రెండు అక్షరసామ్య యతులు

పరిచయము

ప్రకృతిలో ఏవిధముగా పరిసరములు, జన్యుకణములు, జీవరాశులు మారుతుంటాయో, అదే విధముగా మనుష్యులు వాడే భాషలలో కూడ మార్పులు వస్తుంటాయి. కొన్ని కొత్త భాషలు జన్మిస్తాయి, వాడుకలో ఉండిన కొన్ని భాషలు అంతరించిపోతాయి. వెయ్యి సంవత్సరాలకు ముందు ఉండే ఉచ్ఛారణ, పదప్రయోగము, అక్షరములు కొన్ని ఈకాలములో లేవు. కొన్ని భాషలలో ఈ మార్పులు త్వరగా జరిగితే మఱి కొన్ని భాషలలో ఇవి మెల్లగా జరుగుతాయి. కాని కాల పరిభ్రమణములో మార్పు లేనిది ఉండదు. ఉదాహరణముగా పురందరదాసు కీర్తనలలో వాడిన కన్నడ పదములు నేడు కూడ ప్రచారములో ఉన్నాయి, కాని అన్నమాచార్యుల కీర్తనల లోని కొన్ని పదములు నేడు కొఱకరాని కొయ్యగా మిగిలిపోయినవి! తమిళనాడు ప్రాంతాలలో వాడబడే తెలుగు భాష కొన్ని శతాబ్దాలకు ముందటి తెలుగు భాషకు ప్రతిబింబము అనవచ్చును. భాషలోని మార్పులు తక్షణమే శాస్త్ర నిఘంటువులలో ప్రతిఫలించవు. అలా చేరుటకు ఎన్నో సంవత్సరములు పడుతాయి. కొన్ని అలానే మిగిలిపోతాయి కూడ. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఛందశ్శాస్త్రములో చేరని తెలుగు భాషలోని రెండు మార్పులను గుఱించి. ఆ మార్పులను వాడుకలో తీసికొని వచ్చినప్పుడు అక్షరసామ్య యతి ఎలా మారుతుంది? అనేది మన ముందున్న ప్రశ్న.

ఋ-రి-రు

తిక్కన కాలానికి అటూ యిటు భాషలో ఎన్నో మార్పులు వచ్చినవి. అనగా ఇవి 12-14 శతాబ్దాల కాలము మధ్య జరిగినవి. నన్నయ కాలములో ఋ-కారమును రివలె పలికేవారు. దీనికి శాసనముల ఆధారములు ఉన్నాయి, ఉదాహరణమునకు ఒక శాసన పద్యమును (క్రీ.శ. 1132) మొదటి చిత్రములో చూడ వీలగును. ఇక్కడ సూనృత అనే పదమును సూన్రిత అని శిల్పి చెక్కినాడు, ఎందుకంటే ఆ కాలములో దానిని అలా పలికేవారు. కాని ఇంచుమించు అదే కాలములో ఋ-రు కూడ వాడుకలో నుండినది. దీనిని కందప్పశెట్టిగారి వ్యాసములలో [1][2] గమనించవచ్చును.

పితృస్థానము = పిత్రుస్థానము (క్రీ.శ. 1112); పృథ్వి = ప్రుదివి (క్రీ.శ. 1258); ఋతు = రుతు (క్రీ.శ. 1346) బృందావనం = బ్రుందావనం (క్రీ.శ. 1423); సుకృతము = సుక్రుతము (క్రీ.శ. 1450).

కాని తిక్కన కాలానికి ఈ ఋ-కారమును రు-వలె పలుకుటకు ప్రారంభించినారు. తిక్కన, పాల్కురికి సోమన ఋ-కారమునకు రు-కారమునకు అక్షరసామ్య యతిని కొన్ని చోటులలో వాడినారు. నేడు లభించే కొన్ని గ్రంథముల ప్రతులలో వీటిని పరిష్కరించినట్లు తోచుచున్నది. ఉదా.

