వినాయక చవితి కథ

అప్పుడే బోటస్కుర్రు బస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే టైము పన్నెండైపోయింది. అన్న బాపేశ్వర శర్మ గారిని పర్మిషనడిగేసి గేటుదెగ్గర నాకోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఈ సోషలు మేష్టారేమో ఎంతకీ వదలట్లేదు. ఏం చెయ్యాలబ్బా…. అని అనుకుంటూండగానే బయట రెండు పాలపిట్టలు జంటగా ఎగురుతూ కనిపించేవి కిటికీ లోంచి. వెంటనే ” మైనా చుంగీ… మైనా చుంగీ.. ” అని అనేసి, చూపుడు వేలు మూడు సార్లు ముద్దెట్టేసుకుని “యింక యివాల్టికి పాఠాలు ఆపెయ్యాలి, స్కూలొదిలెయ్యాలి” అని కోరేసుకుని మెల్లిగా మేష్టారి వైపు చూసేవాణ్ణి మంత్రం పని చేసిందో లేదో అని.

అప్పుడే మేష్టారు అనేవారు, “యింకివాల్టికి పాఠం చాలర్రా, రేపు వినాయక చవితి కదా. అందుకని, అందరూ తొందరగా ఇళ్ళకెళిపోదురుగాని”  మంత్రం పని చేసినందుకు భలే సంతోషం వేసేది. వెంఠనే తెచ్చుకున్న మూడు పుస్తకాలూ సంచీలో వో మూలకి కుక్కేస్తుండగా “మేష్టారండీ .. మరేమో ఇవాళ ఐక్యరాజ్య సమితి గురించి అప్పజెప్పించుకుంటానన్నారు కదండీ, మరి…” అనేవాడు గోపి గాడు. నాకు వొళ్ళు మండిపోయేది.

“ఐక్యరాజ్య సమితిట ఐక్యరాజ్యసమితి… ఐక్యరాజ్య సమితిలా మొహం వీడూను” అని లోపలే తిట్టుకునేవాణ్ణి. మళ్ళీ మేష్టారే అందుకుని “లేదర్రా. సెలవలయ్యాకా సోమవారం చూద్దాం. యింకిప్పుడు యిళ్ళకెళ్ళి హాయిగా రేపు పండగ జరుపుకోండి. వినాయకుడికి శ్రద్ధగా పూజ చేసుకోండి, కావలసినంత చదువూ, ఆపైన డబ్బూ యిస్తాడు దేవుడు…”

ఇంకా యేవేవో చెప్పేవారు మేష్టారు. కానీ నేను అప్పటికే గేటు దెగ్గరకొచ్చేసే వాణ్ణి. నన్ను చూసి అన్న “యింత లేటుగానా రావడం? యీపాటికి అందరూ కోసేసుంటారు, సర్లే పద” అంటూ పరిగెత్తుతూ నడిచేవాడు. వెనకాలే నేను పడుతూ లేస్తూ పరిగెత్తేవాణ్ణి. గబగబా కొంచెం దూరం వచ్చేసే వాళ్ళం, దిక్కులు చూడకుండా. ఎందుకంటే అక్కడ చూడ్డానికే తప్ప కొయ్యడానికేం లేదు. సినిమా హాలూ, చెక్కావాడి కొట్టూ, కంచెర్ల వాడి పుస్తకాల దుకాణం… ఎన్ని సార్లు చూసినా యివే. అందుకే అవన్నీ దాటి వచ్చేసే వాళ్ళం యెర్రమిల్లి వాళ్ళింటిదాకా.

