విశ్వమహిళా నవల: 12. ఎమిలీ బ్రాంటీ

It would degrade me to marry Heathcliffe now: So he shall never know how I love him; and that, not because he’s handsome. Nelly, but because he’s more myself than I am. Whatever our souls are made of, his and mine are the same and [Edgar’s] is as different as a moonbeam from lightning, or frost from fire.

ఈ మాటల్లో ధ్వనించే ప్రేమ ఒక భయానక, బీభత్స ప్రేమకథకు కీలకమైంది. ఇంగ్లీషు భాషలో వెలువడిన అత్యుత్తమ నవలల్లో ఒకటిగా పరిగణింపబడే ఈ నవల వదరింగ్ హైట్స్ (Wuthering Heights). రచయిత్రి ఎమిలీ బ్రాంటీ (Emily Brontë). ఒక మహిళ ఇలాంటి నవల ఎలా రాయగలిగిందని ఇప్పటికీ పాఠకులు, విమర్శకులు అబ్బురపడుతూనే ఉంటారు.

ఎమిలీ బ్రాంటీ 1818 జులై 30న మరియా బ్రాన్‌వెల్, పాట్రిక్ బ్రాంటీ దంపతులకు ఆరో ఆడపిల్లగా జన్మించింది. బాల్యంలోనే పాఠశాలలోని అనారోగ్య వాతావరణం వల్ల అస్వస్థతకు గురై ముగ్గురు ఆడపిల్లలు మరణించారు. తక్కిన ముగ్గురు ఆడపిల్లలను, ఏకైక మగపిల్లవాడు బ్రాన్‌వెల్‌ని స్కూలుకు వెళ్ళనక్కర్లేదని తండ్రి ఇంట్లోనే ఉంచేశాడు. పాఠశాల విద్య కొరవడినా ఇంట్లో మంచి పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ఎమిలీ, షార్లట్ ఎక్కువగా వాల్టర్ స్కాట్, షెల్లీ, బైరన్‌లని ఇష్టపడేవారు. ఎమిలీ తొలినుంచీ సిగ్గరి. ఎక్కువ మాట్లాడేదికాదు. జంతు ప్రేమికురాలు కూడా. వీధికుక్కలను ప్రేమగా పెంచేది. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళూ మంచి రచయిత్రులే. (షార్లట్, ఎమిలీ, ఆన్). చిన్నప్పుడే ఒక కొత్త ఊహాలోకాన్ని, విచిత్రమైన పాత్రలను సృష్టించుకుని, వాటిని అభినయించడం ఎమిలీ, ఆన్‌లకు అలవాటు. వాళ్ళు ఆ రోజుల్లో సమష్టిగా రాసిన కథలు లభించడంలేదు కానీ, కొన్ని కవితలు మాత్రం ఉన్నాయి. అక్కల్లాగే బ్రాన్‌వెల్ కూడ రచన చిన్నప్పుడే ప్రారంభించాడు. అతను రాసిన ది లైఫ్ ఆఫ్ అలెక్జాండర్ పెర్సీ (The Life of Alexander Percy) నవల ఒకరకంగా వదరింగ్ హైట్స్‌కి స్ఫూర్తిని ఇచ్చిందని విమర్శకుల అభిప్రాయం. ఈ నవలలోకూడా విధ్వంసకరమైన ప్రణయమే వస్తువు.

