పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్

అశ్వఘోషుని పరిచయము

అశ్వఘోషుడు కుషాన్ సామ్రాజ్యమునకు చెందిన కనిష్కచక్రవర్తి కాలమునాటి వాడు. కనిష్కుని కాలము క్రీస్తు శకము మొదటి శతాబ్దమని కొందఱు, రెండవ శతాబ్దమని మఱి కొందఱు అంటారు. ఇతని తల్లి పేరు సువర్ణాక్షి, ఇతని నివాస స్థానము సాకేతపురి. ఇతడొక బౌద్ధ బిక్షువు. ఇతనికి భదంత, ఆచార్య, మహాకవి, మహావాది ఇత్యాది గౌరవప్రదానమైన బిరుదములు ఉన్నాయి. కవికులతిలకుడైన కాలిదాస మహాకవి రెండవ చంద్రగుప్తుని (క్రీ.శ. 380 – 415) ఆస్థానకవి అని చాలమంది అంగీకరించారు. ఇదే నిజమైన పక్షములో అశ్వఘోషుడు కాలిదాసకవికి ముందు జీవించినాడు.

అశ్వఘోషునికి ఆ పేరు ఎందుకు వచ్చినది అన్నదానిపై ఒక కథ ఉన్నది. అశ్వఘోషుడు (ఇతని పూర్వాశ్రమపు నామము మనకు తెలియదు) బ్రాహ్మణుడు, వేదవిద్యలను నేర్చినవాడు. పార్శ్వుడు అనే ఒక బౌద్ధగురువు గాంధారదేశమునుండి మధ్యభారత దేశానికి మతప్రచారము కోసము వచ్చినాడు. అక్కడ ఉండే బౌద్ధ బిక్షువులు మధ్యాహ్న భోజన సమయములో ఒక డంకాను లేక గంటను మ్రోగించేవారు. దానిని విన్న జనులు వారికి భిక్ష తీసికొని వెళ్ళేవారు. అప్పుడు అశ్వఘోషుడు తన్ను వాదప్రతివాదములలో జయించినప్పుడు మాత్రమే దానిని మ్రోగించాలి అని చెప్పినాడట. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరు అతనిని ఓడించలేక పోయారు. ఆ సమయములో ఈ పార్శ్వగురువు అక్కడికి వచ్చి తాను అశ్వఘోషుని ఓడించగలను అని చెప్పి గంట మ్రోగించినాడు. రాజాస్థానములో రాజు, మంత్రుల, పండితుల సమక్షములో పోటి ప్రారంభమైనది. మొట్టమొదట వృద్ధుడు అవడమువలన పార్శ్వుని ప్రారంభించమంటాడు అశ్వఘోషుడు. పార్శ్వగురువు ఇలా ప్రారంభించాడు: ‘దేశము శాంతిభద్రతలతో ఉండాలి, రాజు దీర్ఘాయుస్సుతో నిండాలి, ఈతి బాధలు లేకుండ జనులు ఆనందమయముగా, పృథివి సస్యశాలినిగా ఉండాలి. దీనిని తప్పు అని ఎలా వాదించుటకౌతుంది?’ అశ్వఘోషుడు అపజయమును అంగీకరించి పార్శ్వుని శిష్యుడయ్యాడు, బౌద్ధాన్ని స్వీకరించాడు. కాలక్రమేణ గురువు అతనికి అన్ని విద్యలు నేర్పించినాడు. ఆ దేశపు రాజు కూడ (బహుశా) బౌద్ధ ధర్మాన్ని స్వీకరించినట్లున్నది.

అశ్వఘోషుని పేరు

కొంత కాలము తఱువాత, కుషాను సార్వభౌముడు ఆ రాజ్యముపైన దండెత్తి రాజును ఓడించి కప్పము, కానుకలను అడిగినాడు. రాజు దగ్గర అంత ధనము లేదు. చక్రవర్తి ధనమునకు బదులు అశ్వఘోషుని తనతో పంపమన్నాడు. ఇష్టము లేకున్నా అశ్వఘోషుని ఆజ్ఞ మేఱకు రాజు అలాగే నన్నాడు. కుషాను చక్రవర్తి మంత్రులకు ఇది నచ్చలేదు. లక్ష బంగారు నాణెములకు బదులుగా ఆ సన్యాసిని తమ చక్రవర్తి ఎందుకు అంగీకరించాడని. చక్రవర్తి ఏడు గుఱ్ఱాలను ఆఱు రోజులు పస్తు పెట్టమన్నాడు. ఏడవ రోజు భిక్షువును ధర్మబోధన చేయమన్నాడు. అదే సమయములో గుఱ్రములకుముందు ఆహారమును ఉంచమన్నాడు. జనులే కాక ఆ అశ్వములు కూడ తమ ముందుంచిన తిండిని మాని అశ్వఘోషుని బోధనలను విన్నాయట. అప్పుడా మంత్రులకు ఆ అరుదైన భిక్షువు విలువ తెలిసినదట. అప్పటినుండి అతనికి అశ్వఘోషుడనే పేరు సార్థక నామమయినది.

