విశ్వ మహిళా నవల: 4. షార్లట్ లెనక్స్

అధిక్షేపనవల రాసిన తొలి మహిళ

తెలుగు సాహిత్యంలో స్త్రీల నవలలకు 1960వ దశకం ఎలాంటిదో, యూరోపియన్ సాహిత్యంలో (మరీ ముఖ్యంగా బ్రిటిష్ సాహిత్యంలో) 18వ శతాబ్దం అలాంటిది. నవల స్త్రీల సాహిత్యప్రక్రియగా స్థిరపడిన యుగం అది. స్త్రీలు పుంఖానుపుంఖాలుగా రచనలు చేశారు. ఆ నవలలన్నీ గొప్పవి కాకపోవచ్చు; ఆ రచయిత్రులందరూ గొప్ప ప్రతిభావంతులూ కాకపోవచ్చు. కానీ స్త్రీలు ప్రధానంగా నవలారచనలు చేసిన శతాబ్ది అది. వీరిలో ఫానీ బర్నీ, మేరీ వోల్‌స్టన్‌క్రాఫ్ట్, మదామ్ డి స్టాల్ (ఫ్రెంచ్), సోఫియా లా రూష్ (జర్మన్) వంటి మంచి రచయిత్రులు ఉన్నారు (ఈ రచయిత్రుల గురించి తర్వాతి వ్యాసాల్లో విపులంగా). వీరంత గొప్పగా కాకున్నా, తమ ఉనికిని నిరూపించుకున్న రచయిత్రులు చాలా మందే ఉన్నారు. అందుకే ది రైజ్ ఆఫ్ ది నావల్ వంటి ప్రశస్తమైన, ప్రామాణికమైన నవలాచరిత్ర రాసిన ఇయన్ వాట్ (Ian Watt) ’18వ శతాబ్దిలో వచ్చిన ఇంగ్లీషు నవలల్లో అత్యధికం స్త్రీలవే’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు.

18వ శతాబ్దిలో బ్రిటిష్ నవలల్లోనే మైలురాళ్ళనదగ్గవి వచ్చాయి. నిజానికి 1719లో డేనియల్ డెఫో రాసిన రాబిన్సన్ క్రూసోనే తొలి నవల అనుకున్న రోజులూ ఉండేవి. అది కాక శామ్యూల్ రిచర్డ్‌సన్ రాసిన సూపర్ హిట్ నవలలు క్లరీసా, పామేలా కూడా అప్పుడే వచ్చాయి. లేఖారూపంలో ప్రపంచంలోనే తొలి నవలలు ఇవి. స్త్రీలు ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ నవలలు సంచలనం సృష్టించాయి. ఇవి కాక, హెన్రీ ఫీల్డింగ్ రాసిన టామ్ జోన్స్, లారెన్స్ స్టెర్న్ రాసిన ట్రిస్ట్రమ్ షాండీ, జోనథన్ స్విఫ్ట్ రాసిన గలివర్స్ ట్రావెల్స్, ఆలివర్ గోల్డ్‌స్మిత్ ది వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్, నేటికీ క్లాసిక్స్‌గా పరిగణింపబడే నవలలు. ఇవన్నీ 18వ శతాబ్దిలో వివిధ దశకాల్లో వచ్చినవే. అయితే ఇన్ని క్లాసిక్స్ మధ్య స్త్రీల నవలలు ఎలా ఉన్నాయి? వాటిని ఎవరు చదివారు? అవి ఎంతకాలం పాఠకులకు గుర్తున్నాయి? అంటే అంత సంతృప్తికరమైన సమాధానం రాదు. ఫానీ బర్నీ రచయిత్రుల్లో మకుటం లేని మహారాణిలా నిలబడుతుంది. ఆ తర్వాత మేరీ వోల్‌స్టన్‌క్రాఫ్ట్. కానీ తక్కినవాళ్ళెవ్వరూ అంత గౌరవాన్ని పొందలేదు. ఎందుకు?

