పడిపోయిన సిపాయి కథ గురించి చెప్పబోయేముందు, రచయిత శిష్ట్లా ఉమామహేశ్వరరావు (1912-1952) గురించి ముందుగా మూడుమాటలు చెప్పాలి. కవిగా, తనకన్నా కన్నా ముందుగానే ‘విలక్షణమైన ఒక నవీన ధోరణిలో రచనలు,’ చేస్తున్నాడని శ్రీశ్రీ రాశాడు. అంతేకాదు. ‘మారో మారో, మారో మారో/ ఒకటి రెండూ మూడు నాలుగు,/ మారో మారో మారో మారో (1928)’ కవిత శ్రీ శ్రీ రాసిన మరోప్రపంచం గీతానికి ‘ప్రోద్బల’మేనని చెప్పాలి. ఈ విషయాలు శ్రీశ్రీ తన ‘అనంతం’లో ( శ్రీశ్రీ అనంతం: శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం-20, 1986. చూ: 182 – 183 పేజీలు) రాసుకున్నాడు. వచనకవిత ప్రారంభకుడు ఎవరు అని జ్వాలాముఖి 1970లో అడిగిన ప్రశ్నకు, ‘శిష్ట్లాని చూసినపుడు – I was really inspired. నాకంటే ముందు శిష్ట్లాయే start చేశాడు ఇద్దరమూ ఒక్క దారంట వచ్చిన వాళ్ళమే,’నని చెప్పాడు శ్రీశ్రీ (చూ: శ్రీశ్రీ – ప్రజ పేజీ 93, శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం -19, 1990). ఈ విషయాలు తిరిగి చెప్పడం, శిష్ట్లాని పరిచయం చెయ్యడానికే గాని శ్రీశ్రీని తక్కువ చేయడానికి కాదు.
ఉమామహేశ్వరరావు నవమిచిలుక, విష్ణుథనువు అనే ఖండకావ్యాలు రాశాడు. చాలా కథలు రాశాడు. అయితే సిపాయికథలు గ్రంథరూపంగా మొట్టమొదటి సారి 1946 లో వచ్చింది. 1984 లో కె. వి. రమణారెడ్డి మరికొన్ని కథలు సేకరించి ‘సిపాయికథలు’ సంకలనం ప్రచురించారు.
సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు
నవోదయ ప్రచురణ 1984. వెల రూ. 20/-
ఏ దేశంలోనన్నా యుద్ధం వస్తే, యుద్ధపరంగా సాహిత్యం రావడం సహజం. ఆ విషయంలో మన సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం కుంటుపడే ఉన్నది. కారణం అనూహ్యం. బహుశా తెలుగునాడు నుంచి మిలిటరీలోకి వెళ్ళినవారు తక్కువై ఉండవచ్చు. కాగా సిపాయిలుగా వెళ్ళిన బహుకొద్దిమందీ పెద్దచదువులు చదువుకోలేని పేదలే. వారి అనుభవాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెప్పడానికి అనువు కల్పించబడలేదు, కాబోలు.
పోతే, 1940ల్లో, అంటే రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో, భారతదేశం ఈ యుద్ధంలో పాల్గొన్నది. యూరప్‌లో లాగా మనం ఏ విధమైన విధ్వసం చూడలేదు. సుభాస్ బోసు అజాద్ హింద్ ఫౌజ్‌ని ఎదుర్కోవడానికి అస్సాం – బర్మా సరిహద్దుల్లో బ్రిటిషువారి తరఫున మన సైనిక శిబిరాలు వెలిశాయి. ప్రత్యక్షంగా యుద్ధభీభత్సాన్ని మన సైనికులు అనుభవించలేదు. ఇది, సిపాయికథల నేపథ్యం. ఈ రకం కథలు ఇదివరకు తెలుగులో లేవు. అందునా, గ్రామీణ భాషలో, ఇంకా కటువుగా చెప్పాలంటే సిపాయిల మొరటు భాషలో రాసిన కథలు. ‘గ్రామీణులైన సిపాయిల నోటిలోంచి వచ్చిన మాటలు తడారకుండా కథలలో చొప్పించుకున్నాడు ఈ రచయిత. ఇది అందరూ చేయగలిగిన పని కాదు,’ అని శ్రీరంగం నారాయణ బాబు రాశారు. ఇటువంటి కథలకి శిష్ట్లా నాంది పలికాడు. కథకుడిగా ఎందరిలాగానో శిష్ట్లా మరుగునపడి ఉన్నాడని రమణారెడ్డి రాశారు. అది నిజం.
ఈ పుస్తకంలో చాలా కథలు నన్ను ఆకర్షించాయి. వస్తువుకన్నా, కథాకథనం మిన్న. పడిపోయిన సిపాయి కథలో కంకిపాటి కామాయికి వచ్చిన ఊహలు, కోరికలూ కథలో వర్ణించిన విధం ఆకట్టుకుంటుంది చివరివరకూ. వాడి తల్లి, తమ్ముడు, సుబ్బి వీళ్ళందరూ మనకి పరిచయస్తుల్లా కనిపిస్తారు. ఎక్కడో అస్సాములో చెరువు కంకిపాటి చెరువులా కనిపించి, ఆశ్చర్యపోతాడు కామాయి, ప్రపంచంలో రెండుచోట్ల ఒకే మాదిరుండటం, అని!
కామాయికి ఈ జ్ఞాపకాలన్నీ వడివడిగా వస్తున్న సమయం కథ చివరి దాకా చదివితేగాని పాఠకుడికి తెలియదు. ఒకరకంగా ఇది ఓ హెన్రీ ట్విస్ట్. అందుకనే కథాకథనం, వస్తువు కన్నా మిన్న అన్నాను.
ఈ కథ మీకు కూడా నచ్చితే, ఎందుకు నచ్చిందో చెప్పండి.