గరాజ్ లో పూజ జరుగుతోంది సంప్రదాయ బద్దంగా.
అక్కడవున్న వాళ్ళు, లంకంత ఇల్లు ఎలా వుంటుందో అప్పటిదాకా చూడకపోయినా ప్రసాద్ కొన్న కొత్త ఇల్లు గురించి చాలా మంది పైకి మాత్రం “లంకంత ఇల్లోయ్ ” అనీ, “అబ్బో చాలా పెద్ద ఇల్లు… మేముండే ఇళ్ళతో పోలిస్తే …మైసూర్ పేలెస్ ” అని అంటున్నారు. హృదయ పూర్వకంగా అభినందించే వాళ్ళు కొందరున్నా, కొందరు మాత్రం తాత్కాలికంగా మనసులోని అసూయను ఓ మూల అణచి పెట్టి, ప్రసాద్ ఇల్లు కొనడం తమకెంతో ఆనంద దాయకమైన విషయమని వ్యక్త పరచడానికి చాలా శ్రమ పడుతున్నారు.
నాలుగు బెడ్ రూములున్న ఇల్లు ముందూ వెనుకా పూలమొక్కలకు, కూరగాయల మొక్కలకు సరిపోగా స్విమ్మింగ్ పూల్ కూడా పడేంత జాగా వుంది.
“మొత్తం ఎంతయిందట? ”
“ఎంత డౌన్ పేమెంట్ చేసాడో? ”
“ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గు తున్నాయిగా ”
“ఇళ్ళ రేట్లు కూడా తగ్గు తున్నాయట… చూస్తున్నాంగా మార్కెట్ ”
“ఇలాంటి వాటి పైన ఇన్వెస్ట్ చేయడానికిది మంచి టైము కాదట… మొన్న మాకు తెలిసినాయన అన్నారు ”
“కొంచెం ఎకానమీ కుదుట పడ్డాక కొందామనుకుంటున్నాం మేము కూడా ”
ఫంక్షనుకు వచ్చి బాక్ యార్డ్ లో చేరిన వాళ్ళు పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు.
“మొత్తానికి మీరున్నప్పుడే మీ వాడు ఓ ఇంటి వాడౌతున్నాడు ” అన్నారు రావు గారు, ప్రసాద్ తండ్రి నారాయణమూర్తి గారితో.
“ఏదో అలా కలిసొచ్చింది … ” మొహమాటంగా నవ్వుతూ అన్నారు మూర్తి గారు.
“మా వాడు కూడా ఇల్లు కోసం వెదుకుతున్నాడు. మేము ఇండియా వేళ్ళే లోపునే కొనాలని చూస్తున్నాడు. మళ్ళీ గృహ ప్రవేశానికని ఇంత దూరం రావాలంటే కష్టం కదా! ” అన్నారు రావు.
నిజమేనన్నట్లు తలూపేరు మూర్తి.
“మీ శ్రీమతి గారెక్కడ ” అడిగింది రావు గారి భార్య.
“శారద ఇప్పుడే పాపను తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది ” చెప్పారు మూర్తి.
“పాపతో మీకు బాగానే కాలక్షేపమౌతూంటుంది గా? ” అడిగింది రావు గారి భార్య.
“ఆ… మరె ” అన్నారు మూర్తి.
“ఎన్నోనెల ఇప్పుడు? ”
“నాలుగో నెలండి ”
“ఇంకో రెండు మూడు నెలలు పోతే … పాపతో మీరింకా ఎంజాయ్ చెయ్యొచ్చు ”
పూజ అయిపోయినట్లుంది … హారతి తీసుకుంటున్నారందరూ.
*************************************************************
“ఇంకా నాలుగు వారాలు…నువ్వు మరీ ఇదవ్వకు శారద” అన్నారు సోఫాలో జారిగిలపడి కూర్చుంటూ మూర్తి గారు.
