‘నిజమైన కవిత్వం, అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ (Genuine poetry communicates before it is understood.) అన్న వాక్యం వినక ముందే ఎలియట్ నన్ను అంటుకున్నాడు. ఆరున్నర దశాబ్దాలనుండి అంటుకునే ఉన్నాడు. అప్పుడప్పుడు వదిలిపోయాడనే అనుకున్నాను. ఇతర వ్యాపకాలలో పడి కొంతకాలం నేనే అతన్ని వదిలేశాను. తిరిగి ఎప్పుడో నాకు తెలియకుండా అంటుకొని ఉండేవాడు. ఎలియట్ పుస్తకాలు (ఫేబర్, పెంగ్విన్, రూప, హార్కోర్ట్ బ్రేస్) ఒక్కొకటి అయిదు కాపీలు కొని ఆరు కాపీలు పారేసుకొన్నాను. అయినా అతడు వదలలేదు. అప్పు తీరలేదేమో!
‘ఎలియట్ కవితా శిల్పం’ అన్న నా వ్యాసం భారతి మాసపత్రికలో (1966) అచ్చయి సుమారు ఆరు దశాబ్దాలవుతోంది. ఆ వ్యాసం చదివి వేలూరి శివరామశాస్త్రిగారు అభినందనలు అంటూ ఆరుపేజీల ఉత్తరం (21. 6. 1966) రాశారు. (ఆరుపేజీలు అభినందనలు కావు.) ఈ ఉత్తరం చాలాకాలం తరువాత, (మార్చి 1, 2010న) ‘వార్త’ దినపత్రికలో వచ్చింది. అంతటి దుర్లభమైన ప్రశంస తరువాత, ఎలియట్‌పై వెంటనే ఒకటో రెండో పుస్తకాలు రాసి ఉండవలసిందేమో? ఆ తరువాత సుమారు మరో దశాబ్దానికి ‘The Vision of Death in The Dry Salvages’ అన్న నా ఆంగ్లవ్యాసం, Triveni (Quarterly) ప్రచురించింది. ఇటీవల ఫేస్బుక్లో ఎలియట్‌పై వరుసగా ప్రచురించిన వ్యాసాలను ఒక పుస్తకంగా తేవలె అన్నారు కొందరు మిత్రులు. ఆ వ్యాసాలకు పుస్తకరూపం యిది.
ఈ పుస్తకంలో ఎలియట్ సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేయలేదు. ఇది ప్రధానంగా ‘ద వేస్ట్ ల్యాండ్’, మరికొన్ని కవితల పరామర్శ. అతని సాహిత్యవిమర్శ, పద్యనాటకాలు, ఫోర్ క్వార్టెట్స్ యిందులో స్పృశించలేదు. ఇందులోని వ్యాసాలు సాహిత్యవిమర్శ కాదు. ప్రతిపదార్థతాత్పర్యసహితవ్యాఖ్య కాదు. ఇవి కేవలం ఎలియట్‌తో కాలక్షేపము, కావ్యాలాపము. ఈ వ్యాసాలలో అక్కడక్కడా ఎలియట్ కవితలను, సందర్భం ఉన్నచోట, తెలుగుసాహిత్యంతో అనుసంధించే ప్రయత్నం చేశాను. కేవలం సాహిత్యానందమే యీ పుస్తక ప్రయోజనం. ఎలియట్ కవితపై అభిరుచిని కలిగించగలిగితే యీ ప్రయత్నం సార్థకం.
ఎలియట్ కవితకు, యీ వ్యాసాలలో నేను చెప్పిన అర్థం ఒకటే సాధ్యమని నేననుకోవడంలేదు. మరెన్నో కోణాలనుండి ఆయన కవితలను చూడవచ్చు. చూడగలరని కూడా నా ఆశ. అనేక అర్థాలు సాధ్యమయేలా రాయడం ఎలియట్ కావ్యశిల్పం.
ఈ వ్యాసాలలో, నేను ఎలియట్ కవితలకుగాని వచనానికి గాని అనువాదం చేసే ప్రయత్నం చేయలేదు. ఆంగ్లమూలానికి తెలుగు వివరణ యీ పుస్తకం. – సూరపరాజు రాధాకృష్ణమూర్తి.
