శాస్త్రిగారు
రావిశాస్త్రిగారు నాకు తెలీదు. నేనాయన్ని ఎన్నడూ కలియలేదు. కాని బాగా తెలిసినట్లు అన్పిస్తుంది. తరచు గుర్తొస్తారు. రోజూ అన్నా ఆశ్చర్యంలేదు. ఏదో ఏదో వాక్యమో ఉద్దేశ్యమో గుర్తొస్తూనే వుంటాయి. అన్నిటికన్నా నన్నాశ్చర్యపరచేది ఫోటోలోనే స్పష్టంగా కనిపించే ఆయన అత్యంత సిన్సియారిటీ. అంతకంటే వినయంగా, వినమ్రంగా ఎవరూ బహుశా వుండరేమో అనిపించే విగ్రహం.
శాస్త్రిగారు మాకు బంధువు, చుట్టం అని మా మేనమామ పిలకా రామకృష్ణారావు పదే పదే నాకు గుర్తు చేస్తూ వుండేవాడు. అయినా నేను ఎప్పుడూ కలవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. నేను విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి కోర్టులో ఆయన్ని చూసేను. మరి నేనేమి ఆశించేనో గాని, ఆయన వాదన ఆరోజు నాకు నచ్చలేదు. తరచుగా రిక్షాలో ఒకానొక స్థితిలో ఆయన్ని చూస్తూ వుండేవాణ్ణి. వాళ్ళమ్మాయి పార్వతి మా జూనియర్.
“మీ నాన్నగారు రాసిన ‘సైగల్’, ‘గుంటూరు’ కథలు తెలుసా? మీ నాన్నగారి దగ్గర వున్నాయా? అడగండి” అన్నాను. ఆ అమ్మాయికి తెలియదు. కాని శాస్త్రిగార్ని అడిగింది.
“ఎవరతను? అతనిదగ్గర వున్నాయా?” అన్నారట శాస్త్రిగారు.
“‘విలువలు’ చదివేరా?” అడిగేను.
“చదవండి,” అన్నాను.
శాస్త్రిగారి ముద్దుల చెల్లెలు నిర్మలగారు మా ఫార్మకాలజీ ప్రొఫెసరు. సుమారు ఒక సంవత్సరకాలం ఆవిడ క్లాసులో వున్నాను. తన గురించీ, తన కుటుంబ సభ్యుల గురించీ కూడా వింటూ వుండేవాణ్ణి. చాలా రోజులకి ‘గుంటూరు’ చదివేను. అభిప్రాయాలు, దురభిప్రాయాలు, ప్రిజుడిసులు, బలహీన మనుషుల్లో వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కలిగించే కల్లోలాలు ఎంత సరళంగా, సహజంగా, సరదాగా రాసేరనిపించింది. ఇలాంటి కథ రాసిన, రాయగలిగిన ఈయనకే ప్రిజుడిసైనా వుండడం సాధ్యమా? అనుకున్నాను.
నేనూ ఆయన ‘సైగల్’ లాగా ‘రఫీ’ అని రాద్దామనుకునేవాడిని. కాని ‘సైగల్’ చదవాలిగా!
నేను చదివిన శాస్త్రిగారి మొదటి కథ, బహుశా, వర్షం. దబాయించి జబర్దస్తీ చేస్తోందని మొదలయే ‘వర్షం.’ సిటీబాబు కథ. పిరికితనంనుంచి తెగింపువైపు వర్షంలోకి అతని పయనం కథ. కథలు ఎలారాస్తారో చెప్పే ‘ఓ కథ కథ’లో తన తలలో ‘మెరుపు మెరిసింది.’ కథ ఎలా మెరిసిందో చెప్తారు. నా ప్రకారం ప్రతి కథలోనూ, రచనలోనూ ఏదో మెరుపు మెరుస్తూనేవుంది.