రురువర్ణదేహంబు – ఋగ్వేదమునకు
ధరణి నాత్రేయగోత-త్రంబు గాయత్రి
– పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరిత్ర, తృతీయ ప్రకరణము, వేదనాదనిరసనము.

నన్నయ భారతమునుండి ఇట్టి యతి కలిగిన ఒక పాఠాంతరమును రెండవ చిత్రములో చూడ వీలగును. తిక్కన శల్యపర్వములో ఒక సీస పద్యములో (శల్య, 2.160) మూడవ పాదములో సప్త।ఋషులైరి వారు మ-రుద్గణంబు అని ఒక ప్రయోగము గలదు. కాని దీనిని మార్చి సత్పు।రుషులైరి వారు మ-రుద్గణంబు అని కొన్ని ప్రతులలో ప్రచురించి యున్నారు. అప్పకవి ధ్రు అక్షరమునకు బదులు ధృ వ్రాసి యతిని చెల్లించినాడు: ధృతచక్రధర నరసింహ – ధృవశోధి మహా. ఇక్కడ సరియైన పదము ధ్రువశోధి (మూడవ చిత్రము). ఆశ్చర్యకరమైన విశేషము ఏమంటే ఆకాలములోనే ఈ విలోమ లేఖనము ఉండి ఉన్నది!

ఏది ఏమైనను, నేడు రెండు ఉచ్చరణలు ఉన్నాయి, ఉదా. కృష్ణ = క్రిష్ణ, తృష = త్రిష, ఋషి వేలీ => రిషి వేలీ, మున్నగునవి. కాని ఎక్కువగా ఋ-కారమును రు-వలె పలుకుచున్నారు, ఉదా. ప్రకృతి = ప్రక్రుతి, ఋషికొండ = రుషికొండ, తృతీయా విభక్తి = త్రుతీయా విభక్తి, ఇత్యాదులు. తెలుగులోనే కాదు కన్నడము, మరాఠీ, మలయాళము, ఒడియా భాషలలో కూడ ఋ-కారమును రు-వలె పలుకుతారు.

కాని ఛందస్సు పుస్తకములలో నేడు కూడ ఋ-కారమునకు ఇ, ఈ, ఎ, ఏ-లతో, ఈ హల్లులు కలిగిన యకార, హకారములతో, ఇతర ఋ-కారముతో కూడిన హల్లులతో (నృ, పృ, హృ, ఇత్యాదులు), ఇకార, ఎకార అక్షరములకు ర-ఒత్తుగా ఉండే అక్షరములతో (ప్రి, శ్రీ, క్రి, మున్నగునవి) యతిని చెల్లిస్తారు. అవి ఋవళి, ఋత్వసంబంధవళి [3]. అనగా శాస్త్రము శతాబ్దాలుగా భాషలో జరిగిన ఒక ముఖ్య పరిణామమును చట్టబద్ధముగా అంగీకరించలేదు!

కావున నా సూచన ఏమనగా ఋ-కారమునకు యతి బహుళము చేయవలయునని. అనగా రి-కారము, రు-కారము రెండింటితో చెల్లించుటకు శాస్త్రబద్ధముగా అనుమతి నొసగవలెనని. ఈ శాస్త్రసమ్మతి విశ్వవిద్యాలయముల ద్వారా, భాషాశాస్త్రజ్ఞులద్వారా, పండితులద్వారా, ప్రభుత్వము ద్వారా జరుగవలయును. అంతేకాక విలోమ ఉపయోగమును కూడ బహిష్కరించవలెను. అనగా రు-కారమునకు బదులు తప్పుగా ఋ-కారమును ఉపయోగించుట, ఉదా. ధృవపత్రము. ఋ-కారమునకు బహుళ యతి ప్రయోగములతో నేను వ్రాసిన రెండు తేటగీతులు:

కృష్ణమోహన నీవేల – క్రూరుఁడైతి
తృష్ణ దీర్చంగ రావేల – తోయజాక్ష
నృత్య మాడు నీ డెందమ్ము – నిన్ను జూడ
కృత్య మది సంతసమ్ము నా – కిచ్చు నెంతొ
(మొదటి రెండు పంక్తులు ఋ-ఉ, చివరి రెండు పంక్తులు ఋ-ఇ)

ప్రియము గల్గును మనమందు – పృథివినుండి
వీక్షణము సేయఁ దారల – వృత్తమందు
ఋషులు నభములో వెల్గిరి – రోచితోడ
ధ్రువుఁడు కొనలోన వెలిగెను – దృప్తి నిడుచు
(మొదటి రెండు పంక్తులు ఋ-ఇ, చివరి రెండు పంక్తులు ఋ-ఉ)

దంత్య ౘ, ౙ

తెలుగు వర్ణమాలలో చవర్గములోని అక్షరములలో చ, జ అక్షరములు ప్రత్యేకమైనవి. ఈ అక్షరములు దంత్యములుగా, తాలవ్యములుగా ఉపయోగించబడుతాయి. అ, ఆ, ఉ, ఊ, ఒ, ఓ, ఔ అక్షరములతో ఉండే అచ్చ తెలుగు పదములలోని చ-కార, జ-కారములు దంత్యములు, ఉదా. చందమామ, చామనచాయ, చుట్టు, చూచు, చొంగ, చోటు, చౌక, జల్లు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోరు, జౌకు, ఇత్యాదులు. ఈ దంత్యాక్షరములు కూడ బహుశా తిక్కన కాలము నాటికి తెలుగులో వచ్చినట్లున్నవి. ఆ కాలపు శాసనములోని అట్టి ఒక ఉదాహరణము గలదు, క్రీ.శ. 1393 శాసనములో, పుచ్చుకొని = పుత్సుకొని [కందప్పశెట్టి – [1]], క్రీ.శ. 1512 శాసనములో, పచ్చలు = పత్సలు [కందప్పశెట్టి – [2]].

ఇప్పుడు కూడ కొన్ని పుస్తకములలో, కొన్ని వ్రాతలలో దంత్య చ-కార, జకారములపైన త ఒత్తును ఉచ్చరణ సౌలభ్యమునకై సూచిస్తారు. కొందఱు దీనిని తెలుగు అంకె రెండు అంటారు. తెలుగు అంకె రెండు త ఒత్తు. ఈ త-ఒత్తును ఉంచడము వలన ఈ అక్షరములలోని త-కార, ద-కారముల ఉచ్చరణ ప్రస్ఫుటమవుతుంది. అనగా ౘలి అన్నది త్సలి, ౙాలి అన్నది ద్జాలి. మరాఠీ, కాశ్మీర భాషలలో కూడ దంత్యాక్షరములు ఉన్నాయి.

ఈ దంత్య చ-కార, జ-కారములు నేటికి కూడ ఛందశ్శాస్త్రములో సూచించబడలేదు. నా ఉద్దేశములో దంత్య చ-కార జ-కారములు ఉండు చోటులలో త-వర్గములోని త,థ,ద,ధ అక్షరములతో కూడ అక్షరసామ్య యతిని చెల్లించుటకు వీలు కలుగ చేయవలెను. ఈ నియమము దంత్యాక్షరములకు మాత్రమే. చీమ = దీపము (చీ,దీ) పదములకు యతి చెల్లదు. కొన్ని అక్షరములకు మాత్రము పరిమితమైన ఇట్టి నియమము ఛందశ్శాస్త్రములో ఉన్నది: పు, ఫు, బు, భు, ము (అలాగే ఊ, ఒ, ఓ అచ్చులతో కూడిన అక్షరములకు) యతికి ఉన్నది (పోలికవడి, చక్కటియతి). కాని ప-మలకు యతి చెల్లదు. క్రింద దంత్య చ-కార, జ-కారములకు త, థ, ద, ధ-లతో అక్షరసామ్య యతిని ఉంచి వ్రాసిన రెండు ఉదాహరణ తేటగీతులు:

ౘలియు హేమంతమున హెచ్చెఁ – దాళలేను
ౙలయు ఘనరూపమును బొందెఁ – దళుకుమనుచు
ౙోరుగా వీచె పవనమ్ము – సుడులు లేచె
ౙాలి చూపని ఋతువిది – సత్యముగను

(మొదటి రెండు పాదములలోని దంత్యములకు తకారముతో, చివరి రెండు పాదములలోని దంత్యములకు సకారముతో అక్షరసామ్య యతి)

ౘక్కని నృపుని జూడఁగాఁ – దరుణి మదియుఁ
ౘుక్కలను దాఁకఁ దొడఁగెను – దుఱ్ఱుమనుచు
ౘందమామ వెన్నెలతోడఁ – ౙంపుచుండె
ౘామ కిఁక దిక్కు మన్మథ – స్వామియగును

(మొదటి రెండు పాదములలోని దంత్యములకు తకారముతో, చివరి రెండు పాదములలోని దంత్యములకు సకారముతో అక్షరసామ్య యతి)

ముగింపు

ఛందశ్శాస్త్రములో నేను సూచించినవి క్రొత్తది కాదు. ఇంతకుముందే శాస్త్రము ఇటువంటి ఉచ్చరణలను యతిప్రాసలుగా అంగికరించినది [4]. అవి: జ్ఞావడి: యజ్ఞము – జన్నము (జ్ఞ-న్న); ఆజ్ఞ – ఆన (జ్ఞ-న), మున్నగునవి. ఇవి జ్ఞ శబ్దమును గ్నవలె పలుకుటవలన జనించినది. అప్పకవి ఉదాహరణము:

వెలయుటను దద్భవవ్యాజ – విశ్రమమున
జరిగి న,ణలకు రెంటికి – జ్ఞా తనర్చు
జ్ఞాని చేతోంబుజాత శో-ణకర యనఁగ
జ్ఞాతి విద్వేషి నృపనాశ-నకర యనఁగ

అదే విధముగా కవర్గాక్షరములతో విశేషవళి: తిక్కన శాంతిపర్వమునుండి:

జ్ఞానము కేవలకృప న । జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర-కాశము సేయున్
కర్మ మధర్మమ-జ్ఞాన మాగడము (పండితారాధ్యచరిత్ర)
కార్య ఖడ్గముల ప్ర-జ్ఞా విశేషముల (పల్నాటివీరచరిత్ర)

విభునా।జ్ఞంగొని …. ము-క్తామణి; ఇత్యాదులు. థ – ధ లకు ప్రాస కూడ రామనాథం => రామనాధం వంటి ఉచ్చరణవలన కలిగినదే.

కావున నా ఉద్దేశములో ఋ-రి-రు యతి బహుళత్వము, దంత్య చ-కార, జ-కారములకు త,థ,ద,ధలతో అక్షరసామ్య యతి అంగీకృతములు.


గ్రంథసూచి

  1. శాసనభాషా పరిణామం (క్రీ.శ. 1100-1399) – M. కందప్ప శెట్టి, తెలుగు భాషా చరిత్ర (సం. భద్రిరాజు కృష్ణమూర్తి), నాలుగవ ప్రకరణము, పుటలు 103-142, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1979.
  2. శాసనభాషా పరిణామం (క్రీ.శ. 1400-1599) – M. కందప్ప శెట్టి, తెలుగు భాషా చరిత్ర (సం. భద్రిరాజు కృష్ణమూర్తి), ఐదవ ప్రకరణము, పుటలు 143-172, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1979.
  3. Historical Grammar of Telugu – కోరాడ మహాదేవ శాస్త్రి, పుటలు 37-75, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయము, 1969.
  4. తెలుఁగు భాషలో ఛందోరీతులు – రావూరి దొరసామి శర్మ, యతి ప్రకరణము, పుటలు 211-321, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...