ప్రవేశిక
“సిబిల్! నీకేం కావాలి?”
“నాకు చచ్చిపోవాలని ఉంది.”
ఇది ద వేస్ట్ ల్యాండ్‌కు ముందు ఉల్లేఖనం (epigraph). పాశ్చాత్య సంస్కృతికి చచ్చిపోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావుబతుకులమధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్ కవితలో ప్రధానవిషయం.
My house is a decayed house,
And the Jew squats on the window sill, the owner (Gerontion)
కూలడానికి సిద్ధంగా ఉన్న యూరపు, యూరపీయ సంస్కృతి కూడా, ఒక ‘decayed house’. ఎందుకు? ఏ ధర్మం కోసం పోరాడి తన యిల్లు నిలుపుకోవలెనో, ఆ ధర్మయుద్ధం, బయట కాని వెలుపల కాని, ఏనాడూ చేయలేదు. అలసమైన జీవితం గడిపాడు. అందుకే తన యిల్లు ధనపతుల (యూదుల) వశమయిపోయింది. యజమాని కిటికీలో కూచుని యితని వ్యవహారాన్నిటినీ గమనిస్తుంటాడు, నిఘా ఉంచి నియంత్రిస్తాడు. ప్రపంచమే శిథిలగృహం. అది ధనపతుల వశమైపోయింది. ధనబలం ముందు మనిషి దాసోహమంటూ అద్దె కట్టుకుంటూ బతుకవలసిందే. ప్రార్థన కూడా కష్టమవుతోంది. ప్రారంభించిన ప్రార్థన పూర్తిచేయలేక అర్ధాంతరంగా ఆగిపోతోంది. (For Thine is/ Life is/ For Thine is the: Hollow men)
మొదట ఎలియట్ కవే కాదన్నారు. ద వేస్ట్ ల్యాండ్ అతుకులబొంత అన్నారు. అలా అన్నవారే తరువాత, ‘యిది ఎలియట్ యుగం’ అన్నారు. శతాబ్దం మారినా, ఎలియట్‌ను మించిన మరో ఆంగ్లకవి పుట్టలేదు. ఎలియట్ కావ్యం ‘అర్థం’ చేసుకోవలసినది కాదు. మరి ‘ఏం’ చేసుకోవాలి? సంగీతం వింటాం, అర్థంచేసుకోం కదా! అలానే. అర్థంచేసుకొనే ప్రయత్నం ఆపితే ఎలియట్ కావ్యం అనుభవమవుతుంది. అందుకే, ద వేస్ట్ లాండ్ భావసంగీతం (music of ideas) అన్నాడు ఐ. ఏ. రిచర్డ్స్.
ఒక కవి సత్తాను నిర్ధారించడంలో కాలం నిజమైన కొలమానం. ఎలియట్ కవిగా పేరుతెచ్చుకొంటున్న కాలానికి పేరుపొందిన కవుల పేర్లు కూడా యీరోజు ప్రయత్నించి గుర్తుచేసుకోవలసిందే. యేట్స్ వంటివారికి కూడా యీరోజు ఎలియట్కున్న ప్రాచుర్యం లేదు. (తెలుగులో భావకవితోద్యమకాలంలో దిగ్దంతులనిపించుకున్న కవులు యీనాడు ఎంతమంది కవులుగా ప్రచారంలో ఉన్నారు? కృష్ణశాస్త్రి తప్ప, కొంతవరకు ఎంకిపాటల నండూరి. కొందరి పేర్లు మాత్రం గుర్తున్నాయి. చాలామంది పేర్లు కూడా గుర్తు లేవు.) ఆంగ్లసాహిత్యంలో ఈనాటికీ ఎలియట్‌ను కవిగా పూర్తిగా ఒప్పుకోలేని వారున్నారు. కాని యుగకవిగా ఎలియట్ స్థానం పదిలం. కాలం జల్లెడలో మిగిలినవాడే మహాకవి.
