రచయిత జి. కళ్యాణ రావు
“జ్ఞాపకం గతం కాదు” అని కవర్ పేజీలోనే హెచ్చరికగా మొదలైన అంటరాని వసంతం నవల ఒక పురాణం అని చెప్పవచ్చు. తెలుగు నాట మాలకులస్థుల జీవితంలో ఏడినిమిది తరాల కథ వర్తమానంలో మొదలై గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ, భవిష్యత్తులోకి తొంగి చూస్తూ మూడు కాలాల్లో నడిచిన మాల పురాణం ఇది. కథని కొనసాగిస్తూనే మధ్య మధ్య ఉపాఖ్యానాలూ, పిట్టకథలూ కోకొల్లలుగా చెప్పుకొస్తూ సుమారొక వందేళ్ళ పొడుగున్న జీవిత చిత్రాన్ని సజీవమైన పాత్రలతో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నది.
ప్రధానమైన కథలోనూ, అనుగుణంగా వున్న పిట్ట కథల్లోనూ ఎంతో చరిత్ర వుందనడానికి సందేహం లేదు. రచయిత అక్కడక్కడా వదిలిన “క్లూ”ల సహాయంతో కథలోని సంఘటనల చారిత్రక నేపధ్యాన్ని కొంచెం కష్టపడితే పాఠకులు గుర్తించవచ్చు. ఐతే నాలుగు వాక్యాల ముందు మాటలో,
“అది నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, కాలం ఏదైనా కావచ్చు.
ఈ వసంతం అప్పుడూ నిషేధమే, ఇప్పుడూ నిషేధమే.”
అని చదివినప్పుడు చరిత్ర పాఠం చెప్పటం రచయిత ఉద్దేశం కాదని తేలుతున్నది. ఇది కాకపోతే ఇక చెప్పదల్చుకున్న దేమిటి? అదొక కథ, ఒక జాతి పురాణం అది చదవాల్సిందే. చదివి అనుభవించాల్సిందే. ఈ సమీక్ష మీలో కొందరినైనా ఈ పురాణం చదివేందుకు ప్రోత్సహిస్తే నా బాధ్యత నెరవేరినట్టే.
ఎర్రెంకడి కొడుకు ఎల్లన్న, మేనత్త భూదేవి పెంపకంలో పెరిగాడు. నాగన్న దగ్గర నాటకాలూ పదాలల్లడం నేర్చి “ఆటెల్లడు”, “పాటెల్ల”డని పేరుపొందాడు. పిట్టోడి ముద్దుల కూతురు సుభద్ర కోరి పెళ్ళాడింది వాణ్ణి. తన కళ మీద అగ్రకులాల అగాయిత్యం తట్టుకోలేక వూరిడిచి మాల బైరాగయ్యాడు. వాడి కొడుకు శివయ్య కరువు బాధతో, కలరా మహమ్మారి భయంతో ఉన్న ఊరు ఎన్నెలదిన్ని నొదిలి వలస పొయ్యాడు. మతం పుచ్చుకుని సీమోను అయ్యాడు. సీమోను కొడుకు రూబేను చదువుకుని మతబోధకు డయ్యాడు. తన తండ్రి తాతల చరిత్రనంతా తరచి తరచి తెలుసుకున్నాడు, రూతుకీ నేర్పాడు. కొడుకు ఇమ్మానుయేలు వృత్తికి ఉపాధ్యాయుడైనా తనవారి కష్టాలు చూసి వోర్వలేక విప్లవ మార్గం పట్టి దానికే బలైపొయాడు. ఇక మిగిలింది మనవడు జెస్సీ. మనవడి కోసం ఎదురు చూస్తూ, ఆరాటపడుతూనే రూబేను ముసలి వాడై వెళ్ళిపోయాడు. రూతు సాయంసంధ్యలో వుంది. జెస్సీ రూబీలు వెలగబోయే సూర్యోదయంలా గున్నారు. కట్టె కొట్టే తెచ్చె అని చెపితే అదీ కథ.
భారత భాగవతాల్ని సూతుడు శౌనకాది మునులకి కూర్చోబెట్టి చెప్పినట్టు రూతు మనకందరికీ తన వంశ చరిత్ర చెప్పుకొస్తుంది. గతానికీ భవిష్యత్తుకీ మధ్య వర్తమానపు వంతెన రూతు. ఒక్కగానొక్క కొడుకు ఇమ్మానుయేలు కూడా గతంలో కలిసి పోయాడు. మనవడు జెస్సీ, బిడ్డ కూతురు రూబీ వీళ్ళు భవిష్యత్తు. వెనక్కి చూసుకుంటే .. ఎంత కథ, ఎన్ని తరాల కథ .. ఆ కథలన్నీ తన ప్రియుడు, భర్త రూబేను వెన్నెల రాత్రుల్లో చెప్పగా విన్నది. ఎటువంటి కథలు, వింటుంటే గర్వంతో ఉత్సాహంతో వొళ్ళు గగుర్పొడిచే కథలు, ఎటువంటి మనుషులు తన వాళ్ళు, ఎంత బలమైన వ్యక్తిత్వం కలవాళ్ళు, ఎంత గొప్ప కళాకారులు .. ఎల్లన్న, అతని గురువు నాగన్న, అతని గురువు చంద్రప్ప .. ఆడవాళ్ళు మాత్రం? సుభద్ర అర్జునుడి పెళ్ళానికేమి తీసికట్టు? భూదేవి ఎంత నిబ్బరమైన మనిషి?
