తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు

సాహిత్య విమర్శ కందుకూరి వీరేశలింగం విగ్రహతంత్ర విమర్శనంతో ప్రారంభమైందని అనుకుంటే దాదాపు 140 ఏళ్ళవుతున్నాయని అనుకోవచ్చు. ఇన్నేళ్ళలో తెలుగు సాహిత్య విమర్శ ఎన్ని పోకడలు పోయిందో సమగ్రంగా తెలుసుకోలేకపోయినా, గడచిన తరాలనుంచి ఈనాటి విమర్శ ఏం తెలుసుకోవలసి వుంది; భవిష్యత్తులో పురోగమించడానికి విమర్శలో ఇంకా రావలసిన దృక్పథాలు, కోణాలు ఎటువంటివి అన్న విచికిత్స చేయడానికి ఇది సరైన తరుణమనే భావించవచ్చు.

తొలిదశలో వచ్చిన దాన్ని విమర్శ అని బహుశా చెప్పలేం. ఎందుకంటే ప్రాచీన గ్రంథాలను సంపాదించి, పరిష్కరించి, పాఠ నిర్ణయం చేసి, కవుల చరిత్రను రాయడమే (కందుకూరి, గురజాడ శ్రీరామమూర్తి) అప్పట్లో జరిగింది. 1892లో పి. దక్షిణామూర్తి చేసిన ‘పింగళి సూరన’ ప్రసంగమే తెలుగులో తొలి విమర్శ అని సంపత్కుమారగారంటారు. అక్కడితో మొదలైన తెలుగు సాహిత్య విమర్శలో మూడు రీతులు ప్రధానంగా కనిపిస్తాయి. సంస్కృత లాక్షణికుల సిద్ధాంతాల నేపథ్యంలో జరిగిన విమర్శ-వింజమూరి రంగాచార్యుల నుంచి విశ్వనాథ సత్యనారాయణ వరకు సాగిన విమర్శ; రెండోది, సంస్కృత మర్యాదను అనుసరిస్తూనే పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను కూడా భారతీయ సాహిత్యానికి అన్వయించి చూపిన కట్టమంచి రామలింగారెడ్డి నుంచి ప్రారంభమై జి.వి. సుబ్రహ్మణ్యం వరకూ సాగిన విమర్శ; మూడో రీతి, కేవలం పాశ్చాత్య సామాజిక సాహిత్య సిద్ధాంతాలను తెలుగు రచనలకు అన్వయించే విమర్శ. ఇది ప్రధానంగా మార్క్సిస్టు విమర్శకులైన కొడవటిగంటి కుటుంబరావు, కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు మొదలైనవారు పాటించిన పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లోనూ తెలుగులో ఉత్తమ విమర్శ వెలువడింది. మూడిటిలో ఉత్తమోత్తమమైన పద్ధతి అంటూ ఉందని మాత్రం చెప్పలేం. మూడూ సమగ్ర విమర్శ విధానాలని కూడా అంగీకరించడం కష్టమే.

మొత్తంగా తెలుగు సాహిత్య, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శను సమీక్షించుకోవడంలో ఈ క్రింది ప్రశ్నలు తలెత్తుతాయి.

  1. సాహిత్యాన్ని సాహిత్య ప్రమాణాలతో మాత్రమే చూడాలా?
  2. ఏ కాలంనాటి సాహిత్యాన్ని ఆ కాలంనాటి సామాజిక, సాహిత్య ప్రమాణాల ఆధారంగానే వ్యాఖ్యానించాలా?
  3. సాహిత్యాన్ని సామాజిక విజ్ఞానం ఆధారంగా పరిశీలించాలా? రచనా కాలాన్ని బట్టి కాక, చదివే కాలంనాటి ప్రమాణాలను బట్టి రచనను బేరీజు వెయ్యాలా?
  4. సాహిత్యవిమర్శలో ఉపయోగించే పరిభాషను ఏ యుగానికి ఆ యుగం కనిపెట్టుకోవాలా? లేక ప్రాచీన ప్రాచ్య, పాశ్చాత్య పరిభాష మనకు ఈనాటికీ వర్తిస్తుందా?
  5. సాహిత్య విమర్శ పాఠ్యం (రచన)ఆధారంగా సాగాలా? లేక విమర్శకుడికి ఆమోదనీయమైన సిద్ధాంతాల ప్రాతిపదిక మీద సాగాలా?
  6. సాహిత్య విమర్శకుడిలో నిబద్ధత అనేది ఉండాలా? ఒక సామాజిక లేదా సాహిత్య సిద్ధాంతానికి కట్టుబడి వుండడం విమర్శకుడికి అవసరమా? లేక ఏ రచననైనా దాని యోగ్యతను బట్టి మూల్యాంకనం చేయాలా?
  7. రచయితలు/కవులు విమర్శకులను పట్టించుకోవాలా? పట్టించుకుంటారా? విమర్శకుల వల్ల తమ రచనా విధానాన్ని మార్చుకున్న రచయితలు ఎవరైనా ఉన్నారా?
  8. ఒక్కొక్క సామాజిక/సాహిత్య ఉద్యమం వచ్చినపుడు దానికి అనుకూలమైన విమర్శకులను అదే తయారుచేసుకుంటుందా? అటువంటి విమర్శకులు నిష్పాక్షికంగా ఉండగలరా?

