వజ్ర – ఇంద్ర – ఇం 1-1
1) దివిజేంద్ర / భువనేంద్ర / అవనీంద్ర / యువతీంద్ర
2) హరి యన / హరుసము / హరుఁడన / హరుసము
3) రామేశ / కామేశ / భూమీశ / సామి రా
4) స్వరముల / వరములే / సిరులగు / చిరముగా
5) అలకల / మెలికలు / చెలువపు / టలలగు
వజ్ర – సూర్య – సూ 1-2
1) ఆర్య / సూర్య / ధైర్య / వీర్య /
2) రవికి / ఛవియు / భువిని / గవియు
3) గాథ / నీది / బాధ / నాది
4) లలన / కలలు / శిలల / నలలు
5) నీవు / లేవు / కావ / రావు
వైడూర్య – ఇం/ఇం – యతి లేదు 2-1
1) ఎందుకో వ్యధలతో
కుందు యీ బ్రదుకులో
ముందు రావేలకో
నందగోపాలకా
2) సుందర ముఖముతో
చిందుచు నగవుతో
విందుగ మురళితో
నిందిర కొడయ రా
3) హృదయము నొక గీతి
యుదయము నేఁడయెన్
ముదమున బాడనా
యుదయన రాగమున్
4) పెదవులో యరుణమ్ము
మదిరయో యరుణమ్ము
కొదమ యీ ప్రాయమ్ము
ముదములో వర్షమ్ము
వైడూర్య – సూ/ఇం – యతి లేదు 2-2
1) సన్న జాజుల
మిన్న తావియె
నిన్ను జూడఁగ
కన్నె మనసున
2) ఏటి యొడ్డున
నీటి తుంపర
నాఁటి యాటల
పాటఁ బాడెను
3) మఱల నూదుము
మురళి పాటను
సరళిలో నను
మఱచిపోదును
4) మనసు కోకిల
దినము పాడును
వినఁగ లేరిట
కనఁగ రారిట
వైడూర్య – ఇం/సూ – యతి లేదు 2-3
1) వానలో నీవు
వానలో నేను
శాన సేపుండి
నానితిమ్మిందు
2) చేప లా కనులు
చాపమ్ము బొమలు
చూపుతో నీవు
వేఁపుకొన్నావు
3) గగనమ్ము వెలుఁగు
జగమంత వెలుఁగు
పగలంత వెలుఁగు
మొగమంత వెలుఁగు
4) మనవూరి తోట
మనవూరి కోట
మనవూరి మాట
విను, తేనె యూట
వైడూర్య – సూ/సూ – యతి లేదు 2-4
1) కడలి కలలు
కలల యలలు
విడకఁ దడిపె
నెడఁద నిందు
2) చిత్రమయిన
పత్రము లిట
నేత్రములకు
స్తోత్ర మయెను
3) వనమునందు
ననలు విందు
మనమునందు
స్వనము చిందు
4) నమ్మియుంటి
తమ్మికంటి
తెమ్ము నాకు
నెమ్మి రేకు
నీల – కృష్ణగీతి – ఇం/ఇం/ఇం, యతి లేదు 3-1
1) పత్రము లెఱ్ఱని బెదవులన్
బత్రము లతిమృదు పదములన్
బత్రము పచ్చని వలువలన్
నేత్రము లెప్పుడుఁ దలఁచెఁగా
2) ఇంద్రనీలమ్ము నీ దేహమ్ము
ఇంద్రచాపమ్ము నీ హాసమ్ము
ఇంద్ర ఛందస్సు నీ హారమ్ము
ఇంద్రజాలమ్ము నీ చారమ్ము
(ఇంద్ర ఛందస్సు = వేయి పేటల హారము)
3) డెందమం దుందువో మాధవా
వందన మ్మందుకో యాదవా
విందుగాఁ బాడనా గీత మా-
నందమై యాడనా నేస్తమా
4) ఆకులపాటుల రాత్రిలో
వ్యాకుల మెందుకు యాత్రికా
ఆకులు రాలెడు కాలమా
నీకిఁక ముగిసెడు కాలమా
5) ఉష్ణమో శీతమో పానమ్ము
తృష్ణ నాకాగదే నిజముగాఁ
దృష్ణ తీరంగ నీకిప్పుడే
కృష్ణగీతమ్ము నే పాడనా
నీల – సూ/ఇం/ఇం – 3-2
1) నిదురఁ జాలించి మేలుకో
ఉదయ వేళాయెఁ గోలుకో
ముదపు రోచిస్సు సూచిగా
ఉదయ కిరణాలు తోఁచెఁగా
2) తిమిర మిఁకలేదు జగములో
సుమము లలరంగ వనములో
విమలమై యొప్పు మనసులో
కమలనేత్రుండు తలఁపులో
3) సడులు పైనుండు జలధిలో
సడులు లోనుండ వబ్ధిలో
ముడులు పైనుండు మొగములో
నెడఁదలో నుండ వేమియున్
నీల – ఇం/సూ/ఇం – 3-3
1) వెలిఁగెఁగా వేఁగుఁజుక్కయున్
జిలుఁగుతో నందుఁ జుక్కలన్
పలికెనో, యదియు రజనితో
పలికెనో, యదియు దినముతో
2) ఏమనె రవియు నీతోడ
నేమనెఁ దేఁటి నీతోడ
నేమనె గాలి నీతోడ
నేమనెఁ జెప్పు మో తమ్మి
3) మెల్లఁగా మెల్లమెల్లఁగా
తెల్లఁగాఁ దెల్లతెల్లఁగా
చల్లఁగాఁ జల్లచల్లఁగా
వెల్లువై వెలిఁగె వెన్నెలల్
నీల – సూ/సూ/ఇం – 3-4
1) అరుణమైన మధువులో
తరుణి తడుపు పెదవిలో
మఱచిపోదు నన్ను నేన్
గరగిపోదు లేక నేన్
2) చిత్రమైన సంధ్యలో
నేత్రపర్వ మయ్యెఁగా
రాత్రి యింక వచ్చుఁగా
ధాత్రి హాయి నిచ్చుఁగా
3) చెట్టు క్రింద నిలువఁగా
పిట్ట మీద పాడఁగా
చుట్టు నంద మాడెఁగా
గట్టుమీద నలలుగా
నీల – రమ్యగీతి – ఇం/ఇం/సూ – 3-5
1) ఒంటిగా యీ యింట నేను
వింటివా నామాట నీవు
ఉంటి వా కొండపై నీవు
ఉంటి నీ నేలపై నేను
2) ఆడెద నానంద కేళి
పాడెద నే రమ్య గీతి
తోడుగ నుండవా నీవు
నీడగ నుండనా నేను
3) రమ్య గీతమ్ము నేఁ బాడ
సౌమ్య నృత్యమ్ము నీవాడ
గమ్య మానందమ్మె మనకు
సామ్య మెంతెంతయో మనకు
4) ఆ నీల గగనమ్మునందు
రాణించు మేఘముల్ జిందు
నానందమౌ వర్షధార
కానంగఁ గాల్వలై పార
5) మురియ కో నెలరాజ నీవు
విరియకే కుసుమమ్ము నీవు
కురియకే వెన్నెలా వాఁడు
కరుణ లేకుండెనే నేఁడు
6) చిఱుగాలి వీచకే యిట్లు
హరుసమ్ము లేదె యిక్కట్లె
సరసాల నా ఱేఁడు లేఁడు
విరజాజి వాడేను జూడు
నీల – సూ/ఇం/సూ – 3-6
1) దినము గడువంగ నాదు
మనసు మఱువంగలేదు
క్షణము దల్చుఁగా నిన్ను
వినుము పిలిచితిన్ నిన్ను
2) నీవు మఱువంగ నన్ను
రావు పిలువంగ నన్ను
పూవు పడె నేలఁ జూడు
చావు నాకింక జోడు
3) కనులు గలియంగఁ గనుల
మనసు గలియంగ మనసు
క్షణములో నయ్యె నొకటి
వినఁగఁ నాదమ్ము నొకటి
నీల – ఎత్తుగీతి – ఇం/సూ/సూ – 3-7
1) ఆమని లక్ష్మి నీవు
హేమంత రాత్రి నేను
కోమల సుమము నీవు
ఆ మరుభూమి నేను
2) ఇంద్రుని ధనువు నీవు
చంద్రుని కాంతి నీవు
సంద్రపు పొంగు నీవు
తంద్రపు తూఁగు నేను
3) చిత్తాన నీకె యెత్తు
వృత్తాల నీదె యెత్తు
ముత్యాల మాల వేతు
నెత్తుగీతులను వ్రాతు
4) ఎందుకే కాళ్ళు వణకె
ఎందుకే కన్ను లదరె
ఎందుకే చెప్పవేమె
డెందమున్ విప్పవేమె
5) నిదురలోఁ గలల నీవె
ఎదురుగా శిలల నీవె
ముదములో నలల నీవె
హృదయ సంచలన మీవె
6) మదిలోని దలఁపు నీవె
యెదలోని వలపు నీవె
వ్యధలోని యశ్రు వీవె
సుధలోని నురుఁగు నీవె
7) వానలోఁ జినుకు నీవె
వీణలోఁ బలుకు నీవె
గాన సుస్వరము నీవె
ప్రాణ వాయువులు నీవె
నీల – రామగీతి – సూ/సూ/సూ, యతి లేదు – 3-8
1) దినము వెలుఁగు తగ్గె
మనసు వెలుఁగు హెచ్చె
తనువు డోలలూఁగె
ధ్వనులు మారు మ్రోఁగె
2) నీవె నాకు క్షణము
నీవె నాకు యుగము
నీవె నాకు జగము
నీవె నాదు సగము
3) రవియు నిచ్చు వెలుఁగు
