ఆకురాలు కాలము

  1. సాధించిన విజయమ్ములు,
    వేధించెడు యపజయములు, – విరివిగ మదిలో
    శోధించెడు సమయముగా
    నీ ధర శరదృతువు వచ్చె – నింపుల కిరవై
  2. రంగుల రమణీయతతో
    పొంగెడు సుప్రభలు నిండ – మోహనకరమౌ
    సంగీతముతో జగమను
    రంగస్థలిపైన వచ్చె – రాగాంబరియై
  3. వాతావరణము కడుకడు
    శీతలమయె బయట వీచె – శీతానిలముల్
    వాతావరణము హృదయపు
    లోతులలో వెచ్చబడెను – లోలాయముగా
  4. గతకాలము దలచుచు, స్వా-
    గతమీయగ భావి నెంచి – కలలను గనుచున్
    మితముగ మారెను ప్రకృతి య-
    మితమును వీడినది పొదుపు – మృగముల కబ్బెన్
  5. ఆమనిలో చిగిరిన యా
    భూమిజముల వివిధ వర్ణ – భూషణగణముల్
    కోమల పత్రములు మిగుల
    ప్రేమను కంబళము లెన్నొ – ప్రియముగ వ్రాసెన్
  6. నిదురించును మాసమ్ములు
    వదలక వృక్షములు తాము – వసుధాతలిపై
    మధుమాసము వచ్చు దనుక
    నిదురించును ననలు కూడ – నిర్లిప్తముగా
  7. అంబరమున నంబుదములు
    సంబరమున తూలికలన – సాగుచునుండెన్
    బింబమ్ములు ధారుణిపై
    సంబరమున పరుగుదీసె – సాదృశ్యముతో
  8. పున్నమి పంటల కోతకు
    పున్నమి వేటాడు వారి – పోడిమికొఱకై
    పున్నమిలో చంద్రుని గుడి
    కన్నుల విందగును గాదె – గగనమునందున్
  9. శారదరాత్రులలో బలు
    తారకహారములు దోచె – తళతళమంచున్
    నీరదములు కనిపించని
    నీరంధ్రమునందు బహుళ – నిర్మలకాంతిన్
  10. మండల మొక్కటి హంసగ
    మండల మొండేడు ఋషుల – మాడ్కిన్ దోచెన్
    కుండవలె దోచె నొక్కటి
    మెండుగ వేఱ్వేఱు భంగి – మింటను దారల్
  11. ధ్రువ నక్షత్రము గనపడె
    రవణించెను జ్యేష్ఠతార – రాజిలె నభిజిత్
    నవముగ బిదికిన క్షీరము
    నవిరళమగు ఫేన మనగ – నగపడె చుక్కల్
  12. హిమమయె ముత్యమ్ములుగా
    సుమములపై సుందరముగ – సొబగులతోడన్
    హిమమయెను గాజు తలుపుల
    రమణీయమ్మైన తెరల – లాఘవములతో
  13. గుమ్మడికాయల మలచిరి
    యిమ్ముగ రూపమ్ము నొకటి – నిఱుగన్నుల, దీ-
    పమ్ముంచిరి యందు వెలుగు
    చిమ్మగ గడు భయము గల్గ-జేసిరి చిరుతల్
  14. వేసము బాలురు దాల్చిరి
    వేసము బాలికలు దాల్చి – వీథులలో సం-
    తోసము నిండ మిటాయిల
    కోసము తిరుగాడి చనిరి – గుంపుగ నింపై
  15. శృంగాకారములోగల
    రంగుల బుట్టలను నింపి – రా తరుణము పల్
    భంగుల ఫలధాన్యములన్
    మంగళముగ నిండుదనము – మహి జాటంగన్
  16. ఇంపగు కెంపుల జొంపలొ
    సొంపగు బంగారు రేకు – సొగసుల సిరులో
    వంపుల మరకతవల్లులొ
    నింపెను కంబళమువోలె – నేలను నాకుల్
  17. ఆమనిలో బలు రంగుల
    కోమల కుసుమాల తావి – కొసరుచు పవన
    మ్మేమనె నళితో యంచున్
    బ్రేమన్ స్మరియించె నేమొ – ప్రిదిలెడి యాకుల్
  1. ఏనాడు దక్షిణమ్మున
    యా నవ భూరుహము జేర-నగునో యంచున్
