విశ్వకవిత:విస్లావా జింబోస్కా

ప్రసిద్ధ ప్రపంచకవితల పరిచయం

ఇటీవలి కాలంలో ఇతర భాషల్లో వచ్చిన గొప్పకవిత్వాన్ని పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశం. అలజడి,సంఘర్షణా,జీవితాన్ని అతలాకుతలం చేసే అనుభవాలు,అన్నీ పోగొట్టుకొన్నా శిథిలాలనుండీ ఎదిగే స్థైర్యం గలవారే గొప్పకవిత్వాన్ని రాయగలరు. అన్ని కళల వలె కవిత్వానికి కూడా జీవితమే పునాది, ప్రాతిపదిక. నేలవిడిచి సాముచేయడం ఇందులో పూర్తిగా వర్య్జం. సముద్రంలో అలల్లా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి, పోయాయి. కవులు జన్మించారు, మరణించారు. మిగిలింది లోతులనుండి బయటపడ్డ అనర్ఘమణిలాంటి కవిత్వమే! భూమ్యాకాశాలను, కాలసంధులను ధిక్కరించి వెలుగులు విరజిమ్ముతోంది.

ఒక్కసారి ప్రపంచాన్ని పరికిస్తే, ఎవరికీ పట్టని పలుభాషల సమూహంగా కనిపించి ఆశ్చర్యం గొలుపుతుంది, కానీ,సమీపించేకొద్దీ, అంతరాంతరాల్లో అందరిలో ప్రవహించే ఉద్వేగాలు ఒక్కటే అని తెలిసి ఆనందం కలుగుతుంది. కోట్లమందికోసం ఒక్కడు గొంతు విప్పుతాడు.

కనుక, ఒక్కొక్క భాష నుండి ఒక్కొక్క కవి చొప్పున, అతిరమణీయంగా కవితాంబరాన్ని తాకిన అమెరికన్‌ కవి ట్రంబుల్‌ స్టిక్నే, స్పానిష్‌ నుండి విలక్షణచిలీకవి నెరుడా, అసమానపాటవంతో పేరెన్నికగన్న ఇటీవలికాలపు ఇటాలియన్‌ కవి మొంటాలే, లోతైన జర్మన్‌ కవి రిల్కే, ఎంతో వేదన అనుభవించిన రష్యన్‌ కవి బ్రాడ్స్కీ లతో పాటు, సూక్ష్మంలో మోక్షంగా జపనీయ హైకూ కవిత్వాన్ని కూడ పరిచయం చేయడం జరుగుతుంది.

ఈ శతాబ్దంలో గొప్పకవిత్వం పోలిష్‌ లో వచ్చిందని చాలామంది విమర్శకులు భావించారు. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. యుద్ధ బీభత్సానికి, నాజీల దురాగతాలకు బలైపోయింది పోలెండ్‌. అందుకే,ఆ భాషలో తమస్సినీవాలిలా, ఎండాకాలం చల్లనిగాలిలా, గొప్పకవిత్వం వచ్చింది. కాబట్టి మనమధ్య జీవించివున్న పోలిష్‌ కవయిత్రి విస్లావా జింబోస్కా (Wislawa Szymborska) మధుర కవితల్తో మొదలుపెట్టడమే సబబు.

విస్లావా నోబెల్‌ గ్రహీత(1996). క్లుప్తత, మిరిమిట్లు గొలిపే శైలీవైవిధ్యం, అలవోకగా జారినట్టు వుండే పదచిత్రాలు, ఆమెను ఒక విలక్షణమైన కవిగా నిలబెట్టాయి.