కవి ప్రతిభకు కాలమొక పరీక్ష అయితే, ప్రాచుర్యం మరొక కొలమానం. షేక్స్పియర్ వాక్యాలు కొన్ని జనుల వ్యవహారభాషలో భాగమైపోయాయి: ‘To be or not to be’ తెలియనివాడెవడు? అలాగే, ‘Life is a tale told by an idiot’, ‘As flies to wanton boys are we to the gods.’ అలాగే ఎలియట్ వాక్యాలు కొన్ని భాషలో భాగమైపోయాయి:
– ‘I have measured out my life with coffee spoons’;
– ‘I shall wear the bottoms of my trousers rolled’;
– ‘Not with a bang but a whimper’;
– ‘April is the cruellest month’.
క్లిష్టత: అతితార్కికకావ్యశిల్పం
కొందరి రచనలపై పాషాణపాకమనీ, విద్వదౌషధమనీ ముద్ర పడిపోతుంది. ఇంగ్లీషు కవులలో ఈ ముద్ర పడిన మొదటి కవి బ్రౌనింగ్. రెండవవాడు ఎలియట్. కాని ఇద్దరిపై పడిన ముద్రలలో ఒక తేడా ఉంది. తన కవితలోని అస్పష్టత బ్రౌనింగ్కు అవహేళనకారణమయింది. (‘బ్రౌనింగ్ ఆ కవిత రాసినపుడు దాని అర్థం తెలిసినవారు ఇద్దరే- బ్రౌనింగ్, దేవుడు. కాని ఇప్పుడు దాని అర్థం తెలిసినవాడు ఒకడే, బ్రౌనింగ్’, అని టెనిసన్ అన్నట్టు ప్రచారంలో ఉంది.) కాని, ఎలియట్ కవితలోని అస్పష్టత అతనిని ఆకాశానికి ఎగరేసింది, ఎవరికీ అందనంత ఎత్తుకు. ‘అమ్మో! ఎలియట్! కష్టం’, అంటూ దూరమైనారు పాఠకులు. ఒక కావ్యం అర్థంకావడం కష్టం అనడానికి అనేక కారణాలు. విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షము కష్టం అంటాం. ఆ కష్టానికి ప్రధానకారణం ఆయన నిఘంటుభాష, సమాసగ్రథనం. ఎలియట్ కవితలో కష్టం యిటువంటిది కాదు. అతని కవితలో ప్రధానక్లిష్టత అతని అపూర్వరచనాశిల్పం. ఆ శిల్పం తర్కాన్ని అతిక్రమిస్తుంది. తార్కికంగా ఆలోచించడం మనిషికి అలవాటు. ఈ సహజ ఆలోచనావిధానాన్ని భంగం చేశాడు ఎలియట్. అంటే ఆలోచనలకు మధ్య అతుకులు తొలగించాడు. అప్పుడేమవుతుంది? రైలుపట్టాలను కలిపే లింకులు తొలగిస్తే ట్రెయిన్‌కు ఏమవుతుంది? బుద్ధిగతి కూడా అదే అవుతుంది. ఎలియట్ కావ్యం చదివేవాడికి అదే అయింది. కావ్యపాఠం పట్టాలు తప్పింది. ఈ అతితార్కిక ఆలోచనావిధానానికి అలవాటుపడని పాఠకుడు, ‘కవికి మతి చెడింది’ అంటాడు, లేక తనకే మతి లేదు అనుకొంటాడు. చాలామంది పాఠకులు అదే అనుకొన్నారు.
గాథలు – ఉద్ధృతాలు
ఎలియట్ కవిత కష్టం అనడానికి మరొక కారణం, ఆయన కవితలలోని గాథలు (allusions), ఉద్ధృతాలు (quotations). అనేకసంస్కృతుల పురాణగాథల ప్రసక్తి అతని కవితలో అడుగడుగున వస్తుంటుంది. వాటి పరిచయం ఉండవలె. ఇంతకంటే కష్టమైనది, ప్రధానమైనది, ఎలియట్ అనేకభాషాసాహిత్యాలనుండి వాక్యాలు యథాతథంగా తన కవితలో వాడుతాడు. ఆ సందర్భం తెలిసి ఉండవలె. ప్రయోగించే ప్రతి వాక్యము దానిమూలంలో పట్టుకోవలె. చాలావరకు యీ వాక్యాలు యితరులవి అని తెలుస్తుంది. కనుక కొంత నయం. ఇంతకంటే పెద్ద చిక్కు, ఆయన కవితలోని యించుమించు ప్రతి పదానికి, ఆ పదాన్ని ఏయే రచయిత ఏ అర్థంలో వాడాడు అని తెలియడం. ఇది అన్నిటికంటే పెద్ద చిక్కు. ఈ పద చరిత్రకు అంతుండదు. ఉదాహరణకు, ‘ప్రూఫ్రోక్’ మొదటి పది పాదాలలో దాదాపు యిరవై పదాలకు చరిత్ర ఉంది.
