పునశ్చరణం

రాయటం పూర్తి చేసిన
కవితను మళ్ళీ మళ్ళీ
చదువుతూ ఉంటాను

అప్పుడే పుట్టిన పసికందును
ఒక్క క్షణం కూడా వదలలేక
తడిమి తడిమి ముద్దాడే
తొలిచూలాలిలా

పరాయి దేశం లో
హఠాత్తుగా ఎదురైన
చిన్ననాటి నేస్తాన్ని
తరచి తరచి
పరామర్శించే స్నేహితునిలా

పరిష్వంగాన్ని సడలించిన
మరుక్షణం లోనే వేయేళ్ళ
విరహాన్ని అనుభవిస్తూ
పదే పదే కౌగలించే ప్రేమికునిలా


రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...