దివియు నిచ్చు జిలుఁగు
రవము లిచ్చుఁ బులుఁగు
కవియు నిచ్చుఁ దెలుఁగు
4) ప్రేమతోడ నీకు
రామగీతి పాడి
శ్యామవేళ నిన్ను
స్వామి యనెద నేను
గోమేధిక – మంగళగీతి – ఇం/ఇం – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-1
1) రంగని కయె పెళ్ళి – రమణి యా గోదతో
మంగళగీతిని – మగువలు పాడిరి
చెంగున వాద్యమ్ము – చెలరేగె నెల్లెడ
సంగమ సమయము – సంతోషమయమయె
2) నన్నయ్య రచియించె – నవవర్ణ శోభతో
తిన్నగాఁ దిక్కన్న – తీయఁగా వ్రాసెఁగా
నెన్నంగ నెఱ్ఱన్న – హృద్యమై రచియించె
వన్నెలన్ దెలుఁగులో – భారతమ్మంతయున్
3) కవిసార్వభౌముండు – కల్పించె నైషధ
మ్మువిద వరూథిని – నొలయించె పెద్దన్న
శ్రవణలాలిత్యమ్ము – సాధించె పోతన్న
రవివోలె కవులెల్ల – స్రష్టలే తెలుఁగులో
4) మంగళ మ్మాదేవి – మదనుని దల్లికి
మంగళ మ్మాదేవి – మాధవుఁ జెల్లికి
మంగళ మ్మాదేవి – మాటల బోఁటికి
మంగళ మ్మెప్పుడు – మహిపైన మాతకు
గోమేధిక – సూ/ఇం – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-2
1) చెలువు నిండారు – చెన్నకేశవ సామి
వలపు నిండారు – పార్థసారథి సామి
కళలు నిండారు – గరుడవాహన సామి
కలల నిండారు – కమలాక్ష నా సామి
2) నాకు వలదయ్య – నగల భోషాణమ్ము
నాకు వలదయ్య – నందనోద్యానమ్ము
నాకు వలదయ్య – నవవర్ణ వసనమ్ము
నాకు చాలు నీ – నగుమోము రూపమ్ము
3) సత్యభామకు – సంతోష మెప్పుడున్
నిత్యుఁడౌ హరి – నేస్తమ్ము దలచంగ
చిత్త మామెకు – సిరులతో నిండుఁగా
మెత్తపై గాళ్ళ – మృదువుగాఁ బిసుకంగ
గోమేధిక – ఇం/సూ – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-3
1) చూచెను సీత – సుందర రాముని
చూచెన్ రఘుపతి – సుందరి సీతను
తోఁచెను బ్రేమ – తొలకరి వానగ
వేచెను భూమి – వేడుకఁ గానఁగ
2) సుందరి సీత – సుందర వనమున
కుందెను బాధఁ – గుమిలెను మనమున
ముందర నిలిచె – మ్రొక్కుచు మారుతి
సుందర కాండ – శుభమగు నీ కృతి
3) హనుమంతుఁ డపుడు – హర్షమ్ము దెచ్చెఁగా
కనెనుగా సీత – కనకంపు ముద్రికన్
కనఁగఁ దాఁ బొందెఁ – గడుమోద మప్పుడున్
మనమెల్ల రామ – మందిర మ్మయెనుగా
గోమేధిక – కోమలగీతి – సూ/సూ – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-4
1) చాలు చాలు – సరసాంగి నీ యాట
మేలు మేలు – మృదువాణి నీ పాట
తాళజాల – తరుణమ్ము వచ్చెఁగా
పూలవీణ – మ్రోఁగించఁ బిల్చెఁగా
2) మనసులోన – మానని గాయము
తనువు పలుకు – తలఁకుల గేయము
వినగ రాని – విరహపు రూపము
క్షణములోన – కరిగెడు దీపము
3) కొండ కొక్క – గుండెయు నుండిన
కొండ పాడు – కోమలగీతిని
మండు టెండ – మాయని శైత్యము
రెండు నొకటి – రేతిరి దివసము
గోమేధిక – ఇం/ఇం – సూ/ఇం , యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-5
1) మనమున మన మీవు – మమత దీపమా
తనువునఁ దను వీవు – తపన రూపమా
తృణమున నీవెగా – తృప్తి వలయమా
ప్రణయపు నాదమా – ప్రణవ నిలయమా
2) కలలకు హద్దు లా – గగన తారలా
చెలిమికి హద్దు లీ – చిలిపి హృదయమా
వలపుకు హద్దు నీ – వదన లాసమా
తలఁపుకు హద్దు నీ – తరుణ భావమా
3) ఎందుకే తారకా – యెందు కానవ్వు
ఎందు కో చంద్రుఁడా – యెందు కానవ్వు
సుందరుం దరుదెంచి – సుమము నాకిచ్చు
డెందమ్ము పొంగఁగా – టెక్కు లవి హెచ్చు
గోమేధిక – తరళగీతి – సూ/ఇం – సూ/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-6
1) నందనందనా – నన్ను బ్రోవరా
సుందరాననా – సొబగు నీవెరా
వంద విరుల నీ – పదము నుంచెదన్
చందమామలా – స్వామి రమ్మురా
2) విన్నపాలతో – విసుగు లివ్వ నే
నన్ను జూడఁగా – నగుచు రా హరీ
కన్నులందు నీ – కారు మోము నీ
వన్ని నాకురా – వాసుదేవ రా
3) నీలమోహనా – చాల యాశతో
కేలతోడ నే – మాలఁ గూర్చితిన్
వేళ యయ్యెరా – వేగ రమ్మురా
పూలవీణ నే – మ్రోఁగజేతురా
4) విరియు పూలతో – మురియు కాంతితో
కురియు జ్యోత్స్నలో – సరస మాడఁగా
తరుణ మిదియెగా – స్వరము లొలుకఁగా
తరళగీతి నే – తరుణి పాడనా
గోమేధిక – తుంగగీతి – ఇం/సూ – సూ/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణము పైన – 4-7
1) శృంగమ్ముఁ జూడ – సొగసు వెలిఁగించె
భృంగమ్ముఁ జూడ – విరుల నలఁరించె
తుంగమ్ము తరగ – తోఁచె నదిలోన
శృంగార గీతి – సిరియె మదిలోన
2) నా జీవధార – నవము నిత్యమ్ము
నా జీవయాత్ర – నవ్య మార్గమ్ము
రాజీవనేత్ర – రమ్ము నీకిత్తు
నాజీవ మంత – నాథ నీ సొత్తు
3) పలుకుమా చిలుక – వలపు నిప్పించు
పిలువుమా చిలుక – ప్రేమ నిమ్మంచు
తలపులో వాఁడు – తరుణి కిఁక ఱేఁడు
కలలలో వాఁడు – కలువ మన్నాఁడు
గోమేధిక – రమణగీతి – సూ/సూ – సూ/ఇం, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-8
1) ఎందుకోయి – యిటుల వ్యధలతో
కుందకోయి – కుమిలి బ్రదుకులో
విందు కాదు – పెట్ట విస్తరిన్
ముందు వెళ్ళి – ముదము పొందుమా
2) అమల నీకు – నాలపించనా
రమణగీతి – రమణ, పాడనా
కమలమాల – గళము నుంచనా
విమలమైన – ప్రేమఁ జూపనా
3) పూల వీణ – మ్రోఁగె మూలలో
మేళవించె – మేలు ధ్వనులతో
నాలకించు – మమిత రక్తితో
నేల నింగి – నృత్య మాడఁగా
గోమేధిక – ద్విపదగీతి లేక ఆందోళికా – ఇం/ఇం – ఇం/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4.9
1) అందలమ్మందు నీ – వందమౌ రాణి
ఎందఱో పువ్వులా – యెత్తంగ దాని
ఆందోళికాగీతి – నవలీలఁ బాడ
ముందుగాఁ జనిరి పల్- మురిపాలతోడ
2) చంద్రుఁడా కాన దా – సకి నీవు జూడు
మంద్ర గీతమ్ముఁ దా – మక్కువన్ బాడు
సాంద్రమౌ వెన్నెలన్ – జల్లఁగాఁ నేఁడు
తంద్రమై యున్నదా – తాను యీనాఁడు
3) అలవలె పోదాము – కలకల మంచు
నలపయి నురుఁగులా – కిలకిల మంచు