ఇటీవల ఎలియట్ కవితల సంపూర్ణసంకలనం రెండు వాల్యూములుగా వెలువడింది. (The Poems of T. S. Eliot: Volume I: Collected & Uncollected Poems edited by Christopher Ricks and Jim Cue. Faber, 1311 pp.; The Poems of T. S. Eliot: Volume II: Practical Cats & Further Verses edited by Christopher Ricks and Jim Cue, Faber, 667 pp.) ఈ పుస్తకసంపాదకులు ఎలియట్ వాడిన యించుమించు ప్రతివాక్యము, ప్రతిపదము యింతకు ముందు ఏ ఏ రచయితలు ప్రయోగించారో వెదకి పట్టుకున్నారు. అటువంటి పరిశోధన, ఎలియట్ కవితను పూర్తిగా ఆస్వాదించడానికి ఎంత అవసరం ఎంత అనవసరం అని నిర్ధారించడం సులభం కాదు. కొంత తప్పక అవసరం. కాని, అతడు చదివినదంతా మనం చదవకపోతే ఆయన కవిత్వం అర్థం కాదు అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇది నిజమా? ఎలియట్ చాలా చదివాడు. మిల్టన్ తరువాత అంత చదివిన రచయిత లేడంటారు. (మిల్టన్ కంటే ఎలియట్ తప్పకుండా ఎక్కువే చదివి ఉంటాడు, మిల్టన్ తరువాత ఎలియట్ వరకు వచ్చిన సాహిత్యం మిల్టన్ చదివి ఉండడు కదా!) ఎలియట్ రచన యింత క్లిష్టంగా ఉండడానికి కారణమేమిటి? ఏ కవి తన రచన ఎవడికీ అర్థం కాకూడదని కష్టపడి కష్టంగా రాయడు కదా? ఇది తెలియాలంటే, ఎలియట్ సాహిత్యదృక్పథమేమిటో తెలియాలి.
ఎలియట్ వ్యాసం, సంప్రదాయము-స్వయంప్రతిభ (Tradition and the Individual Talent) ఆధునికసాహిత్యవిమర్శలో ఒక పురాణస్థాయిని పొందింది. ఆధునిక ఆంగ్లసాహిత్యానికి అది మేనిఫెస్టో అని చెప్పలేకపోవచ్చు. ఎందుకంటె దానిని పట్టుకొని ఏ కవిసేన ఉద్యమించలేదు. ఎలియట్ తన కవితలోనైనా ఆ సాహిత్యతత్త్వదర్శనాన్ని ఎంతవరకు అనువర్తించగలిగాడు అన్న ప్రశ్న కూడా ఉన్నది. కాని ఆ వ్యాసంలో ఆయన వివరించిన సాహిత్యదృష్టి శాశ్వతమైన విలువ కలిగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మనం చర్చిస్తున్న విషయం ఆయన కవిత్వంలోని ఉద్ధృతాలవలన కలిగే కష్టం. కనుక దానికి సంబంధించిన వాక్యాలను చూద్దాం.
‘No poet, no artist of any art, has his complete meaning alone. His significance, his appreciation is the appreciation of his relation to the dead poets and artists. You cannot value him alone…
The existing monuments form an ideal order among themselves, which is modified by the introduction of the new (the really new) work of art among them. The existing order is complete before the new work arrives; for order to persist after the supervention of novelty, the whole existing order must be, if ever so slightly, altered; and so the relations, proportions, values of each work of art toward the whole are readjusted; and this is conformity between the old and the new.’ (Tradition and the Individual Talent.)