గ్రంథములు

అంతకుముందు బౌద్ధమత గ్రంథములను, బుద్ధునిగుఱించిన కథలను పాళీ భాషలో, ప్రాకృతములో వ్రాసేవారు. అశ్వఘోషుడు అవే కథలను సులభమైన శైలిలో పండితజన రంజకమైన సంస్కృతములో వ్రాసినాడు. అందువలన వైదిక పండితులకు కూడ బౌద్ధమతములో ఆసక్తి కలిగి అందులో కొందఱు ఆ మతాన్ని అవలంబించినారు. అతడు నాగార్జునాచార్యునికి (క్రీ.శ. 150నుండి 250 మధ్య కాలము) సమకాలికుడా కాదా అనే విషయము కనిష్కుని కాలనిర్ణయముపైన ఆధారపడిన విషయము. సౌందరనందము, బుద్ధచరితము, సారిపుత్రప్రకరణము లేక శరద్వతీపుత్రప్రకరణము అనే నాటకము (ఇప్పుడు ఇందులోని కొన్ని పుటలు మాత్రమే లభ్యము), గండిస్తోత్రము మున్నగు వాటిని వ్రాసినాడు. సూత్రాలంకారము, ప్రబోధచంద్రోదయము కూడ అశ్వఘోషునివే అంటారు. బుద్ధచరితమ్, సౌందరనందములలో సౌందరనందమ్ మొదట వ్రాయబడినదని, తఱువాత బుద్ధచరితమ్ అని అంటారు. కవితాహృదయములో సౌందరనందమ్ గొప్పది. బుద్ధచరితమ్ ఒక మహాకావ్యము. సౌందరనందమును తెలుగులో పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వర రావు వ్రాసినారు.

బుద్ధచరితమ్

బుద్ధచరితమునకు ఆంగ్లములో ఎడ్వర్డ్ కోవెల్ (Edward Cowell), జాన్‌స్టన్ (EH Johnston), పాట్రిక్ ఓలివెల్ (Patrick Olivelle), హిందీలో సూర్యనారాయణ చౌధరి అనువాదాలు ఉన్నాయి. కాని తెలుగులో ఈ మహాకావ్యానికి అనువాదము లేదు. ఆ కొఱతను భాస్కర్ హనుమత్ కొంపెల్ల తీర్చినారు. వారు కొన్ని నెలలకు ముందు బుద్ధచరితమునకు మూల సంస్కృత శ్లోకములతో, ప్రతి పదార్థములు, అన్వయము, తాత్పర్యములు ఇస్తూ శ్రీ అశ్వఘోష విరచితమ్ బుద్ధచరితమ్ అను పుస్తకమును రాసినారు. ఇటివలే ఈ పుస్తకము శ్రీమతి సుప్రభ ద్వారా నాకళ్ళకు కనబడినది. ఇంతవఱకు ఇట్టి ప్రయత్నమును తెలుగులో ఎవ్వరు చేయలేదు.

బుద్ధచరితమ్‌లో మొత్తము 28 సర్గలు (ఆశ్వాసములు) ఉన్నాయి, అందులో మనకు ఇప్పుడు 14 మాత్రమే లభ్యము. అందులో కూడ కొన్ని అసంపూర్ణములు. మిగిలినవి సుమారు వేయి సంవత్సరాల ముందు కాలిపోయినవట. వాటికి అనువాదాలు చైనాలో, టిబెట్టులో ఇప్పుడు కూడ ఉన్నాయి. సిద్ధార్థుని జననమునుండి అతనికి బుద్ధత్వము ప్రాప్తమయ్యే వఱకు ఇందులోని కథ. ఇందులోని ముఖ్య పాత్రలు: శుద్ధోదనుడు (బుద్ధుని తండ్రి), మహామాయ (తల్లి), అసిత మహర్షి (గురువు), యశోధర (భార్య), రాహులుడు (కొడుకు), ఛందకుడు (సారథి), కంథకము (అశ్వము పేరు), బింబసారుడు (మగధ దేశపు రాజు), అరాడాది మునులు, మారుడు (మంచికి ప్రతికూలుడు), శిష్యులు మున్నగువారు. ఇందులోని సర్గలు – (1) భగవత్ప్రసూతి, (2) అంతఃపురవిహారము, (3) సంవేగోత్పత్తి, (4) స్త్రీవిఘాతనము, (5) అభినిష్క్రమణము, (6) ఛందకనివర్తనము, (7) తపోవనప్రవేశము, (8) అంతఃపురవిలాపము, (9) కుమారాన్వేషణము, (10) శ్రేణ్యాభిగమనము, (11) కామవిగర్హణము, (12) అరాడదర్శనము, (13) మారవిజయము, (14) బుద్ధత్వప్రాప్తి.

