రెండు కవితలు

మృత్యు గృహ

భయవిభ్రమంలో
చిన్ని ప్రాణం
మృత్యు గృహలో నిలబడి
ఎర్రని గాయాలతో

చుట్టూ
ఒకే దృశ్యం
చీకటి దృశ్యం

నిరాశ
నిస్సహాయత
ఎర్ర దీపంలా వుంది

మృత్యువు,
వెంటే నడుస్తున్నట్టు
ఒక నీడ.

ఉక్రోషం

ఆప్రదేశమంతా గాలికి కొట్టుకుపోతూ చెల్లాచెదురుగా రాలిన పావురాల ఈకలు.

అణువణువునా జలదరింపు మంటను రాజేస్తుంటే ఆక్రోశపు గీతాలు రాత్రుల వెంబడి.

గులకరాళ్ళు గుచ్చుకుంటుంటే పెనుగులాటను దాచుకుంటూ సరిపెట్టుకుంటూ తూలిపడుతున్న ప్రతిసారి, నేలపై వేళ్ళను ఒత్తిపెడుతూ నిగ్రహించుకుంటున్న సమయం జీవన్మరణ ఊగిసలాట.

ఒంటరిగా కొంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి వెళ్ళలేక ఊపిరాడనివ్వని అలజడి.

గడియ గడియ గారడీ చేస్తుంటే గాఢంగా అలుముకున్న చీకటితో కొన్ని గీతల మధ్య అలాగే ఆగిపోవడం ఒక ఓటమి, చురుక్కుమనిపించే చెంప దెబ్బలాంటి ఓటమి.

ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటే దుఃఖం మెలిపెడుతుంటే ఉక్రోషం అతి గంభీరంగా రాలుస్తున్న సిరా చుక్కలు.