ఏ కావ్యానికైనా అర్థం, కేవలం ఆ ఒక్క కావ్యమే యివ్వలేదు. ఆ కావ్యానికి గతకావ్యాలతో గల అనుబంధం ఆ కావ్యార్థంలో భాగమవుతుంది. అంటే ఏదీ స్వతంత్రకావ్యం కాదు. ఏ కవీ, నా కావ్యం కేవలం నా స్వయంప్రతిభతో సృష్టించాను అనలేడు. తనకు ముందు వచ్చిన సమస్తసాహిత్యము తన కావ్యంతో అనుబంధమై ఉంటుంది. అంటే, ఒక కవి ఎప్పుడూ గతసాహిత్యంనుండి గ్రహించిగాని, స్వతంత్రంగా ఏమీ రాయలేడా? దాని అర్థం అది కాదు. ఈ కవిఋణం అన్నది ఏకపక్షం కాదు. ఇది పరస్పరం. అంటే, ఆధునిక కావ్యం సంప్రదాయంనుండి ఎంత సంపన్నమవుతుందో, సంప్రదాయమూ ఆధునిక కావ్యంచేత అంత సంపన్నమవుతుంది. అలా సంప్రదాయాన్ని సంపన్నం చేయగలిగినదే నిజమైన మౌలిక రచన. అంటే, గొప్ప కవి, సంప్రదాయంనుండి ఎంత గ్రహించగలడో అంతా గ్రహిస్తాడు. కాని, ఊరకే తీసుకోడు. తీసుకున్నంత తిరిగి యిస్తాడు. కనుక, ఎలియట్ కవితలు అంతగా సమస్తసాహిత్యంతో అల్లుకుపోయి ఉంటాయి. తీగను కదిపితే, డొంకంతా కదులుతుంది. ఇది ఎలియట్ కవితలలోని సంక్లిష్టతాస్వరూపం. అది ఆయన సాహిత్యదర్శనంలోని గుణం.
ఎలియట్ గురించి, అతని సాహిత్యశాస్త్రసిద్ధాంతాల గురించి రెండుమాటలు:
సాహిత్యాన్ని ఆస్వాదించడానికి విశ్లేషించడానికి అలంకారికులు (సాహిత్యశాస్త్రజ్ఞులు) కొన్ని పనిముట్లు తయారుచేస్తారు. భారతీయ అలంకారికులు ఈ పని చేయవలసిన దానికంటే చాలా ఎక్కువే చేశారు. గుణము రీతి ధ్వని-అని, వాటిలో మళ్ళీ విభాగాలు, యిలా సాహిత్యాన్ని మొత్తం చించి చీటీలంటించేశారు, వెలతో సహా. ఇంత కాకపోయినా, పాశ్చాత్యసాహిత్యాలలో కూడా ఈ పనిముట్లు సిద్ధం చేసుకునే ఉన్నారు. అయితే, ఇది ఒక్కసారి తయారుచేసుకొని ఉంచుకొనేది కాదు. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త రచనలననుసరించి కొత్త పనిముట్లు తయారుచేసుకోవడం అవసరమవుతుంది. ఈ పని విమర్శకులు చేస్తారు, కవులుకూడా చేస్తుంటారు. కవులు చేసే విమర్శ రెండువిధాలు. ఒకటి, తమ కావ్యరచనలలో తాము ఎదురుకొన్న శిల్పసమస్యలు, తాము కనుగొన్న సాహిత్యసత్యాలు. దీనిని ఎలియట్ ‘workshop criticism’ అంటాడు. ఇక వీరి రెండవ విధమైన కావ్యవిమర్శ ఎటువంటిది? ఒక కొత్త కవితాప్రక్రియను అవలంబించే కవి, తన కవితకు పాఠకులను తానే సృష్టించుకోవలె. అంటే తన కవితకు తానే మార్కెటింగ్ చేసుకోవలె. ‘శ్రీశ్రీ మార్కు పద్యములనే వాడుడు’ అన్నట్టు. ఈ రెండవ రకం విమర్శలో ఎలియట్ సృష్టించిన రెండు పనిముట్లు ‘objective correlative’, ‘dissociation of sensibility’. ఈ రెండూ, సాహిత్యశాస్త్రంలో శాశ్వతస్థానం సంపాదించుకున్నాయి. ఈ రెండు ఎలియట్ ఎందుకు సృష్టించవలసివచ్చిందో మనం అర్థం చేసుకోవలె.