“చాల్లే వూరుకోండి నేనేమీ ఇదవడం లేదూ అదవడం లేదు. ప్రతి రోజూ మీకిదో పాటయింది. అబ్బాయేదో అమెరికా చూద్దురు రమ్మని తీసుకు వస్తే మీరేమిటలా అంటారు?” అంది శారద కొంచెం విసుగ్గా.
కుడి చేత్తో కళ్ళద్దాలు తీసి, ఎడమ చేత్తో నొసలు రుద్దుకుంటూ “అవును. నువ్వేమీ బాధ పడ్డం లేదు… నేనేమీ ఫీలవడం లేదు. అమెరికా మొత్తాన్నీ ఈ ఇంటి గోడల మధ్యనే చూసేసాం. ఆరు నెలల అమెరికా వాసం అనుభవించి వెళదాం.ఏమంటావ్ ” అన్నాడు నవ్వుతూ.
“ఏమోనండి, ఒక్కోసారి మీ మాటలు అస్సలు అర్ధం కావు. నాకైతే ఇక్కడ బాగానే వుంది. కొడుకు కాపురం చూస్తూ, మనవరాలి మంచి చెడ్డలు చూసుకుంటూ …” మూర్తి గారి పెదవుల పై నవ్వు చెదరలేదు … మరి శారద గారికి ఆ నవ్వులో ఏ భావం కనిపించిందో “మీరెప్పుడూ ఇంతే. ప్రతి విషయాన్నీ మీ అద్దాల్లోంచే చూస్తారు. ఇద్దరూ వుద్యోగాలకెళ్ళాలి కాబట్టి పసి పాపను చూసుకోడానికే పిలిచారనుకుందాం. ఏం ఆ మాత్రం కన్న కొడుకుకు సాయం చేయలేమా? అందరూ ఆలోచించినట్లు మీరెందుకు ఆలోచించరు?” భర్తను నిలదీసినట్లు అడిగింది శారద.
ఎలా, ఎప్పుడు, ఎందుకు మొదలయిందో ఖచ్చితంగా తెలీదు గానీ… మద్రాసులో విమానం ఎక్కే ముందున్న భావనలు, అమెరికాలో అడుగెట్టి నప్పటినుంచి క్రమంగా మారిపోసాగాయి. భార్య ఎంత నచ్చ చెప్పినా మనసులో అల్లుకుపోతున్న భావాలు మారడం లేదు.
“అందరూ ఒక్కలాగే ఆలోచిస్తే ప్రపంచం ఇంకా రాతి యుగానికి ముందు దశలోనే వుండేది. నా కళ్ళు నా అద్దాల్లోంచీ మాత్రమే చూడగలవోయ్ అన్నట్టు నా కళ్ళద్దాలు మార్పించాలి. కొంచెం చూపు మందగించినట్లనిపిస్తోంది”
“అలాగా … మరి రాత్రి అబ్బాయికి చెప్పాల్సింది. మార్పించు కొచ్చే వాడుగా?”
“వాడి కంత టైమెక్కడుంది? ఎలాగూ మన వూరెల్తున్నాంగా అక్కడే మార్పించుకుంటా”
“భలే వారే… ప్రయాణం లో ఇబ్బంది అవదూ. మీకు చూపానక నన్నొదిలేసి ఎవర్తి వెనకో వెళితే ”
“నాకీ వయసులో అంత సీను లేదులే. అయినా నీకు బాగానే కనిపిస్తుందిగా”
పక్క గదిలోంచి, పాప ఏడుపు వినిపించేసరికి”అయ్యో ఈ రోజు అప్పుడే లేచిందే…” అంటూ గబగబా ప్రక్కరూములో కెళ్ళింది శారద.
*****************************************************************
తలుపు తెరిచిన అలికిడైతే దిగ్గున లేచారు నారాయణమూర్తి గారు.
కోడలు సుధ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చినట్లుంది. మొహం లోంచీ అలసటను చిరునవ్వుతో ప్రక్కకు తోస్తూ
“నిద్ర పోతున్నారా” అడిగింది పలకరింపుగా.