ఎక్కువ మంది స్త్రీలు రాసినవి రొమాన్సులు, సెంటిమెంటల్ నవలలు. 17వ శతాబ్దిలో ఆఫ్రా బెన్ రాసిన రొమాన్సుల్లో కూడ ప్రత్యేకత, విలక్షణత్వం ఉండేవి. కానీ 18వ శతాబ్ది వచ్చేసరికి వాటి స్థాయి దిగజారింది. ప్రేమ కోసం వాచిపోయిన స్త్రీలు, అనవసరమైన సెంటిమెంట్లతో జీవితాలు దుఃఖభరితం చేసుకున్న స్త్రీలు కథానాయికలయ్యారు. రచనావిధానంలో నాణ్యత లోపించింది. అన్ని కథల్లోనూ అమాయకులు, అబలలు, అందగత్తెలు, ఎక్కువగా ఏడుస్తుండే హీరోయిన్లు. వారి కష్టాలు కడగండ్లు ఒక కొలిక్కి వచ్చి, ఎవడో ఒకడు భర్త అయ్యేవరకూ అటు రచయిత్రులకు, ఇటు పాఠకులకూ కూడ మోక్షం లేదు. అన్ని నవలల్లోనూ ఒక నీతి ఉండాలి. ఆడపిల్లలకు ఎలా ప్రవర్తించాలో చెప్పే ఉద్బోధ ఉండాలి. ఆ రచయిత్రులందరూ అలాగే రాయాలనుకున్నారో లేదో తెలీదు. కానీ అలా రాస్తేనే ప్రచురింపబడేవి. మగవిమర్శకుల మెప్పు పొందేవి. ఎందుకంటే అప్పుడు విమర్శకులందరూ పురుషులే. స్త్రీలు ఎలా రాయాలో చక్కగా తెలిసిన పురుషులు. వారి ఉద్దేశంలో స్త్రీలు తమ నవలల్లో తమ పేరు ప్రముఖంగా ప్రచురించుకుంటే తప్పు. అంతకంటే విచిత్రం, పొరబాటున స్త్రీలు సభల్లోనూ పార్టీలోనూ తమ నవలలను ప్రస్తావించారా వారి కొంప కొల్లేరే. అంటే, ఆడవాళ్ళు ఏదో గ్రహపాటున రాసినా వాటి గురించి బహిరంగంగా చెప్పుకోవడం, చర్చించడం, ప్రశంసలు ఆశించడం, పొందడం అన్నీ ‘అశ్లీలాలు’. అలా మాట్లాడే రచయిత్రులను బహిష్కరించేవారు. అయినా తమకు రాసే అవకాశం లభిస్తున్నంత మాత్రానికే ఆనందించిన ఆ రచయిత్రులు తమ సృజనాత్మకతకు ఉన్న పరిధిలోనే, పరిమితులకు లొంగే, పదను పెట్టారు. పత్రికలు కూడా స్త్రీల రచనల్ని ప్రోత్సహించేవి (1960-70లలో తెలుగులోలా). ఎలా రాస్తే బాగుంటుందో పత్రికా సంపాదకులు సూచించిన సందర్భాలు కూడ ఉండేవి. ఎందుకంటే అప్పటి పాఠకుల్లో అధిక శాతం మహిళలు. ‘చదివేవారూ రాసేవారూ మహిళలే అయినా, వారిని నియంత్రించినవారు మగ పత్రికా సంపాదకులు, మగ విమర్శకులు’ అంటుంది మెకార్తీ ది ఫిమేల్ పెన్ అనే గ్రంథంలో. ఇలాంటి వాతావరణంలోనూ తమ ప్రత్యేకతను నిరూపించుకోవడమే కాక, మగరచయితల అభిమానాన్ని, గౌరవాన్నీ చూరగొన్న రచయిత్రి షార్లట్ లెనక్స్ (Charlotte Ramsay Lennox). ఎందుకంటే ఆమె కూడ తొలుత పైన చెప్పిన రొమాన్సే రాసినా, తన రెండో నవలతో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తం ఐదు నవలలు రాసిన ఆమె ది ఫిమేల్ కిహోటె నవల వల్ల సాహిత్యచరిత్రలో నిలిచిపోయింది.

రొమాంటిక్ భావనల ఊబిలో కూరుకుపోతున్న స్త్రీలను ఆటపట్టించడానికో, ఆ బలహీనతను ఎత్తి చూపడానికో అన్నట్టు ఒక అధిక్షేప నవల రాసింది షార్లట్ లెనక్స్. 1605లో సంచలనం సృష్టించిన స్పానిష్ నవల డాన్ కిహోటెని (Don Quixote) అనుకరిస్తూ తన నవలకు ది ఫిమేల్ కిహోటె అని పేరు పెట్టింది. అధిక్షేప నవల రాసిన తొలి బ్రిటిష్ రచయిత్రి లెనక్స్.

17వ శతాబ్ది చివరి దశాబ్దాల లక్షణాల్లో హిరోయిక్ రొమాన్స్ ప్రక్రియ ముఖ్యమైందని ఇంతకు పూర్వమే చెప్పాను. వాటిలోని ‘సద్గుణా’లను వేళాకోళం చేయడమే ఈ నవల చేసిన పని. హిరోయిక్ రొమాన్స్ లక్షణాల్లో కొన్ని: ఆడపిల్లలు అబలలు. గొప్ప అందగత్తెలు. వాళ్ళకు పరాక్రమవంతుడైన నాయకుడు తటస్థిస్తాడు. అయితే వాళ్ళిద్దరూ ప్రేమించుకునేలోగా అనేకరూపాల్లో విలన్లు ప్రత్యక్షమౌతారు. అదేమిటో నాయికలను చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళను ఎత్తుకుపోవాలని, పెళ్ళి చేసుకోవాలనీ చూస్తారు. మారువేషాల్లో, బంధువుల్లో, మేకవన్నె పులులుగా, అన్ని రూపాల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ నుంచి తప్పించుకోడానికి ఈ అబలలు నానా యాతనా పడతారు. ఇంట్లోంచి పారిపోయి ఆగంతకుల నుంచి మానభంగాలు, హత్యలు, అపహరణలు తప్పించుకుంటారు. ఎట్టకేలకు ఎక్కడినుంచో ఆ పరాక్రమవంతుడైన నాయకుడు ప్రత్యక్షమై, నాయికను శాశ్వతంగా రక్షిస్తాడు. మధ్యలో అపార్థాలు గట్రా వచ్చినా చివరికి సాహసంతో నాయకుడు ఆమెను గెలుచుకుంటాడు.

