చావంత నిశ్శబ్దంగా చల్లగాలి వీస్తూంటే దాన్ని ఎదిరిస్తున్నట్టు ఆమె చేతుల మీది రోమాలు కత్తుల్లా నిల్చున్నాయి. ఆ గాలి తీసుకొచ్చిన తోడేళ్ళ ఊళలు తనున్న మంచుకొండని తాకి ప్రతిధ్వనిస్తున్నాయి. చలినుంచి, తోడేళ్ళ దాడినుంచి రక్షణ కోసం తను కప్పుకున్న తోడేలు చర్మాన్ని ఒంటికి దగ్గరగా లాక్కుంటూ కొండ నుంచి కిందకి చూసింది. కింద లోయలో ఎండిపోయిన చెట్టుపక్కన ఒక తోడేలు శవం పడుంది. దాని చుట్టూ మంచులో తోడేలు అడుగుల ఆకారంలో నిప్పుల్లా మెరుస్తున్న రక్తపుగుంటలు. ఆ ఎర్రటి గుర్తులు లేకపోతే మంచులో కలిసిపోయిన తెల్లటి శవాన్ని గుర్తించలేకపోయేది తను. తన ఎండిపోయిన పెదాలను నాలుకతో తడుపుకొని గట్టిగా గాలి పీల్చుకుని తోడేలులా అరిచింది. ఆ అరుపులు గాల్లో చెదిరిపోయాయి. వాటికి జవాబుల కోసం చూస్తుండగా చల్లగాలి తన కడుపులో నిద్రిస్తున్న పేగులకి ఆకలిని గుర్తు చేసింది.
సాయంత్రం నీడల్ని, నిశాచరుల్ని నిద్రలేపుతుండగా ఆమె ఆ శవం వైపు తన బల్లెంతో సడి లేకుండా సాగింది. ఆ బల్లాన్ని తనకిచ్చి బతుకుతో పోరాడడం నేర్పిన చేతులు మంచులో సమాధి అయ్యి తనని భూమి మీద చివరి మనిషిని చేశాయి. ఆమె నడుస్తుంటే ఆమె కప్పుకున్న గుబురుపాటి తోడేలు చర్మం లోపలి వైపు గుచ్చబడి ఉన్న కత్తి చల్లదనం లోపలి బట్టలను దాటి తన శరీరానికి తగులుతోంది. వేగంగా వీస్తున్న గాలి తను వదిలిన అడుగుజాడల్ని వెంటనే కప్పేస్తోంది. శవాన్ని చేరుకుంటుండగా తనలో ఏదో అనుమానం పొడసూపింది. ఆ తోడేలి కోరలకు, చుట్టూ ఉన్న అడుగుజాడల్లోనూ తప్ప దాని శరీరంపై ఎక్కడా చుక్క రక్తం లేదు. గాలుల వల్ల సరిగ్గా చూడలేకపోతున్నానేమో అనుకుంది. బల్లెంతో దాని కడుపుకింద తెగున్న మాంసంలో పొడిచింది. చలనం లేకపోయేసరకి ఆమె కత్తిని బయటకితీసి దానిమీది చర్మాన్ని కొద్దామనుకొని శవాన్ని కాలితో కదిపింది. అది చాలా తేలికగా కదిలింది.
కాదు. అది తోడేలు కాదు. మరి? తన అనుమానం గట్టిపడేంతలోనే ఆకలి, చలి రెండూ కలిసి తనని ఆ ఆలోచనకి దూరం చేశాయి. ముందు రెండు కాళ్ళను పట్టుకుని ఆ తోడేలు శవాన్ని ఎత్తి భుజం మీద వేసుకుంది. వింతగా ఆ శవం కంటే తను వేసుకున్న చర్మం ఎక్కువ బరువుగా అనిపించింది తనకి. ఆకలి, చలి, చీకటి కమ్ముకుంటున్న లోయ తెచ్చిపెట్టే ప్రమాదాలు తనను ఆ తోడేలు శవాన్ని పరీక్షగా చూడనివ్వలేదు. చచ్చినా తెరుచుకునే ఉన్న ఆ తోడేలు కళ్ళలోకి మరొక్కసారి చూడటానికి ఆమెకు సమయం ఇవ్వలేదు. ఆమె చూపు దూరంగా కనిపిస్తున్న తోడేళ్ళ గుహ మీదకి మళ్ళింది.
ఇదీ ఆ గుహలోదే అయ్యుంటుంది. ఆ గుహ లోపలినుంచి పల్చటి, ఎర్రటి పొగ వస్తుంది. రక్తం ఆవిరైనట్టు ఉందది. చీకటిలో అదింకా భయంకరంగా కనిపిస్తూ ఆమెలో అలజడి రేపింది. మనసు కీడు శంకించింది. వెంటనే కొండ పైకి చేరుకొమ్మని ఆమెను తొందరపెట్టింది. తను మోస్తున్న శవం అంత తేలిగ్గా ఎందుకుందో అర్ధం కాలేదు తనకి.