ఈ పుస్తకము ఎందుకు ముఖ్యమైనదో అనే విషయమును పరిశీలిద్దామా? సంస్కృతములో మనకు దొఱికిన కావ్యములలో ఇది పురాతనమైనది. అంటే అంతకు ముందు కావ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండవచ్చును. అవి ఏలాగుంటాయి అన్నది ఊహాగానమే. ఇది మొట్టమొదటి కావ్యము కావున కాలిదాసాది తఱువాతి కవులకు ఇది మార్గదర్శకము. సర్గమునంతా (చివరి ఒక రెండు పద్యములు తప్ప) ఒకే ఛందస్సులో వ్రాయడము అట్టి ఒక లక్షణము. కొన్ని వృత్తములను అశ్వఘోషుడు మొట్టమొదట వాడినాడు. దానిని బుద్ధచరితమ్‌లో గమనించవచ్చును. శార్దూలవిక్రీడితము, ఆశ్వాసాంతములో మాలిని, నందన, శరభలలితవంటి వృత్తములు, అనుష్టుప్పులోని కొన్ని విపులా భేదములు కావ్యములో మొట్టమొదట ఈ కవి ఉపయోగించినాడు. అదే విధముగా వర్ణనములు, నాటకీయత కూడ. అశ్వఘోషునికి రామాయణ భారతాదులు, పురాణములు పరిచితమే. ఎందుకనగా అతడు పూర్వాశ్రమములో ఒక బ్రాహ్మణుడు. రామాయణములోని కొన్ని ఘట్టములకు ప్రతిబింబాలు ఈ కావ్యములో మనకు కనిపిస్తాయి, ఉదా. బుద్ధుని విడిచి రథములో ఒక్కడుగా వచ్చిన సారథిని చూచిన ప్రజల దుఃఖము, రాముని విడిచి వచ్చిన సుమంత్రుని చూచిన అయోధ్య ప్రజల దుఃఖము, శుద్ధోదనుడు తన్ను దశరథునితో పోల్చుకొనడము, రాముని కష్టములను సీత తలచుకొన్నట్లు గౌతముని కష్టములను యశోధర తలపోయడము. ఒక ఉదాహరణము-

సుమంత్రస్యాఽభియాంతం తం
శతశోఽథ సహస్రశః
క్వ రామైతి పృచ్చంతః
సూతమభ్యద్రవన్నరాః – (వాల్మీకి రామాయణము, అయోధ్య-57-9)

సారథి సుమంత్రుని రథము సమీపించుచుండగా, అక్కడ కూడియున్న వేనవేల జనులు ‘రాముడు ఎక్కడ’ అని వానిని ప్రశ్నించారు.

నిరీక్ష్యతా బాష్పపరీత లోచనా
నిరాశ్రయం ఛందకమశ్వమేవ చ
విషణ్ణవక్త్రా రురుదుర్వరాంగనా
వనాంతరే గావ ఇవర్షభోజ్ఝితా – (బుద్ధచరితము, 8.23)

కన్నీళ్ళు వ్యాపించిన కళ్ళున్న ఆ ఉత్తమ స్త్రీలు సారథి ఛందకుడిని, ఖాళీగా ఉన్న గుఱ్ఱాన్ని చూసి దుఃఖముతో కూడిన ముఖాలతో అడవిలోపల ఎద్దుచేత విడిచిపెట్టబడిన ఆవులు ఎలా ఏడుస్తాయో అలా ఏడ్చినారు (భాస్కర్ తాత్పర్యము).

అశ్వఘోష కాలిదాసు లిద్దరు వైదర్భి శైలిని అనుసరించారు. చిన్న చిన్న పదాలతో అర్థవంతమైన రీతిలో అలంకారయుక్తముగా ఆకర్షణీయముగా వ్రాసినారు. అంతే కాదు వారి ఇద్దరి కవితలలో సామ్యము కూడ ఉన్నాయి.

ద్వంద్వాని సర్వస్య యథః ప్రసక్తా-
న్యలాభలాభప్రభృతీని లోకే
అతోఽపి నైకాంత ముఖోఽస్తి కశ్చి-
న్నైకాంతదుఃఖః పురుషః పృథివ్యామ్ – (బుద్ధచరితము, 11.43)

లోకములో లాభనష్టాలు మొదలైన పరస్పర విరుద్ధమైన జంటలు అన్ని విషయాలలోను అంటిపెట్టుకొని ఉంటాయి. అందువల్ల ఈ భూమి మీద ఏ మనిషి కేవలము సుఖము మాత్రమే అనుభవించడు, అలాగే కేవలము దుఃఖము మాత్రమే అనుభవించడు (భాస్కర్ తాత్పర్యము).