మిగేల్ దె సెర్బాన్తెస్ (Miguel de Cervantes) రాసిన డాన్ కిహోటె ప్రపంచంలోనే తొలి నవలగా కీర్తిని పొందడానికి కారణం అది నవలాలక్షణాలతో ఉండడమే కాదు; అందులోని సందేశం కూడా. జీవితాన్ని, సమాజాన్ని సవిమర్శకంగా చూసి, విశ్లేషించిన తొలి వచన రచన అది. వ్యక్తిగత జీవితంలో వర్ణించలేనన్ని కష్టాలుపడిన సెర్బాన్తెస్, అలాటి కష్టాల్లో భాగంగా జైల్లో ఉన్నప్పుడే నవలారచన ప్రారంభించాడు. ఎన్నో నవలలు రాసి ప్రజల మెప్పు కూడ పొందాడు. కానీ ఆయన రాసిన డాన్ కిహోటెకు సాటిరాగల నవల ఆయన నవలల్లోనే కాదు. అసలు స్పానిష్ భాషలోనే లేదని విమర్శకుల అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే ఒక్క స్పానిష్ అనే కాదు. ప్రపంచ సాహిత్యంలోనే ఇది అత్యుత్తమమైన నవలగా భావించేవారు చాలామందే ఉన్నారు. తన దేశంలో గతించిపోయిన వైభవాన్ని పునరుద్దరించాలన్న కోరికతో, సాహసవీరుల అద్భుతలీలలను, పరాక్రమాన్ని మళ్ళీ సమాజానికి గుర్తుచెయ్యాలని కంకణం కట్టుకున్న అలోన్సో కిహానో అనే ఒక మధ్యతరగతి మధ్యవయస్కుడి కథ ఇది. ఈ క్రమంలో అతను తనని తాను గతించిన వీరుల గాథల్లోని యోధుడిగా ఊహించుకుంటాడు. ఆ యోధుడే తనగా జన్మనెత్తాడని త్రికరణశుద్ధిగా విశ్వసిస్తాడు. అతను చేసే ప్రతి ‘సాహసకృత్యం’లోనూ (స్త్రీలు, పిల్లల రక్షణ, అవినీతిపై పోరాటం వంటివి) విఫలమవుతూ, చివరికి తన ‘ఉన్మాదాన్ని’ వదులుకోవడంతో నవల ముగుస్తుంది. అతని అనుభవాల క్రమంలో, గతించిన వైభవం చిత్రించే కావ్యాల్లోని అబద్ధం, కనీవినీ ఎరగని వీరుల గాథలు, మానవాతీత వ్యక్తుల పరాక్రమాలు–వీటన్నిటినీ అపహాస్యం చేస్తుంది ఈ నవల. కానీ ఇది కేవలం అధిక్షేపనవల కాదు. అన్ని కాలాలకూ వర్తించే ఎన్నో జీవిత సత్యాలను మనముందుంచే అసాధారణమైన రచన. (ఈ నవలకు వేరే అర్థాలు, వ్యాఖ్యానాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతాంశం ఆ నవల కాదు కనక, వివరించడం లేదు.)

ఈ నవలను తను ప్రేరణగా తీసుకున్నట్టు లెనక్స్ చెప్పుకుంది. నిజానికి ఆ నవలలో ఉన్న గూఢార్థాలు, జీవిత తత్వం, భిన్నకోణాలలో సమాజచిత్రణ ఈ నవలలో లేవు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ నవల డాన్ కిహోటెను విజయవంతంగా అనుకరించిందని చెప్పవచ్చు. కలలు, అభూత కల్పనల లోకంలో జీవించే అమ్మాయి ప్రేమ విషయంలో ఎన్ని కప్పదాట్లు వేస్తుందో చెప్పడంతో పాటు, ఆమెను ఇహలోకంలోకి తీసుకురావడమనే ప్రక్రియను ఈ నవల హాస్యస్ఫోరకంగా చిత్రిస్తుంది.

ది ఫిమేల్ కిహోటె

కథానాయిక అరబెలాకు తల్లి బాల్యంలోనే చనిపోయింది. తండ్రి పెంచి పెద్ద చేస్తాడు. కూతుర్ని ‘దుష్ప్రభావాల’ నుంచి కాపాడ్డానికి ఏకాంతవాసంలో ఉంచుతాడు. ఆమెకు నెచ్చెలులు లేరు. ఉన్నదల్లా తండ్రి గ్రంథాలయంలోని ఫ్రెంచి రొమాన్సుల నేలబారు ఇంగ్లీషు అనువాదాలే. వాటిలోని అసహజమైన ప్రణయగాథలే ఆమె ప్రపంచం. వాస్తవ జీవితంతో, వాస్తవ వ్యక్తులతో, సమకాలీన సమాజంతో ఆమెకు సంబంధం లేదు. కానీ తండ్రి మరణంతో వాస్తవ జీవితంలోకి అడుగుపెట్టాల్సివస్తుంది. అక్కడినుంచి, ప్రణయనవలల లోకానికీ యథార్థలోకానికీ పొంతన కుదరని ఆమె జీవితం ప్రారంభమవుతుంది. మొదటి సన్నివేశంలోనే హేర్వే అనే యువకుడు ఆమెను చూసి ఆకర్షితుడు కావడం, అతను ప్రేమలేఖ ఇస్తే దాన్ని తిరస్కరించాలని, అతను ఇచ్చే లంచాలకూ, బహుమతులకూ లొంగకూడదనీ తన సఖి లూసీకి చెప్పడం జరుగుతాయి. ఆమె ఊహించినట్టే అతను ఉత్తరం ఇస్తాడు కాని, ఆమె చదవకుండా వెనక్కి ఇచ్చేస్తుంది (తను చదివిన రొమాన్సుల్లో నాయికలా). దానికతను బోలెడు బాధపడి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడనుకుంటుంది. కానీ తిరిగి వచ్చిన లేఖను చూసి అతను పగలబడి నవ్వాడని లూసీ చెప్పినపుడు ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత అతను తలనొప్పితో విశ్రాంతి తీసుకుంటున్నాడని విని, తన తిరస్కారం భరించలేక మరణశయ్యపై ఉన్నాడనుకుని, తను అంత నిర్దయురాలిని కానని, పైగా తన అనుమతి లేకుండా అతనికి మరణం రాదనీ ఉత్తరం రాస్తుంది. ఈమె గోల భరించలేక అతను వెళ్ళిపోతాడు.