దీనిపై తిరగబడిన తోడేళ్ళు దీని లోపలి భాగాల్ని తినుంటాయా? మరి రక్తమేది?
వెనక్కి తిరిగిచూసింది. నల్లటి తెర భూమిని కప్పేసింది. తిరిగి కొండమీద ఆకాశంవైపు తన నడక సాగించింది. దారికి ఇరువైపులా మంచులో కూరుకునున్న పుర్రెలు. మిగతావారిలా భూమిని వదల్లేక ఇక్కడే ఉండిపోయి ప్రకృతికి అనుగుణంగా బతికేటట్టు ఆమెని పెంచిన ఆఖరు మనుషులవి. భూమి బీడు పోయాక దానిని ఒదిలి వెళ్ళిపోయిన మనుషులు పోగా, తాము ఉన్నంతకాలం మళ్ళీ భూమిపై పచ్చదనం పెంచడం కోసం తపించిన మానవులవి. మళ్ళీ తమలాంటివారు రావడానికి ప్రయత్నిస్తారని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, భూమినే గమనిస్తున్నారని ఆమెకు జాగ్రత్తలు చెప్పిన నాచురలిస్టు సమాజానివి.
“క్‌క్‌ర్‌ర్‌ర్” సన్నగా, స్పష్టంగా ఒక చప్పుడు అయింది. చుట్టూ చూసింది.
“క్‌క్‌క్‌ర్‌ర్‌ర్” ఆ చప్పుడు తన భుజం మీదున్న శవం గొంతులోంచి వస్తుందని గ్రహించటానికి తనకెక్కువ సమయం పట్టలేదు. ఒక్కసారి బలంగా ఆ తోడేలుని కిందకి విసిరేయడంతో దానితోపాటు తను కప్పుకున్న చర్మం, బల్లెం కూడా కిందపడిపోయాయి. క్షణంపాటు తనని అలుముకున్న భయం నిలువెల్లా వణికించింది. చర్మం లోనుంచి తన కత్తి తీసి చలనం లేని ఆ తోడేలు శవం దగ్గరికి వెళ్ళింది, అడుగులో అడుగు వేసుకుంటూ. ఆమె కత్తితో తోడేలు మెడలో పొడిచింది. ఏదో రాయిని పొడిచినట్టుగా చప్పుడు ఖంగుమని మోగింది. గుచ్చిన కత్తిని బయటకి తీసి దాన్ని తన వేళ్ళతో తడిమిచూసింది. రక్తపు జాడ లేదు. మెడకింది చర్మాన్ని వెడల్పుగా కోసి చేతిని లోపలికి పెట్టింది. రాయిలా గట్టిగా, కత్తిలా చల్లగా ఏదో తగిలింది. ఆమె కత్తితో మెడనుంచి వెనక కాళ్ళదాకా తోడేలు పొట్టను చీల్చింది. రెండు అంచులూ పక్కకు లాగింది. లోపల మామూలు తోడేలుకుండే ఎముకలు మాంసం ఏమీ లేవు. సింథటిక్ స్కెలిటన్. దానిలో ఫ్రేమ్ చేయబడిన ఒక చిన్న కంప్యూటర్ బాక్స్. దానిమీద వెలుగుతూ ఆరిపోతున్న లైట్లు. ఆ కత్తినలాగే పట్టుకుని ఒక చేతితో తోడేలు తలని తనవైపు తిప్పిచూసింది. ఎర్రగా మెరుస్తున్న ఆ కెమేరా కన్నులను చూసింది. ఆ కళేబరం కప్పిన కుట్రని చూసింది. తన పెద్దలు హెచ్చరించిన యంత్రభూతం ఇదేనా?
ఎందుకు? మనుషులెందుకు ఇలా చేస్తారు? భూమిని ఎందుకు వదలరు? ఈ కళేబరాన్నెందుకు వదిలేయరు? తోడేలు శవాన్ని కప్పుకున్న సర్వెయ్‍లెన్స్ రోబోని చూస్తూ అనుకుంది. ఏదో ఒకరోజు భూమి త్వరలో బాగుపడ్తుందనో మనుషులు బతకగలిగే అవకాశం ఉందనో తెలిస్తే మళ్ళీ వస్తారా?
పక్కన పడున్న తోడేలు చర్మానికి కత్తిని గుచ్చి తనపై కప్పుకుని గుహ వైపు తిరిగింది. అందులోంచి ఆమెనే చూస్తున్న మరిన్ని నాలుగు కాళ్ళ లోహపు అస్థిపంజరాలను, వాటి ఎర్రటి కళ్ళనూ చూసింది.
తన కాళ్ళ దగ్గరే పడున్న ఆ కళేబరంలో మాంసాన్ని ఒక రాబందు పీక్కుతినటానికి ప్రయత్నిస్తుండడం ఆమె గమనించలేదు.