అభిప్రాయ వేదిక

అది ఒక విస్తృత ప్రజావేదిక
జనబాహుళ్యపు గొంతుక
కొత్త ఆలోచనల కలయిక
భిన్నస్వరాల మాలిక
అయితే ఒక వేడుక

వంచన తెర తీస్తోందా
వైషమ్యం పెంచి పోషిస్తోందా
విద్వేషపు విత్తులు నాటితే
సౌహార్ద్రపు మొక్కలెలా మొలుస్తాయి

వ్యంగ్యానికీ గీటురాయి కావాలి
ధిక్కార స్వరానికీ సంస్కారం తోడుండాలి

గురువింద గింజ నాయకులే
అభిమానుల ఇలవేల్పులైనపుడు
అరచేతిలోని అభిప్రాయ వేదికలపై
నగ్నస్వరూపాలు బయల్పడుతూ

స్నేహ పరిమళాల వనంలో సర్పాలుంటాయి
గంతలు కట్టుకున్న ఆగంతకులుంటారు
నకళ్ళు, నకిలీలు దండెత్తుతారు
ఇజాల ముసుగులో నిజాలు దాస్తారు

అది నువ్వు ఎక్కుపెట్టిన బాణం కాదు
వాక్ స్వాతంత్ర్యపు ఆభరణమూ కాదు
సారం లేని మాటల తూటాల రణం
గుంపు మనస్తత్వ వ్రణం
అణువంతైనా సంయమనం లేని
క్షణికావేశపు అణ్వస్త్రం
ఆత్మాహుతి దళం
కాలహరణ యంత్రం
వడపోయని కషాయం

విషయ పరిజ్ఞాన లేమితో
విచక్షణ చచ్చిన పక్షపాతంతో
బాంధవ్యాలకు బీటలువారుస్తూ
శ్రోతలెవ్వరూ లేని సభలో
వేదికపైనే జనమంతా


అనిసెట్టి శ్రీధర్

రచయిత అనిసెట్టి శ్రీధర్ గురించి:

అనిసెట్టి శ్రీధర్‌ రాసిన పలు కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 15 కథలతో 2008లో తీసుకొచ్చిన ‘కొత్త బంగారులోకం’ కథా సంపుటిని కారా మాస్టారు ఆవిష్కరించారు. ‘నివేదన’ కవితా సంపుటిని తీసుకొచ్చారు. ‘పాతసామాను’, ‘మద్దతు’, ‘జనజీవన స్రవంతి’, ‘శాహా వర్సెస్‌ మాహా’, ‘కొత్త బంగారు లోకం’ కథలకు బహుమతులు అందుకున్నారు. 1993లో వచ్చిన ఇరవై ఉత్తమ కథల్లో ఒకటిగా ఈయన రాసిన ‘నెత్తురు కూడు’ కథ ఎంపికైంది.

 ...