తండ్రి మరణించేముందు తన మేనల్లుడు లార్డ్ గ్లాన్‌విల్‌తో అరబెలాకు వివాహం నిశ్చయిస్తాడు. ఆ విషయం తెలియగానే అరబెలా దిగ్భ్రాంతి చెందుతుంది. అతనంటే ఇష్టం లేక కాదు. వివాహానికి వైముఖ్యమూ లేదు. కానీ అంత సుళువుగా ఒక కథానాయిక వివాహం చేసుకుని కలకాలం ఆనందంగా జీవించడమేమిటి? అపచారం! అపచారం! తను చదివిన రొమాన్సుల్లో అమ్మాయిలు ఎన్ని కష్టాలో పడ్డాక కదా తన ప్రేమ ఫలిస్తుంది? కథానాయకుడు వీరాధివీరుడిగా తన అన్వేషణలో సుదీర్ఘకాలం గడిపి, ఆ కాలంలో మరో అమ్మాయిని తలవనైనా తలవకుండా, ఎట్టకేలకు ప్రత్యర్థిని తన కరవాలానికి ఎరజేసి, ఆమెను గెలుచుకోవాలి. పైగా తను చదివిన ఏ కావ్యంలోనూ ఆడపిల్ల తండ్రి చూపించిన వ్యక్తిని పెళ్ళిచేసుకోదు. కానీ ఆ మేనబావ ఆమెను వదిలివెళ్ళే ఉద్దేశంలో ఉండడు. ఆమెకు దాసుడైపోతాడు. ఏం చేస్తే ఆమె సంతోషిస్తుందో అలాగే ప్రవర్తిస్తూంటాడు. ఏ పురుషుణ్ణీ తను ప్రేమించకూడదనే నియమం ఉన్నందువల్ల అతనిలో అన్నీ లోపాలే వెదుకుతూంటుంది. ఇంతలో తండ్రి జబ్బుచేసి చనిపోతాడు. అతని మరణం పట్ల ఆమె వ్యక్తంచేసే హావభావాల్లో నిజమెంత ఉందో కాని, అందరినీ హడలెత్తించే పుస్తకాల నాటకీయత చాలానే ఉంటుంది. ఆ తర్వాత గ్లాన్‌విల్, అతని తండ్రి ఛాల్స్ ఆమెను కొంతకాలం చూసుకోవడం, గ్లాన్‌విల్ చెల్లెలు కూడ రావడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ మన నాయిక భ్రమలు, ఊహలు కొనసాగుతూంటాయి.

తన తోటలో పనిచేసే ఎడ్వర్డ్ అపుడపుడూ తనకేసి ‘అదోలా’ చూస్తూంటాడనీ, అతను ఏదో రాజవంశానికి చెందిన వాడై ఉండి, తనని అపహరించడానికే తోటమాలిగా వచ్చాడనీ అనుమానిస్తుంది. ఈ మాటే తన సఖి లూసీతో చెప్తుంది. అతన్ని తప్పించుకోడానికి ఇద్దరూ రాత్రికిరాత్రి పారిపోతారు. దారిలో సొమ్మసిల్లి పడిపోయిన అరబెలాను రక్షించడానికి తన అన్నని పిలుచుకురావాలని వెళ్తుంది లూసీ. అన్నగారితో వచ్చేసరికి అరబెలా అక్కడ లేదు. చివరికి పాపం అమాయకుడైన ఆ ఎడ్వర్డ్ కూడా తనకోసం వెతుకుతూ రావడం చూసి అతన్ని నానామాటలూ అంటుంది. ఆమె అభియోగాల్లో ఒక్క ముక్కా అర్ధంకాని గ్లాన్‌విల్, ఎడ్వర్డ్ నిర్ఘాంతపోతారు. తనను అపహరించడానికి కుట్ర పన్నిన ఎడ్వర్డ్‌ని సంహరించాలని గ్లాన్‌విల్‌ని ఆదేశిస్తుంది అరబెల్లా. తన ప్రియురాలికి పిచ్చి ముదిరిందని అతనికి అర్ధమవుతుంది. నవలంతటా ప్రతి మగవాడూ తనని ప్రేమిస్తాడనీ, తనని ఎత్తుకుపోయి అనుభవించాలని చూస్తాడనీ ఆమె నమ్ముతుంది. ఆ రొమాంటిక్ లోకం నుంచి బయటకు రావడానికి ఇష్టపడదు. ఇంత తలతిక్కగా ప్రవర్తిస్తున్నా గ్లాన్‌విల్‌కు అరబెలాపై ప్రేమ తగ్గదు.

