవి దాగిపోనా, ఎటులైన యిచటనే ఆగిపోనా. (‘ఎటులైన’ లోని ప్రత్యేకస్ఫూర్తి గురించి తరువాత చెప్పుకుందాం.)

ఇటువంటి కాల్పనికతను స్ఫురింపజేస్తుంది దాన్తె సేల్వ (selva) పదప్రయోగం. ఇటాలియన్ భాషలో అడవి అన్న పదానికి అనేక పదాలున్నాయి (la foresta, la legna, il bosco). కాని సేల్వ అన్నపదం వాడాడు. ఈ పదంలో కాల్పనిక స్ఫూర్తి ఉంది. ఆంగ్లంలో–pleasantly rural or pastoral, vistas of sylvan charm, అంటారు. ఈ సందర్భంలో ఆ స్ఫూర్తి ప్రయోజనం ఏమిటి?

ప్రారంభపద్యంలోని గహనవనంలో (una selva oscura) రెండు విరుద్ధాలను జత చేశాడు దాన్తె. గహనాటవి, కారడవి మొదలైన ఎన్నో పదాలున్నాయి. అనువాదంలో గహనవనం అన్న పదాన్ని ఎన్నుకోడంలో ప్రయోజనమేమిటి? వనం అన్న పదం రెండర్థాలలో వాడవచ్చు, నందనవనం అనవచ్చు, దండకవనం అనవచ్చు. ఇక్కడ దాన్తె రెంటినీ ఉద్దేశిస్తున్నాడు. కనుకనే, సేల్వ (sylvan,pastoral), oscura (obscure, shadowed) అన్న విరుద్ధపదాలను జత చేశాడు. ఒక అర్థంలో దాన్తె దిక్కుతోచని కారడవిని చెబుతున్నాడు (oscura); మరో అర్థంలో ప్రకృతిరామణీయకతను పల్లె ప్రాంత సౌందర్యాన్ని (selva, sylvan) చెబుతున్నాడు. నందనవనానికి చోటు చూసుకుంటున్నాడు దాన్తె యీ సమాసంలో. నందనవనానికి తరువాత వద్దాం. ముందు, సిల్వన్, పాస్టోరల్ సాహిత్యసంప్రదాయం గుర్తుచేసుకుందాం. ఇంగ్లీషులో మనకు వెంటనే స్ఫురించే కవులు మార్లో (Christopher Marlowe, The Passionate Shepherd to His Love. 1599); ఎడ్మండ్ స్పెన్సర్ (Edmund Spenser, The Shepherdesses Calendar, 1579); ఫిలిప్ సిడ్నీ (Philip Sidney, Arcadia, The Nightingale, The Twenty-Third Psalm). ఈ పాస్టొరల్ సంప్రదాయం కూడా రెండు పాయలుగా సాగింది. ఒక పాయ, పల్లెపిల్లలను పట్టణ సుఖజీవనభావనలతో ఆకర్షించడం (మార్లో); రెండవ పాయ, పల్లెప్రాంతాల ప్రకృతిరామణీయకత, అమాయకత, స్వచ్ఛత. ఫిలిప్ సిడ్నీలో రెండు పాయలూ ప్రవహించాయి. ఆర్కేడియాలో (Arcadia) ప్రకృతిరామణీయకత కావ్యవస్తువు. 23వ సామ్‍లో ప్రకృతిపట్ల మనిషి అప్రమత్తంగా ఉండవలె, తనను కాపాడుకోవలసిన అవసరం ఉన్నది అని గుర్తు చేస్తాడు సిడ్నీ. దాన్తె యీ రెంటినీ జోడించాడు ఒకే సమాసంలో.

