మనసూ కొత్తగా గొంతు సవరించుకుంటోంది
వసంత మొస్తున్నదేమో!
ఎపుడూ వుండే
చేదు మాటలూ పులుపు గుర్తులూ
వుంటూనే వున్నై,
ఇప్పుడైనా
కొంచెం తియ్యదనాన్నీ కలిపి చూద్దాం!
ఉరుకుల పరుగుల జీవితపుబండిని
ఓ పక్కగా ఆపి
కాసేపైనా సరే
నులివెచ్చగా పరుచుకుంటున్న
యీ ప్రశాంతమైన వుదయాన్ని
ఆస్వాదిస్తూ వుందాం!
ముఖం ముఖం తేరిపారా
చూసుకుని
మనసులు విప్పి
కుప్ప పోసినపుడే కదా పండగ!
రోజులూ, ఘడియలూ, విఘడియలూ అన్నీ
పాతవే కావచ్చు,
రేపటికి వాడినా సరే
ఆ ఆశల తోరణం కట్టి చూద్దాం!
ఎపుడూ వింటున్న కోయిల పాట పాతదే కావచ్చు,
గుండెను శ్రుతి చేసి
కొత్త రాగమొకటి వినే ప్రయత్నం చేద్దాం!
యీ కొత్త భావన నిలాగే వుండనిద్దాం!
ఏదేమైనా నువ్వు మాత్రం
అలా నవ్వుతూనే వుండు
కొంచెం కొంచెంగా యీ జీవన పాత్ర
తియ్యనవుతూ నిండనిస్తూనే వుండు.
ఆ పరిమళిస్తున్న వేపపూత మీదుగా
కొత్త గాలీ
పలకరిస్తోంది వింటున్నావా?