వదరింగ్ హైట్స్ కథ

సంక్లిష్టమైన ఈ నవలా కథను కొంత విపులంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. లాక్‌వుడ్ (Lockwood) అనే యువకుడు నార్త్ ఇంగ్లండ్ లోని యార్క్‌షైర్ అనే ఊరిలో థ్రష్‌క్రాస్ గ్రంజ్ (Thrushcross Grange) అనే ఇంటిలో కొత్తగా కిరాయికి వస్తాడు. తన ఇంటికి యజమాని అయిన హీత్‌క్లిఫ్‌ (Heathcliff)ని కలుసుకోడానికి అతను మారుమూలగా ఉన్న వదరింగ్ హైట్స్ అని పిలవబడే మూర్‌లాండ్స్ ఫార్మ్‌హౌస్‌కు వస్తాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులను చూసి వారి విచిత్రప్రవర్తనకు తెల్లబోతాడు. ఇంటి యజమాని నలభై ఏళ్ళ హీత్‌క్లిఫ్‌, అతన్ని నిర్లక్ష్యంగా చూసే పదిహేడేళ్ళ కేథీ లింటన్ (Cathy Linton), నిత్యం భయపడుతూ ఉండే పాతికేళ్ళ అర్భకుడు హేర్టన్ (Hareton)- వీళ్ళను చూసి విచిత్రమైన అనుభూతి పొందుతాడు. ఆ రాత్రి వర్షం కారణంగా అతను అక్కడే పడుకోవాల్సివస్తుంది. ఒకప్పుడు అదే గదిలో ఉన్న కేథరిన్ అర్న్‌షా (catherin Earnshaw) అనే అమ్మాయి రాసిన డైరీ చదివి, అందులో హీత్‌క్లిఫ్‌పై ఆమె ప్రకటించిన ప్రేమకు విస్తుపోతాడు. ఆ రాత్రి ఒక పీడకలలో కిటికీ తలుపులు తెరుచుకుని కేథరిన్ ‘దెయ్యం’ లోపలికి రావడంతో ఉలిక్కిపడి లేచి తలుపులు తోసుకుని పరిగెడతాడు. ఎదురొచ్చిన హీత్‌క్లిఫ్‌తో ‘కేథరిన్ దయ్యం వచ్చింది!’ అంటాడు. హీత్‌క్లిఫ్‌ దానికి విపరీతంగా చలించిపోయి ‘చివరికి వచ్చావా… ఒక్కసారి నాకు కనిపించు కేథరిన్!’ అని దుఃఖించడం అతన్ని మరింత కళవళపెడుతుంది. చలిలో తిరిగి ఇంటికి చేరిన లాక్‌వుడ్‌కు జబ్బుచేస్తుంది. అతనికి సపర్యలు చేస్తున్న హౌస్ కీపర్ ఎలెన్ డీన్‌ని అడుగుతాడు ‘ఆ ఇంటి గురించి నీకేమైనా తెలుసా?’ అని. అప్పుడు వదరింగ్ హైట్స్ ఇంట్లో తను చూసిన జీవితాన్ని ఎలెన్ (నెల్లీగా వ్యవహరింపబడుతుంది) విపులంగా చెప్తుంది అతనికి. నవలలో ప్రధాన కథ నెల్లీ కథనం ద్వారా తెలుస్తుంది.

ఈ నవల రెండు కుటుంబాల కథ. మొదటి కుటుంబం అర్న్‌‌షాది. రెండోది లింటన్‌ది. అర్న్‌షా సంపన్నుడు, వదరింగ్ హైట్స్ అధిపతి. అతనికి భార్య, కొడుకు హిండ్లీ, కూతురు కేథరిన్, పరిచారిక నెల్లీ ఉంటారు. ఒకరోజు అతను ఇంటికి వస్తూండగా, ఒక ఏడేళ్ళ జిప్సీ పిల్లవాడు దారిలో తటస్థపడతాడు. ఆ అబ్బాయిని తీసుకువచ్చి, ఇంట్లోవాళ్ళకు తను పెంచుకోదలుచుకున్నట్టు చెప్తాడు. భార్య, కొడుకు హిండ్లీ అలా తమ ఇంట్లోకి వచ్చిన హీత్‌క్లిఫ్‌ని ద్వేషిస్తారు. కేథరిన్‌కి మాత్రం అనూహ్యంగా అతనితో ఒక స్నేహబంధం ఏర్పడుతుంది. అర్న్‌షా జీవించివున్నంత కాలం హీత్‌క్లిఫ్‌ జీవితం బాగానే ఉంటుంది. కానీ త్వరలోనే ముందుగా భార్య, తర్వాత భర్త మరణిస్తారు. దీనితో హిండ్లీ ఇంటి యజమాని అవుతాడు. అక్కడినుంచి హీత్‌క్లిఫ్‌కు నరకం అనుభవంలోకి వస్తుంది. ఇంటెత్తు చాకిరీ అతని చేత చేయించడం, ఒక్క తప్పు చేసినా విపరీతమైన శిక్షలు విధించడం, తిండి పెట్టకపోవడం ఇలా గడుస్తుంది హీత్‌క్లిఫ్‌ బాల్యం. ఈ అంధకారంలో అతనికి లభించిన వెన్నెల కిరణం కేథరిన్ స్నేహం. ఇద్దరూ గంటల తరబడి అడవుల్లో తిరుగుతూ, కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. ఆ క్రమంలోనే ఒకసారి థ్రష్‌క్రాస్ గ్రంజ్‌ దగ్గరలో వర్షంలో ఇరుక్కుపోతారు. దాని యజమానులు లింటన్, కేథరిన్‌ను పెద్దింటి అమ్మాయి అని గుర్తించి, రాత్రికి ఆశ్రయమిస్తారు. అనాగరికంగా కనిపిస్తున్న హీత్‌క్లిఫ్‌ని రానివ్వరు. ఆ ఇంట్లో లింటన్, అతని భార్య, కొడుకు ఎడ్గర్, కూతురు ఇసబెల్లా ఉంటారు. అక్కడినుంచీ ఎడ్గర్‌తో కేథరిన్ స్నేహం మొదలవుతుంది. ఎడ్గర్ తొలిచూపులోనే కేథరిన్ పట్ల ఆకర్షితుడౌతాడు. స్వార్థపరురాలు, అహంకారి అయిన కేథరిన్ హీత్‌క్లిఫ్‌ పట్ల ప్రేమ ఉన్నా, ఎడ్గర్‌ను కూడా ప్రోత్సహిస్తుంది. ఆమాటకొస్తే రెచ్చగొడుతుంది కూడా. ఇదంతా గమనిస్తున్న నెల్లీకి దీని పరిణామం ఏమవుతుందో అన్న భయం మొదలవుతుంది.

