రోజూ అదే దారిలో వెళ్తుంటావు
ముందు కారుని అధిగమించాలనో
వెనకవాడికి దారి ఇవ్వకూడదనో
ఒకటే జోరు
ముందున్న రైలు గేటు మూసుకుంటే తప్ప
ఈ మలుపులో ఆగే అవసరమే రాదు
ఆ ముళ్ళకంపని అల్లుకున్న తీగకి పూసిన
ముచ్చటైన పూలని చూసే అవకాశమే లేదు
ఏదో ఒక రోజు గేటు పడుతుంది
వాహనాలన్నీ బుద్దిగా
ఒక వరసలో నిలబడిపోతాయి
కారు వేగంలో అప్పటిదాకా వినబడని
రేడియోలో పాటని వింటూ
బద్దకంగా మెటికలు విరుచుకుంటూ
కిటికీలోంచి బయటకి చూస్తావు
లోపలి పాటకు లయబద్దంగా నర్తిస్తున్నట్టు
బయట చెట్లూ పూలూ లతలూ-
వాటితో పాటు
నీ మనసు కూడా కాసేపు
అంతా ఒకే లయ అని
మొదటిసారి తెలుసుకుంటావు
కొన్ని మూసుకుంటే
ఎన్ని తెరుచుకుంటాయో అని
అప్పుడే నువ్వు అబ్బురపడతావు!