తనని అపహరించాలని చూసిన శత్రువు తలతెగ్గొట్టి తీసుకురమ్మని గ్లాన్‌విల్‌ని కోరినపుడు, గ్లాన్‌విల్‌ చెల్లెలు షార్లట్, ‘అలా హత్య చేస్తే మా అన్నకు శిక్ష పడదా? ఎంత నీకోసమైనా మా అన్నను అలాంటి శిక్షకు గురిచేయడం నీకు న్యాయమా?’ అని అడుగుతుంది. అప్పుడు అరబెలా చెప్పే సమాధానం ఇప్పటి భారతీయ సినిమాల నాయకులకు కూడ వర్తిస్తుంది.

I perceive, interrupted Arabella, what kind of apprehensions you have: I suppose you think, if your brother was to kill my enemy, the law would punish him for it: but pray undeceive yourself, miss. The law has no power over heroes; they may kill as many men as they please, without being called to any account for it; and the more lives they take away, the greater is their reputation for virtue and glory.

మీ అన్న నా శత్రువును చంపితే చట్టం అతన్ని శిక్షిస్తుందని భయపడుతున్నావని అర్థమైంది. కానీ అలాంటి అనుమానాలు పెట్టుకోకు. హీరోలపై చట్టానికి ఎలాంటి అధికారం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినంతమందిని చంపొచ్చు. దానికి బాధ్యత వహించాల్సిన పనే లేదు. ఎన్ని ప్రాణాలను వాళ్ళు తీసేస్తే వాళ్ళ శీలం, కీర్తి అంతగ ప్రసిద్ధి చెందుతాయి. అలా అంటూ తను చదివిన హిరోయిక్ రొమాన్సుల్లోని నాయకులను ఉదాహరణలుగా చూపుతుంది. అక్కడితో ఆగక, ఎంత మంది రక్తం చిందిస్తే ఆ నాయిక ప్రతిష్ఠ అంత పెరుగుతుంది కనక, తన ప్రతిష్ఠను పెంచే బాధ్యత తనను ప్రేమించే వ్యక్తిదే కనక, అతను ఎంతమందిని చంపితే తను అంత గొప్ప స్త్రీగా సమాజంలో నిలుస్తుందని కూడ చెబుతుంది.

ఇలాంటి విచిత్రమైన యువతిని ఎలా రక్షించడం అన్న విషయం కథానాయకుణ్ణి కలచివేస్తుంది. ఆమె చదువుతున్న రొమాన్సులను తగలబెట్టమని ఆమె తండ్రే స్వయంగా చెప్పినా, అప్పట్లో ఆమెకు కోపం తెప్పించడం ఇష్టంలేక అతను ఆ పని చెయ్యడు. కానీ ఇప్పుడు అతనికి అనుమానం వస్తుంది, వాటిని తగలబెట్టాల్సిందేమోనని. మొత్తానికి ఈ గొడవతో అతను తరచు అనారోగ్యం పాలవుతూంటాడు. కానీ అతను చనిపోవడానికి తను అనుమతించడం లేదని కనక త్వరగా బాగై రావాలని అరబెలా ఆదేశిస్తుంది. అతను ఎందువల్ల ఆరోగ్యవంతుడైనా అది తన ఆదేశం వల్లేనని ఆమె తీర్మానించుకుంటుంది. ఈలోగా ఆమె బలహీనతను అవకాశంగా తీసుకుని, తనకు రొమాన్సుల పట్ల ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించిన మరో వ్యక్తి సర్ జార్జ్ ఆమె జీవితంలోకి అడుగుపెడతాడు. ఆమెలాగే అతనుకూడా శుద్ధ రొమాంటిక్ భాషలో మాట్లాడతాడు. ఆమె అవివేకానికి ఆజ్యం పోస్తున్నందుకు మిత్రుడు గ్లాన్‌విల్‌తో తిట్లు కూడా తింటాడు. అలా కొన్ని సంఘటనలు గడిచాక, సర్ జార్జ్‌కి నిజంగా తన మీద ప్రేమ లేదని గ్రహిస్తుంది. నవల చివర్లో అతను గ్లాన్‌విల్‌ చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు. మరోవైపు తన కాబొయే భార్యని ఈ విచిత్రమైన మనస్తత్వంనుంచి రక్షించాలని గ్లాన్‌విల్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.