స్త్రీ పాత్రలని, భూదేవి నించి రూబీ దాకా, ఎంతో శ్రద్ధతో, ప్రేమతో, భక్తితో చిత్రించారు రచయిత. విశిష్టమైన వ్యక్తిత్వంతో పట్టుదలతో మన ముందు నిలిచే మొదటి పాత్ర భూదేవి. తరవాత సుభద్ర ఒక పట్టాన మరిచి పోలేము. సుభద్రకి నీరాజనంలాగా ఎల్లన్న పాటలన్నీ సుభద్రని సంబోధిస్తూ కట్టినట్టు (“మిన్నూ పానుపు మీద, దూదీ దుప్పటి పైన, సూకాల పూలగుత్తి సూబద్రా, నువ్వు పచ్చి పగడానివే సూబద్రా “) చిత్రించడం సమంజసంగా వుంది. కథనంలో ఎక్కడికక్కడ పాత సంఘటనలనీ, మనుషుల ప్రవర్తననీ రూబేను గొంతుకతోనో రూతు గొంతుకతోనో నూతన చైతన్యంతో విశ్లేషిస్తూనే, ఈ విశ్లేషణ కథతో కలిసిపోయి బోరు కొట్టే పాఠం చెబుతున్నట్టు కాక చాలా సమర్ధవంతంగా నడిపించారు. కఠినమైన నిజాల్ని, క్రూరత్వాన్ని, వాటిని ఎదుర్కొంటున్న మనుషుల ధీరత్వాన్ని గొప్ప ఆర్ద్రతతో చెప్పారు. తన కథనంతో పాఠకులని ట్యూన్ చేసి ఈ నిజాల్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తారు.
సరళమైన చక్కటి భాషతో కథనం, అక్కడక్కడా వచ్చే సంభాషణల్లో పాత్రోచితంగా మాండలికం వాడుక, ఉప్మాలో జీడిపప్పు పలుకుల్లా దొరికే పాటలు, పదాలు పాఠకుల్ని కథలోకి లాగి బంధించేట్టు వున్నాయి. ఇంతగా కదిలించే కథనంలో తప్పులు పట్టటం భావ్యం కాదు కానీ, ఇంత పెద్ద కాన్వాసుని క్లుప్తంగా (220 పేజీల్లో) చెప్పటం వల్ల అక్కడక్కడా కొన్ని inconsistencies తొంగి చూస్తున్నాయి. ఉదాహరణకి తన తాత చచ్చిపోయాక కొన్నేళ్ళకి, అదీనూ ప్రవాసంలో పుట్టి పెరిగిన రూబేనుకి తన పూర్వీకుల విషయాలు అంత వివరంగా తెలిసే అవకాశం ఎలా వచ్చింది అనే ప్రశ్న లాంటివి. ఐతే నవలని చదివి అనుభవించటానికి ఇవొక అడ్డంకి కావు. రూతు పాత కథలు చెప్పిన ఉరవడితో తన కొడుకు గురించీ మనవడి గురించీ చెప్పలేదు, అందుచేత నవల చివరి పాతిక భాగం కొంత మందకొడిగా సాగినట్టు అనిపిస్తుంది అని ఒక ఆరోపణ వినపడింది. ఇది కొంత వరకూ నిజమే ననిపించినా నిజం కాదు. దీనికి సరైన వివరణ నవలలోనే ఉంది. అరపేజీలో రాసిన చివరిమాటలోనూ ఉంది. కథ చెపుతున్నది రూతు. ఆమె మాటల్లోనే “ఇమ్మానుయేలు తన బిడ్డ గుర్తొస్తే జ్ఞాపకానికి అడ్డొస్తాడు. జెస్సీ మనవడు గుర్తొస్తే పరుగెత్తి వాణ్ణి కలవాలనిపిస్తుంది.” అందుకే రూతు వాళ్ళని సజీవంగా పూర్తిగా చెప్పలేక పోయింది. అది రూతు పాత్ర చిత్రణ నవలలో లోపం కాదు.
చివరిగా కళల గురించి రచయిత మాటల్ని గుర్తు చేసుకుంటూ ముగిస్తాను.
(63 వ పేజీలో) ..
“ఎన్నెలదిన్ని మాలా మాదిగల యిళ్ళల్లో ఉట్టి మీద మీగడ లేదు. వెన్నముద్దలు లేవు. వుంటే ఎండుచాపలుంటాయి. అంతగా కాకపోతే ఎండొరిక లుంటాయి. వాటి కోసం ఏ బాలగోపాలుడు రాడు. వాడిని అంతా సుకుమారంగా నాట్యంలో కొడుతో సరిగమల్లో తిడుతో విన్నావా యశోదమ్మా అని అంటే వినేందుకు యశోదమ్మలు లేరు. ఎన్నెలదిన్ని యశోదత్త ఆ సమయాన తన బిడ్డపైన అందమైన, అతి సుకుమారమైన, రాగయుక్తమైన ఫిర్యాదు వస్తుందని ఆరుబయట ఎదురు చూస్తూ కూర్చోదు. కూరసట్లోకి యిసుకదూసరాకు కోస్తూ వుంటుంది. కాకపోతే తనది కాని పొలంలో నారు పీకుతూ వుంటుంది. ఆ పూట యింత సంకటి ముద్దకి భూమంతా వెతుకుతుంటుంది. అంతా అన్వేషణే. అంతా పోరాటమే ..”