ఎందుకో తెలీదు కాని ఎన్నెన్నో పెన్నేములు. జాస్మిన్, కాంతాకాంతా, శంకరగిరి గిరిజాశంకరం, గోల్కొండ రాంప్రసాద్, విశారా, అన్‌జానా, అందరికీ తెలిసిన రావిశాస్త్రి సరేసరి. ఇవి సరిపోనట్లు ‘కాకి’ అనే పేర్తో కూడా (ఏ కాకీ కాపీ కొట్టకుండా) రాసేనని అన్నారని నాకు జ్ఞాపకం వస్తోంది. మరో ‘నిషారా’ (నాకురాయాలని!) కూడా వుంది.
కథలో కవిత్వం కూడదని కొందరనవచ్చును. కాని మహారచయితల రచనల్లో ఆ అతిచిన్న రేక చెరిగిపోయి కథనమెక్కడో కవిత్వమెక్కడో తెలియకుండా పోతుంది. అయినా అతి సహజంగా అమరుతుంది. శాస్త్రిగారి రచనా సంవిధానంలో అది ఒకానొక అంతర్భాగము. ఎన్నైనా ఉదాహరణలివ్వొచ్చు.
రాసేవాళ్ళలో కొందరికి రాయడమూ ఒక సంతోషమే. ఒక సుఖమే. ఈ ఇరుకుల చిరుగుల బతుకులో కథో మరేదో రాసుకునేపాటి సుఖమూ లేకపోతే, ఈ జీవితం ఇంకా ఇరుగ్గా, చిరాగ్గా తయారైపోయేదేమో అన్నవాళ్ళు వున్నారు. అదిగో, సరిగ్గా అలాంటి సంతోషం కోసమో, సుఖం కోసమో, హుషారు కోసమో, Just for the sake of writing కోసమో కూడా శాస్త్రిగారు రాసేరని నే ననుకుంటాను. ఏ రచయితైనా ఏదో ఒకరోజు తనెందుకు రాస్తున్నాడో తను తెలుసుకో వస్తుందని చెబుతూ, తనెందుకు రాసేడో చెబుతూ ఎవరైనా ఎందుకు రాయకూడదో కూడా చెప్పేరు. ఒకసారి కాదు. మరీ మరీ. పదేపదే.
‘జరీ అంచు తెల్లచీర’ కథ గురించి రాస్తూ ‘విశాలాక్షి నా కూతురు. నా కిష్టమైన పాత్ర’ అన్నారు. ఆ కాలంలో తను రాసినవి అయ్యోఅయ్యో కథలన్నారు. ఆ సమయంలోనే ఆయన ‘సైగల్’ కథ ఎంతో అందంగా రాసేరు. సైగల్ అన్నా సంగీతమన్నా ఎంత అభిమానమో, వాటి ప్రభావం ఎంత గాఢంగా వుంటుందో, ‘పాపాలన్నీ ప్రక్షాళితం చేసేంతగా’ అన్న రొమాంటిక్ భావన బలంగా గల, అంత బలమైనది కాని కథ. ఈ కథలు జాలి, కరుణతో నిండినవి. జాలి, కరుణ చాలదు. కోపం కావాలి. ఆ కోపంలోంచి జనించే ప్రచండతాపం కావాలి, బహుశా అన్ని చెడుగులనీ చెడనాడి తొలగించడానికి.
“నామీది అసహ్యంతో కూడ రాసేను” అన్నారు. తనని తరచిచూచి చెప్పడానికి ఎంత సాహసం కావాలి?!
“తన రచనలను డిఫెండ్ చేసుకోని డిఫెన్సు లాయరు ఈయన”అన్నాను ఒకసారి.
రచనలనిండా సిమిలీల శరపరంపర. సునామీలా సరసరా సాగుతూ అవి సిమిలీలా? మిసైల్సా? అనిపిస్తాయి. ఆ వాక్ప్రవాహం, ఆ వాక్యవిన్యాసం, ఆ పదసందోహం, ఆ శబ్దసౌందర్యం, మా నాన్నగారికి (సి.ఎస్.శర్మ) చాలా ఇష్టం. నాక్కూడా. శాస్త్రిగారి మాటలూ, విషయాలూ తరచుగా తలంపుకి వస్తాయి.