పై ప్రశ్నలకు ఖచ్చితమైన, నిర్దిష్టమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం లభించడం కష్టం. కానీ ఇవన్నీ చర్చనీయాంశాలే. తెలుగు సాహిత్యంలో సందర్భం వచ్చినపుడల్లా ఇటువంటి చర్చ జరుగుతూనే ఉంది. కానీ సృజనాత్మక ప్రక్రియలపై జరిగినంత చర్చ విమర్శ సిద్ధాంతాలపై జరగలేదు. తెలుగు సాహిత్య విమర్శకులలో మౌలిక సాహిత్య సిద్ధాంతాలు చేసిన వారు తక్కువ. అనువర్తిత విమర్శ (applied criticism) చేసిన వారే ఎక్కువ. కొందరు విమర్శకులు ప్రతిపాదించిన మౌలిక సిద్ధాంతాలకు తగిన స్పందన లభించలేదు. వాటిని అనుసరించిన విమర్శకులూ లేరు. ఉదాహరణకు రాయప్రోలు సుబ్బారావు ‘అమలిన శృంగారం’, విశ్వనాథ సత్యనారాయణ ‘జీవుని వేదన’, శ్రీశ్రీ ‘రసన’, జివి. సుబ్రహ్మణ్యం ‘ధర్మవీర రసం’ మొదలైనవి.

తొలితరం విమర్శకుల్లో సమన్వయ ధోరణి

సాహిత్యాన్ని సాహిత్య ప్రమాణాలతో చూడవలసిన అవసరం గురించి అభిప్రాయభేదాలుండవు. కానీ సాహిత్య ప్రమాణాలతో మాత్రమే విమర్శించడం సమగ్రమైన పద్ధతి కాదు. ఆ కాలం నాటి సమాజం ఆ రచనలో వ్యక్తమవుతోందా, ఆ రచన వల్ల నాటి సాంఫిుక పరిస్థితులు తెలుస్తున్నాయా, సాహిత్యం సామాజిక చరిత్రను నిర్మించడానికి చక్కని సాధనం కనక ఈ కావ్యం అటువంటి సాధనంగా ఉందా అన్నవి ముఖ్యంగా పరిగణించాల్సిన అంశాలు. ఈ సామాజిక దృక్పథం అన్నది తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు సిద్ధాంతాల పరిచయం కలిగిన తర్వాత ఎక్కువ ప్రచారం పొందినా, అంతకు ముందు కూడ ఉంది. ఆధునిక విమర్శకు ఆద్యుడని చెప్పే కట్టమంచివారే ఏ సాహిత్య పరిశీలనలోనైనా ఆనాటి సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అనంతరం పాండిత్య ప్రకర్ష కలిగి, సంస్కృత లక్షణ గ్రంథాలను ఔపోశన పట్టిన కోరాడ రామకృష్ణయ్య, కురుగంటి సీతారామయ్య, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటివారు కూడ సాహిత్యానికీ తత్కాల సమాజానికీ ఉన్న సంబంధాన్ని అనివార్యంగా విశ్లేషించారు.

తెలుగులో తొలితరం విమర్శకుల్లో అధికులు ఇంగ్లీషుభాషలో కూడ పాండిత్యం కలిగివుండడం వల్ల సంస్కృత, ఆంగ్ల విమర్శనా విధానాలను సమన్వయపరచగలిగారు. కట్టమంచి నుంచి పింగళి లక్ష్మీకాంతం వరకు ఇది నిరాటంకంగా సాగింది. కొందరైతే (కురుగంటి, కోరాడ) ఇంగ్లీషులో కూడ తెలుగు విమర్శ వ్యాసాలు రచించారు. అదే విధంగా నేటి పాఠకులు ప్రాచీన సాహిత్యాన్ని, ఇప్పటి అవసరాలకు అనుగుణంగా చదవడం, మూల్యాంకనం చేయడం సరైన పద్ధతేనని తొలి నుంచి విమర్శకులు భావించారు. అందుకే కట్టమంచివారు తెలుగు సాహిత్యంలో తిక్కన, సూరన మరికొందరు తప్ప తక్కిన వారి రచనలను పూర్తిగ నాశనం చేసినా తెలుగుభాషకు ఏ నష్టమూ లేదని అన్నారు. కోరాడ రామకృష్ణయ్య ‘మన దేశంలో హైందవజాతికి ప్రాచీన చరిత్ర గ్రంథాలు లేకపోయినను, ప్రాచీన భారతీయ సాహిత్యం ఆ జాతి చరిత్రను తక్కిన ప్రపంచ జాతుల చరిత్రలన్నిటికంటే సువ్యక్తముగ తెలుపగలుగుచున్నది,’ అని అన్నారంటే, సాహిత్యంలో ఆనాటి సమాజం ప్రతిబింబిస్తుందనీ, ప్రతిబింబించాలనీ విమర్శకుడిగా ఆయన భావిస్తున్నట్టు స్పష్టం. (కోరాడ రామకృష్ణయ్య సాహితీ విమర్శ-డా. రావి ప్రేమలత). అలాగే రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ కూడా వేమన, శ్రీకృష్ణ దేవరాయలు గురించి చర్చిస్తున్నప్పుడు ఆనాటి సామాజిక పరిస్థితులను అంచనా వేయడం, ఆయా సాహిత్యాల్లో ఈనాటి పాఠకులు ఎంతవరకు స్వీకరించాలో, ఎంత వదిలేయవచ్చునో సూచించడం ఆయన ప్రాచీన సాహిత్యాన్ని సైతం ఆధునిక దృష్టితో చూడగలిగారని తెలుపుతుంది.

