గీతులు

సంగ్రహము

ఉపగణములతో, మాత్రాగణములతో నిర్మింపబడిన ఛందస్సులు గానయోగ్యమైనవి. తెలుగులో ఆటవెలది, తేటగీతి, సీసము, ద్విపద మున్నగునవి ఈ కోవకు చెందినవే. కాని ఈ ఉపగణములతో ఇంకను ఎన్నియో ఛందస్సులను సృష్టించి, అందులో వ్రాసిన గీతములను పాడుకొనవచ్చును. ఒకటి నుండి ఐదు సూర్యేంద్ర గణములతో కల్పించిన 62 గీతులను సోదాహరణముగా వివరించుట మాత్రమే కాక ఈ గీతులకు ఒక పటిష్టమైన గణిత శాస్త్రపు పునాది కూడ నిర్మించబడినది. వీటితో అర్ధసమగీతులను నిర్మించు విధానము, వృత్తములలోని ఉపగణముల చాయలు, క్రొత్త తాళవృత్తములను కనుగొనుటకు ఉపయోగపడు పద్ధతులు ఈ వ్యాసములో చర్చించబడినవి. గణములకు తగినట్లు పదముల విఱుపుయొక్క అవసరము ఉద్ఘాటించబడినది. తెలుగు కన్నడ భాషల ఛందస్సులో గీతులపై ప్రప్రథమముగా యిట్టి క్రమబద్ధమైన పరిశోధనలు చేయబడినవి.

పరిచయము

గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య (1, 2) తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో[1] కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. సంస్కృత నాటకములలో కూడ ఇట్టి గేయ ఛందస్సులు ఉన్నాయి. తమిళములో కవితను పాట్టు (పాట) అని కూడ అంటారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే. ప్రాఙ్నన్నయ శాసనములలో కూడ మనము దేశి ఛందస్సుల వాడుకను గమనించవచ్చును. శాసనములలో మొట్టమొదట మనకు కనబడిన దేశి ఛందస్సులను[2, 3, 4] క్రింది పట్టికలో చూడవచ్చును.

571 ఎఱికల్ ముత్తురాజు ఎఱ్ఱగుడిపాడు సీసము
575 ఎఱికల్ ముత్తురాజు తిప్పలూరు ద్విపద
575 ధనంజయుడు కలమళ్ళ రగడ
600 చోడ మహారాజు ముత్తుకూరు అక్కర పోలిక
600 చోడ మహారాజు కోసినేపల్లి తేటగీతి (సీస భాగము)
700 విక్రమాదిత్య చోడుడు నల్లచెరువుపల్లె ఆటవెలది (సీస భాగము)
750 రెండవ మహేంద్రుడు బూదినగడ్డపల్లి విడి ఆటవెలది
770 పండరంగడు అద్దంకి తరువోజ
8వ శతా. పెద్దముడియము విడిగా తేటగీతి
850 నలజనంపాడు ఉత్సాహ
930 యుద్ధమల్లుడు బెజవాడ మధ్యాక్కర
945 జినవల్లభుడు కుర్క్యాల కందము

వృత్తములు ఎనిమిది త్రిక గణములతో, నాలుగు ద్వ్యక్షర గణములతో, రెండు ఏకాక్షర గణములతో నిర్మింపబడగా, సీసము, ఆటవెలది, తేటగీతి, ఉత్సాహ, అక్కరలు అంశ లేక ఉపగణములతో (సూర్యేంద్రచంద్ర గణములు), కందము, రగడలు మూడు, నాలుగు, ఐదు, ఏడు మాత్రలతో నిర్మింపబడినవి. త్రిపదలు, షట్పదలు కన్నడములో అంశ, మాత్రాగణ నిర్మితములు, తెలుగులో ఇవి వాడుకలో లేవు. అంతే కాదు, తెలుగులో చంద్ర గణముల ఉపయోగము మృగ్యము. దీని సారాంశము ఏమనగా తెలుగు ఛందస్సులో గానయోగ్య ఛందస్సులు కొన్ని సూర్యేంద్ర గణములతో, మఱి కొన్ని మాత్రా గణములతో సృష్టించబడ్డాయి. ఈ వ్యాసములో నేను సూర్యేంద్ర గణములతో కల్పించ వీలగు ఛందస్సులను గుఱించి చర్చిస్తాను. ఇంతవఱకు ఇట్టి ఛందస్సులు చాల తక్కువ సంఖ్యతో ఉండే గీతులకు, సీసమునకు మాత్రమే పరిమితము. కాని గానయోగ్యమైన ఛందస్సుల విరివి వృత్తాదులవలె అనంతము. ఒకటి నుండి ఐదు ఉపగణములతో నిర్మించ వీలగు అన్ని ఛందస్సులను సోదాహరణముగా వివరించి, మఱి కొన్ని ఛందస్సులను చూచాయగా తెలుపుతాను. వృత్తములకు ఒక అక్షరపు ఉక్త నుండి 26 అక్షరముల ఉత్కృతి వఱకు ఏ విధముగా ఛందములు గలవో, అదే విధముగా సూర్యేంద్ర గణములతో ఒక గణము నుండి తొమ్మిది గణముల వఱకు గల ఛందములకు నవ రత్నముల నామములను పెట్టాను.

తెలుగులో గీతులు

తెలుగు ఛందస్సులో తొమ్మిది విధములైన గీతులను ప్రత్యేకము తెలిపియున్నారు. అవి (1-2) గీతులుగా పరిగణించబడుతున్న ఆటవెలది, తేటగీతులు, (3-5) ప్రాసతో ఉండే విషమ గీతులైన ఎత్తుగీతి, పవడగీతి, కమలనగీతి లేక మేలనగీతి (దీనికి బదులుగా మలయగీతి అను గీతిని పొత్తపి వేంకట రమణకవి పేర్కొన్నాడు), (6-9) ఆర్య యందలి నాలుగు గీతులైన గీతి, ఉపగీతి, ఉద్గీతి, ఆర్యాగీతులు. ఆటవెలదికి ప్రసన్నగీతి, నటి యని కూడ పేరులు గలవు[5]. కన్నడములో దీనిని ఆటగీతి యని నాగవర్మ తెలిపినాడు[6]. తేటగీతిని పవడి, శుభ్రగీతి అని పొత్తపి కవి చెప్పినాడు[5]. ఆర్యలోని కందము తప్ప మిగిలినవి తెలుగు ఛందస్సులో వాడుకలో లేవు. పొత్తపి వేంకటరమణకవి సీసము, గీతులకు ఋగ్వేదబ్రాహ్మణములు మూలములని భావించినాడు.

జయకీర్తి ఛందోనుశాసనములో అక్కర, త్రిపది, ఏల, అక్కరికా, షట్పది, చతుష్పది, ఛందోవతంసము, మదనవతి, గీతికాదులను కర్ణాటక భాషలోనివని పేర్కొన్నాడు[7]. తెలుగులోవలె గాక, కన్నడములో బ్రహ్మ (సూర్య), విష్ణు (ఇంద్ర) గణములతోబాటు రుద్ర (చంద్ర) గణములు ఉండే ఛందస్సులు కూడ విరివిగా ఉపయోగించబడ్డాయి.

కన్నడ, తెలుగు భాషలలో వృత్తములలోని ఒక విశేషము ఏమనగా – సంస్కృతములోవలె ఇక్కడ పాదాంత యతి లేదు, అనగా ఒక పదము మొదటి మూడు పాదముల చివరలో అంతము కానవసరము లేదు. పాద మధ్యములో కన్నడములో పదవిచ్ఛేదయతి ఉన్నా, దానిని కవులు పాటించలేదు. కాని తెలుగులో పాదమునకు పది అంతకన్న ఎక్కువ అక్షరములు ఉండే వృత్తములలో పాదము మధ్యలో పదవిచ్ఛేదయతికి బదులు అక్షరసామ్య యతి లేక వడి యున్నది. ఈ నియమములవలన వృత్తములలో కథాగమనమును, వర్ణనలను సులభముగా చొప్పించవచ్చును.

గీతులకు అవసరములైన నియమములు గీతులు అనగా పాటలు. పాటలలో పదముల విఱుపునకు ప్రాముఖ్యము ఎక్కువ. ఇది ఉన్నపుడు పాట నడక చక్కగా ఉంటుంది, ఇది లేనప్పుడు అది కుంటు పడుతుంది. దీనిని దృష్టిలో నుంచుకొని గీతులకు మనము కొన్ని నియమములను అనుసరించవచ్చును.

  1. ఒక్కొక్క గీతికి ఒక్కొక్క విధమైన గణముల అమరిక ఉండును, పదములను ఆ గణములకు తగినట్లు విఱిచి వ్రాసినప్పుడు మాత్రమే ఆ గీతియందలి గానయోగ్యత, సౌందర్యము బాగుగ ప్రతిఫలించును. వృత్తములలో దీర్ఘ సంస్కృత సమాసములను వాడు తెరగును కవులు అంగీకరించారు. ఇంద్రగణములకు మూడు లేక నాలుగు అక్షరముల నిడివి, సూర్య గణములకు రెండు లేక మూడు అక్షరముల నిడివి. రెండు నుండి నాలుగు అక్షరములు ఉండే తెలుగు పదములు ఎన్నో ఉన్నాయి కనుక గీతులలో గణములకు తగ్గట్లు పదములను ఎన్నుకొనుట అంత కష్టతరమైన పని కాదు. ఈ పదముల విఱుపుగుఱించి అక్కరలను నిర్వచించునప్పుడు జయకీర్తి ఛందోనుశాసనములో[7] ఈ విధముగా అంటాడు –

    పాదే పాదేఽత్ర ప్రతిగణమపి యతిర్లక్ష్యతే సర్వేషామక్షరాణాం

    (అక్కరలో ప్రతి పాదములో ప్రతి గణమునకు యతి, అనగా పదపు విఱుపు, గలదు)

  2. పాదాంత యతి, అనగా పదము పాదముతో ముగియుట, గానయోగ్యతకు సౌలభ్యమును ఇస్తుంది. అందువలన ఈ పాదాంతయతి నిక్కచ్చిగా లక్షణగ్రంథములలో చెప్పబడకపోయినా, దీనిని కవులు గీతులలో ఎక్కువగా పాటించినారు. ద్విపద, రగడలకు మాత్రము ఇది తప్పని సరి.
  3. ద్వితీయాక్షర ప్రాస కూడ పాటకు ఒక ఆభరణము వంటిదే. జాతులకు నియతమైనా, ఉపజాతులకు ఇది ఐచ్ఛికము. అందులకు బదులు, వడితోబాటు ప్రాసయతిని కూడ ఉపజాతులకు సరియని కవులు, పండితులు, లాక్షణికులు నిర్ణయంచినారు. ఈ యతి స్థానము వద్ద క్రొత్త పదము ప్రారంభమయినప్పుడు ఇది ఇంకను శోభస్కరముగా నుంటుంది.