ఎర్రమిల్లి వాళ్ళది ప్రహారీగోడ ఎత్తుగా వుండేది. లోపల్నించి సీతాఫలం చెట్టు కనిపించేది కానీ, నాకు అందేది కాదు. అందుకే నన్ను ” యెవరన్నా చూస్తున్నారేమో అన్నివైపులకీ  చూస్తూవుండు … ఎవరైనా చూస్తే వెంఠనే నాకు చెప్పేయ్‌ ” అని పురమాయించేసి, అన్న మెల్లిగా కాళ్ళెత్తి, చేతికి అందిన కొమ్మని చటుక్కున విరిచేసి సంచీలో కూరేసేవాడు. ఆ యింటిలోపల్నించి ” ఎవరర్రా అక్కడ ” అంటూ మామ్మ గారి కంఠం వినిపించేది. వెంఠనే అక్కడినించి పరుగు. పరిగెత్తేసి కోనసీమా బేంకుదాకా వచ్చేసేవాళ్ళం. అక్కడ కాసేపాగి ఆయాసం తీర్చుకున్నాకా, అన్న మెల్లిగా కొమ్మ బైటికి తీసి, దానికున్న రెండు చిన్న సీతాఫలంకాయలు ముచికతో సహా విరిచి నా సంచీలో వేసి ” కాయలు నీ సంచీలో. ముచికలు విరిగితే చూస్కో. నీకే పాపం…” అనేవాడు. ” అమ్మో ” అని సంచీ కొంచెం జాగ్రత్తగా పట్టుకునే వాణ్ణి, ఎందుకైనా మంచిదని. మెల్లిగా బేంకు కాంపోండులోంచి వచ్చేవాళ్ళం.
బాంకు చుట్టూ బోల్డంత ఖాళీ స్థలం. దాంట్లో ఓమూల పెద్ద ఉమ్మెత్త పొద.
అన్న జామెట్రీబాక్సులోంచి వో బ్లేడు ముక్క బైటికి తీసి, రెండు పెద్ద పెద్ద ఉమ్మెత్తకాయలు కోసేవాడు. నన్నుదూరంగానే వుండమనే వాడు, ముళ్ళుగుచ్చుకుంటాయని. కానీ అన్నకి తెలియకుండా నేనూ రెండు చిన్నకాయలు కోసేసేవాణ్ణి. అన్నీ సంచీలో వేసుకుని మళ్ళీ బయల్దేరేవాళ్ళం. యింతలో యేదో గుర్తుకొచ్చినవాడిలా ” ఆగు , ఇప్పుడే వస్తా ” అని అన్న దూరంగా చిన్న పొదకేసి పరిగెత్తి, జాగ్రత్తగా నాలుగు జిల్లేడు ఆకులు కోసి, రుమాల్లో పెట్టేసి తెచ్చి సంచీలో వేసేసుకుని,
” పద, తొందరగా వెళ్ళాలి, ఇంకా బోల్డు కొయ్యాలి ” అంటూ ముందు వెళిపోయేవాడు, వెనకాలే నేను. దారిలో కనిపించిన ప్రతీ యింట్లోకీ పరీక్షగా చూసుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంట్లో చెట్లుండి, అవి బైటికి అందుబాటులో వుంటే చాలు, ఎవరూ చూడకుండా కొన్ని ఆకులు దూసేసే వాళ్ళం. ఇంతలోనే నేను అన్న దగ్గిరికొచ్చి
” ఇదిగో చూడు..బోల్డంత పత్రి కోశా ” అనేవాడిని, అన్నకి తెలీకుండా, వెనకాలే నడుస్తూ కోసిన కొన్ని ఆకుల్ని చూపిస్తూ.
” ఏవాకులివి? ” అనేవాడు అన్న.
” ఏమో….అశోకపత్రేమో..” అన్నా మెల్లిగా.
” అశోక పత్రీ లేదు, అక్బర్‌ పత్రీ లేదు. పిచ్చాకులన్నీ కొయ్యకు ” అంటూ వెళిపోయేవాడు.
” సర్లే..యేదో, పాపం దేవుడు తింటాడు కదా అని కోస్తే….అయినా మనకెందుకులే..” అనుకుంటూ, కొన్ని లేతాకులు వుంచుకుని, మిగిలినవి పారేసి, ఆ లేతాకుల్తో బొత్తాలు పెట్టుకుంటూ వెనకాలే వెళ్ళేవాణ్ణి.