మెలమెల పోదాము – మిలమిల మంచు
తెలతెల వెలుఁగులా – తళతళ మంచు
4) చల్లని వెన్నెలఁ – జల్లుచునుండె
పల్లకిలో నుండె – పెళ్ళికుమార్తె
తెల్లని మేనిలో – నెల్లెడ సిగ్గు
మల్లెలవలె నామె – యుల్లపు నిగ్గు
5) కస్తూరి రంగయ్య – కావేటి రంగ
ప్రస్తుతింతును నిన్ను – ప్రణయాంతరంగ
హస్తమ్ములందించు – హారి గోవింద
ఆస్తి నీవేగదా – యానందచంద
6) రా వేణుగోపాల – రాసప్రవీణ
రా విశ్వమోహనా – లాసప్రవీణ
రా వారిజేక్షణా – రాధానివాస
రావేల ననుజూడ – రా చారుహాస
గోమేధిక – భద్రగీతి – సూ/ఇం – ఇం/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-10
1) నిద్ర చాలింక – నెచ్చెలీ లెమ్ము
భద్రగీతమ్ముఁ – బాడంగ రమ్ము
యద్రిపై మంచు – యందాల బీడు
ముద్ర లయ్యెఁగా – మోదమ్ము నేఁడు
2) తుంగతో భద్ర – తోయమ్ము చేర
సంగమించెఁగా – సంగీత ధార
తుంగభద్రయై – దోలగా నూఁగె
రంగ రాగిణుల్ – రాణగా మ్రోఁగె
3) నన్ను మఱతువా – కన్నయా నీవు
నిన్ను దలఁతుఁగా – జెన్నుగా నేను
కన్నులన్ జూడు – తిన్నగా పాడు
వన్నెలే నీవు – వెన్నుఁడే నీవు
4) మందరోద్ధార – సుందరా ధీర
నందగోపాల – ఇందిరానాథ
చిందు మానంద – బిందువుల్ జిమ్ము
మిందుఁ బ్రేమాను-బంధ మ్ము లిమ్ము
గోమేధిక – కూరిమిగీతి లేక మంజులగీతి – ఇం/సూ – ఇం/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-11
1) మానసవీణ – మౌనము నేఁడు
గాన ము లేదు – కంఠము మూఁగ
వానయు లేదు – వసుధయు బీడు
దీనకు నీవు – తృష్ణను దీర్చు
2) అండయు నీవె – యాపదలోన
పండితులకును – బామరులకును
కొండలలోని – కోనేటిరాయ
యుండుము నాదు – నుల్లమునందు
3) ఈ రమణీయ – నీరవరాత్రి
తారల గీతి – దూరమునందు
తీరమునందు – నీరధి గీతి
కోరితి నీదు – కూరిమిగీతి
4) నిను గన నాకు – నెయ్యము, ప్రీతి
మనసున లేచె – మంజులగీతి
వినగను రమ్ము – ప్రియమగు పాట
ప్రణయరవమ్ము – పదముల తేట
5) ఇచ్చితిన్ నీకు – హృదయమ్ము నేను
ఇచ్చెదన్ నీకు – నిచ్ఛతో మేను
వెచ్చనౌ రేయి – విచ్చుగా పువ్వు
నచ్చు నీ దివ్య – నాదమౌ నవ్వు
6) మనసున బ్రీతి – మంజుల గీతి
వినగను రమ్ము – ప్రేమ స్వరమ్ము
చిన చిన పాట – సిరులకు మూట
ప్రణయపు పువ్వు – వదనపు నవ్వు
7) అందాలఁ జిందు – యా తార విందు
గంధాలతోడ – గాలి యూఁగాడ
చిందించు కళల – చిద్విలాసముల
నందించు దివిని – యందాల భువిని
8) అందాల భామ, – యానందసీమ
నుందాము రమ్ము – యుత్తేజ మిమ్ము
మందారమాల – మనసొక్క డోల
చిందించు సుధల – చిరునవ్వు నదుల
9) ఒక నవ్వు చాలు – యిఁక నవ్వ జగము
ఒక పువ్వు చాలు – యిఁకఁ బూయ తోట
ఒక పాట చాలు – యిఁక నాడ మనసు
ఒక ముద్దు చాలు – యిఁకఁ బొంగ తనువు
గోమేధిక – చారుగీతి – సూ/సూ – ఇం/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-12
1) కష్ట మెల్లఁ – గరుగఁగ వేగ
నష్ట మెల్ల – నాశన మవఁగ
దుష్ట శక్తి – దూరము సేసి
యిష్ట మంత – నిప్పుడు తీర్చు
2) వర్ణమయము – వసుమతి యయ్యె
స్వర్ణమయము – పత్రము లెల్ల
నర్ణవముగ – నరుణమై తోఁచె
పూర్ణ మయెను – ముగ్గుల రచన
3) చారుగీతి – చక్కఁగాఁ బాడి
హారి నిన్ను – నలరింతు నాడి
చేరు నన్ను – సిరియంచుఁ దలుతు
వారిజాక్ష – భక్తితోఁ గొలుతు
గోమేధిక – సీసకగీతి – ఇం/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి (1.1, 3.1) – 4-13
1) సీసక గీతిని – శీఘ్రముగను
రాసవిహారిణి – రసము లొలుక
నాసలఁ బాడఁగ – నవసరమ్ము
భాసుర రీతిగఁ -బరిఢవిల్లు
2) అందింతు నే నీకు – నందముగను
మందార మకరంద – మాధురులను
ముందు రా చల్లఁగా – ముదపు పూల
సందియ మ్మేలకో – చారుశీల
3) ఆకాశవీథి నేఁ – దాకనుంటి
రాకాసుధాకరున్ – రమ్మనంటి
నీ కపోలమ్ముపై – నెనరు ముగ్గు
యీ కౌముదీవేళ – నేల సిగ్గు
4) కన నిను మోదము – కలిగె మెండు
కనుగవ వ్రాసెను – కావ్య మొండు
వినగను స్వనముల – వీణ యంటి
తెనుఁగున కవితల – తేనె యంటి
గోమేధిక – హరిణగీతి – సు/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-14
1) హరిణగీతిని – హరుస మొసఁగ
హరికిఁ బాడెద – నలరు సిరిగ
విరులసరమును – వేతు మనసు
తరియ మురిసెద – ధవునిఁ జూచి
2) బుసలు గొట్టంగ – భుజఁగతతులు
దెసలు నలుపాయెఁ – దిమిర మలఁది
ముసురు గాలిలో – మ్రోత పెరిఁ గె
రసిక నీపైన – రక్తి గలిఁగె
3) కనులఁ దెఱవరా – కమలనయన
మనసుఁ దాకరా – మదనవదన
ప్రణయకుసుమమ్ము – బల్లవించె
కినుక వలదురా – కృష్ణ నీకు
గోమేధిక – శిశిరగీతి – ఇం/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-15
1) ఆకుల రాశి – యందములను
మ్రాకులఁ జూడ – మనకు నవదు
ప్రాకటమైన – పచ్చదనము
రేకులవోలె – పృథ్వి రాలు
2) చేమంతి పూల – చెలువు లేదు
హేమంత మొసఁగు – హిమపు రాశి
సీమలో నెల్ల – శ్వేత మణులు
ఆమనీ నీవు – అకట లేవు
3) గ్రీవము శిశిర-గీతిఁ బాడు
రావము నందు – రసము వగపు
పూవులు లేని – బుట్ట నైతి
జీవము లేని – శిలగ నైతి
గోమేధిక – మధురగీతి (హయప్రచారరగడ) – సూ/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి మూడవ గణముతో – 4-16
1) ఆటవెలఁది – అత్తగారు
తోటకూర – త్రుంచి తరిగె
పీట వేసి – ప్రేమతోడ
బోటి యొసఁగెఁ – బుల్లకూర
2) అందమైన – యంబరమ్ము
సుందరమ్ము – చుక్క లందు
చందురుండు – చల్లె మత్తు
చిందు వేసెఁ – జిన్న యెడఁద
3) రామచిలుక – రమ్మనంగఁ
బ్రేమతోడఁ – బెంచినాను
రామ యనెను – రామచిలుక
శ్యామ రార – స్వామి రార
4) గడియ గడియఁ – గలఁగుచుంటి
మడియుచుండె – మనసు నాకు
గుడికి వచ్చి – కూరుచుంటి
వడిగ రమ్ము – స్వామి నీవె
5) కుసుమగీతిఁ – బాడుచుంటి
రసము గ్రోల – రమ్మనంటి
వసుధ రాలి – వాడిపోదు
కొసకు జూడఁ – గోరుచుంటి
