సంగ్రహము
సుందరమైన తాళవృత్తాలలో మత్తకోకిల ప్రసిద్ధమైనది. పింగళఛందస్సులో విబుధప్రియగా నిది పేర్కొనబడినా, దానికి యివ్వబడిన ఉదాహరణ యే కాలమునాటిదో చెప్పడము కష్టము. క్రీస్తు శకము 650 నాటికి ఈ వృత్తములో శ్రవణబెళగొళ శాసనములో, తమిళ తేవారములో పద్యములున్నవి. విబుధప్రియా, ఏళుశీర్ విరుత్తం, హరనర్తన, చర్చరీ, ఉజ్జ్వల, మల్లికామాలె, మల్లికా అని ఎన్నో పేరులు ఉన్న ఈ వృత్తానికి తెలుగులో మత్తకోకిల అని పేరు. నన్నయ, నన్నెచోడుల నాటి కాలమునుండి నేటివరకు వాడబడుచున్న వృత్తమిది. భామినీషట్పది, వృషభగతిరగడ, త్రిపుటరేకులు, ముత్యాలసరము మున్నగు నూతన అవతారముల నతి లీలగా నెత్తుకొన్న వృత్తము మత్తకోకిల. ఈ వృత్తపు ఆరంభము, పరిణామము, దీని లయతో నుండే యితర వృత్తాలను గురించిన చర్చ యీ వ్యాసపు ముఖ్యోద్దేశము. శ్రీకృష్ణకర్ణామృతములో నీ వృత్తము నుపయోగించిన లీలాశుకుడు, ఈ లయలో నొక అష్టపదిని వ్రాసిన శ్రీజయదేవకవి ఆంధ్రులేనా అన్న సంశయము కూడ కలుగుతుంది.
పరిచయము
అందమైన తాళవృత్తాలలో మత్తకోకిల సుప్రసిద్ధమైనది. దీనికి ఎన్నో పేరులు ఉన్నాయి, అవి – విబుధప్రియా, హరనర్తనం, హరనర్దకం, చర్చరీ, ఉజ్జ్వలా, మల్లికామాలె, మాలికోత్తరమల్లికా, మల్లికా, ఏళుశీర్ విరుత్తం, మత్తకోకిల. మత్తకోకిల ప్రతి పాదమునకు 18 అక్షరాలు కలిగిన ధృతి ఛందములో పుట్టిన 91955వ సమవృత్తము. పింగళుని ఛందఃశాస్త్రములో[1] ఎనిమిదవ అధ్యాయములోని మొదటి సూత్రము – అవానుక్తం గాథా, అంటే ఈ గ్రంథములో ఇంతవరకు చెప్పబడని విషయాలు కొన్ని ప్రయోగ రూపములో ఉన్నాయి, వాటిని గాథా ప్రకరణము అని చెప్పాలి. ఇదే అధ్యాయములో పదునారవ సూత్రము – విబుధప్రియా ర్సౌ జ్జౌ భ్రౌ వసుర్దిశా, అనగా విబుధప్రియకు గణములు ర స జ జ భ ర, పాదము ఎనిమిది, పదిగా విరుగుతుంది. ఇది ఛందఃశాస్త్రములో మత్తకోకిల మొదటి పరిచయము. కాని దీనికి ఉదాహరణగా ఇవ్వబడిన క్రింది పద్యము ఎవరు వ్రాసినదో, ఏ కాలము నాటిదో అనే విషయము మనకు తెలియదు.
కుంద కుట్మల కోమల-ద్యుతి దంతపంక్తి విరాజితా
హంసగద్గదవాదినీ – వనితా భవేత్ విబుధప్రియా
పీనతుంగ పయోధర-ద్వయ భార మంథరగామినీ
నేత్రకాంతి వినిర్జిత – శ్రవణావతంసిత కైరవా
మల్లెమొగ్గలవలె మెరిసిపోయే పల్వరుస గలదానా, గద్గదస్వరముగల హంసలా వాదించి పండితులకు ప్రీతికరమైనదానా, ఎత్తైన వక్షోజములతో మెల్లగా నడచుదానా, కనుల మెరపును తిరస్కరించే తెల్ల కలువపూవులను చెవులలో అలంకరించుకొన్నదానా!
