రెండు కన్నీటిచుక్కలు

ఒక్కోసారి నువ్వు గుర్తొస్తే
ఊపిరాడదు.
అప్పుడు నీ గర్భాన్ని
నా పసికాళ్ళతో తట్టినప్పుడు
నువ్వెన్ని పూలతోటలై నవ్వేవో
తెలీదు కానీ
ఇప్పుడు నీ జ్ఞాపకాలు
నా గుండెల్ని తడుతుంటే
కన్నీటి మేఘాన్నవుతున్నాను.

చూస్తూండగానే
ఎంత దూరం వెళ్ళిపోయావో
రుతువులు దాటి
కాలాలు దాటి
దేహాలు దాటి
సాయంకాలపు పొడవాటి నీడల్లోకి…

ఒక్కోసారి
చాలా ఆకలవుతుంటుంది
ఒక్కోసారి
గదిలో నక్కిన ఒంటరితనం పులి
నామీద నిర్దాక్షిణ్యంగా దాడిచేస్తుంది
ఒక్కోసారి
చీకట్లో పీడకలలు వెంటాడతాయి.

ఎవరైనా నన్నీ చీకట్లోంచి లాగి
అవతలి ఒడ్డుకు చేరిస్తే బాగుండనిపిస్తుంది
ఒక్క తడిస్పర్శ కోసం
నుదురు ఆకాశమంత కళ్ళతో ఎదురుచూస్తుంది.

అప్పుడెప్పుడో రాసుకున్నట్టు గుర్తు
అమ్మంటే రెండక్షరాలు కాదు
రెండు సముద్రాలని.
ఇప్పుడు?
అమ్మంటే రెండు కన్నీటిచుక్కలనిపిస్తుంది.


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...