రెండు తీరాలు

చీకటి దారాలను పేనుతూ
చిక్కని రాత్రి అక్కడ కురుస్తుంటే
ఇక్కడ వెలుగు కిరణాలు
కిటికీ తలుపులను
తీసేవరకూ తడుతున్నాయి

సూర్యచంద్రులు
నింగి నుండి
మౌనంగా వేళ్ళాడుతున్నారు
కానీ కాలమే
ఉదయరాగాన్ని మీటుతూ
చిటికెన వేలిపై ఆడిస్తోంది

అప్పుడప్పుడు
నిదుర రాని రెప్పలు
రెక్కలు విప్పి
పేజీలను తిప్పడంలో
తలమునకలవుతున్నాయి

చుట్టూ ఎన్నున్నా
ఏదో కోల్పోయినతనం
హృదయాన్ని బద్దలు కొడుతోంది

ఊహించని ప్రపంచం
తన మానాన తను నడచిపోతోంది
సమయం నిర్ధాక్షిణ్యంగా ఆవిరైపోతోంది
ఏ మలుపులలో జొరబడినా
గుండెలో ఇంకని తడి

తోడుగా కొన్ని వాక్యాలు మృదువుగా
ఆత్మబంధువులై హత్తుకుంటూ
ఆగకుండా వర్షిస్తూ ఉన్నాయి

రెండు సముద్రాల నడుమ
కొలవలేనంత అంతరం
ఏ వంతెనా రెండిటినీ కట్టిపడేయలేదు