తరతరాల పంజరపు వాసం
తలపులకు పాతరేసినా
నీడగానే మిగలమన్న ఆదేశాలు
నర నరాన సెగ పెట్టినా
అలుపెరుగకుండా నడుస్తూనే ఉన్నా!
నిలువెల్లా కాలిపోతూ కూడా
వెలుగునూ వెచ్చదనాన్నీ
నింపిన ఒక కొత్తలోకాన్ని
నీకు ప్రతిరోజూ కానుకిస్తున్నా!
నాలో నేను మండిపోతూ కూడా
నీ తాపాన్ని పోగొట్టే
చల్లదనంగా మారాలని
అనుక్షణం చెమరుస్తూనే ఉన్నా!
నేనే కడలిలో దాగున్నానో
ఏ కడలే నాలో దాగున్నదో
కల్లోలం నీ దరికి రాకుండా
రెప్పైనా వేయక కాపు కాస్తూనే ఉన్నా!
ఇన్నాళ్ళ మౌనాన్ని వీడి
రెక్కలు విప్పుకోవాలనీ
తలపుల్ని తెరవాలనీ
ఆకాశపుటంచుల్ని తాకాలనీ ఉంది,
ఒకే ఒక్క అవకాశం నాకివ్వవూ!
ఒకే ఒక్కసారి ఈ నిప్పుని ఆర్పేయవూ!
అహంకరించనులే
నీ ఆధారం నేనేనని
అడగనులే రాసిమ్మని
ఆకాశంలో సగాన్ని.