గణములకు తగునట్లు పదముల విఱుపుతో కొన్ని పద్యములను ఇక్కడ ఉదాహరణములుగా ఇచ్చుచున్నాను –

ఆటవెలది
అక్షమాలఁ బూని – యలమటఁ జెందక
కుక్షి నింపుకొనుట – కొదువఁ గాదు
పక్షి కొంగరీతిఁ – బైచూపు లేఁటికో
విశ్వదాభిరామ – వినుర వేమ – (వేమన పద్యములు, 49[8])

తేటగీతి
ఇష్ట మానస మయిన యా – హేమ ఖగము
నలుని మానస మానంద – జలధియందుఁ
గర్ణ శష్కులి కలశంబుఁ – గౌగిలించి
యీఁదఁ జేయుచు మృదుభాష – నిట్టు లనియె – (శ్రీనాథుని శృంగారనైషధము, 2 -7[9])

ద్విపద –
బసవని శరణన్నఁ – బ్రత్యక్ష సుఖము
బసవని శరణన్న – భవరోగ హరము
బసవని శరణన్న – నసలారుఁ గీర్తి
బసవని శరణన్న – ఫలియించుఁ గోర్కి
బసవని శరణన్న – నెసఁగు వాక్సిద్ధి
బసవని శరణన్న – భ్రాజిల్లు బుద్ధి – (పాల్కురికి సోమనాథుని బసవపురాణము – పీఠిక[10])

కొన్ని సమయములలో రెండు గణములను చేర్చి కూడ కవులు వ్రాసినారు. అట్టి దానికి ఒక ఉదాహరణము –

ఆటవెలది
కమలనయను వదన-కమల “మరందంబుఁ”
దవిలి నయన”షట్ప-దముల”వలనఁ
ద్రావి దినవియోగ – తాపంబు మానిరి
గోపకాంత లెల్ల – గోర్కు లలర – (పోతన భాగవతము, 10.1-627[1])

క్రింద నిచ్చిన పద్యమువంటి పద్యములలో మొత్తముగా గీతి లక్షణములు సరిపోయినను పదములకు గణములకు పొంతన తక్కువ.

ద్యుమణి | పద్మాకరము | విక-చముగఁ | జేయుఁ
గుముద | హర్షంబు | గావించు |- నమృత | సూతి
యర్థితుఁడు | గాక | జలమిచ్చు | – నంబు | ధరుఁడు
సజ్జనులు | దారె | పరహి | తా-చరణ | మతులు – (భర్తృహరి సుభాషితములు, ఏనుగు లక్ష్మణ కవి, నీతి – 63[12])

నవరత్నముల నామములతో గీతుల ఛందములు

తెలుగులోని గానయోగ్యమైన జాత్యుపజాతులలో సూర్యేంద్ర ఉపగణముల సంఖ్య ఈ విధముగా నున్నవి – ఎత్తుగీతికి మూడు, ద్విపదకు నాలుగు, ఆటవెలది (పవడగీతి) తేటగీతులకు ఐదు, మధ్యాక్కరకు ఆఱు, మేలనగీతి ఉత్సాహలకు ఏడు, తరువోజ సీసములకు ఎనిమిది. తరువోజ సీస పాదములను రెండు అర్ధ పాదములుగా తీసికొనినయెడల, అవి ద్విపదకు, నాలుగు ఉపగణముల పాదములకు సరిపోవును. సూర్యేంద్రగణములలో అక్షరసంఖ్యలో, మాత్రల సంఖ్యలో సూర్య గణము చిన్నది, ఇంద్ర గణము పెద్దది. వృత్తసంఖ్య నిర్ణయములో ఏ విధముగా లఘువుకు 1 విలువను, గురువుకు 0 విలువను ఇచ్చినామో అదే విధముగా గీతుల వర్గీకరణ విషయములో సూర్య గణమునకు 1 విలువను, ఇంద్ర గణమునకు 0 విలువను ఇవ్వవచ్చును. అట్లు చేసినప్పుడు మనకు గీతుల సంఖ్య ఈ విధముగా లభించును –

      గణముల సంఖ్య             ఛందము పేరు              గీతుల సంఖ్య      
1 వజ్ర 2
2 వైడూర్య 4
3 నీల 8
4 గోమేధిక 16
5 పుష్యరాగ 32
6 మరకత 64
7 మాణిక్య 128
8 ప్రవాళ 256
9 మౌక్తిక 512

ఛందము లోని గీతి సంఖ్యను ఈ విధముగా కనుగొనవచ్చును. తేటగీతికి గణములు – సూ/ఇం/ఇం – సూ/సూ. సూర్యగణపు విలువ 1, ఇంద్రగణపు విలువ సున్న, కాబట్టి దీనిని యుగ్మాంకముగా ఇట్లు వ్రాయవచ్చును – 10011, దశాంశ పద్ధతిలో దీని విలువ 25. దీనికి ఒకటి చేరిస్తే మనకు 26 లభిస్తుంది. కావున తేటగీతి 5 సూర్యేంద్రగణములు ఉండే పుష్యరాగచ్ఛందములో 26వ గీతి. పాదమునకు నాలుగు గణములు ఉండే గోమేధికచ్ఛందములో 13వ గీతికి గణముల అమరిక ఏ విధముగా ఉంటుంది అనే ప్రశ్నకు జవాబు ఈ విధముగా కనుగొనవచ్చును. మొదట 13 నుండి 1 తీసివేసినప్పుడు మనకు 12 లభిస్తుంది. 12 సంఖ్యను 0011 యుగ్మాంకముగా మనము వ్రాయవచ్చును. 0కు బదులు ఇంద్ర గణమును, 1కి బదులు సూర్య గణమును ఉంచితే మనకు ఇం/ఇం/సూ/సూ లభిస్తుంది. మొదటి పట్టిక నుండి ఇది సీసక గీతి (సీస పాదములోని ద్వితీయార్ధము) అని తెలుస్తుంది.

ఒకటి నుండి ఐదు సూర్యేంద్ర గణములు ఉండే వజ్ర, వైడూర్య, నీల, గోమేధిక, పుష్యరాగచ్ఛందములలో నుద్భవించిన అన్ని గీతులకు ఉదాహరణములను ఇచ్చినాను. ఈ గీతులను మొదటి పట్టికలో చూడవచ్చును. కొన్నిటికి ప్రత్యేకముగా పేరులను పెట్టలేదు. నాకు తెలిసి ఈ గీతులను మఱెక్కడైనను ఉదహరించినయెడల, ఆ పేరులను మార్చలేదు. ఇవన్నియు గీతులు కావున, వీటికి యతియైనను, ప్రాసయతియైనను అంగీకృతమే. పాదమునకు మూడు గణములు ఉండు గీతులకు యతి లేదు. ప్రాస ఐచ్ఛికము. కాని ప్రాస గీతులకు గానయోగ్యతను ఎక్కువ చేయును. నేను ఇచ్చిన ఉదాహరణములలో ప్రాస వాడినాను. ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణమును క్రింద ఇస్తున్నాను. ఇంకను కొన్ని ఉదాహరణములను మొదటి అనుబంధములో చూడ వీలగును. ఈ గీతులను వ్రాయునప్పుడు చాల వఱకు గణములకు సరిపోయేటట్లు పదములు ఎన్నుకొనబడినవి. పేరు ఉంటే గీతి పేరు, తఱువాత గీతి యందలి సూర్య (సూ), ఇంద్ర (ఇం) గణములు, తఱువాత ఛందము పేరు, గణముల సంఖ్య, ఆ ఛందములోని ఈ గీతి సంఖ్య తెలుపబడినవి. యతి స్థానమును గణముల మధ్య ఉండే అడ్డగీత (-) సూచించును. కన్నడ ఛందస్సు నుండి (6,13) గ్రహించిన గీతులను * గుర్తుతో చూపియున్నాను.

వజ్రచ్ఛందము

వజ్ర – ఇంద్ర – ఇం, 1-1
స్వరముల / వరములే / సిరులగు / చిరముగా

వజ్ర – సూర్య – సూ, 1-2
గాథ / నీది / బాధ / నాది

వైడూర్యచ్ఛందము

వైడూర్య – ఇం/ఇం, 2-1
పెదవులో యరుణమ్ము
మదిరయో యరుణమ్ము
కొదమ యీ ప్రాయమ్ము
ముదములో వర్షమ్ము

వైడూర్య – సూ/ఇం, 2-2
ఏటి యొడ్డున
నీటి తుంపర
నాఁటి యాటల
పాటఁ బాడెను

వైడూర్య – ఇం/సూ, 2-3
గగనమ్ము వెలుఁగు
జగమంత వెలుఁగు
పగలంత వెలుఁగు
మొగమంత వెలుఁగు

వైడూర్య – సూ/సూ, 2-4
నమ్మియుంటి
తమ్మికంటి
తెమ్ము నాకు
నెమ్మి రేకు

నీలచ్ఛందము

నీల – కృష్ణగీతి – ఇం/ఇం/ఇం, 3-1
ఆకులపాటుల రాత్రిలో
వ్యాకుల మెందుకు యాత్రికా
ఆకులు రాలెడు కాలమా
నీకిఁక ముగిసెడు కాలమా

నీల – సూ/ఇం/ఇం, 3-2
తిమిర మిఁకలేదు జగములో
సుమము లలరంగ వనములో
విమలమై యొప్పు మనసులో
కమలనేత్రుండు తలఁపులో

నీల – ఇం/సూ/ఇం, 3-3
వెలిఁగెఁగా వేఁగుఁజుక్కయున్
జిలుఁగుతో నందుఁ జుక్కలన్
పలికెనా నదియు రజనితో
పలికెనా నదియు దినముతో

నీల – సూ/సూ/ఇం, 3-4
అరుణమైన మధువులో
తరుణి తడుపు పెదవిలో
మఱచిపోదు నన్ను నే
గరగిపోదు లేకనే

నీల – రమ్యగీతి * – ఇం/ఇం/సూ, 3-5
ఆడెద నానంద కేళి
పాడెద నే రమ్య గీతి
తోడుగ నుండవా నీవు
నీడగ నుండనా నేను