పోలెండ్‌ లో జననం (1923), అందమైన పట్ణం క్రాకో లో నివాసం. చాలాకాలం పాటు సంపాదక బాధ్యతలు చేపట్టింది. నోబెల్‌ (1996) తో పాటు ఎన్నో పురస్కారాలు ఈమెను వరించాయి. శిల్పిలా చెక్కుతుంది పదాలను; అలా అని ఒక మూసలో పడిపోదు. శైలీవైవిధ్యం ఎక్కువ, ఈ కారణంగానే అనువాదాలు కష్టం. ఈమెకు నాగరికత పొడ గిట్టదు, ఈసడిస్తుంది తన కవితల్లో. “పరవశంలొ, నిరాశలో నన్ను గుర్తించగలవు” అని చెప్పుకొంటుంది. అసాధారణ మైనదే కవిత్వం, అందులో ప్రతీ పదానికి తనదైనటు వంటి అర్థం ఔచిత్యం ఉన్నాయని విశ్వసిస్తుంది.

బహిరంగం

ఇక్కడమనం, నగ్నప్రేమికులం
చక్కగా ఒకరికొకరు అదిచాలు
ఈ కనురెప్పలే, మనల్ని కప్పే ఆకులు
చీకటిరేయి, నడుమ పడుకొని మనం

కానీ, వాటికి తెలుసు
ఈ నలుమూలలూ, జేరగిలబడ్డకుర్చీలు
సంకోచించే నీడలక్కూడా తెలుసు
బింకంగా బల్ల కదలదు

టీకప్పులక్కూడా,నిండుగా తెలుసు
తాకలేని ద్రవం, ఎందుకు చల్లబడిందో
తప్పకుండా చెప్పగలడు ఆ పాతకవి
ఇప్పటికీ తన పుస్తకం, అలాగే ఎందుకుందో

పక్షులక్కూడా తెలిసిపోయింది
రాక్షసంగా ఎలారాస్తున్నాయో,
ఎంత బాహాటంగా ఆకాశంలో
చెంత, నిన్ను నేను పిలిచేపేరును

పోనీ, మరి చెట్లు వివరించగలవా
ఆగని వాటి గుసగుసలను
ఈగాలిక్కూడా తెలుసేమో
కానీ, అంతా రహస్యంగా వుంది

కిటికీసందుల్లో రెక్కలాడిస్తూ
కీటకంకూడా, ఆశ్చర్యపరుస్తుంది
దాని నిశ్శబ్దయానం, చూడు ఎంత
అనాయాసంగా తిరుగుతుందో

పురుక్కి సహజమైన తెలివితో
చురుగ్గా చూడగలదు, మనం కనలేనిదాన్ని
నేనెప్పుడూ, గమనించలేదు, నీవూ చెప్పలేదు
మనహృదయాలు వెలిగిపోతున్నాయి చీకట్లో!

స్మృత్యంకం

వారీ పొదల్లో ప్రేమించుకొన్నారు.
మెరిసిపోయే మంచుసూర్యుని క్రింద
కురుల్లో చిక్కుకుంది
ఓ రాలిన ఆకు.

పులుగు హృదయమా
దయ జూపు వారిపై

కొలను ముందు కూలబడి
నేలను, అకులను వెదికారు.
తారల్లా తళుకుమనే చేపలు
చేరుకొన్నాయి నీటి అంచును

పులుగు హృదయమా
దయ జూపు వారిపై

కప్పడని అలలను కదిలిస్తూ
వృక్షాల ప్రతిబింబాలు
పక్షీ, ఈ జ్ఞాపకం
ఎప్పటికీ నిలిచిపోనీ..

మేఘకంటకమా
గాలి గాలమా
మారిన ఉల్కా
వస్త్రాల్లో ఊహా

శిలాక్షరలేఖినీ
కాలాతీతపాణీ
ఖగశకలమా, పక్షీ
గగనాన నయనమా,

గురిపెట్టిన నిశ్శబ్దమా
మీరిన శోకానందమా
పరివేషమా, ప్రేమికులపై
చిరు పక్షీ, దయజూపు.

[ఆంగ్లం: జోనా జెసియాక్‌ (Joanna Trzeciak)]

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...