వింజమూరి శివరామారావు లలితగీతాలు

నాలుగేళ్ళ క్రితం ఆంధ్రభారతి శాయిగారితో కలిసి తెలుగు నిఘంటువులు, పదకోశాలు పోగు చేసే కార్యక్రమంలో ఒకరోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ‘విద్యార్థి కల్పవల్లి’ కోసం వెతుకుతుంటే ఊహించని విధంగా వింజమూరి శివరామారావుగారి గేయసంకలనం కల్పవల్లి-గీతికాలతాంతాలు (1958) అన్న పుస్తకం కనబడింది. చూడగానే ఎగిరి గంతేశాను అంటే అతిశయోక్తి కాదు! చిన్నప్పుడు విజయవాడ రేడియో కేంద్రం నుండి విన్న ఎన్నో లలితగేయాల పూర్తి పాఠాలు ఒక్కసారి కళ్ళముందుంటే కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.

శివరామారావుగారెవరో బాగా తెలుసు కానీ ఇన్ని పాటలు రాశారన్నది నాకు తెలియని విషయం. నల్లని వాడా నే గొల్లకన్నెనోయ్, వినవే చెలి పిలుపు అల్లదిగో, ఊపరె ఊపరె ఉయ్యాల, కాత్యాయని కన్నతల్లి — అన్న నాలుగు పాటలను మినహాయిస్తే! ఆ పుస్తకంలోని సుమారు 60 పాటల్లో ఒక పాతిక పాటల వరకు నా దగ్గరున్నాయని కూడా తేలింది. వేర్వేరు టేపుల్లో వున్న ఆ పాటల్ని ఒకచోటకి చేర్చుదాం అని పని మొదలు పెట్టాను కానీ ఉద్యోగపు పనులు, ప్రయాణాల హడావిడిలో ఆ సంకలన కార్యక్రమం ముందుకి సాగలేదు. పోయిన మే నెలలో ఒకరు ఇ-మెయిల్ ద్వారా శివరామారావు గారు రాసిన శ్రీరామాయణ కథాగానం, ఒకప్పుడు రేడియోలో భక్తిరంజని కార్యక్రమాల్లో ప్రసారమయ్యేది, ఆ గేయం నా దగ్గర వుందా అని అడిగారు. వారే ఆ గేయం, శివరామారావుగారి కుమార్తె పాడిన వర్షన్, యూట్యూబులో వున్నట్లు చెప్పారు. ఆ రామాయణ గేయం ఒరిజినల్ నాకయితే ఇంకా లభ్యం కాలేదు కానీ నాలుగేళ్ళ క్రితం పక్కన పెట్టిన సంకలన కార్యక్రమం మాత్రం కొంచెం ముందుకు కదిలింది.

గతంలో శివరామారావుగారి పాటలు మూడు: శ్రీ పురాణ ధాత్రికీ, ఊపరె ఊపరె ఉయ్యాల, పడవ నడపవోయ్, మీరు విన్నారు. ఇక్కడ మీకు వినిపించబోయే పాటల్లో కొన్ని తేలికగా దొరుకుతున్నవే అయినా ఒక చోట వుంటాయన్న ఉద్దేశంతో, నల్లనివాడా నే గొల్లకన్నెనోయ్, వినవే చెలి పిలుపు అల్లదిగో లాంటి పాటలని కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. ఆయన పాటలు మరికొన్నింటిని త్వరలోనే అందివ్వడానికి ప్రయత్నిస్తాను.


1. బోసినవ్వుల బాపూజీ – శ్రీరంగం గోపాలరత్నం.

2. కాత్యాయనీ కన్నతల్లీ – శ్రీరంగం గోపాలరత్నం.

3. శ్రీ పురాణ ధాత్రికి – బృందగానం.

4. జయ గంట మింట మ్రోగినది – బృందగానం.

5. వందనం అభివందనం – శ్రీరంగం గోపాల రత్నం, వింజమూరి లక్ష్మి.

6. ఊగిపోతున్నది సాగిపోతున్నది – ముసునూరు వెంకట రమణమూర్తి.

7. పడవ నడపవోయ్ – పి. బి. శ్రీనివాస్.

8. జంటగా నావెంట నడుచువాడే – వైదేహి.

9. వినవే చెలి పిలుపు అల్లదిగో – ఆర్. బాలసరస్వతి.

10. చక్కని చుక్క ఏదిరా – మాధవపెద్ది సత్యం.

11. నల్లనివాడా నే గొల్లకన్నెనోయ్ – ఆర్. బాలసరస్వతి.

12. ఓయి తుమ్మెద ఇంత మాయ చేతువా – శ్రీరంగం గోపాలరత్నం.

13. చూడుమీ తెలి వెన్నెల –

14.అందగాడా నా చందురూడా – పి. లీల.

15. వచ్చెనోయి వసంతము – ఇందిర.