మనకు ఇప్పుడు పింగళుని ఛందఃశాస్త్రము హలాయుధుడు వ్రాసిన టీకతో (దీనిని హలాయుధవృత్తి అంటారు) నున్నది. ఈ హలాయుధుడు పదవ శతాబ్దము వాడు. పై ఉదాహరణను హలాయుధుడు చేర్చి ఉండవచ్చును, అంటే అది పదవ శతాబ్దానికి ముందటిదన్నమాట. ఎంత ముందటిదో మనకు తెలియదు. ఇదే అధ్యాయములోని పందొమ్మిదవ సూత్రము శశివదనా న్జౌ భ్జౌ జ్జరౌ రుద్రదిశా (శశివదనకు నజభజజజర గణాలు, పాదము పదకొండు, పదిగా విరుగుతుంది). ఇది మన చంపకమాలకు లక్షణము, దీని ఉదాహరణము మాఘుని శిశుపాలవధ నుండి ఇవ్వబడినది, అంటే పింగళునికన్నా కొన్ని శతాబ్దాల తరువాతిది. అందువల్ల మత్తకోకిల పింగళునిచే పేర్కొనబడినా, దానిని మొట్టమొదట ఎవరు ప్రయోగించారో మనకు ఇదమిథ్థంగా తెలియదని తెలుస్తుంది.
తమిళములో మత్తకోకిల?
క్రీస్తు శకము ఏడవ శతాబ్దములో తమిళ దేశములో తిరుజ్ఞానాసంబందర్ అనే ఒక బాలయోగి ఉండేవాడు. ఇతడు ఒక గొప్ప బాలకవి (child prodigy అని చెప్పవచ్చును). ఈ ద్రావిడ శిశువు సాక్షాత్తు ఆ పార్వతీదేవి స్తన్యాన్ని గ్రోలి కవితను వ్రాసినాడన్న ప్రసక్తి శంకరాచార్యుల సౌందర్యలహరిలోని క్రింది శిఖరిణీ వృత్తములో నున్నది –
తవ స్తన్యం మన్యే – ధరణిధరకన్యే హృదయతః
పయఃపారావారః – పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం – ద్రవిడశిశురాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా-మజని కమనీయః కవయితా
(సౌందర్యలహరి – 75)
ఆ కాలములో జైనమతావలంబులకు శైవులకు వాదోపవాదాలు జరిగేవి. మదురైలో ఏనుగు ఆకారములో ఉండే ఒక కొండ జైనులకు ఉనికి. దానిని ఆనైమలై అంటారు. అక్కడి జైనయోగులతో నేను వాదులాడి వారిని ఓడించి జయాన్ని పొందుతాను అని మధురాపురి మహారాణి మంగయర్కరశితో సంబందర్ చెప్పిన పద్యము మత్తకోకిలకు తమిళప్రతియే అనడములో సందేహము లేదు. జైనాచార్యులు ఎందరో అతి క్రూరముగా చంపబడ్డారు ఈ మతవైషమ్యములో. ప్రాకృతభాషపట్ల నిరసన కూడ ఆ కాలములో ఉండినట్లున్నది. ఇది ఒక బాధాకరమైన చారిత్రక సంఘటన.
మానినేర్విళి మాదరాయ్వళు తిక్కుమాపెరున్ తేవి కేళ్
పానల్వాయొరు పాలనింగివ నెన్ఱునీపరి వెయ్తిడేల్
ఆనైమామలై యాదియాయ ఇడంగళిఱ్పల అల్లల్ చేర్
ఈనర్గట్కెళి యేనలేందిరు వాలవాయర నిఱ్కవే (తిరుజ్ఞానసంబందర్ తిరు ఆలవాయ్ తేవారం తిరుప్పదిగం – 3.411)
జింకలా కన్నులతో ఉండే ఓ పాండ్య రాజమాతా, మీరు నా మాట వినండి. పాలుగారే చెంపలతో ఉండే ఒక బాలకుడని నా గురించి తలబోయకండి. ఆలవాయిలో నెలకొన్న ఆ స్వామి కృపవలన నేను ఆనైమలై నుండి మనకు కష్టాలను కలిగించే ఆ జైనులను ఓడించగలను.