ఇక చివరి సన్నివేశంలో ఇద్దరు ‘అనుమానాస్పదంగా’ ఉన్న పురుషులు తన వెంటపడుతున్నారనుకుని అరబెలా పరిగెత్తడం మొదలుపెట్టడంతో కథ ముగింపుకు చేరుకుంటుంది. వాళ్ళకు ఫలానా యువతి తమని అనుమానిస్తోందని కూడ తెలీదు. వాళ్ళ మానాన వాళ్ళు వెళ్తోంటే ఇద్దరి మార్గం ఒకటే కనక తన వెంట పడుతున్నారని అరబెలా అలవాటు ప్రకారం ఊహించుకుని గుర్రాల మీద వస్తున్న వాళ్ళిద్దరూ తనను చేరకుండా వేగంగా పరిగెడుతూ థేమ్స్ నదిలోకి పడిపోతుంది. అక్కడి నుంచి ఆమెను రక్షించి వైద్యం చేస్తారు. ఆ వైద్యం చేసే క్రమంలో డాక్టర్‌తో పాటు, ఆమెను పరీక్షించడానికి ఒక మతగురువును కూడ ఆమె కజిన్ ఛాల్స్ తీసుకువస్తాడు. ఆమె మానసికంగా కూడ ఆరోగ్యంగా లేదని ఆ మతగురువు గ్రహిస్తాడు. అక్కడి నుంచీ ఆమెకు మానసిక చికిత్స మొదలుపెడతాడు. ఆమె చదివిన పుస్తకాల ఘటనలకు వాస్తవంతో ఏ పోలికా లేదని, పుస్తకాల్లో జరిగేవి నిజజీవితంలో జరగవనీ ఆమెకు అర్ధమయ్యేలా వివరిస్తాడు. క్రమంగా ఆమె అన్ని విధాలా కోలుకుంటుంది. తన కజిన్ గ్లాన్‌విల్‌కు తన మీద ఉన్న ప్రేమే అసలైనదని గుర్తించి, ఊహాలోకం లోంచి బయటపడి, అతన్ని వివాహం చేసుకుంటుంది.

ఈ నవలంతటా పుష్కలంగా హాస్యం ఉంది. అరబెలా ఆలోచనలు, సంభాషణలు మెలోడ్రమటిక్‌గా ఉండడంతో పాటు, విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. ఉదాహరణకు ఆమెను సెన్‌విల్ అనే అతను ప్రేమిస్తున్నాడని ఎవరో చెప్తారు. అరబెలాకు సంతోషం కలగాలి న్యాయంగా. అప్పటికే ఆమె లెక్కలో ఎంతోమంది ప్రేమిస్తున్నారు (అది కేవలం ఆమె అపోహ మాత్రమే). మరొకడు చేరాడు జాబితాలోకి. కానీ అలా అతను తనని ప్రేమిస్తున్నట్టు అందరికీ వెంటనే అర్ధమైపోవడం ఆవిడ దృష్టిలో అపచారం. ముందు అతను తన ప్రేమను చెప్పుకోలేక కృంగి కృశించిపోవాలి. వైద్యులు వచ్చి చికిత్స చేసినా ప్రయోజనం ఉండకూడదు. అప్పుడు వైద్యులు అతనిది మానసిక రోగమని, దానికి చికిత్స లేదనీ చెప్పాలి. అతనిక మరణానికి చేరువలో ఉండగా, నాయిక అతన్ని పలకరించడానికి వచ్చి ‘నీకు చచ్చిపోయేందుకు నా అనుమతి లేదు. ఎందుకిలా అయిపోయావో చెప్పు’ అని నిలదీస్తే ఆమెను ప్రేమించేంత ఘోరమైన నేరం చేశానని, అందుకు మిగిలిన జీవితకాలంలో ప్రాయశ్చిత్తం చేసుకుంటాననీ అనాలి. అతని మరణం తనకిష్టం లేదని ఆమె చెబితే చాలు. అతని రోగం పోయి ఆరోగ్యవంతుడు కావాలి. ఆ తర్వాత ఆమె అతన్ని ప్రేమిస్తుందా? అలాంటి ఆలోచనే తప్పు. కేవలం తనను ప్రేమించేవాడు తన అనుమతి లేకుండా చావకూడదన్నదే ఇక్కడ సందేశం. అదీ కాక, అతను తన ప్రేమను చెప్పుకోలేక మరణం అంచుల దాకా వెళ్ళి తీరాలని ఆజ్ఞ. ఇలా ఉంటుంది ఆమె ధోరణి.

స్పందనలు

ఈ నవల ద్వారా రచయిత్రి ఆ రోజుల్లో విచ్చలవిడిగా ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న ఫ్రెంచి రొమాన్సులను విమర్శించడం, వాస్తవ జీవితం అర్థంకాక, కలల్లో తేలిపోవడంలోని ప్రమాదం గురించి యువతులను హెచ్చరించడం ప్రధానమైన కర్తవ్యంగా పెట్టుకుంది. కాని ఈ నవల ద్వారా మరికొన్ని కోణాలు కూడ బయటపడతాయి. ముందుగా చెప్పాల్సింది ఈ నవలకు వచ్చిన స్పందనలు. రచయితలు శామ్యూల్ రిఛర్డ్‌సన్, శామ్యూల్ జాన్సన్ ఈ నవలను చాలా మెచ్చుకున్నారు. రిఛర్డ్‌సన్ అప్పుడే రెండు మంచి నవలలు రాసి వున్నాడు. షార్లట్‌తో అతనికి స్నేహం కూడ ఉండేది. కనక ఈ నవలలో కొన్ని భాగాలు అతనే రాసిపెట్టాడనే పుకారు కూడ పుట్టింది. ముఖ్యంగా అరబెలా మనసు మార్చేలా మతగురువు మాట్లాడిన చివరి సన్నివేశం రిఛర్డ్‌సన్ రాశాడని చాలామంది నమ్మారు. హెన్రీ ఫీల్డింగ్ నిర్వహించిన పత్రికలో కూడ నవలను ప్రశంసిస్తూ సమీక్ష రావడంతో ఆమె సమకాలికుల్లో గౌరవనీయులైన రచయితల పొగడ్తలు ఆమెకు దక్కినట్టే అయింది.