పాస్టొరల్ కవితలో వస్తువు, కాలుష్యం లేని పల్లెప్రాంతము, కల్మషం లేని మనుషులు. గొర్రెలుకాచే (shepherds) ప్రేమజంటలు. గొర్రెలను గాలికీ మేతకూ వదిలేసి, ప్రేమగీతాలు పాడుతూ ఒకరి వెంట ఒకరు పడడం యీ సంప్రదాయంలో ప్రధానం. (ఈ కాల్పనిక కవిత ఎంత ‘కాల్పనికమో’ మనకు తెలియదు. ఈ కవితను ఆనందించేవారెవరూ గొర్రెలమందను కాని, గొర్రెలకాపరిని కాని చూచి ఉండరు. అది వేరే విషయం.) తెలుగు సాహిత్యంలో యీ పాస్టొరల్ కవితకు ప్రాచుర్యం భావకవులతో వచ్చింది. భావకవితలో (కొందరు బావ కవిత అనికూడా ఎద్దేవా చేశారు!) ముందు గుర్తు వచ్చేది నండూరి సుబ్బారావు ఎంకి పాటలు (భావకవితోద్యమం జల్లెడలో మిగిలేది బహుశా నండూరి, కృష్ణశాస్త్రి మాత్రమే కావచ్చు.)

పాస్టొరల్ కవితల్లో ప్రధానలక్షణం పల్లీయుల ఆత్మీయత, స్వేచ్ఛ, స్వచ్ఛత: ఎలతెలా పోయింది ఎర్రి నా ఎంకి; ఎంకెవ్వరని నన్ను ఎవరైన అడిగితే వెలుగునీడలవైపు వేలు చూపింతు. వెలుగునీడల ప్రకృతికి ప్రతీక ఎంకి. నీడ లేని వెలుగు లేదు. అదే కృష్ణశాస్త్రి కవితాపంక్తి లోని ‘ఎటులైన’ పరమార్థం. ఈ యడవి దాగిపోనా, ఎటులైననిచటనే ఆగిపోనా? ఉండిపోవలెనని నిశ్చయించుకున్నవాడు ‘ఎటులైన’ అనడం ఎందుకు? అడవిలో కేవలం ఆకులు, కొమ్మలు, నునులేత రెమ్మలు, ఉండవు. ముళ్ళు కూడా ఉంటాయి. వెలుగుతో నీడ ఉండకపోదు. (వెలుగునీడలవైపు వేలు చూపింతు.) ఆ నీడలనే (Oscura) గుర్తిస్తూ ‘ఎటులైన’ అన్నాడు కృష్ణశాస్త్రి. ఆ వెలుగు నీడలనే స్ఫురింపజేస్తున్నాడు దాన్తె, గహనవనంలో. ఇది దాన్తె పద్యంలో పై అర్థం. కావ్యంలో దీని పరమార్థం ఏమిటి? ఇక్కడ మనం కొంతసేపు పక్కకు జరిగి నడవాలి.


ఈ కావ్యంలో ప్రధానపాత్రలు రెండు, దాన్తె, వర్జిల్. గహనవనంలో దిక్కుతోచని పథికుడు దాన్తె, దారిజూపే ఆచార్యుడు వర్జిల్. రెండు రంగాలలో ఆచార్యుడు వర్జిల్, కవిగా, ఆధ్యాత్మికవేత్తగా. కవిగా వర్జిల్ పట్ల అపారగౌరవం దాన్తెకు: You are the honor and light of all other poets, may my long study and the great love that made me read your poems serve me now. You are my master and my author. (Inferno 1.82–85.)

