విమానాన్ని చూసిన ప్రతిసారీ
వినమ్రంగా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందిఎగిరే రేకుల డబ్బాలా కాక
చేపా హంసలు ఒక్కటై దర్శనమిచ్చే
దేవతా సోయగంలా అనిపిస్తుంది
సంజీవ పర్వాతాన్ని అమాంతంగా
మోసుకు పోతున్న హనుమంతుడి
కార్యోన్ముఖుతని గుర్తుకు తెస్తుంది
గాలిని అజమాయిషీ చేసే దాని విన్యాసం
నాగరికత చేసే అపూర్వ పర్వతారోహనానికి
ప్రతీకలా అనిపిస్తుందిఎగిరే విమానం
ఏ ఆటంకాలూ లేకుండా ప్రవహించే
ఆరోగ్య శరీరం లోని రక్తాన్ని స్పురిస్తుంది
బద్దకాన్ని దుమ్ముదులపమనే
వివేకానందుడి మేల్కొలుపులా అనిపిస్తుందివిమానాశ్రయం వాకిట్లోకి చేరిన ప్రతిసారీ
వదలివచ్చిన ఊరు
ఊరుకీ ప్రపంచానికీ వెయ్యాల్సిన వంతెనా
గుర్తుకొస్తాయి
ఆ వాకిట్లోనే
స్వాగతంగా తోడ్కొనొచ్చిన అతిధులూ
వీడ్కోలు పలికినప్పటి కౌగిలింతల కన్నీటి ముద్దులూ
కుడా గుర్తుకొచ్చి
మనసంతా కలియతిరుగుతాయిఅనేక,
కేరింతలనీ
ఆశలనీ
ఆశయాలనీ
సమాచారాన్ని
సందడినీ
సందర్శనాలనూ
గమ్యాల దిశగా
సాకారం చేసే విమానం
ఒక్కోసారి
హఠాత్తుగా
బోయవాని వేటుకు
రాలిపడిన విహంగంలా
నడి సంద్రం లోనో
దిక్కూ మొక్కూ లేని నేల మీదో
అర్ధాంతరంగా కూలిపోతే
నడుస్తూ నడుస్తున్న మనిషి కళ్ళలో ఎవరో కారం కొట్టి
మట్టుపెట్టినట్టనిపిస్తుంది
గాలిపటమెగరేస్తున్న పసి మోము లోని
సంతోషాన్ని ఓర్వలేక
ఆ చేతిని ఎవరో నరికేసినట్టనిపిస్తుంది
నాగరికత మనిషిని వెక్కిరించేందుకు
పన్నిన కుట్రలా అనిపిస్తుంది.
ఆ సమయంలో
గుండెలోని విషాదం కళ్ళనిండా ధారలు కట్టి
బుగ్గలమీద ఎండిపోయిన చారికల
వినాశపు గుర్తులా అనిపిస్తుంది.పురిటిలోనే తల్లిని పోగొట్టుకున్న పాప
పెరిగి పెద్దై తను తల్లయ్యాక
కోల్పోయినదేదో తిరిగి పొందినట్టు
కోటి ఆశలతో విమానాలు కూడా
మళ్ళీ మరోచోట
లేస్తూనే ఉంటాయి.
చేరుతూనే ఉంటాయి.
చేరుస్తూనే ఉంటాయి.
రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్. ... పూర్తిగా »