తెలుగు సాహిత్యవిమర్శలో ప్రక్రియా విమర్శకు పట్టంగట్టిన విమర్శకుడు విశ్వనాథ సత్యనారాయణ. ఇతిహాసాలను, పురాణాలను, ప్రబంధాలను ఒకే కొలమానాలతో తూచకూడదని చెప్పిన ఆయన పాశ్చాత్యులు ఎంతో విలువైందిగా భావించే జానర్ క్రిటిసిజమ్‌ని తెలుగువారికి అలవరిచారు. ఈ పంథాని కోవెల సంపత్కుమార, సుప్రసన్న, తుమ్మపూడి కోటేశ్వరరావు, జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం, ముదిగొండ వీరభద్రయ్య వంటివారు అందిపుచ్చుకున్నారు. కానీ విశ్వనాథ సంప్రదాయవాది అన్న ఆగ్రహంతో, ఆయన రచనలన్నిటినీ తిరస్కరించే ధోరణి ప్రబలడంతో, విమర్శకు ఆయన చేసిన మేలును, ముఖ్యంగ ప్రక్రియాసిద్ధాంతం, రచనాశిల్పం, పురాణేతి హాసాల్లో అంతరార్థ కథనం అనే విషయాల్లో ఆయన చేసిన గొప్ప ప్రతిపాదనలు, వ్యాఖ్యానాలను కూడ అనంతర కాలంలో విస్మరించడం కనిపిస్తుంది. ఈ పరిణామానికి ముఖ్య కారణం మార్క్సిస్టు విమర్శ.

రెండో తరం- కుటుంబరావు సామాజిక వాస్తవికత

ఒక రచనను సాహిత్యం అనే దృష్టికోణం నుంచి కాక, చారిత్రక కోణం నుంచి చూడాలనీ, అంటే రామాయణాన్ని వాల్మీకి దృష్టినుంచి కాక, చారిత్రక కోణం నుంచి చూసినప్పుడే అది సద్విమర్శ అవుతుందనీ ప్రతిపాదిస్తూ కొత్త విమర్శ విధానానికి తెర లేపినవారు కొడవటిగంటి కుటుంబరావు. సాహిత్యవిమర్శ అంటే సామాజిక, సాంస్కృతిక విమర్శ అన్నారాయన. ఒక రచనను రచనాకాలంనాటి ప్రమాణాలతో చూడాలా, అది చదువుతున్న పాఠకుల కాలంనాటి ప్రమాణాలతో చూడాలా అన్న మీమాంస వచ్చినపుడు, (పాలగుమ్మి పద్మరాజుగారి అభిప్రాయాన్ని ఖండిస్తూ) పాఠకుల కాలం నాటి ప్రమాణాలతో చూడాలనీ, ఏ రచననైనా చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక కోణం నుంచి చూస్తేనే దాని స్థానాన్ని అంచనా వేయగలమనీ, కేవలం కవి వైపు నుంచో, రచనాకాలం దృష్టి నుంచో విమర్శిస్తే అది విమర్శ కాదనీ కుటుంబరావు అందించిన సూత్రం, ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృక్పథంతో వివేచించడానికి ఒక ఉపకరణాన్ని అందించింది. ఆ మార్గంలో అనంతరం ఎందరో మార్క్సిస్టు విమర్శకులు ఈ విమర్శ విధానాన్ని ప్రచారంలోకి తెచ్చారు.

విమర్శకుడికి కూడ నిబద్ధత ఉండాలన్నది ఈ సిద్ధాంతంలో ముఖ్య విషయం. ప్రజల పట్ల, సామాజిక చైతన్యం పట్ల నిబద్ధత లేని, అటువంటి వస్తువును స్వీకరించని, వర్గ దృష్టిలేని రచనలను వాటి గుణదోషాలతో నిమిత్తం లేకుండా తిరస్కరించడం ఈ విమర్శలో భాగమే. కానీ విశ్వనాథది దీనికి విరుద్ధమైన అభిప్రాయం. ‘కవిత్వానికి నీ ఆదర్శాలతో పనిలేదు. నీ మత భేదాలతో పనిలేదు. నీ వైషమ్యాలతో పనిలేదు. నీవు నీ యిష్టము వచ్చినట్టు రాసుకో. అది కవిత్వమైతే నాకానందమిస్తున్నది. దాని యందు నాకు సానుభూతి కలిగిస్తున్నది. నన్ను మారుస్తున్నది… నన్ను ఆచరణ మార్గంలోకి తిప్పుతున్నది.’ (విశ్వనాథ అసంకలిత సాహిత్యం. పుట 175). అందుకే ఆయన తన అభిప్రాయాలతో పూర్తిగా విభేదించే శ్రీశ్రీ గురించి, ‘ఈ కొత్త కవుల్లో ఒకడే కవి. అతను శ్రీశ్రీ,’ అనగలిగారు. అయితే కుటుంబరావు, సాహిత్యాన్ని సాంఫిుక చైతన్యంలో ఒక శాఖగా భావించారు. అందువల్లే సాహిత్యం సాంఫిుక పరిణామానికి దోహదపడాలనీ, సంఘదృష్టి లేని సాహిత్యాన్ని ఉత్తమ సాహిత్యంగా అంగీకరించలేమనీ అన్నారు. శ్రీశ్రీ విమర్శనా రంగానికి ప్రత్యేకించి పూనుకుని దోహదం చెయ్యకపోయినా, ఆయన తన కవిత్వం ద్వారా, కొన్ని వ్యాసాల ద్వారా ప్రచారంలోకి తెచ్చిన మార్క్సిస్టు సిద్ధాంతాలను విమర్శనలో ఉపయోగించుకున్నవారిలో ముఖ్యులు కుటుంబరావు.