ఒకరోజు నెల్లీ, కేథరిన్‌ను ఈ విషయమై మందలించబోగా కేథరిన్ ‘హీత్‌క్లిఫ్‌ను ఆ భగవంతుడు అంత నీచమైన జాతిలో ఎందుకు పుట్టించాడో! నా తాహతుకు తగడు కదా, పెళ్ళిచేసుకోలేను…’ అనడం చాటునుంచి హీత్‌క్లిఫ్‌ వింటాడు. వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ తర్వాత కేథరిన్ అనే మాటలు వేరు. ‘అయినా నాకు తనంటే ఎంత ప్రేమో హీత్‌క్లిఫ్‌కు ఎప్పటికీ తెలీదు.’ అని ఏడుస్తుంది. ఆ రాత్రి తర్వాత మూడేళ్ళ వరకూ హీత్‌క్లిఫ్‌ ఎవరికీ కనిపించడు. కొన్ని రోజులపాటు కేథరిన్ అతని కోసం వెతికిస్తుంది. తీవ్ర ఆందోళనకు గురవుతుంది. చివరికి కొంత కాలానికి ఎడ్గర్‌ని కేథరిన్ వివాహం చేసుకోవడం, హిండ్లీకి పెళ్ళయి ఒక కొడుకు (హేర్టన్) పుట్టడం జరుగుతాయి. అటు లింటన్ కుటుంబంలోనూ తల్లిదండ్రులు మరణించడంతో ఎడ్గర్ ఆ ఇంటికి యజమాని, కేథరిన్ యజమానురాలు అవుతారు. అయితే హిండ్లీ భార్య కొడుకును కన్న కొన్ని రోజులకే మరణిస్తుంది. భార్యను మింగాడన్న కోపంతో, స్వంత కొడుకు హేర్టన్‌ని నిర్దాక్షిణ్యంగా ఏడిపించి, భయపెడుతూంటాడు హిండ్లీ. నెల్లీ పుణ్యమాని ఆ బాలుడికి భద్రత ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో హీత్‌క్లిఫ్‌ తిరిగి వస్తాడు. ఒక నాగరికుడిగా, సంపన్నుడిగా, మూడేళ్ళ కిందటి హీత్‌క్లిఫ్‌ ఛాయలేవీ లేకుండా తిరిగి వచ్చిన అతన్ని చూసి అందరూ నిర్ఘాంతపోతారు. నెల్లీలో మాత్రం భయం మొదలవుతుంది. ఇక హీత్‌క్లిఫ్‌ ప్రతీకారం మొదలవుతుంది. తరచు కేథరిన్‌తో మాట్లాడ్డం, ఆమె ఆవేశానికీ ఉద్వేగానికీ గురికావడం, ఎడ్గర్, హీత్‌క్లిఫ్‌ని తన ఇంటికి రావద్దని నిషేధించడం జరుగుతాయి. అప్పటికే గర్భవతి అయిన కేథరిన్, మానసిక వ్యాకులతకు గురై కొన్ని రోజులు ఉన్మాదిలా ప్రవర్తిస్తుంది. తన ప్రియురాలిని వివాహం చేసుకున్నందుకు ఎడ్గర్ మీద పగ తీర్చుకోవాలని కంకణం కట్టిన హీత్‌క్లిఫ్‌, తనపట్ల కొద్దో గొప్పో ఆకర్షణకలిగిన ఇసబెల్లాను ఒక రాత్రి మాయమాటలు చెప్పి తనతో తీసుకువెళ్ళిపోతాడు. తన చెల్లెలు ఆ ‘దుర్మార్గుడి’ బారిన పడినందుకు ఎంతో బాధపడినా, దీనివల్ల తన భార్యకు అతని పీడ విరగడైందని సంతోషిస్తాడు ఎడ్గర్. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. హీత్‌క్లిఫ్‌కు కేథరిన్ ఎప్పటికీ తనదే అన్న విషయంలో ఏ సందేహమూ లేదు. తను, కేథరిన్ ఇద్దరూ వివాహితులైనా, ఆమెను నిత్యం కలుసుకోడానికే ప్రయత్నిస్తుంటాడు. పరిస్థితిని చక్కదిద్దడానికి, కేథరిన్ తన భర్తతో సుఖంగా ఉందని తనతో నెల్లీ అన్నపుడు, అతను అంటాడు: For every thought she spends on Linton, she spends a thousand on me!