6) గుంజమందు – కుసుమరాశి
రంజకమ్ము – రాగమయము
సంజెవేళ – శ్రవణములకు
మంజులమ్ము – మధురగీతి
పుష్యరాగ – స్మరగీతి – ఇం/ఇం/ఇం – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో – 5-1
1) పడవలో పోదాము హాయిగా – పదములన్ బాడుచు
నడుమలో నదిబొడ్డు వడిలోన – నభమునే జూచుచు
ఎడఁదలో లేచు యా సడులతో – హృద్యమై యాడుచు
కడు సొంపు వెదజల్లు నక్షత్ర – కాంతిలోఁ దాకుచు
2) నిరుపమ సుందర రూపుఁడు – నీవని యెంచుచు
సరసపు చల్లని చంద్రుని – సంతతి యంటిని
చిఱుచిఱు నవ్వుల పువ్వులఁ – జెలువము చిమ్ముచు
మురిపెము లలరఁగ ముద్దిడు – మోహనుఁ డంటిని
3) విరులెల్ల వికసించ వనమందు – విరహమ్ము మఱువంగ
స్మరగీతిఁ జక్కఁగాఁ బాడంగ – మనసాయె నాకిందు
స్మరణమ్ము సేయంగ నీ పేరు – మరణమ్ము వచ్చినన్
సరి నాకు భువిలోన బ్రదుకులో – సరసమ్ము నింప రా
4) మ్రాఁకున నాకులు లేవిఁక – మాసెను హరువులు
కాకులు కేకులు పలుకవు – కమ్మని కేకలు
చీఁకటిమిత్తియు వెన్నెలఁ – జిమ్మెను నింగిని
చీఁకటి వెలుపల, గృహమునఁ – జిమ్మెను వెలుఁగులు
పుష్యరాగ – అమరేంద్రగీతి-1 – సూ/ఇం/ఇం – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-2
1) నేఁడు నలబోయె నెందుకో – నింగి నీరదరాశి
నేఁడు తెలబోయె నెందుకో – నేలయో హిమరాశి
నేఁడు ధవళాంబరము గప్పె – నేలతాలుపు లెల్ల
నేఁడు హేమంత మరుదెంచె – నిదురించె మన మెల్ల
2) వాఁడు నా డెందమందుండు – భావనా రూపమ్ము
వాఁడు నా ప్రేమ జగతిలో – వాసంత పుష్పమ్ము
వాఁడు నా చిత్త సంకల్ప – వర్ణప్రదీపమ్ము
వాఁడు నా మోహనాంగుండు – వనజాయతాక్షుండు
3) నీవు ఆకాశమందుండు – నీలంపు తారవో
నీవు సంద్రమ్మునందుండు – నీలంపు రత్నమో
నీవు వనములో బర్హికిన్ – నీలంపు పింఛమో
నీవు మనసులో గుడిలోని – నీలంపు మూర్తియో
పుష్యరాగ – అమరేంద్రగీతి-2 – ఇం/సూ/ఇం – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-3
1) వందన మిత్తు నీరోజు – బంధు మిత్రులకు నేన్
వందన మిత్తు నీరోజు – వరుసగా హితులకున్
వందన మిత్తు నీరోజు – వరుసగా గురులకున్
వందన మిత్తు నీరోజు – వసుధ నెల్లరికి నేన్
2) ఇన బింబ మింక వీడుఁగా – నీ నింగిఁ జీకట్ల
వనజాక్ష యుంటి నొంటిగా – భయముతో బాధతో
నిను జూడ మనసు వికసించు – నీలోత్పలాక్ష రా
విన నీదు వేణు రావమ్ము – ప్రేమాబ్ధి పొంగుఁగా
3) అలలేని సంద్ర మెక్కడో – యరుదుగా నుండుఁగా
కలలేని డెంద మెక్కడో – కాలిపోచుండుఁగా
వెలలేని ప్రేమ యెక్కడో – విరహాన నిండెఁగా
తులలేని రూప మెక్క డే – దొంగదో యెఱుగఁగా
4) రాత్రికి వేయి కన్నులు – రాజిల్లుచుండెఁగా
ధాత్రికి వేయి కన్నులు – తంద్రతో నిండెఁగా
ఆత్రముతోడ నీకయి – యలసి నేనుంటిఁగా
పాత్రము నింప నమృతపు – వలపు నిమ్మంటిఁగా
పుష్యరాగ – శ్యామగీతి-1 – సూ/సూ/ఇం – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-4
1) మానసమ్ము పిలిచెఁగా – మారాజు నిన్నిప్డు
ఆననమ్ము గనిపించ – నానంద మౌనుగా
వీను లెసఁగ సొంపుతో – వినిపించు గీతులన్
స్నానమంచు నెంతు నే – సంతోష గంగలో
2) వదనమందు నగపడె – వర్ణనాతీతమౌ
ముదపు టలలు బుగులుచు – పూర్ణిమా రాత్రిలో
నదియె నాదు హృదయము – నయముగాఁ బారెఁగా
నిదుర యేల, మొదలయె – నీటుగా నాటలే
3) పదములేని పాటలన్ – బాడెఁగా మెల్లఁగా
హృదయ మొక్క గీతికన్ – హృద్యమై చల్లఁగా
నిదియె వానితోడ నా – యింపారు మాటలౌ
మదియు నిండె రేయిలో – మా స్వామి మాయలో
పుష్యరాగ – అమరేంద్రగీతి-3 – ఇం/ఇం/సూ – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-5
1) ఆ నింగి శశిబింబమందు – నేనౌదు శశముగ
ఆ నింగి చుక్కలందుందు – నేనొక్క రాశిగా
ఆ నింగి గంగలో నుందు – నేనొక్క పుంతగా
ఆ నిసర్గమ్ములో నుందు – నేనొక్క యణువుగా
2) ఓ మేఘ మాలికా చాలు – యుఱుమకే భయమయ్యె
ఓ మబ్బు త్రోపరీ చాలు – యూఁగకే భయమయ్యె
ఓ మహా వార్నిధీ చాలు – యుబుకకే భయమయ్యె
ఈ మహీతలముపై నుండు – మెప్పుడున్ దోడుగా
3) మాధవా యని బిల్వ నేను – మౌనమా యిట్టులన్
వేదనన్ బాపఁగా రమ్ము – వేగమే చెంతకున్
మోదమ్ము నీయఁగా నాకు – మోహనా పున్నెమౌ
కాదనన్ సరియౌనె నీకు – కాలమ్ము గడచెఁగా
4) గోవింద మాధవా నీవు – నావైపు చూడవా
దేవాధిదేవ రా వచ్చి – దీవించి కావరా
సేవింతు నే సదా నిన్ను – రావేల శ్రీప్రదా
జీవమ్ము నీవెగా నాదు – భావంపు దివ్వెగా
5) మనసేల శిలయయ్యె నిట్లు – క్షణములోఁ గనక నిన్
మనసేల పరిగెత్తె నేఁడు – క్షణములో నిను గాంచ
మనసేల విరహాగ్ని మండె – క్షణములో గనక నిన్
మనసేల కవితలన్ జిందె – క్షణములో నిను గాంచ
పుష్యరాగ – శ్యామగీతి-2 – సూ/ఇం/సూ – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-6
1) రాలి పోవంగ పత్ర – రాశులు నేలపై
తేలి పోవంగ మబ్బు – తెల్లఁగా దూదిలా
కాల మాగునే ఋతువు – కదలుగాఁ జక్రమై
లీల లివియెగా చిత్ర – లీలావిలాసుకున్
2) సోమసూర్యాగ్నినేత్ర – సోమాంభుశేఖరా
కామగర్వాపహారి – కామాక్షివల్లభా
వ్యోమకేశా గణేశ – యోంకారరూపకా
వామదేవా మహేశ – భస్మాంగ భార్గవా
3) మఱచి పోతివి నాఁటి – మాయని మాటలు
తెఱచి మూసితి విందుఁ – దిమిరపు కోటలు
చెఱచి నవ్వుట సరియె – చిత్రపు రంగుల
పరుస వాక్యము లేల – వలపులోఁ దలపులో
పుష్యరాగ – శ్యామగీతి-3 – ఇం/సూ/సూ – ఇం/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-7
1) కన నిన్ను నిదుర లేక – కాచితిన్ వేచితిన్
నను జూడ నీవు రావు – నా సామి యీ రాత్రి
చిన కున్కు నేను దీయఁ – జెప్పకన్ వత్తువా
మనసార నిను గొల్వ – మఱచితిన్ మారాజ
2) ఈ రేయి యంతరించె – నిరులెల్ల మఱుగాయె