‘సరైన విమర్శ రానిదే సరైన సాహిత్యం రాదు,’ అని కుటుంబరావు అనడంలో విమర్శ సృజనాత్మక సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుందన్న విశ్వాసం ఉంది. అలాగే విమర్శకుడి బాధ్యత చాలా పెద్దదని, విమర్శకుడు రచయిత కంటే రెండాకులు ఎక్కువ చదివి వుండాలనీ ఆయనన్నారు. ఈ విషయంలో విశ్వనాథ అభిప్రాయం కూడ గమనించదగ్గదే. ‘కుకవి కంటే కువిమర్శకుడు చేసే సాహిత్య ద్రోహమే ఎక్కువ,’ అన్నారు విశ్వనాథ. వీరిద్దరి ఆలోచనావిధానాన్నీ, విమర్శపంథాను అనుసరించి తెలుగు విమర్శలో 1960ల నుంచి రెండు పాయల విమర్శ కొనసాగింది. తర్వాత వచ్చిన మార్క్సిస్టు విమర్శకులు పట్టించుకోని ప్రక్రియావైవిధ్యాన్ని కుటుంబరావు పట్టించుకోవడం విశేషం. ఆయన కథ, నవల, నాటకం ఇత్యాది ప్రక్రియలపై ప్రకటించిన విమర్శలో ఆయా ప్రక్రియల స్వరూపస్వభావాల పట్ల చక్కని అవగాహన కనిపిస్తుంది. మార్క్సిస్టు విమర్శ అనంతర కాలంలో కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, వెల్చేరు నారాయణరావు, చేకూరి రామారావు, కె.కె. రంగనాథాచార్యులు, కాత్యాయని విద్మహే వంటి వారి రచనల్లో విస్తృతి సాధించింది. అయితే వీరి కాలానికి మార్క్సిస్టు విమర్శ అంటే వస్తువిమర్శ అన్నదానికే పరిమితం కావడం గమనిస్తాం. సాహిత్యంలో కళాత్మకత, శిల్పం అనే అంశాలకు ప్రాధాన్యం క్రమేపీ తగ్గిపోయింది. అయితే అభ్యుదయ విమర్శ పంథాకే కట్టుబడి వున్నా, సాహిత్యానుశీలన మార్గాన్ని కూడ దానితో సమన్వయపరిచిన కేతవరపు రామకోటిశాస్త్రి, అద్దేపల్లి రామ్మోహనరావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటి వారున్నారు. ఇదే సమయంలో మరొక పాశ్చాత్య విమర్శ సిద్దాంతమైన మనోవైజ్ఞానికత కూడ ఒక విమర్శ పద్ధతిగా ప్రారంభమైంది. అయితే ఆర్.ఎస్. సుదర్శనం, కోడూరి శ్రీరామమూర్తి తప్ప ఈ మార్గాన వెళ్ళినవాళ్ళు తక్కువే. ఎం.ఫిల్. పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథాలకే ఈ విమర్శమార్గం పరిమితమైపోయింది.

వీరికి సమకాలీనంగా విశ్వనాథ సాహిత్య శిల్పానుశీలన మార్గాన్ని అనుసరిస్తూ తమని తాము నవ్యసంప్రదాయవాదులని పిలుచుకున్న కొందరు విద్వాంసులు తమ విమర్శను కొనసాగించారు. వీరిలో ముఖ్యులు జి.వి. సుబ్రహ్మణ్యం, కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న, ముదిగొండ వీరభద్రయ్య మొదలైనవారు. అయితే దాదాపు 1990ల వరకూ తెలుగు విమర్శను శాసించింది మాత్రం మార్క్సిస్టు విమర్శ దృక్పథమే.

