తానా 2001 సభలు కొన్ని సాహిత్య కార్యక్రమాల వివరాలు

(ఫిలడెల్ఫియాలో జూన్‌ 30, జూలై 1 న తానా సభలలో ఒక భాగంగా జరిగిన సాహిత్య కార్యక్రమాల వివరాలు కొన్ని “ఈమాట” పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాము. సంపాదకులు)

తానా సాహిత్య కార్య వర్గం, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు ప్రముఖులను ఆహ్వానించి, వారిచే ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు తోడుగా, అమెరికాలోని సాహితీ ప్రియులు, ఔత్సాహిక కళాకారులు పాల్గొనటం హర్షించ తగ్గది.

ఈ మొత్తం కార్యక్రమాలను నాలుగు భాగాలుగా విడకొట్టినట్టైతే, ఇందులో మొదటి భాగంలో, జూన్‌ 30న జరిగిన సాహిత్య వేదికపై ప్రాచీన, నవ్య సాహిత్యాల అతిచక్కని కలయిక రూపం దిద్దుకొంది. ఐదు గంటలకు పైగా సాగిన ఈ వేదికలో, “మన ఇంటిపేర్లుసంస్కృతి, చారిత్రక అంశాల” పై డా. ఐ. బాలగంగాధరరావు మాట్లాడారు. ఈ సందర్భంలో “మన ఇంటి పేర్లు” అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. తరవాత జరిగిన ప్రసంగంలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ” పద్యంలో నుంచి వచన పద్యంలోకి” అన్న అంశంపై, ప్రాచీననవ్య సాహిత్యాలలో ప్రవేశమున్న తమ పరిశీలనలను సభకు అందించారు. “శ్రీనాధుని కవిత్వ సౌందర్యం” పై డా. ప్రసాదరాయ కులపతి అనర్గళంగా 30 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగంలో, శ్రీనాధ మహాకవి సీస పద్యాలలో తెలుగు కవిత్వానికి రంగు, రుచి, వాసన ఏరకంగా చూపించాడో చెప్పిన తీరు, వినిపించిన పద్యాలలోని సొగసు, వాడిన పోలికలు సభికులను ఆనందపరచాయి.

ఆంధ్ర వ్యాసుడుగా పేరున్న శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారు “పురాణా సాహిత్యం” అన్న అంశంపై మాట్లాడుతూ, 18 పురాణాల గొప్పతనాన్ని ఉదాహరణలతో వివరిస్తూ, పాతదైనా కొత్తగా అనిపించే అంశం పురాణాలకు, వేదాలకు, ఇతిహాసాలకు ఉన్న పోలికలు, తేడాలు వివరించారు. ఇదే వేదికపై డా. నాగభైరవ కోటేశ్వరరావు గారు “తెలుగు కవిత్వంలో ఉద్యమాలు” అన్న అంశం పై మాట్లాడారు. శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల “సంగీతంలో సాహిత్యం” పై మాట్లాడుతూ, లలిత సంగీతంలోని సంగీతసాహిత్యాల మేలు కలయికలను ఉదాహరణలతో వివరించారు. “రెల్లు పూల పానుపుపైన జల్లుజల్లులుగా ఎవరో జల్లినారమ్మా … వెన్నెల జల్లినారమ్మా… ” అన్న గీతం కల్యాణి రాగంలో ఆలపించి సభికులను ఆనందింపజేసారు.

ఎక్కువ సమయం లేకపోవడం వల్ల, పైన చెప్పిన వక్తలందరూ 20 నుంచి 30 నిమిషాల దాకా మాత్రమే మాట్లాడ గలిగారు. వీరందరూ, వారివారి రంగాలలో అత్యంత కృషి చేసినవారే! వీరందరికీ ఇంతకన్న ఎక్కువ సమయం ఇవ్వలేకపోవటం వల్ల, వారి పాండిత్యం, ప్రతిభ మనం ఇంకా విశాలంగా తెలుసుకొనే అవకాశం లేకపోవటం విచారింపదగిన విషయం. ముందుముందు ఇలాటి సభలకు తక్కువ సంఖ్యలో వక్తలను ఆహ్వానించి ఒక్కొక్కరికి ఎక్కువ సమయం ఇవ్వడం బావుంటుందేమో! ఇప్పటి పద్ధతి ప్రకారం ఎలాగూ జరుగుతున్నది ఎందరో రావటం, ఎవరూ అటు వారికి గాని ఇటు శ్రోతలకు గాని తృప్తి కలిగే విధంగా మాట్లాడే అవకాశం పొందకపోవటమే కదా!

నవీన సాహిత్యంపై జరిగిన ప్రసంగాలలో, డా. వంగూరి చిట్టెన్‌ రాజు గారు అమెరికా తెలుగు సాహిత్యానికి ఉన్న విలక్షణత, విశిష్టత వివరించారు. వచన కవిత్వంపై శ్రీ శివారెడ్డిగారి ప్రసంగం, ఆయనకు నచ్చిన కొన్ని కవితల పఠనం, వాటి వివరణ, సభికులను ఆనందపరచాయి. కధా రచనపై డా. పాపినేని శివశంకర్‌ చేసిన ప్రసంగంలో ఇటీవల కధారచనలో వస్తున్న మార్పులు, కొత్త పోకడల గురించి ఆయన పరిశీలించిన విషయాలు ఆలోచింపతగ్గవి. ముఖ్యంగా కధా వస్తువుకన్నా, కధా శిల్పంలో చెప్పుకోతగ్గ పరిశ్రమ కధకుల్లో కనపడటం లేదన్న విషయాన్ని విపులంగా తెలియ చెప్పారు. కధా సాహితి, తానా సంస్థలు తెలుగు కధకు ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారో వాసిరెడ్డి నవీన్‌, డా. చౌదరి జంపాల వరుసగా వివరించారు.