“ఇప్పుడేనమ్మా… ఇలా కూర్చుని తెలీకుండానే…” సంజాయిషీ గా చెప్పబోయేరు.
“నేను నెమ్మదిగా తలుపు తియ్యాల్సింది”అంది నొచ్చుకుంటూ.
“పర్లేదమ్మా.. ఎలాగూ సాయంత్రమయిందిగా”
“పాప లేచిందాండీ” అంటూ ప్రక్క గదిలోకి వెళ్ళింది.
సుధను చూసినప్పుడల్లా మూర్తి గారి మనసు భారమౌతుంది.
ఇక్కడకు వచ్చిన రోజు, సుధను చూసి గుర్తు పట్ట లేక పోయారు. బహుశా ప్రెగ్నెంట్ కావడాన గుర్తు పట్టలేక పోయానేమోనను కున్నాడు. ప్రసవం జరిగి నాలుగు నెలలు దాటినా ఆమె ఆకారంలో పెద్దగా మార్పు లేదు. సన్నగా మల్లెతీగలా నాజూగ్గా కొడుకు పక్కన పెళ్ళి పీటల మీద కూర్చున్న ఆ అమ్మాయీ, ఈ అమ్మాయీ ఒక్కతేనా అనిపిస్తుంది సుధను చూసిన ప్రతిసారి. అలాగని కొడుకు ఆకారంలో మార్పు లేదని కాదు. మునక్కాడలా వుండే వాడు గుమ్మడి కాయలా మారేడు. వయసును మించిన మార్పు. పలచబడ్డ జుట్టు … చురుకుదనం లేని కళ్ళు! ముప్పై లోపే వీళ్ళిలా అయితే… ఇంక రాను రాను ఎలా అయిపోతారో?
వీళ్ళంతట వీళ్ళు తెలుసుకునే స్ధితిలో లేరు.
తెలిసేలా చెప్పాలి. చెబితే వినే స్ధితిలోనైనా వున్నారా?
“ఏమిటండి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు?” అడిగింది శారద.
“ఏం లేదు…” అన్నారు భార్య వంక పరిశీలనగా చూస్తూ.
“మీక్కొంచెం టీ పెట్టనా?”
పెట్ట మన్నట్లు తలూపేడు.
ఈ నాలుగు నెలల్లో శారదలో కూడా చాలా మార్పు. తనూ మారేడా? ఏమో?!
టీవీ ఆన్ చేసి, అటూ ఇటూ చానెల్సు మార్చి చూసేడు. ఏదీ కళ్ళను ఆపకపోయేసరికి, టీవీ ఆఫ్ చేసేడు.
నెమ్మదిగా సోఫాలోంచి లేచి, కిచెన్ వైపు వెళ్ళాడు. స్టౌ మీద ట్రాన్స్ పరెన్ట్ గిన్నెలో మరుగుతున్న టీ ఆ పక్కనే ఓ కంట టీ గిన్నెను గమనిస్తూ గిన్నెలు కడుగుతూ భార్య.
మైక్రోవేవ్ లో వేడిచేసిన పాలలో టీ పాకెట్ ముంచుకుని త్రాగడం నచ్చదు మూర్తిగారికి. పాలలో తేయాకు బాగా వుడికితేనే టీకి రుచి.
టీ కాచుకునే సదుపాయం వుండి కూడా మైక్రోవేవ్ లో పాలను వేడి చేసుకోడం నచ్చదు తనకు.
కోడలు పాపతో లివింగ్ రూమ్ లో కొచ్చింది.
“తాతయ్యకు హయ్ చెప్పమ్మా” అంటూ పాపను బాస్సినెట్ లో పడుకోబెట్టింది.
కళ్ళు మూసుకునే నవ్వుతోంది పాప.
“ఏం చేసారు మామయ్యా ప్రొద్దుటి నుంచి” అడిగింది సుధ.