నల్ల మేక: ‘నల్లమేక’ కథలో అది పోయే విన్యాసాలూ, ఎంతమాత్రమూ తలతిప్పకుండా ఎన్ని డిగ్రీలైనా చూడగల కళలూగల నల్లమేక నాకు గుర్తొస్తూ వుంటుంది. చాలా రోజులకి ఆ కథ ఎలా రాసేరో చదివేను.
రెండు విరసాల్లోనూ శాస్త్రిగారు ఒకప్పుడు మెంబరే. ఒకదానికి కొంతకాలం ఉపాధ్యక్షులు కూడా. ఒక విరసంలో (విశాఖ రచయితల సంఘం) నేనెక్కడో చదివిన, బహుశా 1963లో నేలమీద కూర్చుని నెమ్మదిగా ‘నేనెందుకు రాశాను’ అన్న విషయం చర్చిస్తూ కన్పిస్తారు నా ఊహల విభావరిలో. ఆ విరసం వారే టాపిక్కిచ్చి తమ సభ్యులచేత కథలు రాయిస్తే, ఈయన రాసిన కథ ‘కలకంఠి’ అయింది.
తొలి రోజుల్లో నిరీశ్వర వాదే. కాని కాదు. జాతకాలిష్టమే. కాని ‘జాతకకథ’ రాసేరు. జాతకాలు చూపించుకోవడం సరదా, నమ్మినా నమ్మకపోయినా. బ్రాహ్మణకుటుంబాల్లో పుట్టి పెరిగిన వారెవరికి ఆ సరదా వుండదు? ఒక ఇంటర్వ్యూలో, “ఇది మూఢనమ్మకం అనుకునేటట్లయితే, పోనీ ఆ మూఢనమ్మకం నాకు వుందనే అనుకోండి” అనేశారు.
“కాస్ట్ ఫీలింగ్ లేదు. కాని సబ్‌కాస్ట్ ఫీలింగ్ వుంది” అన్నారట. ఎక్కడో, ఎప్పుడో, ఎందుకో తెలీదు. నాకీ వాక్యం మళ్ళీమళ్ళీ గుర్తొస్తూవుంటుంది. ముఖ్యంగా మా కాస్ట్ వాళ్ళ కొందరి వ్యవహారాలూ, వర్తనలూ విన్నప్పుడూ, చూస్తున్నప్పుడూ.
“ఒక సకలాతీతశక్తి ఉన్నట్టా, లేనట్టా?” ఈ ప్రశ్న ప్రతీ చింతనాశీలీ ఏదో ఒకరోజున తనలోతనే ఎదుర్కొంటాడు. అందుకే బహుశా, “ఇలా ఎగ్నాస్టుగా (ఎగ్నాస్టిగ్గా) మిగిలేను” అన్నారు.
మరో విరసానికి (విప్లవ రచయితల సంఘానికి) సెలవన్నారు, తన వ్యక్తిగత బలహీనతల వలన ఏ సంస్థ ప్రతిష్ఠకీ భంగం కలగరాదనే వుద్దేశ్యంతో. ఈ రకమైన నిబద్ధత, సిన్సియారిటీ, ఆనెస్టీ రచనల్లోనూ, జీవితంలోనూ కన్పిస్తుంది.
తన రచనలను ఎంతోమంది మిత్రులకి ఎంతప్రేమతో ఇచ్చారో అంకితం అన్పిస్తుంది. కొందరు మిత్రులని, బహుశా అందరినీ, అంతే ప్రేమగా గుర్తుంచుకోవడం, గుర్తుచేసుకోవడం, కన్పిస్తుంది. శ్రీరంగం రాజేశ్వరరావు కథల పుస్తకానికి రాసిన ముందుమాటలో ఉటంకించిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
‘ఆయన రచనలు సగంలో వదిలేస్తా’రనే విషయం మళ్ళీమళ్ళీ విన్నప్పుడల్లా నాకన్పిస్తూవుంటుంది- రచనలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. కొంతసేపే. కొంత వరకే. జీవితం అనంతం. రచన అసంపూర్ణం. అందుకే ఏ రచనా పూర్తిచెయ్యడం సాధ్యం కాదేమో. అందుకేనేమో ఆయన రచనలు అసంపూర్ణంగా వదిలేశారేమో అని. ఆ రచనలింకా జరుగుతున్న కథలే అన్పిస్తుంది నాకైతే.