అలా మెల్లిగా మళ్ళీ కేథరిన్‌ని కలవడానికి ప్రయత్నించి, నెల్లీ సాయంతో ఒక్క రోజు ఆమె వద్దకు వెళ్తాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ ఎంతో భావోద్వేగంతో కలుసుకుంటారు. పరస్పరం ఎప్పటికీ విడిపోకూడదని, ఏదో రూపంలో కలుసుకుంటూనే ఉండాలని వాగ్దానాలు చేసుకుంటారు. ఎడ్గర్ ఇంటికి వచ్చేశాడని పరిచారికలు చెప్పడంతో హీత్‌క్లిఫ్‌ వెళ్ళలేక, వెళ్ళలేక వెళ్తాడు. ఆ రాత్రి కేథరిన్ విపరీతమైన శారీరక, మానసిక ఉద్విగ్నతకు గురై ఒక అర్భకమైన ఆడపిల్లకు (ఏడో నెలలోనే) జన్మనిచ్చి చనిపోతుంది. హీత్‌క్లిఫ్‌ ఉన్మాదిలా అయిపోతాడు.

అంతకుముందే హీత్‌క్లిఫ్‌ తన జూదవ్యసనాన్ని అవకాశంగా చేసుకుని, తన డబ్బులన్నీ కాజేసినందుకు అతనిమీద ద్వేషం పెంచుకున్న అతని ఆజన్మ శత్రువు హిండ్లీ, హీత్‌క్లిఫ్‌ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ తనే చావుదెబ్బలు తింటాడు. ఈమొత్తం ఉదంతంలో పాల్గొన్న ఇసబెల్లా, హీత్‌క్లిఫ్‌ని ‘భార్య ఉండగా, మరొకరి భార్య మరణానికి సంతాపదినాలు పాటిస్తున్నందుకు’ వెక్కిరించడం, అతను ఆమె మీద కత్తి విసరడం జరుగుతాయి. ఈ సంఘటనతో ఇసబెల్లా పారిపోయి నెల్లీ సాయంతో మరో వూరికి వెళ్ళిపోతుంది. వెళ్ళే సమయానికే గర్భవతి అయిన ఇసబెల్లా ఒక కొడుకుని కని, అతనికి 12 ఏళ్ళు వచ్చేసరికి మరణిస్తుంది. కానీ ఈలోగా ఒక్కసారి కూడ ఈ వూరికి రాదు. హీత్‌క్లిఫ్‌ని తలచుకోను కూడ తలచుకోదు. ఆమె మరణానంతరం హీత్‌క్లిఫ్‌, అనారోగ్యంతో ఉన్న తన కొడుకు లింటన్‌ని తెచ్చుకుంటాడు. ఈలోగా హిండ్లీ తాగుడు వల్ల చనిపోవడంతో (అతని అస్తినంతా హీత్‌క్లిఫ్‌ లాక్కుంటాడు), అతని కొడుకు హేర్టన్‌ని కూడ బలవంతంగా తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇటు తన కొడుకునూ, అటు హిండ్లీ కొడుకునూ కూడ నిరాదరణకే గురిచేస్తాడు.