“ఏముందమ్మా చేయడానికిమామూలే. తినడం ఇలా కూర్చోడం. మధ్యాహ్నం కొంచెం నడుద్దామని బయటకు వెళ్ళా. బాగా చల్లగా వుండే సరికి, వచ్చి కూర్చొని ఓ కునుకు తీసా”
“రేపు కొంచెం వర్షం కూడా పడొచ్చని చెప్పారు. సినిమా ఏదైనా చూడక పోయారా?”
“సినిమాలు చూసి చూసి బోరు కొడుతోందమ్మ”
“ఈ యన ఈ రోజు కొంచెం లేటౌతుందని చెప్పారు” చెప్పింది సుధ, సోఫా లోంచి లేస్తూ.
“టీ తీసుకోండి…” మూర్తి గారికి కప్పందించింది శారదమ్మ.
“అయ్యో మీకెందు కత్తయ్యా శ్రమ, నేను పెట్టే దాన్నిగా టీ” అంది సుధ నొచ్చుకుంటూ.
**********************************************************************
ప్రసాద్ ఇంటి కొచ్చేసరికి ఎనిమిదైంది.
“ఏరా ఇంత లేటయింది” అడిగేరు మూర్తి.
“మామూలే నాన్న. బయల్దేరబోయేముందు అర్జంటు పనొకటి తగిలింది. అదయ్యి వస్తూంటే ఫ్రీవే మీద ట్రాఫిక్ జాం. ఏదో ఆక్సిడెంటట” అంటూ సొఫాలో కూర్చుని షూస్ విప్పుకున్నాడు.
“ఏమిటోరా … వుదయం ఏడున్నరకు వెళతావు… వచ్చేసరికి ఈవేళ అవుతోంది. పోనీ మీ ఆఫీసుకు దగ్గరలోనే ఇల్లు కొనాల్సింది. కొంత టైమన్నా కలిసొచ్చేది”
“అప్పుడు సుధకు దూరమౌతుంది నాన్న. అదీగాక ఈ స్కూలు డిస్ట్రిక్క్టు చాలా మంచిది”
“స్కూలు డిస్ట్రిక్టంటే?”
వివరించాడు ప్రసాద్.
“అలాగా అడగడం మర్చే పోయాను మా టికెట్ల గురించి ఏమైనా తెలిసిందా?”
“మాట్లాడేను నాన్న. వచ్చే వారం కాక పై వచ్చే వారానికి వున్నాయట. మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేద్దామని”
“మమ్మల్నడిగే దేముందిరా? ఎప్పటికి దొరికితే అప్పటికి తీసుకో”
“సరే నాన్నా. చాలా రోజుల్నుంచీ మీతో ఓ ముఖ్య మైన విషయం మాట్లాడదా మనుకుంటున్నాం” అన్నాడు ప్రసాద్ భార్య వైపు, ఇప్పుడే మాట్లాడనా అన్నట్లు చూస్తూ.
“ముఖ్యమైన విషయమా?”అన్నారు మూర్తి కాస్త సర్దుకుని కూర్చుంటూ.
“అమ్మ కూడా వుంటే బాగుంటుంది. అమ్మా..” పిలిచేడు ప్రసాద్
డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ కు ప్లేటులూ, గ్లాసులూ సర్దుతున్న శారదమ్మ లివింగ్ రూములో కొచ్చింది.
“నువ్వలా కూర్చోమ్మా” అన్నాడు ప్రసాద్
“మీ మనవరాలు గురించి. పాపను కొన్నాళ్ళు ఇండియాలో పెంచితే బాగుంటుందనుకుంటున్నాం.”
“ఇండియా లోనా? ఎవరిదగ్గర?” ఆశ్చర్యాన్ని నటించలేక పోయేరు ఎన్నాళ్ళ బట్టో ప్రాక్టీసు చేస్తున్నా.
కొడుకూ కోడలు ఆశ్చర్యపోయారు ఈ విషయంలో ఈ ముసలాయనకు సందేహ మెందు కొచ్చిందా అని.
ఆశ్చర్యం లోంచి ముందుగా తేరుకున్న శారద “ఎవరి దగ్గరో ఏమిటి?” అంది భర్త నుద్దేశించి.