అప్పుడు వచ్చేది దేవగుత్తాపు అమ్మమ్మగారిల్లు. పెద్ద స్థంభాలు, లావుగా, వెనకాల పేద్ద చెక్క తలుపులు, వో స్థంభానికి జార్లా పడి సన్నగా తాతగారు. ఆయన ముడిచేసి వేళ్ళాడదీసిన తెల్ల గొడుగులా వుంటారు, మాట్లాడకుండా ఎటో పైకి చూస్తూ. ఒక తలుపు తీసే వుండేది ఎప్పుడూ. అన్నయ్య తలుపు పక్కనే నించుని, లోపలికి చూస్తూ ” అమ్మమ్మగారూ..మరేమో కొంచెం పత్రి కోసుకోవచ్చాండీ? ” అని పిలిచేవాడు. ఆవిడ మెల్లిగా బైటికొచ్చి ” రండి, మీదే ఆలీసం. పెరట్లో అప్పుడే మీ రాంబంట్లంతా వున్నారు. చెట్లు ఎక్కకండి, జాగ్రత్తసుమా ” అంటూ లోపలికి పంపించేవారు.

మేములోపలికెళ్ళేసరికి జామ చెట్టుమీద గోనెళ్ళాడూ, పెద్ద వుసిరి చెట్టుమీద పెండ్యాలగాడూ.
” పెద్ద కాయలేమీ లేవురా, కావాలంటే చెట్టు చూస్కో ” అనేవాడు గోనెళ్ళాడు జేబులు దాస్తూ.
” నీ మొహం. తినడానికి కాదుగా. పాలవెల్లికి పిందెలే కావాలి, యిలా విసురు కొన్ని ” అనేవాడు అన్న. జామ, వుసిరి, మావిడి, సపోటా, పనస..ఇలా కనిపించిన ఆకులూ, పిందెలూ అన్నీ కోసేసేవాళ్ళం. అందవు కాబట్టి ఒఖ్ఖ కొబ్బరాకుల్ని మాత్రం వదిలేసేవాళ్ళం !!

” ఒరేయ్‌.అమ్మమ్మగార్ని యింకో సంచీ వుందేమో అడుగు ” అనేవాణ్ణి నేను. అన్న వెళ్ళి ” అమ్మమ్మగారండీ..దేవుడి పత్రికోసం యింకో సంచీ వుందాండీ? ” అని అడిగేవాడు అమాయకంగా. అసలు అన్న అలా అడిగితే ఎవరైనా ఇచ్చేస్తారు.

” రామం, యింక కోసిన పత్రి చాలర్రా. యిప్పటికే రెండైపోయింది. యింట్లో అమ్మ భోజనం చెయ్యకుండా మీకోసం కనిపెట్టుకునుంటుంది. గబ గబా వెళ్ళి భోంచేహేసి పడుకోండి. మళ్ళా రేపు పెందలాడే లేవాలా?..” అనేవారు, కొంచెం పత్రి తీసుకుంటూ. యింక సరే అనుకుని నేనూ అన్నా యింటికొచ్చేసి, ముందుగదిలో వోపక్క, తెచ్చిన పత్రీ, కాయలూ అన్నీ గుమ్మరించేసేవాళ్ళం.

” యింతసేపూ ఎక్కడ తిరిగొస్తున్నార్రా? ఆకులు చూస్తే ఆకలీ పాడూ ఏవీ తెలియలేదా? ” అడిగేది అమ్మ. మళ్ళీ తనే ” సర్లెండి. కాళ్ళూ చేతులూ కడుక్కు రండి, భోంచేద్దాం, నీరసవొస్తోంది ” అని వొంటింట్లోకెళ్ళిపోయేది. పసరు అంటుకున్న చేతులూ, దుమ్ముపట్టేసిన కాళ్ళూ శుభ్భ్రంగా కడిగేవాళ్ళం. వేలులో యేదో కలుక్కుమనేది. మెల్లిగా చెయ్యి జేబులోకి దూరుస్తూంటే చూసి ” ఏవైంది వేలుకి? ” అడిగేవాడు అన్న.
” ఏమో, తెలీదు, ఏదో గుచ్చుకుందేమో…” అనేవాణ్ణి మెల్లిగా గొణుగుతూ.
” అవును మరి. దొంగతనంగా ఉమ్మెత్తకాయలు కోస్తే అలాగే గుచ్చుకుంటుంది, చెయ్యిలాతే…”  అని, వెనకాతల జేబులోంచి పెద్ద పిన్నీసు తీసి, ముల్లు ఇట్టే తీసేశాడు.
” యింతేనా, యింకెక్కడైనా గుచ్చుకుందా?  ” అడిగేవాడు. ” లేదు ” అనేవాణ్ణి మెల్లిగా.
” నిజం చెప్పు. మళ్ళీ తరవాత నొప్పెడుతుంది ” కొంచెం మెల్లిగా అడిగేవాడు.
వెంఠనే మోచెయ్యి చూపించేవాణ్ణి ” యిక్కడ గుచ్చుకోలేదు, గీరుకుంది ” అంటూ.
” దానికి ఆనక అమ్మకి తెలీకుండా, ఆయింటుమెంటు రాస్తాలే ” అనేసి చెయ్యుచ్చుకుని లోపలికి తీసుకెళిపోయేవాడు. యిద్దరం భోంచేసి చిన్న పట్టిమంచం మీద అటూ, ఇటూ నిద్దరోయేవాళ్ళం.

