అసందర్భం కాదు

మనుషులంతా
తెరిచిన గుప్పిట్లోంచి
నలువైపులకూ ఎగిరిపోయి
సీతాకోకచిలుకలయ్యే ఆ కూడలిలో
రోజూ అతడిని చూడ్డం ఓ నిశ్చింత

ఎన్ని చెదిరిన పక్షులకు
నీడవ్వడానికి
అతడక్కడొక శ్రమ చెట్టయ్యాడో
తెలీదు కానీ

పగలంతా
ముక్కలైన నడకలను సరిచేస్తూ
పగిలిన కాళ్ళను అతికిస్తూ
కళ్ళ ముందొక
పని హరివిల్లై విరబూస్తాడు

మధ్యాహ్నం
సగం విరిగిన చందమామలాంటి
అతడి గొడుగు నీడ కింద
సూరీడు కాసేపు అలుపు తీర్చుకుని
వెళ్తూ వెళ్తూ
సంతృప్తి నిండిన చిర్నవ్వు నొకదాన్ని
అతడి పెదాల మీద అతికించి వెళ్తాడు

చీకట్లు చిక్కబడుతున్నప్పుడు
అన్నీ సర్దేసుకుని
అతడు వెళ్ళిపోతుంటే
రోడ్లు
మౌనంగా వీడ్కోలు చెప్పేవి

నేను కిటికీ మూసేసి
అలవాటుగా
దిగులు పూలను
మాలలుగా కుడుతూ కూర్చుంటే

ఇంట్లో కొచ్చి
గదిలో ఓ మూలగా వేసిన కుర్చీని
లాక్కొని నా ముందు కూర్చుంటూ
కూడలి నాతో చెప్పేది –
ప్రతి నిమిషం జీవించడం
అలవాటైతే
ఏ వీడ్కోలూ
అర్థాంతరం అసందర్భం కాదని.

సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...