వర్జిల్ కేవలం ఏనియడ్ కావ్యకర్త కాదు, పాస్టొరల్ కవి కూడా. అతడి ఎక్లోగ్స్ (Eclogues) పాస్టొరల్ సాహిత్యసంప్రదాయంలో ప్రముఖ రచనలు. ఆ పాస్టొరల్ సంప్రదాయాన్నే స్ఫురింపజేస్తున్నాడు దాన్తె తన ‘వన’ (selva, sylvan) పదప్రయోగంలో. కాని, అతడి పరమప్రయోజనం అది కాదు. ఇది ఆచార్యుడి పాదాలపై గురిపెట్టిన నమస్కారబాణం. తరువాతి బాణంతో ఆ సంప్రదాయాన్ని గుట్టుగా తలకిందులు చేయబోతున్నాడు. ఆ తరువాత బాణం కొరకు పర్గటోరియో వరకు వేచి ఉండాలి. (దాన్తె కావ్యరచన అల్లిక అట్లా ఉంటుంది. ఆ అల్లిక విషయం మరో అధ్యాయంలో.) ఇంతకూ ఎందుకు తలకిందులు చేయడం? క్రైస్తవధర్మంలో ప్రకృతి దానికదే ఆరాధనీయం కాదు. ‘నేను గొర్రెలకాపరిని’ అనలేదు క్రీస్తు; ‘నేను మంచి గొర్రెలకాపరిని’ (I am a good shepherd) అన్నాడు. ప్రకృతిలో బైబిల్ కవులు చూచింది రామణీయకతను కాదు, రాక్షసకంటకాలనూ కాదు. పాస్టొరల్ సంప్రదాయానికి ఆద్యుడని దాన్తె సంభావించిన వర్జిల్ కూడా యీరాక్షసకంటకాలను, వెలుగునీడలలోని నీడలనూ గుర్తించాడు. This wood of wilderness, savage and stubborn (Inf. 1.93.) అని డివైన్ కామెడీలో అన్నది వర్జిల్. బైబిల్ కవులు ప్రకృతిలో దివ్యలీల దర్శించారు. రామణీయకతను రాక్షసత్వాన్ని, ముళ్ళను పూలను తనలో లీనం చేసుకున్న దివ్యలీల డివైన్ కామెడీ.

The sea looked and fled,
Jordan turned back.
The mountains skipped like rams,
the hills like lambs. (Psalm: 114)

ప్రకృతి అంటే, ఆకులు కొమ్మలు నునులేత రెమ్మలు మాత్రమే కాదు. అందమైన గొర్రెపిల్లలు ముద్దుగా గంతులేయడం కాదు. పర్వతాలు, కొండలు గంతులేయడం దర్శించారు బైబిల్ కవులు (The mountains skipped like rams/ the hills like lambs.) ఎంకి-నాయుడుబావ ప్రేమలు దాని పరమావధి కాదు. పాస్టొరల్ సంప్రదాయాన్ని, ఆ సంప్రదాయంలో ఆదికవి అనదగిన వర్జిల్‌ను వాచ్యార్థంలో గ్రహించిన దాన్తె, పరమార్థంలో ఆ పాస్టొరల్ సంప్రదాయాన్ని తలకిందులు చేశాడు. గొర్రెల కాపరిలో మంచి గొర్రెల కాపరిని దర్శించాడు.

క్రైస్తవధర్మదృష్టితో చూచినపుడు దాన్తె ‘ఉన సేల్వ ఒస్కూర’ ప్రయోగంలో ఒస్కూర పదం (obscure, shadowy) ప్రధానం. కాకులు దూరని కారడవి ఆధ్యాత్మికపథంలో మొదటి దశ, అవసరమైన దశ. Jesus said “I am the way, I am the truth and I am life” (John: 14.6.) మనిషిని మృత్యువునుండి అమృతత్త్వం (I am life) వైపు నడిపించే బతుకుదారి (nostra vita). ఆ దారి కారడవిలో మొదలవుతుంది. ముందు మృత్యువేమిటో తెలియాలి. మృత్యువును అనుభవించినవాడే `మృత్యోర్మామృతం గమయ’ అన్న ఆర్తనాదం చేస్తాడు. కనుక దాన్తె కావ్యం కారడవిలోనే మొదటి అడుగు వేయాలి. అది అమృతత్వం వైపు మొదటి అడుగు. దాన్తె యీ కారడవిని, యీ గహనవనాన్ని ఎలా మార్చేస్తాడో చూద్దాం.


పర్గటోరియోలో ప్రధానవిషయాలు రెండు. ఒకటి వర్జిల్ దాన్తెకు జ్ఞానస్నానం (baptism) చేయించడం. రెండు, గురుశిష్యుల భూలోకస్వర్గప్రవేశం (The Earthly Paradise, The Garden of Eden). జ్ఞానస్నానం క్రైస్తవ పూజారులే చేస్తారు. కాని దాన్తెకు, యీ జ్ఞానస్నానం అనే ధర్మదీక్షను వర్జిల్ యిస్తాడు. వర్జిల్ క్రీస్తు పూర్వంవాడు. ఆచార్యుడై దాన్తెను క్రైస్తవమార్గంలో నడిపించగల అర్హత అతడికి లేదు. కాని స్వర్గంలోని బియత్రీచె అతడికి అలా మౌంజీధారణ చేయమని ఆదేశించింది.