అక్కడ లింటన్ ఇంట్లో కేథరిన్, ఎడ్గర్‌ల కూతురు చిన్న కేథరిన్ అందమైన, ఉత్సాహవంతురాలైన అమ్మాయిగా ఎదుగుతుంది. ఒకప్పుడు అందరి ఈసడింపులకూ, నిర్దయకూ గురైన హీత్‌క్లిఫ్‌ ఎలా ఉన్నాడో, ఇప్పుడు అతని నిరాదరణ వల్ల హేర్టన్ అలాగే ఉన్నాడు. చరిత్ర పునరావృతమవుతుంది. తన తప్పేమీ లేకుండా అందరి వల్లా ఎంతో మానసిక క్షోభను అనుభవించిన ఎడ్గర్ కొంతకాలానికి చనిపోతాడు. దానితో హీత్‌క్లిఫ్‌ రెండు ఇళ్ళకు యజమాని అవుతాడు. కేథరిన్ కొంతకాలం లింటన్‌ని అభిమానిస్తుంది. లింటన్ రోగి మాత్రమే కాదు. కథలో ఎవరో అన్నట్టు, తల్లి ఇసబెల్లాలోనూ, తండ్రి హీత్‌క్లిఫ్‌లోనూ ఉన్న దుష్టగుణాలన్నీ పుణికిపుచ్చుకున్నవాడు. అతని మీద జాలితో కేథరిన్ స్నేహంగా ఉంటుంది. తన పగ ఇంకా చల్లారని హీత్‌క్లిఫ్‌, రోగగ్రస్తుడైన కొడుక్కి చిన్న కేథరిన్‌తో బలవంతంగా వివాహం జరిపిస్తాడు. అందరూ అనుకున్నట్టే లింటన్ త్వరలోనే చనిపోవడంతో కేథరిన్ వితంతువు అవుతుంది. ఇప్పుడు కేథరిన్, హేర్టన్ తమకు ఇష్టం ఉన్నాలేకున్నా హీత్‌క్లిఫ్‌తో జీవిస్తున్నారు. అతని నిరంకుశచర్యలకు బాధితులుగా ఉన్నారు. మొదట్లో ఇద్దరూ కొట్టుకున్నా క్రమంగా స్నేహితులవుతారు.

ఎడ్గర్, తన కొడుకు లింటన్ ఇద్దరూ మరణించిన తర్వాత, హీత్‌క్లిఫ్‌ తన మకాముని పూర్తిగ వదరింగ్ హైట్స్‌కే మార్చేస్తాడు. అతను, కేథరిన్, హేర్టన్ ముగ్గురే మిగులుతారు వదరింగ్ హైట్స్‌లో. క్రమంగా హీత్‌క్లిఫ్‌లో కొంత పరిణామం వస్తుంది. ఎవరిని పీడించాలా అన్న ఉత్సాహాన్ని వదిలి, పూర్తిగా అంతర్ముఖుడౌతాడు. కేథరిన్ పట్ల ఇప్పటికీ ఏ మాత్రం తగ్గని తన ప్రేమను, తామిద్దరూ గడిపిన క్షణాలను తలుచుకుంటూ ఏకాంతంలో ఎక్కువ సమయం గడుపుతాడు. బాల్యంలో తామిద్దరూ తిరిగిన ప్రదేశాలకు వెళ్ళి గాఢసంతాపంలో మునిగిపోతూంటాడు. కొన్ని రోజుల పాటు కేథరిన్‌తో గడుపుతున్న భ్రమలోపడి, నెల్లీ ఎంత బతిమాలినా, ఆహారం తీసుకోవడం మానేస్తాడు. ఇక అక్కడి నుంచి చిన్న కేథరిన్, హేర్టన్ ఎప్పుడు ఎదురొచ్చినా, ఇదివరకటిలా చీదరించుకోక, బాధపెట్టక, ఇద్దరిలోనూ కనిపిస్తున్న తన ప్రియురాలు కేథరిన్ పోలికలకు విభ్రాంతికి గురవుతూ, విచలితుడౌతాడు. రోజూ మృత్యువును ఆహ్వానిస్తూంటాడు. ఒకరకంగా చెప్పాలంటే స్వచ్ఛందమరణం పొందుతాడు. ఆ తర్వాత నుంచి కేథరిన్, హేర్టన్, నెల్లీ పెద్దరికం నీడలో ఆనందంగా జీవితం గడపడం చివరి సన్నివేశం.

ఈ నవల చదవడం ఒక కాలక్షేపం కాదు; వినోదం కాదు; ఉల్లాసం కాదు; వికాసం కూడా కాదు. ఒక అనిర్వచనీయమైన, గాఢమైన అనుభవం. చదివిన తర్వాత దీన్నుంచి కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. ‘Laughter is sadly out of place under this roof’ అంటుంది ఒకసారి నెల్లీ, ఇసబెల్లాతో. నిజంగానే నవల చదువుతున్నంతసేపూ అందులోని పాత్రలు నవ్వకపోవడమే కాదు (ఒకవేళ నవ్వితే అది అపహాస్యంతోనో, ఉన్మాదంతోనో అయివుంటుంది), మనకు కూడ చిరునవ్వు నవ్వే అవకాశం కలగదు. అయినా నవలను వదిలిపెట్టబుద్ధి కాదు.