అస్తిత్వ ఉద్యమాల విమర్శలు

ఆ తర్వాత విప్లవోద్యమాలనుంచి విడివడి, అస్తిత్వ ఉద్యమాలుగా నిలదొక్కుకున్న స్త్రీవాద, దళితవాద సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకునేసరికి, సృజనాత్మక ప్రక్రియల్లోనూ, విమర్శలోనూ కూడ కొత్త పోకడలు ప్రారంభమయ్యాయి. ఇది ప్రధానంగా తమ కవిత్వంపై వచ్చిన విమర్శకు సమాధానంగా ప్రారంభమైంది. స్త్రీవాద కవిత్వాన్ని ‘నీలి కవిత్వమనీ’ స్త్రీవాద కవయిత్రులను ‘వారకాంతలు’, ‘గయ్యాళులు’ అనీ పురుష విమర్శకులు తూలనాడడంతో, దానికి సమాధానంగా వచ్చిన వ్యాసాలు క్రమంగా స్త్రీవాద విమర్శకు రూపురేఖలను అందించాయి.

అంతవరకూ మార్క్సిస్టు విమర్శలో వర్గం ప్రాతిపదికగా జరిగిన విమర్శ లోపభూయిష్టమైనదనీ, జండర్, కులం అన్నవాటిని పట్టించుకోని విమర్శ సమగ్రం కాదనీ, జీవితాన్ని కేవలం వర్గ దృక్పథంతో చూడకూడదనీ, సమాజంలో అసమానతలకు డబ్బు ఒక్కటే కారణం కాదు; జెండర్, కులం మరింత ముఖ్య కారణాలవుతున్నాయనీ, వీటిని ప్రతిబింబించేదే అసలైన సాహిత్యమనీ ఈ విమర్శకుల వాదన. ఈ దృక్పథాల నుంచి వెలువడిన విమర్శ రెండు విధాలుగా ఉంది.

  1. తాము సృష్టించిన సాహిత్యానికి ఒక సిద్ధాంతభూమికను అందించడం,
  2. ప్రాచీనకాలం నుంచి వస్తున్న సాహిత్యాన్ని స్త్రీవాద, దళితవాద చూపుతో విశ్లేషించి, మూల్యాంకనం చేయడం.

ఈ రెండు విమర్శ దృక్పథాలూ విమర్శను ప్రధానంగా వస్తుదృష్టితోనే చేశాయి. ఈ రెండు విమర్శ దృక్పథాలు సాహిత్యాన్ని భాషాదృష్టితో కూడ చూడడం, ఇంతవరకూ వచ్చిన సాహిత్యంలో పురుషుల రచనల్లో స్త్రీల పరంగా కనిపించే అసమదృష్టి వస్తు రూపంలోనూ, భాషా రూపంలోనూ ఎలా ఉన్నదీ స్త్రీవాదం ఎత్తి చూపితే, అగ్రకులాల సాహిత్యంలో వస్తువు, భాషల పరంగా దళితుల పట్ల ఉన్న అసమదృష్టిని దళిత వాదం ఎండగట్టింది.

సృజనాత్మక ప్రక్రియల్లో విమర్శ

ప్రస్తుతం తెలుగు సాహిత్య విమర్శలో పైన చెప్పిన నాలుగు రకాల విమర్శన దృక్పథాలూ (సాహిత్యానుశీలనం, మార్క్సిస్టు, స్త్రీవాదం, దళితవాదం) స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విమర్శ అంతా విమర్శ అనే ప్రక్రియలో (వ్యాసరూపంలో) మాత్రమే జరక్క, సృజనాత్మక ప్రక్రియల్లో ఆవిష్కరింపబడడం. రామస్వామి, చలం నాటకాల ద్వారా హేతువాద దృక్పథంతో పురాణ విమర్శ చేస్తే, రంగనాయకమ్మ నవలారూపంలో మార్క్సిస్టు కోణం నుంచి రామాయణాన్ని ఎండగట్టారు; ఓల్గా వంటివారు నవలలు, కథల ద్వారా, సతీశ్ చందర్, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి వంటి వారు కవిత్వం ద్వారా నిర్దిష్ట భావజాలంతో ప్రాచీన సాహిత్యాన్ని ఫూటుగా, నిర్ద్వంద్వంగా విమర్శించారు. ఇవి ప్రక్రియాపరంగా సృజనాత్మక రచనలే అయినా, విషయపరంగా సాహిత్యవిమర్శలే.

స్త్రీవాద, దళితవాద కోణాల నుంచి ప్రామాణికమైన విమర్శ కూడ గణనీయంగా వచ్చింది. ప్రాచీన కావ్యాలను, కవులనే కాక ఆధునిక రచయితలను కూడ స్త్రీవాద కోణం నుంచో, దళితవాద కోణం నుంచో చూసినపుడు వారికి ఇంతకుముందున్న ప్రతిష్టలో లొసుగులు బయటపడతాయి. ఉదాహరణకు సామాజిక, ఆర్థిక కోణం నుంచి చూసినపుడు మహానుభావుడిగా కనిపించే వేమన, స్త్రీవాద కోణం నుంచి చూసినపుడు ఆ గౌరవాన్ని కోల్పోతాడు. అలాగే భారత రామాయణాలను, కావ్య ప్రబంధాలను దళిత, స్త్రీవాద కోణం నుంచి చూసినపుడు, మార్క్సిస్టు కోణం నుంచి చూసినపుడు గతంలో గమనించని ఎన్నో లోపాలు బయటపడతాయి. స్త్రీవాద విమర్శకు గొప్ప ఉదాహరణ కాత్యాయనీ విద్మహే రాసిన ‘అలంకారశాస్త్రంలో స్త్రీ.’ సంస్కృత లాక్షణిక గ్రంథాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరించకుండా ఉండలేని విధంగా సాగిన విమర్శ ఇది. అలంకారశాస్త్రానికి కొత్త చూపునిచ్చిన రచన.

