Maithili: A Musical

Overture

(ప్రభాతవేళ గగనిలో ఏడు హంసలు అతి మనోహర విన్యాసాలు చేస్తూ, ఏవో కలస్వనాలు చేస్తూ, ఎగిరిపోతున్నాయి. ఆ సప్తస్వరహంసలను అర్ధం చేసుకోగలిగిన ప్రకృతికి, అందులో విష్ణుసంస్తవము వినవచ్చింది.)


ఉంటిమా విశ్వాత్మ! మేముంటిమా?
ఆ ఘనపు ఘడియలలో
మేముంటిమా!

కొండ కవ్వము చేసి
పాము పగ్గము చేసి
దేవతలు, దానవులు
పాలకడలిని చిలికేటి వేళా
కూర్మమై కొండను
కూర్మితో నీవు మోసేటి వేళా
ఉంటిమా స్వామీ! మేముంటిమా?

పాలవెల్లి నుండి పసిడి పూవై,
మేలిమి మెరుపై, వెలువడిన మహలక్ష్మి
ఏది తగిన నెలవు, నేనెవరిని వరింతునని
మనసున తర్కించి, ఇందిరా రమణి-
మణిమందిరము కాదె ఈతని వక్షము!
కరుణాళు వీతడు, కార్యశూరు డితడు,
పుండరీకాక్షుడే నాకు నచ్చిన వరుడు
అని మెడ మాలనిడి, సిరి హరి జూచు,
మరల హరి సిరి జూచు, పరమ రమణీయవేళా
ఉంటిమా స్వామీ! మేముంటిమా?

కంటిమా స్వామీ!
ఉద్ధతితో, నీ వున్న సమయాన
నిన్ను మేము పొడగంటిమా!

భూలోకమును దాటి, భువర్లోకము దాటి
సువర్లోకము దాటి, మహర్లోకము దాటి
జనోలోకము దాటి, తపోలోకము దాటి
సత్యలోకము దాటి, సమస్తము నీవై
నీయందె సమస్తమై, నీవె విశ్వానివై
ఒక అడుగు దివిమోపి, రెండవది
భువి మోపి, నగినగి; “భువనేశ!
మూడవ అడుగు నేనెచట మోపేది?”
అని నువ్వడుగ -బలి బహుభ్రాంతితో జూచు
నీ త్రివిక్రమ రూప విజృంభణము-

కంటిమా స్వామీ! మేము కంటిమా?
ఆ దివ్య సమయాన మేముంటిమా?

నీకోసమే దేవ!
నీకోసమే!
గీతమై
వర్ణమై
ఘన రాగ కీర్తనై
విరతి విరామముల
నిరతముగ
స రి గ మ ప ద ని
వెదికేది
నీకోసమే రామ!
నీకోసమే.

రాగము లన్నిటన్ మధుర రాగము
రాముని రాగమౌ,
సదా రాగను రామచంద్ర శుభరాగము
జీవన రాగమై,
దివిన్ వాగుల సాగిపోగలుగు
పావన వంశపు హంస మేము!
రామేగతి నేలకున్,
దిగము, తేలము నీచపు కాల్వ లెన్నడున్.

రామనామ మననము మానదురా మా మనము, నామమాత్ర స్మరణము శాంతినొందు నెమ్మనము,
మానదురా ఏనాటికి, మారదురా ముమ్మాటికి, మానదురా మా మనము రామనామ మననము -అని హంసలు పదేపదే ఉచ్చరించుచూ ఎగురుచుండగా-