నువ్వు మాట్లాడకు అన్న సంకేతాన్ని మూర్తి కనుసైగల్లోంచి గ్రహించిన శారద మౌనం వహించింది.
తండ్రి తన వంకే సమాధానం కోసం ఎదురు చూస్తూండడంతో “ఎవరి దగ్గరో ఏమిటి నాన్నా? మీ దగ్గరే!” అన్నాడు ప్రసాద్
“మా దగ్గరా? మమ్మల్నే ఎవరేనా పెంచుకుంటే బావుండనుకునే ఈ వయసులో పాపను మేమెలా పెంచగలంరా?”అన్నారు, బరువెక్కుతూన్న వాతావరణాన్ని తేలికబరచే నవ్వుతో.
“అయినా మీరిద్దరూ వుండి కూడా పాపను ఒంటరిగా పెంచాల్సిన అవసరమే మొచ్చింది?”అడిగేరు మళ్ళీ.
సంభాషణ ఎటువైపు వెళుతుందో కొంత వరకు అర్ధమైంది మిగిలిన వాళ్ళకు.
“ఒంటరిగా ఎందుకుంటుంది నాన్నా? మీరూ అమ్మా, ఇంకా చెల్లాయి వాళ్ళు … ఇందరుండగా…”
“మేమెందరం వున్నా మీ ఇద్దరితో సమానం కాదుగా? ఇక్కడే పెంచడానికేమైనా ఇబ్బందా?”
“నేనూ సుధ ఆఫీసులకెళ్ళి పొతే …”
“పోనీ అమ్మాయి కొంత కాలం వుద్యోగం మానొచ్చుగా?”
“తను చేసేది చాలా మంచి కంపెనీలో నాన్నా. ఇప్పుడు మానేస్తే మళ్ళీ దొరకడం కష్టం” చెప్పాడు ప్రసాద్.
తండ్రి ఏమీ మాట్లాడకపోయేసరికి “ఈ పరిస్దితుల్లో వున్న వుద్యోగాలే ఎప్పుడు వూడిపోతాయో తెలీడంలేదు. ఒకళ్ళం వుద్యోగం మానేసినా ఇంటి ఇన్స్ టాల్మెంట్స్ కట్టడం చాలా కష్టం” చెప్పాడు ప్రసాద్
“బాగా అలసిపోయినట్టున్నావు. త్వరగా స్నానం చెయ్యు. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం” చెప్పారు మూర్తి, చర్చకు సెమికోలన్ పెడుతూ.
ఎవరి ఆలోచనల్లో వారు, ముభావంగా భోజనాలయ్యే యనిపించేరు పాప గురించిన ప్రస్తావన తీసుకురాకుండానే.
******************************************************************
శారదమ్మ అంది “మీకంత మొండి పట్టు ఎందుకండీ. పాపను మనం పెంచలేమా? ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయలేదూ”
“పెంచలేమని కాదు నేనంటూంది. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరిగితేనే పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ మంచిదని. నువ్వేమి చెప్పబోతున్నావో నాకు తెలుసు. నూవ్వూ ఆలోచించు కన్న తర్వాత వుద్యోగాల కోసమనీ, ఆస్తులు కూడ బెట్టడం కోసమనీ, పాప మంచి చెడులు చూడ్డం కష్టమనీ పిల్లల్ని తాతల దగ్గర అమ్మమ్మల దగ్గర వుంచాలనుకోవడానికి అనాధాశ్రమంలో వదిలెయ్యడానికి పెద్ద తేడా ఏమైనా వుందా?”
“అంత మాటంటారేమిటి?” అంది శారదమ్మ ఆశ్చర్యంగా.
మళ్ళీ తనే అంది “అనాధాశ్రమంలో వుంచడం మన దగ్గర పెంచడం ఒక్కటెలాగౌతుంది? మీకిల్లాంటి ఆలోచనలెలా తడతాయి? అబ్బాయి వాళ్ళ ముందు ఇట్లా మాట్లాడకండి. నొచ్చుకుంటారు”
“నా దృస్ఠిలో ఒక్కటే. ఈ విషయంలో నా నిర్ణయం నీకర్ధమైందిగా. నువ్వేమంటావు?” అడిగేరు.