రొమాన్సా, నవలా?

ఇంగ్లీషు సాహిత్యంలో, ఆ మాటకొస్తే ఐరోపా సాహిత్యంలోనూ రొమాన్సు, నవల అనే పదాల్ని వేర్వేరు ప్రక్రియలకు ఉపయోగిస్తారు. రొమాంటిక్ నవల వేరు; రొమాన్స్ వేరు. రొమాన్స్ లాటిన్ సాహిత్యం వారసత్వంగా వచ్చినది. ఇందులో ఉన్నవన్నీ అభూత కల్పనలే. అరబెలా చదివిందంతా ఆ లాటిన్ రచనలకు నకళ్ళయిన ఫ్రెంచి నవలల ఆంగ్లానువాదాలు. ఈ నవల ద్వారా షార్లట్ రొమాన్స్‌కు, నవలకూ ఉన్న తేడాను చెప్తోందని కూడ భావించవచ్చు. తను రాస్తున్నది నవల; తన నాయిక చదువుతున్నవి రొమాన్సులు అన్న స్పృహతో ఆమె రాసింది. నవల అనగానే వాస్తవికత పునాదిగా ఉండాలి కనక అది చెప్పడం కోసమే ఆమె ఈ నవల రాసిందని కూడ అనుకోడానికి వీలుంది.

ఈ శతాబ్ది స్త్రీవాద విమర్శకులు ఈ నవలను మరో కోణంలోంచి చూశారు. ‘నవలలో ఏం చూపించింది షార్లట్? ఎటువంటి స్త్రీనైనా ఆ రోజుల్లో ఉత్తమ ఇల్లాలి కిందికి మార్చేసేవారని. అరబెలాలో ఉన్న గొప్ప ఊహాశక్తిని చంపేసి, ఆమెను డొమెస్టికేట్ చెయ్యడమే ఈ నవలలో ఇతివృత్తం.’అని. వాళ్ళ ఉద్దేశంలో షార్లట్ రాసింది ఫ్రెంచి రొమాన్సుల మీద అధిక్షేపం కాదు; పురుషాధిక్య సమాజంలో స్త్రీలను ఎలా గృహిణీధర్మాలకు పరిమితం చేస్తున్నారన్న సమకాలీన సమాజంపై విమర్శ.

స్త్రీల అక్షరాస్యతను చర్చించిన నవల

అపుడపుడే సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తున్న బ్రిటిష్ యువతులకు ‘ఏం చదవాలి. ఏం చదవకూడదు’ అన్న ఆంక్షలు విధించడాన్ని ఈ నవల చర్చకు పెడుతుందన్నది మరో విశ్లేషణ. ‘నవలలో స్త్రీలు పుస్తకాలు చదువుతారు. నవలలోని పురుషులు ఆ పుస్తకాలు చదువుతున్న స్త్రీలను చదువుతారు. వారు ఏం చదువుతున్నారు, చదివినవాటికి ఎలా స్పందిస్తున్నారు అన్న విషయాలపై తీర్పులు చెప్తారు. ఆ రకంగా స్త్రీలపై తమ ఆధిక్యతను మరింత సుస్థిరం చేసుకుంటారు’ (ఏమీ హాడ్జస్, 2013లో రాసిన వ్యాసంలో). పుస్తకాలు చదవడమే ప్రధాన కార్యక్రమంగా ఆనాటి యువతులను షార్లట్ చూపించింది. ఎలాంటి పుస్తకాలు అన్న విషయాన్ని పక్కన పెడితే, స్త్రీలు విస్తృతంగా పుస్తకపఠనం చెయ్యడమే గొప్ప విషయం. దాన్ని స్పష్టంచేసింది ఈ నవల. అంతే కాదు. రొమాన్సులే ఎందుకు చదివారు? అసలు స్త్రీలు ఇంగ్లండులో అనే కాదు. అన్ని దేశాల్లోనూ తొలిదశలో ప్రణయగాథలే ఎందుకు రాశారు? అన్నది కూడ ప్రశ్నే. దీనికి ఆ నాటి బ్రిటన్ రాజకీయ, సామాజిక నేపథ్యం కూడ కారణం.