(తెర తీయబడింది. అప్పుడు భూమి మీది నుండి పైకెగసిన ఒక వీణపాట విని, అప్పటివరకు ఆకాశగమనంలో ఉన్న ఏడు హంసలు, ఉలికిపాటుతో, క్రిందికి దిగి, పాట వినవస్తున్న వనం లోని చెట్లపై వివశతతో అధివసిస్తాయి. ఆ వచ్చి వాలిన హంసల ఉన్నతశరీరాలు, విచిత్రవర్ణాల ఈకలతో కూర్చిన రెక్కల బహువిస్తారపు పరిధి, తెలివి ఒలికే ముఖాలు, దూరదృష్టి గల కన్నులు, ఘన చుంచువులు, -ఎవరైనా చూచి ఉన్నచో వారి అదృష్టమే అదృష్టము. ఆ బాలిక పాట ద్వారా, వారు ఉర్రూతలూగుతున్న రామదర్శనం, త్వరలో కలగనున్నదని తెలిసి, సప్తస్వర హంసలు ఆ పిమ్మట ఆమె వెంటవెంటే అదృశ్యంగా సంచరిస్తాయి. ఆ బాలిక మైథిలి. ఆమె గానమిది.)

తీపికథ నాకొకటి
ఈ పవలు చెప్పవలె వీణియా!
సారిగమ రీగమప
గామపధ మాపధని హెచ్చులౌ
సానిధప నీధపమ
ధాపమగ పామగరి తగ్గులౌ
సారిసగమారిగమధాపధని
సామ సునాదమై
నాదముని త్యాగముని
రాగముల కాత్మగను
వెల్గు నా రామకథ
వీణియా సీతకై మ్రోగవే.


(అది మిథిలానగరం: అక్కడ సీత బాల్య కౌమారాలు. తన తోటలలో సీత ఆటపాటలు.)

లాలాల్లా, లాల్లల్ల లాల్లా, లాలాలా లాలాల్ల లాలా
నానానా నాన్నాన్నానానా నానానా నాన్నాన్న నానా.
లాల్లల లాల్లల, నాన్నన నాన్నన
గువ్వలెన్నొ మూగాయి, సవ్వడెంతొ చేసాయి
ఈ పుంతే పులకించిపోయే
నాకెంతో సంతోషమాయే
లాలాల్లా, లాల్లల్ల లాల్లా, లాలాలా లాలాల్ల లాలా
గంటలెన్నొ మ్రోగాయి, గణగణలాడాయి
కళ్ళన్నీ కళకళలు చిందే
వళ్ళేమో తళతళలు పొందే
లాలాల్లా, లాల్లల్ల లాల్లా, లాలాలా లాలాల్ల లాలా
పువ్వులెన్నొ విరిశాయి, నవ్వులెన్నొ కురిశాయి
తోటంతా మధుపాత్ర ఆయే
మనసంతా ఉల్లాసమాయే
లాలాల్లా, లాల్లల్ల లాల్లా, లాలాలా లాలాల్ల లాలా

పసుపుల రెక్కా, నా కటుఇటు పక్కా
గంతులు చిందులు నీకిం -కెన్నున్నాయే, చిల్కా!
దిరిసెన పువ్వా, మురిపెపు నవ్వా
దురుసుగ పైబడి రంగుల్రా -ల్చేవేమే ఇంకింకా!
నవ్వమ్మా, నవ్వమ్మా, కడుపారా నవ్వమ్మా
నీ గంతుల్చిందుల్, ఎకసక్కెం
నా ముంజేతిపై కాంతి రాసి పుప్పొడిబొమ్మా.

ఈ నేల నడవనిస్తుందీ
నాకు గరిక తివాసీ పరుస్తుంది
ఈ ఎండ ఎదురు వస్తుందీ
నా మెడలో పొగడ దండ వేస్తుంది
ఈ గాలి గౌరవిస్తుందీ
నాకు పూల గంధాలు పూస్తుంది
ఈ వాన పలకరిస్తుందీ
నా పై పన్నీరు చిలకరిస్తుంది
ఈ నేలా ఈ ఎండా ఈ గాలీ ఈ వాన
ఇవే ఇవే నాకే వేళల నెచ్చెలులు.