శారద మాట్లాడలేదు. కళ్ళలో సన్నటి నీటి పొర.
“చెప్పు శారద … పాపను పెంచడం మనకు కష్టమా కాదా? మనకంటూ మన జీవితాలున్నాయి. ఇప్పటి నుంచేగా మనకు కాస్త విశ్రాంతి దొరికేది?” అన్నాడు నచ్చ చెబుతున్నట్టు. అవునన్నట్లు తలూపింది శారద.
“ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెబుతున్నా. నేను వీళ్ళంత తెలివికలవాడిని కాక పోయినా చిన్నప్పటి నుంచీ నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. మనమెక్కడో వేల మైళ్ళ నుంచీ చూసినప్పుడు అమెరికా సుదూరపు కొండ. ఇక్కడ మనబ్బాయి జీవితం నున్నటి రోడ్డు పైన మెత్తగా కదిలిపోయే రంగు రంగుల ఏసీ కారు. ఈ ఆరునెలల బట్టీ చూస్తున్నాంగా మన వాడి సంసారం..”
మౌనంగా వింటోంది శారదమ్మ.
“రైల్లో ఫస్ట్ క్లాసు పెట్టెలో అబ్బాయి కోడలూ ప్రయాణించడంలో కలిగే సంతోషంకంటే వున్నంతలో ఇద్దరూ పాపను వొళ్ళో కూర్చో బెట్టుకుని సెకండ్ క్లాసులో ప్రయాణించడంలోనే ఆనందముంటుంది. రెండు పెట్టెల గమ్యం ఒక్కటేగా! ఎవరి బిడ్డల్ని వాళ్ళు,వాళ్ళకు నచ్చిన రీతిలో పెంచుకోవాలి. ఎక్కడో తాతల దగ్గర, అమ్మమ్మల దగ్గర పిల్లల్ని పెంచితే కొన్నేళ్ళు పోయాక తల్లిదండ్రుల్ని పిల్లలు గుర్తు పట్టగలరా? పిల్లలు కన్నవాళ్ళతో కలిసి కొన్నాళ్ళైనా అన్నీ పంచుకోగలరా?” మాటల కోసం వెదుక్కుంటున్నట్లు కొన్ని క్షణాలాగి “నేననుకున్నట్లు వీడిని పెంచలేక పోయానేమో ననిపిస్తోంది శారదా!” అన్నారు మూర్తి గారు.
“అదేమీ కాదండి. మన రైలు పెట్టెల రోజులకు వీళ్ళ విమానాలా కాలానికి తేడా వుండదూ. వాడి బాధలు వాడివి. రేపెవరైనా మన వూళ్ళో మీ అబ్బాయి అమెరికాలో రెండు కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడటగా అంటే … మనకీ గొప్పే కదా” అంది శారద.
“నిజంగా అది గొప్పేనంటావా?” అడిగేడు కళ్ళద్దాలు తీస్తూ.
శారద మాట్లాడక పోయేసరికి, “సరేగానీ, మళ్ళీ ఈ ప్రస్తావన వస్తే నేను మాట్లాడతాను. నువ్వు మాత్రం తొందరపడి ఏమీ మాట్లాడకు” అని ప్రక్కకు తిరిగి పడుకున్నారు మూర్తి గారు.
“అలాగే, మీరు కూడా జాగ్రత్తగా వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పండి. ఇంకో పది రోజుల్లో వెళ్ళ బోతూ ఎందుకు గొడవపడటం” అంది శారద.
******************************************************************
రెండ్రోజులు గడిచేక, రాత్రి పడుకోబోయే ముందు
“టికెట్ల గురించి మళ్ళీ మాట్లాడారా” అడిగింది సుధ.