సూరీడు తూర్పునందు – శోభతో నుదయించె
పారిజాతములు విరిసె – పవడంపు కొనలతో
చేరంగ నాలయమ్ము – శ్రీరంగ వచ్చితిన్
3) జడలోన పూలతోడ – జలతారు చీరతో
సడి జేయు నందియలకు – జతయైన గాజులన్
నడచినా రడుగు లిడుచు – నడుముపై బిందెతో
పడఁతు లీ యుదయవేళ – పాటలన్ మాటలన్
పుష్యరాగ – అసమగీతి – సూ/సూ/సూ/ – ఇం/ఇం, మొదటి, నాలుగవ గణములకు యతి లేక ప్రాసయతి, 5-8
1) ఆర్య కనుఁగు తనయ – యందాల రాయఁడా
కార్యములకు విఘ్న-కర్తయు హర్త వో
సూర్యచంద్రనయన – శుక్లాంబరధర, మా
చర్యలందు నెపుడు – సన్మార్గమునుఁ జూపు
2) అందమైన రాత్రి – యానంద తారకా
బృంద మాకసమ్ము-నందెల్ల వెలిఁగెఁగా
విందు నొసఁగ నాదు- వీనుల కిప్పుడే
చిందు మసమగీతి – బిందువుల్ సింధువై
3) వెలుఁగులోనఁ దడిసె – విరులెల్ల లతలలో
జిలుఁగు లయ్యె వర్ణ – చిత్రంపు తెరలుగా
వెలుఁగు పారుచుండె – వెల్లువై వెలుపలన్
వెలుఁగు నిండి యుండె – విశ్వంబు నంతటన్
పుష్యరాగ – అమరేంద్రగీతి-4 – ఇం/ఇం/ఇం – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-9
1) చాలురా నీ యాట కన్నయ్య – చాలు చాలయ్య
వేళాయె నెంతయో మేలుకో – వేగ మేలుకో
వేలాది పూవులన్ జూడరా – ప్రీతి నాడెరా
లీల లందియ్యరా తియ్యఁగా – ప్రేమ నియ్యఁగా
2) నా మనమోహన రమ్మని – నాదు సొమ్మని
స్వామిని దలఁచుచునుంటిని – సరస మంటిని
కామిని గోరుచు నుంటిని – గష్ట మంటిని
ఏమని పాడుదు నీవేళ – హృదయ మీవేల
3) అన్నము తీయని పొంగలి – వెన్న రొట్టెలు
జొన్నల కంకులు పప్పులు – సన్న దుంపలు
కన్నుల కింపగు వంటలు – చిన్న పువ్వులు
సన్నుతు లీ దిన మతనికి – మన్నిఁ గావఁగ
పుష్యరాగ – శ్యామగీతి-4 – సూ/ఇం/ఇం – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-10
1) రామ శ్రీరామ జయరామ – శ్యామసుందరా
రామ యంచు నా సుందర – భామ జపియించె
రామ శ్రీరామ జయరామ – శ్యామసుందరా
రామ యంచు నా సుందర – స్వామి జపియించె
2) భువన మెల్లను మ్రోఁగెఁగా – భువనమోహనా
యవిరళమ్ముగ నీ వేణు – రవపు నినదమ్ము
నవము నవమైన గీతమ్ము – శ్రవణసుభగమై
కవిత సెలయేట నను ముంచె – భవము భవ్యమ్ము
3) జలము పోసితిన్ బాత్రలో – వలపు నిండంగ
జలము పోసినా వా పాత్ర – వలపు నిండంగ
జలము కూడంగ జలముతో – సలిల మొకటాయె
జలము నీదేది, నాదేది – వలపు లొకటాయె
పుష్యరాగ – శ్యామగీతి-5 – ఇం/సూ/ఇం – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-11
1) శ్రీధరా నీవె తోడుగా – చెలిమికాఁడుగా
పేద నన్ గాన రమ్మురా – పెద్ద సొమ్ముగా
మాధవా నీదు నీడరా – మమత నీడరా
రాధతో మాట లాడవా – రయము కూడవా
2) యోచనా, దురితమోచనా – ఉదజలోచనా
యోచనా, అసురపాశనా – ఉరగనాశనా
యోచనా, దుష్ట శిక్షణా – హోమరక్షణా
ఈ చరాచరము నీవెగా – హృదయ మీవెగా
3) భావములోన నలలుగా – వంద కలలుగా
జీవములోన హాసమై – చిద్విలాసమై
రావములోన చిందువై – రసపు బిందువై
కావఁగ వేగ రమ్మురా – కరము లిమ్మురా
పుష్యరాగ – లలితగీతి – సూ/సూ/ఇం – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-12
1) కలలలోన నల్లిన – కవిత రూపమై
శిలలపైన శిల్పమ్ముఁ – జెక్కె నొక్కండు
కళలతోడ నది యొక్క – కవిత పాడంగ
కలలు నిక్క మగు నింక – కవిత శిల్పమ్మె
2) మొన్న రాత్రి రాలేదు – నిన్న రాలేదు
నిన్ను జూడ నీరోజు – తెన్ను వెదుకంగ
నిన్ను దాక నీరోజు – పున్నెమగు రంగ
కన్న నీవు రాకున్న – కన్నె వాపోవు
3) లలితగీతి నొక్కటి – రమణ పాడంగ
సులలితాంగ వినఁగ రా – సుందరమ్ముగా
అలలవోలె పారు నా – హరుస మిఁకపైన
నెలఁత యాడు నాట్యమున్ – గలయఁజూడరా
పుష్యరాగ – శ్యామగీతి-6 – ఇం/ఇం/సూ – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-13
1) కన్నులా యెందుకే యిట్లు – కదలుచున్నావు
నిన్నుఁ దాఁ గన వత్తు ననుచు – నిన్న జెప్పంగ
నిన్నయో ముగిసెఁగా పిదప- నేఁడు నరుదెంచె
తిన్నఁగా రాఁడేల వాఁడు – తెరువు శూన్యమ్ము
2) వాదము లెందుకు చంద్ర-వదన నీకిప్డు
మోదపు పాత్రను వంచు – పులకరించంగ
నాదపు వీణను మీటు – నటనమాడంగ
తానన తానన తాన – తనన తానాన
3) మానససరసిలో హంస – స్నానమాడంగ
కానఁగ నెన్నియో నలలఁ – గదలి యూఁగంగ
పానము జేసేను పాలు, – వదలి నీరమ్ము
గానము సలుపంగ నయ్యెఁ – గలఁత దూరమ్ము
పుష్యరాగ – ప్రభాతగీతి – సూ/ఇం/సూ – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-14
1) సుందరాకాశమందు – సోయగమ్ములే
మందమారుతమందు – మత్తు తావులే
నందనందనా నీవు – నాకు సొమ్ములే
ముందు చూపరా మోము – మోహనమ్ములే
2) ఈ ప్రభాతములోన – హృదయ మలరంగ
రా ప్రశాంతత నిండి – రసము లొలుకంగ
రా ప్రతీక్షించితి నుష – రాగములు నింపు
సుప్రభాతగీతికల – శోభ నాలించు
3) నిండు పున్నమి చూడు – పండు వెన్నెల
మండె మనసిట నాకు – మధుర రజనిలో
నండ లేక నేనిందు – నలసి యుంటిరా
ఉండలేనురా చూడ – కుండలేనురా
పుష్యరాగ – సాంధ్యగీతి – ఇం/సూ/సూ – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-15
1) చూడుమా సంధ్య వెలుఁగు – సూర్యుఁ డరుణమ్ము
పాడుమా సాంధ్యగీతి – పరమ మోదమ్ము
నీడలో రాత్రిలోన – నెనరు పుష్పించు
మేడలో రంగు లింక – మెఱసి శోభించు
2) చంద్రోదయమ్ముఁ జూడు – చాల ముదముతో
సంద్రమ్ము పొంగు నింక – చాల సడులతో
మంద్రస్వరమ్ము లగును – మధుర రాగమ్ము
సుందరీ సంతసమున – నిందు రారమ్ము
3) రావోయి చందమామ – రసము నింపంగ
తేవోయి పసిఁడి కాంతి – దిశలు వెలుఁగంగ
పూవులా వచ్చి తాకు – ముద్దు లీయంగ
నీవూపు మీ నిసుంగు – నిదుర పోవంగ
పుష్యరాగ – ఉదయగీతి-5 – సూ/సూ/సూ – సూ/ఇం, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-16