Therefore, go now, and around his waist tie a belt of simple grass, and wash the filth off his face. (Purg: 1:94-96.)

కనుక వెళ్ళు తక్షణం, చుట్టు అతడి నడుముకు
నమ్రగ్రాసరశన, మురికిని కడుగుతూ
చెయ్యి ముఖప్రక్షాళన.

మౌంజీధారణ వంటి క్రతుస్ఫురణ కలిగే సందర్భం:

My master stretched out his hands and picked the fresh grass. I knew what he meant and offered my tear stained cheeks to him. He washed away the infernal filth. Then he gave me the girdle, as was ordained by another. And, miraculously (oh meraviglia!), the grass grew again where it was plucked. (Purg: canto 1: 124-136.)

రెండు చేతులు చాపి నా స్వామి
నునులేత గ్రాసాన్ని గ్రహించాడు;
గ్రహించాను నేను గురుసంకల్పం.

అశ్రుసిక్త కపోలాలతో తన్ముఖమైనాను;
నరకంలో నలుపెక్కిన నా ముఖం
ప్రక్షాళితధూళియై ప్రకాశించింది.

అప్పుడతడా నమ్రగ్రాసపాశంతో
చేశాడు నా మౌంజీధారణ.
పెరికిన గడ్డి తత్‌క్షణమే, అద్భుతం లాగా!
పెరిగింది పచ్చగా, పెరికినచోటనే.
(Purg: canto 1: 124-136)

పర్గటోరియోలో పర్వతారోహణకు యీ ప్రక్షాళనం పథికుడికి అర్హత కలిగిస్తుంది. పర్గటోరియో 27వ సర్గాంతంలో దాన్తెకు వర్జిల్ క్రైస్తవ దీక్షను యిచ్చాడు. ఈ అర్హతను యివ్వడంలో మరొక ప్రాముఖ్యం ఉంది. అది వర్జిల్ అనర్హతను సూచిస్తుంది. ఆపై దాన్తెకు పథనిర్దేశం చేసే అర్హత వర్జిల్‌కు లేదు. తన ఆచార్యత్వాన్ని వదిలేసి, దాన్తెను ఆధ్యాత్మికమార్గంలో ప్రభువును చేశాడు.

Do not anymore look for my word or gesture. Your will is free, true, and steady. Here is your crown and the rod. (Virgil, Canto: 27.139-142)

ఇకపై, నా మాటకై సూచనకై ఎదురుచూడవద్దు;
ఇపుడు నీ బుద్ధి ఆర్జవస్వస్థం ముక్తం;
దానిని అనుసరించడం నీ ధర్మం.
ఆత్మసామ్రాజ్యానికి ప్రభువును చేస్తున్నా, ఇది ముకుటం యిది దండం.


ఇన్‌ఫెర్నోలోని మొదటి పర్వపు మొదటి పద్యంలోని దండకారణ్యం (This wood of wilderness, savage and stubborn అంటాడు వర్జిల్. Inf. 1.93) పర్గటోరియో కొచ్చేసరికి ఈ దండకారణ్యం ఎలా మారింది?

పర్గటోరియో 28వ సర్గ ‘ఆ దివ్యవనం కలయతిరగాలని ఆతురత’ అంటూ మొదలవుతుంది (la divina foresta: Purg: 28.1). రాక్షసాటవి కాస్తా దివ్యవనంగా మారిపోయింది. ఇక గహనవనం ఏమయింది?

Already my slow steps had carried me into the ancient wood, so that I could not look back to the point at which I had entered it. (Purg. 28.22-25.)

నా మందగమనం కూడా అప్పుడే
చేర్చేసింది పురావనంలోకి నన్ను,
ఎక్కడ ప్రవేశించానో తెలియనంత.