ఆగమత్తొడు మందిరంగ ళమైంద చంగత పంగమా
ప్పాగతత్తొ డిరైత్తురైత్త చనంగళ్వెట్కుఱు పక్కమా
మాగతక్కరి పోఱ్ఱిరిందు పురిందునిన్ఱుణుం మాచుచేర్
ఆగతర్కెళి యేనలేందిరు వాలవాయర నిఱ్కవే (తిరుజ్ఞానసంబందర్ తిరు ఆలవాయ్ తేవారం తిరుప్పదిగం – 3.412)
వేదములను బాగుగా చదివిన వారికి సిగ్గు కలిగేటట్లు ఆ భాషకు వికృతముగా ప్రాకృతములో మాటలాడుతూ, కోపముతో మదించిన ఏనుగులా మురికి బట్టలతో సంచరించే జైనులకు నేనేమీ తీసిపోను, ఆ ఆలవాయిలోని దేవుడి దయవల్ల.
సంబందర్ 16ఏళ్ళకే చనిపోయాడట, ఇతని మరణము క్రీ. శ. 660లో అని అంటారు. ఇదే నిజమయితే, పై పద్యములు సుమారు క్రీ. శ. 650 నాటివయి ఉండాలి. ఈ వృత్తాన్ని తమిళములో ఏళు శీర్ ఆశిరియ విరుత్తం[2] అంటారు, అనగా ఏడు గణములు ఉండే ఆశిరియ వృత్తమని అర్థము. ఆ గణాలు వరుసగా తేమా, కూవిళం, తేమా, కూవిళం, తేమా, కూవిళం, కూవిళం. మనకు సుపరిచితమయిన గురులఘువుల పద్ధతిలో, తేమా UU లేక UI, కూవిళం UII, UIU. చివరిది UIUగా ఉండాలి. నా ఉద్దేశములో దీనిని కూవిళంగని, కూవిళంగని, కూవిళంగని, కూవిళం అని కూడ వ్రాయవచ్చును.
మత్తకోకిలలో శిలాశాసనము
క్రీస్తు శకారంభములో ఆనైమలైలో ఒక జైనుల సాంస్కృతిక కేంద్రము వర్ధిల్లుతుండగా, అలాటిదే మరొకటి శ్రవణబెళగొళలో ఆవిర్భవించినది. అక్కడ కొండమీది గుడిలో ఎన్నో శాసనాలు ఉన్నాయి. అందులో సుమారు క్రీ. శ. 650 నాటి శాసనము[3] ఒకటి మత్తకోకిల (కన్నడములో మల్లికామాలె) వృత్తములో నున్నది. నాకు తెలిసినంతవరకు శాసనాలలో మనకు కనిపించే మొట్టమొదటి మత్తకోకిల యిది. అది –
భద్రవాహు సచంద్రగుప్త మునీంద్ర యుగ్మది నొప్పె వల్
భద్రమాగిద ధర్మ మందువలిక్కెవందినిసల్కలో
విద్రుమాధర శాంతిసేన మునీశనాక్కియె వెళ్గొళా
అద్రి మే లశనాది విట్ట పునర్భవక్కెరె యాగి U
భద్రబాహు (చంద్రగుప్త మౌర్యుని గురువు), చంద్రగుప్త మునీంద్రు లిద్దరిలా ఒప్పుచున్నది. చాలా మంగళప్రదమైన ధర్మము లేశ మాత్రము బలహీనమైనప్పుడు పగడములా మెరిసిపోయే పెదవులున్న శాంతిసేన మునీశ్వరుడు వెళ్గొళములో ఉండే కొండపైన ఆహారమును త్యజించి మరో జన్మ లేకుడా తపస్సు చేసినాడు.