శాస్త్రిగారి సినిమా సరదాలు
నాటకాలు రాసి నటించిన రచయితకి సినిమాలన్నా సినిమా రచన అన్నా సరదా వుండడం సహజం. ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు. ఆయనకి చిన్నప్పుడు మాస్టర్ విఠల్ అనే నటుడంటే ఇష్టమని ఎక్కడో చదివేను. తొలినాటి డైరీల్లో చూసిన సినిమాల లిస్టులున్నాయి. స్త్రీ అనే సినిమాకి సంభాషణలు కూడా రాసేరు. రాజా ఔర్ రంక్ అనే హిందీ సినిమాకి స్క్రీన్‌ప్లే కూడా రాసేరు, ప్రత్యగాత్మతో కలిసి. ఈ సినిమా మార్క్‌ట్వైన్ The Prince and the Pauper మీద ఆధారితం. చెఖోవ్ కథ ఆధారంగా రాసిన ఓ సినిమా కథ/ స్క్రీన్‌ప్లే కూడా వుంది. శంకరాభరణం సినిమా మీద ఆయన రాసిన రివ్యూ చదివితే ఎక్కడ ఏ సీను ఎలా తియ్యవలసిందో, తియ్యకూడదో, శంకరశాస్త్రి జె.వి. సోమయాజులుగారి నటనా సామర్ధ్యం ఎలా కొన్నిచోట్ల వాడబడలేదో, సంగీతాన్ని కొన్నిచోట్ల ఎలా సరిగా వినియోగించుకోలేదో తెలుస్తుంది. కథ చెప్పేటప్పుడు కావలసిన వాతావరణ చిత్రణ స్క్రీన్‌ప్లేని పోలినట్టు చాలా కథల్లో అన్పిస్తుంది.
విశాఖపట్నంలో ఓ రోజు జే.పీ.కి (జయంతి ప్రకాశశర్మ) ఫోన్ చేసి చెప్పేరట భమిడిపాటి జగన్నాథరావుగారు “సాయంత్రం ఆఫీసయిన వెంటనే తిన్నగా స్కూటర్ మీద మా ఇంటికి రండి,” అని. అక్కడికి వెళ్ళి చూస్తే అందరు మహానుభావులూ అక్కడే వున్నారట–శాస్త్రిగారు, భమిడిపాటి జగన్నాథరావుగారు, భరాగోగారు, అత్తలూరివారూ. కొందరు మితంగానూ, కొందరు అమితంగానూ… మోతాదులోనూ ఇలా సేవించిన ఈ గేదరింగ్‌లో శాస్త్రిగారు చాలా శ్రావ్యంగా పాడేరన్నాడు జే.పీ. జమునారాణి పాడిన ‘హైలో హైలెస్సా హంసకదా నా పడవ’ అన్న భీష్మ (1962) సినిమా లోని పాట (ఆరుద్రగారిదే!) రాత్రి 11 గంటలదాకా సాగిన రంగులహంగుల మాటలమూటల రివర్బరేషన్లలో నీతులూ, బూతులూ రంగరించే వున్నాయి. ఆ బూతులేమిటో, నీతులేమిటో జేపీ చెప్పలేదు గాని, శాస్త్రిగారు పాడిన పాట మాత్రం చాలా బాగుందని మరీమరీ చెప్పాడు.
అయ్యో నేనక్కడ లేనే అన్పించింది.
శాస్త్రిగారికి సంగీతం, పాటలూ చాలా ఇష్టం, ముఖ్యంగా జానపదగీతాలూ, లలిత సంగీతం లాంటి సెమిక్లాసికల్స్. నవలకంటే కథకంటే పాట చాలా పదునైనది అన్నారు. కాని చాలా బతిమాలించుకుని మరీ ప్రైవేటు గేదరింగ్సులో పాడతారు. చాలాబాగా పాడతారు అన్నారు అబ్బూరి ఛాయాదేవిగారు. ఎవరైనా ఎదురుగా పొగిడితే చాలా సిగ్గుపడిపోతారన్నారు ఆవిడ.