నీల – సూ/ఇం/సూ, 3-6
నీవు మఱువంగ నన్ను
రావు పిలువంగ నన్ను
పూవు పడె నేలఁ జూడు
చావు నాకింక జోడు

నీల – ఎత్తుగీతి – ఇం/సూ/సూ, 3-7
ఆమని లక్ష్మి నీవు
హేమంత రాత్రి నేను
కోమల సుమము నీవు
ఆ మరుభూమి నేను

నీల – రామగీతి – సూ/సూ/సూ, 3-8
దినము వెలుఁగు తగ్గె
మనసు వెలుఁగు హెచ్చె
తనువు డోలలూఁగె
ధ్వనులు మారు మ్రోఁగె

గోమేధికచ్ఛందము

గోమేధిక – మంగళగీతి * – ఇం/ఇం – ఇం/ఇం, 4-1
రంగని కయె పెళ్ళి – రమణి యా గోదతో
మంగళగీతిని – మగువలు పాడిరి
చెంగున వాద్యమ్ము – చెలరేఁగె నెల్లెడ
సంగమ సమయము – సంతోషమయమయె

గోమేధిక – సూ/ఇం – ఇం/ఇం, 4-2
నాకు వలదయ్య – నగల భోషాణమ్ము
నాకు వలదయ్య – నందనోద్యానమ్ము
నాకు వలదయ్య – నవవర్ణ వసనమ్ము
నాకు చాలు నీ – నగుమోము రూపమ్ము

గోమేధిక – ఇం/సూ – ఇం/ఇం, 4-3
సుందరి సీత – సుందర వనమున
కుందెను బాధఁ – గుమిలెను మనమున
ముందర నిలిచె – మ్రొక్కుచు మారుతి
సుందర కాండ – శుభమగు నీ కృతి

గోమేధిక – కోమలగీతి – సూ/సూ – ఇం/ఇం, 4-4
కొండ కొక్క – గుండెయు నుండిన
కొండ పాడు – కోమలగీతిని
మండు టెండ – మాయని శైత్యము
రెండు నొకటి – రేతిరి దివసము

గోమేధిక – ఇం/ఇం – సూ/ఇం, 4-5
మనమున మన మీవు – మమత దీపమా
తనువునఁ దను వీవు – తపన రూపమా
తృణమున నీవెగా – తృప్తి వలయమా
ప్రణయపు నాదమా – ప్రణవ నిలయమా

గోమేధిక – తరళగీతి – సూ/ఇం – సూ/ఇం, 4-6
విరియు పూలతో – మురియు కాంతితో
కురియు జ్యోత్స్నలో – సరస మాడఁగా
తరుణ మిదియెగా – స్వరము లొలుకఁగా
తరళగీతి నే – తరుణి పాడనా

గోమేధిక – తుంగగీతి – ఇం/సూ – సూ/ఇం, 4-7
శృంగమ్ముఁ జూడ – సొగసు వెలిఁగించె
భృంగమ్ముఁ జూడ – విరుల నలరించె
తుంగమ్ము తరగ – తోఁచె నదిలోన
శృంగార గీతి – సిరియె మదిలోన

గోమేధిక – రమణగీతి – సూ/సూ – సూ/ఇం, 4-8
అమల నీకు – నాలపించనా
రమణగీతి – రమణ, పాడనా
కమలమాల – గళము నుంచనా
విమలమైన – ప్రేమఁ జూపనా

గోమేధిక – ఆందోళికాగీతి * – ద్విపదగీతి – ఇం/ఇం – ఇం/సూ, 4-9
చల్లని వెన్నెల – చల్లుచునుండె
పల్లకిలో నుండె – పెళ్ళికుమార్తె
తెల్లని మేనిలో – నెల్లెడ సిగ్గు
మల్లెలవలె నామె – యుల్లపు నిగ్గు

గోమేధిక – భద్రగీతి * – సూ/ఇం – ఇం/సూ, 4-10
తుంగతో భద్ర – తోయమ్ము చేర
సంగమించెఁగా – సంగీత ధార
తుంగభద్రయై – దోలగా నూఁగె
రంగ రాగిణుల్ – రాణగా మ్రోఁగె

గోమేధిక – కూరిమిగీతి లేక మంజులగీతి * – ఇం/సూ – ఇం/సూ, 4-11
ఈ రమణీయ – నీరవరాత్రి
తారల గీతి – దూరమునందు
తీరమునందు – నీరధి గీతి
కోరితి నీదు – కూరిమిగీతి

గోమేధిక – చారుగీతి – సూ/సూ – ఇం/సూ, 4-12
వర్ణమయము – వసుమతి యయ్యె
స్వర్ణమయము – పత్రము లెల్ల
నర్ణవముగ – నరుణమై తోచె
పూర్ణ మయెను – ముగ్గుల రచన

గోమేధిక – సీసకగీతి – ఇం/ఇం – సూ/సూ, 4-13
కన నిను మోదము – కలిగె మెండు
కనుగవ వ్రాసెను – కావ్య మొండు
వినగను స్వనముల – వీణ యంటి
తెనుఁగున కవితల – తేనె యంటి

గోమేధిక – హరిణగీతి – సు/ఇం – సూ/సూ, 4-14
బుసలు గొట్టంగ – భుజఁగతతులు
దెసలు నలుపాయెఁ – దిమిర మలఁది
ముసురు గాలిలో – మ్రోఁత పెరిఁ గె
రసిక నీపైన – రక్తి గలిఁగె

గోమేధిక – శిశిరగీతి – ఇం/సూ – సూ/సూ, 4-15
చేమంతి పూల – చెలువు లేదు
హేమంత మొసఁగు – హిమపు రాశి
సీమలో నెల్ల – శ్వేత మణులు
ఆమనీ నీవు – అకట లేవు

గోమేధిక – మధురగీతి * – సూ/సూ – సూ/సూ, 4-16 (హయప్రచారరగడ)
గుంజమందు – కుసుమరాశి
రంజకమ్ము – రాగమయము
సంజెవేళ – శ్రవణములకు
మంజులమ్ము – మధురగీతి

పుష్యరాగచ్ఛందము

పుష్యరాగ – స్మరగీతి – ఇం/ఇం/ఇం – ఇం/ఇం, 5-1
విరులెల్ల వికసించ వనమందు – విరహమ్ము మఱువంగ
స్మరగీతిఁ జక్కఁగాఁ బాడంగ – మనసాయె నాకిందు
స్మరణమ్ము సేయంగ నీ పేరు – మరణమ్ము వచ్చినన్
సరి నాకు భువిలోన బ్రదుకులో – సరసమ్ము నింప రా

పుష్యరాగ – అమరేంద్రగీతి-1 – సూ/ఇం/ఇం – ఇం/ఇం, 5-2
వాఁడు నా డెందమందుండు – భావనా రూపమ్ము
వాఁడు నా ప్రేమ జగతిలో – వాసంత పుష్పమ్ము
వాఁడు నా చిత్త సంకల్ప – వర్ణప్రదీపమ్ము
వాఁడు నా మోహనాంగుండు – వనజాయతాక్షుండు

పుష్యరాగ – అమరేంద్రగీతి-2 – ఇం/సూ/ఇం – ఇం/ఇం, 5-3
అలలేని సంద్ర మెక్కడో – యరుదుగా నుండుఁగా
కలలేని డెంద మెక్కడో – కాలిపోచుండుఁగా
వెలలేని ప్రేమ యెక్కడో – విరహాన నిండెఁగా
తులలేని రూప మెక్క డే – దొంగదో యెఱుఁగఁగా

పుష్యరాగ – శ్యామగీతి-1 – సూ/సూ/ఇం – ఇం/ఇం, 5-4
పదములేని పాటలన్ – బాడెఁగా మెల్లఁగా
హృదయ మొక్క గీతికన్ – హృద్యమై చల్లఁగా
నిదియె వానితోడ నా – యింపారు మాటలౌ
మదియు నిండె రేయిలో – మా స్వామి మాయలో

పుష్యరాగ – అమరేంద్రగీతి-3 – ఇం/ఇం/సూ – ఇం/ఇం, 5-5
ఆ నింగి శశిబింబమందు – నేనౌదు శశముగ
ఆ నింగి చుక్కలందుందు – నేనొక్క రాశిగా
ఆ నింగి గంగలో నుందు – నేనొక్క పుంతగా
ఆ నిసర్గమ్ములో నుందు – నేనొక్క యణువుగా

పుష్యరాగ – శ్యామగీతి-2 – సూ/ఇం/సూ – ఇం/ఇం, 5-6
సోమసూర్యాగ్నినేత్ర – సోమాంభుశేఖరా
కామగర్వాపహారి – కామాక్షివల్లభా
వ్యోమకేశా గణేశ – యోంకారరూపకా
వామదేవా మహేశ – భస్మాంగ భార్గవా

పుష్యరాగ – శ్యామగీతి-3 – ఇం/సూ/సూ – ఇం/ఇం, 5-7
జడలోన పూలతోడ – జలతారు చీరతో
సడి జేయు నందియలకు – జతయైన గాజులన్
నడచినా రడుగు లిడుచు – నడుముపై బిందెతో
పడఁతు లీ యుదయవేళ – పాటలన్ మాటలన్

పుష్యరాగ – అసమగీతి – సూ/సూ/సూ/ – ఇం/ఇం, 5-8 (ఆటవెలఁది బేసి పాదము)
అందమైన రాత్రి – యానంద తారకా
బృంద మాకసమ్ము-నందెల్ల వెలిఁగెఁగా
విందు నొసఁగ నాదు- వీనుల కిప్పుడే
చిందు మసమగీతి – బిందువుల్ సింధువై

పుష్యరాగ – అమరేంద్రగీతి-4 – ఇం/ఇం/ఇం – సూ/ఇం, 5-9
అన్నము తీయని పొంగలి – వెన్న రొట్టెలు
జొన్నల కంకులు పప్పులు – సన్న దుంపలు
కన్నుల కింపగు వంటలు – చిన్న పువ్వులు
సన్నుతు లీ దిన మతనికి – మన్నిఁ గావఁగ

పుష్యరాగ – శ్యామగీతి-4 – సూ/ఇం/ఇం – సూ/ఇం, 5-10
జలము పోసితిన్ బాత్రలో – వలపు నిండంగ
జలము పోసినా వా పాత్ర – వలపు నిండంగ
జలము కూడంగ జలముతో – సలిల మొకటాయె
జలము నీదేది, నాదేది – వలపు లొకటాయె