1) చూడు ముదయ మాయె – సూర్యబింబమ్ము
పాడు ముదయగీతిఁ – బల్లవించంగ
నేఁడు తొలఁగు వ్యధల – నీడ చీకట్లు
వీడు వీడు మ్రోఁగు – వేడ్క లింపొంద
2) మనసు జలధియైన – మణులు నీవందు
తనువు జలధియైన – తపన నీవందు
కనులు జలధియైన – కాంతి నీవందు
నెనరు జలధియైన – నిప్పు నీవందు
3) సురుఁడు డెందమందుఁ – జూడు మున్నాఁ డ-
సురుఁడు డెందమందుఁ – జూడు మున్నాఁ డ-
సురుల సురుల మధ్యఁ – జూడు కొట్లాట
కురియ జేయు సుధను – కుంభమందుండి
పుష్యరాగ – అమరేంద్రగీతి-5 – ఇం/ఇం/ఇం – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-17
1) సుందర యామిని వెలిఁగెను – సొబగులతోడ
వందల విరు లిట విరిసెను – వాసనతోడ
చిందెను నీరవ గగనము – చెలువము నిండ
బంధము విడువఁగ లేనిది – భవ మిల పండ
2) ఆనంద సంద్రంపు టలలుగా – నేనుండ నెంతు
వాణిలో గీతికా రావమై – నేనుండ నెంతు
తేనెలో మాధుర్య బిందువై – నేనుండ నెంతు
వానలో మెఱుపులో వెలుఁగుగా – నేనుండ నెంతు
3) అడవిలో నడయాడుచుండంగ – నగపడెన్ గనుల
కెడమవై పొక ఱాతి స్తంభమ్ము – క్రిందుగా లతల
పడిన యా ఱాతిపై శిల్పంపు – పలుకు లీ నన్ను
నడకలో నాపంగ నటనతో – నాకయ్యె భ్రాంతి
(పలుకు=మాట, తునక)
4) అందమై పాడనా నీకు నే – నమరేంద్రగీతి
విందుగా నిది యుండు విడువకన్ – వీనులం దెపుడు
ముందు నీ బ్రదుకులో గీతి యిం-పొందఁగా నిలుచు
సుందరమ్మై శుక్రతారగా – శోభించి వలచు
పుష్యరాగ – గోదావరి గీతి – సూ/ఇం/ఇం – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-18
1) వేణు నాదమ్ము వినిపించ – వేగమ్ము రమ్ము
మేను పొంగెరా నీకోస – మీవేళ నమ్ము
ప్రాణ ముప్పొంగు నాలించ – పదము నీ నోట
తేనె చిందించు నందమౌ – తెలుఁగులో పాట
2) నాకు నీవేగదా యెల్ల – నటనమ్ము చాలు
రాకఁ జూచుచున్ నేనుంటి – రమ్ము నన్నేలు
నీకు నేనేగదా యండ – నీవు నాతోడు
చీకు చింతలే లేవింక – చెలువమే నేఁడు
3) అరుణ కిరణమ్ము లంభోధి – యలలపై మెఱయ
నరుణమై తోచె సంధ్యలో – నందమ్ము విరియ
స్థిరముగా శుక్ర తారయుఁ – జిందించె వెలుఁగు
యెఱుపు రంగులోఁ దెల్లఁగా – నెగిరేను పులుఁగు
4) మనసు నీదైన దలఁపులం – బెనవేసికొనెను
దినము నెట్టులో గడిపితిన్ – బనులతో నేను
యినుఁడు గ్రుంకంగ తిమిరమ్ము – వినువీథి నిండె
గణన జేయుచున్ బడియుంటి – గంటలన్ రాత్రి
5) రామ రాజీవలోచనా – రఘువంశదీప
రామ మునివర్య మఖపోష – రాకేందురూప
రామ జానకీవల్లభా – రావణధ్వంస
శ్యామ సాకేతపురరాజ – సచ్చిత్తహంస
6) కృష్ణ మోహనాకారమున్ – గేలతోఁ దాఁకఁ
దృష్ణ నాలోనఁ గల్గెఁగా – దివ్యప్రతీక
వృష్ణివంశాబ్ధిరజనీశ – వేదప్రకాశ
జిష్ణురథసాది గీతాంశ – శృంగారవేశ
7) ప్రేమ జగతిలో దైవమ్ము – ప్రేయసీ నీవు
కామ వనములో సౌగంధి-కాసూన మీవు
శ్యామలాభ్రమ్ములో వెల్గు – శంపాగ్ని నీవు
శ్యామగీతమ్ముఁ బాడ రా – శ్యామ వేళాయె
కాలిదాస మహాకవి వ్రాసిన రఘువంశములో సీతారాములు లంకనుండి పుష్పకవిమానములో మరలివచ్చునప్పుడు రాముడు సీతకు గోదావరి నదిని, ఆమె నీరుపోసి పెంచిన మామిడి చెట్లను, పంచవటి ఆశ్రమమును చూపిస్తాడు (రఘువంశము 13.33-13.35). ఆ శ్లోకములను ఈ గోదావరి గీతిలో అనువాదము చేసినాను.
ఇంద్రవజ్ర –
అమూర్విమానాంతరలంబినీనాం
శ్రుత్వా స్వనం కాంచన కింకిణీనాం
ప్రత్యుద్వ్రజంతీవ ఖముత్పతంత్యో
గోదావరీ సారసపంక్తయస్త్వాం
మ్రోఁగె నీ విమానమ్ములో – మోదమ్ము నిచ్చు
రాగమయమైన ఘంటికా – రావమ్ము లెన్నొ
వేగ గోదావరీతీర – విహగంపు సడుల
స్వాగతోక్తులన్ వినెనేమొ – సంతోషమునను
ఉపజాతి –
ఏషా త్వయా పేశలమధ్యయాపి
ఘటాంబుసంవర్ధితబాలచూతా
ఆనందయత్యున్ముఖకృష్ణసారా
దృష్టా చిరాత్పంచవటీ మనో మే
నీవు కృశమధ్య, మోయుచున్ – నిండైన కుండ
మావి తీవెలన్ బోయఁగా – మధురమౌ జలము
దేవి చూడుమా చెట్టులన్ – తిరుగు హరిణుల
పావనమ్మైన సుందర – పంచవటిఁ గను
ఉపజాతి –
అత్రానుగోదం మృగయా నివృత్తః
తరంగవాతేన వినీతఖేదః
రహస్త్వదుత్సంగనిషణ్ణమూర్ధా
స్మరామి వానీరగృహేషు సుప్తః
నాఁడు వేటాడి వేసారి – నడయాడుచుండ
గాలి గోదావరిన్ దేలి – గాసి దీర్చంగ
నాఁడు నీకోమలాంకమ్ము – నా శిరమ్ముంచి
నీడలో వంశకుంజమున్ – నిద్రించినాను
పుష్యరాగ – శ్యామగీతి-8 – ఇం/సూ/ఇం – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-19
1) గగనమ్ములోని హరివిల్లు – కవి వర్ణమాల
మొగమందు వెలుఁగు హసనమ్ము – ముదమిచ్చుఁ జాల
పొగవోలెఁ గప్పె నచలమున్ – మోడమ్ము చూడు
సొగసైన వర్షఋతువులో – సోయగ మ్మాడు
2) మనసైన సకియ పిలువంగ – మారాజ వినుము
నినుఁ దల్చి యిందు నిలువంగ – నెనరుంచి కనుము
తిన నీకు నిపుడు జేసెఁ దాఁ – దీయఁగా వంట
వనజాక్ష యారగించుమా – వచ్చి యీ యింట
3) బంగారుతీగ బియ్యమ్ము – వండించి తాను
రంగుల కూర లెన్నియో – రమియించ వేఁచె
నింగువ చారు కాచెఁ దాఁ – నింపుగా నీకు
శృంగారవల్లి బోనమ్ము – సేయఁగాఁ బిలిచె
పుష్యరాగ – నెలవంక, నిర్మలగీతి – సూ/సూ/ఇం – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-20
1) ప్రియములాడ నీతోడ – వేళ లేదాయె
నిపుడు నాకు చాకిరి – యింటిలో నెంతొ
కానరాదు నిజముగాఁ – గంటిలో నిద్ర
చాల యేడ్చి నిదురించెఁ – జంటి పాపాయి
2) నింగినుండి నావంక – నెలవంక జూచె
నేమి తెలుసు నా శశి – కీ నాదు మనసు
సుఖము నెఱుగ వా చంద్ర – సూర్యగ్రహాలు
బాధ లెఱుగ వా తార – లీ ధరాతలిని
3) లలిత లలిత భావాల – లహరిలో నేను
మునిగిపోవుచున్నాను – మోహనా యిపుడు
రమ్ము నన్ను గావంగ – రాజీవ నయన
వమ్ము నాకు యీ జీవి-త మ్మీవు లేక
4) కృతిగ నిత్తు నిర్మల – గీతిక నీకు
నతులమైన భావపు – టందము జేర్చి