పైన చెప్పిన లాటిదే మరో సంఘటన. ఈసారి రంగం హైదరాబాదు. అబ్బూరివారి ఇల్లు. ఈ వరదరాజేశ్వరరావుగారు, శాస్త్రిగారికి ఏడోక్లాసునుంచీ మిత్రుడు. ఆదిగురువు. చిన్నప్పుడు చిన్నసైజు హీరో. తరువాతకూడా కొంతలోకొంత హీరోనే. శాస్త్రిగారు హైదరాబాదు ఏ పనిమీద వెళ్ళినా, ఎక్కడ దిగినా వుండేది వీళ్ళింట్లోనే. విశాఖపట్నం నుంచి వెళితే జీడిపప్పు తీసుకు వెళ్తారట. వెనక్కి విశాఖకి మిఠాయిల్తో వెళ్తారట. ఒకసారి అలా వెళ్ళినపుడు అక్కడ ఆరుద్రగారు కూడా వున్నారట. ఛాయాదేవిగారు వీళ్ళకి పెసరట్లు చేసిపెట్టారట. ఈ ముగ్గురు విశాఖపట్నంవాళ్ళకీ వాళ్ళు చిన్నప్పుడు సెట్టివీధిలో తిన్న ఉల్లి చట్నీ కావాలనిపించిందిట, ఆ పెసరట్లతోపాటు తినడానికి. పాపం ఛాయాదేవిగారు ప్రయత్నించారు గాని, ఆవిడ చేసిన ఉల్లిచట్నీ పాకం, సెట్టివీధిలోని ఉల్లిచట్నీలా రాలేదు. అలా సాగలేదు, ఈ విశాఖీయులకి కావలసినట్టు. అప్పుడు ఆరుద్రగారు తన పాకశాస్త్రపరిజ్ఞానాన్నీ ప్రావీణ్యాన్నీ ప్రయోగించి ఛాయాదేవిగారికి సలహాలేవో ఇచ్చారుట. అప్పుడు కొంచెం పాకం కుదిరిందట. ‘అట్టు అట్టు పెసరట్టూ, ఉల్లిపాయ పెసరట్టూ, ఉప్మాతోటీ కలేసికొట్టు’ అన్నట్తుగా వీళ్ళు పెసరట్లూ, ఉల్లిచట్నీ ఆరగించేరట.
శాస్త్రిగారికి ఆరుద్రగారంటే అలర్జీ అంటారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు. ఆశ్చర్యపోయేను. తప్పులైతే అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేస్తారనో, చేయగలరనో అన్న శాస్త్రిగారు, వ్యక్తిగత ప్రిజుడిస్‌ని అధిగమించలేని వారి మీద ‘గుంటూరు’ లాంటి కథలు రాసిన శాస్త్రిగారు! నమ్మలేకపోయాను. అయితే చూడగా, చూడగా, చదవగా, చదవగా, అనిపించేదేమిటంటే శ్రీశ్రీ గారిమీదవున్న అంతులేని అభిమానం, ఆరుద్రగారిమీద అలర్జీగా పరిణమించిందేమో అని.
ఒకసారెప్పుడో రాసేను: మహానుభావులు కూడా మామూలు మనుషులేనా?! అని. రచయితా- మనిషీ అన్నిసార్లూ ఒకేస్థాయిలో వుండరు. కొన్నిసార్లు మహానుభావుడూ, మహారచయితా ఔతాడు, ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యసృష్టి సమయంలో. చాలాసార్లు మామూలు మనిషౌతాడు, ముఖ్యంగా రియాక్షనరీ ఉత్త ఉత్తరాలు విసిరే సమయంలో. రంగూ, రుచీ, వాసనాగల పరిసరాల్లో జరిగే విషయాలకి అస్సలు స్పందించనివాడు, రచయిత, మహారచయిత కాలేడు. ఆయా స్పందనలలో అప్పుడప్పుడూ కొంతలోకొంత రాగద్వేషాలు ఒలకడం సజీవుడైన మానవుడి లక్షణాన్ని మాత్రమే తెలియజేస్తుంది గానీ మరేమీ కాదు.