గహనవనం (una selva oscura) పురావనంగా (la selva antica) మారిపోయింది. ఈ పురావనం భూలోక స్వర్గం, ఈడెన్ ఉద్యానవనం అన్నది స్పష్టమే. ఈ పురావనం గొర్రెలకాపర్లు ప్రేమగీతాలు పాడుకునే వనం కాదు. ఇది కామస్పృహలేని పతనపూర్వ (prelapsarian) ఈడెన్ వనం. పురా (antica) వాడడం వలన ఆనాడు పోగొట్టుకున్న స్వర్గం (Paradise Lost) తిరిగి పొందడమన్న (Paradise Regained) స్ఫురణ కలుగుతోంది. మిల్టన్‍కు మార్గదర్శి అయినాడు దాన్తె. ఇంతవరకూ తనను నడిపించిన వర్జిల్‌నే ఒక నమస్కారబాణంతో యింటికి పంపించాడు! అలా రెంటినీ (oscura,antica) అనుసంధించడానికి సాధనం సేల్వ అన్న పదం. ఆ పదం మారలేదు, ఒస్కూర మారింది, ఆన్తీక వచ్చిచేరింది. గ్రామ్యగీతాలవనాన్ని దివ్యవనంగా మార్చాడు దాన్తె.

మొట్టమొదటి త్రిపద లోని ‘ఉన సేల్వ ఒస్కూర’ను సుమారు నాలుగువేల చరణాల తరువాత ‘ల సేల్వ ఆన్తీక’తో కలిపి ముడివేయడం దాన్తెకు మాత్రమే సాధ్యం.

ఇదీ దాన్తె అల్లిక జిగిబిగి.

ఈ ప్రారంభపద్యం లోని పదప్రయోగంలో చూడవలసింది యింకా ఉంది.

అడవినుండి అడవికి

మరలనదే ప్రారంభపద్యం. ఎంత నడిచినా ఎంతకూ తెగని అడవి యీ ప్రారంభపద్యం. డివైన్ కామెడీ ఆద్యంతము అధ్యయనం చేయనవసరం లేదు. ప్రస్తావన (Prologue) లోని ప్రధాన పద్యాలను అధ్యయనం చేస్తే మొత్తం కావ్యం తెలుసుకున్నట్లే. ఎందుకంటే, యీ కావ్యంలో ఏ పద్యాన్ని కదిలించినా కావ్యమంతా కదులుతుంది. అల్లిక అంత జిగిబిగి.

Nel mezzo del cammin di nostra vita
mi ritrovai per una selva oscura
che’ la diritta via era smarrita.

Midway our life’s path I found out that the direct way was lost in an obscured wood.

ల దిరీత్త వియా ఎర స్మర్రీత: the direct way was lost.

స్మర్రీత (smarrita) అన్న ఇటాలియన్ పదానికి సంస్కృతపదం (వి)స్మరిత. ఈ సాదృశ్యం, విపరీతార్థంలోనే అయినా, యాదృచ్చికం కావచ్చు. (స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గీత. 2.63). విచిత్రమేమంటే, దాన్తె రెండు విరుద్ధార్థాలూ (స్మరిత, విస్మరిత) ఉద్దేశించినట్టే ఉన్నాడు. పథికుడు అడవిలో దారి తప్పలేదు, దారి తప్పి అడవిలో అడుగు పెట్టాడు. ఋజుమార్గం (la diritta via) వదిలి, తప్పుదారి పట్టాడు. అతడు దారి తప్పక ముందు అది దండకారణ్యం కాదు, దివ్యవనమే (la Divina foresta); భూతలస్వర్గమైన పురావనమే (la selva antica). అంటే ఆ వనాన్ని దండకవనంగా మార్చింది మనిషి. అపమార్గం పట్టిన మనిషి. ఈ కావ్యంలో దాన్తె ప్రతి మనిషికి (every man) ప్రతీక. అలా, కథానాయకుడు.