శ్రుతుల కింపు నొసగఁగఁ – జెలువము తలర
గతుల నడచు నియ్యది – కౌతుక మలర
పుష్యరాగ – శ్యామగీతి-9 – ఇం/ఇం/సూ – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-21
1) తలఁపులో నీవెగా స్వామి – ధ్యానమ్ము నీవె
వలపులో నీవెగా స్వామి – వంతలో నీవె
చెలిమిలో నీవెగా స్వామి – చింతలో నీవె
కలఁతలో నీవెగా స్వామి – కనిపించ వేమి
2) కాంచెను రాముని సీత – కందోయి నిండ
కాంచెను రాముఁడు సీతఁ – గందోయి నిండ
కాంచఁగ నొండయె రెండు – కంపిలు హృదులు
కాంచిరి యెల్లరు జనులు – కల్యాణ ఘటన
3) కాంచనమృగమును గోరెఁ – గామిని సీత
కాంచిన సీతను గోరెఁ – కాముకుఁ డొకఁడు
కాంచెను సుందరుఁ డొకఁడు – కాంతను లంకఁ
గాంచన సీతయె తుదకుఁ – గాంతుని తోడు
పుష్యరాగ – చిఱుగీతి – సూ/ఇం/సూ – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-22
1) నేఁడు రేపల్లెలోన – నృత్యాల విందు
పాడు చిఱుగీతి నొండు – స్వరధార చిందు
వాఁడు యూదంగ మురళి – వరరాగ సరళి
కూడి యాడంగ హెచ్చెఁ – గులుకుతో విరలి
2) ఒక్క విధముగా నుండు – నుర్విలో ముదము
లెక్క లేనన్ని విధము – లెప్పుడున్ వెతలు
దిక్కు తోచక నుండుఁ – దెరువులన్ వెదుకఁ
బ్రక్క లేనిచోఁ బ్రియుఁడు – బ్రదుకౌను తునుక
3) వలపు నిచ్చెను హరికి – వలరాయుఁ దల్లి
తలపు నిల్పెను వాని – దారుణ్యవల్లి
కలలు పండఁగఁ జేయు – కలిమితో నెపుడు
చెలువు నిండిన వేల్పు – శ్రీదేవి యిపుడు
పుష్యరాగ – ఆమనిగీతి – ఇం/సూ/సూ – ఇం/సూ, యతి లేక ప్రాసయతి . నాలుగవ గణముతో, 5-23
1) తెలుసునా నీకు తరువు – పలికెడు భాష
తెలుసునా నీకు విరులు – పలికెడు భాష
తెలుసునా నీకు గిరులు – పలికెడు భాష
తెలుసునా నీకు మనసు – పలికెడు భాష
2) ఆనందసీమలోన – నందాల మేడ
కానంగ నందు గలదు – కనకంపు గోడ
వేణూ నినాదములకు – వీణలు తోడు
రాణన్ రమించు నదియు – రసముల వీడు
3) ఆమనిగీతి వినఁగఁ – గోమలీ రమ్ము
ప్రేమకుఁ గ్రొత్త పాట – సోమరసమ్ము
నా మనమందు కేకి – నాట్యమ్ము నాడె
శ్రీమతీ విరులు పూయు – చిత్రమై నేఁడు
పుష్యరాగ – ఉదయగీతి-4 – సూ/సూ/సూ – ఇం/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-24
1) గగనసింధువందుఁ – గమలముల్ బూచె
సొగసు నిండ నీదు – సుపదముల్ దాఁక
మొగము నిండ వెలుఁగు – పూర్ణేందు వనఁగ
పగటి పూజ వేళ – వర వేంకటేశ
2) సిగరమందు నీవు – సిరితోడ నుండి
జగమునందు జనుల – కాపాడుచుండి
సగము కనుల మూయు – సర్వేశ దేవ
నగవు కాంతి వెలయ – నను బ్రోవు మయ్య
3) కమలనయన దివ్య – కౌసల్యతనయ
కమలమిత్రు నుదయ – కాలమ్ము లెమ్ము
అమలసంధ్య జపము – నాచరించంగ
విమల కల్య వేళ – విడు నిద్ర సామి
పుష్యరాగ – శ్యామగీతి-10 – ఇం/ఇం/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-25
1) నీలోన నేనుంటి నాలోన – నీవు గలవు
లోలోన నుండు నా భావంపు – లోఁతు నెలవు
ఆలోచనలు రంగు టద్దంపు – టాలయములు
సాలంకృతము నీదు ముఖమందు – సంబరములు
2) ఆకసమ్మున నీల జీమూత – హార మెందు
నేకమై మెలమెల్లఁ జల్లఁగా – హిమము చిందె
స్వీకరించెను పృథ్వి యభ్రంపు – శ్రీముఖమ్ము
రాకపోకలు తగ్గె రహదారి – రజత మాయె
3) ఎందుకో చంద్రుఁడా నాపైన – నిట్టు లలుక
ముందు రా మబ్బులన్ దొలగించి – మోద మొసఁగ
విందుగా వెన్నెలన్ గాయరా – విరహ మణఁగు
నందియల్ మ్రోఁగంగ నాట్యమ్ము – నాడెదనుర
పుష్యరాగ – తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-26
1) తోటయం దొక్క వలయమ్ముఁ – దొలుతఁ దీర్చి
తేట తెలుఁగులోఁ బాడచున్ – దేటగీతి
మీటి శృంగార వీణలన్ – మృదుల రవము
నాట లాడంగ నీరోజు – హర్షకరము
2) పైడి జాబిల్లి వెలుఁగులో – పరిఢవిల్లి
వేడి లేకుండు గాలిలోఁ – బెఱిగి పెఱిగి
నేఁడు పుష్పించె నీ తీగ – నెనరు విరులఁ
జూడ నతిరమ్య దృశ్యమ్ము – సుందరమ్ము
3) తెలుఁగు ఛందస్సు లందమ్ముఁ – దెలియజేయు
నెలుఁగు నందుండు నాదమ్ము – వెలికిఁ దెచ్చు
నలలు తేటయౌ నీటిలో – నలరు రీతిఁ
గలుఁగ జేయుఁగాఁ జెలువంపు – టలల వెలుఁగు
పుష్యరాగ – బాలగీతి – ఇం/సూ/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-27
1) రాకకై యెదురుజూచితి – రావు నీవు
వేకువన్ జూడు నభములో – వెలుఁగు నిండె
చీఁకటుల్ దొలఁగె జగములోఁ – జెలువు నిండ
నీ కళాపూర్ణ హృదిలోన – నేను లేనె
2) పాడెద బాలగీతిని – పరవశించి
యాడెద నేఁడు నవ్వుల – యలలపైన
తోడుగ నుండ మిత్రులు – తూఁగి యాడ
వేడుక గాదె రోజంత – విసుగులేక
3) ఆకలి రాజ్యమం దొక్క – యాకు నేను
చీకటి రాజ్యమం దొక్క – శిల్పి నేను
కూకటివేరు పెకలించు – క్షురిక నేను
కాకుల రవములో నుండు – గళము నేను
4) వచనపు రచన నిజముగా – వాసికెక్కు
పచనపు రుచికి ఫలితము – బాన పొట్ట
కచునికి దేవయానికి – కస్సుబుస్సు
కిచకిచలాడుచుండెను – కీశకులము
పుష్యరాగ – ఉదయగీతి-3 – సూ/సూ/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-28
1) మనసులోని మనసుగా – మసలినావు
ననుఁ గనంగ నయముగా – నవ్వినావు
దినము రాత్రి ముదములోఁ – దేల్చినావు
వెనుక వదలి యెందుకే – వెళ్ళినావు
2) ప్రణయగీతి పల్లవిన్ – బాడ రమ్ము
ప్రణవమంత్ర మదియెగా – వలపులోన
క్షణము క్షణము వేచితిన్ – గాన రమ్ము
వ్రణముతోడ డెందమున్ – బగులనీకు
3) చిత్ర మొకటి గీచితిన్ – చెలువ మలర
పత్ర మదియె ప్రేమకున్ – ప్రణయమూర్తి
సూత్రధారి మనసులో – స్ఫూర్తి నెఱయ
యాత్రలోన పథము నే – నరయ నౌనె
పుష్యరాగ – ముత్యాలముగ్గు లేక సుందరగీతి – ఇం/ఇం/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-29
1) ముత్యాల ముగ్గు నే వేసి – ముదము నిండ
నిత్యమ్ము పూజింతు దేవ – నియతితోడ