“పాప గురించి తేలకుండా ఎలా?” అన్నాడు ప్రసాద్
“మళ్ళీ మీ నాన్నను అడక్కపోయారు?”
“అడగాలంటే భయంగా వుంది ఒప్పుకోరేమోనని. అయినా అందరు పెద్దవాళ్ళు అడక్క ముందే మేం పెంచుతాం మేం పెంచుతాం అని పోటీలు పడుతుంటారని చెప్పుకుంటూంటే మన దగ్గర కొచ్చేసరికి ఏమిటి ఇలా జరుగుతోంది. ఇప్పుదేం చేద్దాం?”
“ఇంకేముంది చేయడానికి? డే కేర్ లో చేర్పించడమే”
“డే కేర్ కు ఇంకా మిగిలిన ఖర్చులకు వెయ్యికి పైనే అవుతుందనుకున్నాం కదా. ఇంటి పేమెంటూ … ఈ ఖర్చులూ పోతే ఇంకేం మిగులుతుంది”
“మా అమ్మ హెల్త్ బాగుంటే అక్కడికైనా పంపే వాళ్ళం. అయినా ఇల్లు కొనడానికి తొందర పడ్డామేమో”
“అన్నన్ని వేలు అద్దెలకూ టాక్సులకు ధారపోయడంకంటే బెటరనేకదా కొనుక్కుంది. అసలు మా వాళ్ళను అమెరికా పిలిపించిందే పాపను వాళ్ళతో పంపడం కోసమైతే, చివరికి ఇలా జరుగుతోంది. నేనేదో తొందర తొందరగా సంపాయిద్దామనుకుంటే, పెద్ద వాళ్ళై వుండీ సహకరించకపోతే ఎలా? ఈ సంవత్సరం అస్సలు కలిసిరావడం లేదు. అన్నిట్లోనూ లాసులే. రేపోసారి మళ్ళీ కదుపుతాను పాపగురించి ” అన్నాడు ప్రసాద్
“ఏమంటారో తెలిసి కూడా అడగడమెందుకు? అసలే మీకీ మధ్య బీపీ కూడా వచ్చింది. ఆవేశంలో నోరుజారితే బాగోదు. మీ వాళ్ళు ప్రస్తావిస్తేనే ఈ విషయం గురించి మాట్లాడండి ”
“అంతేనంటావా? ”
“అంతే” నంటూ కళ్ళు మూసుకుంది సుధ.
పాప క్రిబ్ లో నిద్రపోతోంది.
మరో వారం తర్వాత పాప ప్రస్తావన రాకుండానే ఇండియా బయల్దేరారు మూర్తి గారు, శారదమ్మతో.
ఏర్ పోర్టులో తల్లిదండ్రుల్ని ఫ్లైట్ ఎక్కించి, దారిలో కుమార్ వాళ్ళ అపార్మ్టెంట్ దగ్గర ఆగేరు.
కుశల ప్రశ్నలయ్యేక, “మొత్తానికి పాపను వదల్లేక పోయారన్నమాట.” అంది కుమార్ భార్య పద్మ.
“మరే … పాప మా దగ్గర వుంటేనే తృప్తిగా వుంటుందనిపించింది” అంది సుధ.
“అవును కుమార్ , పాపను ఇండియాలో పెంచుకుంటామని మా అమ్మా నాన్న ఎంత ముచ్చట పడ్డారో! అయినా మన పిల్లలు మన కళ్ళ ముందు పెరగాలి గానీ ఎక్కడో పెరగడం ఏమిటి? ” చెప్పాడు ప్రసాద్ నువ్వేమంటావ్ అన్నట్లు చూస్తూ.
ప్రసాద్ గాడిలో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందా అని ఆలోచిస్తూ “అంతే మరి. రేపటి నుంచి డే కేర్ కు పంపుతున్నారా?” అడిగేడు కుమార్ .
“అవునండి . కొంచెం ఖర్చైనా పిల్లలు మన కళ్ళముందే వుంటే అదో తృప్తి.” అంది సుధ.