సాయంకాలం పెదనాన్న గారితో చెరువుగట్టుమీదకెళ్ళి కలవపూలు కొనుక్కొచ్చేవాళ్ళం. వాటన్నిటినీ పెద్ద బిందిలో వేసి జాగ్రత్తపెట్టేది అమ్మ. మధ్యలో లేతపసుపు రంగూ, బయట తెలుపూ, కాడ ఆకుపచ్చా…ఎంత బావుంటుందో కలవపువ్వు. నేను కొట్టువాణ్ణడిగి రెండు తామరాకులు కూడా తెచ్చుకునేవాణ్ణి ఆడుకోడానికి. తామరాకుమీద పౌడరేసి, కొంచెం నీళ్ళు చల్లి ముత్యాలు చేసి, వాటితో ఆడేవాణ్ణి. నాన్నగారు రాత్రి వచ్చేవారు రామచంద్రపురంనించి. మొక్కజొన్నపొత్తులూ, వెలక్కాయలూ, చెరుకుగడా, రంగు వినాయకుడి బొమ్మా తెచ్చేవారు.

రాత్రి భోయనాలయ్యాక ” ఏరా. మరి పాలవెల్లి కట్టేసుకుందామా? ” అని అడిగేవారు. అన్న రెడీ అయిపోయేవాడు. నాకు నిద్దరొచ్చేది. ఐనా సరే అన్న రెడీ కాబట్టి నేనూ రెడీ ఐపోయేవాణ్ణి. నాన్నగారు వెదురు బద్దలు చీల్చి, నున్నగా చెక్కి, కొంచెం తడిపి, పసుపు పట్టించి, చిన్న చిన్న మేకులు కొట్టి పాలవెల్లి చేసేవారు. యింతలో అన్న దారబ్బండా, కత్తెరా పుచ్చుకుని వచ్చేవాడు. అవి నేను పేచీ పెట్టి తీసేసుకునే వాణ్ణి.

” నీకు చేత కాదురా. దారాలన్నీ చక్కగా సమంగా కత్తిరించాలి, వాణ్ణి చెయ్యనీ ” అనేవారు నాన్నగారు. సరే అని నేను కాయలు కట్టడానికి తయారయ్యేవాణ్ణి. నాకు ముడి వెయ్యడం రాదు. ముచిక మధ్యలో పెట్టి, దాని చుట్టూ దారం చుట్టి, ముడివేసేసరికి ముచిక జారిపోయి, వేలు ముడిలో వుండిపోయేది.
అమ్మా, అన్నా వొకటే నవ్వు..
అమ్మ అనేది ” వొరేయ్‌ శీనా! నువ్వు దారాలకి పసుపు పట్టించు, యింద ” అని. సరే కదా అని నేను దారాలకి పసుపు రాసే వాణ్ణి, సులువు కూడా కాబట్టి. అమ్మ, అన్నా, కాయలన్నిటికీ పసుపుపెట్టి, దారం కట్టేసేవారు. వెలక్కాయలకి కుంఖం కూడా పెట్టేవారు. మొక్కజొన్న పొత్తులు దొరకడం కష్టం కాబట్టీ, దొరికినా తింటే కడుపునొప్పొస్తుంది కాబట్టీ, అచ్చంగా నాలుగే తెచ్చేవారు నాన్నగారు. వాటి రెక్కలు కొంచెం వెనక్కి మడిచి, పైన దారం కట్టి పాలవెల్లికి నాలుగువైపులా కట్టేవారు. పీచుగడ్డంతో వున్న మొక్కజొన్న పొత్తుని చూస్తే, సాయంత్రం కొట్లలో సాంబ్రాణి వేసే పీరు సాయబులా వుండేది. కాయలన్నీ కట్టడం పూర్తయ్యేసరికి నాకు నిద్దరొచ్చేది. తరవాత అన్న పాలవెల్లి మధ్యలో బల్బు కూడా పెట్టేవాడు. పాలవెల్లిని మా అటక్కొయ్యికి కట్టేసి రెడీ చేసేసేవాళ్ళు నాన్నగారూ, అన్నా. నేను పొద్దున్న లేచే సరికి తోరణం కూడా కట్టేసేవారు. గబగబా స్నానం చేసి, కొత్తబట్టలు కట్టేసుకుని, నేనూ, అన్నా, నాన్నగారూ వెళ్ళి మట్టి వినాయకుణ్ణి కొనుక్కొచ్చేవాళ్ళం, న్యూస్‌ పేపర్లో చుట్టి చాలా జాగ్రత్తగా.