తెలుగు సాహిత్య విమర్శలో లోపాలేమిటి?

1. వస్తు కేంద్రిత విమర్శ

తెలుగు సాహిత్య విమర్శలో సామాజిక, ఆర్థిక కోణాలనుంచి ఒక పాఠ్యాన్ని విమర్శించే క్రమంలో ప్రక్రియాపరంగా, శిల్పపరంగా కూడ దాని విలువలను నిర్ణయించే ఒక సామరస్య, సమన్వయ దృక్పథం అతి తక్కువ స్థాయిలో జరగడం మనకు కనిపిస్తుంది. కావ్యశిల్పంపై దృష్టి ఉంచిన వారు వస్తువును, తత్కాలానికి దాని ప్రయోజనాన్ని, కవి వాస్తవికదృష్టిని పట్టించుకోకపోవడం; వస్తుదృష్టితో మాత్రమే చూసేవారు ప్రక్రియను, రచనాశిల్పాన్ని నిర్లక్ష్యం చేయడం తరచు కనిపిస్తుంది. అంటే ఇక్కడ విమర్శకుడు రచనను సమగ్రంగా కాక, పాక్షికంగా మాత్రమే చూసే పాఠకుడిగా ఉన్నాడు. తొలిరకపు విమర్శకులు ‘చలం భాష, శిల్పం బాగుంటాయి. వస్తువు మాటేమైనా’ అంటే చలానికి అన్యాయం చెయ్యడమే. అలాగే రావిశాస్త్రిని మార్క్సిస్టు రచయితగా ప్రతిపాదించేవారు ఆయన గోవులొస్తున్నాయి జాగ్రత్తనీ, ఆరు సారా కథల్ని, నిజం నాటకాన్నీ గురించి ఒకే విధంగా రాయడం, రచయితగా ఆయన వైవిధ్యాన్ని, ప్రక్రియపై ఆయనకున్న అధికారాన్ని కించపరచడమే.

2. సొంత పరిభాష వెదకాలి

తెలుగు విమర్శకులు పాశ్చాత్య, సంస్కృత సిద్ధాంతాల నుంచి పరిభాషను విరివిగా వాడుకున్నారు. నిజానికి కవిత్వాన్ని తూచిన తూనికరాళ్ళు చాలావరకు పాశ్చాత్య కళాసిద్ధాంతాలు, ఉద్యమాల నుంచి గ్రహించినవే (ప్రతీకాత్మకత, అధివాస్తవికవాదం, ఇమేజిజమ్, ఎక్స్‌ప్రెషనిజం, ఇంప్రెషనిజమ్, మాజిక్ రియలిజమ్ మొదలైనవి). స్త్రీవాద, దళితవాదాలు వీటినన్నిటినీ అంగీకరించక, స్వంత ఈస్తటిక్స్ పెంపొందించుకోవాలన్న ఆశయాన్నయితే ప్రకటిస్తున్నారు కానీ ఆ దిశగా ఇంతవరకూ ఎక్కువ పరిశ్రమ జరగలేదు.

3. కల్పనాసాహిత్య విమర్శ లేమి

తెలుగులో సాహిత్యచరిత్ర అన్నా, సాహిత్యవిమర్శ అన్నా కవిత్వానికే పరిమితం కావడం విషాదకరం. ప్రాచీన సాహిత్యచరిత్ర కవులపరంగా ఉండడంలో, లేదా కవితాప్రక్రియల పరంగా ఉండడంలో ఆశ్చర్యం లేదుగానీ (అప్పుడు కవిత్వం మాత్రమే ఉండేది కనక), ఆధునిక సాహిత్యచరిత్ర కూడ కవిత్వోద్యమాల చరిత్రగా పరిగణించడం అపరిపక్వమైన విధానం. ఆధునిక సాహిత్యంలో కథ, నవల, నాటకం, వ్యాసం వంటి ఎన్నో సృజనాత్మక ప్రక్రియలు కవిత్వంతో సమానంగా, కొన్నిసార్లు కవిత్వంకంటే ఉదాత్త స్థాయిలో రచింపబడ్డాయి. వాటిపై విమర్శ రావలసినంతగా రాలేదు. ఆ ప్రక్రియలను కూడ వస్తుదృష్టితో మాత్రమే చూడ్డం వల్ల ప్రక్రియలుగా వాటి ప్రత్యేకతను అంచనావేసే నైపుణ్యం విమర్శకుల్లో పెరగలేదు.

4. నిష్పాక్షికత ఏది?