నవలను నడిపించేది హీత్‌క్లిఫ్‌; కేథరిన్‌ల ప్రణయం. వాళ్ళిద్దరూ బాల్యంలో అవిభక్త కవలల్లా గడిపినా అదే ప్రేమ. ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నా అదే ప్రణయం. పరస్పరం మాటలతో వేధించినా, ఒకర్నొకరు శిక్షించుకున్నా, అదే ప్రేమ. ఆమె మరణించాక కూడ అదే ప్రేమ. వీళ్ళిద్దరి ప్రేమ అసాధారణమైంది. కానీ అందులో ఆగ్రహం, సంశయం, అసూయ, వేదన, ద్వేషం, తొందరపాటు అన్నీ కలగలిసి వుంటాయి. తమ ప్రేమను సఫలం చేసుకోలేకపోతున్నామన్న దుగ్ధతో, తమను ప్రేమించే ఇతరులందరినీ మాటలతో హింసిస్తారు. తమని తాము హింసించుకుంటారు. ప్రపంచ సాహిత్యంలో ఇంత ‘క్రూరమైన ప్రేమ’ను మరే నవలలోనూ చూడలేమనిపిస్తుంది. వీళ్ళిద్దరినీ పాఠకులు ఇష్టపడ్డం కష్టం. అన్ని లోపాలున్నాయి ఈ పాత్రల్లో. విఫల ప్రేమ, క్రౌర్యం, ప్రతీకారం, వర్గాల అంతరం, ఒంటరితనం ఈ నవలలో ప్రధాన వస్తువులుగా చెప్పవచ్చు. హీత్‌క్లిఫ్‌ చిన్నప్పుడు హిండ్లీ నుంచి దారుణమైన శిక్షలు అనుభవించివుండకపోతే బహుశా అంత క్రూరుడిగా తయారయ్యేవాడు కాడేమో. అతని ప్రవర్తనను సమర్థించడానికి కొన్ని కారణాలు కనిపిస్తాయి కానీ, స్వంత బిడ్డల పట్ల చూపే నిరాదరణ క్షమించదగ్గదిగా ఉండదు. ప్రధాన పురుష పాత్రలు అంటే హిండ్లీ తన కొడుకు హేర్టన్ పట్ల, హీత్‌క్లిఫ్‌ తన కొడుకు లింటన్ పట్ల చూపే అమానుష వైఖరి మనుషుల్లోని చీకటి కోణాలన్నీ ఒకే రచనలో గుప్పించిందా అన్నంత ఘోరమైన అనుభవాన్ని పాఠకులకు అందిస్తాయి. నవలలో ఎడ్గర్, హేర్టన్, చిన్న కేథరిన్ మాత్రమే మంచివాళ్ళనదగిన పాత్రలు. హీత్‌క్లిఫ్‌, అతని కొడుకు లింటన్, అతని శత్రువు హిండ్లీ, అతని ప్రియురాలు కేథరిన్, అతని భార్య ఇసబెల్లా, పనివాడు జోసెఫ్ ఇతరులను బాధించడంలో ఆనందం పొందే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించేవారు.

నవలాంతానికి కథానాయకుడైన హీత్‌క్లిఫ్‌ని మనం ఇష్టపడగలమా అంటే చెప్పడం కష్టం. ఆఖరి రోజుల్లో తన ప్రతీకారం తనకు ఏ మాత్రం ఆనందం ఇవ్వలేదని గుర్తించడం అతని పట్ల కొంత సానుభూతిని కలిగిస్తుంది. కానీ, తన చేతలకు అతను చివర్లో కూడా పశ్చాత్తాపం చెందడు. అందుకే చనిపోడానికి కొన్ని గంటల ముందు నెల్లీతో అంటాడు ‘I’ve done no injustice; and I repent of nothing; I am too happy, and yet I am not happy enough’. హీత్‌క్లిఫ్‌ని మనం ప్రేమించలేమేమో గానీ మరిచిపోవడం అసాధ్యం. ఇంతకూ హీత్‌క్లిఫ్‌ను ఎమిలీ జిప్సీగా ఎందుకు అభివర్ణించిందో విమర్శకులకు అంతుపట్టలేదు. అంటే అతని మూలాలు భారతదేశంలో ఉన్నాయా అనే సందేహం కూడ కొందరికి వచ్చింది. అయితే, అతను తక్కినవారికంటె ఛాయ తక్కువగా, మురికిగా, విద్యాహీనుడిగా కనిపించడం వల్ల, జిప్సీ అన్న పదం అతనికి వాడారు కానీ అది జాతికి సంబంధించింది కాకపోవచ్చుననే అభిప్రాయం కూడ ఉంది. అలాగే మూడేళ్ళలో అతను నాగరికుడిగా, సంపన్నుడిగా ఎలా మారాడో కూడ వివరాలు నవలలో దొరకవు. ఏమైనా నవలంతా అయ్యాక మన మనసుల్లో నిలిచిపోయేది అతని పాత్రే.