ఆత్మాశ్రయము, వస్త్వాశ్రయము
కవులు సాధారణంగా తన కాలంలో ప్రచారంలో ఉన్న, ఆనాడు ప్రజలు ఆదరిస్తున్న మార్గంలోనే రచనలు చేస్తారు. కొంతకాలానికి ఆ మార్గం అరిగిపోయిన రికార్డ్‌లా అయిపోతుంది. ‘My heart aches’ అంటాడు కీట్స్. ‘I fall upon the thorns of life! I bleed!’ అంటాడు షెలీ. కవులతోపాటు పాఠకులూ వారి కష్టం అనుభవిస్తారు. కృష్ణశాస్త్రి ఏడిస్తే ఏడిచిన పాఠకులు, కొంతకాలం అయిన తరువాత, మళ్ళీ మరొకడు ఎవడైనా, ‘నన్ను మనసారగా ఏడ్వనీరు మీరు. నన్ను విడువుడు నన్ను విడువుడు’ అంటే, ‘నిన్నెవరూ పట్టుకోలేదు, వెళ్ళి నీ ఏడుపు నీవు ఏడువు’ అని నవ్వి, వదిలేస్తారు. అప్పుడు ‘ఏడుపు’కు ఒక కొత్త గొంతుక కావాలి. (కవిత్వమంటే ఏడుపే కదా! ఏకో రసః) ఆ కొత్త గొంతుకే ఎలియట్. కవి అనుభూతులను తనవిగా వ్యక్తం చేయడాన్నే ఆత్మాశ్రయకవిత అంటారు, శాస్త్రపరిభాషలో. కృష్ణశాస్త్రి శోకంలాగా తనదైనా, శ్రీశ్రీ శోకంలాగా లోకానిదైనా అది ఆత్మాశ్రయతే. ‘కనబడలేదా! మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు!’ అనడం కూడా ఆత్మాశ్రయవిధానం. దర్శిస్తే ఆత్మాశ్రయం, ప్రదర్శిస్తే వస్త్వాశ్రయం. కవి అనుభూతులను అనుభూతులుగా వ్యక్తం చేయడం ఉత్తమకావ్యలక్షణం కాదు, అంటాడు ఎలియట్. మరి ఎలా చేయాలి?
The only way of expressing emotion in the form of art is by finding an ‘objective correlative’; in other words, a set of objects, a situation, a chain of events, which shall be the formula of that particular emotion. (Hamlet – an essay by Eliot.)
కవి తన అనుభూతిని వ్యక్తం చేయగలిగిన ఒక పాత్రనో సంఘటననో సన్నివేశాన్నో కల్పించవలె. వాటిద్వారా కవి ఉద్దేశించిన అనుభూతి సహజంగా కలుగుతుంది. ఈ సాహిత్యసిద్ధాంతాన్ని ‘generative poetics’ అనవచ్చు, చామ్స్కీ (Chomsky) చెప్పిన ‘generative grammar’ లాగా. వ్యాకరణంలో పాణిని సూత్రపద్ధతినే ఎలియట్ కావ్యానికి చెబుతున్నాడు, (the formula for that particular emotion). ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తిః’ అని భరతుడు చెప్పింది కూడా యీ ఫార్ములానే. అందుకే ఈ విధమైన రచనను నాటకీయమని అంటారు. ఈ ఫార్ములాను అనుసరించనందుకే షేక్స్పియరు నాటకం హామ్లెట్ కళగా విఫలమయిందని (artistic failure) ఎలియట్ తీర్పునిచ్చాడు. కనుక ఎలియట్ తన కవితలో వస్త్వాశ్రయతను అనుసరించాడు. ఒకప్పుడు భావకవిత్వాన్ని వెర్రిగా ఆదరించిన పాఠకులను దారి మళ్ళించడానికి ఈ objective correlative అవసరమైంది కూడా.