యింటికొచ్చాకా దానికి అక్షింతలు అద్దేవాడు అన్న. యింకా కలవపూల కాడలు కొంచెం కొంచెం గిల్లి, వాటితో దండలు కూడా చేసేవాడు. రంగు వినాయకుణ్ణి బీరువాలోంచి తెచ్చి చూపించేవారు మాకు.
” చిన్నగా వుంది నాన్నగారూ. యీ సారి పేద్ద బొమ్మ కొనుక్కుందాం “అనేవాణ్ణి.
” నీ తలకాయి. మనకసలు మట్టి వినాయకుడే ముఖ్యం. యీ రంగుబొమ్మలన్నీ ఊరికే, షోకుకి తప్ప, పూజకి పనికిరావు ” అనేవారు నాన్నగారు. అందరం పూజకి కూర్చునేవాళ్ళం. పాలవెల్లికింద ముగ్గేసి, దానిమీద పెద్ద పసుపు పీట వేసి, పీట మీద మళ్ళీ ముగ్గేసి, తమలపాకులో పసుపు వినాయకుణ్ని పెట్టి, ఆ తరవాత మిగతా వినాయకుళ్ళనీ, దేవుళ్ళనీ పీటెక్కించి, ఛత్రం పెట్టి, దీపాలు పెట్టి, అగరత్తు వెలిగించి, హారతిచ్చి పూజ మొదలుపెట్టేది అమ్మ. నెమలికంఠం రంగు పాత మడి పట్టుచీరా, తలకేమో లేత ఆకుపచ్చ గళ్ళ తువ్వాలు ఓ పక్కకి చుట్టుకుని, అమ్మ అచ్చం ఆండాళ్‌ అమ్మవారుంటారే.. అలా భలే వుండేది. కాసేపు పూజయ్యాకా ” ఏరా పిల్లలూ, అష్టోత్తరవా? సహస్రం చదవనా? ” అడిగేది.
” ఇప్పుడెక్కడి సహస్రవే, వీళ్ళుండలేరు. ఈ సారికి అష్టోత్తరం కానిచ్చేయ్‌ ” అనేవారు నాన్నగారు. అసలు నాన్నగారికే ఆకలేస్తోందేమోనని నాకు అనుమానం వచ్చేది. మనకెందుకులే అని వూరుకునేవాణ్ణి. ఇంతలో మహా నైవేద్యం. బొబ్బర్లుండ్రాళ్ళూ, కజ్జికాయలూ, చక్రపొంగలీ, పులిహారా, పళ్ళూ, తేనే, నెయ్యీ, పెరుగూ, పాలూ యిలా ఎన్నో. నోరూరిపోయేది. పూజ త్వరగా అయిపోతే బావుణ్ణనిపించేది. అమ్మ కథ చదివేది. కథ బానే వుండేది కానీ, కృష్ణుడు జాంబవతిని పెళ్ళిచేసుకోవడం నాకర్థమయ్యేది కాదు. జాంబవంతుడు ఎలుగుబంటి కదా మరి.. అయినా సరేలే, అసలే ఆకలేస్తోంది, అనుకుంటూ కథ వినేసి, గుంజీళ్ళు తీసేసి, అక్షింతలేసేసుకుని, అన్నం తినేసేవాళ్ళం.  అన్నం కన్నా ఎక్కువ ఉండ్రాళ్ళూ, వాటికి మించి లస్కోరా.