విమర్శకుడికి ఉండాల్సిన గుణాల్లో సహృదయత ఒకటైతే, నిష్పాక్షికత రెండవది. ఇవి రెండూ ఈనాటి విమర్శలో కొరవడ్డాయనే చెప్పాలి. విమర్శ రచనను బట్టిగాక, రచయితను బట్టి జరగడమన్నది తెలుగులో కొత్త కాకపోయినప్పటికీ, అది ఈనాడు పరాకాష్ట చేరుకుంది. ‘ముఠాతత్వం’ అన్నది విమర్శలో కూడ ఇప్పుడు కనిపిస్తోంది. అంటే ఒక కులానికి, ప్రాంతానికీ చెందిన వారి రచనలను ఆ కులానికీ, ప్రాంతానికీ చెందిన వారే విమర్శకు స్వీకరించడం, వస్తునిష్ఠతో కాక, విశ్లేషణ రచయిత నిష్టగా జరగడం; సాహిత్య విమర్శకుల్లో కూడ ‘అస్మదీయ’ ‘తస్మదీయ’ భావాలు ప్రబలడం ఈనాటి విమర్శలో కనిపిస్తుంది.

నిజానికి నిష్పాక్షికంగా ఒక పాఠ్యాన్ని విమర్శించగల సత్తా ఉన్నవాళ్ళు లేకకాదు. కానీ వీరు కూడ కాలమానపరిస్థితులను బట్టి జాగ్రత్తగా విమర్శలు రాయడానికే పరిమితమవుతున్నారు. విమర్శకుడిగా ఒక రచనలోని లోపాలను ఎత్తిచూపితే ఆ రచయితలో శాశ్వత శతృత్వం ఏర్పడే పరిస్థితి ఈనాడు దాపురించింది. ఈ సందర్భంగా రాళ్ళపల్లి, కట్టమంచిల స్నేహాన్ని, సంపత్కుమార, చేకూరి రామారావుల మైత్రిని గుర్తు తెచ్చుకోవలసి వుంటుంది. రంగనాథ రామాయణ కర్తృత్వం విషయంలో కట్టమంచి, రాళ్ళపల్లిల మధ్య ఎన్ని విభేదాలు వచ్చి, ఇద్దరూ తీవ్రంగా పరస్పరం ఖండించుకున్నా, అది వ్యక్తిగతరూపం దాల్చలేదు. వారి స్నేహానికి అవరోధం కాలేదు. అలాగే వచన కవిత్వం గురించి సంపత్కుమార, చేకూరి రామారావుల మధ్య తీక్షణమైన వాదోపవాదాలు జరిగినా, అది వ్యక్తిగతదూషణకు, శతృత్వానికీ దారితీయలేదు. ఇటువంటి సహృదయత్వాన్ని ఈనాడు ఆశించడం అత్యాశే. మరోరకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఈనాటి కవులు, రచయితలు తమ విమర్శకులను తామే సృష్టించుకుంటున్నారేమో అన్న అనుమానం, తమపై విమర్శ (ప్రశంస) తామే రాయించుకుంటున్నారేమో అన్న అనుమానం కూడ సహజంగానే కలుగుతుంది. అది సత్యదూరం కూడ కాదు.

5. అధ్యయనం సరిపడా ఉందా?

కవి, రచయిత కంటే విమర్శకుడు ఎక్కువ అధ్యయనశీలి అయి వుండాలన్నది నిర్వివాదాంశం. నేటి విమర్శకులకు అంత అధ్యయనం ఉందా అన్నది ఆలోచించాలి. అటువంటి అధ్యయనం ఉన్నవారు ఎంత తరచుగా రాస్తున్నారన్నది కూడ ఆలోచించాలి. జి. లక్ష్మీ నరసయ్య, వాడ్రేవు చినవీరభద్రుడు, బి. తిరుపతిరావు, పాపినేని శివశంకర్ మొదలైనవారు కొన్ని కొత్త విమర్శ సూత్రాలను అందించడానికి ప్రయత్నిస్తున్నమాట నిజమే. కానీ ఇటువంటి వారిని చదువుతున్నవారు, అనుసరిస్తున్నవారు తక్కువే.

ఇప్పుడు వ్యాసాలు రాస్తున్నవారిలో ఎక్కువమంది ముందుగా తాము ఏర్పరచుకున్న సిద్ధాంతాలు, అభిప్రాయాలను ముందుంచుకుని, ఆ తర్వాత తాము విశ్లేషించవలసిన రచనను ఆ చట్రంలోకి బిగించడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. అది అందులో ఇమడకపోతే మంచి రచనకాదన్న తీర్పు వెలువడుతుంది. ఈ ధోరణి ఈనాడే ఏర్పడింది కాదు.(సంపత్కుమారగారు జాతీయత అనే చట్రం నుంచి గురజాడను చూసి, అతను తన సాహిత్యం ద్వారా నిజంగా సమాజానికి ఏం అందించారన్న విశ్లేషణను వదిలేసి, ఇంగ్లీషువారిని పొగిడి అతను సాహిత్యానికి చేసిన హాని అమితమైందని తేల్చడం ఇలాంటిదే. అలాగే మహాప్రస్థానంలో స్త్రీలు, దళితుల ప్రస్తావన లేదు కనక శ్రీశ్రీ వారికి వ్యతిరేకి అనడం.)