కథకురాలు నెల్లీ అన్నట్టు కథాంతానికి అన్ని చేదు అనుభవాలను అధిగమించి చిన్న కేథరిన్, హేర్టన్ తమలో ఇంకా సున్నితత్వం, మానవత్వం నశించిపోలేదని నిరూపిస్తారు. హీత్‌క్లిఫ్‌లాగే వీళ్ళు కూడ నిరాదరణకు గురయ్యారు. కానీ వీళ్ళిద్దరూ దాన్ని ద్వేషంగా మలచలేదు. తన పట్ల నీచంగా ప్రవర్తించిన హీత్‌క్లిఫ్‌ మరణించినపుడు అతని కోసం కన్నీరు కార్చింది అతని చేతిలో అత్యంత నిరాదరణకు గురైన హేర్టన్ మాత్రమే. నవల ముగిసేసరికి, తమ పెద్దల కంటే ఎంతో పరిణతమనసును ప్రదర్శించిన కేథరిన్, హేర్టన్ ఆ పెద్దలందరి విపరీత మనస్తత్వాలనూ ప్రక్షాళనం చేశారనిపిస్తుంది. మనోవైజ్ఞానిక కోణం నుంచి పరిశీలించగలిగిన అంశాలెన్నో ఈ నవలలో ఉన్నాయి. సున్నితమైన ప్రణయగాథలకు పేరుపొందిన విక్టోరియన్ యుగంలో, మనిషి అంతరాంతరాలను కల్లోలితం చేసే ఒక ఉన్మాదంలాంటి ప్రణయాన్ని చిత్రించడం ఎమిలీ చేసిన గొప్ప సాహసం.

ఎవరు చెప్పాలి ఇలాంటి కథని?

భావోద్వేగమే ప్రధాన లక్షణంగా ఉన్నవారు, స్వార్థపరులు, అహంభావ పూరితులు, నిత్య బాధితులు, క్రూరులు అయిన స్త్రీపురుషుల కథను ఎవరి కోణం నుంచి చెప్పాలి? ఒకే కుటుంబానికి చెందినప్పటికీ కుటుంబం అనే అనుబంధానికి ఏ గుర్తింపూ లేని ఈ నవలలో, ఆయా పాత్రల కోణం నుంచి కథను చెబితే అన్ని పాత్రలకూ న్యాయం జరగకపోవచ్చు. అందుకే వాళ్ళందరికీ సమానదూరంలో ఉంటూ, కొందరితో దగ్గరితనాన్ని తనకు తాను ఆపాదించుకుంటూ, అందరికీ sounding board లాగా ఉండే నెల్లీ డీన్ చేత కథ చెప్పిస్తుంది. చెబుతున్నది కూడ ఈ నాటకంలో పాత్రధారులెవ్వరికీ కాదు. వారిని గురించి తెలుసుకోవాలని కుతూహలపడిన ఒక ఆగంతుకుడికి. ఈ నవల మొత్తంలో, విజ్ఞత కలిగిన మనిషి, అందరినీ వారి లోపాలతో సహా ప్రేమించగలిగిందీ, అందరి బాగును కోరుకునేది నెల్లీనే కనక, ఆమె చేత కథ చెప్పించడం ఎమిలీ బ్రాంటీ కథనశిల్పంలో సాధించిన విజయం.