ఇందులో భాగమే, ఎలియట్ చెప్పిన extinction of personality కూడా.
Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of personality, but an escape from personality… The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality. (Tradition and the Individual Talent.)
కవి చేయవలసింది ఆత్మాభివ్యక్తీకరణం కాదు, ఆత్మాపాకరణం. సమస్తసాహిత్యాన్ని తనలో కలుపుకొని వ్యక్తమవుతాడు మౌలికప్రతిభ కలిగిన కవి. ఎలా కలుపుకొంటాడంటే, ‘అసలు యితడు రాసింది ఒక్క ముక్క లేదు యిందులో, యితడేమి కవి’, అన్నంతగా కనిపించకుండా కలిసిపోతాడు.
కవి ఒక విత్తనం లాంటివాడు. తనను తాను సాహిత్యక్షేత్రంలో నిక్షేపించుకుంటాడు. విత్తనంగా ఆత్మార్పణం చేసుకుని, సమస్తసాహిత్యసత్త్వము సంగ్రహించి, మొలకై ఆవిర్భవిస్తాడు, మానుగా ఎదుగుతాడు. నీవు యింకా విత్తనం కోసం వెదికితే ఎక్కడ దొరుకుతుంది? ఈ ఆత్మార్పణమే, ఎలియట్ చెప్పిన ‘continual extinction of personality’. బహుశా, ఎలియట్ తన వేస్ట్ లాండ్ లోని వాక్యానికి కూడా యిదే అర్థం కావచ్చు: That corpse you planted last year in your garden /Has it begun to sprout?
మరణం పునరుజ్జీవనానికి పునాది. ఈ భావం ఎలియట్ కవితలో తరచు పలకరిస్తుంది మనల్ని. చచ్చి బతకడం నిజమైన చావు, బతికి చనిపోవడం ద్విజన్మ, పునరుజ్జీవనం, పునరుత్థానం. పదం పద్యంలో ఆత్మార్పణం చేసుకొని, పద్యంలో విడదీయలేని భాగమై, కొత్తజన్మనెత్తుతుంది. ‘A poem should be wordless /As the flight of birds’ (Archibald MacLeish) అనడంలో భావం యిదే. ‘శ్రేణుల్ గట్టి నభోంతరాళమున బారెన్ పక్షులు’ (పెద్దన) అన్నపుడు ఏ ఒక్క పక్షిని, దాని విశిష్టతను చూడం. శ్రేణులు కట్టి ఎగరడంలోని లయను చూస్తాం. పద్యంలో పదం ఆకర్షించకూడదు. పద్యమైన పదశ్రేణి మాత్రమే కనిపించాలి. ఆధ్యాత్మిక సాధనామార్గం కూడా యిదే, వ్యష్టి తనను క్రమక్రమంగా సమష్టిలో లయం చేసుకొని ఒక సమష్టి చైతన్యంతో ఆవిర్భవించడం. ఆధ్యాత్మిక సాధనలో అంతర్భాగమే సాహిత్యకృషి. అలా అని, సాహిత్యాన్ని ఆధ్యాత్మికసాధనంగా భావించడం ఎలియట్ అంగీకరించడు.
ఆలోచన – అనుభూతి
ఇక, ‘dissociation of sensibility’. ఇది ఎలియట్ Metaphysical poets (డన్, మార్వెల్, మరి కొందరు) మీద రాసిన వ్యాసంలో వాడాడు. వీరి కవితలలో ఆలోచన, అనుభూతి, ఈ రెంటి రసాయనంలో రసనిష్పత్తి కలుగుతుంది, అని ఎలియట్ అంటాడు. 18వ శతాబ్దపు మిల్టన్, డ్రైడెన్ వంటి కవులలో ఆలోచనలు తప్ప అనుభూతి ఉండదంటాడు. 19వ శతాబ్దంలోని రొమాంటిక్ (వర్డ్స్‌వర్త్, కోలరిజ్, షెలీ, కీట్స్) కవితలలో ఉద్వేగమే కాని, ఆలోచన తక్కువ. మరి, ఎలియట్ కవితారంగంలో ప్రవేశిస్తున్న సమయానికి యుగకర్తలనిపించుకొంటున్న టెనిసన్, బ్రౌనింగులు తమ కవితలలో భావాలను నెమరు వేసుకోడమే కాని, వాటికి కవితారూపం యివ్వలేకపోయారు. ఆలోచన అనుభూతి, ఈ రెంటి సామరస్యం, మెటఫిజికల్ కవులను షేక్స్పియర్, దాన్తెల స్థాయిలో నిలిపిందని ఎలియట్ అంటాడు. వారు, ముఖ్యంగా డన్ (Donne), ఒక భావాన్ని ఒక రోజాపూవును వలె ఆఘ్రాణిస్తారు, అంటాడు ఎలియట్. అంటే ఎలియట్ దృష్టిలో కవి తన భావాన్ని కవిత్వపు కరెన్సీలోకి మార్చుకోవాలి. అలా మార్చుకోవలె అంటే, ఆ భావాన్ని కలిగించగల ఒక వస్తువును ఆశ్రయించాలి.