పుష్యరాగ – శ్యామగీతి-5 – ఇం/సూ/ఇం – సూ/ఇం, 5-11
యోచనా, దురితమోచనా – ఉదజలోచనా
యోచనా, అసురపాశనా – ఉరగనాశనా
యోచనా, దుష్ట శిక్షణా – హోమరక్షణా
ఈ చరాచరము నీవెగా – హృదయ మీవెగా

పుష్యరాగ – లలితగీతి – సూ/సూ/ఇం – సూ/ఇం, 5-12
మొన్న రాత్రి రాలేదు – నిన్న రాలేదు
నిన్ను జూడ నీరోజు – తెన్ను వెదుకంగ
నిన్ను దాక నీరోజు – పున్నెమగు రంగ
కన్న నీవు రాకున్న – కన్నె వాపోవు

పుష్యరాగ – శ్యామగీతి-6 – ఇం/ఇం/సూ – సూ/ఇం, 5-13
మానససరసిలో హంస – స్నానమాడంగ
కానఁగ నెన్నియో నలలఁ – గదలి యూఁగంగ
పానము జేసేను పాలు, – వదలి నీరమ్ము
గానము సలుపంగ నయ్యెఁ – గలఁత దూరమ్ము

పుష్యరాగ – ప్రభాతగీతి – సూ/ఇం/సూ – సూ/ఇం, 5-14
సుందరాకాశమందు – సోయగమ్ములే
మందమారుతమందు – మత్తు తావులే
నందనందనా నీవు – నాకు సొమ్ములే
ముందు చూపరా మోము – మోహనమ్ములే

పుష్యరాగ – సాంధ్యగీతి – ఇం/సూ/సూ – సూ/ఇం, 5-15
రావోయి చందమామ – రసము నింపంగ
తేవోయి పసిఁడి కాంతి – దిశలు వెలుఁగంగ
పూవులా వచ్చి తాకు – ముద్దు లీయంగ
నీవూపు మీ నిసుంగు – నిదుర పోవంగ

పుష్యరాగ – ఉదయగీతి-5 – సూ/సూ/సూ – సూ/ఇం, 5-16
మనసు జలధియైన – మణులు నీవందు
తనువు జలధియైన – తపన నీవందు
కనులు జలధియైన – కాంతి నీవందు
నెనరు జలధియైన – నిప్పు నీవందు

పుష్యరాగ – అమరేంద్రగీతి-5 – ఇం/ఇం/ఇం – ఇం/సూ, 5-17
అందమై పాడనా నీకు నే – నమరేంద్రగీతి
విందుగా నిది యుండు విడువకన్ – వీనులం దెపుడు
ముందు నీ బ్రదుకులో గీతి యిం-పొందఁగా నిలుచు
సుందరమ్మై శుక్రతారగా – శోభించి వలచు

పుష్యరాగ – శ్యామగీతి-7 – సూ/ఇం/ఇం – ఇం/సూ, 5-18
రామ రాజీవలోచనా – రఘువంశదీప
రామ మునివర్య మఖపోష – రాకేందురూప
రామ జానకీవల్లభా – రావణధ్వంస
శ్యామ సాకేతపురరాజ – సచ్చిత్తహంస

పుష్యరాగ – శ్యామగీతి-8 – ఇం/సూ/ఇం – ఇం/సూ, 5-19
బంగారుతీగ బియ్యమ్ము – వండించి తాను
రంగుల కూర లెన్నియో – రమియించ వేఁచె
నింగువ చారు కాఁచెఁ దాఁ – నింపుగా నీకు
శృంగారవల్లి బోనమ్ము – సేయఁగాఁ బిలిచె

పుష్యరాగ – నెలవంక లేక నిర్మలగీతి – సూ/సూ/ఇం – ఇం/సూ, 5-20
నింగినుండి నావంక – నెలవంక జూచె
నేమి తెలుసు నా శశి – కీ నాదు మనసు
సుఖము నెఱుఁగ వా చంద్ర – సూర్యగ్రహాలు
బాధ లెఱుఁగ వా తార – లీ ధరాతలిని

పుష్యరాగ – శ్యామగీతి-9 – ఇం/ఇం/సూ – ఇం/సూ, 5-21
కాంచెను రాముని సీత – కందోయి నిండ
కాంచెను రాముఁడు సీతఁ – గందోయి నిండ
కాంచఁగ నొండయె రెండు – కంపిలు హృదులు
కాంచిరి యెల్లరు జనులు – కల్యాణ ఘటన

పుష్యరాగ – చిఱుగీతి – సూ/ఇం/సూ – ఇం/సూ, 5-22
ఒక్క విధముగా నుండు – నుర్విలో ముదము
లెక్క లేనన్ని విధము – లెప్పుడున్ వెతలు
దిక్కు తోచక నుండుఁ – దెరువులన్ వెదుకఁ
బ్రక్క లేనిచోఁ బ్రియుఁడు – బ్రదుకౌను తునుక

పుష్యరాగ – ఆమనిగీతి – ఇం/సూ/సూ – ఇం/సూ, 5-23
తెలుసునా నీకు తరువు – పలికెడు భాష
తెలుసునా నీకు విరులు – పలికెడు భాష
తెలుసునా నీకు గిరులు – పలికెడు భాష
తెలుసునా నీకు మనసు – పలికెడు భాష

పుష్యరాగ – ఉదయగీతి-4 – సూ/సూ/సూ – ఇం/సూ, 5-24
కమలనయన దివ్య – కౌసల్యతనయ
కమలమిత్రు నుదయ – కాలమ్ము లెమ్ము
అమలసంధ్య జపము – నాచరించంగ
విమల కల్య వేళ – విడు నిద్ర సామి

పుష్యరాగ – శ్యామగీతి-10 – ఇం/ఇం/ఇం – సూ/సూ, 5-25
ఆకసమ్మున నీల జీమూత – హార మెందు
నేకమై మెలమెల్లఁ జల్లఁగా – హిమము చిందె
స్వీకరించెను పృథ్వి యభ్రంపు – శ్రీముఖమ్ము
రాకపోకలు తగ్గె రహదారి – రజత మాయె

పుష్యరాగ – తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ, 5-26
తోటయం దొక్క వలయమ్ముఁ – దొలుతఁ దీర్చి
తేట తెలుఁగులోఁ బాడుచున్ – దేటగీతి
మీటి శృంగార వీణలన్ – మృదుల రవము
నాట లాడంగ నీరోజు – హర్షకరము

పుష్యరాగ – బాలగీతి – ఇం/సూ/ఇం – సూ/సూ, 5-27
రాకకై యెదురుజూచితి – రావు నీవు
వేకువన్ జూడు నభములో – వెలుఁగు నిండె
చీఁకటుల్ దొలఁగె జగములోఁ – జెలువు నిండ
నీ కళాపూర్ణ హృదిలోన – నేను లేనె

పుష్యరాగ – ఉదయగీతి-3 – సూ/సూ/ఇం – సూ/సూ, 5-28
మనసులోని మనసుగా – మసలినావు
ననుఁ గనంగ నయముగా – నవ్వినావు
దినము రాత్రి ముదములోఁ – దేల్చినావు
వెనుక వదలి యెందుకే – వెళ్ళినావు

పుష్యరాగ – ముత్యాలముగ్గు లేక సుందరగీతి – ఇం/ఇం/సూ – సూ/సూ, 5-29
పారఁగా నుల్లమునందు – భక్తినదియు
శ్రీరంగనాథుని మార్గ-శీర్షమందుఁ
జేరంగఁ గోరుచు గోద – సేసె సేవ
హారమ్ముఁ దాలిచి యిచ్చు – హారి కెపుడు

పుష్యరాగ – ఉదయగీతి-2 – సూ/ఇం/సూ – సూ/సూ, 5-30
గొల్లపడుచులు చిలుకు – కుండలందు
దెల్లనగు వెన్న బైకిఁ – దేలివచ్చె
గల్లుగల్లంచు లలన – గాజులాడె
హృల్లతలు బూచె సరస-హృదయుఁ జూడ

పుష్యరాగ – ఛందోవతంసము * – ఉదయగీతి-1 – ఇం/సూ/సూ – సూ/సూ, 5-31
ఉదయమ్ము, తూర్పు నరుణుఁ – డుద్భవించె
ఉదయమ్ము, నభమునందు – నుషయు వెల్గె
ఉదయమ్ము, సరసిలోన – నుదజ మలరె
ఉదయమ్ము, క్రొత్త యాశ – లుదయ మాయె

పుష్యరాగ – కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ, 5-32
కమలగీతి వినఁగ – ఖమణి వచ్చె
భ్రమరగీతి వినఁగ – రమణి వచ్చె
రమణిగీతి వినఁగ – రాజు వచ్చె
సుమవనమ్మునందు – శోభ వచ్చె

పైన ఉదహరించిన 62 గీతులు కాక సూర్యేంద్ర గణములతో శోభిల్లు తెలుగులోని మిగిలిన ఛందస్సుల వివరములు క్రింది విధముగా నుండును –

మరకత మధ్యాక్కర ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ 6-37
మధురగీతి సూ/సూ/సూ – సూ/సూ/సూ 6-64
మాణిక్య ఉత్సాహ సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం 7-64
హృదయగీతి ఇం/సూ/సూ – ఇం – ఇం/సూ/సూ 7-103
కమలన(మేలన)గీతి సూ/సూ/సూ/సూ – సూ/సూ/సూ 7-128
ప్రవాళ తరువోజ ఇం/ఇం – ఇం/సూ – ఇం/ఇం – ఇం/సూ 8-137
సీసము ఇం/ఇం – ఇం/ఇం // ఇం/ఇం – సూ/సూ 8-193
తురగవల్గనరగడ సూ/సూ -సూ/సూ – సూ/సూ – సూ/సూ 8-256
విరులసరము సూ/సూ – ఇం/ఇం // ఇం/ఇం – ఇం/ఇం 8-4 (విలోమసీసము)
జవోరుతము సూ/ఇం – ఇం/ఇం – సూ/ఇం – ఇం/ఇం 8-18 (విలోమతరువోజ)

మధురగీతికి ఒక ఉదాహరణము
మరకత – మధురగీతి- సూ/సూ/సూ – సూ/సూ/సూ, 6-64
మధురలోన నుండు – మదనమోహనుండు
వ్యధల నెల్లఁ బాపు – మదికి నిచ్చుఁ దీపు
మృదులమైన నవ్వు – హృద్యమైన పువ్వు
నిదురయందు వాఁడె – నెనరులోన వాఁడె

హృదయగీతికి ఒక ఉదాహరణము
మాణిక్య – హృదయగీతి – ఇం-సూ-సూ – ఇం – ఇం-సూ-సూ – 7-103
కోకిలా పాడబోకు – కొమ్మపై – నాకులన్ మెక్కి చటుల
చీకుచింతలను మాని – చెల్లునా – నీకుఁ బాడుటయు నిటుల
రాక వాడుండిపోయె – రాత్రిలో, – వేకువన్ వెలుఁగు నిండె
నీకు నే దెలుపు టెట్లు – నెంజెలిన్, – మేకుగా జీల్చె గుండె

విషమగీతిగా పేర్కొనబడిన కమలనగీతికి ఒక ఉదాహరణము
మాణిక్య – కమలన(మేలన)గీతి – సూ/సూ/సూ/సూ – సూ/సూ/సూ, 7-128
చిన్న చిన్న యాశ నాకు – చిన్న చిన్న యాశ
నిన్ను గనఁగ నాశ నాకు – నిన్ను గనఁగ నాశ
సన్నజాజి మాల వేతు – సన్నజాజి మాల
నన్ను గాన వేల నీవు – నన్ను గాన వేల

ఆధునిక సాహిత్యములోని కొన్ని గీతులు

తక్కువ గణములతో ఉండు గీతులకు ప్రయోజనము ఉన్నదా అనే ఆలోచన కలుగవచ్చును. ఆధునిక సాహిత్యములో అట్టి గీతులు ఉన్నాయి.