విమర్శ సాహిత్య రాజకీయాల నుంచి బయటపడాలి

ఉత్తమ విమర్శ ప్రయోజనం ఏమిటని ప్రశ్నించుకున్నప్పుడు అది ఏకసూత్రంలో బంధింపబడదు. ఒక సామాన్య పాఠకుడికైతే, ఒక పుస్తకం చదవాలా, చదివితే దేనికోసం చదవాలి అన్న సందేహనివృత్తి చేయాలి. సాహిత్య విద్యార్థికైతే, ఒక రచనలో మంచి చెడులను ఎలా విశ్లేషించాలి, సాహిత్యచరిత్రలో ఈ రచన స్థానం ఏమిటి, ఒక రచనకు తూనికరాళ్ళను ఎలా ఎంచుకోవాలి అనే జిజ్ఞాసను రేకెత్తించి, మార్గదర్శకత్వాన్ని ఇవ్వాల్సి వుంటుంది. రచయితలకైతే, సృజనాత్మకతకూ, దాన్ని మూల్యాంకనం చేసే శక్తికీ వున్న అంతరం ఏమిటీ, తను రాస్తున్న రచన తను ఉద్దేశించిన రీతిలో పాఠకులకు అందుతున్నదా అనే అవగాహన కల్పించాలి. తోటి విమర్శకులకైతే, ఏ రచననైనా ఎన్ని కోణాల నుంచీ చూడడానికి వీలుంది, రాగద్వేషాలకు అతీతంగా ఎలా ఒక రచనని నిర్ణయించాలి; రచన ముఖ్యమా, రచయిత ముఖ్యమా మొదలైన మీమాంసను సహేతుకంగా, నిష్పాక్షికంగా ఎలా వ్యాఖ్యానించాలో తెలియజేయాలి.

ఇన్ని పనులనూ సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ చేయగలుగుతోందా? అంటే సంతృప్తికరమైన సమాధానం లభించకపోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఈనాటి విమర్శకులలో కొంతమందికేమో ‘ఏం రాస్తే ఎవరికి కోపం వస్తుందో’ అన్న భయం, ఏదో ఒక ‘గుంపు’కు తను చెందకపోతే తన విమర్శను సమర్ధించుకోలేనన్న సంశయం, నిష్పాక్షికంగా ఉండడంకంటే ఎవరిలో ఒకరికి కొమ్ము కాయడమే మేలన్న రాజీధోరణి, మరి కొంతమందికి తగినంత అధ్యయనం లేకున్నా, ఎలా రాసినా తనను సమర్ధించే ఒక గుంపును తయారుచేసుకున్నానన్న ధీమా, విమర్శ రచనానిష్టం కంటే వ్యక్తి నిష్టమైనపుడే తాము గొప్ప విమర్శకులుగ చలామణీ కాగలమన్న అపోహ- ఇవన్నీ పోవాలి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైంది మన లాక్షణికులు చెప్పినట్లు ‘సహృదయతే.’ ఇది పరిమితార్థంలో అర్థంచేసుకునే మాట కాదు. అందులో మొత్తం విమర్శక ప్రవృత్తి ఇమిడి వుంది. అదొక్కటుంటే సాహిత్య రాజకీయాలకూ, రాగద్వేషాలకు, భయానికీ, మొహమాటానికీ అతీతంగా విమర్శను వెలువరించగలగడం అసాధ్యమేమీ కాదు.

ఇంతకూ పైన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించడం సాధ్యమా అంటే చెప్పలేం. ఎందుకంటే కాల స్వభావాన్ని బట్టి విమర్శ స్వరూపస్వభావాలు కూడ మారడం సహజం. ఒకప్పుడు రచననే ప్రమాణంగా తీసుకుని, విమర్శకుడు అందులోని అంతర్గత సాక్ష్యాల ఆధారంగానే విమర్శ చేసేవాడు. కానీ ఇప్పుడు పరిసర విజ్ఞానాలు, ప్రాపంచిక దృక్పథాలు, పాశ్చాత్య దేశాల్లో వస్తున్న కొత్త తరహా విమర్శ సిద్ధాంతాలు మొదలైనవి ముందుంచుకుని, వాటి నేపథ్యంలో కొత్త విశ్లేషణ చేయడానికి విమర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. నిజానికి విమర్శ తగినంతగా ఎదగకపోవడానికి వాటి ప్రచురణకు సరైన పత్రికలు లేకపోవడం కూడా కారణమే. తెలుగులో పరిశోధక రచనలను ప్రోత్సహించే పత్రికలు ఒకటి రెండిటికి మించి లేవు. ఒక అంశంపై చర్చలు జరపడానికి కూడా దినపత్రికల సాహిత్యం పేజీల పైనే ఆధారపడవలసివస్తుంది. ఆ పేజీలు వాటి సంపాదకుల ప్రాధాన్యతలపై ఆధారపడి వుంటాయి. వారి ఇష్టాయిష్టాలకు, పరిమితులకు లోబడి వుంటాయి. కనక విమర్శను వెలువరిద్దామన్నా ‘చోటు’ లేకపోవడం విమర్శ దుర్భర స్థితికి మరో కారణం. ఏమైనా, వస్తున్న కొద్దిపాటి విమర్శ ఏ పద్ధతిని అనుసరించినా, పాఠకుల సాహిత్య సంస్కారాన్ని పెంచడానికి మరింత చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...