    బాణాకారములో జనె
    నానావిధమగు స్వనముల – నభమున బక్షుల్
  2. చిన్నప్పుడు తల్లి యొసగ
    తిన్నప్పటి రోజు లెల్ల – తియగా గనెనో
    మిన్నున రవి దాక నెగురు
    మున్నటి యా ఘడియ దల్చి – మురిసినవేమో
  3. దూరముగా పత్రరహిత
    భూరుహములు కొండలందు – బోసిగ దోచెన్
    తోరణముల యంచులతో
    జీరలు గనరావు రాలె – జెచ్చెర నాకుల్
  4. పచ్చని వలువ లవెక్కడ
    వెచ్చని పొడవైన మంచి – వేసవి దినముల్
    ముచ్చట గొలిపెడు రాత్రుల
    యచ్చెరువుల జ్ఞాపకమ్ము – లరుదెంచినవో
  5. ఒకవైపున సందిగ్ధత
    యొకవైపున భావి తలపు – లొప్పుగ నుండున్
    రకరకముల యాలోచన
    లకటా శరదృతువునందు – నగు నీ మదిలో
  6. ముగిసినది పంటకోతయు
    నగపడు ఫలరాశి యొసగు – యనుభూతి యెదో
    సుగమో దుఃఖమొ తెలియని
    సగమగు స్థితి యదియు గాదె – శారదవేళన్
  7. జీవితమున నెన్నుకొనిన
    ద్రోవయు సరియౌనొ కాదొ – ధ్రువముగ నెఱుగన్
    ద్రోవను వేఱొకటి కొనిన
    భావియు వేఱొక్క త్రోవ – పట్టేనేమో
  8. ఇట్టుల సందియములు బలు
    తట్టును మెదడునకు తరచు – తప్పక నెపుడున్
    బుట్టును శరత్తులో జలి
    బుట్టును దలపుల నలుగుచు – పోటులతోడన్
  9. అడుగిడె జీవిత మదియును
    కడగానని యాకురాలు – కాలమునందున్
    వడివడిగా ప్రాత స్మృతులు
    కడవల పోతలుగ ముంచె – క్షణకాలములో
  10. అలనాటి వెల్గు వెల్లువ
    లలరుల గంధములు హితుల – యానందోక్తుల్
    లలితస్వర నాదమ్ములు
    మెలమెల త్రవ్వేను స్మృతుల – మెదడున విడకన్
  11. జ్ఞాపకములు దాకెను నను
    జ్ఞాపకములు నింపె నన్ను – జలధారవలెన్
    జ్ఞాపకములు చుట్టి తిరిగె
    జ్ఞాపకములు ముంచి తేల్చె – శారద రాత్రిన్
  12. ఆది యగు నంతముగ, నా
    యాదియు జనియించుచుండు – నంతములోనన్
    బూదియగు జీవిత మది, యా
    బూదియె కారణము క్రొత్త – పుట్టుకకొఱకున్
  13. చప్పుడు లేకను వచ్చును
    జప్పున హేమంతఋతువు – చలితో వలితో
    నిప్పుడమిని నిక్కముగా
    దప్పక నెవరాపలేరు – దాని బ్రకృతిలో
  14. ఒక నాడీ హేమంతపు
    వికటమ్మగు నగవు లెల్ల – వినబడకుండున్
    చకచక మొలచును కళికలు
    రకరకముల రంగు లలర – రమ్యత చిమ్మన్
  15. వచ్చును వసంతకాలము
    హెచ్చగు సుమరాశితోడ – నెల్లెడ నిలపై
    మెచ్చుగ భ్రమరాల రొదల
    విచ్చును హృత్సరసిజంపు – వేయి దళమ్ముల్
  16. పులుగులు పాడుచునుండును
    పలుపలు రీతుల నెలుగుల – వనవీథులలో
    కులుకును సుగంధమయముగ
    వెలుగును ధారుణి వసంత – విస్మయములతో
  17. జీవనమది యొక పునరు-
    జ్జీవనమా లేక క్రొత్త – జీవనమా యా
    దేవు డొసంగు నొక పున-
    ర్జీవనమా తెలియనౌనె – సృష్టి నెవరికిన్

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...