నండూరి సుబ్బారావు ‘యెంకితో తిరపతి’ పాట లోని[14] చరణములు రెండు ఇంద్ర గణములతో నున్నాయి – ఉదా. మొదటి చరణము –

ఆవ్ను దూడల్నిచ్చి
అత్తోరి కాడుంచి
మూట ముల్ళీ గట్టి
ముసిలోళ్ళతో సెప్పి … యెంకి నాతోటి రాయే

అడివి బాపిరాజు ‘మెట్లు'[15] అనే గేయమును త్ర్యస్రగతిలో చాలవఱకు రెండు సూర్య గణములతో వ్రాసినాడు. అందులో నుండి ఒక చరణము –

కోట్ల కోట్ల / గుణగణాల
అడుగులబడి / అరిగిపోయి
అడుగులబడి / తరిగిపోయి
మెట్లు మెట్లు / రాతి మెట్లు
కారు నల్ల / రాతి మెట్లు

నాలుగు సూర్య గణములతో బసవరాజు గీతాలలోని దొకటి[16] –

బ్రతుకు బరువు మోయ లేక
చివికి చివికి డస్సినాఁడ
పికరు పుట్టి పారిపోయి
ఒకడ నేను తోటలోన

అబ్బూరి రామకృష్ణరావు ‘ప్రశంస’ లోని[16] చరణము ఇం/ఇం/సూ గణములకు సరిపోతుంది –

నిన్ను ప్రశ్నింపగా జాల
నీ నాఁటి ప్రొద్దుటి పూఁట
గంభీరమై ప్రవహించె
నీదు సౌందర్యంపు పాట

వృత్తములలో సూర్యేంద్ర గణములు

సంస్కృతములో నుదహరించబడిన వృత్తముల గురు లఘువులను సూర్యేంద్ర గణములుగా విభజించుటకు వీలగునా అన్న ఒక ఆలోచన కలిగినది. Sanskrit Language Resources అనే వెబ్‌సైటులో వేయికి పైగా వృత్తములకు లక్షణములు ఇవ్వబడినవి. వాటిని నేను, శ్రీ దిలీప్ మిరియాల పరిశీలించి ఒక పట్టికను తయారు చేసినాము. సుమారు నాలుగు వృత్తములలో ఒక దానికి ఇది సాధ్యము. ఇందులో మఱొక విశేషము ఏమనగా ఒకే వృత్తమునకు ఒకటికన్న ఎక్కువగా గీతుల లక్షణములు ఉన్నవి. ఈ పట్టికను రెండవ అనుబంధములో పరిశీలించవచ్చును. గీతుల చాయలున్న కొన్ని వృత్తములకు క్రింద ఉదాహరణములను ఇస్తున్నాను.

1) అన్వర్తికాపవాసక – త/ర/జ/ర, యతి (1, 8) UUI UI UI – UI UIU ఇం/సూ/సూ – సూ/ఇం, సాంధ్యగీతి, 5-15; 12 జగతి 2795

కోరండి వచ్చునంచుఁ – గ్రొత్త లోకముల్
మీరింక నేర్వ రండి – మేలు శాస్త్రముల్
చేరండి దూరమందుఁ – జెల్గు తారలన్
తారాశశాంకభూమి – తాకి రండహో!

2) చమరీచరము – న/న/ర/న/ర, యతి (1, 10), III III UIU III UIU సూ/సూ/ఇం – సూ/ఇం, లలితగీతి, 5-12; 15 అతిశక్వరి 11968

విరహ మదియు బాధయే – వెతల గాథయే
మురిపె మిచట లేదుగా – ముదము చేదుగా
స్వరము లవియు నెల్గులో – వఱలు మూల్గులే
విరులు వలదు నాకిఁకన్ – వెలుఁగు లేదిఁకన్

3) విరేకి – ర/న/ర/ల 10 పంక్తి 699 UIU III – UI UI ఇం/సూ – సూ/సూ, శిశిరగీతి, 4-15

ఆమనీ కనదె – హర్ష మెందు
కోమలీ మనసు – కుందె నిందు
ఏమియో బ్రదుకు – లిట్టు లాయె
కామినీ కలలఁ – గాన వాయె

UI UI – IIUI UI సూ/సూ – ఇం/సూ, చారుగీతి, 4-12

సొంపులీను – శుకపాళి లేదు
కంపులీను – కమలమ్ము లేదు
అంపశయ్య – యయె భూమి చూడు
చంపుచుండెఁ – జలి నన్ను నేఁడు

4) ముకులితకలికావలీ – ర/న/న/ర; 12 జగతి 1531;

UIU III – III UIU ఇం/సూ – సూ/ఇం, తుంగగీతి, 4-7

మానసోత్కళిక – మఱల విచ్చునో
వేణు సద్రుతము – వినఁగ వచ్చునో
తేనియల్ ఝరిగఁ – దియగ పారునో
వానగన్ గురిసి – వలపు ముంచునో

UI UII IIII UIU సూ/ఇం – ఇం/ఇం, 4-2

గానలోలుని – గలయఁగఁ నెంచఁగా
మానసమ్మున – మరులను బెంచఁగా
నేను నీకను – నిజమును గాంచఁగా
మేను వేచెను – మృదుమధురమ్ముగా

5) గీతికా – స/జ/జ/భ/ర/స/లగ, యతి లేక ప్రాసయతి (1, 11) IIUI UII UIU – IIUI UII UIU ఇం/ఇం/ఇం – ఇం/ఇం/ఇం, 6-1; 20 కృతి 372076

విరబూయు పూవుల గంధమై – విరిబోణి యిచ్చెను ఛందమై
హరివిల్లు వెల్గుల రంగులై – మురిపించు నీరధి పొంగులై
సురనారి నాట్యపు చిందులై – స్వరరాగ శోభల విందులై
సరసాన మల్లెల మాలతో – నరుదెంచు మిప్పుడు శ్రీలతో

6) సిద్ధి – ర/స/న/ల 10 పంక్తి 987

UIU IIUI III ఇం/ఇం/సూ, 3-5

పుష్పమై విరబూయు నెనరు
బాష్పమై కనుజారు ననరు
పుష్పమై విరబూయు నగవు
బాష్పమై కనుజారుఁ దగవు

UI UII – UI III, సూ/ఇం – సూ/సూ, తరళగీతి, 4-14

సిద్ధిఁ బొందితిఁ – జేర నిపుడు
శుద్ధిఁ బొందితిఁ – జూడ నిపుడు
బుద్ధి గల్గెను – భూమిపయిన
బుద్ధుఁ డిచ్చును – బోధనలను

అర్ధసమ గీతులు

వృత్తములలో ఏ విధముగా అర్ధసమ వృత్తములు ఉన్నాయో అదే విధముగా గీతులలో కూడ అర్ధసమ గీతులను సృష్టించ వీలగును. అట్టి గీతులలో ప్రసిద్ధమైనది ఆటవెలది గీతి. తేటగీతిలో అన్ని పాదములకు లక్షణములు ఒకే విధముగా నుండగా, ఆటవెలదికి బేసి పాదములకు ఒక విధముగా, సరి పాదములకు ఒక విధముగా లక్షణములు గలవు. ఇలా వేఱువేఱు లక్షణములు పాదములకు ఉన్నప్పుడు గీతిని పాడుకొనునప్పుడు విసుగు లేని వైవిధ్యము కనబడును. అప్పుడు గీతములో ఒక నూతనమైన నడక, శోభ కలుగుతుంది. అర్ధసమగీతుల సంఖ్య నిజముగా లెక్కకు లేనన్ని. మూడు-నాలుగు సూర్యేంద్ర గణములతో 128, మూడు-ఐదు సూర్యేంద్ర గణములతో 256, నాలుగు-ఐదు సూర్యేంద్ర గణములతో 512 అర్ధసమ గీతులను సృష్టించ వీలగును. కాని తెలుగులో ఆటవెలది, సీసము మాత్రమే ఈ కోవకు చెందినవి. అనగా అందఱికి జనరంజకముగా అందుబాటులో ఉండే ఇట్టి ఛందస్సుల లేమి నా ఉద్దేశములో ఒక పెద్ద లోపమే. తేట తెలుగు పదాలతో గానయోగ్యములైన ఛందస్సులు ప్రజల నోటిలో పాటల రూపములో, పద్యముల రూపములో కలకాలము నిలిచి ఉంటాయి. కన్నడమునుండి కొన్ని, నేను కల్పించినవి కొన్ని అర్ధసమ గీతులను రెండవ పట్టికలో చూడగలరు. ప్రతి అర్ధసమగీతికి ఒక ఉదాహరణమును క్రింద ఇస్తున్నాను. మిగిలినవాటిని మూడవ అనుబంధములో చదువ వీలగును. కన్నడ ఛందస్సునుండి (6, 13) గ్రహించిన గీతులను * గుర్తుతో చూపియున్నాను.