చిత్తమ్మునం దుండ రమ్ము – శ్రీనివాస
పొత్తమ్ము వ్రాయంగ నిమ్ము – స్ఫూర్తి నీవు
2) భావమ్ము రాగమ్ము తాళ – వాద్యనికర
రావమ్ము లన్నియున్ జేర – రమ్య నృత్య
జీవమ్ము సొంపొందు రంగ – సీమపైన
దేవికిన్ నైవేద్య మిదియుఁ – దృప్తి నిడును
3) పారఁగా నుల్లమునందు – భక్తినదియు
శ్రీరంగనాథుని మార్గ-శీర్షమందుఁ
జేరంగఁ గోరుచు గోద – సేసె సేవ
హారమ్ముఁ దాలిచి యిచ్చు – హారి కెపుడు
4) మింటిలో దీపమ్ము వెలిఁగె – మినుకు మనుచు
నింటిలో దీపమ్ము వెలిఁగె – నెల్ల గదులఁ
గంటిలో దీపమ్ము వెలిఁగెఁ – గాంతు లలరఁ
దుంటరీ తాఁకకే కేల-తోడ దివ్వె
5) మాధవా కేశవా చారు – మందహాస
రాధికామోహనా శ్యామ – రాసవాస
శ్రీధరా సుందరాకార – చిత్రవేశ
బాధలన్ బాపఁగా రమ్ము – పాపనాశ
6) నీవట నేనిటఁ దలఁచ – నీవు లేవు
నీవట నేనిట వలచ – నీవు రావు
నీవట నేనిట మధ్య – నీరనిధులు
నీవట నేనిట పైన – నింగి దాట
7) సుందరగీతిని పాడి – సుధలఁ జల్ల
నందన వనమున నాడె – నమిలు లెల్ల
వందల సుమములు కదలెఁ – బవనమందు
బందిగ నయితిర నేను – భవమునందు
పుష్యరాగ – ఉదయగీతి-2 – సూ/ఇం/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-30
1) తెల్లవారెను నేఁడు – తెలుగునాఁడు
యుల్ల మలరఁగఁ బాడు – నుదయగీతి
ఫుల్లమాయెను విరులు – పూజకొఱకు
వెళ్ళుదామిఁక విభుని – వేడ గుడికి
2) గొల్లపడుచులు చిలుకు – కుండలందు
దెల్లనగు వెన్న బైకిఁ – దేలివచ్చె
గల్లుగల్లంచు లలన – గాజులాడె
హృల్లతలు బూచె సరస-హృదయుఁ జూడ
3) విప్రబృందము గుడికి – వెడలుచుండె
సుప్రసన్నునిఁ గొలువ – శుద్ధముగను
సుప్రకాశమ్ము నిండె – క్షోణిపైన
సుప్రభాతమ్ము నీకు – సుందరాంగ
పుష్యరాగ – ఛందోవతంసము- ఇం/సూ/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-31
1) ఇంద్రధనుస్సుఁ జూడు – మిచ్చు ముదము
చంద్రుని జ్యోత్స్న పఱచుఁ – జల్లదనము
మంద్రమౌ స్వరము లొసఁగు – మదికి హాయి
సంద్రంపు నీల మదియు – సామి రంగు
2) చూడుమా చందమామ – సుందరమ్ము
మేడపైఁ బరచుఁ దనదు – మేటి కాంతి
గూడుపైఁ బరచుఁ దనదు – గొప్ప వన్నె
వాఁడు స్నేహితుఁడు నిజము – ప్రజల కెల్ల
3) ఉదయమ్ము, తూర్పు నరుణుఁ – డుద్భవించె
ఉదయమ్ము, నభమునందు – నుషయు వెల్గె
ఉదయమ్ము, సరసిలోన – నుదజ మలరె
ఉదయమ్ము, క్రొత్త యాశ – లుదయ మాయె
4) అందమ్ముఁ జిందు పద్య – మతులితమ్ము
ఛందోవతంస మిదియు – సంతసమ్ము
చందురుం డాకసమున – జారు దీప్తి
విందుగాఁ దారలందు – వెలుగు రీతి
5) గగనాంగణమున జంద్ర – కాంతి నిండె
సొగసుగా ధాత్రిపైన – శోభ నిండె
నగముపై శ్వేత హిమపు – నగవు నిండె
సుగముగా నగర మెల్ల – సోలుచుండె
6) బావిలో జంద్రు ఛాయ – పాల బిందె
రేవులో పడవ నీడ – లెందు జూడ
త్రోవలో పిల్లి వెళ్ళె – తుఱ్ఱుమంచు
తావులన్ జిమ్మె విరులు – తరళ రాత్రి
పుష్యరాగ – కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 5-32
1) నభములోన వెలుఁగు – ననలు విరిసె
శుభము లీయ నుదయ – శోభ కురిసె
ప్రభువు నిదుర లేచు – వసుధ యింక
ప్రభలతోడ నిండు – వలదు శంక
2) రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె
భువిని చెట్టులెల్ల – మ్రోడువారె
దివిని పులుఁగు వలను – దెసకుఁ బోయె
అవుర హిమము గురియు – నవనిపైన
3) కమలగీతి వినఁగ – ఖమణి వచ్చె
భ్రమరగీతి వినఁగ – రమణి వచ్చె
రమణిగీతి వినఁగ – రాజు వచ్చె
సుమవనమ్మునందు – శోభ వచ్చె
మరకత – మధురగీతి- సూ/సూ/సూ – సూ/సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో, 6-64
1) మధుర భావ భరిత – మధుర పదము నీకె
మధుర రాగ భరిత – మధుర గీతి నీకె
మధుర వేణు నాద – సుధలఁ జింద రమ్ము
మధుర హృదయమందు – ముదము నింప రమ్ము
2) మధురలోన నుండు – మదనమోహనుండు
వ్యధల నెల్లఁ బాపు – మదికి నిచ్చుఁ దీపు
మృదులమైన నవ్వు – హృద్యమైన పువ్వు
నిదురయందు వాఁడె – నెనరులోన వాఁడె
3) పండుగాయె నేఁడు – వ్రజమునందుఁ జూడు
నిండు శశియు వెలిఁగె – నేల కూడ వెలిఁగె
దండఁ దాల్చి పాడెఁ – దనువు పొంగఁ బాడె
గుండె లలర విభుఁడు – గోపాబాలుఁ డపుడు
మాణిక్య – హృదయగీతి – ఇం/సూ/సూ – ఇం – ఇం/సూ/సూ, యతి నాలుగవ గణముతో, ప్రాసయతి ఐదవ గణముతో, 7-103
1) పాడనా హృదయగీతి – వలపుతో – నాడనా నీకు ముందు
మేడలో నిన్ను దాకి – మృదువుగా – జూడనా వెన్నెలందు
జాడలన్ నడచి నేను – జల్లగా – నీడలో నిలిచియుందు
తోడుగా జీవిత మను – ద్రోవలో – వీడ కీ జగమునందు
2) ఏ రాగ మాలపింతు – హృదయమో – యీ రేయి మూగవోయె
తారాగణమ్ము వెల్గెఁ – దపనతో – నా రూపు మాసిపోయె
క్రూరుండు చంద్రుడాయెఁ – గోరికల్ – దీరంగ, లేవు నీవు
దూరాన నుంటి వెందు – దుఃఖమున్ – వారించ రావు నీవు
3) కోకిలా పాడబోకు – కొమ్మపై – నాకులన్ మెక్కి చటుల
చీకుచింతలను మాని – చెల్లునా – నీకు బాడుటయు నిటుల
రాక వాడుండిపోయె – రాత్రిలో, – వేకువన్ వెలుఁగు నిండె
నీకు నే దెలుపు టెట్లు – నెంజెలిన్, – మేకుగా జీల్చె గుండె
మాణిక్య – కమలన(మేలన)గీతి – సూ/సూ/సూ/సూ – సూ/సూ/సూ, 7-128
1) చిన్న చిన్న యాశ నాకు – చిన్న చిన్న యాశ
నిన్ను గనఁగ నాశ నాకు – నిన్ను గనఁగ నాశ
సన్నజాజి మాల వేతు – సన్నజాజి మాల
నన్ను గాన వేల నీవు – నన్ను గాన వేల
2) మనసు మనసు గలియ వేయి – మాట లనవసరము
తనువు తనువు గలియు వేళ – తర్క మనవసరము
ప్రణయ మధువు లొలుక నమృత – పాత్ర యనవసరము
వనజనయన నిన్ను జేర – స్వర్గ మనవసరము
3) ప్రాసయతితో –
మనసునందు కలలు నీవె
వనధియందు నలలు
తనువునందు సిరులు నీవె
స్వనమునందు స్వరులు
క్షణములోని భావి నీవె
ననలలోని తావి
వినగ మంచి పాట నీవె
వెనుక ముందు బాట