అపమార్గం పట్టిన మనిషితో, అంటే ఆదిమానవపతనంతో, కావ్యం మొదలవుతుంది (Adam’s Fall, Original sin). కవి, మనిషి ‘పోగొట్టుకున్న స్వర్గం’ చెప్పాడు స్మర్ర్రీత-లో. ‘తిరిగి స్వర్గం పొందడం’ కూడా సూచించాడా యీ నాందీపద్యంలో? ఇందులో ఒక పదంలో అటువంటి సూచన ఉండవచ్చుననిపిస్తోంది. అది రిత్రోవై (ritrovai). ఇటాలియన్‌లో రిత్రోవై అన్నా, త్రోవై (trovai) అన్నా ఒకటే అర్థం: కనుగొన్నాను. మరి త్రోవై అనవచ్చుగదా? దారి తెలియడం లేదు అని చెప్పవలసిన సందర్భంలో, కనిపించింది రిత్రోవై (found again) అనడం ఎందుకు? ఇంతకూ యీ పదంలో దాన్తె ఏం చెబుతున్నాడు, స్మరణమా విస్మరణమా? స్మృతి భ్రంశమా, స్మృతిలాభమా? (నష్టో మోహః స్మృతిర్లబ్ధా. గీత. 18.73). అడవిలో దారి తప్పిపోయిందా, దారి దొరికిందా? రెండు విరుద్ధాలూ చెబుతున్నాడా? చెబితే, ఆ విరుద్ధాలను ఎలా సమన్వయించుకోవలె. మి రిత్రోవైని (I found me) రెండు విధాలుగ, విరుద్ధాలుగా అనువాదం చేయవచ్చు: నాకు దారి దొరికింది, నేను దారితప్పాను!

…mi ritrovai per una selva oscura (I found myself again in a dark wood.)

ఇక్కడ రిత్రోవై బదులు త్రోవై అనవచ్చు. కాని దాన్తె రెండర్థాలు స్ఫురించాలనే ‘రి’ (తిరిగి, మళ్ళీ) చేర్చి ఆ పదం వాడాడు, ‘మి రిత్రోవై’ అని. అంటే, మనిషి పతనం ఎప్పుడో ఆదిలో బైబిల్‌లో జరిగిపోయింది కాదు, నిత్యమూ జరిగేదే. మనిషి మళ్ళీ మళ్ళీ పతనమవుతుంటాడు. ఆ తప్పు దారి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది, చిత్తభ్రమణకారణమై ఎదురు తగులుతూనే ఉంటుంది. అందుకే రిత్రోవై. మనిషి దారి తప్పడం యిది మొదటిసారి కాదు. నేనొక గహనవనం ‘కనుగొన్నాను’ అన్నా (లబ్ధా), నేను దారి ‘మర్చిపోయాను’ (నష్టః) అన్నా ఒకటే. అటువంటపుడు, ఆ రెంటిలో లబ్ధా అన్న లాభాన్ని స్ఫురింజేసే రిత్రోవై పదాన్ని ఎన్నుకోడంలో కవిత్వప్రయోజనమేమిటి? నష్టస్వర్గప్రాప్తి స్ఫురణ కొరకు (Paradise Regained). పతనోత్థానాల పౌనఃపున్యార్థాన్ని స్ఫురింపజేయడానికే రిత్రోవై. ఒక్క పదంలో రెండర్థాలు, రెండు వ్యతిరేకార్థాలు స్ఫురింపజేస్తున్నాడు కవి. మనిషి దారి తప్పుతూంటాడు, దారిలోకి వస్తూ ఉంటాడు.

ఇక్కడ అవసరమైన పదం ‘కనుగొన్నాను’ (trovai, I found) కాదు; ‘పోగొట్టుకున్నాను’ (ho perso, I lost). అటువంటపుడు యీ వాక్యనిర్మాణం ఇలా చేయడంలో ప్రయోజనం ఏమిటి? పతనం (Fall) శాశ్వతం కాదని, ఇన్‍ఫెర్నో తరువాత పర్గటోరియో ఉంటుందని, యీ క్రూరారణ్యం ముందు ముందు దివ్యవనంగా మారబోతుందని సూచించడానికి.

io non potea rivedere ond’ io mi intrassi. (I could not see back where I had entered it. – Purg: 28.24-25).

ఆ దివ్యవనానికి చేరి వెనకకు తిరిగి చూస్తే యీ వనంలోకి ఎక్కడ ప్రవేశించానో కనిపించదు. నరకానికి దారి మూసుకుపోతుంది.