ఆధునికత
ఈ మెటఫిజికల్ కవిత్వానికి ఆంగ్లసాహిత్యంలో వారసులెవరూ లేరు. ఈ విధానాన్ని ఫ్రెంచి సింబలిస్టులు, అంతకంటే ఎక్కువగా ఇమెజిస్ట్లు, అనుసరిస్తూ ఉండినారు. ఎలియట్‌పై వారి ప్రభావం బాగా ఉండింది. ముఖ్యంగా ఎలియట్ కవిత్వం రాయడం మొదలుపెడుతున్న సమయంలో, ఫ్రెంచి కవి లాఫోర్గ్ అతనిని ఒక దయ్యంలా ఆవహించి ఉండినాడు. లాఫోర్గ్ వ్యంగ్యశైలి, వైరుద్ధ్యాలను కలబోయడం వంటివి, ఎలియట్‌ను ఆకర్షించిన కావ్యగుణాలు. ఉదాత్త, విదూషకలక్షణాలు, గంభీరమైన విషయము చవకబారు ముచ్చట-యిలా అతకనివాటిని ఎదురుబెదురుగా ఒక చోట చేర్చి చెప్పడం లాఫోర్గ్ కవితాలక్షణం. ఈ ప్రభావం ఎలియట్ ప్రారంభ కవితలలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఎలియట్‌ను ఆధునికతకు ఆద్యుణ్ణి చేసింది. ఆధునికత తాజావార్తలలో, వర్తమాన సామాజికసమస్యలలో ఉండదు. మరి దేనిలో ఉంటుంది? ఆధునికత విషయంలో ఉండదు. నవ్యవిధానంలో ఉంటుంది. ఆధునిక భాష, వాక్యనిర్మాణము, కొత్త ఛందస్సు, కొత్త కవిసమయాలు, యివి ఒక రచనను ఆధునికం చేస్తాయి. ఈ అన్నిటిని సాధించాడు ఎలియట్. జీవితదర్శనం సనాతనం, అభివ్యక్తి అత్యంత అధునాతనం.
సాహిత్యంలో ప్రగతి ఉండదు, విజ్ఞానశాస్త్రంలో వలె. వాల్మీకి కంటే కాళిదాసు, కాళిదాసు కంటే కృష్ణశాస్త్రి, కృష్ణశాస్త్రి కంటే శ్రీ శ్రీ… యిలా అభివృద్ధి సాధించారని చెప్పలేం.
కవి బాధ్యత: కవికి సమాజం పట్ల ప్రత్యక్ష బాధ్యత ఉండదు, అంటాడు ఎలియట్. అతని బాధ్యత భాషకే. తన సాటివారి భాషను స్వీకరించి, దానిని శుద్ధిచేసి, కావ్యయోగ్యంగా తీర్చి దిద్దడమే ప్రజల పట్ల కవి పరోక్షబాధ్యత.
పేరు: ద వేస్ట్ ల్యాండ్, మరో నాలుగు కవితలు (2019).
ప్రచురణ: ఆథర్స్ ప్రెస్, న్యూఢిల్లీ.
వెల: 495 రూ. (25$)
ప్రతులకు: authorspressgroup@gmail.com, : www.authorspressbooks.com