బ్రిటన్‌లో ధనవంతులు మరింత ధనవంతులైన కాలమది. మగపిల్లలకు పాఠశాలలు పెరిగాయి. కానీ ఆడపిల్లల్లో ఎక్కడో మరీ ధనవంతులైతే తప్ప, పాఠశాలలకు పంపేవారు కాదు. ఇళ్ళలోనే కుట్లు, అల్లికలు నేర్చుకుంటూ కాలంగడిపేవారు. అందుకని వారి చదువంతా ఇంట్లో తండ్రులు సేకరించిన గ్రంథాలయాలలో పుస్తకాలను కూడబలుక్కుని చదవడమే. తమకున్న భాషాపరిజ్ఞానంతో వాళ్ళు చదవగలిగినవి నవలలు మాత్రమే. ఇంగ్లీషులో అప్పటికి ఎక్కువ నవలలు లేవు కనక ఫ్రెంచి రొమాన్సుల ఇంగ్లీషు అనువాదాలే గతి అయ్యాయి. ఆ ఫ్రెంచి నవలలు లాటిన్ నుంచి అరువు తెచ్చుకున్న అద్భుత, అభూత కల్పనల సకళ్ళు. ఈ నేపథ్యంలో స్త్రీలు కాల్పనిక ప్రణయ నవలలు మాత్రమే రాయగలగడంలో ఆశ్చర్యం లేదు.

18వ శతాబ్ది యూరప్‌లో, ఇంగ్లండులోనూ అనేక రకాలుగా ముఖ్యమైన యుగం. ఈ శతాబ్ది మధ్యలో పారిశ్రామిక విప్లవం ఆ దేశానికి ఆర్ధికంగా ఉన్నత స్థితిని ఇచ్చింది కానీ దానివల్ల ఆర్ధికమైన అంతరాలు మరింత పెరిగాయి. ఆ శతాబ్ది అంతానికి, అమెరికా ఫ్రెంచి విప్లవాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి సాహిత్యం ఆ మార్పులన్నిటినీ చిత్రించిందా అన్నది అనుమానమే. క్రీ.శ. 17వ శతాబ్దిలోనే బ్రిటిష్, ఫ్రెంచి వారి మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. 18వ శతాబ్ది నాటికి బ్రిటన్ తన అధికారంలోకి అనేక దేశాలను (మన దేశంతో సహా) తెచ్చుకుని, తక్కిన దేశాల మీద తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. గ్రేట్ బ్రిటన్‌గా మారింది. ఫ్రెంచి, బ్రిటన్ దేశాల వైమనస్యం అప్పటి బ్రిటిష్ సాహిత్యంలో ప్రతిధ్వనించింది. ది ఫిమేల్ కిహోటెలో కథానాయికను పెడతోవ పట్టించింది ఫ్రెంచి నవలలే.

స్త్రీవాద విమర్శ పెరిగిన తర్వాత షార్లట్ లెనక్స్ నవలను అనేక రకాలుగా విశ్లేషించడం కనిపిస్తుంది. అక్షరాస్యతా కోణంలో, పురుషాధిక్యతా కోణంలో ఈ నవలను చర్చించారు. షేక్స్‌పియర్ టేమింగ్ ఆఫ్ ది ష్రూలో ఆడపిల్లను కట్టడి చేయడం ప్రస్తావన ఉన్నట్టే ఈ నవలలోనూ అరబెలాను అదుపులో ఉంచడం కనిపిస్తుందని వ్యాఖ్యానించినవారూ ఉన్నారు. మరోవైపు, ఏ రొమాన్సులనైతే ఈ నవలలో రచయిత్రి ఎగతాళి చేసిందో ఆ రొమాన్సులలోని అవకతవకలే ఈ నవల్లోనూ ఉన్నాయన్నవారూ ఉన్నారు.

కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం స్త్రీల పఠనం, స్త్రీల రచన అనే రెండిటికీ ఉన్న సంబంధాన్ని షార్లట్ నిర్వచించిన విధం. ఆడపిల్లల ‘చదువు’ ఎన్ని ఆంక్షల మధ్య ఎన్ని పరిమితుల మధ్య జరుగుతుందో ఆమె విశ్లేషించిన పద్ధతి. మగవాళ్ళతో సమానంగా పాఠశాలకు వెళ్ళి నియమబద్ధమైన విద్యను చదువుకోలేని ఆడపిల్లలు చేతికి దొరికినవి చదివేవారు. ఆడపిల్లలు చదవడానికి మంచి సాహిత్యం ఇంట్లో ఉండాలన్న స్పృహ ఏ తండ్రికీ లేదు. దొరికిందే చదివిన ఆ స్త్రీలు అదే నిజమైన లోకం అనుకుని, దాన్ని జీర్ణించుకున్నారు. అవకాశం రాగానే దాన్నే తమ సృజనగా మార్చుకున్నారు. షార్లట్ రెండు పొరలుగా ఈ కథను చెప్పిందని భావించవచ్చు.

ఒక స్థాయిలో చూస్తే, చెత్త సాహిత్యం చదివి, అవాస్తవికమైన ఊహలతో, అపార్థాలతో, అపోహలతో, మిడిమిడిజ్ఞానంతో, అహంభావంతో జీవితాన్ని అతలాకుతలం చేసుకున్న ఆడపిల్ల వాటి నుంచి బయటపడి, వాస్తవజీవితంలో ఆనందం పొందడం. రెండో స్థాయిలో చూస్తే, మన చదువే మన ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుందనీ, ఆ చదువు స్త్రీలకు లభించకపోవడం వారి దురదృష్టమే కానీ, నేరం కాదనీ చెప్పడం. సాహిత్యానికీ, జీవితానికీ మధ్య ఉన్న అతి సన్నిహితమైన, సునిశితమైన అనుబంధాన్ని వ్యాఖ్యానించిన నవల కూడ బహుశా మొదటిది ఇదేనేమో.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...