శాస్త్రిగారు చాలా ఉత్తరాలే రాసేరు. ఒక ఉత్తరంపై నా అభిప్రాయం మాత్రం రాస్తాను.
1983 జూన్ 15న శ్రీశ్రీగారు మరణించిన తరువాత, ఆరుద్రగారు ఒక వ్యాసం రాసేరు ఆంధ్రజ్యోతిలో. దాని పేరు ‘పెద బాబాయ్-చిన బాబాయ్.’ ఈ వ్యాసంలో పెదబాబాయ్‌ని శ్రీశ్రీగా భావించిన శాస్త్రిగారికి ఆ వ్యాసంలో వారియెడల నిందాస్తుతి వున్నట్టుగా తోచింది. ఆ వ్యాసంలో తనే మరిచిపోయిన తన కార్మిక చినబాబాయి గురించి ఆరుద్రగారు, ఆయన గొప్పవారని, మంచివారనీ అన్నట్టుగ్గానూ శాస్త్రిగారికి తోచింది. చినబాబాయిగారి పట్ల శాస్త్రిగారికేమీ తక్కువ అభిప్రాయం లేదు. వారితో పోల్చి పెదబాబాయిని కించపరిచినట్లు భావించి, ఆవేశించి, కోపించారు శాస్త్రిగారు. ఆశ్చర్యకరంగా ఈ వ్యాసం చదివినప్పుడు నాకు వేరేగా తోచింది. పెదబాబాయి, చినబాబాయి వేరువేరు కాదనీ, ఒకరేననీ. వారికి ఒకరే బాబాయి అని నాకన్పించింది. శ్రీశ్రీలో ఒక ‘శ్రీ’ పెదబాబాయి అయితే, మరో ‘శ్రీ’ చినబాబాయి అనుకున్నాను. ఆయన వర్ణించిన ఆ రెండు లక్షణాలూ ఈ వెళిపోయిన బాబాయిలోనే వున్నట్టుగా అన్పించి, అది ఒక అద్భుతమైన నివాళిగా తోచింది.
శ్రీశ్రీలోనే కాదు, శాస్త్రిగారిలోనే కాదు, మహానుభావులైన ఎవరిలోనైనా తరచి చూస్తే పరస్పర విరుద్ధమైన వైరుధ్యాలు కన్పిస్తాయి. కాని ఈ వైరుధ్యాలు వారిస్థాయిని గాని, గొప్పదనాన్నిగాని ఏమాత్రం తగ్గించలేవు అని నా అభిప్రాయం. ఆరుద్రగారు దుఃఖంతోనే రాశారు గాని ఏమాత్రం ఎవర్నీ కించబరచలేదనే నా కనిపించింది. ఇంత సబ్జెక్టివ్ డిఫెన్సా అని ఆశ్చర్యపోయాను.
ఒక రిక్షారాముడి కథ
కండి అప్పన్న అనే రిక్షామనిషి గురించీ, అతను ‘మాటల చిత్రంగా’ చెప్పిన విషయాన్నీ శాస్త్రిగారు వాళ్ళింట్లో చెబితే, వాళ్ళ అమ్మాయి, “చదువులేని రిక్షామనిషి అంత చక్కగా ఎలా చెప్పగలిగేడు నాన్నా?” అని అడిగిందట.
చప్పున ఆయనకి ధూర్జటి ‘కాళహస్తీశ్వర శతకం’లోని ‘ఏ వేదంబు పఠించె లూత భుజగంబే శాస్త్రముల్చూచె, దానే విద్యాభ్యసనంబొనర్చె గరి, చెంచేమంత్ర మూహించె… స్ఫురించిందట. ఏవి చదువులో, ఏవి కావో తెలిసినవాడూ మామూలు సాదాసీదా మనిషీ కాడు. మహానుభావుడు. పైగా శాస్త్రిగారు. మన వ్యర్ధమైన చదువుల సారం, మర్మం తెలిసినవారూ, అదే విషయాన్ని అనేకసార్లు చెప్పిన వారూనూ. అందుకే, “చదువుకున్న వాళ్ళకి పుస్తకాలుంటాయి. చదువులేనివాళ్ళు చదవాలంటే వారికి జీవితం తప్ప ఏదీ వుండదు. దానిని వాళ్ళు చదువుకోకపోతే వారికి దినం వెళ్ళదు. బతుకు బరువు మోసే మనుషుల మాటలకి పదునెక్కువ వుంటుందనుకుంటాను,”అన్నారట.
