శ్రీ వరసిద్ధి వినాయక పద్యమాల

1. శ్రీ గణనాథుని చరితము
వాగర్థములందగింప వ్రాయగ నెంచీ
నాగోపవీతధారుని
యోగధ్యానంబుసల్పి యోచింతు మదిన్‌.

2. భక్తుల కోర్కెలు దీర్చగ
శక్తికి మించిన వరములొసంగే శివుడా
భక్తికి మెచ్చి గజాసుర
భుక్తంబై తనివి తీర్చి పొట్టను చేరెన్‌.

3.  కైలాసంబున గిరిసుత
చాలా తనియించె భర్త జాడ తెలియకా
ఫాలాక్షుని రక్షించీ
యేలాగునొ వెదకి తెచ్చి యిమ్మని అడిగెన్‌.

4.   హరిగూడెను బ్రహ్మాదుల
సరినందే గంగిరెద్దు సాగెను మేళం
అరిజంపిరుపాయముతో
గిరిజాపతి రక్ష జేసి గీడును బాపీ..

5.   చెలువపు బాలుని జేసెను
అలవోకగ లోకమాత యభ్యంగనమున్‌
సలుపుచు కావలి యుంచెను
నలుగునకే వెలుగులద్ది నలువయె తానై..

6.   శూలిని యడ్డెను బుడుతడు
బాలునికేమెరుక తండ్రి పాశము కలదే
కేలెత్తి శిరము దునిమెను
హాలాహలధారి హరుడు యాగ్రహమందీ..

7.   నిజ సుతునే జంపితియని
సజలాత్మకుడై కపర్ది సాలోచనగా
గజముఖమును తగిలించెను
ద్విజుడయ్యె గజాననుండు దీవెనలందెన్‌.

8.   ఎలుకను యేనుగు యెక్కెను
పలుకగ విడ్డూరము కద పార్వతి తనయుల్‌
చిలుకుచు ముద్దుల మాటలు
కులుకుల నెమలిని యమరెను కొమరుడనుజుడున్‌.

9.   ఎన్నగ విఘ్నాధిపతిని
అన్నా తమ్ముళ్ళ మధ్యనయ్యెను పోటీ
మిన్నేరుల మునగకనే
పన్నగపతి సేవ జేయ ఫలితము దక్కెన్‌.

10. గిరిజాసుతు రూపమునే
పరిహాసము జేసె రేడు పార్వతి కినిసీ
సరి యాతని జూచిన దు
ర్భర నిందలపాపములను బడ శపియించెన్‌.

11. వేడగ సురులకు జెప్పెను
పీడలు బాపెడు తెరవును బింబాధరుడున్‌
వేడిన గజముఖు (భాద్రపద శుద్ధ) చవితిని
మూడును కీడెల్ల జనులు ముక్తిని బొందన్‌.

12. గోపాలుడు నిందలబడె
తాపాలను చంద్రు జూచి తస్కరుడయ్యెన్‌
తాపమణిచె భల్లూకుని
చేపట్టెను మణి రమణుల చెలువము మీరన్‌.

13. వెనకటికి యగ్ని పడతుక
మునికాంతల రూపు దాల్చి ముచ్చట దీర్చన్‌
మునిపత్నుల యపనిందలు
గణనాధుని పూజసేయ గ్రక్కున తొలగెన్‌.

14. శిరసాప్రణమిల్లిన యా
వరమూషిక వాహనుండు వాంఛితమిచ్చున్‌
కరములు జోడింపగనే
కరివదనుడు వరములిచ్చి కరుణను కురియున్‌.

15. గణపతి వృత్తాంతంబిటు
మునులకు సూతుండు జెప్పె మోక్షప్రదమౌ
వినుతించిన విఘ్నపతిని
జనులకు సుఖ సిధ్ధి శాంతి జయములుకలుగున్‌.

16. వ్రాసెను సంస్కృతమందున
వ్యాసుండాశువుగ చెప్ప భారత చరితన్‌
కాసిని ఉండ్రాళ్ళిచ్చిన
దోసిట విద్దెలను కురియు తోషము జెందీ..

17. వెనకయ్యకు మొక్కండీ
అనుకొన్నవి యన్ని జరుగు నా గణపతియే
మనకున్న యాది దైవము
ఒనగూర్చును తా సకలము ఒట్టది సుమ్మీ..

18. పలుకజ్జికాయలప్పం
బులు వుండ్రాళ్ళారగింపు పూర్ణములన్నం
బులు యటుకులు బెల్లంబును
ఫలరసములు పాలు పెరుగు పంచామృతముల్‌.

19. ఇరువదినొకండు పత్రులు,
విరిబాలలు పేర్చి పాల వింటిని కూర్చీ
హరుసుతునారాధించిన
గరికలకే మురిసి యిచ్చు ఘనఫలితంబుల్‌.

20. బాల వినాయకునీవిధి
వీలుగ కొలిచిన తదుపరి విని యీ కథలన్‌
మేలగునక్షంతలు గొన
నీలాపపు నిందలుడుగు నిఖిల ప్రజకున్‌.

21. వరసిద్ధి వినాయకునీ
స్థిర చిత్తమునందు నిలిపి సేవించినచో
దరిజేరవు విఘ్నంబులు
సిరిసంపదలెన్నొ గలుగు శీఘ్రంబుగనే..