నల్లతోలు: కథ నచ్చిన కారణం

కథ నచ్చకపోవడానికి కారణమో, కారణాలో చెప్పమంటే చాలా తేలిగ్గా చెప్పొచ్చు. వస్తువు బాగోలేదనో, కథనం కుదరలేదనో, శైలి ఛండాలమనో, వాతావరణం బాగా లేదనో, శిల్పం (అంటే?) మృగ్యమనో – కథలను వొలిచి కొలిచే పదునైన పడికట్టు పదాలతో చీల్చి చెండాడవచ్చు. కానీ, కథ నచ్చిన కారణం చెప్పమంటే కథ వ్రాసినంత కష్టమే!

నాకు నచ్చి, నేను మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు చాలానే ఉన్నాయి. అందులో సి.రామచంద్రరావు గారి ‘నల్లతోలు‘ కథ ఒకటి! నల్లతోలు కథ ఎందుకు నచ్చింది, ఎందుకలా చదివిన కథనే పదేపదే చదువుతున్నాను అని ప్రశ్నించుకున్నప్పుడు వచ్చే సమాధానాలే కథ నచ్చిన కారణాలనుకుంటాను నేను. వాటినే మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.


వేలుపిళ్ళై – సి. రామచంద్రరావు, 2011
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. 120పే. రూ. 55.00

శ్రీ సి.రామచంద్రరావు గారి కథ! వీరి కథా సంకలనం ‘వేలుపిళ్ళై’ మొదటి ముద్రణ జరిగేనాటికి నేను పుట్టలేదు. ఈ సంకలనం మళ్ళీ ఈ మధ్యే ప్రచురించారని తెలిసి ఎంతో ఆనందపడ్డవాళ్ళలో నేనొకణ్ణి. దాదాపు అర్థ శతాబ్దం క్రితం వ్రాసిన ఈ కథల్లో కనిపించే ప్రాంతాలు, పరిసరాలు నాకు పరిచయం లేనివి. కానీ పరిసరాలను, పాత్రలను కళ్ళ ముందు నిలిపేందుకు వాడిన భాష, వాక్యాలు నిత్యనూతనం. కథ పూర్తయ్యేసరికి, కథ జరిగిన ప్రదేశంలో ఎప్పుడో తిరుగాడినట్లు, కథల్లో పరిచయమైన పాత్రలతో ఎప్పుడో వాళ్ళతో మాట్లాడినట్లు, వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆ ప్రక్కనే ఉన్నట్లు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినట్లు, దీర్ఘ సంభాషణల్లో పాలుపంచుకున్నట్లు అనిపిస్తుంది.

‘వేలుపిళ్ళై’ కథలో గోపాల్ చెట్టియార్ లారీలోంచి దిగి, అక్కడ బజారులో పనిచేసే పిల్లలకు బీడీలు పంచడం నా కళ్ళముందే జరిగిన అనుభూతి కథ చదివిన ప్రతిసారీ కలుగుతుంది.

ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించి – నాకు ఈ కథ నచ్చిన కారణాలను విన్నవించుకుంటాను. కథ నాకెందుకు నచ్చుతుందో, మిగిలిన నా సహపాఠకులకు అవే కారణాలతో అదే కథ నచ్చాలని లేదు. వారికి కథ నచ్చడానికి (లేదా నచ్చకపోడానికి) గల కారణాలు వేరుగా ఉండొచ్చు కూడా!

నల్లతోలు కథ నచ్చి, నాకు చాలా కాలం గుర్తుండడానికి కథ అల్లిక ఒక ప్రధాన కారణం. పేట్ రావ్ కోణం లోంచి రచయిత అలవోకగా చేసే పరిశీలనలు, ప్రస్తావనలు కథకు కీలకమని, పూర్తిగా చదివాక తెలుస్తుంది. పేట్ రావు సామాజిక స్థాయి, ఆ సంఘంలో పేట్ రావుకున్న గుర్తింపు, పరపతి – ఇవన్నీ దారిలో కనిపించీ కనిపించని చిన్న చిన్న సైనుబోర్డులు. కథతో బాటు ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకున్న పాఠకులకు, చూసీ చూడకుండా దాటి వచ్చిన సూచనలు గుర్తొచ్చి అబ్బురపరుస్తాయి. నలుపు తెలుపులు కథంతా పరుచుకుని వున్నా, జాగ్రత్తగా చూస్తే నలుపు తెలుపుల సమ్మేళనమే (grey shade) కథలో కనిపిస్తుంది. ముందే చెప్పినట్లు, ఈ కథలో వాతావరణం నాకు పరిచయం లేనిది. అయినా ఇప్పుడిది వ్రాస్తున్నప్పుడు కూడా పేట్ రావు వెళ్ళిన పార్టీ, అతడు నుంచున్న చోటు, ఉత్తుత్తి బల్ల చుట్టూ కూర్చున్న వారికి ఉత్తుత్తి షాంపేను పోస్తున్న బ్రిటీష్ యువకుడు, పాడుతూ గెంతులు వేస్తున్న యువకులు, కథ చివరలో నల్లని జాగ్వార్ కోసం చీకట్లో వెదికే పేట్ రావ్, కారులో నిద్రపోతున్న డ్రైవర్ – అన్నీ, అందరూ కళ్ళ ముందు కదలాడుతున్నారు! ‘వేలుపిళ్ళై’ కథలో లాగానే, ఈ కథలో పేట్ రావ్, లోవరాజుతో మాట్లాడేటప్పుడు నేనక్కడే ఉన్నాను. పార్టీ జరుగుతున్నప్పుడు మిస్టర్ స్టూవర్ట్ పేట్ రావుకు స్కాచ్ గ్లాసు అందిస్తున్నప్పుడు, డంకన్ హార్వీతో బాటు నేనూ అక్కడే ఆ పార్టీ జరిగే గదిలోనే ఉన్నాను!

మాతృదేశంలో కేవలం శరీరం రంగు వల్ల పేట్ రావ్, వలస పాలకుల వారసుల వివక్షకు గురి కావడం కలచివేసే విషయం. పరాయి నేల మీద, నాలాగ వలస వచ్చిన వాళ్ళు అక్కడక్కడ అప్పుడప్పుడూ వివక్షకు గురౌతున్నామన్న సంగతి గుర్తించడం, ఆవేదనతో ఆవేశపడడం మనకు అనుభవమే! బ్రిటీషర్లతో సమానమైన హోదా, పరిచయాలు గల పేట్ రావ్ శరీరం రంగు కారణంగా కొంతమందితో వెలివేయబడ్డం (అది పార్టీ రూములోంచా లేక…?), పార్టీ హోస్ట్ మిస్టర్ స్టూవర్ట్ దాన్ని ఆపాలనుకోవడం, అప్పుడు కప్పుకున్న రంగుతోలు జారిపోయి, మానవ సహజమైన స్వీయ ప్రయోజనాలు స్నేహాన్ని, విచక్షణను శాసించడం ఈ కథలో పతాక సన్నివేశం!

దేశాలు, మతాలు, రంగుల కన్నా వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమన్న నిజాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతం. చెప్పదలుచుకున్న విషయమ్మీద పూర్తి అవగాహన, చెప్పే విధానంలో రచయిత నేర్పు, సన్నివేశాల ఎంపికలో, వాటి కూర్పులో ప్రదర్శించిన నైపుణ్యం ఈ కథను కలకాలం నేను గుర్తుంచుకునేలా చేశాయి.

మీరూ ఈ కథ చదవండి. మీ అభిప్రాయాలను కూడా మనందరితో పంచుకోండి.