ఆయాసంతో మంచవెక్కి పడకేసేవాళ్ళం. సాయంత్రం, లేచాకా, అమ్మ వచ్చి ” ఏరా శీనూ, అట్టలేద్దామంటే నీ పుస్తకం వొక్కటీ కనబడదు. ఎక్కడున్నాయిరా? ” అనేది.
” అన్నీ దేవుడి దగ్గర పెట్టేశానమ్మా.తొమ్మిదిరోజుల్దాకా తియ్యకూడదు కదా ” అనేవాణ్ణి నేను ఏవీ తెలియనట్టు.

” అబ్బా, అలాగా.. అయితే పద, నిన్నుకూడా అక్కడే కూలేస్తాను. వంచిన తల ఎత్తకుండా, అక్కడినించి కదలకుండా, తొమ్మిది రోజులు చదువుకుందుగాని ” అంటూ చెవి మెలిపెట్టేది అమ్మ. రాత్రి పందిట్లోకెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకునే వాళ్ళం. చెరో పావలా వేస్తే, పందిట్లో వినాయకుడు చెయ్యెత్తి దీవించేవాడు కూడా. హరి కథలూ, బుర్ర కథలూ, నాటకాలూ, తోలుబొమ్మలాటా, సినిమాలతో నవరాత్రులిట్టే గడిచిపోయేవి. సెలవలెప్పుడో అయిపోయేవి అప్పటికే. తొమ్మిదిరోజులూ అయ్యాకా, పదో రోజు దేవుణ్ణి వూరేగించేవారు మా అగ్రహారంలో. అమ్మ నన్నూ అన్ననీ పిలిచి ” యీ మట్టి వినాయకుణ్ణి పందిట్లో ఇచ్చేసి రండి. వాళ్ళు నిమజ్జనం చేసేస్తారు ” అనేది. పందిరి దాకా వెళ్ళాకా అన్న నడిగేవాణ్ణి ” నిమజ్జెనం అంటే? ” అని.

” అంటే..నీళ్ళలో కలిపేస్తారన్నమాట, చెరువులో వేసేసి..” అనేవాడు అన్న.
” మరి పాపం, వినాయకుడు ములిగిపోడూ? ” బెంగగా అడిగేవాణ్ణి. అన్న కాసేపు అలోచించి
” ములిగిపోడు ఆయన దేవుడు కదా ” అనేవాడు. కాసేపాగి నేను అనేవాణ్ణి
” పోనీ మన వినాయకుణ్ణి మనం దాచేసుకుందామా, ఎవ్వరికీ తెలీకుండా ? ”
“తప్పు, పూజ అయిపోయాకా నీళ్ళలో కలిపెయ్యాలని అమ్మ చెప్పిందికదా “అనేవాడు అన్న. నాకెందుకో ఆ బొమ్మని ఇవ్వాలనిపించలేదు. అరుణ్‌ గాడికి యీతొచ్చు. అయినా వాడు ఇదివరకే చెప్పేడు నీళ్ళలో వూపిరాడదని. అందుకే ఇంకా భయం వేసేది. వినాయకుడికేమైపోతుందోనని చాలా బెంగగా అనిపించేది. వదల్లేక వదల్లేక వినాయకుణ్ణి పందిట్లో వదిలేసి వచ్చేసేవాళ్ళం.

వస్తూంటే నా బెంగ చూసి అన్న అనేవాడు “అసలు ఆ బొమ్మ లో వినాయకుడుండడు తెలుసా? పూజ అయిపోగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళిపోతాడు. మళ్ళీ మనం పూజ చేస్తేనే వస్తాడు ” అని.

నాకు తెలుసు, అవన్నీ నన్ను ఓదార్చడానికి చెప్పే మాటలని. అయినా అవే నమ్మాలనిపించేది. అందుకే అడిగేవాణ్ణి ” నిజంగానా? ” అని.
” ఒట్టు. భూదేవి బొట్టు ” అని నేలమీంచి కొంచెం మట్టి తీసుకుని బొట్టు పెట్టుకునేవాడు అన్న.

అప్పటికి బెంగ తీరేది. యిద్దరం యింటికెళ్ళిపోయేవాళ్ళం.


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...