(మిథిలకు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో వచ్చి ఉన్నారని వార్త తెలిసి ఆనందంతో తన మహంతిపై సీత పాట. జనకమహారాజుని ఆమె కోరే కోర్కె. సీత స్వయంవరం.)

మధుర గీతమా! మరల పలుకుమా!
మహంతీ మ్రోగుమా
పుడమి పుత్రిని, విమల గాత్రిని
గానమది నా ప్రాణమే
ఘలంఘల ఘల ఝణం ఝణ ఝణ
మ్రోగవే వీణియా
స్వరమునకు నే సంతసించుదు
నా మనసు ఝల్లని విరిసి పోవును
పృధివి దాటును నింగి కెగురును
కలసిపోదును నే …నాదమందున
గీతమా! పలుకుమా!
పరి పరి.
మంజుల స్రవంతీ! మ్రోగుమా!
మరి మరి.

అతని అల్లెత్రాటి మ్రోత మీరెవరైన వింటిరా?
కోటానుకోట్ల భ్రమర ఝంకారాల పరంపరలు
దశదిశలు పంపునా దశరథ సూనుడు?
రాముని వింటినారి, వినిపించు దయతోటి
ఈ రోజు నాకొక్కసారి తండ్రీ!


(పరమశివుని విల్లెత్తి నారి బిగించిన రామునికి, సీతనిచ్చి వివాహం జరుపటానికి జనకమహారాజు సంతోషంతో ఒప్పుకుంటాడు.)

సీతాకళ్యాణ వైభోగమే
రామాకళ్యాణ వైభోగమే.
పామరాసురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ.
పరమేశనుతగీత భవజలధిపోత
తరణికుల సంజాత త్యాగరాజనుత
సీతాకళ్యాణ వైభోగమే
రామాకళ్యాణ వైభోగమే
(త్యాగరాజు కీర్తన నుండి)


(మిథిలలో రాముడితో పెళ్ళి జరిగాక, ఒక ప్రభాత గీతిక. సీత తోటలో పాట. ఆమె శయనమందిరంలో వీణపై ఒక గీతిక.)

కలకలకలకలా
మధుగీతి పక్షులు
పాడెరా ఎంతో సుతారముగను
తళతళతళతళా
కెరటాల వాగులు
తూగుతూ పారేను పల్లములకు
కొలనుల జలజలా
వనజాల రేకులు
వందలై విచ్చే విలాసముగను
ఉదయపు వెలుగులో
సతి సీత పూలతొ
వేడ్కతో నిల్చేను లే రఘువర!

ఏలనొ! ఏలనో!
శహన రాగిణి
సారెకు వీణ
మ్రోగెనో!
ఏటికి కోటలో
ఇటుల మాటికి
తూరుపు గాలి
వీచెనో!
తోరపు కాంతితో
గగన సీమల
తారక లెన్నొ
తోచెనో!
నూతన బంధుడై
కడిమి కూర్మితొ
రాముడె చూడ
వచ్చునో!

చందమామ వందునా!
ప్రియుడ!
అందగాడవందునా! అందినాడవందునా
చందనవనమందున
నీ పొందుల నేనుందునా.
మిథ్య! ఇక నాకు మిథిల యందునా
మధ్యమావతి యందె మైమరచి నిను వలచి
నయుడ!
నీ మోమున ఊగేటి
అలకలను నే కందునా
చందమామ వందునా.


(సప్తస్వర హంసలు తెర వెనుక ఎగురుతూ ఇచ్చేటి ఆశీస్సులు.)

చాల కలరాగముల
తీపికథ ప్రేమకథ కావ్యకథ రామకథ
వీణియల సారిణులు పల్కగా
మరి పూచునదె రేయి కడు కోరికల
తారకలు తళ్కులై.

(Refrain. Curtain)


Composition: Lyla Yerneni
Poetry tutor: Poet Potana
Prosody tutor: J.K. Mohana Rao.