తప్పినదారే తప్పనిసరి దారి. కనుక త్రోవై, రిత్రోవై–యీ రెంటి అర్థం ఒకటే. ఇన్‌ఫెర్నోని (నరకాన్ని) గడవనిదే, పర్గటోరియో లేదు, ఆపై పారడీసో (స్వర్గమూ) లేదు.

ఈ ప్రారంభపద్యంలో మరొకముఖ్యమైన భావం చెబుతున్నాడు దాన్తె. పాపము పాపఫలము వేరుకావు అంటున్నాడు. పాపానికి ప్రతిఫలం మృత్యువు (The wages of sin is death) అంటుంది బైబిల్. దాన్తె అంటున్నాడు, మృత్యువు పాపఫలం కాదు, పాపమే మృత్యువు (death itself is little more so!: Inf.1:4). ఈ భావమే విశ్వనాథ సత్యనారాయణ చెలియలికట్టలో వ్యక్తమయింది:

ప్రళయకాలమహోగ్రవిభావరీమహా
ఝరీపాత ఘోరనదీఝరాభ
వారిధారావిధంబున వచ్చి వచ్చి
హద్దులనుద్రెంచి పూర్వమర్యాదలురలి
బద్దెలను దాటి ధర్మసంబంధమెడలి
నిర్దయస్వాంతమగు ఘోర
కర్దమాభీలజలపాతకంబు లేచి.

పద్యంతో, అసమాపక క్రియతో (లేచి) సమాప్తమవుతుంది యీ వచననవల. పాపఫలంగా లేచింది జలపాతం కాదు, జలపాతకమే. అది ఒక్కసారి లేచి పడిపోయేది కాదు. అలా ‘లేచి’ ఉంటుంది, అప్పుడప్పుడూ విరుచుకుపడుతుంది (యదా యదా హి). అందుకే అసమాపకక్రియతో నవల సమాప్తం. మానవపతనం ఆదిమానవుడితో ఆగిపోలేదు. అది అసమాపకం.


ఏ పదం ఎందుకు ఎన్నుకోవాలి, ఏ వాక్యం ఎలా నిర్మించాలి, యిలా తెలిసి కావ్యరచన చేస్తాడు దాన్తె. ఇది పదవాక్యప్రమాణపారీణత కాదనగలమా? ‘ఉభయకావ్యప్రౌఢిపాటించు శిల్పమునన్ పారగుడు’ దాన్తె. దాన్తెకు మనమేమీ బిరుదులివ్వనవసరం లేదు. ఆయనకు బోలెడంత ఆత్మవిశ్వాసం. తిక్కనకేమీ తీసిపోడు. హోమర్, వర్జిల్, ఓవిడ్, హోరెస్, ల్యూకన్, తరువాత ఆరవవాడిని అని చెప్పుకున్నాడు: They made me one of their own band;/So that the sixth was I, ‘mid so much wit (Inferno: canto 4: 100-103). ఏదో బాగుండదని ఆరవవాడిని అన్నాడు కాని, అంతకంటే ఓ పిసరు ఎక్కువే అనుకుని ఉండొచ్చు. గ్రీకు, లాటిన్, ఇటాలియన్ మూడు భాషలలో ముచ్చటగా మేమె కవీంద్రులము (హోమర్, వర్జిల్, దాన్తె) అన్నంత ధీమా ఉన్నది దాన్తెకు. ఆ ముగ్గురిలో కూడా తన స్థానం కొంచెం ఎక్కువ అని అనుకుని ఉండవచ్చు. గురువును మించిన శిష్యుడు అన్న విషయం ల దివీన కొమేదియ లోనే ధ్వనిప్రాయంగా ఉన్నది. వర్జిల్ స్వయంగా దాన్తెకు కిరీటం పెట్టి ప్రభుదండం చేతికిచ్చాడు. ఆధ్యాత్మిక గురువుగా మాత్రమే కాదు, కవికులగురువుగా కూడా వర్జిల్ పదవీత్యాగం చేశాడని, తన తరువాత ఆ పదవికి అర్హుడని సూచన చేశాడు దాన్తె యీ సందర్భంలో.