ఈ సాహిత్య కార్యక్రమాలలో రెండవ భాగంగా జూలై 1న (ఉదయం )అమెరికా తెలుగు వారికి తొలిసారిగా పరిచయం ఔతున్న సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు నాలుగు గంటలకు పైగా జరిగిన త్రిగుణిత అష్టావధానంతో సభను రంజింపజేసారు. తెలుగు సాహిత్యంపై అభిమానమున్న అనేకమంది అమెరికా స్థానిక దిగ్గజాలు పృచ్ఛకులుగా అవధానంలో పాల్గొని, “పద్యం” మీద అమెరికా తెలుగు వారి అభిమానం ఏమాత్రం తగ్గలేదు అన్న విషయాన్ని మళ్ళీ నిరూపించారు. ఈ అవధానంలో, ఇండియానుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారితో సమానంగా పృచ్ఛక స్థానం అలంకరించిన స్థానిక పృచ్ఛకుల సాహిత్యాభిమానం, సాహిత్యంలో చెప్పుకోతగ్గ ప్రవేశం మెచ్చుకోతగ్గవి. ఇతర ప్రోగ్రాముల్లాగే, అవధాన శిరోమణి శ్రీ గరికపాటి వారికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చినట్టయితే, వారి పాండిత్య ప్రతిభ ప్రేక్షకులకి మరింతగా తెలిసేది!

మూడవ భాగంగా “ఆగతానికి స్వాగతం” అనే సాహిత్య, సంగీత, నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ సరికొత్త ప్రయోగంలో, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని (ఆనాటి ఆదికవి నన్నయ్య నుంచి నిన్నటి సంస్కరణ కవి కందుకూరి వీరేశలింగం వరకు) మన కళ్ళముందు ఉంచే ప్రయత్నం జరిగింది. సుమారు 20 కి పైగా కళాకారులు పాల్గొన్న “ఆగతానికి స్వాగతం” (ఆగతం అంటే జరిగిపోయినది అని అర్ధం) రూపకానికి డా. డి. ఎస్‌. ఎన్‌. మూర్తి దర్శకత్వం వహించారు. “మన సాహిత్య చరిత్రే మన చరిత్ర” అన్న భావన మీద ఆధార పడ్డ ఈ రూపకంలో ఆంధ్రదేశం నుంచి వచ్చిన కళాకారులతో పాటూ, అమెరికాలోని లోకల్‌ టాలెంట్‌ ని కూడా కలిపి ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసారు నిర్వాహకులు. అరుదైన ఈ ప్రయత్నంలో ప్రదర్శకులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, మొత్తం మీద “సాహిత్య రూపకం అంటే ఇలా ఉండాలి” అన్న ప్రశంశలు పలువురు ప్రేక్షకులనించి విన వచ్చాయి. అలాగే, తానా సభలు ఇటువంటి రూపకాలకి సరైన వేదికలా? అన్న అనుమానం కొందరికి వచ్చిన మాట కూడా సత్యం!

సాహిత్య కార్యక్రమాల్లో ఆఖరి భాగంగా “స్వీయకవితా వేదిక” ఏర్పాటు చేసారు. ఇందులో అమెరికాలో నివసిస్తున్న పలువురు ప్రవాసాంధ్రులు తమ రచనలను చదివారు. వీటిలో కొన్ని రచనలు ఇంగ్లీషులో కూడ ఉండటం గమనించ తగ్గది. వాసిలో నివాసాంధ్రులకన్న, ప్రవాసాంధ్రుల సాహిత్యం మిన్నగా ఉన్నా లేకపోయినా, అమెరికా తెలుగు వారు సాహిత్యంలో చేస్తున్న కృషి, వారి సాహిత్యాభిమానం ఈ వేదిక ద్వారా అందరికీ స్పష్టంగా తెలిసాయి.

మొత్తం మీద తానా 2001 సభలలో ఒక భాగంగా జరిగిన ఈ సాహిత్య వేడుకలలో, ముందుగా అనుకున్నట్టుగానే కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
తానా వంటి అతి పెద్ద సంస్థలు సాహిత్యానికి సరైన వేదికలు ఏర్పాటు చెయ్యగలవా? ప్రతి రెండవ సంవత్సరం జరుపుకొంటున్న ఈ సభల్లో ఎప్పటికప్పుడు పరగడుపేనా అన్న విధంగా అవే అవే నిర్వహణ లోపాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతాయి? ఒక దాన్లో జరిగిన తప్పుల్నించి ఆపై జరిగే సభల నిర్వాహకులు ఏమీ ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? సాహిత్యంపై అభిమానమున్నవారు ప్రత్యేకించి వేరొక సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకోటం అవసరం ఔతున్నదా? ఆంధ్ర నుంచి వచ్చే వారికి, ముఖ్యంగా సినిమాల వారికి, రాజకీయనాయకులకు ఇంత ప్రాధాన్యత అవసరమా? ఈ సభలకు వస్తున్న వారి అవసరాలేమిటనే విషయం తెలుసుకోవటానికి తానా వారు ఏమైనా సర్వేలు గాని, పోలింగ్‌ గాని చేస్తున్నారా?

ఎన్నో ప్రశ్నలు అన్నీ క్రితం సారి సభల సందర్భంలో అడిగినవే!