కస్యాత్యంతం సుఖముపనతం దుఃఖమేకాంతతో వా
నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమిక్రమేణ – (మేఘదూతము, 109)

ఎవరైనా ఎడతెగని సుఖముతో గాని లేక దుఃఖముతో గాని ఉండుటకు వీలవుతుందా? మన అదృష్టము చక్రభ్రమణమువలె పైకి క్రిందికి చరిస్తుంది.

పుస్తకపు విశేషములు

కొంపెల్ల భాస్కర్ ఈమాట పత్రికకు చిరపరిచితులైన రచయితయే. వారికి సంస్కృత భాషపైన మక్కువ ఎక్కువ. అంతే కాక అందులోని కావ్యపు సొగసులను తెలుగువారికి తేట తెలుగులో పరిచయము చేయాలనే ఆకాంక్ష కూడ ఉన్నది. ఈ రెండు ఒకే చోట ఉండడమువలన మనకు బుద్ధచరితపు అనువాదము లభించినది. వారు జాన్‌స్టన్ అనువాదములను గుర్తులో ఉంచుకొని ప్రతి పద్యానికి అన్వయము, అర్థము, తాత్పర్యమును ఇచ్చినారు. మచ్చుకు యాదృచ్ఛికముగా ఒక పద్యమునకు వారి అనువాదమును ఇక్కడ ఇస్తున్నాను. అందువలన పాఠకులు ఈ పుస్తకమును కొనుక్కొని చదువుకొనుటకు ఆసక్తి కలుగవచ్చును.

వియుజ్యమానే హితరౌ
పుష్పైరపి ఫలైరపి
పతతిచ్ఛిద్యమానే వా
తరురన్యో న శోచతే – (బుద్ధచరితము, 4.61)

హి = ఎందుకనగా, పుష్పైః అపి = పువ్వుల చేతనైననూ, ఫలైః అపి = ఫలములచేతనైననూ, తరౌ = చెట్టు, వియుజ్యమానే = విడదీయబడుచున్నది కాగా, వా = లేదా, ఛిద్యమానే = నరకబడుచు, పతతి = పడిపోవుచున్నది కాగా, అన్యః తరుః = వేరొక చెట్టు, న శోచతే = దుఃఖించదు.

ఎవరైనా ఒక చెట్టుకున్న పువ్వులూ, కాయలూ కోసేస్తున్నా, లేక ఆ చెట్టుని నరుకుతుండగా అది తెగిపడిపోతూ ఉన్నా మరొక చెట్టు దుఃఖించదు. జడమైన చెట్టు ప్రవృత్తిలాగే మానవుల ప్రవృత్తి కూడా ఉందని భావన.

ఒకే మారు ఈ పుస్తకాన్ని అందఱు చదువలేరు. నిదానముగా ఒక్కొక్క సర్గను ముగించి అందులోని భావములను అవగాహన చేసికొని వేఱొక సర్గను ప్రారంభిచుట మంచిది.

భాస్కర్ కృషి అభినందనీయము. సంస్కృత సాహిత్యముపైన తెలుగులో వెలువడిన ఇటీవలి పుస్తకాలలో ఈ బుద్ధచరితమునకు ఒక గొప్ప స్థానము గలదని నేను భావిస్తాను. మలి ముద్రణలో క్రింది విషయములను చేర్చినయెడల పాఠకులకు అనుకూలముగా ఉంటుంది: 1. క్లుప్తముగా ప్రతి సర్గయందలి సారాంశము. 2. అక్కడక్కడ ఉండే ముద్రారాక్షసముల సవరణ. 3. పుటల సంఖ్యతో శ్లోకముల అకారాది పట్టిక. 4. సర్గలలో వాడిన ఛందస్సును ఇస్తే నాలాటి వారికి అనుకూలముగా నుంటుంది.

(శ్రీ అశ్వఘోష విరచితమ్ బుద్ధచరితమ్ (అర్థ తాత్పర్యములతో) – భాస్కర్ హనుమత్ కొంపెల్ల; ప్రచురణ: అజో విభో కందాళం ఫౌండేషన్, హైదరాబాదు, తెలంగాణ; పుటలు: 432, విడుదల: జనవరి 2018; ప్రతులు: నవోదయ, విశాలాంధ్ర, తెలుగు బుక్ హౌస్; మూల్యము: 300 రూపాయలు.)


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...