తను చదివిన చదువూ, తనకి కలిగిన జ్ఞానం వల్లే రాసేనన్నారు శాస్త్రిగారు.
అది ఎటువంటి చదువు! ఎంత విజ్ఞానం! కథలు రాయాలనే తీవ్రమైన కోరికతో, రాయలేనేమో అనే అనుమానంతో ఎలా రాయాలో చెప్పేవారెవరూ కనబడక చదువుతూ చదువుతూ పోగా, దానికి తోడుగా తను వృత్తిపరంగా చూసిన సమస్యల్ని, దొరికిన పాటక జ్ఞానాన్నీ కూడా కలిసి చదవగా జనించిన జ్ఞానం.
ఎవరు, ఏది వీరికి ప్రేరణ? డేవిడ్ కాపర్ ఫీల్డుతో మొదలుపెట్టి చదివిన డికెన్సూ, ఎవరో తెలియకుండా చదివిన చెఖోవ్, అభిప్రాయాల అంగీకారం లేకపోయినా చదివిన ‘సాక్షి’ పానుగంటివారి శైలీ విన్యాసం, ఆరాధ్యనీయులు గురజాడా, శ్రీశ్రీలూ.
వీరే కాకుండా మరో రెండు ఆశ్చర్యకరమైన ఇన్‌స్పిరేషన్లు! తన తొమ్మిదవ ఏట 1931లో నవంబరు నెలలో ‘గృహలక్ష్మి’లో ఒక కథ చదివేరు. ఎవరు రాశారో గుర్తులేకపోయినా ఏమి రాశారో గుర్తుంది. ‘ఆ గదిలోనే’ అనే ఆ కథ ఆయన్ని ఎంతో ఉత్తేజపరిచింది. వెంటాడింది. దానివలనే తాను ‘వెన్నెల’ రాసేనన్నారు. ఒక సందర్భంలో అయితే తన మొత్తం సాహిత్యాన్ని ఆ కథ ప్రభావితం చేసిందన్నారు. ఆ కథకోసం, రచయిత్రి కోసం, ఎందరో మిత్రులని ఆశ్రయించారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మగారూ, ‘స్వాతి’ బలరామ్‌గారూ, చలసాని ప్రసాద్‌గారూ కూడా సాధించలేకపోయారు. చివరకి అత్తలూరు నరసింహారావుగారు అత్యంతప్రయత్నంతో, మలయవాసినిగారి సహాయంతో, ముద్దా విశ్వనాథంగారి కృషితో శోధించి సాధించారు. ఆ రచయిత్రి–ఆ కథరాసిన సమయంలో పదహారేళ్ళ – యు. సత్యబాలాసుశీలాదేవిగారు.
కొంతకాలం కథలురాసి సుమారు ఎనిమిదేళ్ళు ఏమీ రాయకుండా ఉండిపోయారట 1941-1949 మధ్య. ఆ తరువాత, బహుశా 1949లో, పాల్ డి క్రైజ్ రాసిన, The Microbe Hunters అనే 1926 American Best Seller చదివి ఇన్‌స్పయిరై మళ్ళీ తెలుగులో రాయడం మొదలుపెట్టాను అన్నారు. ఆ పుస్తకం – The classic book on the major discoveries of the microscopic world! అది ఈరోజు కూడా బెస్ట్ సెల్లరే! ఈ విషయం ఆయన పుస్తక పఠనంలోని ‘రేంజ్’ని తెలియజేస్తుంది. పైగా ఒక సృజనాత్మక మస్తిష్కం ఎలా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది. ఏది ఎప్పుడు ఎలా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందో ఎవరూ చెప్పలేరనీ తెలుస్తుంది.