ఉత్సాహగీతి-1 – యతి లేక ప్రాసయతి బేసి పాదములకు ఐదవ గణముతో, సరి పాదములకు నాలుగవ గణముతో బేసి పాదములు – (ఉత్సహ పాదము) సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం, 7-64; సరి పాదములు – (తేటగీతి పాదము) సూ/ఇం/ఇం – సూ/సూ, 5-26

ఆలయమ్ము చెంత భిక్ష – నడుగుచుంటి వాని నే
నాలకించంగ వాఁడు రాఁ-డాయె ముందు
కాలమెల్ల నిట్లు జగతి – గడచిపోవుచుండెఁగా
రాలు నా పండుటాకులా – రాలిపోదు

ఉత్సాహగీతి-2 – యతి లేక ప్రాసయతి బేసి పాదములకు ఐదవ గణముతో, సరి పాదములకు నాలుగవ గణముతో బేసి పాదములు – (ఉత్సాహ పాదము) సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం, 7-64; సరి పాదములు – (ఆటవెలది బేసి పాదము) సూ/సూ/సూ – ఇం/ఇం, 5-8

శిశిరఋతువులోన నిలుచు – చెట్టువోలె నుంటిఁగా
దిశల వెలుఁగు తగ్గెఁ – దిమిరమ్ము హెచ్చెఁగా
కృశితమయ్యె నాశ లెల్లఁ – కృపను జూపవేలకో
వశము జేసికొమ్ము – వసుధపై నను నీవు

లీలాషట్పద – బేసి పాదములకు ప్రాసయతి, సరి పాదములకు యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో బేసి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ/సూ, 6-64; సరి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ, 5-32

నింగిఁ జలువఱేఁడు – రంగు లిడెను నేఁడు
శృంగమందుఁ జూడు – సిరుల మంచు
చెంగలువల తావి – భృంగములకు నీవి
రంగఁ డూఁదుఁ గ్రోవి – రహిని ముంచు

నర్తకి గీతి
– యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో బేసి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ/సూ, 6-64; సరి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ, 5-32

చెరువులోని చేప – చిందులాడె మురిసి
అరుణకాంతిలోన – నతిగ మెఱిసి
సరసియందుఁ జూడ – విరిగఁ దోచె నదియు
తరువు లేని చోట – విరియు కదిలె

అళిగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – సూ/సూ/సూ, 5-29; సరి పాదములు – ఇం/ఇం – సూ/సూ, 4-13

సుమరాశి యళిగీతి – సోలి వినుచు నూఁగె
కమనీయమగు వేళ – గాలి యూఁగె
విమల రాగమ్ములో – వేయి సడులు లేచె
రమణీయ ఋతువులో – రమణి వేఁచె

ఆటగీతి లేక సరసగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/ఇం – ఇం/సూ/సూ, 5-26; సరి పాదములు – సూ/ఇం – ఇం/సూ, 4-10

తెల్ల పిల్లిలా – తేట వెన్నెలగ రావె
మెల్లమెల్లగా – మేఘాల రావె
కల్వ పూరేకు – కనుల మూయంగ రావె
చల్లఁగా నిద్ర – స్పర్శించి పోవె

తేనెగీతి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో బేసి పాదములు – సూ/ఇం – ఇం/సూ/సూ, 5-26; సరి పాదములు – సూ/ఇం /ఇం, 3-2

చూడు మావైపు వినువీథి – సోయగాలు
చూడు మీవైపు మేఘాలు
చూడు మావైపు గగనాన – సూర్యకాంతి
చూడు మీవైపు హరివిల్లు

ఆటవెలఁది – యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో బేసి పాదములు – సూ/సూ/సూ – ఇం/ఇం, 5-8; సరి పాదములు – సూ/సూ/సూ – సూ/సూ, 5-32

ఆటవెలఁది యాడె – నందమ్ము నిండఁగా
నీటుగాను జూపె – నిగ్గు లెన్నొ
తేటగీతిఁ బాడెఁ – దియ్యఁగా నయముగా
మేటియైన రవము – మేడ నిండె

నాట్యరాణి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, సరి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/సూ/సూ – ఇం/ఇం, 5-8; సరి పాదములు – సూ/సూ – ఇం/ఇం, 4-4

నీవు రాక నాకు – నిదురయే లేదురా
నీవు లేక – నిదురయే రాదురా
జీవమున్న కూడ – చేవయే లేదురా
నీవు లేక – నేనిందు లేనురా

సుషమగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/ఇం – సూ/ఇం/ఇం, 5-6; సరి పాదములు – సూ/ఇం – సూ/ఇం, 4-6

పగలు రేతిరి – పనుల తొందర ముంచఁగా
సగము కాలము – జారిపోయెను
మిగులు కాలము – మేను వాల్చఁ దలంచఁగా
రగులు నీ హృది – రగిలి యారును

రాసగీతి * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/సూ – సూ/సూ, 4-16; సరి పాదములు – సూ/సూ/సూ, 3-8

హరికి పేరు – హర్ష మగును
సిరికి నిరవు వాఁడు
సరస నుండ – సరస మగును
సురవములకు వీడు

అరుణగీతి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/సూ – సూ/సూ, 4-16; సరి పాదములు – సూ/సూ/ఇం, 3-4

చక్కనమ్మ – సన్నగిల్లె
జిక్కిపోయె నాంచారు
ఎక్కడుండె – నెడఁద యకట
చెక్కిలిపయి కన్నీరు

నందగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతోబేసి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9; సరి పాదములు – ఇం/ఇం – సూ/సూ, 4-13

జాబిల్లి వెలుఁగులోఁ – జలి వేయుచుండె
నా బుల్లి పాపాయి – నవ్వుచుండె
డాబాయె స్వర్గంపు – టద్దాల దారి
పూబంతు లాడంగ – పులకఁ జేరి

కనకాంగి లేక అనామిక – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9; సరి పాదములు – ఇం/ఇం/సూ, 3-5

మనసులో నగ్గి నన్ – మసిజేయ మున్ను
వనజాక్షి చూడుమా నన్ను
యెనలేని యాశతో – నెగురుదా మిపుడు
మనమింక సుఖజీవు లెపుడు

రేయెండ లేక నెలరేక – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9; సరి పాదములు – ఇం/ఇం – ఇం, 3-1

మల్లియ తావియో – మనసులో – మమత
తెల్లని రేయెండ – దీప్తియో
చల్లని మృదువైన – స్పర్శయో – బ్రమత
జల్లుగా వర్షించు – జ్ఞప్తియో

చెలిమిగీతి – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/ఇం – సూ/ఇం, 4-6; సరి పాదములు – సూ/ఇం – ఇం/సూ/సూ, 5-26

వలపు కలియఁగా – చెలిమి విరియఁగా
కలిమి మురియఁగా – కనుల నీళ్ళేల బాల
ముదము కలియఁగా – పదము విరియఁగా
హృదులు మురియఁగా – నిట్టులీ చింత లేల

కలువ గీతి – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – సూ/ఇం – సూ/ఇం, 4-6; సరి పాదములు – సూ-ఇం-ఇం, 3-2

మనసు పలికిన – మౌన రాగము
వినఁగ వేఁచుచు నుంటివో
కనులు వ్రాసిన – కావ్య గాథను
గనులఁ జదువఁగ నుంటివో

విరులసరము – (విలోమ సీసము) యతి లేక ప్రాసయతి ప్రతి అర్ధ పాదములో మూడవ గణముతో బేసి పాదములు – సూ/సూ – ఇం/ఇం, 4-4; సరి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1

సరసమయము – చారుహాసము నీది
మురిసె నా డెందమ్ము – పురి విప్పు నెమలిలా
విరుల సరము – ప్రియ నేను జూడఁగా
హరుసంపు గంధమ్ము – వ్యాపించె మనసులో
సిరుల పాట – శ్రీరాగ మాలించ
ఝరివోలె పారెనే – స్వరరాగ సుధలిందు
యిరవు నాది – యిఁక నొక్క స్వర్గమ్మె
కురిపించు నందమ్ము – గుడివోలె నమలమ్ము

పై పద్యమును తీసికొని రెండేసి గణములను వెనుకనుండి వ్రాస్తే అది సీసమవుతుంది –

పురి విప్పు నెమలిలా – మురిసె నా డెందమ్ము
చారుహాసము నీది – సరసమయము
వ్యాపించె మనసులో – హరుసంపు గంధమ్ము
ప్రియ నేను జూడఁగా – విరుల సరము
స్వరరాగ సుధలిందు – ఝరివోలె పారెనే
శ్రీరాగ మాలించ – సిరుల పాట
గుడివోలె నమలమ్ము – కురిపించు నందమ్ము
యిఁక నొక్క స్వర్గమ్మె – యిరవు నాది

మోహనగీతి * – యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1; సరి పాదములు – ఇం/ఇం – ఇం/సూ, 4-9

స్వరముల నేటితో – పలుపలు రాగముల్
చెరలుచుఁ బాడఁగాఁ – జిందును సుధలు
కరుగును వెన్నయై – కలలకు వన్నెయై
వఱలును డెందమ్ము – పరవశమొంది

సాంగత్యము * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1 ; సరి పాదములు – ఇం/ఇం/సూ, 3-5

నీ వాస మా కొండ – నా వాస మీ లోయ
మోవి నే ముద్దాడు టెట్లు
నీవేమొ దిగిరావు – నేనెక్కఁగా లేను
యా వేయి యెత్తైన మెట్లు

ఏల * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1 ; సరి పాదములు – ఇం/సూ/ఇం, 3-3

వెలుఁగులో నింపరా – ప్రేమలో తడుపరా
అలలుగా పొంగు కడలిరా
కలలలో రమ్మురా – కౌగిళ్ళ నిమ్మురా
నెలఁతపై సుధలఁ జిమ్మరా

సొబగుల సోన * – బేసి పాదములకు యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/ఇం – ఇం/ఇం, 4-1; సరి పాదములు – ఇం-ఇం-ఇం, 3-1

సొంపుల వానవై – సొబగులసోనవై
వంపుల రూపమై రా చెలీ
కెంపుల చెంప నా – కింపుగఁ దోచెఁగా
చంపక వేగమే రా సకీ

గీతిక * – సరి పాదములలో యతి లేక ప్రాసయతి మూడవ గణముతో బేసి పాదములు – ఇం/సూ/ఇం, 3-3; సరి పాదములు – ఇం/ఇం – సూ/ఇం, 4-9

ఏ రాగ గీతి పాడ నే
నో రాగ రంజనీ – యుల్లసించంగా
గారాముతోడ నీకు నే
శ్రీరాగమును బాడి – చేర రమ్మందు