ఈ నవలను ఎమిలీ తన పేరుతో రాయలేదు. ఎలిస్ బెల్ (Ellis Bell) అనే పేరుతో రాసింది. ఆమె మరణానంతరమే (నవల ప్రచురింపబడిన ఏడాదికి, కేవలం 30 ఏళ్ళకే ఆమె మరణించింది) ఆమె అసలు పేరు బయటకు వచ్చింది. అంతవరకూ ఈ నవల రాసింది మగవాడే అనుకున్న చాలామంది విమర్శకులు, పాఠకులు ఈ నిజం తెలిసి నిర్ఘాంతపోయారు. ఈ నవలకు ప్రశంసలు, తీవ్రవిమర్శలు కూడ ఎదురయ్యాయి. ఇంత హింసాత్మకమైన రచన ఒక స్త్రీ ఎలా చేసిందనే చర్చ కూడ జరిగింది. ప్రేమను ఒక విధ్వంసకర శక్తిగా చిత్రించడం, మానసిక జాడ్యం స్థాయికి దాన్ని ‘దిగజార్చడం’ చాలామందికి కొరుకుడుపడలేదు. స్వయానా అమె అక్క షార్లట్ బ్రాంటీ కూడ ‘హీత్‌క్లిఫ్‌ లాంటి దారుణమైన వ్యక్తిని ఎలా నాయకుడిగా చిత్రించిందో నాకర్థం కాదని’ వాపోయింది.

కానీ తర్వాతి కాలంలో, ఈ నవల ఒక క్లాసిక్‌గా అఖండగౌరవం సంపాదించింది. మనిషి మనసు ఒక మహాసముద్రమని, దాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమనీ, మానవ హృదయంలో అతనికే తెలీని ప్రేరణలు, ఆలోచనలు ఉంటాయనీ మనస్తత్వ శాస్త్రం నిరూపించిన తర్వాత, అవేవీ తెలియకుండా ఇంత లోతైన మనస్తత్వాలను చిత్రించిన ఎమిలీ బ్రాంటీ ఒక గొప్ప రచయిత్రిగా గుర్తింపు పొందింది.

తెరపై వదరింగ్ హైట్స్

ఈ నవల హాలీవుడ్‌ని, టెలివిజన్ నిర్మాతలను సహజంగానే ఆకర్షించింది. 1939 నుంచి 2011 వరకూ కనీసం 10 చిత్రాలు ఈ కథ ఆధారంగా నిర్మించబడ్డాయి. అయితే దాదాపు ఏ సినిమా కూడ నవలకు న్యాయం చెయ్యలేకపోయిందనే అందరూ భావించారు. ఒక్క 1962లో వచ్చిన సినిమా అన్నిటిలోకీ కొంత నయమని విమర్శకుల అభిప్రాయం. హిందీలో దిలీప్ కుమార్, వహీదా రెహమాన్‌లతో వచ్చిన ‘దిల్ దియా దర్ద్ లియా’ (1966) కూడా భారతీయ ప్రేక్షకులను, దిలీప్ కుమార్ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకోవడం వల్ల నవలకు న్యాయం చెయ్యలేకపోయింది. (దిలీప్ కుమార్ హీరోగా 1950లో వచ్చిన ఆర్జూ, 1951లో వచ్చిన హల్‌చల్ కూడ ఈ నవలపై ఆధారపడినవే.)

ఎమిలీ శైలి

I have not broken your heart—you have broken it; and in breaking it, you have broken mine – Heathcliff.

If all else perished, and he remained, I should still continue to be; and if all else remained, and he were annihilated, the universe would turn to a mighty stranger – Katherine.

ఇలాంటి రచనతో దాదాపు ప్రతి సంభాషణ, ప్రతి ఆలోచనా చాలా పదునుగా ఉంటాయి. తీవ్రమైన భావాలను అంత తీవ్రమైన పదజాలంతోనే ఎమిలీ వ్యక్తీకరించింది. నవలలోని మరో విలక్షణమైన విషయం – ప్రకృతి వర్ణన. దట్టమైన అడవుల్లాంటి తోటల మధ్య ఉన్న ఈ రెండు ఇళ్ళు, రుతువులు మారినపుడల్లా బాహ్యప్రకృతిలో వచ్చే మార్పులు, నిరంతరం ఉద్విగ్నభరితమైన ఆ వ్యక్తుల అంతఃప్రకృతిలో వచ్చే ప్రకంపనాలు అద్భుతంగా వర్ణిస్తుంది ఎమిలీ.

ఎమిలీ రాసిన 200 కవితల్లో చాలా కొన్ని మాత్రమే లభ్యమవుతున్నా, ఈ ఒక్క నవలతోనే ఆమె అజరామరమైన కీర్తిని సంపాదించింది. 1883లో ప్రసిద్ధ కవి స్విన్‌బర్న్ (Algernon Swinburne) వదరింగ్ హైట్స్ గురించి రాస్తూ ‘essentially and definitely a poem in the fullest and most positive sense of the term’ అన్నాడు. నవలే ఒక కావ్యంలా ఉండడం వల్లనే బహుశా ఆమె కవితలు లభించడం లేదన్న కొరత పాఠకులకు కూడ లేదేమో.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...