ఆయన మళ్ళీ మళ్ళీ, తిరిగి తిరిగి, తను ఫెయిల్డ్ పొయెట్‌ననీ, తనకి తెలుగు రాదనీ చాలాసార్లు చెప్పుకున్నారు. కాని ఎంతో సజీవమైన తెలుగు రాసేరు! వచన కవిత్వం అంటే ఇష్టంలేని ఆయన తన వచన రచనలనిండా ఎంత కవిత్వం నింపేరు! ఆయనకి తెలుగు భాషన్నా, తెలుగు పద్యమన్నా చాలా మక్కువ. తను ఆరాధించే కవుల, పండితుల స్థాయిలో రాయలేనేమో అన్న వుద్దేశ్యంతో తనని తాను ఫెయిల్డ్ పొయెట్ అన్నారా? ఆయన గోల్డ్ స్టాండర్డ్, ఆయన ఇష్ట శతకం – కాళహస్తీశ్వర శతకభాష, పద్యాలూనా?
బహుముఖప్రజ్ఞాశాలి అయిన శాస్త్రిగారు తన బహుముఖీయతని పబ్లిక్ డిస్‌ప్లేకి ఇష్టపడరని తెలుస్తుంది. ఒకప్పటి నా ప్రియస్నేహితుడూ, శాస్త్రిగారి అతిగొప్ప అభిమానీ, కె.ఎన్.వై. పతంజలి, ‘మహాకవి విశ్వనాథశాస్త్రి’ అన్నాడు. ‘వంద వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్‌లు కలిసినా ఒక రాజు-మహిషి కాలేదు,’ అన్నాడు. ‘పదిమంది గాబ్రియల్ మార్క్వెజ్‌లు ఒక రాచకొండ విశ్వనాథశాస్త్రికి సమం కాలేరు,’ అన్నాడు. ఎంతోమంది సాహిత్యవేత్తల దగ్గరికి నన్ను చెయ్యిపట్టుకు తీసుకువెళ్ళిన పతంజలి, మహాకవి శాస్త్రిగారి దగ్గరకు మాత్రం తీసుకువెళ్ళలేదు. అదికూడా ఒక కారణమా ఆయన నాకు తెలీకపోడానికి?!
శాస్త్రిగారితో నా సంభాషణ… ఊహాజనితమే…
‘రాచకొండ విశ్వనాథశాస్త్రి కథల’కి అవార్డు తీసుకున్నారు. తరువాత పరిణతి చెంది ‘రత్తాలు-రాంబాబు’కి వద్దనేవారు అన్నారు. ఈ పరిణతి ప్రమోటర్లతో నేనంగీకరించను. మీరు తీసుకుని వుండవలసింది. ఎందరో సంశయాత్మలకి దారి చూపినవారై వుండేవారు. అంత నిబద్ధతా, అలోభమూ మీకే సాధ్యము. వ్యక్తి విశ్వాసాలు ఎలాంటివయినా, ఒక వ్యక్తి ప్రజలను (సామూహిక) చైతన్యవంతులుగా చెయ్యగలడు అన్న నిశ్చిత అభిప్రాయం ఉన్నవారేగా మీరు!
నా అసంతృప్తి.
మీ జ్ఞానం ఎవరిది? ప్రజలది.
మీ ధనం ఎవరిది? ప్రజలది.
మీ ఆరోగ్యం, ప్రాణాలూ ఎవరివి? ఎందరివో!
వాటిని తృణప్రాయంగా త్యజించే అధికారం మీకెవరిచ్చారు?
ఫుల్లుమూను లైటటా
జాసమిన్ను వైటటా
మూనుకన్న
మొల్లకన్న
నీదు మోము బ్రైటటా
టా! టా! టా!
మీ ఈ ‘జాస్మిన్’ అక్కడిదేనా?
ఎంత తెలిసినా ఇంకా తెలియకుండా మిగిలే ఉంటారు. మీ గురించి ఏమీ తెలియదనిపిస్తూవుంటారు. అందుకే నా ఈ ‘అన్‌జానా’?
తెలిసినా, తెలియకపోయినా సదా గుబాళించే సౌరభమే మీరు.