కందగీతి – సరి పాదములలో యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో బేసి పాదములు – సూ/ఇం/ఇం, 3-2; సరి పాదములు – సూ/ఇం/ఇం – సూ/సూ, 5-26

ఎదయు పిడికిలి పూవుగా
ముదముతో కొన్ని వేళల – మురిసిపోవు
నెదయు పిడికిలి పూవుగా
వ్యధలతో కొన్ని వేళల – వాడిపోవు

వెన్నెల లేక జ్యోతి – బేసి పాదములు – ఇం-ఇం-ఇం, 3-1; సరి పాదములు – ఇం-ఇం-సూ , 3-5

స్వయముగా ప్రేమతో వ్రాసితిన్
బ్రియతమా చదువవా లేఖ
నయముగా తేనెతో పాలతో
భయము సంకోచమే లేక
హొయలతో వలపు పుష్పించఁగా
బ్రియములౌ కవితలన్ జూడు
హయముపై రా వచ్చి ప్రీతితో
లయల యీ గీతికన్ బాడు

అర్ధసమ గీతులలోని విశేషములు

అర్ధసమగీతుల కొన్ని విశేషములను ఇప్పుడు గమనిద్దాము. దీనికి ఆటవెలదిని ఒక ప్రతినిధిగా తీసికొన్నాను. మిగిలిన అర్ధసమగీతులకు కూడ ఇవి వర్తించును. ఇది చాల ముఖ్యమైన విషయము, ఎందుకనగా గీతి అమరిక కూడ గానయోగ్యతకు ఒక ప్రధానాంశమే. ఆటవెలది బేసి పాదములను ఆట (ఆ) పాదములని, సరి పాదములను వెలది (వె) పాదములని పిలుస్తాను. ఏ పాదమునకు ఆ పాదమును స్వతంత్రముగా వ్రాసినప్పుడు, వీటిని ఆఱు విధములుగా అమర్చవచ్చును. అవి – (1) ఆ-వె-ఆ-వె, (2) వె-ఆ-వె-ఆ, (3) ఆ-ఆ-వె-వె, (4) వె-వె-ఆ-ఆ, (5) ఆ-వె-వె-ఆ, (6) వె-ఆ-ఆ-వె. అందులో ఒక్కొక్క దానిని నాలుగు విధములుగా వ్రాయవచ్చును. అనగా ఒక అర్ధసమ గీతి పాదములను 24 విధములుగా అమర్చవచ్చును. వీటిని నాలుగవ అనుబంధములో చదువవచ్చును. ఆ ఆఱు విధములకు ఒక్కొక్క ఉదాహరణము –

(1) ఆ-వె-ఆ-వె 1234 పాదములు + ఇట్టివి ఇంకొక మూడు

దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు

(2) వె-ఆ-వె-ఆ 2143 + ఇట్టివి ఇంకొక మూడు

దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

(3) ఆ-ఆ-వె-వె 1324 + ఇట్టివి ఇంకొక మూడు

దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు

(4) వె-వె-ఆ-ఆ 2413 + ఇట్టివి ఇంకొక మూడు

దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

(5) ఆ-వె-వె-ఆ 1243 + ఇట్టివి ఇంకొక మూడు

దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

(6) వె-ఆ-ఆ-వె 2134 + ఇట్టివి ఇంకొక మూడు

దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు

పైన ఇచ్చిన ఉదాహరణములన్నిటిలో విధిగా ఒక పద్యములో రెండు ఆట పాదములు, రెండు వెలది పాదములు గలవు. ఈ నియమమును తొలగించి, 0, 1, 2, 3, 4 ఆట లేక వెలది పాదములతో ఎన్ని గీతులను సృష్టించవచ్చును అన్న ప్రశ్నకు జవాబు 16. అవి – సున్న ఆట పాదములు (లేక అన్ని వెలది పాదములు) – 1, ఒక ఆట, మూడు వెలది పాదములు – 4, రెండు ఆట, రెండు వెలది పాదములు – 6, మూడు ఆట, ఒక వెలది పాదము – 4, అన్ని ఆట పాదములు (సున్న వెలది పాదములు) – 1. అట్టి 16 అమరికలను ఐదవ అనుబంధములో చదువ వీలగును.

వెలఁదిగీతి – ఆటవెలది, తేటగీతి – ఈ రెంటిని చేరిస్తే (అనగా ఒక సమగీతి పాదము, రెండు అర్ధసమగీతి పాదములు) వెలదిగీతి వస్తుంది. ఇది మూడు విధములుగా సాధ్యము – (1) రెండు తేటగీతి పాదములు, రెండు ఆటవెలది పాదములు; (2) రెండు ఆటవెలది పాదములు, రెండు తేటగీతి పాదములు; (3) ఒక తేటగీతి పాదము, రెండు ఆటవెలది పాదములు, ఒక తేటగీతి పాదము. రెండు ఆటవెలది పాదములు అవసరము, ఎందుకనగా అందులో రెండు పాదములు వేఱు విధముగా ఉంటాయి కనుక. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా చేజెర్ల గ్రామములో శ్రీకపోతేశ్వర స్వామి గుడిలో శక సంవత్సరము 1085 (అనగా క్రీ.శ. 1163) నొక ఱాతి స్తంభముమీద చెక్కబడిన శాసనమునందలి సీసపద్యమునకు ఎత్తుగీతి (2) రెండవ విధముగా వ్రాయబడినది. ఆ పద్యము –

సిద్ధ వంద్యుఁడైన – చేజెఱువుల కపో-
తీశ్వరునకు భక్తి – శాశ్వతముగ
మనుమ కులుఁడైన తాడూరి – ఘనుఁడు మార
మాంబ కేతఁ డఖండ దీ-పంబు నిలిపె

మూడవ తీరులో నేను వ్రాసిన వెలదిగీతము క్రింద ఉదహరించబడినది-

వెలఁదిగీతి – తే.గీ./ఆ.వె./తే.గీ. పాదములతో –
తేటగీతిని యమృతపు – యూట యనఁగ
నాటవెలఁది యామె – యందముల్ జిందించి
తేట తెలుఁగు లోనఁ – ద్రుళ్ళి పాడె
ఆటవెలఁది నిర్మలగీతి – తేటగీతి!

తేటగీతి గతులు – గీతులలో పదముల విఱుపుకు ప్రాముఖ్యత చాల విలువైనదని నా అభిప్రాయము. తేటగీతిని ఎన్నియో గతులలో వ్రాయ వీలగును. కాని అవన్నియు తేటగీతి నడక కలిగి ఉంటుందని చెప్పలేము. గణస్వరూపము వేఱు, గతి వేఱు. క్రింద తేటగీతియొక్క వివిధ గతులు –

త్ర్యస్రగతిలో తేటగీతి –
అందమైన శశినిఁ జూడు – మాకసాన
జిందె నెల్ల దెసలఁ గాంతిఁ – జిత్రముగను
సందియమ్ము వలదు నీకు – సారసాక్షి
విందు నేఁడె మనకుఁ ద్రాగు – ప్రేమ మదిర

చతురస్రగతిలో తేటగీతి –
చూడుము విరులన్ బూచెను – సుందరముగ
పాడుము పదముల్ రాగిణి – భాసురముగ
కూడఁగ సమయ మ్మాయెను – గూరిమి నిట
తోడుగ సకియా రా కడు – తొందరగను

ఖండగతిలో తేటగీతి –
ఆమనికి నీవెగద – యంద-మగు ఘడియలు
శ్రీమయము లయ్యెగద – చిందు – చిఱు నగవులు
నా మనసు నిచ్చితిని – నా వ-నజ నయనకు
రా మధుర రాత్రి యిది – రాగ-రస మొలుకఁగ

పై పద్యము వనమయూరపు (UIII UIII – UIII UU) గతి కలిగినదిగా ఉన్నది కాని తేటగీతి గతి కాదు. అందుకే మధ్యలో వనమయూరములా మఱొక యతిని కూడ నుంచినాను.

ఆఱుమాత్రల త్ర్యస్రగతితో తేటగీతి –
కోరిక లవి సుందరమగు – కోరకములు
చేరగ నిను బ్రేయసి వడి – చెప్పిన వవి
దూరపు శశి తారలు నవ – తోరణములు
నా రమణికి నే నొసఁగెద – హారములను

మిశ్రగతిలో తేటగీతి –
వేణు వూదుము – వినెద జీ-విత వరముగ
గానమా యది – గంగ వే-గము నిజముగ
మానసమ్మున – మంద్ర కో-మల రవముల
రా నిశీథము – రమ్య తా-రల రచనలు
(ఇక్కడ కూడ మఱొక యతిని అదనముగా నుంచినాను)

ఇవి తేటగీతి గణయతులను పాటీంచినను, తేటగీతివలె ధ్వనించలేదు. అందుకే గణములకు సరిగా పదములు విఱిగినప్పుడు గీతులకు గానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. తేటగీతి లక్షణములతో రెండు వృత్తములను క్రింద చదువ వచ్చును –

రజని- ర-జ-న-న-న, యతి (1, 7); 15 అతిశక్వరి 32747

మంచి వేళ యిప్డు – మధుర-మయిన రజని
పంచ రావ దేల – ప్రణయ – వరము లొసఁగ
మించు ఆశతోడ – మెయియు – మెలిక లయెను
ముంచు నన్ను వేగ – ముదపు – పురుల నడుమ

రాగవల్లి- ర-ర-ర-న- ల, యతి (1, 7); 13 అతిజగతి 7827

రాగవల్లీ సదా – రమ్య – రాగనిలయ
భోగమల్లీ సఖీ – మోద – మోహవలయ
వేగ రావే దరిన్ – ప్రేమ -విశ్వవిజయ
యోగవేళన్ మన – మ్మూయె – లూఁగ సదయ

షట్పదిగా తేటగీతి – తేటగీతి రెండు పాదాలను (సూ, ఇం,ఇం) (సూ, సూ, సూ) (ఇం, ఇం, సూ, సూ) గణాలుగా విడదీసి వ్రాస్తే తేటగీతి ఒక షట్పదిగా మారుతుంది. క్రింద ఒక ఉదాహరణము –

లలితలలితము భావాలు
లలిత మనుభవాలు
లలిత మీ జీవిత స్వర రవాలు
లలితమగు ననురాగాలు
లలితమగు సుఖాలు
లలిత మీ బ్రదు కింక కలలఁ దేలు

నూతన తాళ వృత్తముల సృష్టి

కొన్ని వృత్తములను సూర్యేంద్ర గణముల ప్రత్యేకతలుగా భావించవచ్చునని తెలిపినాను. ఇది క్రొత్త తాళవృత్తములను కనుగొనుటకు కూడ సహయకారిగా నుంటుంది. ఇందులకు ఉదాహరణముగా సుప్రసిద్ధమయిన మత్తకోకిల (చర్చరీ) వృత్తమును తీసికొందాము. మత్తకోకిల గురులఘువులు – UI UII UI UII – UI UII UIU, సూర్యేంద్ర గణముల రూపములో ఇది సూ/ఇం/సూ/ఇం – సూ/ఇం/ఇం. ఇప్పుడు ఇంద్ర గణములుగా భ-గణమునకు బదులు వేఱు గణములు తీసికొన్నప్పుడు మనకు క్రొత్త లయలు గోచరమవుతాయి. క్రింద నా ఉదాహరణములు –

1) భ-గణమునకు బదులు సల-గణముతో వ్రాసినది, ఇది ఒక క్రొత్త వృత్తము.

రసగంగ – భ/జ/భ/జ/భ/జ/ర, యతి (1, 13) UI IIUI UI IIUI – UI IIUI UIU; 21 ప్రకృతి 715695

నీవు మనసార నన్ను బిలువంగ – నేను పులకించి పోదునే
నీవు సరసాన నన్ను స్పృశియించ – నేను సరియంచు నందునే
భావ రసవీణ మ్రోఁగ మది పొంగ – బంధ మదియింక హెచ్చునే
త్రోవ యిఁక వెల్గు దూరములు తగ్గు – త్రుళ్ళి హృదయమ్ము విచ్చునే

ప్రాసయతితో –
స్వామి నినుఁ జూడఁ – బ్రేమరసగంగ – నా మనసునందు లేచెఁగా
కోమలము నీదు – మోముఁ గన నాకు – నామనియు మెల్ల వచ్చెఁగా
వ్యోమమున వెల్గె – సోమజమువోలెఁ – గౌముదియుఁ జల్లచల్లఁగా
నా మనసు వీణ – గోముగను మీటి – కామరసధారఁ జల్ల రా

(2) భ-గణమునకు బదులు న-గముతో వ్రాసినది; ఇది కూడ ఒక క్రొత్త వృత్తము.

పూలసరము – భ/స/భ/స/భ/స/ర, యతి (1, 13) UI IIIU UI IIIU UI IIIU UIU; 21 ప్రకృతి 649119

నింగి వెలుఁగులోఁ దార తళుకులో – నేల సొగసుతో నుండెఁగా
పొంగు లహరిలో రంగు విరులతో – మ్రోఁగు సడులతో నిండెఁగా
ఖంగు మనెనుగా గంట బురుజులో – కాల మయెనుగా రాఁడొకో
రంగఁ డతఁడు నా ముందు నిలువఁడే – రాత్రి గడియలో నేలకో

ఇదే వృత్తము చతుర్మాత్రా గతితో –
బాలక యిటులన్ గ్రీడలు సరియా – పాలను పెరుగున్ ద్రావఁగా
వాలము వలదీ కోఁతికి నగుచున్ – వాసముఁ జొరఁగా మేయఁగా
చాలిక నిటులీ జాలము చిఱుతా – చక్కఁగ నిడెదన్ వాఁతలన్
గోలను నిక నే తాళఁగ నగునా – గోకుల తిలకా చేఁతలన్

(3) భ-గణమునకు బదులు త-గణమును ఉంచి వ్రాసినది; ఇది కూడ ఒక క్రొత్త వృత్తము.

ఉన్మత్తకోకిల – ర/ర/య/జ/త/ర, యతి (1, 11); 18 ధృతి 84563

UI UUI UI UUI – UI UUI UIU విఱుపుతో –

ఎందు కీ రోజు నిన్ను జూడంగ – నిట్లు డెందమ్ము మాడెఁగా
నందగోపాల యిందు రావేల – నన్ను ముద్దాడఁ దోడుగా
చిందు మానంద వర్ష మీ తన్వి – చిత్త ముప్పొంగి యూఁగఁగా
మందహాసమ్ము నాట్య మాడంగ – మాల నేవేతు నాసగా

UIU UI UIU UI – UIU UI UIU విఱుపుతో –

వీణపై నొక్క పాట నే మీట – ప్రేమతో నీవు పాడుమా
వాణినిన్ విన్న స్నానమున్ జేతు – భారతీ గంగ ధారలో
రాణతో వేగ రమ్యమై నీవు – రాగమున్ బాడ రంగులన్
తానమున్ నేను జక్కఁగా వీణ – తంత్రులన్ నొక్కి పొంగెదన్

UI UUI UIU – UI – UI UUI UIU గతిలో, యతి (1, 9), ప్రాసయతి (1, 11)

తార లాకాశావీథిలోఁ – దాఁక –
దూరదూరమ్ము లెంతయో
కోరుచున్నాను నిన్ను నే – గూర్మి –
చేరువన్ రమ్ము వేగమే
చారు సంగీత మాధురుల్ – జాల –
స్ఫారమై తోచు రాగమై
తేరులో నూఁగు దైవమా – దిగ్గి –
దారిలో నన్ను జూడుమా

వృత్తములకు మాత్రమే కాదు, పై పద్ధతి మాత్రాగణములతో నిర్మించిన ఛందస్సులకు కూడ వర్తిస్తుంది. కందములోని ఒక అమరికకు తగ్గట్లు క్రింది విధముగా పద్యమును వ్రాయవచ్చును –

కం. ఈ సంధ్య ఘడియఁ బులుఁగులు
వాసము జేరంగ నెగిరె – వంద సడులతో
హాసమ్ము చిందె నెల్లెడ
భూసతి యెఱ్ఱంచు చీర – ముదపు గురుతుగా

దీనిని ఒక అర్ధసమగీతిగా క్రింది విధముగా గీతికాకందము అనే పేరుతో వివరించవచ్చును –

బేసి పాదములు – ఇం/సూ/ఇం
సరి పాదములు – ఇం/ఇం/సూ – సూ/ఇం

ఇట్టి అమరికతో ఏ ఇంద్రగణమునైనను వాడగా మనకు కందపద్యములాటి ఇతరములైన లయలు కూడ లభించును. క్రింద అట్టి ఒక ఉదాహరణము –

గీతికాకంద మందమై
ప్రీతితో వ్రాయనా నీకుఁ – బ్రేమఁ బాడనా
శీతల మ్మయ్యె భూమి, యీ
చేతమో యయ్యెగా వేడి – చెలియ తియ్యఁగా

ముగింపు

ఛందస్సులో గీతులకు ఒక ప్రత్యేకమైన స్థానము గలదు. తెలుగులో సూర్యేంద్ర గణములతో ఉండు జాత్యుపజాతుల సంఖ్యను వ్రేళ్ళపైన లెక్కించవచ్చును. గీతులలో గణములకు తగినట్లు పదములను ఎన్నుకొనినప్పుడు గీతులను శ్రవణానందకరముగా పాడ వీలగును. సూర్యేంద్ర గణములతోడి గీతులకు ఒక గణిత శాస్త్రపు పునాదిని కల్పించి వాటిని నవరత్నముల పేరులున్న ఛందములకు కేటాయించినాను. ఒకటినుండి ఐదు సూర్యేంద్ర గణములతో కల్పించ వీలగు అన్ని గీతులను సోదాహరణముగా వివరించినాను. ఇట్టి గీతులతో కొన్ని అర్ధసమ గీతులను కూడ సృష్టించినాను. ఇవన్నియు గేయములకు క్రొంగ్రొత్త మూసలు. సుమారు వేయి వృత్తములను పరిశీలించగా, అందులో 20-25% వృత్తములను సూర్యేంద్ర గణముల ప్రత్యేకతలుగా భావించవచ్చును. అట్టి వాటితో క్రొత్త తాళ వృత్తములను సృష్టించుటకు కూడ అవకాశము గలదు. ఇట్టి గీతులను కవులు, పండితులు ఆదరించగలరని నమ్ముతున్నాను.

(రెండవ అనుబంధమును తయారుచేయుటలో నాతో సహకరించిన దిలీప్ మిరియాలగారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.)


గ్రంథసూచి

  1. ఛందోఽనుశాసన – హేమచంద్ర సూరి, సం. హరి దామోదర వేళంకర్, భారతీయ విద్యా భవన్, ముంబై, 1961.
  2. శాసనపద్యమంజరి – సం. జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ, 1930.
  3. శాసనపద్యమంజరి, రెండవ భాగము – సం. జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ, 193?.
  4. తెలుగులో దేశి ఛందస్సు – ప్రారంభ వికాస దశలు – సంగభట్ల నరసయ్య, ఆనందవర్ధన ప్రచురణలు, ధర్మపురి, కరీంనగర్ జిల్లా, 1991.
  5. లక్షణశిరోమణి – పొత్తపి వేంకటరమణ కవి – సం. రావూరి దొరసామి శర్మ, ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1979.
  6. కన్నడ ఛందస్సు – నాగవర్మ – సం. F. కిట్టెల్, Basel Book and Mission Tract Depository, మంగళూరు, 1875.
  7. ఛందోఽనుశాసనం – జయకీర్తి – సం. హరి దామోదర్ వేళంకర్, హరితోషమాల, ముంబై, 1949.
  8. వేమన పద్యములు – సం. నేదునూరి గంగాధరం, అద్దేపల్లి అండ్ కో, 1960.
  9. శృంగార నైషధము – శ్రీనాథ కవి – సం. వేదం వేంకటరాయ శాస్త్రి, జ్యోతిష్మతీ ముద్రాక్షరశాల, మదరాసు, 1913.
  10. బసవపురాణము – పాల్కురికి సోమనాథుడు.
  11. శ్రీమదాంధ్ర భాగవతము – బమ్మెర పోతన, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1913.
  12. భర్తృహరి సుభాషితము, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1949.
  13. ఛందోదర్పణ – క.పు. సీతారామ కెదిల్లాయ, భారద్వాజ ప్రకాశన, మంగళూరు, 1985.
  14. ఎంకి పాటలు – నండూరి వెంకటసుబ్బరావు, సాఇరాం పబ్లికేషన్స్, హైదరాబాదు, 2002.
  15. వైతాళికులు – సం. ముద్దుకృష్ణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1994.
  16. తెలుఁగు భాషలో ఛందోరీతులు – రావూరి దొరసామి శర్మ, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...